ఒక్క అడుగు కోసమే …

లా వెళ్ళిపోయావు
చెప్పకుండా వెళ్ళిపోయేంత దూరం
స్థలం ఎప్పుడు సంపాయించింది మన మధ్య,

కన్ను అలవాటుపడిన హాయి
స్నేహస్పర్శకి
నా నుండి అంటిన దోషమేమిటీ?
కలత
సూదిలా కన్నుపై నాట్యమాడుతోంది

1
నగ్నచీకటి పైన వెన్నెల్లా పరుచుకున్న
నీ ప్రేమ నుంచి
ఏ రహాస్యాలను దాయగలను?

పసిపాపలాంటి మృదువైన ప్రేమమనసుకు
ఏ ద్రోహాలు నేర్పించగలను?

నా చేయి తాకితే గాయపడిపోతావేమోనని
ఊపిరితో తప్ప నిను తాకనైనా తాకలేదు
నీ శరీరాన్నే నాజూకుగా తపనపడే నేను
నీ మనోనిట్టూర్పుల కాగితపుపడవల
మనుగడ పట్ల
ఎంత జాగ్రత్త వహిస్తానో తెలియదా?

2
ఈ సాయంకాలాల
వెలుతురు పరదాలపై నువ్వు జారవిడుచుకున్న
ప్రతి పరిమళాన్ని జ్ఞాపకంగా దాచిపెట్టుకున్నందుకు
శిక్షగా వెళ్ళిపోవడం న్యాయమా ప్రియతమా?

ఈ వలపుఒడ్డు నీ ఒక్క అడుగు కోసమే
వేచి ఉంది
సముద్రాన్ని నీ పాదానికి తాపాలని
సముద్రమంతా విశ్వాసం
నీ ఎదుట ఒలకబోయాలని..

నీ రాక ఎడారి కాబోదనే నమ్మకం
కనురెప్పపై బరువు కాదు కదా?

*

మహమూద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు