ఒకే ఒక్క ఉదాహరణ వరవరరావు!

జైలు నిర్బంధం అంటే మౌలికంగా కదలికల మీద ఆంక్షలు. మాట్లాడే హక్కు మీద, భావప్రకటనా స్వేచ్ఛ మీద, తోటివారితో కలిసి సంఘం పెట్టుకునే స్వేచ్చమీద ఆంక్షలు కూడ. అయితే చెరసాల గోడలు ఎక్కువలో ఎక్కువ మనిషి కదలికల మీద ఆంక్షలను మాత్రమే విజయవంతంగా అమలు చేయగలవు. ఆ మనిషి ఊహాశక్తి మీద ఆంక్షలు విధించడంలో అవి తప్పనిసరిగా విఫలమవుతాయి. ఆలోచనాశక్తి ఉన్న మనిషి ఊహలు ఎక్కడైనా, ఎక్కడ పడితే అక్కడ వికసిస్తూనే ఉంటాయి. అది ఎడారి గానీ, సముద్రమధ్యం గాని, మనిషి కనబడని చోటు గాని, పర్వత శిఖరం మీద ఒంటరితనం గాని, లేదా అన్నిటికన్న మిన్నగా నలుదిశలా ఏకాంతం ప్రతిధ్వనించే చెరసాల గోడల మధ్య గాని మనిషి ఊహాశక్తి మీద ఏ ఆంక్షలూ పని చెయ్యవు. జైలు ఆ అభివ్యక్తిని బహిరంగంగా ప్రచారం చేయడం మీద పరిమితులు విధిస్తుంది. కాని ఆ మనిషి తన కలలనూ కామనలనూ ఆలోచనలనూ ఆవేదనలనూ తనలో తాను గున్గునాయించుకోకుండా, వ్యక్తీకరించకుండా, కాగితం మీద పెట్టకుండా ఏ జైలూ ఆపజాలదు. జైలు కటకటాల వెనుక నుంచి మరింత శక్తితో రచనలు చేసిన రచయితల ఉదాహరణలూ, జైలు నిర్బంధంలోనే తమ భావవ్యక్తీకరణ ప్రారంభించిన రచయితల ఉదాహరణలూ ప్రపంచ చరిత్రలో వేలాదిగా ఉన్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే జైలు గోడలు స్వేచ్ఛను అరికట్టడానికి ఎంత గట్టిగా ప్రయత్నించినా ఊహా శక్తినీ, భావ వ్యక్తీకరణనూ ఎంత మాత్రం అడ్డుకోజాలవు. తెలుగు సాహిత్యంలో అందుకు బలమైన ఉదాహరణ వరవరరావు.

వరవరరావు ప్రస్తుతం భీమా కోరేగాం హింసాకాండ – ఎల్గార్ పరిషద్ సభ కేసు లేదా అర్బన్ నక్సల్ కేసు అనే అబద్ధపు కేసులో విచారణను ఎదుర్కొంటున్న నిందితుడిగా ఇప్పటికి పందొమ్మిది నెలలుగా మహారాష్ట్ర జైళ్లలో ఉన్నారు. 2018 నవంబర్ 18 నుంచి 2020 ఫిబ్రవరి 24 దాకా పుణె లోని యరవాడ జైలులో, ఆ తర్వాత నాలుగు రోజులు ముంబాయి లోని ఆర్థర్ రోడ్ జైలులో, ఫిబ్రవరి 29 నుంచి నవీ ముంబాయి లోని తలోజా జైలులో ఉన్నారు. ఎనబై సంవత్సరాల వయసులో అరవై సంవత్సరాలకు పైబడిన ప్రజా జీవితం గడిపిన వరవరరావు ఇప్పటికి మొత్తం తొమ్మిది సంవత్సరాలు జైళ్లలో, నిర్బంధంలో ఉన్నారు. మొట్టమొదటిసారి 1973లో అరెస్టు అయిన నాటి నుంచి మొత్తం ఏడు సంవత్సరాలు ఆంధప్రదేశ్ జైళ్లలో గడిపారు. ప్రభుత్వాలు ఆయన మీద ఇప్పటికి మొత్తం ఇరవై ఎనిమిది కేసులు పెట్టాయి. వాటిలో చట్టవ్యతిరేకంగా గుమిగూడడం, రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా రెచ్చగొట్టడం, దాడి చేయడానికి కుట్ర చేయడం, హత్య, హత్యాప్రయత్నం, పేలుడు పదార్థాల వాడకం, మారణాయుధాల వాడకం వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అంతటి తీవ్రమైన నేరారోపణలు చేసిన పోలీసులు, ప్రాసిక్యూషన్ ఇరవై ఐదు కేసులలో ఒక్క కేసులో ఒక్క ఆరోపణనైనా రుజువు చేయలేకపోయారు. ఇరవై ఐదు కేసులలో న్యాయస్థానాలే ఆయనను నిర్దోషిగా ప్రకటించి కేసులను కొట్టివేశాయి. అవన్నీ కొట్టుడుపోయిన తర్వాత, ఇరవై ఆరో కేసుగా భీమా కోరేగాం కేసులో అరెస్టు చేసి, జైలులో ఉండగానే కర్ణాటకలో 2005 నాటి కేసును, మహారాష్ట్రలో 2016 నాటి కేసును తవ్వితీసి ఆయనను నిందితుడిగా చేర్చారు.

ఈ కేసుల ద్వారా ఆయన భావప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తీకరణను, రచనను అడ్డుకోవడానికి, పరిమితులు విధించడానికి రాజ్యం ప్రయత్నించింది. కాని భీమా కోరేగాం కేసుకు ముందు ఆయన అనుభవించిన 84 నెలల జైలు జీవితం ఆయన తన రచనను మరింత శక్తిమంతంగా, మరింత లోతైన ఆలోచనతో, అంతర్ దృష్టితో సాగించడానికి అవసరమైన సమయాన్ని ఇవ్వడానికే ఉపయోగపడింది. నిజంగానే ఆయన రచనా సర్వస్వంలో జైలు రచనలు ఎంత ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తాయంటే, వెయ్యి పేజీలకు మించిన ఆయన అరవై సంవత్సరాల కవిత్వంలో (2018లో వెలువడిన రెండు సంపుటాల ‘వరవరరావు కవిత్వం 1957-2017’) లో 300 పేజీలకు పైగా జైలులో రాసిన కవిత్వమే. అలాగే, ప్రచురితమైన ఆయన 16 వచన రచనా సంపుటాలలో కనీసం ఐదు జైలులో రాసినవే. అలాగే ఆయన చేసిన రెండు ప్రధాన అనువాద గ్రంథాలూ జైలులో సాగిన కృషే.

వరవరరావు జైలు జీవితం ఆయన ముప్పై మూడో ఏడు నిండడానికి ఒక నెల ముందు 1973 అక్టోబర్ లో మొదలైంది. వరంగల్ లో విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల మూడు రోజుల పాటు విజయవంతంగా జరిగి ముగిసిన మర్నాడే, 1973 అక్టోబర్ 10న హనుమకొండలో వరవరరావును అరెస్టు చేశారు. హైదరాబాద్ లో చెరబండరాజు, ఎంటి ఖాన్ లను కూడ అరెస్టు చేసి ఆంతరంగిక భద్రతా చట్టం (మేంటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆక్ట్ – మీసా) కింద జైలులో పెట్టారు. రచయితలను వారి విశ్వాసాల కారణంగా నిర్బంధించగూడదని, వారికి ప్రత్యక్షంగా నేరాలతో సంబంధం ఉంటే నేరుగా ఆ నేరారోపణలే చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్బంధాన్ని కొట్టి వేసింది. అందువల్ల ముగ్గురినీ నవంబర్ 16న విడుదల చేశారు.

జనవరి 1974లో వెలువడిన వరవరరావు మూడో కవితా సంపుటం ‘ఊరేగింపు’లో ప్రత్యేకంగా ‘జైల్లో’అనే విభజనతో ఎనిమిది కవితలు అచ్చయ్యాయి. అది ఐదు వారాల పాటు సాగిన ఆయన మొట్టమొదటి నిర్బంధకాలం. అంటే జైలు జీవితం ఆయన చేత సగటున వారానికి దాదాపు రెండు కవితలు రాయించిందన్న మాట.

విచిత్రంగా, జైలులోకి వెళ్లిన మూడో రోజున, 1973 అక్టోబర్ 12 న రాసిన మొట్టమొదటి జైలు కవితకు ఆయన ‘కామా అని శీర్షిక పెట్టారు. తాను ఆలోచిస్తున్న, రాస్తున్న, ఆచరిస్తున్న జీవిత వాక్యంలో జైలు నిర్బంధం ఒకానొక కామా మాత్రమేనని, అటువంటి కామాలు ఈ జీవితంలో మరికొన్ని ఉండబోతాయని ఆయన భవిష్యత్తును ఊహించినట్టున్నారు.

“మాట్లాడే ప్రజల మధ్య నుంచి

మాట్లాడని చెట్ల మధ్యకు వచ్చాను

ఉద్యమాల ఊపు నుంచి, నినాదాల గాలి నుంచి

మూగగా వీస్తున్న చెట్ల మధ్యకు

గాలిని బంధించాలని పెరిగిన గోడల మధ్యకు” అనే చరణంతో ఈ ‘కామా’ కవిత మొదలవుతుంది.

రెండు రోజుల తర్వాత అదే జైలులో రాసిన మరొక కవితలో,

“నోటికీ, కాళ్లకూ ఇది జైలు

చెయ్యి రాయడం మానలేదు

మనసు రాపాడడం మానలేదు

ఒంటరి చీకటి నుంచి పయనించి కలలు

వెలుగు తీరాలకు చేరుతూనే ఉన్నాయి” అనీ,

“రాత్రి వెన్నెలలు పంచడానికి జైల్లో

చంద్రునికి అనుమతి లేదు గాని

ఉదయమే తూర్పు సూర్యుని వెలుగులోకి

ఉరకకుండా నన్నెవ్వరాపగలరు!” అనీ నిర్బంధం మధ్య నుంచే ఆశాభావాన్ని పలికారు.

1973 నవంబర్ విడుదల తీర్పులో రచనల కోసం నిర్బంధించగూడదనీ, నేరాల కోసం మాత్రమే నిర్బంధించాలనీ కోర్టు చెప్పిన మాటను ఆధారం చేసుకుని 1974 మే లో పోలీసులు ఒక పెద్ద కుట్రకు తెర తీశారు. ఎక్కడో ఏదో “నేరం”, దాడో, హత్యో, హత్యా ప్రయత్నమో, జరుగుతుంది. ఆ ఘటన మీద అప్పటికే స్థానిక పోలీసు స్టేషన్ లో కొందరు నిందితుల మీద కేసు నమోదై ఉంటుంది. అటువంటి కేసులన్నీ పట్టుకుని, దానిలో ప్రతి దానికీ వారం ముందో, నెల ముందో, మూడు నెలల ముందో అక్కడ ఏదైనా సభ జరిగిందా, ఆ సభలో విప్లవ రచయితలు మాట్లాడారా, లేదా ఆ కాలంలో సృజనలో, పిలుపులో ఏదైనా రచన వచ్చిందా, మరేదైనా పుస్తకం వెలువడిందా వంటి వివరాలు పోగేసి, ప్రతి నేరానికీ ఏదో ఒక ఉపన్యాసమో, రచనో ఆధారమని అంటూ పోలీసులు ఒక బృహద్రచన చేశారు. ఫలానా ఉపన్యాసం, ఫలానా రచన రెచ్చగొడితేనే ఆ నేరం జరిగిందనీ, కనుక ఆ నేరపు కుట్రలో ఈ ఉపన్యాసకులకూ రచయితలకూ భాగం ఉందనీ సికింద్రాబాదు కుట్రకేసు తయారు చేశారు. కొండపల్లి సీతారామయ్య, కె జి సత్యమూర్తి తో సహా నలబై ఒక్కరు విప్లవకారులను, ఆరుగురు రచయితలను (వరవరరావు, కెవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చెరబండరాజు, ఎంటి ఖాన్, ఎం రంగనాథం) కలిపి నిందితులుగా చూపుతూ ఆ కేసు పెట్టారు.

సికిందరాబాదు కుట్రకేసులో వరవరరావును 1974 మే 18న అరెస్టు చేశారు. ఆ కేసులో హైదరాబాద్ లో మాత్రమే ఉండాలనే షరతుతో కూడిన బెయిల్ తో 1975 ఏప్రిల్ లో విడుదలయ్యారు. కాని, రెండు నెలలు తిరగకుండానే జూన్ 25న ఎమర్జెన్సీ విధింపుతో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మొట్టమొదటి అరెస్టులలోనే వరవరరావును కూడ అరెస్టు చేశారు. 1977 మార్చ్ 23న ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేశారు గాని, వరవరరావును జైలు గేటు బైటే మళ్లీ అరెస్టు చేశారు. ఒక వారం తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. అలా సికిందరాబాదు కుట్రకేసు ముద్దాయిగా పదకొండు నెలలు, ఎమర్జెన్సీ నిర్బంధితుడిగా ఇరవై ఒక్క నెలలు జైలు జీవితం అనుభవించి 1977 ఏప్రిల్ లో ఆయన బైటికి వచ్చారు. ఈ 32 నెలల నిర్బంధ జీవితంలో ఆయన 36 కవితలు రాశారు. అవన్నీ 1978 ఏప్రిల్ లో వెలువడిన ‘స్వేచ్ఛ – జెయిలు కవితలు’ సంపుటంలో వచ్చాయి. నిర్బంధంలోని కవిత్వానికి ‘స్వేచ్ఛ’ అనే శీర్షిక పెట్టడం ఒక కవితాన్యాయం.

“రాత్రి గాలి వీస్తూ ఉంటుంది

నా కవి మిత్రుడు చెప్పినట్లు

జైలుగోడ ముళ్లతీగల్లో చంద్రుడు బందీ అవుతాడు

మేం పాడి, మాట్లాడి, విప్లవ స్వప్నాల్లో మునిగిపోతాం

పాపం ఒంటరిగాళ్లు

నిద్రకూ ఆశ్రయానికీ వెలియైన పేద పోలీసులు మాత్రం

’సబ్ ఠీక్ హై’ అని

గంట గంటకూ ఆవులిస్తూ వుంటారు” అనే సుప్రసిద్ధ ‘సబ్ ఠీక్ హై కవిత ఈ సంపుటం లోనిదే.

అలాగే వరవరరావు స్వభావానికి సహజమైన, వేలాదిసార్లు ఉటంకించబడిన, ప్రముఖమైన

“నేరమే అధికారమై

ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే

ఊరక కూర్చున్న

నోరున్న ప్రతివాడూ నేరస్తుడే” అనే కవితా పాదాలు కూడ ఈ జైలు నిర్బంధ కాలానివే.

ఈ ఎమర్జెన్సీ కాలంలో విప్లవ రచయితల సంఘం సభ్యులు ముప్పై మందికి పైగా ఆంధ్రప్రదేశ్ లోని వేరు వేరు జైళ్లలో నిర్బంధంలో ఉన్నారు. వారు విడివిడిగా ఒక్కొక్క జైలులోనూ, ఒక జైలు నుంచి మరొక జైలుకు పంపే ఏర్పాటుతో ఉమ్మడిగానూ లిఖిత సాహిత్య పత్రికలు తయారు చేశారు. వాటిలో కొన్నిటిని కొన్ని సందర్భాలలో బైటికి పంపించడానికి కూడ ప్రయత్నించారు. వరవరరావు ‘స్వేచ్ఛ’లో కొన్ని కవితలు అలా జైలు పత్రికలోనూ, ఎమర్జెన్సీకి ముందు బైటి పత్రికల్లోనూ కూడ వెలువడ్డాయి.

‘స్వేచ్చ’ తర్వాతి సంపుటం ‘భవిష్యత్తు చిత్రపటం’ 1986 సెప్టెంబర్ లో వెలువడేనాటికి వరవరరావు మళ్లీ జైలులోనే ఉన్నారు. రెండోసారి అధికారానికి వచ్చిన ఎన్ టి రామారావు ప్రభుత్వం 1985 ప్రారంభం నుంచీ ప్రజా ఉద్యమాల మీద దారుణమైన దమనకాండ ప్రయోగించింది. స్వయంగా ఎన్ టి రామారావు ‘ఆట, పాట, మాట బంద్’ అన్నారు. ఈ నిర్బంధకాండకు పరాకాష్టగా వరవరరావు సన్నిహిత సహచరుడు, పిల్లల వైద్యుడు, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు డా. ఎ రామనాథం ను ఆయన క్లినిక్ ముందు నుంచి వెళ్తున్న పోలీసుల ఊరేగింపులోంచి వచ్చిన పోలీసులు కాల్చి చంపారు. ఆ ఊరేగింపులో ‘వరవరరావును చంపుతాం’, బాలగోపాల్ ను చంపుతాం’ అని నినాదాలు కూడ ఇచ్చారు. అటువంటి భయానక పరిస్థితుల్లో, వరవరరావు ‘రచించే, జీవించే స్వేచ్చ కోసం జైలుకు వెళ్తున్నాను’ అని ప్రకటించి, సికిందరాబాద్ కుట్ర కేసులో అప్పటికి తాను అనుభవిస్తున్న బెయిల్ రద్దు చేసుకుని జైలుకు వెళ్లారు. అలా 1985 డిసెంబర్ చివరి వారంలో జైలుకు వెళ్లిన వరవరరావు, 1989 ఫిబ్రవరిలో సికిందరాబాద్ కుట్రకేసు కొట్టివేసిన తర్వాత, జైలులో ఉండగానే బనాయించిన రాంనగర్ కుట్రకేసులో బెయిల్ వచ్చిన తర్వాత 1989 మార్చ్ లో విడుదలయ్యారు. ఆ రాంనగర్ కుట్రకేసు అనే కొత్త కుట్రకేసును 1986 మే లో బనాయించగా, అది పదిహేడు సంవత్సరాల పాటు విచారణ జరిగింది. ఆ కేసును కూడ న్యాయస్థానం కొట్టివేసి ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.

అలా ఆయన జైలులో ఉన్నప్పుడు వెలువడిన ‘భవిష్యత్తు చిత్రపటం’లో జైలు కవిత్వం ఏమీ లేదు గాని, నిర్బంధం మీద, పోలీసు కస్టడీలో ఉన్న అనుభవం మీద రాసిన కవితలున్నాయి. ఆ పుస్తకం వెలువడిన మూడు నెలల్లోనే 1987 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిషేధానికి గురయింది. (ఆ నిషేధాన్ని 1990 మార్చ్ లో ఉపసంహరించుకున్నారు).

డిసెంబర్ 1985 నుంచి మార్చ్ 1989 దాకా జైలులో అనుభవించిన ‘వెయ్యి రాత్రుల ఒంటరితనం’ వివి రచనా జీవితంలో అత్యంత విస్తృతంగా సృజన సాగిన కాలం. కవిగా, రచయితగా, అనువాదకుడిగా ఆయన ఈ మూడున్నర సంవత్సరాల్లో విపరీతమైన కృషి చేశారు. ఈ కాలంలో రాసిన 80 కవితలతో 1990 జనవరిలో ‘ముక్తకంఠం’ వెలువడింది. ముక్తకంఠం అనే పదబంధానికి విముక్తి అయిన కంఠం అనీ, బృందగానం అనీ ఉన్న రెండు అర్థాలూ సరిపోతాయి. ఈ సంపుటంలోని జైలు కవితలు వైవిధ్యభరితమైనవి, సమకాలీనమైన అన్ని సంఘటనల మీదా, పరిణామాల మీదా వరవరరావు వ్యక్తీకరణలు ఈ కవిత్వంలో ఉన్నాయి.

ఈసారి జైలు జీవితం కేవలం కవిత్వానికి మాత్రమే కాదు, ఎన్నో వచన రచనలకూ అనువాదాలకూ కూడ అవకాశం ఇచ్చింది. ఎన్నో సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాల మీద వ్యాసాలతో పాటు, శ్రీశ్రీ ‘మరో ప్రస్థానం’ మీద సాహిత్య విమర్శ పుస్తకమే రాయడానికి ఈ జైలు జీవితం అవకాశం ఇచ్చింది. ‘కల్లోల కాలానికి దర్పణం శ్రీశ్రీ మరోప్రస్థానం – టీకా టిప్పణి’ పేరుతో అది 1990 జనవరిలో వెలువడింది. అలాగే, ఈసారి జైలుకు వెళ్లడానికి కొద్దిముందు ఆయన కెన్యన్ ప్రవాస రచయిత గుగి వా థియోంగో సాహిత్యంతో పరిచయంలోకి వచ్చారు. జైలు ఒంటరితనంలో గుగి రాసిన నవల ‘ది డెవిల్ ఆన్ ది క్రాస్’ నూ, గుగి జైలు జ్ఞాపకాలు ‘డిటెయిన్డ్: ఎ రైటర్స్ ప్రిజన్ డైరీ’ నీ తెలుగులోకి అనువదించారు. నవల ‘మట్టికాళ్ల మహారాక్షసి’ పేరుతో 1992 జనవరిలో, జైలు జ్ఞాపకాలు ‘బందీ’ పేరుతో 1996 జనవరిలో తెలుగులో వెలువడ్డాయి. (స్వేచ్ఛాసాహితి ప్రచురణలుగా ఈ రెండు పుస్తకాలూ ఈ సారి వివి అరెస్టు అయిన తర్వాత 2018 నవంబర్ లో పునర్ముద్రణ అయ్యాయి).

ఈ ‘వెయ్యి రాత్రుల ఒంటరితనం’ కాలంలో ఆయన తెలుగు సాహిత్యానికి అందించిన కానుకలలో అతి ముఖ్యమైనది జైలు నుంచి ఆయన రాసిన లేఖల సంపుటం ‘సహచరులు’. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకుడు అరుణ్ శౌరి ఆగస్ట్ 1988లో వరవరరావు ను జైలు నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఒక శీర్షిక రాయమని కోరారు. “అది ఇంత దీర్ఘకాలం ఒక చిన్న స్థలంలో బందీ అయి జీవించడమంటే ఏమిటో మాకు చెప్పగలగాలి. అది జైల్లో ఉండే చిన్న సమాజం ఆరాటాలేమిటో మాకు చెప్పగలగాలి. అది బయటి ప్రపంచపు ఏ వార్తలు లోపలి వాస్తవాల వెలుగులో కనిపిస్తాయో చెప్పగలగాలి” అని అరుణ్ శౌరి మూడు కోరికలు కోరారు. దానికి జవాబుగా వరవరవరావు తెలుగులో రాసిన లేఖలు వరుసగా ఆంధ్రప్రభలో అచ్చవుతూనే, సమాంతరంగా ఇంగ్లిష్ అనువాదంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో అచ్చయ్యాయి.

జైలు నుంచి రచన బైటికి వచ్చి, బైటి ప్రపంచంలో అచ్చు కావడానికి అవసరమైన అనుమతులను జైలు అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదించింది. ప్రతి లేఖనూ రాయగానే వరవరరావు జైలు సూపరింటెండెంట్ కు ఇవ్వవలసి ఉండేది. ఆయన అది చదివి, రాష్ట్ర ప్రభుత్వ ఇంటిలిజెన్స్ శాఖ అనుమతి కోసం పంపేవాడు. ఆ అనుమతి వస్తే అప్పుడది ఇండియన్ ఎక్స్ ప్రెస్ – ఆంధ్రప్రభ కార్యాలయానికి చేరేది. ఈ శీర్షికలో భాగంగా వరవరరావు “పదముగ్గురు సహచరుల” గురించి రాయదలిచారు. ఆ సహచరులు చెట్లు, పూలు, నిరీక్షణ, ములాఖాత్ లు, సహఖైదీలు, పుస్తకాలు, రచనలు, ఆశ. ఈ పదమూడు లేఖల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్నిటినీ ఇంటిలిజెన్స్ అనుమతించింది గాని, ఒక లేఖను మాత్రం అనుమతించలేమని వాపస్ ఇచ్చారు. అయితే, వాళ్లది వాపస్ ఇచ్చిన కొద్ది రోజులకే బెయిల్ వచ్చి, విడుదల కావడంతో అది కూడ ఆంధ్రప్రభలోనూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోనూ అచ్చయింది. ఈ శీర్షిక డిసెంబర్ 1988 నుంచి ఏప్రిల్ 1989 వరకు ప్రతి పదిహేను రోజులకొకసారి చొప్పున అచ్చయింది. వసంత్ కన్నబిరాన్, కె బాలగోపాల్, ఎంటి ఖాన్, కె జితేంద్రబాబు, జగన్మోహనా చారి, ఎన్ వేణుగోపాల్ లలో ఎవరో ఒకరు ఎప్పటికప్పుడు ఇంగ్లిష్ లోకి అనువదించారు.

తెలుగులో ‘సహచరులు’ మొదటి ముద్రణ పర్ స్పెక్టివ్స్ ప్రచురణగా 1989 జూలై లో వెలువడగా, రెండో ముద్రణ నయనోదయ ప్రచురణలుగా 2019 ఫిబ్రవరిలో వెలువడింది. ఇంగ్లిష్ అనువాదం ‘కాప్టివ్ ఇమాజినేషన్’ పేరుతో పెంగ్విన్ ప్రచురణగా 2010 లో వెలువడింది.

ఇంగ్లిష్ పుస్తకానికి గుగి వా థియోంగో ముందుమాట రాశారు. “ఈ పుస్తకం శీర్షిక కాప్టివ్ ఇమాజినేషన్ దానికదే ఒక వైచిత్రి. మానవ లక్షణాలన్నిటిలోకీ అత్యంత కేంద్ర స్థానంలో ఉండేదీ, అత్యంత మానవీయమైనదీ ఊహాశక్తే. భవన నిర్మాణ శాస్త్ర నిపుణులు భవనం నిర్మించక ముందే దాన్ని తమ ఊహలో రూపుదిద్ది కాగితం మీద చిత్రించి వాస్తవంగా నిర్మించేవారికి ఇస్తారు. ఊహాశక్తే లేకపోతే మనం గతాన్ని గాని, భవిష్యత్తును గాని ఊహించలేం. మన ఊహాశక్తిలో దేవతలను చిత్రించుకుని ఉండకపోతే మతం అనేది ఉండడమే అసాధ్యం కదా? మనం చేరదలచుకున్న గమ్యాన్ని చాల ముందుగానే మన మనసులో రూపుకట్టుకునే ఊహాశక్తే లేకపోతే అర్థవంతమైన ప్రయాణం చెయ్యగలమా? కళలూ ఊహాశక్తీ గతితార్కికంగా ముడిపడి ఉంటాయి. ఊహాశక్తే కళలను సుసాధ్యం చేస్తుంది. ఆహారం దేహాన్ని పోషించినట్టుగా, నీతి అంతరాత్మను పోషించినట్టుగా కళలు ఊహాశక్తిని పోషిస్తాయి. రచయితలు, గాయకులు, శిల్పులు – మొత్తంగా కళాకారులు ఊహాశక్తికి ప్రతీకలు. వారు ఆ ఊహాశక్తితో సంభాషించి అసాధ్యమని అనిపించే పరిస్థితుల్లో కూడ సాధ్యమయ్యే అవకాశాలను చూపుతారు. అందువల్లనే పదే పదే రాజ్యం కళాకారులను చెరసాలలో నిర్బంధించడానికి ప్రయత్నిస్తుంది. ఊహాశక్తిని బందీగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాని ఊహాశక్తికి ఎంత సామర్థ్యం ఉంటుందంటే అది తన స్థల కాల నిర్బంధాన్ని బద్దలు కొట్టుకొని బైటికి రాగలుగుతుంది. ఊహాశక్తి నిర్బంధం నుంచి బైటపడుతుంది. స్థలంలో, కాలంలో విహరిస్తుంది” అని గుగి అన్నారు.

‘వెయ్యి రాత్రుల ఒంటరినిర్బంధం’ తర్వాత వరవరరావు దాదాపు పదిహేను సంవత్సరాలు ఇతరేతర ఆంక్షలు, ప్రాణానికే ప్రమాదాలూ, హత్యాప్రయత్నాలూ, ప్రవాసాలూ అనుభవించినప్పటికీ జైలు జీవితం మాత్రం లేదు. కాని ప్రభుత్వం 2005 ఆగస్ట్ లో విప్లవ రచయితల సంఘం మీద నిషేధం విధించినప్పుడు, అంతకు ముందు విప్లవకారులకూ ప్రభుత్వానికీ మధ్య జరిగిన, విఫలమైన చర్చలలో మధ్యవర్తులుగా ఉండిన వరవరరావునూ, కళ్యాణరావునూ నిర్బంధించింది. ఈసారి ఆయన ఎనిమిది నెలలపాటు జైలులో ఉన్నారు. ఆ కాలంలో పద్దెనిమిది కవితలు రాశారు. అవి ఆ తర్వాత 2006 జూన్ లో వెలువడిన ‘అంతస్సూత్రం’ సంపుటంలో భాగమయ్యాయి. ఈ కాలంలో ఆయన ఎన్నో రాజకీయ, సామాజిక, సాహిత్య అంశాలపై వ్యాసాలు కూడ రాశారు. వాటిలో కొన్ని ‘జైలు రాతలు’గా ఒకే సంపుటంగా వెలువడ్డాయి.

అలా వరవరరావు జైలు రచనల చరిత్ర చూస్తే, ప్రస్తుత యరవాడ జైలు జీవితం ఆయన నుంచి మరిన్ని రచనలు రావడానికి అవకాశం ఇస్తుందనుకోవచ్చు. ఈ సందర్భంలో ‘సహచరులు’ లో తన జైలు రచనల గురించి ఆయనే స్వయంగా చెప్పుకున్న మాటలు చూడాలి:

”…జైలు నిర్బంధంలో, నిఘాలు, సెర్చ్, దాడుల్లో కవుల, రచయితల సాహిత్య శిశు హత్యలు, భ్రూణ హత్యల గురించి ఇంతకన్న వివరించనక్కర్లేదనుకుంటాను.

1973 అక్టోబర్ మొదలుకొని నేనుమధ్య మధ్యలో ‘కటకటాల కౌగిళ్ళ మధ్య’ రాసిన మాట నిజమే కాని ‘కరకు నేలపై’ కూర్చొని మాత్రం కాదని సవినయంగా విన్నవించదలచుకున్నాను. డిటెన్యూగానైనా, స్పెషల్ క్లాస్ ఖైదీగానైనా నేనెప్పుడూ కుర్చీపై కూర్చొని టేబిల్ పై రాశాను. ‘రచన చేసే సౌకర్యం’ పొందాను. మానసికంగా సాంస్కృతిక, రాజకీయ ఒంటరితనం తప్ప భౌతిక వనర్ల విషయంలో ఏ బాధా అనుభవించలేదు” అని ఆయన 1989 ఏప్రిల్ 16న రాశారు.

తాజా కలం:

భీమా కోరేగాం కేసులో వరవరరావు నవంబర్ 17న అరెస్టు అయిన ఒకటి రెండు వారాల్లో ఆయన పరిచయంగా ఇంగ్లిష్ లో నేను రాసిన ఈ వ్యాసం సుప్రసిద్ధ న్యాయవాది ఇందిరా జైసింగ్ నడుపుతున్న ది లీఫ్ లెట్ అనే చట్టవ్యవహారాల వెబ్ సైట్ మీద 2018 డిసెంబర్ 17న వెలువడింది. ఇప్పుడు పద్దెనిమిది నెలలు గడిచాక ఈ వ్యాసానికి చేర్చవలసిన అంశాలు, తాజా కలాలు చాల ఉన్నాయి.

అప్పటికి ఎనబై నాలుగు నెలల జైలు జీవితంలో, అది వరంగల్ జైలు అయినా, ముషీరాబాద్ జైలు అయినా, చంచల్ గూడ జైలు అయినా రాసుకోవడానికి ఒక బల్లా, కూచోవడానికి ఒక కుర్చీ దొరికాయని, హోచిమిన్ చెప్పినట్టుగా ‘కరకు నేల’ మీద కూచోవలసిన స్థితి రాలేదని వరవరరావు రాశారు. ఆ మాట రాసిన నాటికి ఆయన వయసు ఇంకా యాబై నిండలేదు, బహుశా ‘కరకు నేల’ను కూడ తట్టుకోగల స్థితిలో ఉన్నారేమో. కాని తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాలకు, ఆ మేరకు వయసు మీద పడిన తర్వాత, ఆరోగ్యం క్షీణించిన తర్వాత వచ్చిన ఈ పుణె యరవాడ జైలు నిర్బంధంలో అక్షరాలా ఆయన ‘కరకు నేల’ మీదనే గడపవలసి వచ్చింది. కింద పరచుకోవడానికి జైలు అధికారులు ఇచ్చిన ఒక గొంగడి మినహా, మేం ఇస్తామన్నా మరొక దుప్పటి కూడ అనుమతించని కర్కోటక, అనాగరిక జైలు వ్యవస్థలో యరవాడ జైలులో అయన పదిహేనున్నర నెలలు – నాలుగు వందల అరవై ఐదు రోజులు – గడిపారు. ఆ తర్వాత నాలుగు రోజులు ముంబాయి లోని ఆర్థర్ రోడ్ జైలులో, ఆ తర్వాత మూడున్నర నెలలు – నూట ఐదు రోజులు – గా నవీ ముంబాయి లోని తలోజా జైలులో అంతే దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారు. ముంబాయికి మారినప్పటినుంచీ కొవిడ్ వల్ల, లాక్ డౌన్ వల్ల ఉత్తరాలు లేవు, ములాఖాత్ లు లేవు, న్యాయవాదులతో ములాఖాత్ లు కూడ లేవు గనుక ఎట్లా ఉన్నారో, ఏమి చేస్తున్నారో, చదువుతున్నారో, రాస్తున్నారో ఏ సమాచారమూ లేదు. నెలా రెండు నెలలుగా అనారోగ్యంతో ఉన్నారని, జైలు ఆస్పత్రిలో ఉన్నారని అస్పష్టంగా, అట అట లుగా వచ్చిన సమాచారంతో ఆందోళన పడుతుండగానే, ఆయన అనారోగ్యం నిజమేనని ఆయనను నగరంలోని జెజె ఆస్పత్రికి పంపించారనే వార్తతో తేలిపోయింది.

కనుక ఈ మూడున్నర నెలల గురించి తెలియదు గాని పుణె జైలులో మాత్రం ఆయనకు సాగిన విస్తారమైన చదువూ రాతా గురించి కొంత సమాచారం ఆయన ఉత్తరాల్లో రాసినదైనా, కోర్టులో, జైలులో కలిసినప్పుడు చెప్పినదైనా ఉంది. అవన్నీ తెలుగు రచనలు గనుక, తెలుగు చదివి ఆమోదించే సెన్సార్ అధికారులు జైలులో లేరు గనుక ఆ రచనలేవీ ఆయన విడుదలయ్యేవరకూ బైటికి రావు. ఉత్తరాలు ఇంగ్లిష్ లో రాశారు గనుక అవి మాత్రం సెన్సార్ కత్తెరల కళ్లు దాటి బైటికి వచ్చాయి.

యరవాడ జైలులో వివి విపరీతంగా చదివారు. దాదాపు ఆ అరవై వారాల్లో కనీసం అరవై పుస్తకాలైనా చదివి ఉంటారని నా అంచనా. హైదరాబాద్ నుంచి మేం పంపించినవీ, పుణె వెళ్లినప్పుడు ఇచ్చినవీ నలబై దాకా ఉన్నాయి. అవి కాక తోటి ఖైదీలకు వచ్చినవీ, జైలు లైబ్రరీలో ఉన్నవీ కూడ చదివే ఉంటారు. ఇంగ్లిష్ దినపత్రికలు, ఆదివారం అనుబంధాలు, ముఖ్యంగా సాహిత్యానుబంధాలు క్షుణ్ణంగా చదవడం మాత్రమే కాదు, ఆ పత్రికల్లో సమీక్షలు వచ్చిన పుస్తకాలు పంపించమని ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాశారు. పుస్తకాలూ వ్యాసాలూ చదివి ఆ రచయితలకు ఉత్తరాలు రాశారు. ఒకరకంగా చెప్పాలంటే. తెలుగు అక్షరం చదివే అవకాశం రాలేదు గనుక తెలుగుతో కాదు గాని, ఇంగ్లిష్ సాహిత్య లోకంతో మాత్రం గతంలోకన్న ఎక్కువ సంబంధంలో ఉన్నారు.

అమితవ్ ఘోష్ నవలలు అంతకు ముందు ఒక్కటి కూడ చదవని వారు, జైలులో ఆయన నవలలన్నీ చదివేశారు. ఆ నవలల మీద తన అభిప్రాయాలు అమితవ్ ఘోష్ కు ఉత్తరాలు రాసి ఆయన నుంచి జవాబులు పొందారు. అలాగే మీనా కందసామి నవలలు చదివి ఆమెకు ఉత్తరం రాసి జవాబు పొందారు. అశోక్ వాజపాయి సంపాదకుడుగా ఇటీవల వెలువడిన ఇండియా డిసెంట్స్ (భారతీయ భాషా సాహిత్యాలలో అసమ్మతి ధోరణుల అనువాద సంకలనం, వెయ్యి పేజీల పుస్తకం) చదివి, తెలుగు అసమ్మతి ధోరణుల అనువాదాల గురించి తన అభిప్రాయాలు ఆయనకు ఉత్తరం రాశారు. బంగ్లాదేశీ ఫొటోగ్రాఫర్, ప్రగతిశీల అభిప్రాయాల వల్ల జైలు నిర్బంధం అనుభవించి బైటికి వచ్చిన షహీదుల్ ఆలం ఇంటర్వ్యూ ఏదో పత్రికలో చదివి ఆయనకు ఉత్తరం రాసి ఆయన నుంచి ఆత్మీయమైన జవాబు పొందారు. అలాగే ఒక ఆస్ట్రేలియన్ జానపద గాయని గురించి చదివి ఆమెకు ఉత్తరం రాశారు. ఒక దినపత్రికలో వ్యంగ్య శీర్షిక రాసే రచయితను అభినందిస్తూ ఉత్తరం రాశారు. ఇలా చెపుతూ పోతే మరెన్నో ఉన్నాయి. బహుశా తెలుగు సమాజంలో ఆయన లాగ బైటి సాహిత్యకారులతో ఇంత సంబంధం నెరపుతున్నవారు చాల తక్కువ మంది ఉంటారు.

ఇక ఈ పదిహేనున్నర నెలల్లో ఆయన స్నేహితులు, ఆత్మీయులు కొందరు మరణించారు. వారి జ్ఞాపకాలను మరొకరితో పంచుకోవడానికి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అవకాశం లేని స్థితిలో, కనీసం వారికి తెలుగులో ఉత్తరం రాయడానికి అవకాశం లేని స్థితిలో, ఇంగ్లిష్ లో పలకరింపు/సంస్మరణ ఉత్తరాలు, జ్ఞాపకాలు రాశారు.

ఇక యరవాడ జైలులో ఆయన రచనల గురించి చెప్పాలంటే, మనకు తెలుస్తున్నది కొద్ది మాత్రమే అయినప్పటికీ, కనీసం మూడు వేల పేజీలు రాశారని నా అంచనా. అనారోగ్యంతో, రాసుకునే సౌకర్యాలు లేని స్థితిలో, ఎటువంటి రిఫరెన్సులు చూడడానికి అవకాశం లేని స్థితిలో, రాసినది ఎవరితోనూ పంచుకోవడానికి అవకాశం లేని స్థితిలో, నేల మీద కూచుని, చేతిరాతలో అంత విస్తారమైన కృషి చేశారంటే నా వరకు నాకు కన్నీళ్లు ఆగడం లేదు.

ఎప్పటి నుంచో ఆయన ఆత్మకథ రాయాలని, అది తన కోసం కాదని, ఇరవయో శతాబ్ది రెండో అర్థభాగపు తెలుగు సామాజిక చరిత్ర నమోదు చేయడానికని మేం పోరుతూ ఉన్నాం. ఇంతకాలం ఏవో అభ్యంతరాలు చెపుతూ వచ్చారు గాని ఇన్నాళ్లకు జైలులో జ్ఞాపకాలు రాయడం మొదలుపెట్టారట. తన జీవితం కన్న ఎక్కువగా, తన వ్యక్తిగత, ఉద్యోగ, సాహిత్య, ఉద్యమ జీవితాలలో కలిసి నడిచిన వ్యక్తుల గురించీ, పరిణామాల గురించీ, ఘటనల గురించీ జ్ఞాపకాలు రాస్తున్నారట. చదివిన ప్రతి పుస్తకం మీదా చిన్నదో పెద్దదో వ్యాసమో, విశ్లేషణో రాస్తున్నారట. తాను అరెస్టు కావడానికి కొద్ది ముందు, కాజీ నజ్రుల్ ఇస్లాం జీవిత చరిత్ర ఆయన రాస్తే బాగుంటుందని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి ఆయనను అడిగి కావలసిన పుస్తకాలు ఇచ్చారు. జైలులో ఆ పని మొదలుపెట్టి, ముందుగా నజ్రుల్ ఇస్లాం కవితలు ఓ యాబై దాకా తెలుగు చేశారట. గుల్జార్ ‘సస్పెక్టెడ్ పొయెమ్స్’ పుస్తకం మొత్తం తెలుగు చేశారట. అలాగే తనకు నచ్చిన కవిత్వం, వ్యాసాలు అనువాదం చేశారట. ఈ ఒకటిన్నర సంవత్సరంలో యాబై అరవై కవితలు రాశారట. అవన్నీ ఆయన విడుదలై వచ్చేటప్పుడు ఆయనతో పాటు బైటికి రావలసిందే.

అంటే ఆ ఏడు సంవత్సరాల్లోనైనా, ఈ రెండు సంవత్సరాల్లోనైనా జైలు గోడలు వివి సృజనను ఎంతమాత్రం అడ్డుకోలేకపోయాయి. జైలుగోడలను పరిహసిస్తూ ఆయన భావప్రకటన, వ్యక్తీకరణ మునుసాగుతూనే ఉన్నాయి.

వివి రెండు అక్షరాలు కాదు. అక్షరాలా అక్షరం. అక్షర విస్ఫోటక శక్తి. ఎన్నటికీ విశ్రమించని వాగ్ధార.

*

Avatar

ఎన్. వేణుగోపాల్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వరవర రావు గారి గురించి బాగానే తెలిసున్నా ఆయన రచనలు కొన్ని చదివివున్నా, ఇంతవివరంగా , స్పూర్తిదాయమయిన ఆయన పడిన అన్నీ బాధల్లోనూ అంత విలువయిన రచనలు చేసిన వివరాలు వేణుగోపాల్ గారు రాసింది చదివేకా, రాజ్యం చేస్తున్న దుర్మార్గం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.

  • Absolutely inspiring write up on varavararao. Congratulations to Venugopal
    Veluri Venkateswara Rao

  • can anybody imprison the wind, sunlight, and smiles of the bright moon! VV is all three combined. He will surely come out of jail with tons of newly written literature.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు