నీ దోసిట్లో పోస్తాను
కెరటాల రెక్కలపైకి ఎక్కించి
పసిదనపు తుళ్ళింతలలో
నిన్ను ముంచి
నింగిలోకి ఎగరేస్తానునీ చేయి నా చేయి కలుపుకుని
ఇసుకతీరాన్ని
తాబేలు అడుగులుగా కొలుస్తూ
తీపి తీపి సంగతులను
గుండెల నిండా
కాసేపు పోగేసుకుందాంమరికాసేపు మౌనాన్ని పరచుకుని
వెనుకకు మళ్ళి
బ్రతుకుపుటలను తిరగేస్తూ
అనుభవాలను నెమరేస్తూ
నిశ్శబ్దాన్ని చప్పరిద్దాం
తీరిక లేదని
సాకులను సాగదీయకు సుమా
ఒకసారి నీ పాదాలను
అలలకు అప్పగించి చూడు
తెలతెల్లని నురుగుల చక్కిలిగిలి
నీ పెదవులపై చిరునవ్వులు
సాగు చెయ్యకపోతే అడుగు
వేడివేడి మొక్కజొన్నల ఘుమఘుమలు
వేగుతున్న వేరుసెనగ వాసనలు
నీ నాలుకపై
నదులను పోటెత్తిస్తాయి చూడు
గట్టు మీద కూర్చున్నప్పుడల్లా
తుపానులను దాచుకున్న
మనసులు సైతం
నవ్వులనావలెక్కి
ఆనందస్వర్గాలను తాకడం గమనించాను
నిరుపేదపూలు సైతం
గాలిని పూసుకుని
పరిమళభరితమై వీయడం చూసాను
మిత్రమా
నాకెందుకో సముద్రాన్ని
లోతుగా చూసిన ప్రతిసారి
ముందుకూ వెనుకకూ
పరుగులు తీస్తూ
రకరకాల విన్యాసాలు చేస్తూ
గాంభీర్యాన్ని తొడుక్కున్న జీవితంలా
అనిపిస్తుంది తెలుసా
ఎన్నిసార్లు నేను చూసినా
మిత్రమా ఒకసారి నువ్వొస్తే
నాలుగుకళ్ళనూ ఒకటిచేసి
కొన్ని అందమైన క్షణాలను
తీరికగా ఒలుచుకు తిందాం
గుప్పెడు అనుభూతిని
అమృతంలా తలాకాస్తా పంచుకుందాం
విశాఖపట్నం సముద్రమంత అందంగా, ఆహ్లాదకరంగా ఉందీ కవిత కూడా. విశాఖపట్నం జ్ఞాపకాల్ని ఒక్క కుదిపి, కుదిపి లేపినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు సర్