[ఒకప్పటి మూలుగు]

కాశంలో సమాధి నీడ కింద, ఆమె నవ్వని నవ్వు వింటావ్. నివాళి పదాలు పేరుస్తావ్. ఎవరూ చూడని కొమ్మపై ఓ పాత చినుకు, ఓ పాత పిట్ట కనిపిస్తాయి నీకే. పువ్వులకోసం ఎదురుచూసే సుఖద్రోహమేదో చెట్టులో దాగుంటుంది. ధ్వని ఓ కాయం. చిల్లిగవ్వలేని నిద్రలో, కల. అదో నొప్పంతే. వేలిముద్రల నవ్వు. నొప్పి, కృష్ణహరితంగా. క్రూర శాంతీ! నీ ముఖం ఎంత బలహీనం. పిరికివాడి పిడికిలి రంగేంటి. మై వన్ అండ్ ఓన్లీ demoక్రసీ, దేశీక్రసీ, ఆ కలే లేదు, ఆకలే లేదు ఎవరికీ, నాలుకలే లేవు ఎవరికీ. అరలు అరలు ప్రతి అక్షరంలో. ఎవరివవి. వాటి పొదల పొరల్లో పారవశ్య ప్రార్థనల్ చేసేయ్. నల్లటి తాత్విక తాప తపస్సులు. మాండలిక కుండలినీ ఆటంకాలు. స్మార్ట్ ఆర్ట్ మురికి. మోక్ష విచారం.

లిఖిత వైద్యం. నిశ్చల రూపాలన్నీ అవమానాలే. హార్టో పోర్టో పడవ తేలదు. జ్ఞాపకాలే, మింగు. ఆటల మాటలలో దిగబడి, ఏ బడిలో, ఏ ఏలుబడిలో మునుగుతావ్. గట్టిగా గుట్టుగా కన్నీటిని పిసుకు. నినాదాలే నిరూపాలవ్వాలి. మహాద్రోహీ! నోళ్ళు మూసుకునే అతిగా నిద్రపోతుంటాం. కలలకి పురిటినొప్పులు రానివ్వం. మా నోట్లోనే కలలుంటాయ్. నోరిప్పమ్. చావొచ్చినా. వెన్నెముకలేని ఆసుపత్రి ఎగురుతోంది.

పారేసేవే ఎక్కువ, పదాల మధ్య ఉండే వాక్యంలో. వాటి కాటికాపరే ఏ కాలెండర్లోనూ చనిపోడు. ఎదలేని నీడ ఎదురవ్వదు. మరో చీడ పురుగు కొత్త లంగోటీతో. దైవత్వం, ఎవరి సంకలోనో నవ్వుతుంటుంది. నిరుక్త పరిమళాలు సంతోషద్వేషంలో.

*

ఎం. ఎస్. నాయుడు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • మీ గద్యం కావ్యమయంగా ఉంది. కల్పనను పదాలుగా పేరిస్తే కవిత. రాస్తూ పోతే గద్యమేమో.

 • ఒకప్పటి ములుగే, ఇప్పటికీ ఉంది..sir! తరచి చూసుకుంటే.. కవిత బాగుంది..ధన్యవాదాలు..sir!

 • పక్క పక్కనే ప్రశ్నించుకునే పరస్పర విరుద్ధ అర్థాల పదాల పొందిక ఏ వదనంలో రంగులు మారుస్తున్నది? అటు కౌగలించుకుని ఇటు జారిపోయే ఆ ఎదురుగాలి నీడ ఎవరిది ? పారవశ్యంతో నవ్వుతున్న అస్థిపంజరపు ఇకిలింపు ఎవరిది? నీ ఆనందపదాల మీమాంస సందిగ్ధ అలలమధ్య ఎవరి కలలు కంటున్నది? గుండెల మధ్య పొడుచుకున్న కత్తి డాగు ఎర్రజీర ఎవరిది?

  ఏ రసాయన ద్రావణ సమ్మేళన ఘాటు పుప్పొడి నీలో చేరి నిన్నిలా రాయిస్తున్నది?

  ఇంతకీ ఈ మోక్ష విచారం ఎవరిది?

 • నాయుడు నా ఇంటి దగ్గరే ఉంటాడు…అర్ధం కాదు ఒకపట్టాన…మంచి రాతగాడు… అందుకే ఏమైనా సరే నాయుడు మీద కోపం రాదు.

 • ఒకప్పటి మూలుగు ఇప్పటికీ అలాగే ఉంది.. ఏమీ మారలేదు..sir, కొన్నిజీవితాలలో.. me write-up బాగుంది sir! ధన్య వాదాలు!

 • ఎంత కొత్తదనమండీ బాబూ. చదువుతూ ఉక్కిరిబిక్కిరయ్యా..

 • Words or sentences don’t have much importance in framing the meaning in Naidu poetry. Just a feeling be rised amidst of absurdity. the common reader gets shock and struggles in groping for certain meaning. But he use rare and much beautiful poetic words th any othser. The contradiction in making poetry

 • ఎవ్వరికీ నాలుకలు లేని చాతకాని తనాన్ని చాలా గట్టిగా చెప్పిన నాయుడు కవిత్వం ఇప్పటి మూలుగు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు