‘ఏ సమస్యనైనా మేనేజ్ చేసేయవచ్చు’

సంచిక నుంచి పతంజలి శాస్త్రి గారి రెండవ కథల ప్రుస్తకం “నలుపెరుపు” సంపుటం లోని ‘కాసులోడు’, ‘సింవ్వా సెలం గోరి గేదె’ కథలని చూద్దాం.

ఈ రెండు కథలు కూడా వ్యవస్థలో బలంగా నాటుకుని వున్న ‘ఏ సమస్యనైనా మేనేజ్ చేసేయవచ్చు’ అన్న ధోరణిని ఎత్తి చూపిస్తాయి. సమస్యలని పరిష్కరించడం అనేది ఎప్పుడో పోయింది. ఆ సమస్యని ఎలాగోలా చుట్ట చుట్టి చాపకింద తోసేయడం అనేది ఈ రోజున జరుగుతున్న విషయం. ఆ విషయాలనే ఈ కథలు తెలియ చెప్తాయి.

“కాసులోడు”

ఎల్లుండి మీటింగ్. మీటింగ్లంటూ ఎక్కడినుంచో వచ్చి, వూళ్ళో వాళ్ళని చెడగొడుతున్నారు. ఎవడి భూములు వాడు అమ్ముకుంటాడు, మధ్యలో వీళ్ళకేంటి? అనుకుంటూ అసహన పడుతున్నాడు కాసులు. SEZ కోసం భూ సేకరణ జరుగుతోంది. కలెక్టర్ బుజ్జగించినా, ఎమ్మెల్యే వచ్చి మాట్లాడినా కొన్ని గ్రామాల రైతులు భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. ఎమ్మార్వో గారు అప్పుడే కాసులుని ఎంచుకున్నారు కార్యక్రమాలని చక్కబెట్టడానికి. బయటినుంచి సంఘాలవాళ్ళు వచ్చి రైతులని మాట వినకుండా చేస్తున్నారని కాసుల ఆరోపణ. తన గ్రామాల వాళ్ళని ఒప్పిస్తే ఎమ్మెల్యే ద్వారా మినిస్టర్ గారికి కూడా దగ్గరయ్యే అవకాశం వుంది. అందుకే కాసులు చేతికందే ఏ అవకాశాన్నీ వదులుకోలేదు.

కాసులు ఇంటి ఎదురుగా నూకరాజు ఉంటాడు. నూకరాజు భార్య నాగమ్మకి గంగమ్మతల్లి వంటిమీదకి వస్తుంది. ఎక్కడెక్కడివాళ్ళు డాక్టర్లు ఇచ్చే గోళీలు మింగేసి కూడా జబ్బు నయం కోసం నాగమ్మ దగ్గరకి వస్తుంటారు. నూకరాజుకదో కిట్టుబాటు వ్యాపారం. ఆ మధ్యఏవో చర్చి లు వెలిసినా, మెళ్ళో సిలువలు తప్ప నమ్మకాల్లో తేడాలేమీ రాలేదు. ఈ సంఘం వాళ్ళు రావడం, కొంతమంది పోలీసుల అత్యుత్సాహం, సమస్యని మరీ క్లిష్టం చేసాయి. ఎలాగైనా ఈ పని చేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, బాగా కిట్టుబాటు అవుతుందని అనుకుంటే, విషయం తెగేలా కనబడటం లేదు. అప్పుడే కాసులు కళ్ళకి నూకరాజు కనబడ్డాడు. నూకరాజుకి కాసులు ఓ పెద్ద వ్యాపార అవకాశంలా కనిపించాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు.

నాలుగురోజులు పోయాక కాసులు భార్య మరో ఇద్దరు ఆడవాళ్ళూ యధాలాపంగా, వున్న నాలుగైదు వీధుల్లో, రెండు వీధులు తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు. వూళ్ళో ఆడాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.

నాగమ్మగారికి రెండు రోజులనుంచి వంటిమీద స్పృహ లేదు, పీడ కలలంట. “అమ్మా తల్లో! దయవుంచు తల్లో !” అని రెండు చేతులెత్తి దండాలు పెట్టుకుంటోందిట, వర్షాలు పడవంట, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంట, ఇలా రకరకాలుగా పిట్ట కథలు చెలరేగిపోతున్నాయి. ఆ తరువాత నాలుగు రోజులకి వూరు ఊరంతా ఏకమై గంగమ్మతల్లి చెప్పినట్లు నడుచుకుంటామని నైవేద్యాలు పెట్టి, మాటిచ్చి వచ్చారు.

ఊరి గురించి నాగమ్మ మట్టిలోనే కలిసిపోతుంది కానీ డాక్టర్ల దగ్గరకి వెళ్ళదని నాగరాజు నొక్కి చెప్పేసాడు. నెమ్మదిగా ప్రజలకి, సంఘం వాళ్ళమీద నమ్మకం సన్నగిల్లింది. ఒకరోజు సాయంత్రం నాగమ్మ, గంగమ్మ మీదకు రావడంతో వెర్రెత్తి పోయింది. “తల్లీ మాట వింటాం”! అని హారతులిచ్చి, ఊరంతా బుజ్జగించింది.

కాసులు సంతోషంతో బాగా తేలికైపోయాడు. “ఎండి రధం మీద లక్ష్మి దేవి కనిపిస్తుంటే వూళ్ళో ఎవరూ రానీట్లేదంట. కరువొచ్చి ఊరంతా నాశనం అయిపోద్ది, అందుకే లక్ష్మి దేవిని అపుతుంటే, వద్దంది గంగమ్మ తల్లి, అన్నాడు నూకరాజు. మొత్తానికి అందరూ ఒప్పుకున్నారు అని ఆనందం లో ములిగిపోయాడు కాసులు.

*

‘సింవ్వా సెలం గోరి గేదె’

ఎంతమంది బుజ్జగించినా సింహాచలం వినేటట్టు లేడు . ఇంకా ఎమ్మెల్యే గారు రాలేదు. ఎండలతో నిమిత్తం లేకుండా వూరు వారం రోజుల నుంచి వుడికిపోతోంది. నాలుగు వృధాప్య ఫించన్లు, కొన్ని పాయఖానాలు, ఎమ్మెల్యే గారు సభ పెట్టి, ప్రకటిస్తారని, దండోరా వేశారు. ఆ సభలోనే తాడో పేడో తేల్చుకోడానికి చెట్టంత సింహాచలం తన గేదెను వెంటేసుకుని వచ్చేసింది. విషయం ఏంటంటే సరిగ్గా ఏడాది క్రితం మీటింగులో ఎంపిక చేసిన వాళ్ళకి గేదెలను పంచి పెట్టింది యంత్రాంగం. ఆస్ట్రేలియా లో పుట్టి పెరిగి హర్యానాలో కొంత కాలక్షేపం చేసిన కొన్ని గేదెల్ని ఆంధ్రా కి తరలించారు. నల్లగా బలంగా వున్న గేదెను చూసి సంబర పడింది సింహాచలం. లచ్చిందేవి వచ్చిందనుకుంది. ఐతే గేదెది విదేశీ పౌరసత్వం. ఆరు నెలలు దాటకుండానే సింహాచలం ఇల్లు వళ్ళు గుల్ల అయిపోయాయి. అందుకే ఎలక్షన్ లో డబ్బులిచ్చి మళ్ళీ కనబడకుండా పోయిన ఎమ్మెల్యేని దులిపేద్దాం అని వచ్చింది. పాల సంగతి దేవుడెరుగు ఇచ్చిన గేదె దెయ్యంలా మేట్లు మేట్లు గడ్డి తినేస్తుంది. అసలే కరవు, గడ్డి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అలాంటి చోట ఇలాంటి విదేశీ జాతి గేదెల్ని తీసుకువచ్చి చేతులెలా దులిపేసుకుంటారు? చల్లటి వాతావరణం లో మాత్రమే బతక గలిగే జీవుల్ని, ఇలా ఉడికి పోయే ఎండలుండే చోటికి ఎలా ఇచ్చారు? పుష్కలంగా గడ్డి, నీరు వున్న చోట ఉండాల్సిన జీవుల్ని, తినడానికి అంతంత మాత్రంగా వున్న కుటుంబాలకిస్తే అవి గుల్లయిపోవూ? శుభ్రంగా ఓ పూట తినేవాళ్ళకి దరిద్రం పట్టుకుంది. మెట్ట పొలాల్లో నీళ్లు లేని చోట ఈ గేదెలేంటి? అందుకే ఈ గేదెలూ వద్దూ మీరూ వద్దూ పట్టుకు పోండని ప్రజా ప్రతినిధిని దులిపేయడానికి సిద్దమై వచ్చింది సింహాచలం. భద్ర కాళిలా వున్న సింహాచలాన్ని ఎలా సముదాయించాలో తెలియక ఎండివో, కలెక్టర్ అందరూ తలలు పట్టుకు కూర్చున్నారు. ఎలాగ సమస్యను పరిష్కరించుకోవడం? ఐతే ఇలాంటి వ్యవస్థల్లో చాకుల్లాంటి అసిస్టెంట్లు వుంటారు. ఏ అధికారి పరిష్కరించలేని సమస్యల్ని చిటికెలో చక్కబెట్టేస్తారు . ఎమ్మెల్యే గారు వచ్చారు . మండుతున్న ఎండలో కూర్చున్న సింహాచలాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకు వెళ్ళడానికి అసిస్టెంట్ వచ్చాడు. లోపలికి వెళ్లే ముందు ఆఫీస్ వెనకాల వరండాలో కూర్చోబెట్టి స్టీల్ గ్లాసులో చల్లని కూల్ డ్రింక్ ఇచ్చాడు. పొద్దున్నుంచి ఎండనపడ్డ సింహాచలం కూల్ డ్రింక్ ని గట గటా తాగేసింది. రెప్పలు బరువెక్కాయి. గంటలో మీటింగు అయిపోయింది, వెనక వరండా లో బెంచి మీద సింహాచలం గుర్రు పెట్టి నిద్ర పోతోంది.

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు