ఏలికపాములు

తూరుపు కొండల మీద నుంచి గాలి వీస్తోంది. చాలా మత్తుగా ఉందా గాలి. కొండల కింద వున్న జీడిమామిడి, మామిడి, సరుగుడు చెట్ల వాసనలు కలుపుకొని వుంది గాలి.

పెందుర్తి నుంచి గోపాలపట్నం వెళ్లే గతుకుల రోడ్డులో పోలీసు జీపు శబ్దం చేసుకుంటా వెళ్తోంది. రోడ్డు పక్కగా వున్న పదో నంబర్ మైలురాయి కాలనీ మొదల్లో రెండు మదుం దిమ్మలున్నాయి. వాటిమీద కూర్చొని ఆ అర్ధరాత్రికాడ మెల్లగా మాట్లాడుకుంటున్నారు కాలనీ జనాలు. వాళ్ల దగ్గరకొచ్చిన  జీపు కుయ్యిమని ఆగింది. ఇంజిను ఆపకపోవడంతో డుర్యుమ్.. డుర్యుమ్ అని శబ్దం చేస్తోందా జీపు.

“ఎవరైనా కనిపించారా?” అడిగాడు పోలీసాయన.

“లేదండి” చెప్పారు కాలనీలో పెద్దాయన శర్మ.

“అందరి దగ్గరా కర్రలున్నాయా?” ఇంకో ప్రశ్న వేశాడు పోలీసు. జీపులో లైటు లేక పోలీసాయన మొఖం కనపడటం లేదు.

“అందరి దగ్గరా విజిల్సు వున్నాయి కదా?” అడిగాడు జీపులోంచే మరో పోలీసు.

“హా.. వున్నాయి” అన్నాడు సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగి నందగోపాల్. “మా దగ్గరే కాదు, కాలనీలో అందరి ఇంటికీ ఇచ్చాము” వివరించాడతను.

“జాగ్రత్తగా తెల్లవారుజాము నాలుగింటి వరకూ పెట్రోలింగ్ చేయండి. మేము గోపాలపట్నం బంకు వరకు వెళ్లి వస్తాం” అని కాలనీ జనానికి చెప్పి,”పోనియ్” అని హోంగార్డుతో అన్నాడు. జీపు శబ్దం చేసుకుంటూ ఒంటరి రోడ్డు మీద చివరికంటా వెళ్ళిపోయింది.

పొగమంచు పడుతున్న నవంబర్ రాతిరిలో జీపు నుంచి వొచ్చే పొగ, మంచు రెండూ కలిసిపోయాయి. ఎత్తులోకి  వెళ్లి మర్రిచెట్టు మలుపులో మాయమైపోయింది జీపు. ఇంక రోడ్డు మీద నరమానవుడు లేదు.

గంభీరమైన వాతావరణం. కీచురాళ్ళ చప్పుడు. కొండల కింద మైదానాలలో టి టి టి.. టి టి టి.. అని ఒక పిట్టేదో అరుస్తోంది.

కాలనీలో దొంగలు పడకుండా, ఎవరి ఇల్లు కొట్టేయకుండా ఇంటికొకరు చొప్పున అయిదుగురేసి ఒకరోజు వొంతున  కాలనీలో కాపలా కాస్తున్నారు జనాలు. రాత్రి పన్నెండు నుంచి తెల్లవారి నాలుగింటి వరకు కాపలా. పోలీసుల భాషలో పెట్రోలింగ్.

*   *   *

ఒకే రోజు వరసగా ఏడిళ్లల్లో దొంగతనాలు జరిగాయి. ఒక ఇంట్లో దోచుకున్నాక రెండువైపులా బయట గెడ పెట్టేశారు. ఆ తరువాత పక్క ఇల్లు, ఆ తరువాత మరోటి. ఇలా ఏడు ఇల్లు ఒకేసారి కొట్టిపారేసారు. తిరగబడిన మూడో ఇంటి వాడికి మూడు కత్తి పోట్లు పడ్డాయి.

ఎస్సై వొచ్చాడు. సీఐ వొచ్చాడు. జాగిలాలు వొచ్చి అటూ ఇటూ తిరిగాయి. కొండల మీదకు వెళ్లే దారిలో సగం దూరం వరకు తీసుకెళ్లాయి. ఆ తరువాత సిటీ పోలీస్ కమిషనర్ వొచ్చి జనంతో మాట్లాడేడు. దొంగల్ని పట్టుకుంటాం అన్నాడు. జాగర్తగా ఉండాలని చెప్పాడు.

దొంగతనాలు మాత్రం ఆగటం లేదు. స్టేషన్ పరిధిలో ఎక్కడో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. డబ్బు దొరికితే పట్టుకుపోతున్నారు. బంగారం సరే సరి. ఆడాళ్ళ చెవి దిద్దులు బలవంతంగా తీసేస్తున్నారు. చెవుల నుంచి రక్తం వొచ్చేస్తోంది.

నగరానికి ఈ ప్రాంతం దూరం. ఓ పక్క కొండలు, మరో పక్క మామిడి తోటలు, ఇంకో పక్క యాభై, నలభై గడపల చిన్న గ్రామాలు. వీటికి ఇంకాస్త దూరంలో వుడా లేఅవుట్ల  గవర్నమెంట్ కాలనీలు. ఆ కాలనీల్లో మట్టి రోడ్లు మాత్రమే వున్నాయి. పూర్తిగా వీధిలైట్లు కూడా రాలేదు. కొన్ని ఇళ్లకు కాంపౌండ్ వాల్ వుంది. చాలా వాటికి లేదు.

దొంగలు ఇలాంటి కాలనీల మీద పడిపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుపోతున్నారు. అడ్డొస్తే మగాళ్ల బుర్రలు బద్దలు కొట్టేస్తున్నారు.

పోలీస్ కమిషనర్ మళ్ళీ వొచ్చాడు. కాలనీ జనాలను పిలిచాడు. మీ భద్రతే మీదే అని చెప్పాడు. ప్రతి రాత్రి కాపలా ఉండాలి అన్నాడు. వొంతులవారీగా తిరగాలి అన్నాడు. ప్రతి కాలనీలోను పోలీసులు వొచ్చి వెళ్ళేటట్లు ఒక రిజిస్టరు పెట్టాడు.

పోలీసుల పెట్రోలింగు జీపు రాత్రంతా అన్ని కాలనీలు తిరుగుతోంది. జనం కాలనీ అంతా కర్రలు, విజిళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. నెలకు ఇంటికి ఇరవై రూపాయలు తీసుకునే గూర్ఖా కూడా ఒక విజిలు, పాత సైకిలు, కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు.

అయినా దొంగలు ఏదో ఒక మూల, ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడి ఇంటికి కన్నమేస్తున్నారు. తిరగబడితే  పొడిచేస్తున్నారు. వెంటిలేటర్ల నుంచి పిల్లలను పంపించి వెనక తలుపులు తీసేసి ఇంట్లో దూరిపోతున్నారు. వంటగదిలో తెరచిన కిటికీ నుంచి వాళ్ళ దగ్గరున్న ఇనుపకొక్కెంతో తలుపు గెడలు తీసేస్తున్నారు.

జనానికి కంటి మీద కునుకు లేదు. ఆడాళ్లకు ప్రశాంతత లేదు.

 

*    *   *

పెట్రోలింగ్ చేస్తున్న ఆ అయిదుగురు శర్మ గారి ఇంటి మెట్ల వరకు వెళ్లి కాసేపు కూర్చున్నారు. శర్మ గారు ఇచ్చిన మంచినీళ్లు తాగారు. ఒకాయనకు ఏమీ తోచక చేతిలో వున్న కర్రతో నేలమీద గొయ్యి చేస్తున్నాడు.

“బచావో .. బచావో.. చోర్.. చోర్.. ” అని ఒక పెద్ద కేక.

ఎక్కడ నుంచి వినిపించిందో తెలీలేదు. తాగుతున్న నీళ్ల సీసా అక్కడే పడేసి విజిళ్లు ఊదుకుంటూ ముందుకు కదిలింది కాపలా బ్యాచీ.

“మా ఆవిడ సార్.. మా ఆవిడ.. ” ఆందోళనగా అరుస్తున్నాడు కాపలాకి వొచ్చిన ఐదుగురిలో ఒకాయన.  అయన అచ్చ తెలుగు. వాళ్ళావిడ కూడా! హిందీలో అరిచింది వాళ్ళావిడ కాదేమో అనే విషయం ఆయనకి తట్టలేదు.

అతను చెప్పినట్లే అయన ఇంటివైపు పరుగుపెడుతోన్న వాళ్లకి దూరంగా ఒక ఇంట్లో లైట్లు వెలిగి చేతులు ఊపుతున్న మనిషి కనపడింది. మళ్లీ అదే కేక “బచావో.. బచావో.. చోర్.. చోర్..”

పరిగెత్తుకెళ్లిన వాళ్లకు సూట్‌కేసు తీసుకుని దొంగలు పారిపోయిన దారి చూపించిందా హిందీ ఇంటామె‌. శాంతి ప్లాస్టర్స్ రామ్మూర్తి లైసెన్సుడు గన్ తీసుకొచ్చి తుప్పల వరకు వొచ్చి నిలబడ్డారు. టార్చ్ వేశారు. ఆ తుప్పలు దాటితే అంటా చీకటి. పది అడుగులకొక ఎలుగుబంటి లాంటి చీకటి గొయ్య. ఎవరూ ముందుకు వెళ్లే సాహసం చేయలేదు.

పోలీసులొచ్చారు. చూశారు. కాలనీలో సగం మంది అక్కడకు చేరుకున్నారు. దొంగల చేతిలో కత్తిపోటు దెబ్బలు తిన్న అన్నదమ్ములను ఆసుపత్రికి తీసుకుపోయారు.

తెల్లారి అయిదు గంటలకు వెలుగువస్తూన్న వేళ. దొంగలు  ఎక్కడైనా సూట్‌కేసు వొదిలేసి పారిపోయుంటారేమో అని పోలీసుల సలహాపై కాలనీలో నలుగురు కుర్రాళ్లు కొండలు, గెడ్డలు వెతకడానికి బయలుదేరారు. అలా వెతుకుతూ కొండల్లో, గెడ్డల్లో పదిగంటల వరకూ తిరుగుతూనే వున్నారు. అప్పటికే ఆ పొదల్లో, కొండల్లో మెకం ఒకటి తిరుగుతుందని పేరు. ఎలుగుబంటి ఉందేమో అని మరో భయం. నక్కలైతే జనం కనిపిస్తే పరార్ కాబట్టి కుర్రాళ్లకు భయం లేదు. ఏమీ కనపడక తిరిగివచ్చేస్తున్న వాళ్లకు పరిగెత్తుకుంటూ కాలనీ నుంచి వస్తోన్న పిల్లాడొకడు కనిపించాడు.

వొగరుస్తూ వొచ్చిన ఆ బుడ్డోడు “పోలీసులొచ్చేశారు. దొంగ దొరికేసాడు. దొంగలు పడిన ఇంటికి తీసుకొచ్చేరు. మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు” అని చెప్పాడు.

అందరూ పరుగుపెట్టారు. నిన్న రాత్రి దొంగలు పడిన ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ జనం చేరి వున్నారు.

సన్నగా చిన్న నిక్కరు, కట్ బనీను వేసుకున్న మనిషి చేతులకు బేడీలతో వున్నాడు. పోలీసులు సీన్ క్రియేషన్  చేయిస్తున్నారు. దొంగతనం ఎలా చేసి ఎటు పారిపోయాడో, ఇంట్లో ఎలా దూరాడో, ఎంతమంది వొచ్చిందీ అడుగుతున్నారు. వాడు వాళ్లకు మాత్రమే వినిపించేట్లు, అసలు మాట్లాడాడో లేదో తెలియనట్లు  మాట్లాడుతున్నాడు.

 

*  *  *

దొంగతనం చేశాక ఇద్దరు దొంగలు చెరో పక్క విడిపోయారు. ఒకడు ఆ పెద్ద ఎర్ర సూట్‌కేసు తీసుకొని గెడ్డలు దాటుకుని, నడుచుకుంటూ మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి ఒక టీ దుకాణం ముందు చెక్కబెంచీ మీద కూర్చొని టీ తాగుతున్నాడు. టవున్ నుంచి వొచ్చే తొలి బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు.

దుకాణానికి సరిగ్గా రోడ్డుకు దిగువలో మొక్కల వెనకాల పోలీసుస్టేషన్ వుంది. దుకాణం నుంచి చూస్తే స్టేషన్ కనపడదు.

నైట్ డ్యూటీలో వున్న సివిల్ డ్రెస్ కానిస్టేబుల్ కాళ్లకు చెప్పులు లేకుండా పెద్ద సూట్‌కేసుతో వున్న ఈ మనిషిని చూసి “ఏ ఊరు రా మీది?” అని అడిగాడు.

అంతే! ఆ దొంగ సూట్‌కేసు వొదిలేసి పరిగెత్తబోతే ఎదురుగా వున్న మిగతా కానిస్టేబుళ్లు వొచ్చి వెంటబడి  పట్టేసుకున్నారు.

ఏ ఇంట్లో కన్నమేయాలో, దారెటో, ఏ ఇల్లు కొంచెం మిగతా ఇళ్లకు ఎడంగా వుందో రెక్కీ చేసుకున్న దొంగ పోలీస్‌స్టేషన్ ఎక్కడుందో తెలీక దొరికిపోయాడు. వాడి ద్వారా రెండోవాడూ దొరికిపోయాడు.

“ఇది ఏలికపాముల ముఠా పని. మేము చాకచక్యంగా పట్టుకున్నాము” అని కమిషనర్ ప్రకటించాడు.

జనం చప్పట్లు కొట్టారు.

*

మరికొన్ని కరుడుగట్టిన అంశాలపైన  కథలు రాయాలి

* నమస్తే హరి గారూ! మీ గురించి చెప్పండి.

నమస్తే! మాది విశాఖపట్నం. కొన్నాళ్లు హైదరాబాద్‌లో పని చేసి ప్రస్తుతం విశాఖపట్నంలోనే ఉంటున్నాను. ఇక్కడ  ఎన్జీవో రంగంలో పనిచేస్తున్నాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

మాది అభ్యుదయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా అమ్మానాన్నలు అప్పట్లో ఉద్యమాల్లో పనిచేశారు. చాలామంది ప్రముఖులు మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. ఇంట్లో పుస్తకాలు, న్యూస్ పేపర్లు ఉండేవి. మా టీచర్లు సాహిత్యాన్ని బాగా వివరించి చెప్పేవారు.  అలా పుస్తక పఠనం మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. మా తాతయ్య దొంగ నీలాద్రి, మేం అద్దెకుండే ఇంట్లోని దేశపాత్రుడు గారు నాకు రకరకాల కథలు చెప్పేవారు. వాటిలో చాలా ఊహాత్మక శక్తి ఉండేది. అయితే నేను కథలు రాస్తానని అప్పట్లో అనుకోలేదు. 2014కు ముందు కొన్ని కథలు రాశాను. నా మొదటి కథ ‘పులొచ్చింది’. ఆ తర్వాత మరికొన్ని కథలు రాశాను.

* ‘బర్మా క్యాంపు కథలు’ మీకు బాగా పేరు తెచ్చాయి కదా! వాటి నేపథ్యం గురించి చెప్పండి.

మా తాతగారు అప్పట్లో బర్మా వెళ్లి, ఆ తర్వాత మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. బర్మా నుంచి తిరిగివచ్చిన వారికోసం ఇందిరాగాంధీ కాలంలో విశాఖపట్నంలో బర్మాక్యాంపు అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. మా ఇల్లు ఆ దగ్గర్లోనే ఉండేది. చుట్టూ చాలా ఖాళీ స్థలం. ఆ బర్మా క్యాంపులోని వాళ్ల జీవితాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అక్కడి వాతావరణం, వాళ్ల పద్ధతులు, అలవాట్లు, తగాదాలు అన్నీ గమనించేవాడిని‌. ఆ అనుభవంతో 2020లో తొలిసారి ‘నూకాలమ్మ తల్లి పూనకాలు’ అనే కథ రాసి సారంగ వెబ్ పత్రికకు పంపాను. ఎడిటర్ అఫ్సర్ గారి నుంచి రెండో రోజే రిప్లై వచ్చింది. కథ బాగుందని, సిరీస్‌గా కథలు రాయమని అన్నారు. అలా ఆ సిరీస్ మొదలుపెట్టి 19 కథలు రాశాను. నన్ను, నా కథల్ని సారంగ నిలబెట్టింది.

* ఆ తర్వాత ‘మాబడి కథలు’ కూడా సిరీస్‌గా రాశారు కదా?

అవును! మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. బర్మా క్యాంపు దగ్గర్నుంచి ఆఫీసర్స్ కాలనీలోని ఇంటికి మారాము. అక్కడ జిల్లా పరిషత్ స్కూలు ఉండేది. అక్కడ జరిగిన రకరకాల అనుభవాలను 14 కథలుగా రాశాను. అవన్నీ ‘నవమల్లెతీగ’ మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. సాధారణంగా బాల్యస్మృతుల కథలంటే అల్లరి, ఆటల గురించి ఎక్కువగా రాస్తారు. కానీ నేను వాటి జోలికి వెళ్లలేదు. ఎక్కువగా సామాజిక మార్పులు, ఆర్థిక తారతమ్యాలు, స్కూల్ డైనమిక్స్  చుట్టూ సాగే కథలు రాశాను.

* మీ సామాజిక కార్యక్రమాల గురించి చెప్పండి.

హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టడం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే మసనోబు ఫుకుఒక రాసిన ‘The One-Straw Revolution’ తెలుగు అనువాదం ‘గడ్డిపరకతో విప్లవం’ పుస్తకం చదివాను. అది నాలో ఆలోచన రేపింది. ఆ తర్వాత విశాఖపట్నం వచ్చేసి 17 ఏళ్ల క్రితం సామాజిక కార్యాచరణ ప్రారంభించాను. పర్యావరణ రక్షణ, బాలల విద్య, వికాసం,సంరక్షణ, పాలసీ మేకింగ్‌లో పాలుపంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశాలు. ఇతర ఎన్జీవోలు, ప్రాజెక్టులకూ నేను పని చేస్తుంటాను.  కమ్యూనిటీ అసెట్స్‌ని అభివృద్ధి చేయడం, వినూత్నంగా పని చేయడం, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ మాడ్యూల్స్ తయారుచేయడం నాకు ఇష్టమైన పని.

* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

ఎన్జీవోలో నా స్వీయ అనుభవాలు, పరిశీలన కలిపి నవలగా రాస్తున్నాను. దాని పేరు ‘లోయలో పడని బస్సు’. అన్నిటికీ నోట్స్ రాసుకోవడం నాకు అలవాటు. మరికొన్ని కరుడుగట్టిన అంశాలపైనా కథలు రాయాలని ఉంది.

*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘ఏలికపాములు’ కధ చాలా ఆసక్తిగా వుంది. చదివిన కొద్ది చదవలనిపించింది. సులభ శైలిలో అందరికీ చదివి ఆనందించేలా హరి గారు కధ ను మలిచిన తీరు చాలా బాగుంది.

  • ‘ఏలికపాములు’కధ బాగుంది. రచయితకి అభినందనలు

  • Brilliant narration. I’ve been teleported to the place where the story was set as I was reading the story. Would love to see this story in motion with the exact narration of the author!

    • కథ చదవడం ఒక ఎత్తు. స్పందించడం మరొక మెట్టు .. అందరికీ ధన్యవాదాలు.

  • సాంప్రదాయ సాహిత్యానికి భిన్నంగా వైవిధ్యభరితమైన ( చిన్నతనంలో జరిగిన కొన్ని వాస్తవ అపురూపాలను, ) గత స్మృతులను తమ కథా ఇతివృత్తాలుగా ఎన్నుకుని సాగించిన మీ కథా సృజన శ్లాఘనీయం..
    మీ…ఆలోచనలు అనుభవాలు మరిన్ని కథలు గా పాఠకుల ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ… మీకు శుభాభినందనలను తెలియజేస్తున్నాను..
    మీ … నరసింహం కోడుగంటి ( కే వీ ఎస్ నరసింహం. ) .

  • కథను ఆసక్తికరంగా మలచిన తీరు అద్భుతం.
    చదువుతున్న కొలదీ హృదయంలో ఆత్రుత కలుగుతున్న తీరు వర్ణనాతీతం.
    రచయిత మరెన్నోఅద్భుతమైన కధనాలు రచించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు