ఏదో ఒక వంక పెట్టుకొని పెద్దఊరకు…

బాల్యమే లేని చాలా జీవితాల్లో ఎక్కడో ఓ చోట చిన్న మెరుపు ఉంటుంది. ఆ మెరుపు ముచ్చటే, ఆ తడిమిన జ్ఞాపకమే ఈ కత.

మేం పొద్దున్న నిద్ర లేచే సరికి అమ్మ, ఇద్దరు చిన్నమ్మలు ఇంటి ముందు సానిపి చల్లి, అలికి ముగ్గు పెట్టేటోళ్ళు. లేచి ఆవలిచుకుంటూ, ఇంటిముందు మెట్లమీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉండేటోళ్ళం. మాది మెయిన్ రోడ్డుకి కొద్దిగా ఇవతలికి ఉన్న ఇల్లు కం హోటల్. ఆ పొద్దు పొద్దుగాల నాగలి భుజాన పెట్టుకుని, సద్దిమూట సంకల పెట్టుకొని ఎద్దులను అదిలించుకుంటూ రైతులు పొలాలకు పోతుండేటోళ్ళు. ఒకరైతు మోటబాయి బొక్కెన నెత్తిన పెట్టుకొని పోతుంటే, దాని తోక చూసి మేం నవ్వుకునేటోళ్లం. ఇంకో రైతు చర్నాకోలను గాల్లో తిప్పుకుంటూ ఎద్దులను ఉరికిస్తుంటే, ఎద్దుల మెడలో గంటలు గణ గణ మోగుకుంటూ బండ్లు పోతుండేవి. ఒక గొళ్లాయన గొంగడి భుజానేసుకుని జువ్వాలను తోలుకు పోతుంటే, రెడ్డోళ్ల పశువుల మందను ఆళ్ల జీతగాడు మేతకు తోలుకుపోతుండేటోడు.

మాకు ఎడమచేతి రోకు పెద్ద సర్కారీ బాయి ఉండేది, మూడువైపులా గిరకలుండేవి. అమ్మలక్కలు నీళ్లు చేదుకుంటూ ఏవో ముచ్చట్లు, పరాచికాలాడుకుంటూ నీళ్లు సల్లుకుండేటోళ్ళు. రోడ్డుమీద అటు ఇటు బస్సులు, లారీలు నడుస్తుండేవి. మా నాయన ఇంటి ముందు కట్టించిన చిన్న వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తుంటే, అట్నుంచి పోయే ఓ పెద్దమనిషి నోట్లో సుట్ట బెట్టుకుని “సత్తయ్య, జర అగ్గి పెట్టి ఉంటే ఇస్తావ్” అనెటోడు, “ఒరేయ్ మల్లయ్య, గా కొరకాసు తెచ్చి గీ పెద్దమనిషి కియ్యి” అంటూ తమ్ముడు మల్లయ్యను పురమాయించెటోడు. ఆయనా కొరకాసుతోటి సుట్ట ముట్టించుకుంటుంటే మాకు భలె తమాషాగుండేది. వినాయకుడికి పూజ అయ్యాక మా నాయన కొబ్బరి ముక్కలతో చక్కెర కలిపి తియ్యటి పలారం(ప్రసాదం) చేసేటోడు.

పలారం కోసం నేను,మా చెల్లె చేయి చాపితే ‘మొహం కడుక్కొని రాపోరి’ అంటూ మా అమ్మ గదిమేది. మా అన్న అప్పటికే లేచి, మొహం కడుక్కొని రెడీ గా ఉండెటోడు. అదే టైంకి పాలు పోసే లచ్చవ్వ, ఈరమ్మ, పుల్లమ్మ గంపలు నెత్తిన పెట్టుకొని వచ్చేటోళ్లు. వీళ్లు చుట్టుపక్కల మెయిన్ రోడ్ కి మరింత లోపలిగా ఉన్న చిన్న చిన్న పల్లెటూర్ల నుండి పాలు, కూరగాయలు తెచ్చేటోళ్లు. పొట్టి చెలిమె, ముసలమ్మ చెట్టు అని గమ్మత్తు గమ్మత్తు పేర్లుండేవా ఊర్లకు. ‘లచ్మీ, పాలు తీసుకపోయి పోయ్యి మీద పెట్టు’ అంటూ మా పెద్ద చిన్నమ్మకు చెప్పి, ‘సరోజన ఈళ్లకు మొహాలు కడిగే’ అంటూ చిన్న చిన్నమ్మ కు పురమాయించేది అమ్మ. మా ఇంటి వెనుక చాలా స్థలం ఉండేది, రెండు మూడు కట్టెల పొయ్యిలు నడుస్తుండేవి. వాటిల్ల పిడకలు కూడా ఏసేటోళ్లు. ఒకదాని మీద పాలు, ఒక దాని మీద అన్నం, ఇంకోదానిమీద పూరీలు చేయడానికి కడాయిలో నూనె మరుగుతుండేది. పచ్చి మొరంగ్గడ్డలు పొయ్యిలో వేసి కాల్చుకుని తినెటోళ్లం. ఇంకా పాలు పోసే అమ్మలక్కలు కూడా వాళ్ల పొలాల్లో తెంపుకొచ్చిన పెసర కాయలు, అప్పుడే భూమి నుండి పీక్కొచ్చిన చెనక్కాయలు మాకిచ్చెటోళ్లు. కొంత అటు ఇటుగా, ప్రతిరోజు మా ఇంట్ల పొద్దుగాల ఇట్లనే ఉండేది. పాలోల్లు వచ్చిన కాన్నుంచి ఇగ కొంత హడావుడి పెరుగుతుండేది.

మా హోటల్ లో పొద్దున పూట టిఫినులోకి పూరీ, చపాతి ,ఛాయ్, మధ్యాహ్నం భోజనం ఉండేది. ఛాయ్, పెరుగు కోసం ఎక్కువ పాలు తీసుకుంటాం కాబట్టి, పాలు పోసేటోళ్లు ఇంట్లో ఆపని, ఈ పని చేసి, సాయంత్రానికి పైసలు తీసుకొని పోయేటోళ్లు. ఈ గొళ్లోల్లు మా అమ్మను సుసీలక్కా అని పిలిసేటోళ్లు, ఛాయ్, టిఫిన్, అన్నం మాఇంట్లనే తినటోళ్లు. వీళ్లుకూడా మాఇంట్ల మనుషుల్లాగే అనిపించేది. ఇక ఛాయ్, టిఫిన్ల కోసం హోటలుకు వచ్చేపోయే జనాలతో సందడి మొదలై, భోజనాల టైంకి ఊపందుకునేది. ఎవరి పన్లల్ల వాళ్లుండేటోళ్లు. అప్పుడు నాకు నాలుగైదేండ్లు ఉంటాయేమో! అన్న నాకంటె రెండేండ్లు పెద్ద. చెల్లెలు మూడేండ్లది. ఇక మా ఆట,పాటలకు అంతే ఉండకపోయేది. అట్ల ఆట, పాటలతోటి, జనాల మధ్య నా బాల్యం మొదటి భాగం కొంత బాగానే గడిచిందని చెప్పొచ్చు. ఇదంతా పెద్దవూరలో జరిగిన కత. నా మెుత్తం బాల్యంలోనే ఇది స్వర్ణయుగం.

“పెద్దవూర” అని ఆ ఊరికి ఆ పేరు ఎవరు, ఎందుకు పెట్టారో తెలియదు కానీ అదొక చాలా చిన్న పల్లెటూరు. ఊరి మెుత్తానికి 100 గడపలు కూడా ఉండవేమో. మూడునాలుగు హోటల్లు, పాన్ డబ్బా, సైకిల్ షాపు, కల్లు దుకాణం, సారా దుకాణం మెయిన్ రోడ్డుకి రెండు పక్కలా ఉండేవి. ఒక మోస్తారు రెండుమూడు కిరాణా షాపులు ఊరికి లోపలివైపునే ఉండేవి. ఒకటి అర చిన్న షాపులు మెయిన్ రోడ్డు మీద ఉండేవి. మెయిన్ రోడ్ కి కొద్దిగా లోపల ఒక బీడీవో ఆఫీసు, దాని వెనుక ఐదో క్లాస్ వరకు ఒక చిన్న బడి, పోస్ట్ ఆఫీస్, కొద్దిగా పైకి పోతే ఒక డాక్ బంగ్లా ఉండేది.

అయితే లోపల ఊర్లో అన్ని వర్గాల ప్రజలు ఉండేవాళ్ళు. ఎక్కువ మంది వ్యవసాయం, పొలం పన్లే చేసేటోళ్లు. మెయిన్ రోడ్ నుంచి ఊర్లోకి వెళ్లే దారిలో మోరి దాటగానే ఇద్దరు ముగ్గురు కోమటోళ్ళ కిరాణా షాపులు, అవి దాటగానే మాదిగ వాడ ఉండేది. అది దాటి కొంత లోపలికి ఎడమచేతి వైపు పోతే కటిక కిషన్ మటన్ షాపు, అట్లానే పోతే గౌండ్లోళ్ల బజారు, ఆ తర్వాత గొడ్ల దవాఖానా.. ఇటు కుడి చేతి వైపు గుడి, ఊరి పెద్ద, సర్పంచో, పట్వారో నారాయణ రెడ్డి ఇల్లు, ఇంకా ఒకరిద్దరు పెద్దోళ్ల ఇండ్లుండేవి. ఆ ఇండ్ల ముందు నుంచి కొంత దూరం అలా నడుచుకుంటూ పోయి, కుడిచేతి వైపు తిరిగితే, వాగు. మరీ లోతు కాదు, ఒక గుండు ఎక్కి దూకేంత లోతుగా ఉండేది. వాగు దాటితే పొలాలు. ఇంతే ఊరు.

ఇప్పుడు చిన్నగనిపిస్తుంది గానీ, అప్పుడా చిన్న ఊరే మా పెద్ద ప్రపంచం. అప్పటికింకా కరెంట్ రాలేదు, పెట్రోమాక్స్ లైట్లు, కందిల్లతో (లాంతర్లు) రాత్రులు గడచేవి. పెట్రోమాక్స్ లైట్ కు పైన డొప్ప తీసి, దానికి ఒక మెటల్ (జాలి జాలిగా ఉండే చిన్న గుడ్డ సంచి, Forex కంపెనీ) కట్టి, మళ్లీ డొప్పపెట్టి, దానికి ఉన్న పంపుతో ఫుల్లుగా గాలి కొట్టి అగ్గి పుల్లతో ముట్టించేటోళ్లు. ఆ మెంటల్ కొద్దిసేపు మండి తెల్లగా మారేది, అప్పుడు ఫుల్లు వెలుగు వచ్చేది. మేమైతే కళ్లింతలు చేసుకుని ఆశ్చర్యంగా చూసేటోళ్లం. ఇంటి దగ్గర స్నానం చేయడం కంటే వాగులో ఈతకొట్టడం బలే సంబరంగా ఉండేది. అప్పుడప్పుడు మా చిన్న కక్కయ్య పాండరయ్య, వాగుకు తీసుకొచ్చేటోడు. నేను మా అన్నే కాదు అప్పటికే అక్కడ మిగతా పిల్లలు కూడా ఆడుకుంటూ ఉండేటోళ్లు. ఇక మా గోలకు, దూకులాటకు అంతే ఉండక పోయేది. మా కక్కయ్య 501బార్ సోప్ లోని రెండుముక్కలు గాని, సన్ లైట్ సబ్బుబిళ్ళ గానీ తెచ్చెటోడు. అప్పట్లో ఈ సబ్బులు చాలా ఫేమస్. స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి రెండిటికీ పనికొచ్చేది.

ఈత కొట్టి, ఉతికి పిండుకున్న అంగీని భుజాన వేసుకుని, రోడ్డుమీదకొచ్చేటోళ్లం. రోడ్డుకు రెండువైపుల పెద్ద పెద్ద చెట్లుండేవి, వేపచెట్లు, చింతచెట్లు, రాగి చెట్లు, ఇంకేవో. ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్కడు ఒక చెట్టును సుట్టేసుకుని, ఒరేయ్, ఇది నా చెట్టు, దీని దగ్గరకొచ్చినవో తంతానంటూ వార్నింగిచ్చుకుని, ఎవరిపన్లో వాళ్లు పడేటోళ్లం. చెట్లతో పనేంటంటే గోందు(బంక-గమ్) గిల్లుకోవడం. ఎంత ఎక్కువ గోందు దొరికితే, జానయ్య సేట్ అంత బెల్లం, పుట్నాలు పెడతడు. మాకప్పుడు ఇదీ ఒక ఆటే. అప్పుడప్పుడు మా చిన్నత్తమ్మ భారతమ్మ దేవరకొండ నుండి పెద్దవూరకొచ్చేది. ఆమెతో కలిసి చెట్ల సుట్టూ తిరిగి వేపకాయలేరెటోళ్లం. అవి సేర్ల లెక్క ఆ సేటే తీసుకుంటోడు. డాక్ బంగ్లల పొగడపూల సెట్టుండేది, మస్తు పూసేవి.

మా చెల్లె కోసం కొన్ని పూలడిగతే అక్కడి చెప్రాసి ఇచ్చేటోడు కాదు. “మీ హోటల్ నుండి రెండు పూరీలు తీస్కరాపో ఇస్తా” అనెటోడు. రయ్య్ న ఉరికి, అమ్మకు తెల్వకుండా, రెండు పూరీలు జేబుల పెట్టుకుని వచ్చి, చెప్రాసికిచ్చి, కిందపడ్డ పూలన్నీ ఏరుకుని పోయి, చిన్నమ్మలకిస్తే, నన్ను, అన్నను ముద్దు పెట్టుకుని, మంచిగ అల్లి చెల్లెకు జడలో పెట్టెటోళ్లు. ఎంత ముద్దుగుండేదో. ఇవి కాక సిగిరెట్ పత్తాలాట, సీసంగోళీలాట, అష్టాచెమ్మా, దాడి లాంటి ఆటలుండేవి. జిర్రగోనా, బొంగరాలాట మా అన్న, ఆళ్ల దోస్తు చంద్రమౌళీ బాగా ఆడేటోళ్లు. పత్తాలైతే నావే ఎక్కువ పోయేవి. బర్కిలీ, నేవీబ్లూ కాస్ట్లీ. వాటిని దొబ్బుదామంటే పడనిచ్చేటోళ్లు కాదు. మా ఇంటి పక్క సైకిల్ షాప్ జలీల్ కొడుకు మతిన్ గాడు బాగా దొబ్బెటోడు. డంగు మల్లయ్య సేటు కొడుకు ఎంకటేశంగాడు బాగా తొండి చేసేటోడు, వాన్ని మాతోని ఆడనిచ్చేటోళ్లం కాదు. గోళీలాటంటే మనని మించినోడు లేకుండే. ఒకసారి మా హోటల్ ముందు పాండబ్బా కృష్నయ్య, నాకంటె శానా పెద్దోడు- బద్ది ఆట ఆడదాం అంటే సై అన్న.(బద్ది ఆట అంటే ఒక గోళీతో ఇంకో గోళీని కొట్టుకుంటూ పోయి, చివరి పాయింట్ కు ఎవరైతే తీసుకుపోతారో వాళ్లు విన్నన్నమాట. ఓడిన వాళ్లు ఆక్కడినుండి బద్ది-చిన్న గుంట- దాకా కుంటాలి.) బొటన వేలు నేల మీదపెట్టి, మధ్య వేలుకు గోళీనానించి సూటిచూసి కొడ్తుంటే కృష్నయ్య గోళీ ఎక్కడికో పోయేది. రోడ్డుచివరినుంచి పాన్ షాప్ దాకా కుంటించిన. “చూసినవ సత్తయ్య, మీవోడెంత పని జేసిండో” కుంటుకంటూ కృష్నయ్య అంటుంటే, “గోటిలాటల మావోనితోటి పెట్టుకుంటవా మరి” అంటూ మా నాయన మురిసిపోయేటోడు.

మా ఇంటికి నాలుగిళ్ళవతల ఉండే సిరంగి రాములొక్కడే నాతోటి కుంటిచ్చేటోడు.ఇంత పొడుగు వేళ్లతోని భలె కొట్టేటోడు. వాళ్ల నాయనే ఊర్లో ఎవరికన్నా రోగం, రొప్పు వేస్తే మందిచ్చేటోడు, సూది గుచ్చెటోడు. దవాఖానా ఉండేది కాదు, ఏదైన కాన్పో, పెద్ద రోగమో వస్తే అటు సాగర్ కానీ, ఇటు దేవరకొండ కానీ పోయేటోళ్లు. సిరంగోళ్ల ఇంటి పక్కన వజీరలీ ఇల్లు, ఆయనకు ఐదుగురో,ఆరుగురో కొడుకులు-పెద్దోళ్లే. పీర్ల పండగొస్తే, చిన్న పీరు పట్టుకుని ధూల ఆడనిచ్చేటోళ్లు. వజీరలీ బీడీవో ఆఫీసులో చెప్రాసీ, వాళ్ల పెద్దసారుకు భోజనం మా హోటల్ నుండే క్యారియర్ తీస్కపోయేటోడు. ఇగ మా బడి జోలొస్తే, అప్పుడు మా అన్న బడికి బాగనే పోయేటోడనుకంటా,రెండో, మూడో. నేనే తిప్పలు పెట్టేటోన్నేమో, మా చెవిటి రాములు కక్కయ్య పిర్రలు వాయించి, పలక చేతికిచ్చి, భుజాలమీద కూసోబెట్టుకుని బళ్లో అప్పజెప్పి వచ్చేటోడు. ఒకటో తరగతి. సుజాతలీ సారుండెటోడు- ఆయన్ని చూస్తేనే ఉచ్చ పడేది. తెలుగు వాచకంలో- అప్పిచ్చు వాడు, వైద్యడు..బట్టలు నేసేదెవ్వడురా,కుండలు చేసేదెవ్వడురా, ఒంకర టింకర వో, వాని తమ్ముడు సో, నల్లా గుడ్ల మే, నాలుగు కాళ్ల భే.. అని ఉండేవి. పిల్లలందరితో వల్లె వేయించేటోడు. ఓ అంటూ ఒకటే గోల.

నాది కొత్త పుస్తకం, ఇంటికి పోయేటప్పుడు పలక మాత్రమే ఉంది, పుస్తకం పోయింది. చెప్పేదేముంది, ఇంటికి పోయాక చింతబరిగ తిరిగేసింది మా అమ్మ. మా చిన్నమ్మ లు ఏదో ఒక తాయిలం పెట్టి ఊర్కోబెట్టే ప్రయత్నం చేసేటోళ్లు. ఏడుపు మనమెందుకు ఆపుతం! ఇంకా ఎక్కెక్కి ఏడుస్తుంటే అమ్మే మళ్ళీ దగ్గరకు తీసుకునేది. రేప్పొద్దున మంత్రించిన పసుపు బియ్యం పంపించి, క్లాసులో అందరు పిల్లలు తినిపించేది, అమ్మ. ఎవడికి కడుపునొప్పొస్తే వాడే పుస్తకం కొట్టేసినట్టు లెక్క. అదేమైందో గుర్తు లేదు. ఏదో ఒక టైంల అమ్మ జానయ్య సేట్ కొట్టుకి సామానుకు పోయేది. చెల్లెను తీసుకపోయేది, వద్దన్నా వెంటపడి నేను కూడా పోయేటోన్ని, సామానంతా తీసుకొనుడు అయినంక, సేటు మా చేతుల కొంత కొంత బెల్లం పెడ్తడని. అట్ల కొంత గారాబంగానే గడిచేది. దేవరకొండ నుంచో, ఆ చుట్టుపక్కల పల్లెల నుంచో లంబాడోళ్లు సీతాఫల పండ్లు బండ్లమీద మిర్యాలగూడకో, సాగర్ కో- దగ్గరి టౌన్లకు తీసుకుయేటోళ్లు. భోజనమో, టిఫిన్లు చేయడానికో లేక వాళ్ళు కట్టుకొచ్చుకున్న సద్ది తినడానికో మధ్యలో మా హోటల్ దగ్గర ఆపేటోళ్లు. అమ్మ వాళ్లు సద్ది తింటామంటే మంచినీళ్లు ఇచ్చేది, వాళ్లు పోయేటప్పుడు మాకు పెద్ద బుట్ట నిండా పండ్లిచ్చిపోయేటోళ్లు. బుట్ట సుట్టూ చేరి తినుడే తినుడు. ఇట్లా ముంజల బుట్టలోళ్లు, మామిడి పండ్ల బళ్లోల్లు, రేగి పండ్ల బుట్టలోళ్లు వస్తుండేటోళ్లు. దేవరకొండలో సాలోళ్లు ఎక్కువ, మగ్గం పని కూడా ఎక్కువే. అక్కడ నేసిన బట్టలు దగ్గర టౌన్లలో అంగడికి ( వారంలో ఒకసారి జరిగే సంత) తీసుకుపోతూ, వాళ్లు కూడా మధ్యలో మా దగ్గరే ఆగేటోళ్ళు.

మా నాయన, అమ్మ దగ్గరి చుట్టాలు కూడా నెత్తి మీద పెద్ద పెద్ద బట్టల మూటలు పెట్టుకుని చాలామందే వచ్చేటోళ్లు. నారాయణ రెడ్డి పట్వారి, మాలీ పటేల్, పోలీస్ పటేల్( వీళ్ల పేర్లు గుర్తుకు లేవు) గాని రోడ్డుమీదికి వచ్చిండ్రంటే మా హోటల్లో కూసోనే మాట్లాడుకునెటోళ్లు. ఆళ్ళెంట వచ్చే ఇద్దరు మస్కూరోళ్లు, కర్రెగా, ఇంతలావు మీసాలేసుకుని, ఆ పక్క ఈ పక్క లావుపాటి దుడ్డు కర్రలు పట్టుకుని నిలబడేటోళ్లు. ఛాయి, సిగిరెట్ తాగి పైసలు ఖాతాల రాసుకోమనటోళ్లు. ఎక్కడా ఉండకపోయేది, మా హోటల్లో రేడియో ఉండేది. ఎప్పుడూ వార్తలో, హిందీ సినిమా పాటలో వస్తుండేటేవి. బీడీవో ఆఫీస్ లో పనిచేసే కొంతమంది మా హోటల్లోనే తినేవాళ్ళు, జనార్దన్ రావు అనే పోస్ట్ మాస్టర్ కూడా మా హోటల్లోనే భోజనం చేసేవాడు. ఈయన భోజనంలోకి మామిడిపండ్లు తెచ్చుకునేటోడు, పండ్లు ముక్కలు కట్ చేశాక మాకు తల ఒక ముక్క ఇచ్చేటోడు. మా నాయనకు పోస్టాఫీసుల చిన్న నౌకరీ ఉండేదనుకుంటా. బస్సుల నుంచి టప్పా సంచి ( ఉత్తరాల మూట) పోస్టాఫీస్ కందిచ్చుడు, పోస్టాఫీస్ నుంచి ఇంకో మూట బస్సుల ఏసుడు. ఇవి ఏసేటప్పుడు ఆయన జబ్బకొక లైసెన్స్ బిళ్ల కట్టుకునేటోడు, దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా. అట్లా అంతా సందడి సందడిగా ఉండేది. ఇక పండగలు, పబ్బాలు వచ్చినయంటే, మాకు కొత్త బట్టలు వచ్చేయి. ఊరంతా కొత్తదనం పూసుకున్నట్టుండేది, ఒకటే కుషాలు కుషాలుగుండేది.

సంక్రాంతికి పతంగులు ఎగిరేసుడు, పీర్ల పండుగలో దూల ఆడుడు, హోలీకి రంగులు పూసుకోనుడు, శాన మాసంల చెట్ల కిందికి పోవుడు(వన భోజనాలు).. ఒకటేంది ఎన్ని సంతోషాలో, ఎన్ని ఇష్టాలో. వానల తడుసుడయితే పడిశం పట్టి, జరం పట్టిందాక ఎగురుడే ఎగురుడు. ఇంగ బట్టుగుడెం జాతరకు గానీ, కోదండాపురం జాతరకు గానీ పోవుడంటే ఆది చెప్పనలవికాని ముచ్చటబ్బా! వాగు దాటి, పొలాలపొంటి రెండు కోసులు నడుచుకుంటూ జాతరకు పోయేటోళ్లం. రంగురంగుల కళ్ళద్దాలు, పీపీ ఊదే బూరెలు, బొంగు-పుట్నాలు, చిలకలు-బత్తీసాలు, జిలేబీలు, నూగు జీడీలు, బెల్లంపూస, చిన్న రంగులరాట్నం, ఓ పక్క బాగోతాలు ఆడేటోళ్ళు, తోలుబొమ్మలాడేటోళ్లు.. ఇంకో పక్క కాయ్ రాజా కాయ్, ఐదుకు పది, పదికి ఇరవై అంటూ ఒకడు ఒక చక్రాన్ని రయ్యిమని తిప్పుతూ ఏదో మాయ చేసేటోడు..గుడి దగ్గరైతే డప్పుల సప్పుడు, కొమ్ములూదే సప్పుడు.. పారవశ్యంతో ఊగే జనాలు.. ఎక్కడి జనాలు.. ఒకటే జనాలు..ఓ పెద్ద వేరే ప్రపంచం లోకి వచ్చినట్టుండేది. మా చిన్ని పానాలకు అంతకు మించిన సంతోషం లేదనిపించేది. ఇవికాక మా చిన్నప్పుడు, ఒకట్రెండు సార్లు మా నాయన మమ్మల్ని నాగార్జునసాగర్ కి తీసుకపోయినట్టు గుర్తు. సాగర్ డ్యాం ఇనాగరేషన్ కు ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వచ్చినప్పుడు, వాళ్లను చూసినట్లు కూడా లీలగా గుర్తుంది. ఆ జనంలో మా తాత తప్పిపోవడం, మళ్లీ దొరకడం కూడా గుర్తుకొస్తుంది.

అక్కడే మా దూరపు బంధువు కృష్ణానందం గారి ఫోటో స్టూడియో ఉంటే, అందులో మమ్మల్ని ఫోటోలు దింపించి, అక్కడ ‘అత్తగారు కొత్త కోడలు’ సినిమా చూపించినట్టు గుర్తుంది.(ఇదే నేను చూసిన మెుదటి సినిమానేమో. నో గ్యారంటీ)..ఎంతటి ఆనందాలవి..ఎంతటి మధురమైన రోజులవి..ఇప్పుడెక్కడ దొరుకుతాయి!? ఆ చిన్న ఊర్లో, కొంతకాలమే అయినా, 50 ఏళ్ల తర్వాత ఇప్పటికీ గుర్తుంచుకోదగిన తియ్యటి జ్నాపకాలవి. ఈ పెద్దఊర జీవితం తవ్వుకుంటూ, జ్ఞాపకాలన్నీ పేర్చుకుంటూ పోతుంటే ఇప్పుడు అనిపిస్తుంది-మా నాయన ఎంతటి తీన్మార్ ఖానో, ఎంతటి దిల్దారో కదాని. మా నాయనకు ఇద్దరు తమ్ముళ్లు- మల్లయ్య, పాండరయ్య, ఇద్దరు చెల్లెళ్ళు. ఇద్దరు సొంత తమ్ముళ్ల తో పాటు తన సొంత తమ్ముడు కాని చెవిటి రాములును కూడా తీసుకొని నాగార్జున సాగర్ డాం కడుతున్న టైంలో, దేవరకొండ నుండి పెద్ద వూరకు బతుకుతెరువు కోసం వచ్చాడు మా నాయన. చిన్న గుడిసెలో హోటల్ పెట్టాడు. రోజుకు పదుల సంఖ్యలో సిమెంట్ బస్తాల లారీలు అటు ఇటు తిరుగుతుండేవి. భోజనాలకు మా హోటల్ దగ్గర ఆగేవి. భోజనాలు చేస్తున్న డ్రైవర్లను అడిగి, అన్ లోడింగ్ లారీలలో అక్కడక్కడా పడిపోయిన సిమెంటును ఒక చాటలో దులపుకొచ్చేటోడు, నాయన. అట్లా రోజూ కొంత కొంత జమ చేసి, రెండు మూడు బస్తాల సిమెంటు అయ్యాక, దానికి కావలసిన మిగతా సామాన్లన్నీ కిందో మీదో పడి, అప్పో సప్పో చేసి, అందరూ కష్టపడి గుడిసె ఇంటిని చిన్న మిద్దె ఇంటికి మార్చేశారు. తొమ్మిదర్రల ఇల్లు. అట్ల మా నాయనని మంచి తెలివిగల్లోడు, గొప్ప పనిమంతుడని, కూడా అనేటోళ్లు.

పెద్దవూరకొచ్చాకే రాములు కక్కయ్య, మల్లయ్య కక్కయ్యలకు మా నాయనే పెళ్లిల్లు చేశాడట, అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండేటోళ్ళు. పాండరయ్య కక్కయ్య చిన్నోడు కాబట్టి ఆయనకి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. పెద్దత్తమ్మ పెళ్లి దేవరకొండలో ఉండగానే చేసి, పెద్దవూర వచ్చాక చిన్నత్తమ్మ పెళ్లి కూడా చేశాడు. అట్లా మా నాయన అన్నగా, ఇంటికి పెద్దగా తన బాధ్యతను గౌరవించదగ్గ స్థాయిలో నిర్వర్తించి మంచోడనిపించుకున్నడు. ఆ సాలే( గునమే) మాకూ వచ్చిందని మా నాయన గురించి తెలిసినోళ్లు అనే మాటలు. మా అమ్మ, మిగతా యేరాండ్లు అందరూ సొంత అక్కాచెల్లెళ్ల కంటే ఎక్కువగా కలిసి మెలిసి ఉండేటోళ్ళు. పదిమంది ఉన్న ఆ ఇంటిలో ఎప్పుడు ఏ గొడవ వచ్చినట్టుగా నాకు గుర్తులేదు. అమ్మ అందర్నీ ఆధరంగా, ప్రేమగా చూసిన జ్ఞాపకమే ఉంది. చెవిటి రాములు మా సొంత కక్కయ్య కాదని మాకు మెున్న మొన్నటిదాకా కూడా తెలియదు. సంతోషం, ప్రేమ, మంచితనం, నిర్మలత్వం, గొడవలు లేని కమ్మని బతుకు ఈ ఊర్లో పండింది. 50 ఏండ్ల తర్వాత లోతుగా తవ్వుకుంటూ పోతుంటే బయటపడుతున్న జ్నాపకాలివి.ఇప్పుడు అందరూ పోయారు, మా అన్న కూడా-ఆయనది అకాల మరణం. 70 ఏండ్ల వయసులో పెద్దచిన్నమ్మ, 80 ఏండ్ల వయసులో అమ్మ ఉన్నారు. 75 ఏండ్ల వయసులో మా పెద్దత్తమ్మ కమలమ్మ, గుంటూరులో ఉంటది..

ఈమె ఎప్పుడో కొని పెట్టుకున్న ఒకస్థలం ఈ మధ్య అమ్మకానికి పెడితే కొంత పైకం వచ్చిందట, అందులోంచి మా అన్నదమ్ములు, అక్కచెల్లెల్లందరికీ తలో రెండు వేలు పంపించింది. ఎందుకంటే, నా అన్నదమ్ములు నాకు సంతోషాల్ని పంచలేదా, నేను నా అల్లుళ్లకు, కోడళ్లకు పంచుతున్నానన్నది. ఇప్పటికీ పెద్దఊరలో మా మూలాలు ఉన్నాయి. మా పాండరయ్య కక్కయ్య కొడుకు తమ్ముడు గిరి అక్కడ ఫోటో స్టూడియో నడుపుతున్నాడు. అప్పుడప్పుడు వెళ్లి నా జ్ఞాపకాలను తడుముకుని వస్తాను. ఏదో ఒక వంక పెట్టుకొని ఇప్పటికీ పెద్దఊరకు పోయి రావడం మా అమ్మకు చాలా ఇష్టం.

*

నర్సిం

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • Narsim Garu gnaapakaala donthara
  Pottichelima musalamma chettu gurthu chesaaru
  My childhood is in Nagarjunasagar. I knew those villages. Manchi parichayam.

 • ఇది ఒక పల్లెటూరి పిల్లగాడి సజీవ చిత్రం. కన్నీళ్లు తెప్పించే పాలబబుగ్గల పసిమొగ్గ బతుకు పోరాట కథ. నర్సిం ఒకచిత్రకారుడు. ఎన్నో బొమ్మల సమాహారమమే ఈ అచ్చతెలంగాణ కథ. అయినా ఇది అన్ని ప్రాంతాలకూ చెందిన అచ్చమైన పల్లెటూరి కథాచిత్రం.

 • నర్సిం,

  చాలా బాగున్నాయి మీ ఊరు, మీ చిన్నప్పటి కబుర్లు.

  మీ ఊరి కబుర్లు చదువుతుంటే, నేను కూడా మీతో పాటు ఊరి వీధుల్లో, చెరువులమ్మటా తిరుగుతున్నట్లు , మీ బంధువులంతా నాకు తెలిసినట్లే అనిపించింది. మరిన్నిటి కోసం ఎదురుచూస్తుంటాను.

 • నర్సిం, ఎంత బాగున్నదో. కళ్ల నిండా నీళ్లతో చదివాను. నిసర్గ సౌందర్యం. అద్భుతమైన కథనం. ఎన్నిఅభినందనలు చెప్పినా తక్కువే. గాఢమైన అభినందన పూర్వక బిగి కౌగిలి.

 • Thanks, Giri Prasad garu.
  ఇంకా కొన్ని ఊర్ల పేర్లు మర్చిపోయాను- పినవూర, నాయకుని తండా, కుంకుడు చెట్టు తండా.. ఇంకేవేవో ఉండేవి. నాకవి చాలా గొప్ప రోజులు.

 • మంచి లైట్& షేడ్ ఫోటోగ్రఫీ టెక్నిక్ తో black&white లో తీసిన ఒక అద్భుతమైన పల్లెటూరి సినిమా అక్షరాల్లో నే చూపించినందుకు ఒక బిగ్ హగ్ !
  ఇంకా ఇటువంటి అక్షర చిత్రాలు ఎన్నో వస్తాయని ఆశిస్తూ….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు