ఏది అసలు సిసలు చైతన్యం?!

చాలా కాలం క్రితం, అంటే ఓ పుష్కరం క్రితం కావచ్చు చలం అంటే విపరీతమైన ఆరాధన ఉన్న మిత్రుడు సడన్గా కారు చైతన్య ఇన్స్టిట్యూట్ ముందు ఆపాడు. బిడ్డ వస్తుంది తీసికెళ్లాలి అని. హాస్టల్ కాదు, డే ఇన్స్టిట్యూటే. అయినా కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే జడ్జిమెంట్స్ కు వెళ్లే అలవాటు పోయి 20 ఏళ్లయ్యింది కాబట్టి కాస్త కూల్ గా ఆలోచించా. ప్రాసెస్ చేసుకోవడానికి చాలా కాలమే పట్టింది.

కింది నుంచి కష్టపడి వచ్చిన తొలితరానికి మలితరానికి భయం ఉంటుంది. జారిపడతామేమో అని. ఆ భయం వెనుకబడిన సమూహాల నుంచి వచ్చిన వారికి జీవితాంతం వెన్నాడుతుంది నీడలాగా. నింపాదిగా భరోసాతో ఉండడం అనేది జీవితాల్లో రావడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే కొన్ని తరాలు.

పైకి కనిపించని ఈ తేడా బాడీ లాంగ్వేజ్ లోనూ లాంగ్వేజ్ లోనూ ప్రతిఫలిస్తుంది. పైనుంచి వచ్చినవారికి భరోసా ఉంటుంది. ఎంటర్ ప్రైనర్ షిప్ ఉంటుంది. చొరవ ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. కేపిటల్, సోషల్ కాపిటల్ రెండూ విశ్వాసం పెంచుతాయి. రిస్క్ తీసుకోగలవు. నింపాదిగా పైకి పైపైకి చూడగలవు. కిందినుంచి వచ్చినవారికి కూడా పైచూపు ఉంటుంది, కానీ ప్రతి అడుగు వెనుకా ముందు చూసుకుంటూనే నడవాల్సి ఉంటుంది. ఎప్పుడు జారతామో ఇంకా వెనక్కి పడిపోతామో అనే భయం సెకెండ్ స్కిన్ అవుతుంది.

పిల్లలు వారు కోరుకున్న చదువు వారిని చదవనివ్వాలి, సంపూర్ణ స్వేఛ్ఛనివ్వాలి అనేది అవసరమైన ఆశయమే. కానీ రైడర్స్ లేకుండా కాదు. అందరూ సమాన స్థాయిలో ఉన్నపుడు, ఉద్యోగాలకు మెరుగైన జీతం ప్రమాణం కాకుండా పాషన్ ప్రమాణమయ్యే రోజులొచ్చినపుడు కథవేరు. మనమింకా ఆ స్థాయికి చేరుకోలేదు. మన సమాజంలో ఉద్యోగం అంటే మెరుగైనజీతం దానితో పాటే మెరుగైన జీవితం, భద్రత.

బాగా గుర్తు, ఇంట్లో ఎసి ఉండి కార్లో తిరుగుతున్న రోజుల్లో దాదాపు అదే పదిహేనేళ్ల క్రితం మా అమ్మని ఆస్పత్రికి తీసికెడుతుంటే ఆమె మళ్లీ మొదలెట్టింది ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదయ్యా, టీచర్ అట్లా అని. అప్పటికి టీచర్స్ కి ఇపుడున్నంత కంఫర్ట్ బుల్ జీతాలు కూడా లేవు. అది కిందినుంచి వచ్చినవారికి భద్రత పట్ల ఉన్నభయం.

సో జిందగీ నహీ మిలేగా దుబారా అన్నది పైవారి నినాదం. ఉన్నది ఒకటే జీవితం దాన్ని పూర్తిగా ఆస్వాదించాల అనే మాట నిజమేకానీ సార్వజనీకం కాలేదు వర్గసమాజంలో. దానికి పూర్తి వ్యతిరేకంగా మరో ఎక్స్ ట్రీమ్లో జీవితం ఎట్లా నెట్టుకురావాలా అని సతమతమయ్యే వారుంటారు. మధ్యలో అనేకానేక లేయర్లు ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకటే మాట నప్పదు.

సో కిందినుంచి వచ్చినపిల్లలకు పై వారి పిల్లలకు మల్లే భరోసాతో కూడిన వాతావరణం ఉండదు. దిల్లీలో ఉండి కోచింగ్ తీసుకుంటూ ఒకటి కాకపోతే రెండు మూడు సివిల్స్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు అనేంత సీన్ ఉండదు.పైపెచ్చు నీ ఎక్స్ పోజర్ నీ కలల లిమిట్ ని నిర్ణయిస్తుంది. ఇపుడంటే తెలిసినవాళ్లలో వాళ్లూ వీళ్లూ సాఫ్ట్ వేర్ కావడం వల్ల కలలుకాస్త విస్తరించాయి కానీ, ఫీజు రీఎంబర్స్ తర్వాత ఇంజనీరింగ్ కాస్త చేరువై పోయింది కానీ ఇరవై యేళ్ల క్రితం వరకూ కింది తరగతుల్లో టీచరో ఇంకేదైనా నాన్ గజిడెట్ ఉద్యోగమో, ఏదన్నా కావచ్చు, నెలా నెలా గడిచే ఒకటో తేదీ జీతం వచ్చే సర్కారీ నౌకరి అతి పెద్ద కల గ్రామసీమల్లోని పేదలకు. వారికి చాలా ఎనర్జీ ఉండొచ్చు. నర్చర్ చేస్తే వాళ్లూ సివిల్స్ ఏం ఖర్మ, దాని తాతమ్మలకు కూడా పరిపోవచ్చు. కానీ డి ఎస్ సి కొట్టాక పెళ్లి అవుతుంది. ఉద్యోగం కోసమే పెళ్లి వెయిట్ చేస్తా ఉంటది. తర్వాత వాయిదా వేసే వెసులుబాటు గ్రామసీమల్లో ఉండదు. పిల్లలు పుట్టేస్తారు. చాలు, ఏదో ఒక మండలంలో ఉద్యోగంతో సరిపోతుంది. తర్వాత ఎనర్జీఅంతా ఎమ్మెల్యేనో ఎంపినో పట్టుకుని మన ఊరికి దగ్గరిగా పోస్టింగ్ వేయించుకోవడంతో సరి.  కల అక్కడే  ఆగిపోతుంది.( టీచర్ తక్కువని కాదు. వాస్తవానికి అది నా డ్రీమ్ జాబ్- ఇప్పటికీ. ఐ లవ్ టీచింగ్. అదే కల అయినచోట ఇబ్బంది లేదు. కలల పరిమితి గురించి గ్రామీణఉదాహరణ కోసం మాత్రమే ఇక్కడ చెప్పడం) సో కలలు చిన్నవి కావడం దారిలో దొరికిన దారితో సంతృప్తి పడడం అనేదికింది నుంచి వచ్చినవారికి పరిమితి. పెద్ద కలలు కనొచ్చని కానీ వాటిని వెంటాడడానికి కానీ వారి దగ్గర ఎక్స్పోజర్ కాపిటల్ సోషల్ కాపిటల్ ఉండదు. అసలా ఎకోసిస్టమ్ ఉండదు. కేవలం డబ్బు మాత్రమే కాదు. ఎకో సిస్టమ్ అనేది పెద్దది.

పైనుంచి వచ్చిన వారికి ఆ పరిమితి ఉండదు. వారు తాపీగా ఒక లక్ష్యం పెట్టుకుని దాని కోసం నింపాదిగా ప్రయత్నించగలరు. అటూ ఇటూ అయితే వెనక్కి పోతామేమో అన్నభయం ఉండదు. కాపిటల్ సోషల్ కాపిటల్ ఆ భరోసా ఇవ్వగలవు.

రెండో అంశం, పిల్లలను వారు కోరుకున్న చదువులు చదివించడం వత్తిడి లేకుండా చూడడం అభిలషణీయమే అయినా దానికి రైడర్స్ ఉంటాయి. వారి ఎకోసిస్టమ్ పరిమితమైనపుడు వారికి బ్రాడర్ గా దారిచూపించడమో లేదా కాస్త డిసిప్లిన్ ఏర్పాటు చేయడమో దానికది నేరం కాదు. వద్దు మొర్రో అంటుంటే వారికి పూర్తిగా ఇష్టంలేని చదువుల్లో పెట్టి మన కలలను వారిపై రుద్ది బలవంతం చేయడం నేరం. తిరిగి కొట్టలేని వారిని కొట్టడం, విపరీతమైన ఒత్తిడి పెట్టయినా మన కలలను నెరవేర్చాలనుకోవడం నేరం. డాక్టరో ఇంజనీరో కాకపోతే మనిషే కాదన్నట్టు పిల్లలను బలవంతంగా ఆరెంటికీ అంటించి వారి మీద విపరీతమైన ఒత్తిడి పెట్టాలని కాదు. కానీ యవ్వనంలో పొంగిపొర్లే ఎనర్జీని చానలైజ్ చేసే ప్రయత్నం చేయడం ముఖ్యంగా టైంని ప్రాపర్ గా ఉపయోగించుకునే ఏర్పాట్లు చేయడం నేరం కాదు. రెంటికి మధ్య లైన్ ఎక్కడా అనేది మన సెన్సిబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో ప్రతిదానికి లెక్కలు ప్రమాణాలు నిర్దేశించి ఉండవు. మనం మన సెన్సిబిలిటీస్ మీద ఆధారపడినిర్ణయించుకోవాల్సిందే.

యవ్వనంలో అపరిమితంగా ఉండే ఎనర్జీని చానలైజ్ చేయకపోయినా, వార్థక్యంలో వ్యాపకం సృష్టించుకోకపోయినా అది నరకంగా మారుతుంది. వారికి వారి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా.

దీనర్థం వెంటనే పిల్లలను నారాయణలోనూ చైతన్యలోనూ హాస్టళ్లలో చేర్పించి వారి జీవితాలను బందీలు చేయాలని కాదు. పిల్లలకు హక్కులుంటాయి. కానీ చలాన్ని చదివో మరొక ఎలీట్ మాట వినో పువ్వులు మొక్కలు ప్రకృతి అని కవిత్వంలో బతికితే కష్టం. అవేవీ సార్వజనీక సత్యాలు కావు. ఎవరితో మాట్లాడుతున్నావు అనేదాన్ని బట్టి కొన్ని సత్యాలుంటాయి. మొక్కల్లాగా పువ్వుల్లాగా పిల్లలు ఆడుతూ పాడుతూ పెరగాలి నిజమే. కానీ అటువంటి రిషివాలీ కాస్ట్లీ. ఆర్గానిక్ ఫుడ్ లాగే. నువ్వుచచ్చినట్టు నీ చుట్టు పక్కల ఉన్నవాటిలో పిల్లలను కొట్టని తిట్టని స్కూల్స్ వెతుక్కోవాల్సిందే. కొట్టి తిట్టి చదువుచెప్పడం సులభం. కొట్టకుండా తిట్టకుండా చెప్పాలంటే చాలా ట్రైనింగ్ కావాలి. ముఖ్యంగా ప్రేమ కావాలి-పిల్లల పట్ల, టీచింగ్ పట్ల. అలాంటి స్కూల్స్ వెతుక్కోవడం చాలా పెద్ద శ్రమ. అందులో ఏదైనా మిస్ అయితే దాన్ని ఇంటిదగ్గరే పూరించాలి. కాబట్టి కాస్త మెలకువ అవసరం, పరిస్థితి పట్ల  ఎరుక ఉండడం పిల్లలకు కలిగించడం అనేవి ముఖ్యమైనవి. బాధ్యత పట్ల ఎరుక! తనజీవితం పట్ల, తన చుట్టూ వారి జీవితాల పట్ల. ఒకటి రెండు తరాలు దాటాక వారికీ భరోసా వస్తుంది. అపుడు జిందగీ నహీ మిలేగా దుబారా అని వారు కూడా పాడతారు. అందరూ కోరస్ పాడొచ్చు. అప్పటివరకూ పారా హుషారే!

*

జీ.ఎస్. రామ్మోహన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సమాజమూ, మార్కెట్టూ మన సాఫల్య సంతోషాలకు ప్రమాణాలను నిర్దేశించి, నియంత్రించే వేళ.. నువ్వు విప్పి చెప్పిన సత్యం మనసుకు పడితే చాలామంది తల్లిదండ్రులు పాపం.. అప్రూవర్లుగా మారవచ్చు రామూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు