మొదటి అడుగు: కొనసాగింపు
ఇది ఇలాగే కొనసాగనీ నియతీ. ఇప్పటి దాకా నడిచింది. ఇక ముందు కూడా నడుస్తుంది. రహస్యం రహస్యంగానే వుండనీ. లోకం దృష్టిలో నందు నీకు భర్త కావచ్చు. నీది కాని సమయంలో నీకు కూడా అతనే భర్త కావచ్చు. కానీ నీకంటూ ఒక సమయం వుంది కదా! శశాంక్ తో గడిపే సమయం. ఆ కొద్దిసేపు మాత్రం నందుని మర్చిపో.
తెలిసిపోతుందేమో అని భయపడుతున్నావా? తెలిసిపోవచ్చు. తెలియకపోవచ్చు. తెలియకుండా వుండాలంటే నువ్వు జాగ్రత్తగా వుండాలి మరి. మోసం తప్పకపోవచ్చు. మోసం చెయ్యాలంటే తెలివితేటలు కావాలి. నువ్వేం తెలివితక్కువదానివి కాదు కదా!
మొన్న శశాంక్ ఇంటికి వెళ్ళిన రోజు అతనేమన్నాడు?
“నీ దగ్గర ఒక ప్రత్యేకత వుంద తెలుసా నియతీ?” అడిగాడు.
నువ్వు డ్రాయింగ్ రూమ్ లో వున్న పెయింటింగ్ వైపే చూస్తూ “ఏంటది?” అన్నావు.
“అదే… ఒక వైపు ఆ పెయింటింగ్ ని చూస్తున్నావు. మరోవైపు నాతో మాట్లాడుతున్నావు. ఒకేసారి రెండు పనులు చెయ్యగలగడం ప్రత్యేకతే కదా” అన్నాడు. నువ్వు నవ్వేశావు.
అదే సమయంలో నీ మనసులో వున్న ఆలోచన అతనికి తెలియదు కదా. నీకన్నా ముందే నందు ఇంటికి వచ్చి ‘ఎక్కడికివెళ్లావు?’ అని అడిగితే చెప్పాల్సిన అబద్దం కూడా ఆలోచిస్తున్నావని. రెండు కాదు. మూడు పనులు ఒకేసారి… కాదు కాదు. నాలుగు పనులు. ఆ పెయింటింగ్ వేసిన శశాంక్ భార్య రేఖ మనస్తత్వాన్ని ఆ పెయింటింగ్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నావు కదూ అప్పుడు?
ఒకేసారి ఇన్ని చెయ్యగలిగిన నువ్వు ఒకేసారి అటు నందుకి భార్యగా, ఇటు శశాంక్ కి ప్రియురాలిగా వుండలేవా? ఖచ్చితంగా వుండగలవు.
మరింకేం? ఇది ఇలాగే కొనసాగనీ.
ఎందుకు భయపడుతున్నావు. ఏమిటి నీ అనుమానం?
కొనసాగించలేవనా లేకపోతే కొనసాగించకూడదనా?
కొనసాగించడం కొనసాగించకపోడం నీ నిర్ణయానికి సంబంధించినది మాత్రమే కాదు. నువ్వు కొనసాగించగలవా? కొనసాగించలేవా? అన్న ప్రశ్న కూడా అందులోనే వుంది. అది నీ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. రెండు దారులు రెండు వేరు వేరు గమ్యాలను చేరుస్తాయి. కానీ ఆ రెండు దారుల్ని జాగ్రత్తగా గమనించుకోని అడుగు వెయ్యాలి నువ్వు.
ఇది ఇలా కొనసాగించకూడదు అనుకోవడం మొరాలిటీకి సంబంధించినది. సమాజం ఏమంటుంది అన్న చర్చ వుంటుంది అటు వెళ్తే. ఇది ఇలా కొనసాగించకూడదని నిర్ణయంచుకోవడం అంటే నువ్వు తప్పు చేస్తున్నావని ఒప్పుకోవడమే అవుతుంది.
నువ్వు ఆది ఒప్పుకునే పరిస్థితిలో లేవు కదా? కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది కొనసాగించడానికి నీకు సమర్థత వుందా లేదా అని మాత్రమే. నీ సమర్థత మీద నీకు ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగని.
ఎంతకాలం అని అడక్కు. ఆ ప్రశ్నకి జవాబులేదని నీకు కూడా తెలుసు. అటో ఇటో తేల్చుకోడానికి ఇది ఒక సందర్భం కాదు. రెండు పడవల మీద సాగుతున్న ప్రయాణం.
సరే ఒకవేళ ఇలా కొనసాగించకూడదు అని నీకు మనసులో ఏదో ఒక మూల ఆలోచనవుంటే దాన్ని కాస్సేపు పక్కన పెట్టు. రెండో దారిలో ఏ ముళ్లు వున్నాయో చూసుకో. శశాంక్‍తో నీకున్న సంబంధాన్ని ఎందుకు కొనసాగించాలో ఆలోచించు.
బహుశా కొనసాగించక తప్పదని నీకు అనిపిస్తోందేమో. నీకు ఇలాగే బాగుంది కాబట్టి, ఇలాగే నడవనీ అనుకుంటున్నావేమో. అది సరి కాదేమో.
కొనసాగించడానికి తప్పని కారణం ఒకటి వుంది. అదేంటో తెలుసా? ఇది ఎలా ముగించాలో తెలియకపోవడం. అవును. ఎలా ముగిస్తావు? ఈ ప్రయాణం చేరే గమ్యం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా?
శశాంక్ ని వదిలేసి నందు భార్యగా వుండిపోతావా? నీ వల్ల కాదది. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పాల్సిన పని లేదు.
నందు మంచివాడే. కాదనగలవా? ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా సమస్య ఏమిటంటే – అతను నీకు నచ్చకపోవటం.
అతను నిన్ను ప్రేమిస్తున్న మాట కూడా నిజమే. కాని అది నీకు కావాల్సిన ప్రేమ కాదు కదా.
అవును. చాలా సున్నితమైన, సాదాసీదా ప్రేమ అతనిది. ప్రేమ కన్నా నిన్ను నేను రక్షిస్తాను అన్న భరోసా కనపడుతుంది అతని ప్రవర్తనలో. నీకు ఇష్టమైన భావకవిత్వంలా ప్రేమని పలికించడం అతనికి రాదు. కాని నీకు అర్థమైపోతుంది. కాదంటావేం? మొదటిసారి ప్రేమని ఎలా వ్యక్తపరుచుకున్నారో గుర్తులేదా?
“నా మహాద్బుత ప్రపంచంలో జీవం నువ్వు. నా కలల్లో పూచే లేతగులాబీల పరిమళం నువ్వు. నా ఊహాలోక విహారంలో నా విహంగానివి నువ్వు. చెప్పు నందు. ఒక శ్రావ్య గీతంలా నీ ప్రేమను నాకు అందింస్తావా?” అన్నావు. ఎందుకలా సిగ్గు పడిపోతున్నావు? నువ్వు ఏరుకొచ్చి కూర్చిన కవిత్వం గురించేనా? అది వదిలెయ్. ఆ తరువాత నందు ఏమన్నాడో గుర్తు చేసుకో.
“అవును. ప్రేమిస్తున్నాను”
అంతేనా అన్నట్లు చూశావు అతని వైపు. అయినా ఆ మాట నీకు ఒక భరోసా ఇచ్చినట్లుగా ఎందుకనిపించింది? ఇప్పుడు, నాలుగు సంవత్సరాల తరువాత, అతనిలో నీ పట్ల బాధ్యతే కానీ ప్రేమలేదని అనుకుంటున్నావు. కాదు కాదు. ప్రేమలేదని కూడా నువ్వు అనట్లేదు. నీకు కావల్సిన విధంగా అతని ప్రేమ నీకు దొరకటం లేదని అంటున్నావు. అంతేనా? సరే అలాగే అనుకో.
అయినా సరే, శశాంక్‍ని వదిలి నందు దగ్గరే వుండిపోగలవా? వుండలేవు కదూ? అందుకే ఇది ఇలాగే కొనసాగించడం మంచిది.
నీ సంతోషానికి కొలమానం శశాంక్ తో గడిపిన క్షణాలే అయినప్పుడు, నీకు ఇష్టం లేని నిస్సారమైన బంధంలో ఇరుక్కోవడం కన్నా విషాదం ఏముంటుంది చెప్పు?
అందుకే ఇది ఇలాగే కొనసాగనీ. మళ్ళీ అదే ప్రశ్న – ఎంతకాలం?
సాగినంతకాలం.
ఈ విషయం తెలిసిపోనంతకాలం నందుతో సమస్య ఉండదు. శశాంక్ వైపు నుంచి ఏదైనా సమస్య వస్తుందా? అసలు శశాంక్ ఏమనుకుంటున్నాడు? ఈ విషయం గురించి నువ్వు ఆలోచించలేదే! అతను కూడా ఈ ఎఫైర్… సరే కాదులే… ఈ సంబంధం ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నాడా? అతన్ని అడిగితే ఏమంటాడు?
“తెలియదు నియతీ… నాకు ఇలా బాగుంది. నీకూ ఇలాగే బాగుంది. మనిద్దరికీ బాగున్నంత కాలం ఇలాగే కొనసాగనీ…”
అలా అంటాడని నీ ఊహ కదూ. నువ్వు కొనసాగించాలన్న నిర్ణయం తీసుకోవడం కోసం, నీకు అనుకూలంగా వుండేలా ఊహించుకుంటున్నావు. నిజం చెప్పు అలాగే అంటాడా? లేక అలాగే అనాలని నువ్వు కోరుకుంటున్నావా?
నియతీ! ఇదేనా నువ్వు అతన్ని అర్థం చేసుకుంది? ఏదో తేడాగా అనిపించడం లేదూ? అతను అలాంటివాడు కాడే! అలా ఎలా ఊహించగలవు? మీ ఇద్దరి పరిచయం ఇప్పుడు కొత్తగా పుట్టిందేమీ కాదు కదా. డిగ్రీ కాలేజ్ లో వున్నప్పుడే అతను నీ మీద తన మాయని కురిపించాడు. సన్నటి తడి తగిలే మంచులాంటి మాయ.
పోటీ పరీక్షలకి అవసరమయ్యే రీజనింగ్ అతనికి బాగా వచ్చని అందరిలానే నువ్వు కూడా అతని దగ్గర నేర్చుకోవాలని దగ్గరయ్యావు. రీజనింగ్ కి అందనిదేదో నీలో జరిగింది. అతని చిరునవ్వు ఒక మంత్రంతో సమానం అన్నావు. ఏంటది? మెస్మరైజింగ్ ఛార్మ్ అని కదూ అన్నావు?
కాని అప్పట్లో అతనికి అంత వరకే తెలుసు.
ఎదురుగా నువ్వు వున్నా, నువ్వు పీకల్లోతు ప్రేమలో వున్నావని తెలిసినా, ఏం చెప్పాలో తెలియని అయోమయంలో అతను. అతను ఏం చెప్పట్లేదన్న ఉక్రోషంలో నువ్వు. నువ్వు ఉక్రోషం ప్రదర్శించాక భయంతో నీకు దూరంగా అతను. అతను దూరంగా వున్నాడన్న బాధలో వెళ్ళిపోయావు నువ్వు. నువ్వు వెళ్ళిపోయాక అతను. అతను మిగిలిపోయాక నువ్వు. నువ్వు రాసిన కవితే ఇది!
ఇంక అతనెవరో, నువ్వెవరో అనుకున్నావు. మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నావు. హీ ఈజ్ అన్డిపెండబుల్, అన్ ట్రస్ట్ వర్తీ ఎండ్ క్రూయల్. ఇదే కదూ ఆ రోజు నీ ఫేస్బుక్ స్టేటస్?
ఆరునెలల క్రితం “హలో నియతీ” అన్న పలకరింపు వేల సంవత్సరాల ఎడబాటుకి వంతెన కట్టినట్లు అనిపించింది నీకు. తడబడ్డావు. మాట రాలేదు. నీ మెడలో వున్న నల్లపూసల దండ బిగుసుకున్నట్లు అనిపించింది నీకు. అతని మీద నీకు చంపేయాలన్నంత కోపం వుండేది కదా? అది వచ్చే దారిలో ఏ మలుపులో మర్చిపోయావు?
ఆ కోపాన్ని వెతుక్కునే లోపు అతను చిరునవ్వు నవ్వాడు. అయిపోయింది. మెస్మరైంగ్ ఛార్మ్.
ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ అతను. అతను ఇప్పుడైనా నీ ప్రేమని గుర్తిస్తాడా అని ఉత్కఠతతో నువ్వు. నువ్వు చెప్పకపోయినా నీ నుదిటి మీద చెమట చుక్కలు చెప్పేసిన నీ ఉత్కఠతని గమనించి మరో చిరునవ్వు నవ్విన అతను. అతను అలా నవ్వుతుంటే ఆ నవ్వుని అలాగే శాశ్వతంగా అతని పెదవులపై అలంకరించేందుకు అతని జీవితంలోని దుఖమనే బరువునంతా తలకెత్తుకోడానికి సిద్ధపడినట్లు నువ్వు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు అన్న ధైర్యంతో నీ చేతిని అందుకున్న అతను. అతను అందుకున్న చేయి వణుకుతుంటే బేలగా అతని వైపు చూసిన నువ్వు. నువ్వు వణుకుతున్నావని అంటూ పొదవి పట్టుకున్న అతను. అతను అన్న భావనలో నువ్వు. నువ్వు అనే అస్థిత్వాన్ని చెరిపేస్తూ అతను. అతనే నువ్వు. నువ్వే అతను.
ప్రేమని కనిపెట్టింది అతను కాకపోవచ్చు.
కానీ దాన్ని కళగా మార్చింది మాత్రం అతనే.
ఆ తరువాత వారానికి నువ్వు రాయబోయి ఆపేసిన కవిత.
చొరవ తీసుకుంది ఎవరు అన్నది కాదు ప్రశ్న. అలా జరగాలని కోరుకున్నది ఎవరు అన్నది కాదు ప్రశ్న. ఇద్దరూ వద్దనుకోకపోవడం బహుశా ఒక ప్రశ్న కావచ్చు.
కనీసం నీ అనాఛాదిత శరీరంపైన నల్లపూసలు కనిపించినప్పుడు.
అడ్డమనిపించి ఆ దండని తీసెయ్యాలని నువ్వు ప్రయత్నించినప్పుడు.
“వుండనీ” అన్న మాట అతని నోటి నుంచి వెలువడినప్పుడు.
అప్పుడెప్పుడూ పుట్టని ప్రశ్న. ఎందుకు వద్దని అనుకోలేదు?
నీ దగ్గర సమాధానం వుంటుందని అనుకోవడం లేదు నియతీ. సమాధానం వుండాల్సిన అవసరం కూడా లేదు. సమాధానం లేదు అనీ, అవసరమూ లేదని అనిపిస్తోందే అక్కడే విప్పలేని చిక్కుముడి బిగుసుకుంటోంది.
శశాంక్ ప్రేమ కావాలి. శశాంక్ తో గడిపే ఆ కొద్ది సమయంలో కలిగే సంతోషం కావాలి. అంతే కదా? ఆల్రైట్. అందుకే నువ్వు దీన్ని ఇలాగే కొనసాగించు.
కానీ కొనసాగించాలి అనుకుంటే మళ్ళీ ఈ ప్రశ్నార్థకాలు నిన్ను వెంటాడుతాయి. అందుకు సిద్ధమైతే తప్ప కొనసాగింపు సాధ్యం కాదేమో.
ఏం ప్రశ్నలు
ఎంతకాలం? ఎలా? ఏమన్నా జరిగితే? నందుకి తెలిస్తే?
వద్దు. ప్రశ్నల పదును కొక్కానికి నీ మనసు వేలాడేయకు. వాటిని దాటేసిన ప్రపంచాన్ని ఉహించాలనుకుంటున్నావు నువ్వు.
అసలెందుకీ ప్రశ్నలు? ఇద్దరితో నీ బంధం ఇలాగే కొనసాగే అవకాశం లేదా? ఏమో. వుందేమో. నీ ప్రశ్నలన్నింటికీ ఒక్కటైన సమాధానం.
ఇద్దరికి తెలిసి, ఇద్దరూ అంగీకరించి ఇది ఇలాగే కొనసాగించే అవకాశం.
ఇది విప్లవాత్మకమైన ఆలోచన.
అవును. ఇద్దరికీ విషయం తెలియనీ. ఇద్దరినీ ఆ విషయాన్ని ఒప్పుకోనీ. అవును భర్త వున్నాడు. ఒక బాయ్ ఫ్రెండ్ కూడా వున్నాడు అయితే ఏంటి? అనేసెయ్. నీకు అవసరమైన భర్త, నిన్ను ప్రేమించే ప్రేమికుడు. ఇద్దరూ కావాలి. చెప్పేయి ఈ ప్రపంచానికి. ఇదింతే. ఇది ఇలాగే వుంటుందని ప్రకటించెయ్.
సాధ్యమా అని ఆలోచించకు. ఇది ఇరవై ఒకటో శతాబ్దం. నీకు కావాల్సిన ప్రేమ నువ్వు వెతుకున్నావు. ఇందులో తప్పేముంది. నీకు సపోర్ట్ గా కొంతమంది ఫెమినిస్టులు వాదిస్తారు. ఇది తప్పని కొంత మంది సంప్రదాయవాదులు అరుస్తారు.
నువ్వు చెప్పేది కూడా నిజమే. నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నలుగురు వుంటే నిన్ను తిట్టిపోసే వాళ్ళు నాలుగు వందల మంది వుంటారు. అయినా వాళ్లతో నీకేంటి పని? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేయ్. నీకు చెయ్యాలని లేకపోతే వదిలెయ్.
కష్టమా? అయితే ఈ ఆలోచన కూడా వృధా అంటావు.. కానీ నీకు కావాల్సింది ఇదే. ఇద్దరూ కావాలి కదూ నీకు. ఇంత కన్నా మంచి మార్గమేముంది చెప్పు? ధైర్యం చెయ్యాలి. చేసి ప్రయత్నిస్తే ఇది ఖచ్చితంగా మంచి అవకాశం. ఇందులో సిగ్గుపడటానికి ఏముంది? అవమానకరం ఏముంది? అంతా నువ్వు చూసే దానిబట్టి వుంటుంది.
ధైర్యం తెచ్చుకోని వెయ్యాల్సిన అడుగే కానీ ఇందులో ఒక నిజాయితీ వుంది. కానీ నిజాయితీగా నీ మనసులో మాట చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? గొంతుకేదో అడ్డంపడినట్లు అనిపిస్తుంది. మాటలు కరువై భాష క్లుప్తమౌతుంది. నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారినా ఆశ్చర్యం లేదు.
నువ్వు చిన్నప్పుడు స్కూల్లో చేసిన తప్పు నీకు గుర్తుందా? తొమ్మిది చదువుతున్నావు అప్పుడు. స్కూల్ ఎగ్గొట్టి మరో ముగ్గురితో కలిసి సినిమాకి వెళ్ళావు. ఆ తరువాత శ్రీకాంత్ ఇంటికి వెళ్ళారు. శ్రీకాంత్ వాళ్ళ నాన్న తాగే సిగరెట్లు చూపించి ట్రై చేద్దామా అన్నప్పుడు దేవి వద్దన్నా వినకుండా మిగిలిన ఇద్దరు మగపిల్లలతో కలిసి సిగరెట్ తాగావు. తప్పు చేసానన్న బాధ, భయం రెండు రోజులు నిద్ర పట్టనివ్వలేదు నీకు. స్కూల్ ఎగ్గొట్టిన విషయం అమ్మకి తెలిసే దాకా. నిజమేనా అని అమ్మ నిలదీసినప్పుడు మొత్తంచెప్పేశావు. భయం కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చింది. గిల్టీ ఫీలింగ్ గొంతుకు అడ్డంపడి మాట్లాడటం కష్టం చేసింది. కానీ చెప్పేశావు. మొత్తం.
కష్టం అనిపించకుండా, కన్నీళ్ళు పెట్టకుండా జరిగితే అది జీవితం కాదు అని అప్పుడే తెలుసుకున్నావు కదా.
అమ్మ ఏమనింది?
“నువ్వు చేసింది తప్పు అని నీకు అర్థం అయ్యింది కదా? అది గుర్తుపెట్టుకో. నిజాయితీగా చెప్పావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. కానీ మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యవు అన్న నమ్మకంతో”
ఇదీ అంతే! సిగరెట్ అంత చిన్న విషయం కాదు. నిజమే కానీ. తప్పు ఒప్పుకోవడంలో వున్న తృప్తి గురించి ఆలోచించు.. లోపల మనిషిని కడిగేసే ఆ ప్రక్రియ గురించి. నందుకి పూర్తిగా విషయం చెప్పేస్తావు. అమ్మ క్షమించినంత సులభం క్షమించడేమో. కానీ నీ సంగతి ఆలోచించుకో. నిజం చెప్పేసిన తృప్తి నీకు ఏ టెన్షన్ లేకుండా చేస్తుంది కదా. ఇలా నిద్ర లేని రాత్రులు ఆలోచనలతో గడపాల్సిన అవసరం వుండదు కదా.
కానీ ఇక్కడ సమస్య వేరే!
సిగరెట్ తాగిన విషయం అమ్మకి చెప్పిన తరువాత మళ్ళీ సిగరెట్ తాగలేదు నువ్వు. నందుకు విషయం చెప్పిన తరువాత మళ్ళీ శశాంక్ ని కలవకుండా వుండగలవా?
దీని సమాధానం అవును అని నువ్వు చెప్పలేకపోవడం లోనే సమస్య జటిలం అవుతోంది.
నీకూ కోరికలు వున్నాయి. కొంచెం ఎక్కువగానే వున్నాయేమో. కాదులే ఎక్కువ తక్కువ గురించి కాదు. ఒక అనుభూతిని ఒక అనుభవాన్ని ప్రతిసారీ కొత్తగా అనుభవించాలని నీకు కోరిక. అది సాధ్యపడటం లేదు నందుతో! ఈ విషయం నందుకి చెప్పగలవా? చెప్పి? శశాంక్ ఎందుకు నీకు అవసరమో వివరించగలవా? పోనీ శశాంక్ దగ్గరకు వెళ్ళి ఎందుకు నందు అవసరమో చెప్పగలవా? నందు నీకు ఎందుకు అవసరం? సమాజం? సెక్యూరిటీ? డబ్బులు? ఛీ డబ్బులు మాత్రం కాదులే.
ఏది ఏమైనా అలా చెప్పగలిగితే అది చాలా నిజాయితీతో చేసిన పని అని వాళ్ళిద్దరూ గుర్తించాలి. అంత ఓపెన్ గా చెప్పినందుకు నిన్ను అభినందించి ఈ ప్రతిపాదనకి ఒప్పుకోవాలి. జరిగే పనేనా? సమాజం, కట్టుబాట్లు, చట్టం, న్యాయం వీటన్నింటికీ బానిసైన మెదడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనిది. కేవలం నిన్ను, నీ భావనలని మాత్రమే అర్థం చేసుకోగలిగిన మనసు వున్న వ్యక్తి మాత్రమే ఒప్పుకునేదిది.
మోరల్లీ రాంగ్. ఎమోషనల్లీ రైట్.
నువ్వు చేసే పని సరైనదే అన్న నమ్మకం నీకుంది. నీ దృష్టిలో నువ్వు కరెక్టే. మరింకేం ఆలోచించకు. అందరూ కాదన్నా ఫర్లేదు. అందరినీ కాదనుకోవాల్సి వచ్చినా ఫర్లేదు. నువ్వు అనుకున్నదేదో అదే చెయ్! వేరే విషయాలేవీ ఆలోచించవద్దని నీ మెదడుని బలవంతం చేసైనా సరే. అది చేసెయ్.
కానీ బలవంతంగా చేసే పని ఒక బందిఖానా లాంటిది. అది సరైనదైనా బలవంతంగా చెయ్యాల్సి వస్తే అది సరైనది కాదనే అనిపిస్తుంది. ఆలోచించు.
నందు వుంటాడు. శశాంక్ కూడా వుంటాడు. ప్రయత్నించు. నిజమౌతుందేమో. నందుని మోసం చేస్తూ వుండటం కన్నా ఇదే ఉత్తమమైనది.
ఈ మాట విని నందు అరుస్తాడేమో, మండి పడతాడేమో. చెయ్యి చేసుకుంటే? ఏమో? ఇంకా వయిలెంట్ గా ఏదైనా చేస్తే? చెయ్యనీ? అదంతా నీ మంచికే. కోపం వచ్చిందంటే ఇంకా మీ ఇద్దరి మధ్య ఒక బంధం పచ్చిగానే వుందని అర్థం. కాదూ తెగేదాకా లాగుతాడు అంటావా? నీకు ఇంకో మార్గం తెరుచుకుంటుంది. నందుకి దూరమవడం.
ఇదంతా సాధ్యమయ్యే పనిలా అనిపించడంలేదా? అంత ధైర్యం చేసి నాకు ఇద్దరూ కావాలని ప్రకటించలేవా? అవున్లే, నీకు సమాజం అంటే భయం. నందు అంటే భయం. వదిలెయ్. నీ ఇష్టం. నిర్ణయం మాత్రం నీదే. కొంచెం కష్టమైన అడుగే అది కానీ, ఆ అడుగు వేసి పర్యవసానం చూడచ్చు. కానీ ఏమీ చెయ్యకుండా వుండటం కూడా ఒక కొనసాగింపే. అది మర్చిపోవద్దు నువ్వు.
మళ్లీ మొదటికే వచ్చి చేరావు. నందుకి తెలియకుండా వుంచడం. శశాంక్ ని వదులుకోకుండా వుండటం. అంతేగా? ఎలా చేసినా కొనసాగించడం చాలా మంచి సమాధానంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి దాకా అదే జరిగింది కాబట్టి. ఇప్పటి దాకా జరిగింది ఇక ముందు జరగకుండా ఎందుకుంటుంది అనిపిస్తుంది నీకు. అంతలోనే అది చాలా కష్టం అనిపిస్తోంది.
కొనసాగించడం సాధ్యం కాదా? కొనసాగించాలంటే మోసం అనివార్యం. తెలివితేటలు కూడా పని చేస్తాయి కానీ కాలంతో పాటు కప్పిపుచ్చటం కష్టమౌతూ వెళ్తుంది. ఫర్లేదా? ఎంతకాలం? ఒకసారి అబద్ధం చెప్తే అది వీలైనంత వరకు నిజం చెయ్యడానికి ఎంత కష్టపడాలో తెలుసా? నువ్వు శశాంక్ తో వైజాగ్ వెళ్ళడానికి ఎన్ని అబద్ధాలాడావు? వాటిని కప్పి పుచ్చడానికి ఇంకెన్ని అబద్దాలు చెప్పావు?
పోనీ, నందుకి చెప్పేసి శశాంక్ ని కలవడం మానేస్తే. ఒప్పుకోవు నువ్వు. అదసలు నీకు ఒక ఆప్షన్ లా కూడా వుండటానికి వీల్లేదు. శశాంక్ కావాలి నీకు. అతనితో నీ బంధం ప్రత్యేకమైనది. అతనితో రహస్య కలయికల థ్రిల్ ఇంకా అయిపోలేదు.
నీ భర్త వల్ల నీ ప్రేమ విఫలమైంది. నీ ప్రేమికుడి వల్ల నీ పెళ్ళి విఫలమైంది. రెండు వైఫల్యాలలో దేన్ని బ్రతికించుకోవాలనుకుంటున్నావు?
రెండూ బతికుండే కొనసాగింపు ఒక మార్గమని నీకు అనిపిస్తోంది. సరే కొనసాగిస్తావు. ఇప్పుడు ఎలా వుందో అలాగే కొనసాగిస్తావు. కానీ కొనసాగించడంలో దాగి వున్న సమస్య ఏమిటో తెలుసా. ఏ రోజైనా ఈ గుట్టు రట్టు కావడం.
నిన్న అద్భుతమైన రోజు అనుకుంటున్నావు. ఏ కష్టం రాలేదు కాబట్టి. ఈ రోజు ఎప్పుడూ రిస్కే. ఎప్పుడు ఎక్కడ బయటపడిపోతుందో అని. అందువల్ల అది నీకు అంత ఆహ్లాదాన్ని ఇవ్వకపోవచ్చు. మళ్ళీ ఈరోజు రేపటిలోకి జారుకుందంటే అదో అనుభవం అనుకుంటున్నావు. రోజు రోజుకి రిస్క్ పెరుగుతుందే తప్ప తగ్గేది కాదు. ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగించగలవు? సమస్య తీవ్రత పెరగటమే కానీ తగ్గటం కనపడటంలేదు.
ట్రబుల్ విల్ డబుల్ ఎవ్రీడే! కొనసాగించేది నీ సంబంధాన్ని కాదు. నీ భయాన్ని.
నిన్ను దోషిని చేసి బహిరంగంగా నిలబెట్టే సందర్భం ఒకటి వస్తే ఏం సమాధానం చెప్తావు? ఇక అప్పుడు కొనసాగించడం జరగని పని. నాకేం తెలియదు అనడం మంచిదేమో.
దోషిగా ఎలా మారతాను అని అంటావేమో. ఎవరికైనా తెలిస్తే కదా నువ్వు దోషిగా మారేది అనుకుంటావేమో. కళ్లు తెరువు నియతీ. నువ్వు చేస్తున్న పనిని ఎవరూ గమనించడంలేదు అనుకోవడం నీ పిచ్చితనం. ఎవరో వుంటారు. ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గట్టిగా ప్రకటిస్తారని కాదు. బట్ ఎవరో వుంటారు.
గుర్తుందా ఆ రోజు. వర్షం మొదలైంది. అతను నిన్ను అంటుకట్టిన మొక్కలా పొదవి పట్టుకున్నాడు. అతను వేసుకున్న రెయిన్ కోట్ సగం నిన్ను కప్పడానికి వినియోగించాడు. ఇద్దరూ చినుకుల నుంచి తప్పించుకునే పొడి ప్రదేశం కోసం పరుగెత్తారు. అదంతా రహస్యమనే అనుకుంటున్నవు. అంత బాహాటంగా జరిగిన సంఘటన రహస్యంగా వుండి పోతుందని ఎలా అనుకున్నావు.
నీ విషయం నలుగురికి తెలియడం ఒక సమస్యే. కానీ దాని కన్నా పెద్ద సమస్య ఏమిటో తెలుసా? ఆ నలుగురిలో నందు వుండటం. ఆ ఆలోచనే భయం కలిగిస్తోంది కదూ? అసలు ఇప్పుడు నందుకి తెలియదు అని ఎందుకు అనుకుంటున్నావు? బహుశా అతనికి తెలిసే ఇదంతా చేస్తున్నాడేమో ఆలోచించావా?
ఒకసారి ఆలోచించు. ఒక వేళ నందుకి ఈ విషయం తెలిసిపోతే? అప్పుడేం చేస్తావు? అసలు ఈ పాటికే నందుకి ఈ విషయం తెలిసిపోయి వుంటే?
(రెండో అడుగు వచ్చే సంచికలో)
Dual and multiple relationships గురించి చాలా చర్చ జరగాల్సి వుంది. Morally wrong and emotionally right! సమాజ కట్టుబాట్లలో పడి లా ఆఫ్ నేచర్ ని ignore చేస్తున్నామా! మనం create చేసుకున్న boundaries ని కాలం గడుస్తున్న కొద్దీ మనమే break చేసుకున్న సందర్భాలున్నాయి. ఇక ఇలాంటి introspections ఎప్పుడూ స్త్రీలకే ఎందుకుంటాయో! Can’t wait to read the full story.
Thanks for liking the first part Jhansi. మీరు చెప్పిన చర్చకు ఆస్కారం ఇచ్చే కథే ఇది. మరి కొన్ని కోణాలు, లోతులు ముందు ముందు వస్తాయి…. చదువుతూనే ఉండండి.
మంచు లాంటి మాయను, పరిచయం చేసినందుకు మొదటి అడుగులో❤️.మీకు,అభినందనలు..sir! బాగా రాశారు..👍
పద్మ గారు థాంక్ యూ. Keep reading
Sudheer garu, మొదటి భాగంలోనే నియతి సమస్యని అర్థం చేసుకొని విడాకుల పరిష్కారం (తీర్పు అనాలా?) ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
ఆడవాళ్ళు పెళ్లికి ముందు ప్రేమిచ్చాడమే తప్పు అనే సమాజంలో పెళ్లి తర్వాత అదే ప్రేమని కొనసాగించడం కొంచెం కష్టం కానీ ప్రస్తుత సమాజంలో ఇవే ఎన్నో కథలు నిజంగా జరుగుతున్నాయి ఏదైనా open గా ఒప్పుకొని భర్తని మోసగించకుండా తనకి కావలసిన బంధాన్ని ఏర్పరుచుకోవచ్చ్ కదా.అటు అతని భార్య కూడా ఒప్పుకొంటే
ఏకబిగువున చదివించారు. మిగతావి చదివి అభిప్రాయం తెలుపుతాను.