బూడిద రంగు సత్యం లోలోనికి ఇంకుతోంది. చూస్తున్నదంతా గోతులమయం అనిపిస్తుంది. లీలగా భయం ఒలికి చూపు దిక్కుమార్చుకుంది. చేతిలో కాఫీ కప్పు వణికింది. తియ్యదనం బావుందో చిరుచేదే నచ్చిందో నాలుక ఎప్పటికీ సాక్ష్యమియ్యదు. రకరకాల స్టేట్మెంట్స్ పాస్ చేసుకుంటూ నోరు తనపనిలో ఉంటుంది. మరి మెదడు? ఏది నిజమని జస్టిస్ చేసే ఒక తర్కంలో ఉంటుందా.
కానీ, కొంత ఏదో వాదన కావాలి. కొన్ని విసురు పదాలు కావాలి. బ్రతకడానికి కొంచం తత్వం బోధపడాలి. కొంత విమర్శ, మరికాస్త పరామర్శ, వోదార్పు వచనాలూ.. ఎలా అలా పద్యంలో పదాల్ని అమర్చినట్లు జీవితానికి అడుగులు ఏర్పరచడం. ఎక్స్పెక్టేషన్స్ బావుంటాయా, లేకపోతే అదంతా కాలయాపనా. ఎక్స్పెక్ట్ చేసీ భంగపడీ, ఏమో ఇదంతా పనిలేనితనమేమో. పోనీ, ముతకతనం సవరించుకోలేక మృదుత్వం తెలియక నలుగురితో కలవడం కళ్ళల్లో నలక పడినట్లవుతదెందుకో తెలీని ఒక అమాయకత్వం?.
ఎవరైనా అలా చెప్పారా? అత్తరులో ముంచిన మాటల వాసన నీతో మాట్లాడితే అని! ఊహూ.. పోనీ వినిపించుకోలేదేమో, వినికిడిజ్ఞానం సరిగాలేదేమో.
నవ్వడమైతే తెలుసుకానీ, ఏడుపు గురించి మరీ బాగా తెలుసు. అయినా బ్రతకడం తెలుసని చెప్పాలో వద్దో దగ్గరే సందేహం తచ్చట్లాడుతది.
ఏంటి బ్రతకడం అంటే? స్వేచ్ఛని మునివేళ్ళపై ఆడించి కాగితంపై ఇష్టానికి రాసుకుపోవడమా? పోనీ నచ్చినంత సుఖంగా కాలాన్ని సాగతియ్యడమా? ఋతువుకు తగినట్లు ప్రవర్తించడమా?
మరి లాస్ట్ నైట్ డిన్నర్ ఏంటి అంటే కొంత బాయిల్డ్ స్వీట్ పొటాటో, సాండ్విచ్, దాల్ ఫ్రై, రైస్, పికిల్,.. వంకలు పెట్టని నాలుగుగోడల లోన్లీనెస్.
ఇంకేం కావాలి.?
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
వంకలు పెట్టని నాలుగు గోడల లోన్లీ నెస్
Super….But ఏంటి ఈ ప్రక్రియ అంటే…
కవిత అందామా
కథ అందామా
బ్రతుకు నిర్వచనమా
అన్నిటినీ మించినదేదో వుంది❤️
చదివిన ప్రతిసారీ ఒక కొత్త అనుభూతిని మిగులుస్తోంది. 🥰🤗🙏 చాలా బాగా రాశారు అనూ. అభినందనలు
నిద్రకు కలకు మధ్య మెలకువనిపించే ఒక అచేతనావస్థ,
బ్రతుకుకు జీవితానికి నడుమ ఉనికనిపించే ఒక నిశ్చలనం…
సందేహంగా తారట్లాడే ప్రాంగణం.. ఒంటరితనం.!
అప్పటివరకు గదికి మాత్రమే తెలిసిన బూడిద రంగు సత్యం గగనానికి ఎగిసే సరికి ఏకైక సాక్ష్యం విస్తరించి పలుచబడిన గుర్తుగా జీవం మరింత వెలవెల బోతుంది.!
బ్రతకడం తెలుసు.. బ్రతికించడమూ తెలుసని అంతలోనే నాకు నేను కూడబలుక్కుని మరొసారి చెప్పుకునేందుకు ఇలాంటి బలమైన నెపమంటూ ఉండాలేగానీ.. ఇంకేం వొద్దు.!
గొప్పగా రాశారు, అనురాధ గారూ.. కంగ్రాట్స్ 💐