ఎవరు……ఎవరీ చేరా?!

జులై, 1న మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘చేరా సర్వ లభ్యరచనలు’ పుస్తకావిష్కరణ

1986 ఆంధ్రజ్యోతిలో దేవిప్రియ ప్రోద్బల, ప్రోత్సాహాలతో తెలుగు కవిత్వం మీద చేరాతలు మొదలుపెట్టినప్పటినుండి రామారావు ‘చేరా’గా ప్రసిద్ధులయ్యారు. ఆయన ప్రాచీన, ఆధునిక తెలుగు కవిత్వాలను పరిశీలించడం ప్రారంభించాకే వచన కవిత్వ విమర్శ ప్రాచుర్యం పొంది సాహిత్య జీవులు అధికంగా చర్చించుకునే స్థితి ఏర్పడింది. ‘చేరాతలు’ కవిత్వ రచనా నిర్మాణ విధానాన్ని, కవులు చూపించిన మెలకువలను, వారి అంతరంగ మనోవ్యాపారాలను వెలికి తెచ్చి పాఠకులకు పరిచయం చేసే పద్ధతిని ఏర్పరచాయి.

ఈ నేపథ్యంలో ఆయన విమర్శకుడా, పరిశోధకుడా, భాషాశాస్త్రజ్ఞుడా, నిర్భర భావుకుడైన కవియా, ఫక్తు వచన రచయితా, ఛందోవ్యాకరణాలను లోతుగా అధ్యయనం చేసిన వ్యాకరణకర్తయా, ప్రాచీన కవితాప్రియుడా, ఆధునిక కవితాప్రియుడా, వస్తుప్రేమికుడా, రూపప్రేమికుడా, బహుళపీఠికారచయితా?- ఈ ప్రశ్నలన్నీ ఎవరైనా వేస్తే అన్నీ చేరాలో సంగమించాయని అనుకోవలసి వస్తుంది. ‘రెండు పదులపైన’ కవిత్వసంపుటినుంచి తర్వాత ఆయన చేసిన రచనలన్నీ ఇందుకు దృష్టాంతంగా నిలుస్తాయి.

1968 నవంబర్ 15న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ‘గ్రామ నామాలు’ మీద పరిశోధన చేసే పరిశోధకవిద్యార్థిగా చేరిన తర్వాతా, అంతకుముందూ అంతో ఇంతో రచనల ద్వారా పరిచయమైన చేకూరి రామారావు గురించి తిరుపతిలోని సాహిత్య మిత్రబృందంలో ప్రస్తావించుకునేవాళ్ళం. ముఖ్యంగా త్రిపురనేని మధుసూదనరావు, చేకూరి రామారావు రచనలు ఎప్పుడొచ్చినా ఆ రచనలగురించి మా మధ్య చర్చ వచ్చేది. అప్పట్లో చేరా వచనరచనలపట్ల నాకు అంతగా సంతృప్తి ఉండేది కాదు. ఆ సంతృప్తి పూర్తిగా వచ్చింది 80వ దశకంలోనే. అప్పటినుండి ఆయన వచనరచనల్లో సారళ్యం, స్పష్టత, తర్కబద్ధత సుష్టుగా కనిపించేది.

1974లో కడపజిల్లా గ్రామనామాల పరిశోధన సిద్ధాంతగ్రంథంను న్యాయ పరిశీలకులకు విశ్వవిద్యాలయంవారు పంపించినట్లు తెలిసింది. అభ్యుదయ రచయితల సంఘం సభలకు ఆ ఏడాదిలో హైదరాబాదు వెళ్ళినప్పుడు, ‘మీ సిద్ధాంత గ్రంథం న్యాయపరిశీలనకు చేకూరి రామారావుకు వచ్చినట్లు ఆయనే స్వయంగా నాతో అన్నాడు’ అని మిత్రుడు ఏటుకూరి ప్రసాద్ చెప్పాడు. ‘ఒకసారి వెళ్ళి కలువు’ అని కూడా అన్నాడు. ఏటుకూరి ప్రసాదు, చేకూరి రామారావు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సహాధ్యాయులు. ఒక సాయంకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టాఫ్ క్వార్టర్స్ లోని చేకూరి రామారావు ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి కలిశాను. అట్లా బయటికి వెళ్లి వద్దాం అని ఆయనన్నారు. ఇద్దరం కలిసి తార్నాకలో ఒక కేఫ్ లో కూర్చొని మాట్లాడుకున్నాం. అంతకుమునుపే దారిలో చేకూరి రామారావు రెండు ప్రశ్నలు వేశాడు. ‘నీ పిహెచ్.డి. నివేదికను నేను పంపితే డిగ్రీ వచ్చాక నీకేం లాభం?’ అన్నాడు. నాకు లాభం గురించిన ఆలోచన లేదు. రెండో ప్రశ్నగా ‘మీ పరిశోధన బాగుంది. కానీ అందులోని సంజ్ఞానామ తత్వ సమస్యను గురించి చర్చించడం అవసరమా?’ అని అడిగాడు. ‘తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా ఈ సమస్యను చర్చించినవారు లేరు. ఇది సంజ్ఞానామ పరిశోధనలో భాగంగా చర్చించడం సరైనదే అనుకుంటాను’ అని చెప్పాను. మీరెప్పుడు నివేదికను పంపిస్తున్నారని నేను అడగలేదు. ఆయన ఎప్పుడు పంపారో కూడా తెలియదు.

1982 ఆగష్టు 24న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. దూరవిద్యా స్ఫూర్తికి సంకేతంగా పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యగ్రంథాల నిర్మాణానికి సూచనలు ఇవ్వడానికి నిపుణుల బృందాన్ని విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య జి. రామిరెడ్డి నియమించారు. చేకూరి రామారావు సమన్వయంలో ఆచార్య జి.ఎన్.రెడ్డి, ఆచార్య తూమాటి దొణప్ప, డా. కేతవరపు రామకోటిశాస్త్రి, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు ముసాయిదా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ఒకటి రెండు రోజుల్లో చేకూరి రామారావుతో నా దూరవిద్యా సంబంధాలకు పునాదులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేను డిప్యుటేషన్ మీద చేరడానికి చేకూరి రామారావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. నేను చేరేందుకు మూడు మాసాలు పట్టింది. చేరిన తర్వాత కొన్ని ఇతరేతర కారణాలు కూడా పనిచేసినట్లు తెలిశాయి.

చేకూరి రామారావు మాటల్లోనే చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్యప్రణాళికలు, తెలుగు పాఠ్యాంశాలు ఒక నిశ్శబ్ద విప్లవానికి దారితీశాయి. సంప్రదాయ విశ్వవిద్యాలయాలు సాహసించని రీతిలో అవి కొత్తదారిలో నడిచాయి. వాడుక భాషకు, ఆధునిక చేతనకు అవి పట్టంగట్టాయి. తెలుగు మౌలికాంశాల్లో వచనకవిత్వాన్ని చేకూరి రామారావు పరిచయం చేశాడు. ఆ పరిచయంలో స్త్రీవాద ఉద్యమానికి స్ఫూర్తిమంతంగా నిలిచిన సావిత్రి కవితను విశ్లేషించాడు. తెలుగులోని ఏ పాఠ్యపుస్తకం ఈ సాహసం చేయలేదు. ముందుచూపును ప్రదర్శించలేదు.

1983, 84, 85 సం॥లలో విశ్వవిద్యాలయంలో మా ప్రయాణం సాగింది. ఆరోజుల్లో మా విశ్వవిద్యాలయంనుంచి నేను, ఉస్మానియా విశ్వవిద్యాలయం క్వార్టర్స్ లో  చేకూరి రామారావు ఇంటి మీదుగా వెళ్లేవాణ్ణి. క్వార్టర్స్ ఇంటి ముందు మంచం మీద కూర్చొని ఏదో ఒక ప్రాచీన కావ్యాన్ని చదువుతూ కనిపించేవాడు. ఆయన ఎంత పద్య ప్రియుడో అంత వచన పద్య ప్రియుడు, గేయమూ ఆయనకు ప్రియమే.

తెలుగు సాహిత్యప్రేమికులు ముగ్గురు ‘రా’లను ప్రస్తావిస్తుంటారు. వారు రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి), బూరా (బూదరాజు రాధాకృష్ణ), చేరా (చేకూరి రామారావు). వీరి మార్గాలు భిన్నంగా కనిపించినా వారిలోని తెలుగు సాహిత్యప్రేమను, చిత్తశుద్ధిని, అభ్యున్నతి కాంక్షను ఎవరూ కాదనలేరు. చేకూరి రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ, తెలుగు విశ్వవిద్యాలయంలోనూ పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో డీన్ గా  ఉన్నప్పుడు సి. నారాయణరెడ్డి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఒకరోజు రాత్రి చేకూరి రామారావు, శ్రీశైలం చరిత్ర డీన్ తిమ్మారెడ్డి, నేనూ కలసి మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంలో కాబోయే తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఎవరనే చర్చ మామధ్య వచ్చింది. సి. నారాయణరెడ్డి మిమ్మల్ని ఇద్దరినీ ప్రభుత్వానికి సిఫారసు చేయడని నేను అన్నాను. అదే జరిగింది. పదవులాట ఇట్లానే ఉంటుంది.

ఈ సందర్భంలోనే మరో విషయం. సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు మౌలికాంశాలకు ఆయన సంపాదకుడు, నేను ఉపసంపాదకున్ని. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయ మౌలికాంశాల రచనకు నేను సంపాదకున్ని, ఆయన ఉపసంపాదకుడు. దీన్నిబట్టి చేకూరి రామారావులోని అహం లేని వ్యక్తిత్వం, సంస్కారం తెలుస్తుంది. అంతేకాదు, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు మౌలికాంశాల పాఠ్యాంశాల రచనలో ప్రముఖ పాత్ర చేకూరి రామారావు వహించడమే కాకుండా, నా గదిలో కూర్చొని ఆ పాఠాలు రాసి ఇచ్చేవాడు. 1983లో సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్యాంశాల రచనలో ఒకమారు ‘రాసే అలవాట్లు’ పాఠాన్ని దాదాపు 15 పేజీలకు మించి రాసి ఇచ్చాడు. ‘ఇది డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు అందేది కాదు’ అని నేను అన్నప్పుడు అదే రోజు రాత్రి పట్టుబట్టి ఆ పాఠాన్ని తిరగరాసి స్నేహపురి కాలనీలోని మా ఇంటికి ఉదయం 6 గంటలకల్లా సైకిల్ పై వచ్చి ఇచ్చాడు. చాలా బాగా వచ్చిందని నేను అన్నప్పుడు మురిసిపోయాడు. ఎంపికలో, ఎడిటింగ్ లో నా కర్కశత్వాన్ని ఆయన మెచ్చుకున్నాడు.

1983-1997 మధ్య మేము కలిసి ఉన్న కాలంలో మా స్నేహంలో ఏ పొరపొచ్చాలు లేవు. కొంతమంది విమర్శకులు ఆశ్చర్యపడుతూ నన్ను అడిగేవారు. బూదరాజు రాధాకృష్ణ, కె.కె. రంగనాథాచార్యులు, చేకూరి రామారావు మధ్య అంతగా అపేక్షలు ఏమీ ఉండేవి కావు. సార్వత్రిక విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళికలు, పాఠ్యాంశాల నిర్మాణంలో వారిని కలగలుపుకొని ఎట్లా కూడగట్టుకుని పని చేయించుకుంటున్నావ్ అని. ఆ ముగ్గురి నుంచి వారి వారి ప్రతిభను మాత్రమే వినియోగించుకోగలిగాను.

చేరా వంటి ప్రజాస్వామికవాది, సంయమనశీలి, విమర్శలో శైలీశాస్త్ర జ్ఞానాన్ని అన్వయించినవాడు, వాడుక భాష అంటే మనం మాట్లాడే భాషకు దగ్గరగా ఉండే భాష మాత్రమే అనగలిగిన గిడుగు అనంతర ఆధునిక వ్యావహారిక భాషావాది మరొకరుండరు.

చేకూరి రామారావు ఇంటికి తరచూ వెళ్లేవాన్ని. ఆయన భార్య రంగనాయకి, అమ్మాయి సంధ్య నా పట్ల అపేక్ష చూపించేవాళ్ళు. మగపిల్లలతో నాకంత పరిచయం లేదు. చేరా మా ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం కలసి బయటికి వెళ్ళవలసిన సందర్భంలో ‘పద్మా! నేను అబ్సిగూడ దాకా పోయొస్తా’ అని చెప్పేవాన్ని. చేరా వెంటనే అట్లా చెప్పే అలవాటు తనకు లేదనేవాడు. నేను నవ్వేవాన్ని.

హైదరాబాదులో ఉన్నప్పుడు ఎన్నెన్ని సాయంకాలాలు, ఎన్నెన్ని రాత్రులు తెలుగు భాషా బోధనకు సంబంధించి, అందులో తీసుకురావాల్సిన మార్పులను గురించి మాట్లాడుకున్నామో లెక్కలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. చేరా సహాయసహకారాలు లేకపోయినట్లైతే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ నిశ్శబ్ద విప్లవంలో నేను ప్రధానపాత్ర వహించలేకపోయేవాన్ని.

ఒకందుకు నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను. చేరా మరణించిన రోజున చివరిచూపుకు పోలేకపోయాను. మనసు ఫౌండేషన్ ప్రచురిస్తున్న చేరా సమగ్రరచనల్లోని ప్రతి అక్షరంలోనూ చేరా స్నేహహస్తం స్మృతికి వస్తూనే ఉంటుంది. అలవోకగా నలుగురిలో చేరాను కలిసినప్పుడు కవి, మహాకవీ అని నేను పిలిచే చేరా మన మధ్య లేడు. ఆ స్నేహహస్త స్మృతి మాత్రం ఆయన అక్షరాలు ఉన్నంతవరకు ఉంటుంది.

(చేరా సర్వ లభ్యరచనలు, పీఠిక)

***

కేతు విశ్వనాథ రెడ్డి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇదంతా నిజంగా వొక నిశ్శబ్ద విప్లవం.
    కేతు మాస్టారికి పరిపరి వందనాలు.

  • ‘చేరా’ గురించి కొంత వరకూ మా అన్నయ్య, స్వర్గీయ
    కె.కె.మీనన్ ద్వారా, తెలుసుకున్నాను.ఇప్పుడు మీ వ్యాసం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. చేరాతలు చదివిన జ్ఞాపకం వుంది.
    మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సర్.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు