ఎవరున్నారనిక్కడ, నువ్వు తప్ప…

1.

పెళ్ళాం పిల్లలున్నోడు పోతే,
వుండే బాధ,
అనాథ పోతే వుంటుందా?

బాధ, పోయినోడి కోసమా?
మిగిలినోళ్ళుకు పోయిందాని కోసమా?

ఒరేయ్.. ఒంటరి!
నీ ప్రాణం కోసం ఎవరైనా ఉన్నారా, చూస్కో.

2.

పేడ పురుగైనా,
దేవుడి పాదం మీద పెట్టిన పూవైన,
యే భావం లేకుండా జీవించి పోవడం లేదా?
మతుందని మనకీ పాట్లు గానీ,
చితిలో పడి చితికినాక, యేం మిగులుతుందని?

3.

జరుగుతున్నవి
జరుగుతున్నాయని గుర్తించే సమయం పట్టదు, జరిగిపోడానికి.
యిక మతంతా జరిగిపోయిన చలన చిత్రమేగా_

అయినా, ఎందుకు మోస్తామో, వునికి వుడిగిన కర్మలు..
మన ఖర్మ కాకపోతే!

4.

దేహభూమి దాటి,
మోటబావిలోకి,
మెట్టు మెట్టూ దిగాకా,
అడుగులేని ప్రాణజలంలో,
అలుపెరుగక యీదులాడుతుంటే…
ఎవరున్నారనిక్కడ, నువ్వు తప్ప_

మోటబావి ఊట తోడ్కొనే వాళ్ళు,
తరుచూ తారసపడేవాళ్ళు,
మన భాగాలేనని భ్రమ పడతాం గానీ_

ఎవరున్నారనిక్కడ, నువ్వు తప్ప_

 

2

లోకాకి 

చీమలా_
అందరితో కలిసి వరసలో వెళుతున్నా,
ప్రతి అడుగులో సొంతడివిలో పడి తప్పిపోతున్నా.

చిరుతలా_
బతుకెనుక కసిగా పరిగెడుతున్నా,
క్షణానికోసారి ఆగి,
హృదిలోకి తీరిగ్గా తొంగి చూసుకుంటున్నా.

గాడిదలా_
బరువులన్నీ బాధ్యతతో మోస్తున్నా,
గాలివాటానికి దూది పింజలా తేలిపోతున్నా.

డేగలా_
చేప చెంగు మీన, ఆకలి కన్నేసే వున్నా,
నింగి నీలమంతా రాజులా స్వేచ్ఛగా యేలుతున్నా.

 

3
 ఋతుస్వామ్యం 

అంతా స్తబ్దుగా ఉంటే,
కొత్త ఋతువనుకున్నా,
ఋతువులన్నీ వెళ్లిపోయాయని తెలిసింది.

ఏమీలేనితనం అన్నిటినీ
కప్పుతూ పోతుంటే,
శూన్యమాసమనుకున్నా,
కాలమే కడతేరిందని తెలిసింది.

నీకు గుర్తుందా,

ఆత్రంగా అన్ని ఋతువుల్ని ఎలా చూపించావు!

అన్ని ఋతువులూ
ఒక్కసారే గుమ్మరించి
ఎలా అబ్బురపరిచావు!

నీకు మాత్రమే చెందిన వరమును
నాకు మాత్రమే కానుకిచ్చావు.

పచ్చి చిగుర్ల పచ్చదనం గూర్చి,
వెన్నెల కబుర్ల
వెచ్చదనం గూర్చి
ప్రస్తుతం ప్రస్తావనే లేదు.

కనీసం
ఎండల్ని మండించే
జీవనోద్వేగం పండించు.

ఆకులైనా రాలుస్తూ
జీవచలనాన్ని బ్రతికించు.

కన్నీళ్లైనా వర్షించి,
జీవితమింకా తడారలేదని ప్రకటించు.

ఏదో ఒక ఋతువుగా వచ్చి,
ఆగిన కాలాన్ని కదిలించు.

*

ప్రమోద్ వడ్లకొండ

తెలంగాణలోని హనుమకొండ మా స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో హెలికాప్టర్ డిజైన్ డిపార్టుమెంటులో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కవిత్వం అంటే కొంచెం పిచ్చి. బాగా చదువుతాను. అప్పుడప్పుడు రాస్తాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు