ఎన్నాళ్లకో ఒక మెరుపు, మరెన్నాళ్లకో ఒక మలుపు!

స్కైబాబ కొత్త కథ “గాఫిల్” గురించి కొన్ని ప్రశ్నలూ జవాబులూ

ఈ కథ వెనక కథ ఏమిటి?

గాఫిల్‌ కథ బీజం మనసులో పడడానికి కథ పూర్తి కాడానికి సంవత్సరాలు పట్టింది. గడ్డం పెరిగి చింపిరిగా కనిపించే పిచ్చివాడిని, ఒంటి మీద సోయి లేకుండా రోడ్డుపై కనిపించే పిచ్చి తల్లిని చూసినప్పుడు నేను చాలాసేపు స్తబ్దుగా అయిపోతాను. వారి వెనక కథ ఏమై ఉంటుందా అనిపిస్తుంటుంది. అలా ఎన్ని కోణాల ఆలోచనలు చుట్టుముడతాయో!

ఒకసారి నల్గొండ బస్టాండ్‌లో బస్‌ వెళ్లిపోతుందన్న తొందరలో వేగంగా నడిచెళ్తున్న నా చేతిని పట్టుకొని ఆపాడు, ఇలాగే పిచ్చిగా ఉన్న ఒకతను. ఒళ్ళు ఝల్లుమన్నది. చూస్తే ప్రముఖ కవి. అనార్కిస్టు. ఏంటన్నా, ఇలా ఉన్నావ్‌? ఏమైంది అన్నాను. ఆ రూపం ఎన్నటికీ మరిచిపోలేను.
పోయిన జ్ఞాపకశక్తి ఎన్నాళ్లకో కొంచెం కొంచెం వచ్చిన ఒక చాంద్‌ పాష తరచి చూస్తే ఏ అపరాత్రో చీకట్లో ఏ చెట్టు కిందనో నేలమీద పడుకొని ఉంటే ఎలా ఫీలవుతాడు? తను ఎవరో, ఎందుకు అక్కడ అనామకంగా ఉన్నాడో తెలుసుకోవాలనే ఆరాటం, ఎంతకూ యాదికి రాని గతం.. అలా ఈ కథ రాయడంలో ఎంతో లోలోతుకు వెళ్లాను. ఆస్వాదించాను, సంఘర్షించాను, తపించాను, ఎన్నాళ్లకో ఒక మెరుపు, మరెన్నాళ్లకో ఒక మలుపు అన్నట్లుగా సాగింది కథ. చివరికి ఎన్ని ముగింపులో. మిత్రులతో చర్చించి బాగుందనుకున్న ముగింపు ఇచ్చుకున్నాక తృప్తి మిగిలింది.

ఇంతకుముందు కథలకి ఇది ఎలా భిన్నం?

నా మిగతా కథలకు ఇది భిన్నమైన కథ. కాకపోతే మొదలుపెడితే చివరి దాకా చదివించే పూచీ నాది. నా కథలేవైనా చదవడం మొదలేస్తే వదలకుండా చివరిదాకా చదివించే శిల్పమేదో పట్టుబడింది  నాకు. చాలామంది ఇలా అంటుంటారు.

ఇది పెద్ద కథ. ఎందుకు అంత పెద్ద కథ వైపు మళ్ళారు?

ఇది నా నాలుగో పెద్ద కథ. ఇంత పెద్ద కథ ఎందుకు? నవల రాయొచ్చు కదా! లాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. లాస్ట్‌ ఇయర్‌ ఖుష్‌ మిజాజ్‌ అని కాస్త చిన్న కథ రాశాను. చాలామంది బాగుందన్నారు. నేను కథ మొదలేస్తే అది ఎంత వస్తే అంత, అది ఎలా నడిపిస్తే అలా రాస్తాను. బలవంతంగా ముగించడమో, కథ ఇంతే ఉండాలని గిరి గీయడమో చేయలేను. అందుకే ఇది 60 పేజీల కథ అయ్యింది.

మిగిలిన మీ రచనల కంటే దీనికి భిన్నమైన ప్రతిస్పందన రావచ్చని అనుకుంటున్నారా?

మంచి స్పందనే రావచ్చు. స్కై ఇలాంటి కథ రాయడం బాగుందనుకోవచ్చు. కొందరికి కథ నచ్చకనూ పోవచ్చు. మూస కథలకు బాగా అలవాటు పడిపోయామేమో మనం. అందుకు అలా అనిపించవచ్చు.

ప్రతిస్పందన వచ్చినా రాకున్నా కొన్నేళ్లుగా పూర్తి కాని ఈ కథ  భారం దించుకున్నాను. పెద్ద రిలీఫ్. మంచి విమర్శకుడైన అనంతు చింతలపల్లి ఒక మాటన్నాడు, ఈ కథ తరువాత నువ్వు వేరు అని. చూద్దాం.

గాఫిల్ కథలో రచయితగా మీ మనసుకి బాగా దగ్గిరగా వచ్చిన సన్నివేశం ఏమిటి?

-చాంద్ పాష నిద్ర పట్టక ఒక అద్దరాతిరి లేచి బయటికొచ్చి నిలబడతాడు. అప్పుడు ఒక పిచ్చి తల్లి చీకట్లోంచి నడుస్తూ వచ్చి చాంద్ ఎదురుగా రాగానే ఒక మాట అంటూ గద్దిస్తుంది. చాంద్ ఒళ్ళు ఝల్లు మంటుంది. ఆ సన్నివేశం, అది మనసులో మెరవడం, రాయడం నచ్చింది.

*

స్కైబాబ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు