ఎక్కుపెట్టిన విల్లు లావణ్య సైదీశ్వర్ కవిత్వం

Poetry is the perfect venue for social protest no matter the subject;  ఒక సామాజిక తిరుగుబాటు కు కవిత్వం ఒక గొప్ప సాధనం. తన ఆక్రోశాన్ని, ఆలోచనలను, సంఘర్షణను, పీడిత వర్గ పాట్లను, పిల్లలపై ఆకృత్యాలకు తన మనసు పడే వేదనను బయట పెట్టేందుకు ఆమె కవిత్వాన్ని ఎంచుకొంది. సమాజ దాష్టీకాలను ఎండగట్టేందుకు ఆమె కవిత్వాన్ని వాహకంగ వాడుకొంది. ఒక పవర్ఫుల్ టోన్ ను కవిత్వం లో వినిపిస్తూ ,  రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కవయిత్రి గా పేరు గాంచిన లావణ్య సైదీశ్వర్ సాహితీ పరిచయం ఈ వారం “ కొత్త కవిత్వ తీరాలు” శీర్షిక కు అందిస్తున్నాను.
లావణ్య సైదీశ్వర్ గురించి తెలుసుకొని సారంగ పత్రిక కు అందచేయాలని, ఆమెకు ఫోన్ చేసాను.  మీ గురించి తెలుసుకోవాలని అడిగితే….. వెంటనే ఆమె ఒక కవిత ను నాకు పంపినారు….

నేనెవరంటే..

***
నేనొక అగాధపు అంచున నిలిచిన చేయూతను..
పలుచబడ్డ గీతలపై కనిపించే అక్షరాన్ని నేను.
ఊహాలోకపు మైకం తెల్వదు నాకు..
కాల్పనిక భావాల
జిత్తులెరుగను నేను..
గారడీ మాటల గమ్మత్తులు రాక
మందిలో మౌనంగా మిగిలిపోయాను..
ఎదలోతు గాయాల రసికారుతుంటే
సిరాతో గిలిగింతలు
గుమ్మరించలేను..
నా‌ మస్తిష్కం పచ్చి బాలింత..
చూపులనలుముకున్న
నలుదిక్కుల చీకట్లు
సలపరిస్తుంటే
సరస సంగతులు వల్లించలేను..
విద్వత్తు ఏమంత లేదసలు
విషాదపు పిలుపు పసిగట్టగలను..
కనువిందు రూపాల తెరవెనుక
కన్నీటిఊట కనిపెట్టగలను నేను..
నా దృశ్యం అనంతం..
కంచెలు కూలదోసి
వంచిత కధనాల పంచన
నిలబడే బలగాన్ని..
నేనొక పక్షపాతిని
నా వారెవరో తెలుసు
నిప్పులగుండాలలో
తగలబడిపోతున్న
తలరాతల నుసిని పులుముకుంటున్న  ఎండమావుల బ్రతుకు బాటసారుల రాస్తాలో
నేనొక పాదముద్రను..
కుంగిన పొద్దులో రేపటి
ఆశలు చిట్టాను దాచి
చచ్చిన కలల శిధిలాల
కింద తలదాల్చి
మరునాడు మైల స్నానం
చేసే బడుగు జీవుల నిత్య
సహచరిని నేను.
స్వేధం స్వాధీనం చేసుకున్న
కర్ఖానాల కంబంధహస్తాల్లో
ఆవిరైపోతున్న ఎర్ర నెత్తురు
ఆక్రందనలకు నినాదాన్ని నేను..
నిలువెత్తు రూపం అది కసాయి సామ్రాజ్యం
కాదని వారించేవారే లేని
కసి కత్తుల యుద్దంలో
సర్వం కోల్పోతున్న
కొన ఊపిరికి
వెన్నుముకను నేను
వెన్నుదన్నును నేను
నా వారని కాపాడుకునే
మానవత్వమున్న మనసును..
కలం పట్టుకున్న కవిత్వాన్ని నేను..
నేనొక చిక్కటి  ప్రవాహితను
పదునైన వ్యక్తీకరణను..
ఆ పోయెమ్ చదివి  కాసేపు అలా స్థాణువు అయ్యాను.  ఎంత పవర్ఫుల్ వ్యక్తీకరణ, ఎంతటి ధీమా ఆ అక్షరాల్లో అనిపించింది. తండ్రి కమ్యూనిస్ట్ లీడర్,  హేతువాది. ఇల్లంతా communism భావాలతో, సమస్యల పట్ల స్పందిస్తూ, ఉండటం చూసిన లావణ్య  తన కవిత్వం లో కూడా  పదునైన వ్యక్తీకరణ ను పాఠకుడికి అందచేస్తుంది.
సాహిత్యంలో 2018 కి గాను లేడీ లెజెండ్ అవార్డు పొందిన లావణ్య సైదీశ్వర్ ఇవాళ సారంగ తో మాట్లాడారు.
సాహిత్యం లో ఎదుగుతున్నప్పుడు పక్కన ఉన్నవాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు. అవన్నీ మనసుకు తీసుకొనే సంఘటనలు కాదు కానీ, మనసుకు నొప్పి ఇస్తుంటాయి….. అని చెప్పినప్పుడు  ఒక్కసారిగా ఈ వ్యవస్థ లోని డొల్ల తనాన్ని ప్రశ్నించినట్లు అనిపించింది. సాహిత్యం లో జరిపిన ఇంటర్వ్యూ లల్లో  ఇంత బోల్డ్ గా చెప్పిన ఈ అంశం, నిజం చెప్పాలంటే ఇప్పుడు రాజ్యమేలుతోంది. వెనుక మాటున డ్యామేజ్ చేస్తూ, నోటితో మాట్లాడుతూ, నొసలు తో ఎక్కిరించే ఒక దుర్మార్గ వ్యవస్థ చిన్నగా ప్రాకుతోంది. నిజం!
ఆమె సాహితీ ప్రయాణం  ఆమె మాటల్లోనే :
కవిత్వాభినివేశం:  
స్కూల్ డేస్ లో హంస ధ్వని అనే ప్రోగ్రాం ఉండేది. మనకు నచ్చిన అంశం పై రాయొచ్చు. అప్పుడు నేను చిన్ని చిన్ని కథలు, కవిత్వం రాస్తుండే దానిని.  అందరూ మెచ్చుకొనే వాళ్ళు. చాలా సంతోష పడే వాళ్ళం. డిబేట్ లో పాల్గొనే వాళ్ళం.
సీరియస్ గా తీసుకొన్నది.. 2015 నుండి సీరియస్ పోయెట్రీ రాస్తూ వచ్చాను. వాట్సప్ గ్రూప్ లలో ప్రారంభం అయినప్పటి నుండి స్పీడ్ అందుకుంది…2018 సాహిత్యం లో  లేడీ లెజెండ్ అవార్డు రాజారత్న ఫౌండేషన్ వారి నుండి అందుకున్నాను. గురజాడ ఫౌండేషన్ , usa, రాష్ట్ర స్థాయి పురస్కారం కవిత్వం లో అందుకున్నప్పుడు చాలా  ఆనందపడినాను. గురజాడ ఫౌండేషన్ పురస్కారం జాతీయ స్థాయి లో కూడా వచ్చింది. తర్వాత తెలుగు కవిత వైభవం తరఫున పురస్కారం.. గజల్ లోగిలి , ఆకాంక్ష ఛారిటబుల్ ట్రస్ట్ , తెలుగు తేజం, తెలుగు వేదిక , వీటి తరఫున పురస్కారాలు అందుకున్నాను.
నా భర్త పేరు సైదీశ్వర్. నా పేరుతో కలిపి నా కలం పేరుగా మార్చాను. నా భర్త నా సాహిత్య ప్రయాణం లో పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. ఇప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన సహకారం లేనిదే నేను కవిత్వాన్ని రాసే అవకాశం లేదు.
మార్గదర్శకత్వం : 
నా వరకైతే శ్రీ శ్రీ నే చెప్పుకోవాలి. మహా ప్రస్థానం. ఆ బుక్కు ద్వారానే నేను బాగా కనెక్ట్ అయ్యాను. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చదివే దానిని.  తర్వాత కాళోజి నా గొడవ., గుంటూరు శేషంద్ర గారి ఆధునిక మహాభారతం, వరవర రావు కవిత్వం, తిలక్ అమృతం కురిసిన రాత్రి, సతీష్ చందర్ గారి పద చిత్రం, ఇలా చదువుతూ నా కవిత్వ ప్రయాణం సాగింది.
*ప్రస్తుతం మీకు బాగా నచ్చిన కవి ఎవరు?
ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ బాగా రాస్తున్నారు. సాయిబాబా గారి “నేను చావును నిరాకరిస్తున్నాను”. ఈ సంకలనం అద్భుతంగా ఉంది. ఆయన జైలు లో ఉండగా రాసిన కవిత్వం.  బాగా మనసుకు కనెక్ట్ అయ్యింది.
*సంతోష క్షణాలు : 
చిన్నపిల్లలపైన జరుగుతున్న అకృత్యాలపై, “నా పొరపాటే బిడ్డ”, అనే నా కవిత ను  బిక్కి కృష్ణ గారు చాలా బాగా సమీక్ష చేసారు. నాకు చెప్పలేదు. ఆంధ్ర భూమి పత్రిక లో ఈ సమీక్ష రావడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మంచి ఆదరణ  వచ్చింది ఆ కవిత పై. మంచి స్పందనను నేను చూసాను.
“పొదల మాటున నీపై
గునపాల పోటుకి
అర్ధం కాని బాధేదో మేలి పెడుతుంటే,
నీ ఆక్రందన వినని
మొద్దు నిద్ర పోతున్న సమాజాన్ని ,
చెర్నాకోల నీ చేతికి ఇచ్చి,
చరిచి చరిచి చీల్చి చెండాడమని
అరచి చెప్పక పోవడం నా పొరపాటే..
నీ లేత వ్రేళ్ళకు
ఇనుప గోళ్ళను తొడగక పోవడం నా పొరపాటే..
నిన్ను అణకువగా కాదు
ఆయుధం గా మార్చక పోవడం నా పొరపాటే..!”
*కవితల్లో రెవల్యూషనరీ  ఆటిట్యూడ్..!?
నాన్న కమ్యూనిస్ట్ లీడర్. ఇంట్లో అంతా కమ్యూనిజం ఉండేది. నాన్న హేతువాది. అప్పడి నుండి నాకు ఆ ప్రశ్నించే గుణం వచ్చిందేమో అని నాకు అనుమానం.  ఇంట్లోనే మొత్తం ఇదే వాతావరణం ఉండేది. పార్టీ పెద్దలు, పార్టీ ఆలోచనలు, అన్యాయం జరిగితే అక్కడికి వీళ్ళు వెంటనే స్పందించడం జరిగేది.
మా ఊరు తెలంగాణా రాష్ట్రం నల్గొండ జిల్లాలోని హాలియా. పెరిగింది, చదివింది అంతా హాలియా లోనే, అక్కడే, ఇంటర్ చదువుతుండగానే వివాహం జరిగింది.ఆ తరువాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువుకు సుదీర్ఘ విరామం ఇవ్వవలసి వచ్చింది. కొన్నేళ్ళ తరువాత బి.ఏ పొలిటికల్ సైన్స్ చదివాను. నాకు ఇద్దరు సంతానం. బాబు,పాప.
మావారు ఒక ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
నేనేమో గృహిణిని..కవయిత్రిని..
ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నేను కవయిత్రిగా మారాడానికి నా చుట్టూ జరిగిన పరిణామాల గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో పని ఒత్తిడి కాస్త తగ్గుతూ విరామసమయం దొరికేది. అదిగో ఆ సమయంలోనే నేను ఎక్కువగా రామచంద్రమిషన్ కు సంబంధించిన పుస్తకాలు చదివేదాన్ని , మనసుకు తోచింది రాసుకోవడం, హాలంకరణ మీద శ్రద్ద, పాటలు పాడుకోవడం ఇలాంటివి  చేస్తుండేదాన్ని. అయితే నా జీవితంపై నా తల్లిదండ్రులు నేర్పిన  సంస్కార ప్రభావం ఎక్కువగా ఉండేదని చెప్పొచ్చు. అన్నట్టు మా అమ్మగారి పేరు కొత్వాల్ సరస్వతి, నాన్నగారు కొత్వాల్ యాదగిరి గారు(డాక్టర్).. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మా చిన్నతనం నుండి అమ్మనాన్నలు మాకు ఏదైతే చెప్పేవారో దాన్నే చేసి చూపేవారు అదే సమాజం పట్ల మన బాధ్యత ఎంతని, ఏమిటని, ఎలా ఉండాలనేది.
వాళ్లు ఎక్కువగా పేదలకు ఉచిత విద్య,  ఉచిత వైద్యం, అవసరాల మేరకు ఆర్థికపరమైన సాయం చేస్తూ మాకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పుకోవడం నాకెంతో గర్వంగా ఉంటుంది. అటువంటి వాతావరణంలో పెరిగిన నాకు సమాజానికి నావంతుగా ఏదో చేయాలనే తపన ఉండేది. నా చుట్టుప్రక్కల జరిగే సంఘటనలు, ప్రతినిత్యం పత్రికలలో,
దృశ్యమాధ్యమాలలో చూసే వార్తల ద్వారా నాలో ఒక తెలియని సంఘర్షణ జరుగుతుండేది. దాన్నే అంతర్మధనం అంటారు కదా. హా అదేనండీ. ఆ ఘర్షణ తాలూకు భావాలని కాగితంపై పెట్టేవరకూ ప్రశాంతత ఉండేది కాదు. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో నా చిన్ననాటి స్నేహితురాలి ద్వారా ఒక సాహిత్య వేదిక పరిచయం అయ్యింది. అందులో ప్రతీ ఒక్కరి రచనలు చదువుతూ నా రచనల్ని పరిచయం చేస్తూ ఉండేదాన్ని. నేను ఎక్కవగా స్త్రీల, పిల్లల పట్ల జరిగే దారుణాల పట్ల, ఇంకా శ్రమజీవులపై, నాకలాన్ని ఎక్కుపెట్టేదాన్ని. నా తొలినాటి కవనాలతో “కలంసవ్వడి” అనే పేరుతో కవితా సంపుటిని వెలువరించాను. ఎందరో మహానుభావుల ప్రశంసలు అందుకున్నాను. అవే నాకు అవార్డులు, రివార్డులు..
నా రచనలకుగాను మొదటే చెప్పినట్టు ప్రముఖ సాహితీ సంస్థల ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు కూడా అందుకున్నాను.
 ఇక్కడ ఒక గమ్మత్తు విషయాన్ని మీతో చెప్పుకోవాలనిపించింది.
అదేంటంటే నేను అందుకున్న పురస్కారాల కంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నవే ఎక్కువ..ఇక విషయంలోకి వస్తే ముఖ్యంగా రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు ట్యూటర్స్ ప్రైడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సాహిత్యవిభాగంలో  ప్రతిష్టాత్మకమైన 2018 లేడిలెజెండ్ అనే అవార్డును అందుకున్నాను.
ఈ పురష్కారాలన్నీ నాకు సమాజం పట్ల మరింత భాద్యతను పెంచాయనే చెప్పాలి. నా రచనాశైలికి మరింతగా పదును పెట్టి బాధిత పీడిత వర్గాలకోసం పనిచేస్తానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది.
ఒక స్త్రీగా, గృహిణిగా కుటుంబం పట్ల బాధ్యతలు నిర్వర్తిస్తూనే కలాన్ని కదిలించడం అంత సులువేంకాదు. దానికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం. నాకు వెన్నుదన్నుగా నిలబడిన నా కుటుంబం అందులో మరీ ముఖ్యంగా మా శ్రీవారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అతనే నా తొలి పాఠకుడు, విమర్శకుడు కూడా.
ఇంకా నా రచనలు చదువుతూ నన్ను ప్రొత్సహించే, నా గురువులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ, మున్ముందు కూడా ఇంతే నైతిక బాధ్యతతో రచనలను కొనసాగిస్తానని వినమ్రంగా చెబుతూ.. ఆఖరిగా మరొక్కమారు నాలోని ప్రతిభను గుర్తించి  లేడిలెజెండ్ గా గుర్తింపునిచ్చిన ట్యూటర్స్ ప్రైడ్ వారికి ప్రత్యేక అభివాదాలు అందజేస్తున్నాను.
ఇలా అనర్గళంగా చెప్పుకొంటూ ఎలాంటి భేషజం లేకుండా ఆమె తన సాహితీ ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల రాస్తున్న కవయిత్రుల్లో అత్యంత పదునైన శైలి, అభివ్యక్తి తో కవిత్వాన్ని అందిస్తున్న ఆమె కవితల్ని , ఆమె స్పందించే విధానాన్ని  ఇక్కడ చెప్పదలచుకొన్నాను.
ఆమె తొలి కవిత  “ ఇక మీదట”  అనే  కవిత లోని కొన్ని పాదాలను చూస్తే….
“కాలం వరదలా పోటెత్తుతున్నప్పుడే
కాగితపు నావను వదిలి
కసితీరా ఎదురీదగలగాలి..// తడిగీతం గొంతులో చెలిమ తోడుతున్నప్పుడే/
బీడు గుండెకు జీవం పోయగలగాలి..//మాటలు రాల్చిన పుప్పొడి/ మౌనం వహించినప్పుడే/ చదును పలక మీద
సేద్యం చేయగలగాలి..//సిరాచుక్కలకంటిన/ భావం ఎర్రని మేఘమై/ కమ్ముతున్నప్పుడే
ఆంతరంగిక చర్చ/ మొదలు పెట్టగలగాలి../ ఆకాశమై గొడుగు
పట్టగలగాలి..”
ఇలా మొదటి కవిత లోనే ఒక్క వృధా వాక్యం లేకుండా ఎంత షార్ప్ గా తన కవిత్వ కరవాలాన్ని తిప్పారో తెలుస్తుంది.
175 సంవత్సరాల క్రితం షెల్లీ తన “డిఫెన్సు ఆఫ్ పోయెట్రీ” లో  “poets are the unacknowledged legislators of the world.” అని అంటారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు కవులు, కవయిత్రులు ఇదే క్రమం లో పయనిస్తూ వస్తున్నారు. వారిలో లావణ్య సైదీశ్వర్ గారిని కూడా చెప్పవచ్చు. ఆమె స్పందించే విధానం వేరు. ఆమె వ్యంగ్యం వేరు. ఆమె పద తీవ్రత వేరు. ఒక భిన్నమైన కవయిత్రి తో మాట్లాడినానన్న సంతృప్తి మిగిల్చారు.
“అదే ప్రశ్న
అగ్ని ప్రచండమై
దహిస్తుంది
స్వాభిమానం ఎరుగని
సగభాగాన్ని తడిమి
చూసుకుంటూ..
అదే ప్రశ్న
పలుమార్లు ప్రకంపిస్తుంది
స్వేచ్ఛ లేని ఉనికి
మౌన శిలువను మోసుకుంటూ..
నీడలేని దేహాన్ని చూస్తూ
అదే ప్రశ్న గొంతుచించుకుంటూ
అరుస్తుంది
ఆమె ఎక్కడా అని..
అవును ఆమె ఎక్కడా అని..”
అస్తిత్వ అన్వేషణలో గొంతు చించుకుంటున్న వేదన ఈ అక్షరాల్లో..
సాధారణంగా, సామాజిక చైతన్యం (social awareness ) నుండి వ్యక్తి చైతన్యం (self awareness) పుడుతుంది. లావణ్య తొలుతుగా తనను తాను చైతన్య పరచుకొనే దిశగా ఆమె తన కవిత్వాన్ని మలచుకొంది.
అనాధ పిల్లల పట్ల తన బాద్యత ను  ఎలా కవిత్వీకరించిందో పరిశీలిస్తే….
“నా భాద్యతనే” అనే కవిత లో
“నేను నా చూపులతో నీ పసితనాన్ని /తూకం వేయాలని చూసినప్పుడు/ చిల్లుపడ్డ నీ పేగుల్లోని ఆర్దాకలి ఎందుకో
అడ్డుపడుతుంది.//ఒకే ఒక్క ప్రశ్న/
అదే ప్రశ్న/పదేపదే సూటిగా అడుగుతుంది/గాయపడ్డ గుండెకు//చిరునవ్వుల లేపనాలు//అద్దుకుంటూ..
అదే ప్రశ్న/జడివానలా మారి/ముంచెత్తుతుంది/చితికిన ఆత్మగౌరవానికి/ అతుకులు వేసుకుంటూ..
నాలుగు వీధుల కూడలిలో నీ నీడ నాపై ముసిరినప్పుడు //ఆ చీకటి చూపుల భాష్యం ఏ నిఘంటువులో వెదికినా//
మౌనమే సమాధానమవుతుంది..
నీ లేత మునివేళ్ళపై /క్షణక్షణం నుసిలా రాలిపోతున్న/బాల్యపు చివురులను/
నా దోసిట్లో దాచాలని చూసినప్పుడల్లా కానరాని కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది..//
‘తప్పు’కున్న కాలాన్ని వెదికేందుకు గతంలోకి జారిపోతున్న నన్ను/విధిని ఎదిరించే నీ సత్తువ లంగరేసి ఆపుతుంది../వెక్కిరించే వర్తమానం నా భాద్యతను గుర్తుచేస్తుంది..//
ఆ హృదయ స్పందన నిజంగా ఆర్తి తో కూడినది.
అదే విధంగా  సిరియా లో పిల్లల చావు… ఉగ్రవాదం పై ఆమె రాసిన రక్త చరిత్ర కవిత చదివి తీరాల్సిందే…
“చిధ్రమైపోతున్న మీ పసిదేహాలను చూస్తూ /సొమ్మసిల్లిన నేను ఏమని రాయగలను.. తెల్లటి వస్త్రంలో చుట్టిన మీ నెత్తుటి దేహాలను చూసైనా /ఆ ఆఖరి సంతకం చేసి మృత్యుకుహారాన్ని మూసే అధికారం కానరాని  కసాయి రాజ్యంలో/ మీ లేత ప్రాణాలను తూట్లుపొడుస్తున్న ఇనుపగుండ్ల పాశవికతకు/ఏ కవిత్వంతో ఎదురెళ్ళి ఆపగలను..//..
మరణశయ్యపై మీరిచ్చే ఆఖరి వాంగ్మూలాలు వినేవారెవరక్కడ../..
అక్షరానికి ఆయువు పోసుకుంటా..
మనిషి మనసును నిద్దురలేపే
కొత్త గీతాన్ని రాస్తా…”
అదే విధంగా ఉన్న ఊరు వొదిలి,  బ్రతకలేక, కూలీలైన వారి నుద్దేశించి,  ఆమె రాసిన “జర సోచాయించు”” అనే కవిత కూడా ఇదే పవర్ఫుల్ అభివ్యక్తిని అందిస్తుంది…
“కత్తుల వంతెన మీద కాలం కుప్పకూలిపోయినప్పుడు/ కండ్లల్లకెళ్లి వండగండ్లు ఎందుకు రాలిపడ్తయో జర సోచాయించు../ ఒట్టిపోయిన బతుకు బుగ్గిపాలైనప్పుడు/ తప్పిపోయిన మబ్బులొచ్చి/ ఎందుకు ముసురుకుంటాయో జర సోచాయించు..// .. ఊరిడిసిన పాదాలు
దారి తప్పిపోయినప్పుడు/ సొక్కిన పొద్దు ఎందుకు జీవిడుస్తదో జర సోచాయించు..// ఒత్తిలో నీళ్లు ఆవిరై ఏండ్లు గడిచిపోతునప్పుడు/ నివురు గప్పుకున్న పిడికిలల్ల / నిప్పులెట్ల రాజుకుంటయో జర సోచాయించు..//తడి కొంగులో వడిచేలు నింపుకుని వరం మీద ఉరికొచ్చే/ పరుగులిప్పుడు ఏ వైపుకు మళ్లుతయో జర సోచాయించు../ మనసుపెట్టి ఆలకించు..//
“పరిచయాలన్నీ రైలు ప్రయాణాలైనప్పుడు…..
………..కృత్రిమ సముహాల్లో బంధాలు నిటారుగా నిలబడుతాయనుకోవడం
చిట్లిన పెదవులపై  చిరునవ్వులను వెదకడమే……
……..సమాంతర పట్టాలపై ప్రయాణం తుదిఘట్టం చేరేవరకు ఆఖరి ఆశ్రుబిందువును అలాగే దాచివుంచు..
అదే నీ తోడు అవుతుంది.. నిన్ను తోడ్కొనిపోతుంది..” సమూహాల్లో సన్నిహితత్వాల్లోని కృత్రిమతను తాత్విక ధోరణిలో కాస్త కరకుగానే చెప్పిన కవిత “నీ తోడు”.
//నాది నా మతమంటూ గిరిగీసుకున్న రేఖలను/ దాటి ఒక్కసారి బయటకురా../ …………. మతం మాటున చేసే మారణకాండ చాలదా../మానాలేం పాపం చేశాయని/మంటగలుపుతన్నారో/ ……………… నాలో రగిలే బడబాగ్నికి బదులు ఇచ్చి కదలాలి…// (దమ్ముందా) అంటూ ఆసిఫా ఆత్మఘోష సాక్షిగా ప్రశ్నిస్తుంది.
******
ప్రతి కవీ తన కలం నేత్రంతో సమాజాన్ని చూస్తుంటాడు. కానీ ఈ కవయిత్రి కలం ఝళిపించే తీరు అమోఘం. ఎప్పుడూ ఎక్కుపెట్టిన విల్లు లా ఉంటుంది ఈమె కలం. పదాల మధ్య భావం.. వేగం.. చదివిన పాఠకులను కాసేపు ఉద్వేగభరితుల్ని చేస్తుంది. అక్షరాల్లోని లయ ధ్వనీ శ్రీ శ్రీ ని తలపిస్తుంది. విప్లవ భావజాల ప్రవాహాన్ని చూస్తే అనామధేయుడు గుర్తొస్తాడు.. అభివ్యక్తి లోని తెగింపు అలిశెట్టికి తీసిపోదు. కవయిత్రుల కలాల్లో అరుదుగా కనపడే లక్షణాలు అవి. తనదే అయిన విలక్షణ గొంతుక ఈమెది. ఈమె అక్షరం భాస్వరం. అక్షరాలు తూటాల్లా పేలతాయి.
“నరమేధం ..నరమేధం
అచట ఇచట ఎచట చూడు..
ఉన్మాదం..ఉన్మాదం
నరనరాలు తెంపుకుంటూ
కసికసిగా వాంఛలన్నీ చెలరేగిన చోట
ఉక్రోశం..ఉక్రోశం
సాటి వాని నీడ చూసి కాలరాసే
ఆవేశం..ఆవేశం
…………..
దుర్భేద్యం..దుర్భేద్యం
డబ్బు జబ్బు చేసినట్టు
సుస్తీపడ్డ సమాజంలో
నిర్వేదం.. నిస్తేజం
నీరుగారు ఆశలను
నిలపలేని దగాపడ్డ
ధౌర్భాగ్యం..
అమానుషం..అమానుషం
మనిషి మనిషిని పీక్కుతింటున్న
నవసమాజ దృశ్యం..” (నేటి దృశ్యం) ఆ పదాల్లోని ఉరవడి శ్రీశ్రీని తలపిస్తూ.. నేటి మన సమాజ స్థితిని ఆలోచింపజేస్తూ.. చదువరుల నరాల్లో ఉద్వేగాన్ని నింపట్లేదూ..!?
“మాలో చీమూనెత్తరుందన్న విషయమే మర్చినం/ నిగ్గదీసే నాల్కలకు నరాలు తెంపుకున్నాం../ చుట్టుముడుతున్న మాయగాళ్ళ మానిఫేస్టోమీద/ నాలుగు ప్రశ్నలను ఖాడ్రించి ఊయడం మర్చి
కండువాల అంచులకు పచ్చ కాగితాలుగా వేలాడుతున్నాం..
…………ఎందుకంటే మేం యాదిమర్చినం
ఓటర్లమన్న యాదిమర్చినం….
వ్యవస్థ రాత మార్చగల సిరాచుక్కలమని యాదిమర్చినం..” రాజీకీయ మాయమర్మాల మధ్య మర్చిన బాధ్యత ను గుర్తు చేసే వ్యంగ్యాస్తృం ఈ “యాదిమర్చినం”. మాండలీకంలోనూ ఈ కవయిత్రి కలం పదును చురుక్కుమనిపిస్తుంది. పాఠకుల మస్తిష్కాల్లో ఓ మెలకువను వదులుతుంది.
మతోన్మాదాన్నీ కులం పేరుతో పరువు హత్యల్నీ ఖండించేందుకు వెరవని కలం లావణ్యది. ఆధునిక సమాజ రూపంలోని వికృత కోణాన్ని బయటపెట్టేందుకు భయపడదు.
“కల్లోల సాగరంపైన
కప్పిన మఖ్మల్ వస్త్రం నా సమాజం
నేనొక సజీవ సాక్ష్యం..
బహిరంగ విధ్వంస భయానక రూపమొకటి బయపెడుతుంది నిత్యం..
నేనొక కమిలిన స్వప్నం..
మహా యుద్ద పర్వాలన్నీ పురుడుపోసుకునే
చీకటి గర్భకుహరం ముందు మౌనం వహించే మంత్రసాని నా సమాజం
నేనొక చితికిన పిండం………  గుల్లబారిన మాటలతో నా సమాజం..” సమాజపు డొల్లతనాన్ని అద్దంలో పట్టిస్తుంది ఈమె అక్షరం.
******
“ఊపిరి సంచిలో ఉండచుట్టుకున్నప్పుడే
నీ చుట్టూ సిద్దాంతాలెంతగా సుడులు తిరిగాయో..” అంటూ స్త్రీ ల పట్ల తన వాదాన్ని సూటిగానే వినిపిస్తుంది.
“ఇక్కడ స్త్రీలు పూజింపబడతారు
కాదు కాదు/ కాసుల మూసలో కొలచబడతారు..//జాడీలో నెత్తుటి ముద్దగా ఉన్నప్పుడే రేపటి జాబితాపై దీనంగా వేలిముద్రలేసి తనఖాలుగా బయటకు తర్జుమా చేయబడతారు…” (యత్ర నార్యంతు విక్రయంతే) అంటూ వాస్తవాలను తన అక్షరాల తక్కెడలో వేసి స్పష్టంగానే చూపిస్తుంది.
“సంతకం చేసిన శ్వేతపత్రంపై నమ్మిన రెండు వాక్యాలు ఇప్పుడు కనిపించట్లేదు../ తెల్లచీమలు నమిలిన ఆ సాక్ష్యాలకోసం గతాన్ని ఎంతగా తవ్విపోసుకుందో గాని ఆమె మునివేళ్ళపైన్న గోళ్ళన్నీ చిట్టిపోయి వున్నాయి../….. నలిగినరాత్రుల కింద రాలిపడ్డ శిరోజాలు మూలమూలల్లో నిశ్శబ్ద విప్లవంగా పెనవేసుకోవడం పసిగట్టి ఉండరు../ తడిసిన తలదిండులో మొలువుకొచ్చిన తెగువను బహుశా ఎవరూ తాకి ఉండరు../ అందుకే పాత నిబంధనావళని తిరగేరాసి/తప్పుకుపోయిన వాగ్దానాలలో వాస్తవాలను తిరగరాయలనుకుంది../అరిగిన గీతల్నీ దాచిన అరచేతుల్లోనే అగ్నిసందేశాన్ని రాసి ప్రపంచంతో చదివించాలని నిర్ణయించుకుంది..”
తరతరాల అణిచివేతను దృశ్యీకరిస్తూనే ఫీనిక్స్ లా పైకి లేచి ధిక్కార బావుటా ఎగురవేస్తుంది.
కొత్త కవిత్వ గళాల్లో సరికొత్త భాస్వరం ఈమె స్వరం. ఇప్పుడు మహిళా సాహిత్యం లో ఇటువంటి గళాల అవసరం ఉంది.
                 *******
Avatar

సి.వి. సురేష్

52 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • సరళ మైన పదజాలంతో ప్రాస లయతప్పకుండా చిన్న చిన్న ముత్యాలాంటి పదాల పొందికతో లావణ్య సైదీశ్వర్ మేడం గారు అద్భుతంగా కవితలు రాసిన తీరు ఆమోఘంగా ఉంది… ఇంత చిన్న వయ్యసులోనే అంత భావయుక్తం గా కవిత రచన శైలిని అలవారుచుకున్న ఆమె ముఖపుస్తకపు స్నేహితుల కూటమిలో నేను కూడా ఒకర్ని అయినందుకు గర్వపడుతున్నాను

 • నేను కవిత్వం రాయడం మొదలు పెట్టినపుడు ఒక వాట్సాప్ సమూహంలో తన అక్షరాలతో నామనసును బంధించిన కవయిత్రి , అమ్మ లావణ్య సైదీశ్వర్ . కవిత్వంలోని తేజస్సును నాకు రుచి చూపించిన కవయిత్రి . నాకు నచ్చిన కవయిత్రుల జాబితాలో ఈ అమ్మది ఎప్పుడూ మొదటి స్థానమే . ఒక్కొక్కరు ఒక్కో రకమైన శైలికి కనెక్ట్ అవుతారు , నేను కనెక్ట్ అయి కవిత్వమంటే ఇది అనుకున్న శైలి వీరిది . అమ్మ గురించి రాసిన ఏ అక్షరమైనా అది నాకెంతో ఆనందాన్నిస్తుంది . తన ప్రతీ అక్షరానికీ నేను ముగ్దుడను . అలాంటి కవయిత్రి (అమ్మ) గురించిన పరిచయం అందించిన మీకు సారంగ యాజమాన్యానికి కృతఙ్ఞతలు.

  • నువ్వు రాసిన ప్రతీ అక్షరం నా గుండెలకు హత్తుకున్నాయి. నాన్న.థ్యాంక్యూ సో మచ్

 • కవిత్వం అందరూ రాస్తారు. కానీ సమాజం పట్ల బాధ్యత, సాహిత్యం పట్ల అవగాహన, అకృత్యాలు అత్యాచారాల పట్ల ఆవేదన, ఉద్వేగాలు ఇలా ఓ ఉన్నతమైన భావాలతో, ముక్కు సూటిగా ప్రశ్నించే ధోరణి తో అక్షర బాణాలు సంధించి పాఠకుల మదిని కదిలించడం అందరి కవులకూ సాధ్యం కాదు.. ఆమె కవిత్వం అవార్డులు సన్మానాల కోసం కాదు.. పాఠకుల మెప్పు, గొప్పల కోసం కాదు. ఆమె కవిత్వం జనాన్ని జాగృతం చేయడం, నిద్రిస్తున్న నా సోమరి సమాజాన్ని మేల్కొల్పడం.. అమ్మ కవిత్వం చదువుతుంటే నాకు అనిపిస్తుంది, అమ్మ అరచేతికి గుండె మొలిచిందేమో అనిపిస్తుంది.. ఆమె రాసిన ప్రతి మాటా ఒక్కో తూటాలా పేలుతుంది.. అమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలవు.. రోజులూ సరిపోవు.. మా అమ్మ శ్రీమతి లావణ్య సైదీశ్వర్ గారికి పాదాభివందనాలతో అభినందనలు 🙏 🙏

  • నా కవిత్వం అవార్డుల సన్మానాల కోసం కాదన్న నిజం ఇట్టే పసిగట్టావ్ చిన్నూ…థ్యాంక్యూ నాపై ఉన్న నమ్మకానికి

 • లావణ్యసైదీశ్వర్ గారిది ఈ తరం కవిత్వం గొంతుకలలో మరో బలమైన గొంతుక.తను కవిత్వాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది.సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అరాచాకాలపట్ల నిత్యం సంఘర్షణకు లోనవుతూ కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సమాజానికి అనేకప్రశ్నలను సంధిస్తున్నది.తన మొదటి సంపుటిని వెలువరించే సందర్భంలో కొన్నిసార్లు ఆమెతో మాట్లాడాను.తను కవయిత్రిగా ఎదుగుతున్న క్రమంలో ఎన్ని ఆటంకాలో ఎదురయ్యాయో(తోటి కవులనుండి) తెలిసింది.అవేవి శాశ్వతం కాదని చెప్పాను. వాటినన్నీంటిని అధిగమించి ఇవ్వాల తను పదునైన కవిత్వాన్ని రాస్తుండడం అభినందనీయం. తన మొదటి కవిత్వ సంపుటికి,ఇప్పుడు రాస్తున్న కవిత్వానికి చాలా పరిణతి వచ్చింది.. ఇప్పుడిప్పుడే తన కలంతో ముందుకు దూసుకవస్తున్న లావణ్య ఈ మధ్య రాయడాన్ని ఎందుకు ఆపిందో అర్థం కావడంలేదు.తన కలం ఇంకా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఇటువంటి ‘కొత్త కలాలను’ ప్రోత్సహిస్తూన్న సురేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను!!

  • మీరిచ్చిన ప్రోత్సాహం ఎన్నడూ మరువను సర్..
   మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు .

 • లావణ్య గారిని అభినందించొచ్చు. కానీ అతిశయోక్తులతో ఆకాశానికి ఎగిరేయొద్దు. సురేష్ గారు అలాంటి వాక్యాలతో వ్యాసాన్ని నింపేశారు. లావణ్య గారు రావాల్సింది ఇంకా చాలావుంది. ఆ తర్వాత ఆమె కవిత్వాన్ని మూల్యాంకనం చేస్తే బావుంటుంది. విమర్శకుడు ఆబ్జెకివ్ గా వుండాలి. విమర్శ అభిరుచి స్థాయికి జారకూడదు. సివి సురేష్ నుండి ఇలాంటి పరిచయ వ్యాసాలు నేను ఆశించడం లేదు. అలా ఆశించిన వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది తప్పకుండా.

  • మీరన్నట్టు త్వరలో సంకలనం తెస్తాను.మీ సూచన బావుంది.. థ్యాంక్యూ సర్

 • చక్కటి సమీక్ష సర్..
  చెపాల్సిన విషయాన్ని సూటిగా చెబుతూ
  ఎటువైపు నిలబడాలో అటుగా నిలబడి మాట్లాడటo
  అక్క కవిత్వం ప్రత్యేకత… అక్కకు శుభాకాంక్షలు

 • లావణ్య గారిది సామాజిక కవిత్వం… ఆమె గొంతు చాలా బలమైనది. ఎదుగుతున్న క్రమంలో పక్కవాళ్లతోనె ఎదుర్కొనె సమస్యలు తప్పకుండా ఉంటాయోమో అనిపిస్తుంది లావణ్య గారి మాటలు కూడా విన్నాక…ఏదేమైనా ఎవరినీ పట్టించుకోకుండా సొంత గొంతుతో బలంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… అభినందనలు

  • నా కవిత్వం పట్ల మీ స్పందనకు మనస్పూర్తిగా థ్యాంక్స్ రాధిక గారు.మోటివేట్ చేసే మీ సూచన బావుంది

 • లావణ్య గారు వాట్సప్ సమూహంలో తన కవితలతో నాకు పరిచయమయ్యారు కవితలోని దూకుడు చూస్తే, స్వచ్ఛత అమాయకత్వం కనిపించే ఈవిడ ఇంత చక్కటి కవిత్వం రాసింది అనిపించేది. ఆ మాట నేను తనతో చెప్తూ ఉంటాను కూడా. సారంగ పత్రికలో రాసిన దానిలో ఏమి అతిశయోక్తి లేదు

 • ముందు గా అక్కగారికి నా హృదయపూర్వక వందనములు _/\_
  అందకారంలో మునిగి యున్న నేటి సమాజానికి మీ కలం నుండి కాంతి కిరణాలు వెలుగు నింపాలి . గౌరవనీయుల మీ భర్త ప్రోస్తాహనానికి వందనములు చిన్న కవిత, (ఎటి వడ్డున పడియున్న మట్టిని చూచి హేళన చేచితిరి ఆ మట్టినే కుమ్మరి తెచ్చి సానెలో పెట్టి అందమైన కూజాను చేసి నగిషీలు దిద్ది గాజు బీరువాలో పెట్టిన దాని విలువ తెలిసేది ) _/\_

  • మీ కవిత చిన్నదైనా భావం లోతైనది..థ్యాంక్యూ ఫర్ యువర్ కామెంట్

 • నీతెక్కడుంది ? నీకు యాడకానొచ్చింది ? అని అడిగే కాదు కాదు, కడిగిపారేసే కవిత్వం రాసే లావణ్య గారిని పరిచయం చేసే ప్రయత్నం బాగుంది. అయితే ఆమె కవిత్వాన్ని గురించి, ఆమె వ్యక్తీకరణల గురించి ఇంకాస్త వివరించలేదు కనుక చాలా మాటలు పొగడ్తల్లానే ఉన్నాయి. మీ ప్రయత్నం చాలా మంచిది. కొత్తవాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బహుశా అందుకే ఆ సున్నితమైన సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కంగ్రాట్స్ CV అన్నా !

  ఇది చదివాకన్నా లావణ్య గారు తన వ్యాసంగాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తారనుకుంటున్నాను. అమె రాయడం తగ్గించారు. మీరామెని పరిచయం చేసి మంచి పని చేశారు.

  • శ్రీరాం గారు మీ స్పందన,సూచన కూడా విలువైనది.. థ్యాంక్యూ

 • సురేష్ గారు కవయిత్రి లావణ్య సైదీశ్వర్ గారి గురించి వ్రాసిన వాక్యాలు అక్షరసత్యాలు. కవితా ప్రపంచంలో తనదైన బాణీలో ,వినూత్న శైలిలో దూసుకుపోతున్న లావణ్యగారు ఎంతైనా అభినందనీయులు. నేటి సమాజంలోని అణగారిన గొంతులకు తనవంతుగా అండగా ఉంటూ కవితాఝరిని కొనసాగిస్తున్న లావణ్య గారి గురించి సవివరంగా తెలియజేసిన తీరు ఎంతో బాగుంది. శ్రీ శ్రీ గారి భావజాలంతో ముందుకు వెళుతున్న లావణ్య గారి నుండి మరిన్ని సమాజహిత కవితలు రావాలని కోరుకుంటున్నాను.

  • అన్నయ్య ఎలా ఉన్నారు..కవితలే కదూ మనల్ని కలిపింది.మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ…

 • మహిళ సాహిత్యం లో lady legend లావణ్య గారి..గురించి న మీపరిచయ వాక్యాలు, బాగున్నాయి, సర్.👌ఇంతకుముందు, వారి కవితలు కొన్ని, చదివాను. బాగరాస్తారు… లెజెండ్ ని,మరింత గా పొగడవలసిన,.. అవసరం లేదు అనిపించింది, మాకు అయితే…..!రాసిన మీకు,లావణ్య సైదీశ్వర్ గారికి..మాఅభినందనలు,..💐💐!

 • గురజాడ జాతీయస్థాయి అవార్డులో లావణ్య అక్కను చూశాను.తన కలంసవ్వడి తీసుకున్నాను.కలంసవ్వడి కవితలకు ఇప్పుడు రాస్తున్న కవితలకు ఎంతో పరిణితి.గొప్ప వ్యక్తీకరణలు.వీటన్నింటిని అద్భుతంగ పరిచయం చేశారు సార్ .ఈ శీర్షిక మాలాంటి ఎంతో మందికి గొప్ప ప్రోత్సాహం సార్ .సామాజికతను నింపుకొని కవిత్వం రాస్తున్న అక్కకు శుభాకాంక్షలు

  • గోపాల్ మీ పలకరింపు ఎప్పుడూ ప్రత్యేకమే నాకు..థ్యాంక్యూ

 • లావణ్య గారి కవిత్వం చాలా బాగుంటుంది ..నేను చదివాను కూడా..మంచి కవయిత్రికి మంచి ప్రోత్సాహం..అభినందనలు లావణ్య గారు..

  • థ్యాంక్యూ వైష్ణవి గారు..ఏకాంతవేళలో మీ ఏడవ ఋతువును ఆస్వాదిస్తున్నాను ప్రస్తుతం

 • సామాజిక కవిత్వం రాసేవారిలో లావణ్య సైదీశ్వర్‌ ముందుంటారు. బహుశా ఆమె సమాజాన్ని ప్రశ్నించే గుణాన్ని తన తండ్రి నుండే పుణికి పుచ్చుకుని ఉంటారు. సమాజం పట్ల బాధ్యతగా ఉన్న కవయిత్రి. మంచి పవర్ఫుల్‌ అక్షరాలను ఆయుధాలుగా ప్రయోగించగల సత్తా కలిగిన స్త్రీ. ఇంటర్వ్యూ బాగా వచ్చింది సురేష్‌ సర్‌.

  ఆమె నిజంగానే గారడీ మాటల గమ్మత్తులు రాక మౌనంగా మిగిలిపోతున్నారీ మధ్య. రాత తగ్గించేశారు. లావణ్యా రాయండి.. ఇంతకు ముందులాగే!

  • తప్పకుండా గీతా గారు..మీ అందరి అభిమానం నన్ను ఖాళీగా ఉండనివ్వదు..థ్యాంక్యూ

 • Excellent 👌👍 lavanya and I am speech less ,wounderful Expresstion in every poetry and best of luck in your near future and blessings dear lavi

 • అద్వితీయం సురేష్ గారు. చాలా ఓపిగ్గా రాసినదె ఇది. మన:స్ఫూర్తిగా విశ్లేషించిన వ్యాసం. మీరు చెప్పదల్చుకున్నదానికి పూర్తి న్యాయం చెయ్యడం కోసమని మీరెన్నుకున్న ఉదాహరణలు పూర్తి న్యాయం చేసాయి. అదొక అనుభూతిలా రాసుకొచ్చారు. మీ ఎఫోర్ట్ ని అభినందించకుండా ఉండలేరు .

 • లావణ్య సైదీశ్వర్ గారు సూటిగా,స్పష్టంగా,పదునుగా రాస్తారు. తన కవితలో ఆమె హృదయ స్వచ్ఛత,నైర్మల్యం,సంఘ సంస్కరణాభిలాష అన్నీ సమృద్ధిగా కనిపిస్తూ పాఠక కవిలో కవితా స్ఫూర్తిని మరింతగా పెంచుతాయి.
  కాకపోతే ఆమెకి నా వ్యక్తిగత విన్నపము
  ఇప్పుడు తనకు ఉన్న సామాజిక స్పృహకి తోడుగా మనస్తత్వశాస్త్ర జ్ఞానాన్ని జోడించుకోవాలి. ఆ సబ్జెక్ట్ ని తను బాగా అధ్యయనం చేయాలి. ఆ తరువాత తను వ్రాసే రచనలలో మనస్తత్వ రూప వాస్తవిక కోణం,సామాజిక సమస్యలకు మూలమైన అనేకానేక సమస్యలను,వాటికి పరిష్కార మార్గాలను ఇంకా అద్భుతంగా ప్రకటించగలుగుతారు.

  వ్యక్తిత్వ వికాసాలు లేకనే సాంఘిక అపసవ్యతలు పేట్రేగిపోతున్నాయి.
  సగటున బిడ్డ గర్భస్థ శిశువుగానే తల్లి మనసు నుండి ఒత్తిడిని అనుభూతిస్తూ,
  పుట్టాక కుటుంబపు,సమాజపు అపసవ్య ఒత్తిడులను భరిస్తూ పైకి కనిపించని మానసిక అష్టావక్రుల్లా ఎదుగుతున్నారు.
  అనేక ఆత్మన్యూనతలు,అహంభావాలు,అభద్రతా భావాలతో,భావోద్వేగ అసమతుల్యతలతో , పర్యావరణ , మీడియా కాలుష్యంతో పెరిగే బిడ్డ ఖచ్చితంగా సమాజం పై ఋణాత్మక ప్రభావాన్నే చూపిస్తుంది.
  నేటి బాల రోగులే రేపటి ఉన్మాద సైకోలు అన్నట్లుగా మారుతుంది సమాజం రోజు రోజుకూ…ఈ విషయం లో ప్రతి రచయిత సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తూ నివారణ,చికిత్సల దిశగా ప్రతి రచనా చేయాల్సిన అత్యవసరం లో వర్తమాన సమాజముంది.

  • మనస్తత్వ రూప వికారాలముందే కాస్త కంగారుపడ్డానేమో..దాన్నే స్టడీ చేయాలనే మీ సూచన చాలా బావుంది..మన భాద్యతలను సక్రమంగా పాటించడం మనకు ప్రధానం..థ్యాంక్యూ ఫర్ యువర్ కామెంట్

 • ఈ కవయిత్రి నేపథ్య సంస్కారమే తన కవిత్వం మీద బలమైన ముద్ర వేసిందని నేను భావిస్తున్నాను.
  వస్తువు లోనూ,అభివ్యక్తి లోనూ,తనదైన తాత్విక చింతన ఒక నిశ్శబ్ద విప్లవాన్ని బలపరుస్తూ ఉంది.కవియిత్రి స్పష్టమైన దృక్పధాన్నీ చక్కగా విశ్లేషించిన సివి సురేష్ గారికి అభినందనలు.

  • నేనూహించని స్పందన మీది. చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు సర్

 • కొత్త కవిత్వ తీరాలకు నన్ను పరిచయం చేసిన పత్రికా యాజమాన్యానికి,ముఖ్యంగా అఫ్సర్ సర్ గార్కి,సురేష్ సర్ గార్కి,ఆత్మీయురాలు మాధవి గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు..ఈ శీర్షిక ద్వారా పరిచయం కాబోతున్న కొత్త కవులకు ముందస్తు శుభాకాంక్షలు కూడా..

 • పదునైన వ్యక్తీకరణనని తనకుతానే చెప్పుకోగలిగిన ధైర్యమున్న కవయిత్రిని మీదైన శైలి లో పరిచయం చేసారు…లావణ్య గారిని త్వరలో మా ప్రాంతం పిలిచే భూమిక మీరందించారు….

  కవులు నిర్భయంగా వ్యవహరించాలి …అన్న శివారెడ్డి గారి మాటలకు రూపం లాంటి కవయిత్రి కీ మీకూ అభినందనలు

 • లావణ్య గారి పరిచయం చాలా బాగుంది. మేడమ్ గారు సాహిత్యం లో మరింత ఉన్నత శిఖరాలను చేరాలని మనస్పూర్తిగా అశిస్తున్నాను…

 • సాహితీ రంగంలో మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. మీ మదిలోని భావాలకు అక్షర రూపం ఇచ్చి నిద్రపోతున్న సమాజాన్ని మేకొల్కొపేందుకు చేస్తున్న ప్రయత్నం బాగుంది. మీరు మరిన్ని ఉన్నత అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు