ఎందుకు? ఆ ధ్వనులు? ఏం చెప్తోన్నాయవి?

solipsism : ఇవన్నీ బ్రతికిన క్షణాలు,  లేదా snapshots.  లేదా Portugueseలో saudadeలాగా. లేదా hireathలాగా . నేను ఇంతకాలం వ్రాసుకున్నవన్నవన్నీ కూడా బహుశా ఇవే. నేను విధించుకున్న పరిమితులకు లోబడినవి,  ప్రత్యేకత ఏమీ లేనివీ, ప్రత్యేకత ఏమీ లేకపోవడం చేతనే ప్రత్యేకతను కలిగి ఉన్నవి. మీరు రోజూ చూస్తున్నవే, మీరు చూస్తున్న వాటినే ‘తిరిగి చూడండి’ అని చెబుతున్నవి. చిన్నవి. సాధారణమైనవి.  చిన్నవైన / సాధారణమైన వాటిలోనే జీవన రహస్యం కూడా దాగి ఉండవచ్చునని పలుకుతున్నవి. ‘Make visible what, without you, might perhaps never have been seen’ అని నేను నమ్ముతున్నవీ! మీరు కూడా చూస్తారనీ  –

  1. {some references: బ్రతికిన క్షణాలు: వేగుంట మోహన ప్రసాద్
  2. “Saudade” isa untranslatable Portuguese term that refers to the melancholic longing or yearning. A recurring theme in Portuguese and Brazilian literature, “saudade”refers to a sense of loneliness and incompleteness. 
  3. Hiraethis a Welsh concept of longing for a home which you can’t return to or one that was never yours. not necessarily a house, but a homely feeling such as love. It can be loosely translated as ‘nostalgia’, or, more commonly, ‘homesickness’ for a home to which you can’t return.
  4. Robert Bresson Notes on the Cinematographer.}

1

అనివార్యమైన

*

రాత్రంతా అతనొక్కడే, కుర్చీలో వొరిగి
ఎంతో అలసటతో,
మరి తొలిచే, ఒక నిస్సహాయతతో –
***
నేలంతా రెక్కలు ఊడిన ఉసుళ్ళు; కొన్ని
జీవంతో కదులుతో
మరికొన్ని, గాలికి చెల్లాచెదురవుతో –

ఎందుకొచ్చాయో అవి: వాన వచ్చిందనో
కాంతి వెలిగిందనో,
బహుశా, రాక తప్పని అగత్యంతో

రావడం తప్ప, హృదయాన్ని పదిలంగా
దాచుకుని వెళ్లడం
తెలియక, వొచ్చాక, వొచ్చి చూసాక

కూలి, విరిగి, రాలిపోతామని తెలియకో
తెలిసో, మరి అవే,
రెక్కలూడిపోయి; లోపలి ఉసుళ్ళు!
***
రాత్రంతా అతనొక్కడే, లోపలకి వొరిగి
ఎవర్నేమీ అనలేక
ఏమీ చేయలేక, ఒక్కడే, అక్కడే ఇక

ఆ ఉసుళ్ళని హత్తుకుని, తప్పిపోయి!

 

2

నారింజ

*

నారింజను వొలిచే ఆ చేతివేళ్ళని
చూసావా ఎపుడైనా?
కంటిపై నీటిపొరని తుడిచినట్లు

ఎంతో ఒద్దికగా ఓ మూల పట్టుకుని
మరెంతో సున్నితంగా
ఇంకో మూలదాకా నిన్ను వొలిచే

సుకుమారమైన తన చేతివేళ్ళని?
మరి సూర్యరశ్మినీ
పుప్పొడినీ నింపుకున్నా కళ్ళనీ?

ధ్యాసతో ముడుచుకున్న పెదాల్నీ
వొంచిన తన తలకు
పైగా వీచే, పల్చటి గాలి తెరల్నీ?

పిచ్చుక రెక్కలని విదిల్చినట్లున్న
ఆ చేతి కదలికల్ని?
నీపై చిల్లే, తొనల్లోని తడివంటి

వేసవి ఆగమన, తన మాటల్నీ?

***
నారింజని వొలిచే ఆ చేతివేళ్ళని
చూసావా ఎపుడైనా?
నిన్ను, సమూలంగా వొలిచినా

బద్ధబద్దగా నిను చీల్చినా, మరి
నీ దాహాన్ని తీర్చి,
నిన్ను మరో వేసవికి సిద్ధం చేసే

జీవధాతువైన, ఆ నారింజని?

 

3

తర్జుమా

*

కిటికీ ఆవలగా పిచ్చుకలు; కనిపించవు కానీ
చివ్చివ్ చివ్చివ్మంటో ఎందుకో
ఒకటే అరుపులు; మసక మధ్యాహ్నపు వేళ,
వృక్షఛాయలో, ఒక నీటి పాయ
రాళ్ళని ఒరుసుకుంటో అట్లా పారుతోన్నట్లు …

 

ఎందుకు? ఆ ధ్వనులు? ఏం చెప్తోన్నాయవి?
వొట్టి శబ్దాలేనా అవి? ఆకులు
రాలి గాలికి నేలపై కొట్టుకుపోతోన్నట్లు, వాన
సన్నగా కురుస్తోన్నట్లు, మరి,
అంతేనా? ఇంకే అర్థమూ లేదా, ఆ శబ్దాల్లో?

 

బయట వెలుతురు, నీ చర్మమై మెరుస్తోంది!
కిటికీ ఆవలగా నిశ్శబ్దం, కాంతి
కూడా కొలవలేని చీకటియై, జోలపాటలేని
ఖాళీ ఊయలయై, ఊచల మధ్య
అరచేతుల్లో పాతుకుపోయిన శిరస్సయ్యితే,
***
కిటికీ ఆవలగా, ఏవో ఎగిరిపోయి మిగిల్చిన
ఖాళీ గూళ్ళు. మట్టి దీపాలు –
శ్వాస లేని పూలు. ఎన్నెన్నో అలిఖితాలు!

 

మరి తెలుసునా నాకు? ఇప్పటికైనా? నువ్వు
చేరాకనే, శబ్దం అర్థంగా, ఒక
హృదయంగా మారి, ఈ లోకం చలిస్తోందనీ?

 

4

సాదాగా

*

లంచ్ బాక్సు విప్పి
ఒక వొంటరి మధ్యాహ్నం వేళ, ఒక్కడినే మరి
బల్ల ముందు –

నీ చేతివేళ్ళ చివర్లై
మెతుకులు: తెల్లగా మెత్తగా దయగా, నువ్వైన
సువాసనతో …

పొడుగాటి కిటికీలకకు
ఆవలగా జలజలలాడే ఆకులపై మెరిసే ఎండ
( నీ కళ్ళా అవి? )

ఎక్కడో దూరంగా మరి
చివుక్ చివుక్ మని శబ్ధాలు, అనువాదమయిన
ఆనందంతో …

(నీ మాటలే అవి
WhatsAppలోంచీ, మెసేజ్ ఇన్బాక్స్లోంచీ తేటగా
ఎగిరొచ్చే పిట్టలు)

“తిన్నావా? తినేసేయి
త్వరగా. క్లాసులు అయిపోయాయా? తినకుండా
అలాగే ఉండకు”

తెరలు తెరలుగా వీచే
శీతాకాలపు మధ్యాహ్నపు గాలి. స్కూలు పిల్లలు
ఊరకనే మరి

మైదానంలో ఎగిరెగిరి
గెంతుతోన్నట్లు, బల్లపై కొట్టుకుకులాడే కవిత్వ
పుస్తకపు పుటలు …

(అది నా హృదయం అనీ
ఈ పూట అది మైదానమూ, పిల్లలూ, గాలీ అయి
ఉన్నదనీ, నేను

నీకు ఎలా చెప్పేది?
మెతుకులలో నువ్వూ, మెరిసే నీ ముఖమూ నీ
శ్రమా మరి

కనిపిస్తున్నవనీ
వాటికి నేను ఎంతో రుణపడి ఉన్నాననీ, నేను
ఎవరికి చెప్పేది?)
***
రెండు చేతులూ
జోబుల్లో దోపుకుని, ఏదో స్ఫురణకు వచ్చి, ఇక
లోలోన

నవ్వుకుంటూ
మబ్బు పట్టిన దారిని, నింపాదిగా దాటుకుంటూ
వెళ్లినట్లు

లంచ్ బాక్సు విప్పి
ఒక వొంటరి మధ్యాహ్నం వేళ, ఒక్కడినే ఇక్కడ
నీ ముందు!

 

5

నీ నవ్వు

*

నవ్వినప్పుడు, ఎంతో బావుంటావు నువ్వు
చలికాలపు వెన్నెల రాత్రుళ్ళు
గుర్తుకు వస్తాయి అప్పుడు నాకు. అవి

 

నీలా ఉంటాయని కాదు; కానీ, అవి అంటే
ఎంతో ఇష్టం నాకు. తెలుసులే
నాకు, ఇవన్నీ పోలికలనీ, ఇవేవీ కూడా

 

నీ చేతిస్పర్శని భర్తీ చేయలేవనీ! అమ్మని
వెదుక్కునే ఓ పసిచేతిని, మరి
ఏ పదం, అర్థం వివరించగలదో చెప్పు!

 

యెదలో వొదిగిన నిదురనీ, ఆ నిదురలోని
స్వప్న సువాసననీ, పెదాలపై
తేలే నెలవంకనీ, లేత పిడికిలి పట్టునీ

 

ఏ భాష, ఎలా అనువదించగలదో చెప్పు?
***
నవ్వినప్పుడు, ఎంతో బావుంటావు నువ్వు
నెగడై రగులుతో, చిటపటమని
నిప్పురవ్వలను వెదజల్లుతో! మరి, ఓ

 

అమ్మాయీ, ఈ చీకటి క్షణాలలో, నువ్వు
అన్నిటినీ విదుల్చుకుని, అట్లా
నవ్వడాన్ని మించిన విప్లవం ఏముంది?

***

వినయమేమీ కనిపించని కొన్ని వాక్యాలు

కవిత్వం ఇంకేం చేస్తుందో/ చేయాలో తెలియని సందిగ్ధంలో చదవాల్సిన కవితలు ఇవి. కవి చెప్పదలచుకున్న లేదూ విప్పదలచుకున్న బతుకు కథలు ఇంకెన్నెన్ని వుంటాయో అవన్నీ ఈ కవితలకు ఇతివృత్తాలు. నిజానికి వృత్తాన్ని దాటుకుంటూ వెళ్లిపోయే వాక్యాలు. కొన్ని వ్యక్తీకరణలు తెలుగు కవిత్వం ఇప్పుడున్న స్థితిలో కచ్చితంగా వొదగవు. అట్లా వొదిగిపోవాలన్న వినయమేమీ ఇక్కడి వాక్యాలకు లేదు. కొన్నిసార్లు ఎక్కడి నించో తర్జుమా అయిన కవిత్వం చదువుతున్నామా అని లోపల నించి చిన్న కంగారు. “ఏ భాష, ఎలా అనువదించగలదో చెప్పు?” అని ప్రతిసారీ ప్రశ్నిస్తూ చదువుకోవాల్సిందే. అయినా, చదవకుండా వుండనివ్వనితనమేదో ఈ కవితల్లో వుంది. అందుకే, వీటిలో దోషాలు నాకు పెద్దగా కనిపించడం లేదు. గుణాలే ఎంచుకుంటూ చదువుతూ వున్నా.

  • అఫ్సర్

చిత్రం: రాజశేఖర్ చంద్రం

Avatar

శ్రీకాంత్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీకాంత్ ని దశాబ్ద కాలం నుంచి చదువుతున్న. నిశ్శబ్ద ధ్వనులు వినిపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా …

  • కొన్ని వ్యక్తీకరణలు తెలుగు కవిత్వం ఇప్పుడున్న స్థితిలో కచ్చితంగా వొదగవు. అట్లా వొదిగిపోవాలన్న వినయమేమీ ఇక్కడి వాక్యాలకు లేదు. కొన్నిసార్లు ఎక్కడి నించో తర్జుమా అయిన కవిత్వం చదువుతున్నామా అని లోపల నించి చిన్న కంగారు.

    Afsar garu, the above lines may lead form an essay.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు