ఎండ్లూరి సుధాకర్‌ మన తరం జాషువా!

వర్గీకరణ అవసరాన్ని తెలియ చేసే రచనలు చాలా మంది మాదిగ కవులు చేశారు. వాళ్లందరిలో ఎండ్లూరి సుధాకర్‌ ప్రథముడు అనాలి.

     ఎండ్లూరి సుధాకర్‌ వొక అద్భుతమైన ప్రేమస్వరూపుడు. యువకవులను నిత్యం ప్రోత్సహించే వ్యక్తి. అంతే స్థాయిలో విమర్శకులను కూడా గౌరవించేవాడు. నా విమర్శ వ్యాసాలు పలు చోట్ల చదివి, నేను ఎదురు పడగానే వాటిని ప్రస్తావిస్తూ నా రచనలోని వైవిధ్యాన్ని మెచ్చుకొనేవాడు. నేను తనతో సన్నిహితంగా మెదిలిన సందర్భాలు చాలా అరుదు. కానీ, తనను కలిసిన ప్రతిసారీ నాకెంతో సాన్నిహిత్యం వున్నట్టు ఒక ఫీలింగ్‌ నాలో కలిగేది. ఆయన వేదికల మీద ప్రసంగించే  తీరు, ఆ విద్వత్తు, స్పాంటేనిటీకి అబ్బురపడని వారెవరుంటారు? నేనలా మైమరిచి ఆయన్ని విన్న సందర్భాలు చాలా వున్నాయి.

దళిత సాహిత్యం మన దేశ సృజన రంగాన్ని బాగా ప్రభావితం చేసింది. మరాఠీలో దళిత సాహిత్యం మొదట మొదలైందని చేసే సూత్రీకరణలను నేను నమ్మను. ఎందుకంటే, మనదేశంలోని అన్ని భాషా సాహిత్యాలలో స్వతంత్రానికి పూర్వమే కుల సమస్యను ప్రధాన వస్తువుగా చేసుకొని రచనలు చేసిన కవులు, రచయితలున్నారు. తెలుగులో మహాకవి గుఱ్ఱం జాషువా, కుసుమ ధర్మన్న, మేదరి భాగయ్య వంటి వాళ్ల రచనలు అందుకు సాక్ష్యం. డా. అంబేద్కర్‌ సామాజిక, రాజకీయ ఉద్యమ కాలంలో యింకా యెంతమంది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాశారో పరిశోధించాల్సి వుంది. దళిత పాంథర్స్‌ ఉద్యమ ప్రభావంతో దళిత సాహిత్యం వచ్చిందని చెప్పే దానిలో నిజం లేదు. అంతకు ముందునుంచీ వస్తున్న కుల వ్యతిరేక సాహిత్యానికి ఒక పేరు పెట్టడం ద్వారా దానికో ప్రత్యేక ఉనికి, గుర్తింపు వచ్చింది. ‘దళిత సాహిత్యం’ అనే పేరు వల్ల ఒక కొత్త సామాజిక, సాహిత్య ఉద్యమం ఉనికిలోకి వచ్చిందని అంతా అనుకున్నారు. దళిత పాంథర్స్‌ వ్యవస్థాపకుల్లో నాందేవ్‌ థస్సాల్‌ వంటి బలమైన కవులు వుండటం వల్ల కూడా దళిత సాహిత్యం ఒక ప్రత్యేక సాహిత్య ఉద్యమంగా గుర్తించడానికి దారితీసింది. అంతకన్నా ముందు నుంచే తెలుగులో వెలువడుతున్న కుల వ్యతిరేక సాహిత్యానికి, ఈ కొత్త సందర్భం మరింత బలాన్ని యిచ్చింది. అదే సమయంలో కంచికచర్ల కోటేశు సజీవ దహనం, కారంచేడు, చుండూరు, పదిరికుప్పం వంటి దళితులను ఊచకోత కోసిన దారుణాలు తెలుగు సాహిత్యంలో దళితవాదం ప్రబలడానికి ఒక ప్రాతిపదిక ఏర్పరిచాయి.

తెలుగు దళిత సాహిత్యంలో ఎండ్లూరి సుధాకర్‌ది విశిష్ట స్వరం. ఆయన కవితా విన్యాసం అందరినీ ఆకర్షించింది. కులం, దాని వికృత రూపాన్ని ఆయన తన కవిత్వంలో తీవ్రంగా నిరసించిండు. హైదరాబాదులో పెరిగాడు కాబట్టి ఉర్దూ కవితా పరిమళగంధం తనకు బాగా అబ్బింది. ఉర్దూ గజల్‌, రుబాయిల సొగసు తనను సమ్మోహితుణ్ణి చేసింది. వాటిలోని కవిత్వ వైభవాన్ని ఆయన బాగా వొంటపట్టించుకున్నాడు. అయితే, ఆయన రాసిన కవిత్వంలో ఎక్కడా వాటి ఘాటువాసన తగలనీయడు. తన దళిత అస్తిత్వ సంస్కృతి నుంచి తీసుకున్న సంజ్ఞలు, ఉపమ, రూపకాలే ఎక్కువగా వుంటాయి. అవే అతని కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అయితే, యితర భాషాదళిత సాహిత్యంలో కనపడని మరో విశిష్టత తెలుగు దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. యింకా స్పష్టంగా చెప్పాలంటే, తెలుగు దళిత కవులు ఈ దేశానికి యిచ్చిన కానుక అది. అదే మాదిగ సాహిత్యం.

దళితులంతా ఒకే రకంగా లేరని, వారిలోని బహుళత్వాన్ని మాదిగ సాహిత్యం గుర్తించేలా చేసింది. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం జరిగే పోరాటం దళిత కవిత్వం రాస్తున్న మాదిగలను తమ అస్తిత్వం గురించి ఆలోచించేలా చేసింది. ఆ క్రమంలోనే మాదిగ జీవితం, సంస్కృతి, ఉద్యమ అవసరాలను విడిగా అర్థం చేసుకొనే ఒక అనివార్యత ఏర్పడ్డది. ఆ క్రమంలో వర్గీకరణ అవసరాన్ని తెలియ చేసే రచనలు చాలా మంది మాదిగ కవులు చేశారు. వాళ్లందరిలో ఎండ్లూరి సుధాకర్‌ ప్రథముడు అనాలి. ఆయన ఎలాంటి గందరగోళం లేకుండా తన వైఖరిని ప్రకటించాడు. వర్గీకరణీయం, కొత్త గబ్బిలం సంకలనాలు రిజర్వేషన్ల హేతుబద్దీకరణను బలపరుస్తాయి. అయితే, మాదిగల సామాజిక సాంస్కృతిక జీవితాన్ని కథలుగా ఆయన చెప్పిన తీరు ప్రత్యేకం. మల్లెమొగ్గల గొడుగు కథాసంకలనం విశిష్టమైనది. అలాంటి కథలు ఆయన తప్ప మరొకరెవరూ రాయలేక పోయారు. ఒక మాదిగగా అమెరికా వెళ్లినప్పుడు తను చూసిన విశేషాలను, తన అనుభవాలను ‘ఆటాజనికాంచె’ కవితా సంకలనంలో వ్యక్తం చేశాడు. దేశంలో జరిగే అనేక దుర్మార్గాలను ఆయన ఎప్పటికప్పుడు తన కవితల ద్వారా నిరసించాడు. ముజఫర్‌ నగర్‌ నుంచి మొదలుకొంటే పసిగుడ్డు మనీషా ఉదంతం వరకు జరిగిన దారుణాలను ఆయన తీవ్రంగా ఖండించాడు.  తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో ఆంధ్రలో ఉద్యోగం చేస్తూ కూడా తను పుట్టిన ప్రాంతానికి మద్ధతుగా నిలబడ్డాడు.

పండితులు కొలువుదీరిన రాజమండ్రిలో నెగ్గుకు రావడం అంత మాములు విషయం కాదని నాతో ఒకసారి అన్నాడు. రాజమండ్రిలో ఆయన సుదీర్ఘకాలం ఉద్యోగం చేసిండు. అక్కడ తెలుగు బోధించే ఆచార్యునిగా కంటే, కవిగానే ఎండ్లూరి సుధాకర్‌ అందరికీ యిష్టం. సవర్ణ పండితులు వేసే కొంటే ప్రశ్నలకు, చేసే వెకిలి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్తూ ఆయన ఒకరకంగా ఒంటరి యుద్ధమే చేసిండు. బేతవోలు రామబ్రహ్మం అంటే ఎందుకోగాని తనకు ప్రత్యేకమైన అభిమానం వుండేది. బేతవోలు రామబ్రహ్మంకు కూడా ఆయన్ని అమితంగా యిష్టం. విద్వత్తుగలిగిన వారిని కుల, మతాలకు అతీతంగా అభిమానించే సహృదయత ఎండ్లూరి సుధాకర్‌ది.

మహాకవి గుఱ్ఱం జాషువా జయంతి సభల్లో మేము కలుసుకొనేవాళ్ళం. హైదరాబాదులో నిర్వహించే సభలకు ఎండ్లూరి సుధాకర్‌ అధ్యక్షులుగానో లేదా ముఖ్యఅతిథిగానో వుండేవారు. నేను అతిథిగానో, లేదా ప్రేక్షకుడిగానో వుండేవాణ్ణి. గుఱ్ఱం జాషువా జయంతి, వర్ధంతులను ఒక ఉద్యమంలా సాగించాడు. దామోదరం రాజనర్సింహ ఉపముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆ పనిని మరింత ఎక్కువగా చేసిండు. ఉత్తరాదిలోని సంతు రవిదాసును తెలుగు వారికి పెద్దయెత్తున పరిచయం చేసిన వారిలో మాష్టార్జీతో పాటు ఎండ్లూరి సుధాకర్‌ కూడా ఒకరు. దామోదం రాజనర్సింహ సహకారంతో ఫతేఅలీఖాన్‌ (ఎల్బీస్టేడియం) మైదానంలో పెద్ద సభ ఏర్పాటు చేసి రవిదాసు జయంతి పండగను ఘనంగా నిర్వహించాడు. ఆ తర్వాతే రవిదాసు గురించి తెలుగు ప్రజలకు అవగాహన ఏర్పడ్డది నిజం.

మహాకవి జాషువా కళాపీఠం, గుంటూరు వారి ఆధ్వర్యంలో ప్రతియేటా అవార్డులు యిస్తారు. సాహితీ ప్రియులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మూడు రోజుల పాటు నిర్వహించే జాషువా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఆ క్రమంలో ఆ పీఠం తొలిఅవార్డును 2017లో ఎండ్లూరి సుధాకర్‌కు బహూకరించారు. మూడు గుర్రాల బగ్గి మీద ఆయన్ని కూచుండబెట్టి గుంటూరు పురవీధుల్లో బ్రహ్మండంగా ఊరేగించారు. ఎండ్లూరి సుధాకర్‌ కవిరాజువలే వెలుగులీనారు. ఆ మూడు గుఱ్ఱాల బండి మందు వేలాదిమంది జనం బారులు తీరారు. నాతోపాటు శరణ్‌ కుమార్‌ లింబాలే, జి. లక్ష్మీనరసయ్య, పాపినేని శివశంకర్‌, వైబి సత్యనారాయణ, పసునూరి రవీందర్‌, కాకాని సుధాకర్‌, డప్పోళ్ల రమేష్‌, గోగుశ్యామల, నూతక్కి సతీష్‌, యింకా చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఉత్సవాల విశిష్టత ఏమిటంటే, దళిత లిటరరీ ఫెస్టివల్‌ కూడా నిర్వహించటం. ఢల్లీి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి అనేక ప్రాంతాల నుంచి రచయితలను, స్కాలర్లను ఆహ్వానించి, వివిధ అంశాల మీద ఉత్తమ ప్రసంగాలను జాషువా కళాపీఠం నిర్వహించింది. ఆ ఉత్సవం ఆరంభం కావడానికి ముందు రోజు రాత్రి మేమంతా గుంటూరుకు చేరుకున్నాము. ఆహ్లాదకరమైన ఆ రాత్రి ఎండ్లూరి సుధాకర్‌ ఉర్దూ గజళ్లు, రుబాయిలు వినిపిస్తూ మా హృదయాలను దోచుకున్నారు. తీవ్రమైన సైద్ధాంతిక చర్చను కూడా ఆయన తన కవితా చలోక్తులతో తేలికపరిచారు. అది నేనెప్పటికీ మరిచిపోలేని రాత్రి.

తనకు గుండెకు పెద్ద ఆపరేషన్‌ అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన్ని మధుమేహం నెమ్మదిగా తినేస్తుందని తెలిసి చాలా దిగులు పడ్డాను. ఒకరోజు నేనూ, పసునూరి రవీందర్‌ యిద్దరము కలిసి సెంట్రల్‌ యూనివర్శిటీలో ఆయన్ని కలిశాము.  ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ యింట్లో విశ్వకవి ఎండ్లూరి సుధాకర్‌ను కలుసుకోవడం చాలా ఆనందం. ఆ తర్వాత ప్రొఫెసర్‌ ఉమామహేశ్వర్‌రావు వచ్చి మాతో జాయిన్‌ అయ్యాడు. కవిత్వం, కథ, పాట ఒక్కటేమిటి మరో రెండు గంటలు మాకు సమయమే తెలియలేదు. ఆ రోజు పసునూరి రవీందర్‌తో పాటలు పాడిరచుకున్నాడు. మధుమేహం వున్నవాళ్లు మధువు సేవించవలదు కదా సార్‌ అన్నాను. రుచిలేని మంట, రుచిలేని మాట, రుచిలేని బతుకు ఎందుకు? బుద్ధుడు చనిపోయాడు. అంబేద్కర్‌ చనిపోయాడు. మనమూ చనిపోతాం. కాకపోతే కాస్తా ముందు చనిపోతాము కావొచ్చని ఆయన మాకే నచ్చచెప్పాడు. ఆ తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన్ని యూనివర్శిటీలో కలిసి మాట్లాడాను.

రెండు కొత్త పుస్తకాలు నా చేతిలో పెట్టి, ‘నీకు నేను ఇవి మాత్రమే యివ్వగలను’ అన్నాడు. ‘నాక్కూడా ఇవే కావాలి’ అని వచ్చాను. ఆయన తడియారని కవితా హృదయం తన సహచరి పుట్ల హేమలతా మరణంతో ఎండిపోయింది. ఆమె కోసం తపిస్తూ రాసిన కవితలను చదివి బాధేసేది. ఈ కవికింత ప్రేమ యెందుకు? ఈ ప్రేమబరువుతో ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని నాకు దిగులేసేది. యెందుకింత ప్రేమ అని అడిగితే, ప్రేమపూరిత సమాజం కోసమే కదా నువ్వు తండ్లాడుతున్నది అని నన్ను సముదాయించాడు. ఈ మానవ లోకాన్ని ఆనందంగా చూడాలని, అసమానతలు లేని ప్రపంచాన్ని కలగన్న విశ్వకవి ఎండ్లూరి సుధాకర్‌ అకాల మరణం వల్ల తెలుగు సాహిత్యం చాలా నష్టపోయింది. ఆ నష్టం ఎవరూ పూడ్చలేనిది. ఆయనికిదే నా నివాళి.

*

జిలుకర శ్రీనివాస్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవి దళిత సాహిత్య రధసారధి ఎండ్లూరి సుధాకర్‌ గారి మరణం తెలుగు సాహిత్యంలో తీరని లోటు వారిగూర్చి మీరు రాసిన వ్యాసం బాగుంది సార్ నమస్తే

  • కవిగానే కాక వ్యక్తిగా సుధాకర్ గారి గొప్పతనాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు

  • నమస్కారం సార్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సార్ తన సాహిత్యం ద్వారా సమ సమాజాన్ని స్థాపించాలనే భావనతో తనదైన శైలిలో విభిన్న నేపథ్యాన్ని చిత్రిస్తూ ఎంతో దళిత దళిత సాహిత్యాన్ని వెలువరించారు ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు ఎంతోమంది పరిశోధకులకు ఎంతో గొప్ప మార్గం నిర్దేశాన్ని చేసిన గొప్ప పర్యవేక్షకులు తెలుగు సాహిత్యంలోని పరిశోధనకు సంబంధించి ఏ అంశాన్ని గురించిన పరిశోధకులు అడిగిన ఓపికగా చక్కగా అర్ధమయ్యేలా చెప్పే గొప్ప గురువు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సార్ అంత గొప్ప సాహితీవేత్త గురించి చక్కని వ్యాసాన్ని రాశారు సార్ ధన్యవాదాలు సార్

  • నమస్కారం సార్. దళిత సాహిత్యానికి అలుపెరుగని సాహితీ కృషి చేసిన గొప్పకవి, రచయిత, మార్గదర్శకులు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సార్ ని గురించిన వ్యాసం చాలా బాగుంది సార్ .తెలుగు సాహిత్యం ఉన్నన్నాళ్ళు ఆయన బ్రతికే ఉంటారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు