ఊరు గాసిన కానుపు

జెరంతో నాలుగునాళ్లుగా ఆస్పత్రిలో జావినై ఉండిన మాలచ్చమ్మ సచ్చిపొయ్యింది. ఇంట్లోవోళ్లు గుండిలు గొట్టుకోని యాడస్తుంటే మిగిల్న ఊరు ఊరంతటికీ ఆయమ్మి నెలల కడుపుతో సావడం అరిస్టవఁని జంకు బట్టుకునింది. ఆస్పత్రి నుంచి సెపాన్ని అంబిలేన్సులో యాసకొస్తుండారని ముందుగాల ఊరు జేరిన కుర్ర పిలకాయిలు జెప్పినారు.
తెల్ల బూసికాలు దిగేస్కోని ఆస్పత్రి మణుసులు గూడా వొస్తుండారంట్రా ? అని అడిగినారు ఊళ్లో జెనం ఆ కుర్రపిలకాయిల్ని. ఆయమ్మి కోవీడితో గానీ సచ్చింద్యా తెల్ల బూసికాలోళ్లొచ్చి బూడ్సేదానిక్యా ? అని ఇదలగొట్నారు ఆస్పత్రిలో అంతా దగ్గిరుండి సూసొచ్చిన కుర్రపిలకాయిలు.
వోళ్ల ఇదిలింపుల్తో కోవిడి బయిం తీరింది జెనాలకి. కడుపుతో సచ్చిందనే బయిం మిగిలుండాది. ఇప్పుడా, అప్పుడా అని అంబిలేన్సి కోసరం కనిపెట్టుకోని ఉండారు అందురూ…
*****
లచ్చారెడ్డి ముసిలోడైనానక, వొంట్లో బాగల్యాక ఇల్లు కదలడంల్యా. నిన్నా మొన్నటి దాకా మంచీ సెబ్బర్లకి ఆయిన మాట మిందన్నే పొయ్యింది ఊరు. రాజికియ్యింగా గూడా సెక్కరం దిప్పిన మణిసి. ఆ పెబలన్నీ ఆరిపొయ్యినా ఆయిన మేనల్లుడు రాజికియ్యాల్లో ఉండటాన ఇప్పుటికీ ఊరికి పెద్ద దిక్కుగా తెగని ఎవ్వారాలన్నిటికీ తొలిగా ఆయిన దెగ్గిరికే పోతుంటారు ఊరంతా.
మజ్జానంగా సెపం ఊరు జేరింది. సందేళ, మిద్దింటి వొరండాలో లచ్చారెడ్డి పడక్కుర్సీలో కూకోనుండంగా ఎదాళంగా వాకిట్లో గచ్చుమింద కూకోని తుండుగుడ్డ నోట్లో గుక్కుకోని యాడస్తుండాడు మాలచ్చమ్మ మొగుడు యేణుగోడు. వోడెనకాల నిలబడుండారు ఇద్దురు ముగ్గురు మాలాడ కుర్ర పిలకాయిలు.
యాడవబాకరా యేణా.. అయ్యిందేదో అయ్యింది నాయినా. పొద్దు గూకతుండాది, జరగాల్సింది గదా సూడాలిప్పుడో అనన్నాడు లచ్చారెడ్డి.
ఐతే యాందినా నువ్వనేద్యా ? అసలకే పెళ్లాం జచ్చిన బాదలో వోడుంటే ఇట్టాటప్పుడు ఆశారం, శాస్తరం అంటా తప్పుడు కూతలు కూసిన్నా కొడకల్ని సెప్పుతో గొట్టకుండా పెద్దోడివి నువ్వు గూడా వోళ్లకే సపోర్టు జేస్తే ఎట్నా ? అన్నాడు యేణుగోడి ఎనికాల నిలబడుండేటి కాకోడు.
లచ్చారెడ్డి నీరసంగా మూలిగి వొకరిద్దురి మాటంట్రా అది కాక్యా ? ఊరందురి మాటగదా ! కడుపుతో సచ్చిన ఆడదాని సెపానికి కానుపు గాయకుండా ఆపట్నే బూడిస్తే ఊరికి వొరిస్టవఁని అందురూ బయిపడతుండేది మీరు గూడా ఇంటుండ్లా ? ఇది పెద్దోళ్లనాటి నుంచీ వొస్తుండేటి ఆశారం. శాస్తరాలకీ ఆశారాలకీ ఎదుర్దిరిగి రచ్చలు బెట్టుకుంటే పన్లౌతాయంట్రా అనన్నాడు.
అప్పుటిదాకా గచ్చుమింద కూకోని యాడస్తుండేటి యేణుగోడు సివక్కన పైకిలేసి అట్నే రెడ్డ్యా, కానీండి. ఈళ్లీళ్లుగా కోసి కువ్వలెయ్యిండి దాన్ని. పుట్టిడి కడుపుతో సచ్చుళ్లా లంజిద్యా.. దానికట్నే గావాల. నేను గూడా ఇంక బతకబళ్యా ఉరేస్కోని సస్తా అన్జెప్పి, మాలచ్చిఁవ్యా… నేను గూడా వొస్తుండాన్యే.. అంటా అరస్తా లగువెత్తుకున్నాడు.
మాలాడ పిలకాయిలు వోడెనకబడ్డారు. లచ్చారెడ్డి పడక్కుర్సీలో నుంచి లెయ్యిల్యాక లేసి లగిస్తుండేటి కాకోడ్ని ఎనిక్కిరమ్మని అరిసినాడు.
కాకోడొచ్చి వొరండా మెట్లమింద కూలబడ్డాడు. రెడ్డి పడక్కుర్సీలో కూకోని, నాయినా నువ్వన్నట్టు వోడు పెళ్లాం సచ్చిన బాదలో ఉండాడు సరే, మనం గూడా వోడి మాదిర్నే ఆగం జేస్కుంటే ఎట్రా ? ఇప్పుడు మనం శాస్తరం పెకారం పోకపోతే ర్యాపట్నుంచీ ఊళ్లో యాం జరిగినా దీనిమిందనే బడతారు. ఎట్నో నువ్వే గుండి రాయిజేస్కోని దగ్గిరుండి జరగాల్సింది సూడాలిప్పుడు. యేణుగోడ్ని వొలికిల్లోకి రానీబాకండి. సూసి తట్టుకోలేడు అనన్నాడు.
నేను మాతరం ఏవాటాన సూస్తా నిలబడేదినా ? సిన్నపిల్ల కదనా ఆయమ్మే, నాకు సెల్లిలు గావాల. వోళ్ళకి పెళ్లయ్యి యాడాది గూడా గాలా అంటా కళ్లనీళ్లు బెట్టుకున్నాడు కాకోడు.
లచ్చారెడ్డి నిట్టూర్సి దగ్గి, నిజివేఁగానీ ఇప్పుడు ఇయ్యన్నీ మాట్లాడే టయివుఁ గాదురా. మజ్జానం నుంచీ వొలికిల్లోనే పడుండ్లా సెపవా. ఎంతసేపని ఆవాటాన పెట్టుకోనుంటావోఁ. సీకటి బడతుండాది. ఎరికిలి పొండోడు ఉండాడా ? అనడిగినాడు.
ఆయినిక్యాందో బాగల్యాక మంచాన పడుండాడని అనుకుంటుండార్నా అని జెప్పినాడు కాకోడు.
బిన్నా వోడికాడికి పొయ్యి నేను జెప్పినానని అంతా ఇవరంగా జెప్పి వోడ్ని వొలికిల్లోకి తీసకపో, వోడు ఎంతడిగితే అంత ఇస్తానన్నానని నామాటగా జెప్పు. మీరు గూడా ఏ కర్సుకూ బయిపడబాకండి. ఇంద ఈ ఐదొందలూ నీకాడ బెట్టుకో అని జోబీలో నుంచి కాయితం దీసి కాకోడి సేతిలో బెట్టబొయ్యినాడు రెడ్డి. అంతగా అవుసరం బడితే తీస్కుంటాలేనా నీకాడ్నే ఉండీ అంటా లేసి మాలాడ దారి బట్నాడు కాకోడు.
*****
వొయిసు పొయ్యిన ఎరికిలి పొండుతాత కూకోల్యాకా నిల్సుకోల్యాకా దినాలు లెక్కేస్కుంటా మంచానబడి వొణకతుండాడు. కస్టంమింద ఆయిన్ని వొలికిల్లోకి ఎత్తకొచ్చి ఇసికిలో కూకనబెట్నారు. పందుల్ని గోసేటి మొచ్చుకత్తిని నూరతుండాడు ఆయిన కొడుకు.
వొలికిల్లో సీకట్లు గమ్మతుండాయి. మాలచ్చమ్మ ప్యాణం ఎప్పుడు బొయ్యిందో, నెల్లూరులో పైవేటు ఆస్పత్రోళ్లు ఆ మందల ఎప్పుడు బైటబెట్నారో గానీ మసక సీకట్లల్లో ఉబ్బరిచ్చకపొయ్యుండాది సెపం. అరమూట వొడ్లబస్తా మాదిర్నుండాది బిడ్డతో గూడా కడుపు. వొకడు అదంతా సెల్లుపోన్లో సాటుగా ఈడియో తీస్తుండేది కనిపెట్టి వోడ్ని అదిలిచ్చి అంతా డిలీటు సేపిచ్చి ఆడ్నుంచి తరివేఁసినారు.
యేణుగోడ్ని ఇంట్లో కూకనబెట్టి ముగ్గురు కుర్రపిలకాయిలు వోడితో పిచ్చికుక్కల మొందు (సీపు లిక్కరికి మా ఊరి ముద్దుపేరు) తాగిస్తుండారు. ఐనా వోడి యేడుపుని పట్లేకుండారు.
యాందిరా ఈ కరమ నాకా ? ఎప్పుటి శాస్తరాల్లా ఇయ్యా ? వొయిసు పిలకాయిలు మీగ్గూడా యాందిరా ఈ శాదవలా ? అనడిగినాడు కాకోడ్ని పొండుతాత.
కాకోడు యాం పలకలా.. కత్తి నూరతుండేటి అలికిడి వొక్కటే వొలికిల్లో ఏటి గాలికి సుట్టలు దిరగతుండాది.
వోళ్ల కొంపల్లో ఇదే వాటాన ఆడగూతురు కడుపుతో సస్తే అప్పుడు గూడా ఇదే శాస్తరం సిదగతాడంట్రా ఆ లచ్చారెడ్యా ? అనన్నాడు నూరిన కత్తిని వొణికే సేత్తో అందుకోని బొటినేలుతో పొదును జూస్తా పొండుతాత.
పనైనానక నిన్ను ఔపడమన్నాడు రెడ్డి. నువ్వు ఎంత గావాలంటే అంత డబ్బిస్తానన్నాడు, నీ పెశ్నిలన్నీ ఆయిన్నే పొయ్యి అడుగు అన్జెప్పినాడు కాకోడు.
ఆయిన దరమాన ఈ పున్నిం మూటగట్టుకుంటుండ్లా, సాలని జెప్పు. ఆయిన వాకిటికిబొయ్యి ఈనావుఁలు దెచ్చుకోని వోటితో నరకమెండలానికి పోలేనన్నానని గూడా జెప్పు, రాండి నన్ను ఎత్తకపొయ్యి సెపం అమ్మిడి కూసనబెట్టండి అన్నాడు పొండుతాత…
*****
మాలచ్చమ్మా, యేణుగోడూ ఇద్దురూ మా మాలాడలో నా కళ్లముందర పుట్టి పెరిగిన పిలకాయిలు. పేట కూల్డ్రింకు సాపులో పనిజాస్తాడు యేణు. వోడు ఆయమ్మి మింద మనుసుబడి పెళ్లి జేసుకుంటానని పెద్దోళ్లకాడ అడిగంపిస్తే ఆయమ్మి గూడా వొప్పుకునింది. వొరసైనోళ్లే గదా అని పొయ్యిన యేడే పెళ్లిజేసినారు ఆ ఇద్దురికీ. పెళ్ళి కార్డు ఎత్తుకోని యేణుగోడి తరపున వొకరూ, మాలచ్చమ్మ తరపున వొకరూ నెల్లూరికొచ్చి నాకు ఇచ్చిపొయ్యినారు. నాయిడిపేట ఎంకటేసులుసావిఁ గుడిలో నిన్నా మొన్నా జరిగినట్టుండాది ఆ పెళ్లి నా గెవణంలో…
మూడు నెల్లకి ముందర మాలచ్చమ్మ పొయ్యిన మందల పోన్లో జెప్పినాడు నా తమ్ముడు. నేను అప్పుడు రాల్యాకపొయ్యినా. మొన్న పెద్దపండక్కి ఊరికి పొయ్యినప్పుడు యేణుని పలకరిద్దాం అని పోతే ఇంటికి బీగాం ఏసుండాది.
నేనెప్పుడు ఊరికి పొయ్యినా ఎట్ట కనిపెడతాడో గానీ ఎంటనే వొచ్చి నాకు తోక మాదిర్న మారి నోటిమింద సెనం మూతబడకుండా నా సెవ్వులో జేరి యాంద్యాందో గొణగతానే ఉంటాడు యాందోళ్ల ఏడుగొండ్లు. వోడ్ని అడిగినా యేణుగోడు ఎట్టుండాడ్రా, ఇంటికిబోతే లేడా అని.
సచ్చిన పెళ్లాం కడుపుని వొలికిల్లో గోస్తే ఏ మొగోడు సూస్తా బాగుంటాడ్నా ? అన్నాడోడు.
అదిరిపడి కడుపుని కోసేద్యాందిరా అనడిగినా. ఆ సెనం దాకా నాకు అసలు మందల తెలవదు..
వొలికిల్లో మాలచ్చక్క కడుపుని గోసి బిడ్డని బైటికి తీస్నార్నా, పొండుతాతకి సెయ్యి వొణకతా కత్తి పైకీ కిందకీ దూసిపోతుండ్యా, కడుపులోనుంచి అద్యాందో పచ్చంగా గారింది, సూస్తుంటే వోంతికొచ్చింది. పొండుతాత కళ్లనిండా నీళ్లు బెట్టుకోని రేపోమాపో సచ్చేటోడ్ని నా స్యాతల్తో ఏంటికీ పని జేపిచ్చినావు బెగవొంతుడా అంటా రొండుసేతులెత్తి దణ్ణం బెట్టి ఓ అంటా ఏడ్సినాడ్నా.
ఎలికంతుండాది ఆడపిల్ల ! ఆ పిల్లని కోకలో జుట్టి పట్టుకోండ్రా అంటే బయానికి అందురూ ఉచ్చ బోస్నారు, నా సేతికి అందిచ్చినాడు పొండుతాత. ఆయక్క పక్కన్నే బిడ్డని పండేసి బండిడి కట్టెల్లో కాల్సేసినాం. కట్టిలన్నీ కాలిందాకా ఎగదోస్తా పిచ్చికుక్కల మొందు సప్పరిస్తా ఆడ్నే కూకున్నాం. అంతా కాల్నానక పంగాలకట్టిల్తో బూడిదీ, సెడుదుడూ, బొగ్గులూ గెట్టుమింద నుంచి ఏట్లోకి దోసేసినాం. వానలకి ఏట్లో నీళ్లు బారతుండ్లా, తెల్లారేలేకి యాంల్యాకుండా తూపిలిపాలిం సవందరంలోకి కొట్టకపొయ్యింది అంతా..
ఇసిత్రంగా ఆ మరసట్నాడే పొండుతాత సచ్చిపొయ్యినాడు. లచ్చారెడ్డి మెడ్రాసులో కొడుకు దెగ్గిరికి పొయ్నాడన్నారు మల్లా తిరిగిరాలా. రెడ్డికి పచ్చోతం వొచ్చింది అని గూడా జెప్పుకుంటుండారు. యేణన్న ఆ తెల్లారి నుంచి ఈనాటికీ అడ్రాసు లేడు…
యాందిరా నువ్వు జెప్తుండేద్యా అనడిగినా…
నిజింనా, శాస్తరం పెకారం అట్టా జెయ్యికపోతే మాలచ్చక్క దెయ్యివఁయ్యి ఊరిమింద బడతాదంట. ఊళ్లో కడుపొచ్చిన ఆడోళ్లని సంపతాదంట. మనూళ్ళోనే గాదునా ఏఊరి ఆడమణిసి కడుపుతో సచ్చినా ఆఊర్లో గూడా ఇదే ఆశారం జరగాలంట…
నా రొత్తిలో ఆశారంనా. అదే నేనయ్యుంటే ఎనో, ఇట్టాటి శాస్తరం జెప్పిన నా కొడకల్ని ఆడ్నే కత్తవతో పొడిసిపాం దెంగుదును గానీ, సస్తే మాత్రవూఁ నాయాడదాని వొంటిమింద సెయ్యెయ్యినిస్తానంట్నా.. అంటా సెప్పకపోతుండాడు ఏడుగొండ్లు.
ఎవురెవురు ఉణ్యార్రా అప్పుడా వొలికిల్లొనా అని అడిగినా.
మీ కాకెన్నా, సుబ్బరమని, జానుగోడూ.. ఇంకా ఎవురో ఉణ్యారు. మీ కాకెన్నే గదంట్నా నెత్తీ నోరూ గొట్టుకుంటా అందుర్నీ కలేసింద్యా అనన్నాడు. సరే నువ్వు ఇంటికి పొయ్యి సందేళ రాబో అని వోడితో జెప్పి కాకెన్న కాడికి లగిచ్చినా…
*****
వాకిట్లో నన్ను జూసి ఇంట్లోకి రమ్మన్నాడు కాకెన్న. కాదునా మాటుండాది మా సిన్నాయిన మావిడితోపు దాకారా అని తోడకపొయ్యినా. ఆ మాటా ఈ మాటా ఐనానక ఈ మందల ఎత్తినా.
ఆనాయాలు ఏడుగొండ్లుగోడు జెప్పినాడంట్రా నీకా. వోడే గదా నీ గుద్దెనికీటా తిరగలాడేద్యా అని రాని నవ్వు నవ్వినాడు కాకెన్న. ఎవురు జెప్తే యాందినా. ఇంతపని ఎట్టజేసినార్నా అనడిగినా.
ఎవురు మాత్రవూఁ జేసిన పని యాఁవుండాదిరా దీంట్లా ? శాస్తరం, ఆశారం అని ఊరంతా అంటుంటే ఎవురుఁవని ఎదురు జెప్పగలుగుదువోఁ ? పెద్దోళ్ల మాట కాదంటే బతకనిస్తారా అన్నాడు మొకవంతా బాదగా పీల్సకపోతా.
పోలీసోళ్లకి చెప్పగొడుదంట్నా అనన్నా.
ఎవురి మింద జెప్పాల్రా పోలీసోళ్లక్యా. శాస్తరం పెకారం పోకపోతే మరసటి పొద్దునుంచీ ఊళ్లో యాం జరిగినా సచ్చినమ్మి మిందే బడతారు అన్నాడు లచ్చారెడ్డి. ఆయిన చెప్పింది గూడా నిజివేఁ అనిపిచ్చింది నాకు. ఎన్ని గాతకపు పనులు జూడలేదీ కళ్లతో, వోటెల్లో ఇదొకటి. ఇంకేంటికని నేనే నలగర్ని కలేసి బతివిఁలాడి ఆ పాపాన్ని దెగ్గిరుండి జెయ్యిచ్చినా అని అన్నాడు.
నాకు యాం మాట్లాడాలో తెలవలా. ఆయన్నొక మావిడిసెట్టు మొదుట్లో నేనొక సెట్టు మొదుట్లో బైటికి పొంగకొచ్చిన యార్లమింద కూకోనుండాం. రోన్సేపు గమ్మునుండి ఆయన్నే అన్నాడు. బయాలూ, బ్యాంతులూ ఇంకా పోల్యేదురా మన ఊళ్లల్లోనా. కాలాలు మారతుండినా శాస్తరాలూ, ఆశారాలూ జరక్కపోతే కీడనీ, వొరిస్టవఁనీ యేగులాడతుండారు అందురూ. ఈయమ్మి మందలే జూడు రెడ్లూ, నాయిళ్లూ, మాదిగోళ్లూ ఆకిరాకి మన మాలోళ్లూ అందురూ వొక్కటయ్యి అరిస్టఁవన్నోళ్ళే. మీబోటి సదువుకున్నోళ్లు పల్లెల్లో గెట్టెంగా నిలబడితే మారొచ్చు ఇట్టాటివన్నీ. నాలుగు అచ్చిరిం ముక్కలు నేర్సినోడు ఎవుడికీ పల్లెల్లో కాలు నిలవకపోతుండ్యా, సుట్టపు సూపులికీ, పండగాపెబ్బాలకీ వొచ్చి నాలుగునాళ్లుండి పొయ్యేదే అబ్బురంగుండాది మీబోటోళ్లకి, ఎవురిమింద యాఁవని పెట్టాల్రా పోలీసు కేసా..? పోదాం పదరా అంటా లేసినాడు కాకెన్న.
ఆయన్న మాటలు నన్ను పారతో సెలిగినట్టుణ్యాయి.
మావిడితోపు బైటికి వొచ్చినానక యేణుగోడు యాఁవైనాడునా అనడిగినా.
ఆ రేతిరి మాలాడంతా ఇనబడేటట్టు మాలచ్చివ్యాఁ, మాలచ్చివ్యాఁ అని అరస్తా యాడస్తుణ్యాడు. తెల్లారి జూస్తే ఎట్టబొయ్యినాడో గానీ ఎవురికీ కనబడలా. వోడ్ని ఎతుకులాడతా మూడునెల్ల నుంచీ ఊళ్లు గాలిస్తుండారు వోళ్లమ్మా నాయినా. ఈ గోరానికి నలగర్ని మల్లిచ్చినందుకు ఆనాట్నుంచీ సక్కరంగా కూడు సగీటంలేదు ఇజియా నాకా అన్జెప్పి ఎల్లిపొయ్నాడు కాకెన్న.
మావిడితోపు బైటే వొంటిగా నిలబడిపొయ్యినా..
నేను కనబడంగానే ఎనా అంటా లగిస్తావొచ్చి సెయ్యి బట్టుకోని గెలగెలా మాట్లాడేటి మాలచ్చమ్మా, సిగ్గుపడతా మావాఁ అని పలకరిచ్చేటి యేణుగోడూ ఇద్దురూ కదిలాడతుండారు నా కళ్ల ముందర.
ఎప్పుడొచ్చినాడో ఆడకి, నాకు ఎదాళంగా నిల్సుకోని కళ్లు పెద్దంగా జేస్కోని యాంటికినా యాడస్తుండావా నో ఇజ్జన్నా అంటా అడగతుండాడు ఏడుగొండ్లు…
*

సొలోమోన్ విజయ్

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి కత ఇడ్సినాడు ఇజియా.పల్లెల్లో ఈ ఆశారాలు
  మారాలంటే ఎవురు పూనుకోవాలి.ఆగమయ్యే బతుకులకు అంతే లేదా..?
  ఒక చేదు మాత్ర ఈ కత.

  • ఔను, ఆగమయ్యేటి బతుకులకి అంతే లేదునా..

 • “మీబోటి సదువుకున్నోళ్లు పల్లెల్లో గెట్టెంగా నిలబడితే మారొచ్చు ఇట్టాటివన్నీ.” ఆ రోజుకోసరం ఎయిటింగ్ న్నా….

  • ఆరోజు వొస్తాద్యా ?! రాదనుకుంటా..

 • విజయ్ గారు ఒక వంద చెమర్చిన కళ్ళు ఇంకో వెయ్యి ఆర్థ్రమయిన హృదయాలు మీ కథకి. ఎక్కడ చూసినా చదివినా మరీ ఏదో ఒక భాషలో c గ్రేడ్ వెబ్ సిరీస్ చూసి లేదా you tube thumbnail base తీసుకొని రాసే కథలే ఇంక ఈ జన్మకి మనసున్న కథ అంటూ చదవనేమో అని కళ్ళ కి మాస్కులు కట్టుకొని కథల ప్రపంచం లో ధృతరాష్ట్రుడి అవతారం కట్టిన నాకు …అసలు ముందు ఆ స్లాంగ్ ,ఆ originality, కంటెంట్ చెప్పగలిగిన సామర్థ్యం జస్ట్ సింప్లీ ఫుల్ ఆన్ ఫిదా అంతే.

  ఇంట్లో పెద్దవాళ్ల కోసం ప్రింట్ తీసి చదివించాను. ఒకటి అరా తెలిసిన వాళ్లకి చదవండి మొర్రో అని దండోరా వేసాను .. Totally overwhelmed to such a wonderful gut wrenching work . చాలా కాజ్యువల్ గా ఇలాంటివి ఎన్నో జరిగిపోతూ ఉంటాయి , ఎక్కడో ఒక చోట అది అగ్ని లా మారుతుంది..ఈలోపే అన్ని వైపులా గుమి గుడినా అన్ని వర్గాలు దానికంత ఆక్సిజన్ దొరక్కుండా జాగ్రత్త పడుతూ మంట పెద్దదవుతూ నేలలు ఊర్లు దాటి రాజ్యాలకు అంటకుండా ఎవరి పిడికెడు మట్టి వాళ్ళు వేస్తూ ఉంటామ్. విషాద సాహిత్యంలో ఎంత ఎక్కువ ఇలాంటి కథలు వస్తే అంత ఎక్కువగా మీ లాంటి జెన్యూన్ రచయితలు ఒక హిస్టోరియన్ లా ముందు తరాలకి వాళ్ళ అసలు సిసలు రూట్స్ ఏమిటి అందివ్వగలరు.

  ఒకే ఒక చిన్న కోరిక , దయచేసి అచ్చోసిన అక్షరాలు లా పుస్తకాలు అచ్చేయడం కోసం ఒకటికి వంద కవిత్వాలు ..ఒకటికి పది కథలు అంటూ మొదటి పేజ్ కి వెయ్యి పేజ్ కి తేడా ఏమీ లేకుండా ఎడా పెడ రాసేసి జనం మీద వదలడం కాకుండా ఇదుగో మాస్టర్ పీస్ లా ఒకటి ..అర ..రాసినా ఇంకో 5 ఏళ్ల తర్వాత ( అప్పటికి మీ రైటింగ్ ఫేజ్ ఇంకా ముగియకపోతే ) మళ్ళీ మీ కథ చదివినా ఈ రైటర్ రచన కోసమే పుట్టాడు అన్న ఫీలింగ్ నాలాంటి రీడర్స్ కి మిగిలెలా రాయండి please 🥺. Which you can actually do. Looking forward to read more and more from you.

  నిశీధి .

  • మప్పిదాలు అన్నా..
   రెండేళ్ల కిందట రాసినా ఇదే సారంగలో ‘లింగ’ అనేటి కత. మళ్లీ ఇప్పటికి రాయగలిగినా…

 • కడుపూ గుండె మెలితిరిగి పోయాయి కథ చదివాక. ఎట్టా రాసినావో ఈ కథని విజయా?

  • ఆ పసి ఆలూమగలు ఇద్దురూ నాకు దగ్గిర మణుసులు. ఏడుపు తప్ప ఏం మిగల్లానా. గుండికాయి ఉగ్గబట్టుకోని రాసిన కత ఇది..

 • మాటల్లేవ్ , ఏం చెప్పాలి కథే అయ్యుంటుంది అని సర్ది చెప్పుకోడం తప్ప.

 • నమ్మడానికి ఇష్టపడని కథ.
  నమ్మితే గాయపడాలి.సిగ్గుతో కుమిలిపోవాలి.
  ముఖ్యంగా ఆ కులాల్లో కుటుంబల్లో సామాజికంగా ఎదిగి “ఆ ఆశారాలు” పట్టనట్టుండే ( అవసలే లేనట్టు ) సమూహాలుఎప్పుడోఒకప్పుడైనా సమాధానం చెప్పాల్సి రావాలి.
  ఏం మారింది ,విజయ్ గారు ?
  నా మటుకు , లోలోపాల సలుపుతున్న ముల్లుని కదిలించారు..దుఖం కారుతోంది.
  1960 ల్లో..ఎలుపోడు, దగదర్తి గ్రామాల్లో కులాచారాలు, శాస్త్రాలు చేసిన గాయం.
  రెండో కానుపుకి పుట్టింటికెళ్లి కడుపుతో చనిపోయినభార్యని చిట్టడివిలో చెట్టుకి కట్టేసి పారిపోయిన ఆ భర్త దుఖం ఎలాటిదో? ఎంతకాలానికి చల్లారిందో ఎవరు చెప్తారు?
  ఎప్పుడూ నవ్వుమొహంతో ఉత్తరాలు మనిషి మనిషికి చేర్చే ఆ పోస్ట్ మాన్ (మస్తాన్ బాబు) ఎంతకాలం ఎక్కడెక్కడ తిరిగాడో ..
  తిరిగి ఉద్యోగంలో చేరినా ఆయన ముఖం మీద నవ్వుని చూడలేదు. సరియైన మాట వినలేదు.
  ప్రతిరాత్రి ఇంచుమించుగా తన నిస్సహాయతకి తనని తను తిట్టుకోవడం, కన్నీళ్ళు కార్చడం నాకు తెలుసు.

  విజయ్ గారు, మీరిలాగే నిజాయితీ తో నేలపొరల్లోని శిలాజాలని తవ్వి తీయాలని గుండె పొరల్లోని కథలు రాయాలని, ఆ కథలు మేము నిజాయితీగా చదవాలనీ — ధన్యవాదాలతో

  • ఎక్కడైనా ఇవే మరుగునున్న కథలు, వ్యథలూ సర్… మీరు రాసింది చదువుతోంటే గుండె పిండుతోంది.

 • మా తొమ్ముడు ఇజియ చానా మంచి కత రాసినాడు. కడుపుతో ఉన్న ఆడ మనిషి సచ్చిపోతే, ఆ కడుపులో ఉండే బిడ్డని యెరుఁజేసి సెపాన్ని పుటం చేయాలి. లాకుంటే అరిష్టం అనే దురాచారాన్ని నేను కూడా విని ఉండినా. తొమ్ముడు రాసిన కత చదివి కన్నీళ్లు కదా వొచ్చింది.

 • గుండె కింద కండను లాగినట్టు అయ్యింది. నీ కథలన్నీ అలాగే అనిపిస్తాయేమో నాకు. ఈ దురాచారాలన్నీ అంతమయ్యే రోజు ఎప్పుడొస్తుందో..

 • ఇలాంటి యాస బాగా రాసేవారిలో విజయ్ ఒకడు.. కథనం చాలా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు