ఉర్వి

1

గ్ని నిట్టూరుస్తున్న గ్రీష్మసముద్రం. తళతళ మెరుస్తూ ఎగిసిపడుతూ ఎండ అలలు భూమిని ముంచెత్తుతున్నాయి. భూమ్యాకాశాలు తల్లడిల్లిపోతున్న వేసవి ఉప్పెన లోకం తెల్లగా ఊహించుకుపోతోంది. సరస్సుల నీలి చర్మాలు ఎండి, అంటుకుని ఆవిరైపోయాయి. కన్నీటి చారికల్లా ఎండిపోయాయి సెలయేళ్లు. ఎండ సముద్రంలో మామిడితోటలు మాత్రం పచ్చదీవుల్లా తేలుతున్నాయి. గ్రీష్మ తాపాన్ని పీల్చుకుని తోటలు పండేయి. చిన్న చిన్ని తాటాకు పందిళ్ల కిందా, చెట్ల కింద గంపల్లో, రహస్య మాధుర్యం నింపుకుని పెళ్లిపీటల మీద కన్యల్లా ఒదిగిపోయి కూచున్నాయి మామిడిపళ్లు. సంధ్యా సమయం, దూరపు కొండలమీది అడవులు చలించి మూర్ఛిల్లిన పట్టణం మీదికి చల్లటి గాలుల్ని విడుదల చేశాయి.

ఉర్వి తోటలో పచ్చిక మీద పడుకుని ఉంది. తోట గోడ చుట్టూ చెట్లూ, తోట మధ్యలో చిన్న చెట్లూ, పూల పొదలూ ఆమెని ఎండ ఎడారి నుంచి వేరు చేశాయి. దరిదాపు నగ్నంగా ఉన్న వీపుని పచ్చిక చల్లబరుస్తోంది. కళ్లు ముసుకుందామె. కొంచెం కుంకుమ కలిసిన ఆమె బంగారు దేహం మీద పల్చటి ఊపిరి వంటి చెమటపొర పరుచుకుంది. నీలంరంగు చీర శరీరం మీద చిత్రించినట్టుండి ఆమె సముద్రం విడిచి వెళ్లిన అలవలె ఉంది. ఎక్కడెక్కడో నదుల్లో, సెలయేళ్లలో, సరస్సుల్లో చేపలా స్నానిస్తోందామె. ఒడ్డున చెట్ల నీడలు పడ్డ కాలవల్లో, పడవలో పడుకుని గాలికి సాగుతోందామె. పిల్లగాలి కెరటాలు హాయిగా ముఖం మీదా, పొట్టమీదా అతని పెదాల్లా మెత్తగా సంచరిస్తున్నాయి. కాసేపటికి ఎప్పుడో కళ్లు తెరిచిందామె. ఉమ్మెత్తపూల తోటలా అంతటా వెన్నెల వీస్తోంది. ఒడ్డు తగిలి ఆగిపోయింది పడవ. నది మెరుస్తోంది.

”అమ్మా, చీకటైంది లేవరా?”

కుదిపినట్టు మేలుకొంది ఉర్వి. నిజమే, చీకటవుతోంది. మెల్లిగా లేచి కూచుందామె. వీపుకీ ఆమె బుగ్గకీ ఒకటి రెండు గడ్డిపరకలు ఉండిపోయాయి.

”రండి” చెయ్యి అందించిందామె. ఉర్వి చెయ్యి అందుకుని లేచి నిలబడింది. మెట్లెక్కి ఇద్దరూ పైకి వెళ్ళేరు. లోపల దీపాలు వెలుగుతున్నాయి. కిటికీలన్నీ తెరిచి ఉన్నాయి. పల్చటి సుగంధ పరిమళం ఇల్లంతా వ్యాపించింది. అద్దం ముందు కూచుంది ఉర్వి. కళ్లు పెద్దవి చేసి తన ముఖం చూసుకుంటోందామె.

”తల దువ్వనా?”

”ఒద్దులే. నే దువ్వుకుంటాను” అంటూ ఆమె దువ్వెన తీసుకుని జుట్టుముడి విప్పుకుని తీరిగ్గా దువ్వుకోవడం మొదలుపెట్టింది. అద్దం పక్కన బల్లమీద రెండు పళ్ళేలలో మల్లెపూలు, సన్నజాజులు పరిమళిస్తున్నాయి. గది మధ్యలో పెద్ద మంచం మీద నీలం పూల దుప్పటీ పరచి ఉంది. దువ్వుకుంటున్నంతసేపూ ఆమె జుట్టు ఒక అస్పష్ట పరిమళాన్ని విడుస్తూనే ఉంది. చిక్కటి జుత్తు పట్టుకుని కొప్పు చుట్టుకుందామె. రెండు పొడవాటి వెండి సూదులు కొప్పులో గుచ్చుకుని లేచింది ఉర్వి. ఒకసారి ఒళ్లు విరుచుకుని మెల్లిగా ఒంటిమీద బట్టల్ని విడుస్తూ అద్దంలో చూసుకుందామె. రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని చూసుకుంటూ నవ్వుకుందామె. ఈ సౌందర్యం ఎవరిది? దీనికీ తనకీ సంబంధం ఏముంది? ఏ ఒక్క చిన్న గడ్డిపువ్వుకంటే గొప్పది ఈ అందం? గడ్డిపూల మధ్య నగ్నంగా, పదార్థంలా పడుకోవాలనుంటుంది తనకి. నదీ తీరపు మెత్తని మట్టిలో పూలచెట్టుగా మొలవాలని ఉంటుంది. ఎర్రటి మోదుగుపూల కొమ్మగా పుట్టాలని కోరుకుంటుంది. సారవంతమైన ఈ శరీరంలోంచి తను నిద్రలో ఉండగా పంటపొలం విస్తరించాలి. తనవేపు చూసుకుంటూ ఉండిపోయింది ఉర్వి. బయట నిశ్శబ్దంగా లేత వెన్నెల పరుచుకుంది. అతను ఏ క్షణమైనా వస్తాడు.

ఆమె ఒంటిమీద చల్లటి నీళ్లు ధార కడుతున్నాయి. మధ్యాహ్నం చేతులకి రాసుకున్న గంధం కరిగిపోయింది. స్నానం ఇష్టం ఆమెకి. తనివి తీరని స్నానం. ఎన్ని నదుల్ని పోసుకున్నా సరిపోదు. మంచిగంధం వాసన వల్ల గంధం సెలయేర్లో స్నానిస్తున్నట్టుంది. భూమి మీద పడ్డ వర్షంలా ఉర్వి శరీరం చన్నీటి ధారల కింద చల్లబడ్డం లేదు. కొండలు, లోయలు, ఎండుతూన్న గడ్డి భూములు- నేల చర్మం కాలి కమిలిపోతోంది.

గది దీపం వెలుగులో నిండిపోయింది. ఒంటిమీద మెరుస్తున్న నీటి పొరల్ని మృదువుగా తొలగించుకున్నదామె. తెల్లపూలు కుట్టిన గోధుమరంగు చీర కట్టుకుంది ఉర్వి. అద్దంలో ఒకసారి చూసుకుని కిటికీ దగ్గిరికి వెళ్లి నుంచుందామె. బయట వేసవి వెన్నెల కురుస్తోంది. కొప్పు చుట్టూ పెట్టుకున్న మల్లెచెండు పరిమళం, వెన్నెలజల్లు ఆమెని కొంత శాంతపరిచాయి. కళ్లు మూసుకుని ఎంతసేపు అలా నిలబడిపోయిందో, ఒక పరిచితమైన దేహగంధం సోకగానే కళ్లు విప్పింది ఉర్వి. వెనక్కి తిరిగే లోపలే అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది. నవ్వుతూ వెనక్కి తిరిగిందామె.

”నువ్వొచ్చేవని తెలుసు నాకు”

”ఎలా తెలుసు?”

”నీ అడుగులు వినబడతాయి నాకు. నీ శరీరం సోకుతుంది నాకు. నా ఒళ్లు నిన్ను పోల్చుకుంటుంది. నీ పాద స్పర్శ తెలుసు నాకు.”

”దినమంతా నన్ను నీ పరిమళం ఆవహించి ఉంటుంది. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నా చుట్టూ ఏ ఇతర సుగంధాలున్నా దుర్గంధాలున్నా నీ దేహగంధం మాత్రమే నాలో ప్రవేశిస్తుంది. ఒక ఉన్మత్తస్థితి కల్పిస్తుంది. నిత్యం జరుగుతూంటుంది ఇది. నేను నిరంతరం నిన్ను శ్వాసిస్తూంటాను.”

అతనామెను దగ్గిరికి తీసుకున్నాడు. ‘చెట్టు లతను చుట్టుకున్నట్టు’- అనుకున్నదామె. ఆమెని గాఢంగా ఆఘ్రాణిస్తూ తన్మయత్వంతో కళ్లు మూసుకున్నాడతను. మెల్లిగా అతన్ని విడిపించుకుంటూ నవ్విందామె. మంచం మీద కూచోపెట్టి పళ్ళెంలో నేరేడుపళ్లు తెచ్చి అతని ముందు పెట్టింది ఉర్వి. దీపం వెలుగులో నల్లగా మిలమిల మంటున్నాయి.

”తీసుకో, తియ్యగా ఉంటాయి.”

”నాకు తెలుసు. నీ చెయ్యి తాకడం వల్ల, నీ చూపు పడ్డం వల్ల తియ్యగా ఉంటాయి. మాధుర్యం నీ జీవలక్షణం. నీకు తెలియదా?”

”తెలీదు. నాకు తెలియడంతో ప్రమేయం లేదు”

అతడు రెండు పళ్లు తిన్నాడు. నీలపు కండ మెల్లిగా నములుతూ అన్నాడు, ”నువ్వూ తిను.”

”ఇవి నీకోసం”

”కానీ ఇలా తినడం నాకిష్టం లేదు. నువ్వు తిను ముందు.” పండుతీసి ఆమె నోటి కందించాడు. నాలుగైదు పళ్లు తినగానే ఆమె తియ్యబడిపోయి నోటికి పళ్ల రంగు పట్టింది.

”నువ్వు తినవా?”

”ఇప్పుడే.”

ఆమె ఒళ్ళోంచి అతను పళ్ళెం తీసి దూరంగా పెట్టి రెండు చేతులతో ఆమె ముఖాన్ని దగ్గిరికి తీసుకుని ఆమె పెదాల్ని తన పెదాలతో తెరిచాడతను. ఉర్వి పెదాలు, నాలు దాచుకున్న నేరేడు తీపి అతని తనివితీరా పీల్చుకున్నాడు. ఆమె ఆయాసంతో తల వెనక్కి వాల్చింది.

”ఎన్ని పళ్లు తిన్నాను?”

ఆమె నవ్వుతూ వెనక్కి వాలి పడుకుంది. ఆమె నలాగే కళ్లతో చప్పరిస్తూ ఒంగి ఆమె వక్షం మీద తలపెట్టుకుని అన్నాడు.

”వేసవిలో చెట్టు నీడలా ఉంటుంది. ఇక్కడింత ప్రశాంతంగా ఎలా ఉంటుంది?”

”నాకు తెలీదు. ఈ రహస్యాలన్నీ నీకే తెలియాలి.”

అతను లేచి కూచుని విరుగుడుచేవ పందిరి మీద నీలం రంగు పల్చటి తెరలని కిందికి లాగేడు. నీలపు తెరల్లోంచి పడుతున్న వెలుతురులో మంచం సముద్రగర్భంలా ఉంది.

”ఉర్వీ నిన్ను తెలుసుకోవాలని ఉంది. ఎన్నిసార్లు అడగను?”

”ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నావు. నా శరీరం నాకంటే ఎక్కువ నీకే తెలుసు.”

”గొప్ప అనుభవం తప్ప తెలియడం లేదు.”

”నీ స్థితి. నీ అనుభవం నీకు తెలిసినప్పుడు తెలియని రహస్యం తెలుసుకోవడం దేనికి?”

”నీ సౌందర్య రహస్యం తెలియాలి. ఎందుకో తెలీదు.”

”ఎందుకు తెలుసుకోవాలో తెలియనప్పుడు, తెలుసుకుని ఏం చేయాలో తోచనప్పుడు ఈ చింత ఎందుకు?”

”నీ రహస్యం నన్ను బాధిస్తోంది.”

”అదంతా నువ్వు భ్రమించిన రహస్యం.”

 

అతను ఏమీ అనలేదు గానీ తల అడ్డంగా ఊపేడు విశాలమైన ఆమె కళ్లలోకి చూస్తూ దరిదాపు చేష్టలుడిగిన స్థితిలో, అనేకసార్లు గతంలో కలిగిన అనుభవమే ఇప్పుడూ కలిగిన మనసులో ఉలిక్కిపడ్డాడతను. చటుక్కున ఆమె మీదకి జరిగి ఆమె పెదాలను గాఢంగా చుంబించాడు. కొన్నిక్షణాల తరువాత తేరుకుని యధాస్థితికి వచ్చి నవ్వేడతను. ఎందు కనిపిస్తుంది? ఇంత సమీపంలో, ఆమె దగ్గిర విరబూసిన ఏదో మహావృక్షం కింద నుంచున్న భావన, తనకే అంతుపట్టని ఒకింత భయం? ఉర్వి అతని జుట్టుని వేళ్లతో సవరిస్తోంది. తన సర్వశక్తుల్నీ, సర్వేంద్రియాల్నీ, ఉద్వేగాలనీ, తన అస్తిత్వాన్నీ ఆమె మునివేళ్లతో సవరిస్తూ కలవరపెడుతోంది. జుట్టులోంచి ఆమె చేతిని లాక్కున్నాడతను. ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు.

”నువ్వెలా చూస్తున్నావో తెలుసా?”

చూపు మరల్చకుండా తల అడ్డంగా ఊపిందామె.

”ఏడుస్తున్న పిల్లవాణ్ని చూస్తున్నట్టు.”

మువ్వలు గాలికి కదిలినట్టు నవ్విందామె. అతనూ నవ్వుతూ ఆమెనే చూస్తూ ఒంటిమీద బట్టల్ని విప్పుకుంటున్నాడు. దేవదారు కొమ్మలాంటి అతని భుజాలను చేత్తో నిమరిందామె. ఒంగి ఆమెను వివస్త్రను చేశాడు. ఆమె నలాగే చూస్తూ పెదాలతో ఒత్తుగా ఆమె శరీరాన్ని పరామర్శిస్తున్నాడతను. కళ్లు, బుగ్గలు, పెదాలు, చెవితమ్మి, మెడ, బాహుమూలాలు, ఆమె చూచుకాలు, ఆస్వాదిస్తూ అడిగేడు.

”ఉర్వీ, పండిన ఈతపళ్లలా ఈ రుచి ఎలా సాధ్యం?”

”తెలీదు.”

అతని పెదాలు కల్పిస్తున్న క్లేశానికి ఉర్వి శరీరం అక్కడక్కడ కందిపోతోంది. ఆమె నడుము మెత్తటి ముడతలను పలకరిస్తూ అతను నాభిచుట్టూ నాలికతో సున్నాచుట్టి అన్నాడు.

”పొగడపూలు, పొగడపళ్లు నీ పొట్టలో దాచుకున్నావా? ఇంతటి కమ్మదనం ఎట్లా వస్తుంది?”

”ఏమో.”

”ఉర్వీ, నీ శరీరంలో ఇన్ని పూల, పండ్ల రుచులు ఎలా చేరేయి. నాకు తెలీని అనేక వాసనలు, నిత్యం వెలువడే తడిసిన లేత పచ్చిక వాసన నేను ఏ స్త్రీలోనూ చూడలేదు. ఈ మర్మం ఏమిటో చెప్పు.”

”జీవధారణ పరిమళం.”

”అంటే?”

”అంతే అది.”

ఆమెని కాళ్లతో బంధించి బరువుగా ఆమె మీదికి చేరి అన్నాడతను.

”నేనింక భరించలేను ఉర్వీ. ఎంతకాలం నుంచి అడుగుతున్నాను? నీ సౌందర్య రహస్యం ఏమిటి?”

”తెలీదు. నీకు తెలిస్తే చెప్పు. ఎప్పుడో నీ రహస్యంలో కూరుకుపోతావు.”

నవ్వేడతను

”అసంభవం. ఉర్వీ, నువ్వు గర్భం ధిరిస్తే పళ్లూ, పూలూ పుడతాయి.”

ఆమె చిరునవ్వింది. కాసేపటికి ఇద్దరూ అలసిపోయారు. వేగంగా పరుగెత్తిన గుర్రంమీద కూచుని దిగినట్టుందామెకి. పక్కకి ఒత్తిగిలి ఆమెను చూస్తూండిపోయాడతను. ఎంతకాలం నుంచి చూసినాఏదో రహస్యం తనకి అర్థం కావడం లేదు. ఆమె జుట్టు చెదిరిపోయి పూలతోపాటు దిండుమీద పరుచుకుంది. నిద్రా, మెలకువా? అతని చూపులకి కళ్లు విప్పింది.

”నా రహస్యం గురించి చూస్తున్నావా?”

అవునంటూ మెల్లిగా తల ఊపేడతను. అతని కళ్లలో తీవ్రమైన అశాంతి కనిపించిందామెకి. ఆ సుఖనిద్రలో కూడా ఆమెకి ఏదో పెద్ద శబ్దాలూ, మహావృక్షాలు విరిగిపడుతోన్న చప్పుడూ వినబడుతూనే ఉంది.

 

***

 

ఇప్పుడింక విరగబూసిన ఎర్రతురాయి గుత్తులు ఎండకి అందాన్నిస్తున్నాయి. ఉర్వి పచ్చికలో పడుకుంది. సంధ్య వాటారుతుండగా ఆ దినం వేసవి కొంగు వంటి వసంతం ఆమె మీదుగా పరుచుకుంది. ఇకనుంచీ తన మనసుకి చెట్లమీంచి చినుకుల సంగీతం వెలువడుతుంటుందని తెలుసామెకి. ఒత్తిగిలి దీర్ఘంగా నిట్టూర్చిందామె. వేసవి చివరి నిట్టూర్పు.

ఎక్కడ నుంచి వచ్చిందో వెడల్పాటి ఎర్రబాదం ఆకు ఆమె మీద పడింది.

 

2

ఒక సాయంత్రం కిటికీ దగ్గిర నుంచుని ఆకాశం వేపు చూస్తోంది ఉర్వి. నేరేడు గుట్టలవంటి మేఘాలు బరువుగా కదుల్తున్నాయి. వాటిని ఒరుసుకుంటూ చల్లటిగాలి ఆమె మీద వాలింది. ఆకారాలు మారుతూన్న మేఘాలు పురి విప్పుకున్న నెమళ్ల గుంపుల్లా మెల్లిగా నేలమీదికి దిగుతున్నట్టనిపించింది. ఉర్వి ఒళ్లు జలదరించింది. నెమళ్లన్నీ గాఢ తమకంలో ముక్తకంఠంతో క్రేంకారం చేసినట్లు ఉరిమింది. ఎక్కడనుంచో నేల తడిసిన పరిమళం సోకిన మరుక్షణం తోటలోకి పరుగెత్తింది ఉర్వి. చల్లటిగాలి చెట్లమీంచి ఆమెను చుట్టబెడుతోంది. టపటప చెట్ల చప్పట్లలో ఆమె కొత్త రుతువు లయ ధ్వనించింది. తెల్లని నీటిపళ్లలా జలజల. ఆమె చెట్ల కిందికి వెళ్లినిలుచుంది. చెట్లూ, వర్షం స్వపరుస్తూన్న రుతుగీతంలో ఉర్వి పులకరించింది. నెర్రెలుగా విచ్చిపోయి అలమటిస్తున్న వీర్యదాహార్తి ఉపశమించిన వగరు పరిమళం ఏదో సోకినట్టయిందామెకి. ఒక ఆదిమ మహోద్వేగంలో భూమి కంపించింది. ఎంతసేపు అలా ఉండిపోయిందో తెలియలేదు.

గోరువెచ్చటి నీటిలో సుగంధ ద్రవ్యాలు చల్లి ఉర్వి మళ్ళీ స్నానించింది. బయట వర్షానంతర నిశ్శబ్దం. లేత పసుపురంగు చీర కట్టుకుని తలకి సాంబ్రాణి ధూపం పెట్టుకుందామె. లేతాకుపచ్చ దుప్పటి మీద పడుకుని కళ్లు మూసుకుంది ఉర్వి. ఎక్కడో ఉరిమిన శబ్దం. పక్కకి ఒత్తిగిలి పిండాకారంలో పడుకుందామె.

”నాకోసం నిద్రా, మెళకువా?”

టప్పున కళ్లు విప్పిందామె. ఆమె పక్కనే పడుకుని మోచేతి మీద తలవాల్చి అడిగాడతను.

”ఎప్పుడొచ్చేవు?”

”కొంతసేపయింది. నవ్వుతుంటే మేలుకున్నా వనుకున్నాను.”

ఆమె జుట్టు తన ముఖం మీద పరుచుకుని ”నిద్రలో ఎంత అందంగా ఉన్నావు!” అన్నాడతను.

”అందానికి నిద్రా మెళకువ ఉండదు.”

”పూలు పెట్టుకోలేదేం?”

”సాంబ్రాణి పూలు ఇవాళ. వర్షం పడుతున్నప్పుడు బట్టలు వేసుకోవాలనిపించదు.”

”ఏం?”

”నగ్నంగా ఉంటేనే వర్షానికి గౌరవం.”

”సరే అయితే.”

ఆమె అభిప్రాయాన్ని ముందు గౌరవించి తదేకంగా చూస్తూ అడిగేడతను.

”ఉర్వీ నీ సౌందర్య రహస్యం చెప్పు ఇవాళ.”

”అందమైన స్త్రీలు తెలియదా నీకు?”

”తెలుసు. ఉర్వీ నీదొక గొప్ప మార్మిక సౌందర్యం. నీక్కూడా సంబంధించని సౌందర్యం. నీకు తల్లిదండ్రులవల్ల సంక్రమించని సౌందర్యం. నువ్వు మనిషి జన్మ ఎత్తిన అమృతపుష్పానివి. అందుకే నీ రహస్యం ఏమిటి? నన్ను నిత్యం వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఇది నా జీవన్మరణానికి సంబంధించిన సందేహం. నిజానికి నువ్వు స్త్రీవి కూడా కాదు.”

”మరింక రహస్యం ఏముంది?”

”ఉంది. అది నాకు తెలిసితీరాలి.”

అతను ఆమె నలాగే చూసి హఠాత్తుగా దగ్గిరికి లాక్కున్నాడు అంతే. ఆమె ఊహించలేని సుళ్లు తిరుగుతున్న ఒక కాంక్షాగ్రహంలో తడిసి, నలిగి, ముద్దయిపోయిందామె. కొన ఊపిరి వరకూ మధించిన సుఖం నిద్ర పుచ్చింది. ఆమెని అతుక్కుపోయి కళ్లు మూతపడుతుండగా గొణిగేడతను.

”చెప్పు. నేనెవరకీ చెప్పను.”

***

కొండల్ని కోస్తూ, భూమిని బద్దలు చేస్తూ బయట రాక్షసరౌంద్రంతో వర్షం విజృంభించింది. నదులు, వాగులు పొంగి తెగిపోయిన దారాలయిపోయాయి. అపార జలరాశి ఉధృత ప్రవాహమై తన మీంచి పారుతున్నట్టు కలగన్నది ఉర్వి. ఆమె కళ్లు తెరిచే ఉన్నాయి. పారదర్శకమైన గాజు ప్రవాహం వలె ఆమె మీంచి వెళ్లిపోతోంది. అందులో అనేక జలచరాలు కొట్టుకుపోతున్నాయి. ఒక పొడవాటి పాము ఆమెని చుట్టుకుంది. పాము కదలడంతో ఉలిక్కిపడి మెళకువ వచ్చిందామెకి. బోర్లాపడుకుని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడతను. జలస్థితిలోంచి రావడానికి కొన్ని క్షణాలు పట్టిందామెకి. మళ్ళీ ఆమె కనురెప్పలు భారంగా మూతబడుతున్నాయి. అతను బరువుగా వాయులీనంలా శ్వాసిస్తున్నాడు. పొట్టమీంచి అతని చెయ్యి కదిలింది. అతని వేళ్లు ఆమె నాభి నుంచి కిందికి చేరుకుంటున్నాయి. అతని వేళ్లు మృదువుగా స్పృశిస్తూండగా అతని పెదాలు కదిలేయి.

”చెప్పు.”

నిద్రలో ఆమె బోర్లా తిరిగి పడుకుంది. వర్షంలో ముడుచుకున్న బంగారు తాబేలు.

నాలుగు దినాల తరువాత వచ్చేడతను. గాఢ నిద్రలో లేచి వచ్చినట్టు అతని కళ్లు భారంగా ఉన్నాయి.

”నేను వెడుతున్నాను.”

”ఎక్కడికి?”

”నువ్వు దాస్తున్న రహస్యం తెలుసుకుంటాను.”

”ఎవర్ని అడుగుతావు!”

”వాళ్లు నీకు తెలీదు.”

ఆమె ఏమీ అనలేదు. అతని వేసే నిశ్చలంగా చూస్తూండిపోయింది. జలపాతం నిటారుగా మీదికి దూకినట్టు అంగలో ఆమెని సమీపించి ఆమె రక్తమాంసాలు తన శరీరంలోకి పీల్చుకుంటున్నట్టు బలంగా హత్తుకున్నాడతను.

3

ఆకాశం నిర్మలంగా ఉంది. వర్షాలు కొండ లవతలకి గాలిలో ఎక్కడికో వెళ్లిపోయాయి. వర్షంతోపాటు అతనూ కొన్ని దినాలు ఎక్కడికో వెళ్లిపోయాడు. మనసులో పెరిగిన చెదపుట్టలో అనేక ఆలోచనలు ఒకే ఒక ప్రశ్న అతన్ని వేధిస్తోంది. క్రమంగా అతను ఎవరితోనూ మాట్లాడ్డం మానేశాడు. రుచికరమైన అతని కిష్టమైనవేవీ రుచించడం లేదు, మద్యం తప్ప. అతను శుష్కించకపోయినా కళ్ల కింద నీడలతో, చంచలమైన చూపులతో, నడుస్తున్నప్పుడు ఎటు వెళ్లాలో నిర్ణయం పాదాలకే వదిలినట్టు కనబడుతున్నాడు. పగలంతా తోటల్లో, నదీతరంలో లేదా పడవలో పడుకునో కాలం గడుపుతున్నాడతను. ఒక చీకటి బిలంలోకి జారిపోయినట్టయింది. అతని జీవశక్తి అంతా ఉర్వి చిరునవ్వుతో ఉండిపోయింది.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రయాణించి ఒక గ్రామం చేరుకున్నాడతను. వెతుక్కుంటూ శివాలయం వెనక తోటకావల ఉన్న చిన్న పెంకుటింటి తలుపు తట్టేడు (”అమ్మవారే వారితో మాట్లాడతారు”). మఠం వేసుకుని కూచుని చిన్న హోమగుండం వెలిగించాడు వృద్ధుడు. కొంచెం నల్లగా తెల్లటి పెద్దకళ్లతో ఆగంతకుణ్ని మూడే ప్రశ్నలు వేశాడాయన. ఆయన తీక్షణమైన చూపులు శరీరానికి చిల్లులు పెడతాయి. మంటలో వేసిన సామాగ్రివల్ల గదంతా పల్చటి పొగ వ్యాపించింది. చాలాసేపు ఆయన కళ్లు మూసుకుని ఉండిపోయాడు. ఆయన ముఖం, శరీరం చెమటతో తడిసిపోయింది. మెల్లిగా కళ్లు తెరిచి అగ్నివేపు చూస్తూ తనతో చెప్పుకుంటున్నట్టుగా అన్నాడాయన.

”తెలియడం లేదు. నా శక్తి చాలదు. వెళ్లు. ఆమెనే అడుగు.”

శవప్రాయంగా ఎప్పుడో ఇల్లు చేరుకున్నాడతను. ‘అమ్మవారికి తెలియకపోవడం ఏమిటి?’ మర్నాటి రాత్రి నిద్ర లేచాడతను. మరికొన్ని దినాలు ఇల్లు కదల్లేదు. ఉర్విని చూడాలనిపిస్తోంది. కానీ ఓడిపోయి కాదు.

రాత్రిళ్లు బాగా చల్లబడిపోయాయి. మంచుకొండల్ని తొలుచుకుని చలిగాలులు పట్టణం మీది కొస్తున్నాయి.

”అడవిలో ఉంటారు వాళ్లు. వనవాసులు. వాళ్లకి గురువులు, దేవతలూ ఉంటారు. గురువులు దేవతలతో మాట్లాడుతుంటారు. అక్కడికి వెళ్లు.”

మిత్రుడి సూచన మేరకు అతను చీకటిపడేలోపు అడవిలోకి ప్రవేశించాడు. అడవి చీకట్లు వేరు. లోపల ఎక్కడో ఉన్న వనవాసుల ఇళ్లు చేరుకున్నాడు. మండుతోన్న దుంగల చుట్టూ కూచున్నారు. అతను ఉప్పూ, కొన్ని బట్టలూ వారి కందించాడు. చాలాసేపు మాటాడిన తరువాతగానీ వనవాసుల పెద్దకీ, గురువుకీ అర్థం కాలేదు. చివరికి గురువు అన్నాడు.

”రాత్రి అమ్మతో చెప్పుకుంటాను.”

ఆ మాట విని వాళ్లతో కల్లు సేవించి జింక మాంసం తిని పడుకున్నాడతను. గాలిలో గిరగిర వేగంగా తిరుగుతూ అంతే వేగంతో సముద్రగర్భంలోకి దూసుకుపోయినట్టు కలగన్నాడతను. ఉషోదయానికి ముందే అతనూ మరో ముగ్గురూ అడవిలోకి బయలుదేరారు. పెద్ద అతనికి కర్ర దివ్వె అందించి కొంతదూరం అతనితో నడిచిన తరువాత దారి చూపించి వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. దివ్వె వెలుగుతో నడుస్తూ అతను అడవి కడుపులో కదలాడుతున్న చిత్రమైన ప్రాణిలా ఉన్నాడు. కొంతదూరం నడిచిన తరువాత పెద్ద చెప్పినట్టే హఠాత్తుగా అతనికెదురుగా పెద్ద చెట్లకొమ్మలతో కట్టిన కుటీరం కనిపించింది. క్షణం ఆగి చూశాడతను. కుటీరం వెనక నుంచి నీరు పారుతున్న శబ్దం వినిపించింది. దివ్వె బయట గుచ్చి మెట్లెక్కి గుమ్మం దగ్గర ఆగిపోయాడతను. లోపల మట్టిదీపాలు వెలుగుతున్నాయి. బయటకంటే చల్లగా ఉండి ఆ దీపాలే చలికాగుతున్నట్టున్నాయి. గది వెనకాల గోడకి కిటికీ కనిపిస్తోంది. దీపాల వెలుగు కదులుతూండడంతో గదిలో వెలుగు కంటే నీడల తెరలే కదుల్తున్నాయి.

క్రమంగా అతని కళ్లు చీకటికి అలవాటుపడ్డాయి. కిటికీ ఇవతల రెండు మంచాల పొడవున్న వెదురు బద్దలతో చేసిన ఆసనం కనిపించింది. వెలుగు పడ్డప్పుడల్లా దానిమీద ఎవరో కూచున్నట్టు తెలుస్తోందతనికి. కొన్ని క్షణాలు కూచున్న ఆకారంవేపు తదేకంగా చూసిన తరువాత అతని గుండె ఝల్లుమంది. కదలడానికి అతని పాదాలు నిర్జీవంగా మట్టినేలకి అతుక్కుపోయాయి. రక్తప్రసారం ఆగిపోయినట్లయింది. అతని ఎదురుగుండా వెదురు ఆసనం మీద కూచున్నది స్త్రీమూర్తి. నడి నెత్తిన ఆ వెలుగులో కూడా నిగనిగలాడే పెద్ద కొప్పు. దాన్నిండా కొప్పులోనే పూసినట్టున్న రకరకాల పూలు. ఆమె శరీరం మీద బట్టలున్నాయో లేదో తెలియడం లేదతనికి. నడుము భాగం నుంచి కొప్పు వరకూ ఆమె చిన్న ఆలయ శిఖరంలా ఉంది. అనేక నదుల పుణ్యజలాలను పీల్చి ఘనరూపంలో మార్చుకున్నట్టు ఆమె ఉన్నత వక్షద్వయం లోకంలో పిల్లలందరి దాహార్తినీ తీర్చగలవు. ఆమె శరీరం మీద కనిపిస్తున్న ప్రతి అవయవం మామూలు మనిషి వనిపించడం లేదు. ఒంటినిండా ఒంట్లోంచి మొలిచినట్టున్న గడ్డివంటిదేదో, చిన్నచిన్న కొమ్మలు, ఏవో చిన్నపూలతో ఉన్న పూలతీగలు అతనికిప్పుడు బాగా కనిపిస్తున్నాయి. ఈమె దేవత అయితే అప్పుడే భూమిలోంచి వచ్చిందనుకోవాలి. భయం, దడ తగ్గి చేష్టలుడిగి నుంచున్న అతన్ని కట్టి పడవేసినవి ఆమె కళ్లు. అంత విశాలమైన కళ్లు మానవమాత్రులెవరికీ ఉండే అవకాశం లేదు. ఆ కళ్లు అతన్ని పొరలు పొరలుగా ఒలుస్తున్నాయి. (”ఆ యమ్మ మా కొండా, గుట్టా, చెట్టూ, ఏరూ, నేలా…”) ఆ నేత్రాల అనుమతివల్లే పిట్టలు ఎగరడం, నదులు పారడం, చెట్లు పెరగడం వంటి వన్నీ జరుగుతుంటాయనిపించిందతనికి. ఆమె చేత్తో, రమ్మని సంజ్ఞ జేసింది. అడుగు పడలేదతనికి. మరుక్షణం ఆమె నేమడగాలో మర్చిపోయాడతను. సన్నగా పొడవుగా ఉన్న పాము ఆమె భుజం మీంచి ఒళ్ళోకి జారింది. అతని గుండె తెగి కడుపులో పడింది. అసంకల్పింతగా అతని పాదాలు కదిలేయి. చటుక్కున వెనక్కి తిరిగి గుమ్మం దాటి మెట్లు దిగి పారిపోయినట్టు వెళ్లిపోయాడతను. సూర్యోదయ కోలాహలంతో అడవి నిండిపోయింది.

స్నానం మధ్యలో పారిపోతున్నట్టు అతను ఒగర్చుకుంటూ తడిసిపోయి బాణం నుంచి తప్పించుకుంటున్న జంతువులా అడవి దాటి బయటపడ్డాడు. సొమ్మసిల్లి పోయాడతను.

ఉర్వి అతని రాక కోసం ఎదురుచూస్తోంది. ఎక్కడికి ఇంతకాలం వెళ్లిపోయాడు? ఏదో రహస్యాన్ని వెంటాడుతూ మరీచికల వెంట వెళ్లి ఉంటాడనుకున్నదామె. శీతువు అప్పటికే నిశ్శబ్దంగా ప్రవేశించింది. ఒకదినం ఆమె తెలవారుతూండగా కిటికీ దగ్గిర బయటకు చూస్తోంది. పొడవాటి పొగమంచు ముద్ద చెట్ల మధ్య నుంచి తేలుతూ కనిపించింది. ఒళ్లు కప్పుకుని అభిసారిక శీతువు ఊళ్ళోకి వెళ్లిపోతోంది అనుకున్నదామె. ఒళ్లు జలదరించిందామెకి. ప్రాభాతశీతల పవనం కత్తివలె ఆమె శరీరంలోకి చొరబడింది. కొన్నిదినాల క్రితం ఉర్వి అతని గురించి తెలుసుకురమ్మని మనిషిని పంపించింది. లేదనీ, ఎక్కడికి వెళ్లాడో ఎప్పుడు తిరిగిరావచ్చునో తెలియదనీ తెలుసుకు వచ్చేడతను. మరికొన్ని దినాల తరువాత మళ్ళీ మనిషిని పంపించిందామె. ప్రయాణపు బడలికలో ఉన్నాడనీ, నీరసించి విశ్రాంతి తీసుకుంటున్నాడనీ తెలిసిందామెకి. ఆందోళన ఉపశమించిందామెకి. వస్తాడు త్వరలో. అలా అనుకున్నది మరికొన్ని దినాల వరకూ అతను కనిపించలేదు. శీతాకాలం రాగానే ఆమె ఎక్కువ ఎరుపురంగు చీరలు కట్టుకుంటుంది. చాలాసేపు వేడినీటిలో స్నానించుకొని గానీ బయటకురాదు. తెల్లటి ఆమె చర్మం కంది పొగలు విడుస్తూండగానే మబ్బుల్లోంచి జారినట్టుందామె.

ఉదయం నుంచీ ఆమెకి అతని అడుగుల చప్పుడు వినబడుతోంది. అతని సామీప్యం తెలుస్తోందామెకి. రాత్రి ఆమె స్నానించి ఎర్రమందారం చీర కట్టుకుని, జుట్టు సాంబ్రాణి పొదలా పరిమళిస్తూండగా అతనికోసం నిరీక్షణ ప్రారంభించింది. ఆమె ఊహించినట్టుగానే నిశ్శబ్దంగా ప్రవేశించాడతను. అతనివేపు తిరిగి నుంచుందామె. అతని ముఖం, కళ్లూ తనకి పరిచితమైనవి కావు. అతను ఏ కారణంచేతనో ఇటీవల మరణించి, ఒకటి రెండు దినాలు మళ్ళీ బతికి వెళ్లడానికి తిరిగి వచ్చినట్టున్నాడు. స్త్రీలని చూడగానే వాళ్లని చుట్టుముట్టే బలమైన ఆకర్షణ. మనిషిని చూడగానే దేవదారు చెట్టు స్ఫురించే ప్రత్యేక పుంస్త్వం అతని అస్తిత్వ లక్షణం. తనవేపు పుస్తుతం అస్పష్టమైన నిస్సహాయత, నిస్పృహలతో చూస్తున్న ఈ వ్యక్తి, తన స్త్రీత్వానికి పరవశం కల్పించి అనేక గాఢమోహపు రాత్రిళ్లు సృష్టించినవాడు కాదు. ఆమె నవ్వింది. ఆమెని చూసేకొద్దీ అతనిలో, కోల్పోయిన స్పృహ నుంచి మేలుకుంటున్నవాడి వలె జీవం పొడచూపుతోంది. ఆమె మనసులో చిన్న ఆందోళన ప్రవేశించింది. చేతులు చాపిందామె. పాలిండ్లని వెదుక్కునే పసివాడివలె ఆమె చేతుల్లోకి వాలిపోయాడతను. ఆమెని హత్తుకుపోయి కొంతసేపటికి జీవశక్తిని పొందేడతను.

అతను ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు.

”ఎక్కడికి వెళ్లేవు?”

”ఏదో పనిమీద.”

”పని అయిందా?”

”లేదు. అవదు.”

”బాధపడుతున్నావా?”

”ఊ”

”నేనున్నాను గదా! బాధపడకు.”

నవ్వేడతను. ఆమె మళ్ళీ అంది.

”బాధపడకు. నువ్వు నా దగ్గిరే ఉండు కొన్నాళ్లు.”

అతని ఒళ్లు కంపించింది. రక్తనాళాలు పొంగేయి. ‘నీ దగ్గిర ఉండి మరణించను’ అనుకున్నాడతను. ఆమె నడుం చుట్టూ ఉన్న అతని చెయ్యి బిగిసింది. అతని ఒళ్లు ఎర్రబడుతోంది. ఆమె తలని ఒంచి పెదాలను బలంగా అందుకున్నాడతను. ఆమె తేరుకుని లేచి వెళ్లి పళ్లుకోసి పళ్లెంలో పెట్టి తీసుకొచ్చింది. పండ్లు కోసే కత్తి చేతిలోకి తీసుకున్నాడతను. ఒక్కో ముక్కో అతని నోటి కందించింది ఉర్వి.

”చాలు.” ఆమె లేచి పళ్ళెం పెట్టి వచ్చింది.

”నువ్వు కొత్తగా చూస్తున్నావు. అన్నీ మర్చిపో. తెలియనిదాన్ని తెలుసుకోవడం జ్ఞానం అంటారు. లేనిదాన్ని తెలుసుకోవడం ఎలా సాధ్యం?”

అతను తల అడ్డంగా ఊపేడు. ఇప్పుడామె వేపు చూడ్డం లేదతను హఠాత్తుగా మోకాళ్ల మీద కూచుని తన ఒంటిమీద బట్టల్ని విప్పుకుని విసిరేశాడతను. ఆమె మీదికి ఒంగి ఎర్రమందారం చీరని ఒలిచి మంచం పక్కకి పడేశాడు. ఎరుపులోంచి విడివడి ఆమె నగ్నంగా మెరిసిపోతోంది. చీర గోధుమరంగు పాలరాతి నేలమీద పడి గడ్డ కట్టిన పల్చటి నెత్తుటి మడుగులా ఉంది. అతను మళ్ళీ చాలాసేపటివరకూ ఆమెకి ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వలేదు. ఆమె శరీరాకృతి పోగొట్టుకుని మాంసపు ముద్దయిపోయింది. అటువంటి తీవ్రమైన హింసాసుఖం ఆమెకి మొదటి అనుభవం. ఉర్వి రొప్పుతోంది. చలిలో కూడా చెమట పట్టిందతనికి. ఆమె మీద నుంచి పక్కకి జారి, ఊపిరి తీసుకుని తన ఎడమ వక్షం మీద ఆమె తల పెట్టుకున్నాడు. ఒత్తిగిలి అతనిచుట్టూ ఆమె చెయ్యి వేసింది. జుట్టు గాలికి చెదిరిపోయినట్టు విడిపోయి సాంబ్రాణి పరిమళం సోకుతోందతనికి.

”ఉర్వీ, ఆఖరిసారి. ఇప్పుడేనా చెప్పు.”

”ఏం చెప్పను?”

”నీ సౌందర్య రహస్యం.”

”సౌందర్యానికి అనుభవం తప్ప రహస్యం ఉండదు.”

”ఉంది. చెప్పు.”

అప్పటికే ఆమె నిద్ర కళ్లు మూతబడుతున్నాయి. తల అడ్డంగా ఊపింది. అతను మరోసారి అడిగాడు. మరోసారి కూడా అడిగాడు. దూరపు వాయులీనంలా ఊపిరి తీసుకుంటోందామె.

ఆపాదమస్తకం ఒణుకుతూ ఆమె ముఖం వేపు చూస్తూ చెయ్యి జాపి దిండు కింద నుంచి తెల్లటి పళ్లు కోసుకునే కత్తి తీశాడతను. అతని కళ్లు ఎర్రబడ్డాయి. ఆమె ముఖంలోకే చూస్తూ ఆమె తొడల మధ్య బలంగా రెండుసార్లు కత్తి దింపేడు. చిన్న అరుపుతో ఆమె కళ్లు తెరిచింది. కత్తి లాగి ఆమె నాభిలోకి బలంగా రెండుసార్లు కత్తి దింపేడతను. ఆమె కళ్లు విప్పారినాయి.

మరుక్షణంలో ఆమె నాభిలోంచి, తొడలలోంచి ఉధృతమైన రక్తప్రవాహం ఎగిసిపడింది. పెద్ద అలలై అతన్ని కిందికి నెట్టేసింది. రక్తసముద్రం కరిగి పొంగి బయటికి ఉరికింది. ఎర్రటి ఉప్పెన. అతను లేవగలిగిన స్థితిలో లేడు. ఉధృతమౌతున్న ప్రవాహంలో ములిగిపోతున్నాడతను. చిత్రమైన అలల శబ్దం ఆవరిస్తోందతన్ని. అతని కళ్లముందే అతన్ని ముంచెత్తుతున్న రక్తప్రవాహం కిటికీలోంచి బయటికి పడుతోంది.

చివరిసారి ప్రవాహంలో తన మీంచి ఏవో జలచరాలు, లుంగలు చుట్టుకున్న తీగలూ, మెరుస్తోన్న చేపలూ గుంపులుగా వెళ్లిపోవడం చూడగలిగేడతను. రక్తంలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవడం లీలగా తెలిసిందతనికి.

మంచం రక్త ప్రవాహంలో ములుగుతోంది. విశాలమైన పడకగది రక్త కాసారం వలె చలిస్తోంది.

ఆమె అంతరాంతరాల్లో ఎక్కడో, మహాశిలలు విస్ఫోటించినట్టూ, మహావృక్షాలు కూలుత్నుట్టూ, నేల బద్దలవుతున్నట్టూ, రాళ్లమీద మహాచక్రాల రొదలు, కూలుతున్న కట్టడాల ధ్వనులు వినిపించేయి.

*

ఛాయా ప్రచురిస్తున్న పతంజలి శాస్త్రి గారి “రామేశ్వరం కాకులు- ఇతర కథలు” పుస్తకం నుంచి…

Avatar

తల్లావజ్ఘల పతంజలి శాస్త్రి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఆస్ట్రేలియా మంటల్లోంచి , అంతరించిన వనాలమీదుగా , నిన్న నాశనమైన దిశ వరకూ –
  ఆ పైకి, శాక్తేయం వైపుకు ఈ కథ.

  అర్థం కాని దాన్ని తెలివి గలవాళ్ళు నియమించబోతారు, మూర్ఖులు ఛిద్రం చేస్తారు . బుద్ధిమంతులు తలవంచుతారు. ఆరాధకులు దానికి మెట్ల దారి వెతుక్కుంటారు. Tragedy అంతా ఈ విభాగాలు అంత విడివిడిగా ఉంటుండకపోవడమే.

  రహస్యమేమీలేదు , అతనినుంచి వేరేగా. అనుభవం తరువాత ఆ ఎడం తట్టిందా , మోకరిల్లటమే.

  అమ్మవారు చెప్పే ఉంటారు , ఉపాసకుడికి అర్థమై ఉండదు … ఆయన లో ఒక conditioning పనిచేసి.

  అభినందనలు.

 • అత్యంత అద్భుతమైన’ఉర్వి’ ని పురోగమనం పేరుతో పురుగై దొలిచే మానవాళి… PHYSICAL గా చెక్కేరు….
  గగుర్పొడిచేలా….నమస్సులు అండీ….

 • జీవధారణ పరిమళం,గురించి, ఎంతబాగా రాశారు!పాదాభివందనం లు💐అండీ.!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు