ఉరి పోసుకుంటున్న మానవత్వం

మరీ ముఖ్యంగా ఒక దిగులు ముఖం కనబడ్డప్పుడు ఆప్యాయంగా పలకరిద్దాం.

జీవితం ఎంత గొప్పదో, విలువైనదో తెలియక పోవచ్చు, ఆలోచించక పోవచ్చు కానీ సృష్టిలోని ప్రతి ప్రాణికి ప్రాణభయం వుంటుంది. మండే దీపం మీదకి సహజాత ఉద్రేకంతో లంఘించి రెక్కలు కాల్చుకొని నిర్జీవ కళేబరమై నేల రాలే పురుగుది కూడా మృత్యువాంఛ కాదు. అదో వెర్రి ఆకర్షణ! ఆహార అన్వేషణలో భాగంగా వేట కోసం తప్పితే అసలు నిజానికి ఏ జీవి అయినా ప్రాణ భయంతోనే మరో ప్రాణి మీద దాడి చేస్తుంది సాధారణంగా. పాము వంటి విష జంతువుల నుండి క్రూర ఫాక్షనిస్టు వరకు ప్రాణభయంతోనే గడుపుతుంటారు. ఎన్నో బాంబు దాడులు చేసి, మరెన్నో బాంబు దాడుల నుండి అతి కష్టం మీద ప్రాణాలతో బైడపడి, చివరికి ఒకానొక ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన “బకెట్ బాంబ్ ఫేం” కప్పట్రాళ్ళ వెంకటప్పయ్య నాయుడు కూడా తనకి ప్రాణాలు ఎంత ముఖ్యమైనవో, ఎంతటి ప్రాణ భయంతో బతికేవాడో చెప్పాడు. తాము బతికుండటం కోసమే మరొకరి ప్రాణాలు తీసే వాళ్ళు కోకొల్లలు. ప్రతి మనిషికీ ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ తెలియటం, ప్రాణాన్ని కాపాడుకోవటం బతకటంలో ఓ భాగం.

నిజానికి ప్రతి అనారోగ్యంలోనూ మృత్యు భయాన్ని పొందుతుంటారు మానవులు. చావు కత్తి నెత్తి మీద వేలాడతీసే భయంకర రోగాలతో పోరాడుతూ కూడా మృత్యువుని తప్పించుకోటానికో లేదా కనీసం వాయిదా వేయటానికి అనేక రకాల చికిత్సలు, ఔషధాలూ వాడుతుంటారు మనుషులు.   పొద్దున్నే నిద్ర లేవగానే “ఇంకా బతికున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు”చెప్పుకునే వాళ్ళు ఎందరో. ఈ భూమ్మీద ఎంతటి సుందర ముదనష్టపు జీవితాన్నాయినా పడుతూ లేస్తూ అయినా చాలీ చాలని బతుకుని గడపటానికి సిద్ధమౌతారే కానీ స్వర్గంలో అమృత పానీయాలతో, రంభ ఊర్వశీ మేనక మన్మధుడు వంటి వారితో ఎన్ని సౌఖ్యాలు ఆఫర్ చేసినా, కేవలం వాటి కోసమే ఇక్కడ ఇప్పటికిప్పుడు చావటానికి సన్నద్ధపడే మనుషులుండరు. హిట్లర్ కాలంలో నిర్వహించిన కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఎవరూ ఆత్మహత్యలకి ప్రయత్నించలేదు. వారందరూ తమ టర్న్ వచ్చేంత వరకు చావు కోసం ఎదురు చూసారు. నిజానికి జీవితంలో మనిషి జీవితం మీద ఎంత ప్రేమతో వుంటాడో చావు గురించి అంత వ్యతిరేకంగా వుంటాడు. జీవితంలో మరణమే అత్యంత పెద్ద విషాదంగా మనిషి భావిస్తుంటాడు.

మరి కొంతమంది ఎందుకు ఆత్మహత్య వైపు ఆలోచిస్తుంటారు? దేనికని అంత కర్కశంగా తమ జీవితానికి చెల్లు చీటి రాసేస్తున్నారు? ఎందుకెందుకని సమాజంతో, చుట్టూ వున్న మనుషులతో, సహచరులు, తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులతో సహా తమకి మానవ సంబంధాలు వున్నవారితో సర్దుకు పోలేని తనం, రాజీ పడలేనితనంతో ఆత్మహత్యని ఒక నిరసన ప్రకటనగా ఎంచుకుంటున్నారు?

ఇప్పుడేం జరుగుతున్నది?   ఆశాభంగం, కోపం, ఉద్రేకం ఇప్పుడు ఎక్కువగా ఆత్మ హననానికి దారి తీస్తున్నది. మనిషిప్పుడు చంపటానికే కాదు చావటానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు భగ్న ప్రేమికులు మాత్రమే ఆత్మహత్యల విషయంలో ప్రధమ స్థానంలో నిలిచేవారు. మరి ఇప్పుడో? వీడూ వాడు అని లేదు. ఆమె ఈమె అని లేదు. అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్ధులు, ఆశోపహతులు, కులం వల్ల అవమానితులు, జీవితం మీద లోతుగా దిగబడ్డ అప్పుల గునపాలు తట్టుకోలేని రైతులు మాత్రమే కాదు, అనుకున్నది సాధించలెని వాళ్ళే కాదు కలలు కన్న జీవితాన్ని సాఫల్యం చేసుకున్న వాళ్ళు, ఉన్నత శిఖరాలు అందుకున్న వాళ్ళు, సమాజంలో గుర్తింపు పొందిన ప్రముఖులు, అనన్య సామాన్య ప్రతిభతో విజయాలు సాధించిన వాళ్ళు, విజయ దరహాసంతో చిర్నవ్వు నవ్విన వాళ్ళు, తమ అపార ప్రతిభా సంపత్తితో ఎంతోమందిని ఉర్రూతలూగించిన వాళ్ళు, సమాజంలో ఏదో ఒక భాగాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, తాము మరణిస్తే తమ కుటుంబ సభ్యుల నుండి, వందలాది, వేలాది, లక్షలాది హృదయాలు నిర్ఘాతపోతాయని, కంట తడి పెడతాయని కూడా తెలిసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రచయితలు, క్రీడాకారులు, సినిమా/టీవీ నటులు, పారిశ్రామికవేత్తలు, చివరాఖరికి కర్కశ హృదయులుగా పేరొందిన రాజకీయ నాయకులు కూడా స్వీయ నిర్దాక్షిణ్యంతో వెళ్ళిపోతున్నారు. 2014 నుండి భారతదేశం ఆత్మహత్యల విషయంలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో కొనసాగుతున్నది. ప్రస్తుత్తం భారతదేశం ప్రపంచానికే ఆత్మహత్యల రాజధాని!

జీవితేఛ్ఛని హరించి బతకాలన్న స్ఫూర్తి నాశనమవటం ఎలా సాధ్యం? ఆత్మ హత్యలకి కారణాలనేకం. ఒక్కో ఆత్మహత్యకి ఒక్కో కారణం. కానీ నడిపించే సూత్రాలు మాత్రం దాదాపు ఒక్కటే.

****

ఆత్మహత్య చేసుకున్న వారికి వ్యక్తిగతంగా అనిపించే ఏవేవో కారణాలుండొచ్చు. అవి వారు ఒక్కోసారి లోకానికి ప్రకటిస్తూనే వెళ్ళిపోవచ్చు. లేదా తన చావుకి ఎవరూ బాధ్యులు కారని అందుకు నిజమైన “కారకులు”ని ఒడ్డున పడేసి మరీ పోవచ్చు. కొంతమంది అసలు ఏమీ చెప్పకుండానే తల వేలాడేసి పోవచ్చు. ఏది ఏమైతేనేం ప్రతి సూసైడ్ నోట్ మొదలు లేకుండా తుది మాత్రమే వున్న ఆత్మకథలో చివరి అధ్యాయం వంటిది. ఈ ప్రపంచానికి తామేదో సందేశం ఇవ్వాలని కాదు కానీ తమ మానసిక గాయాల్నో, దెబ్బ తిన్న హృదయాల్నో, సముదాయించుకోలేని దుఃఖాన్నో, చల్లార్చుకోలేని లోలోపలి నిప్పునో, పంచుకోలేని దిగులునో, ఎవరూ పట్టించుకోని ఫిర్యాదునో, అయిన వారో లేక పరాయి వారో చేసిన నిభాయించుకోలేని ద్రోహాన్నో తట్టుకోలేక తమ సూసైడ్ నోట్ లో తమకి చేతనైన పద్ధతిలో వ్యక్తీకరిస్తారు. కానీ బతికున్న సమాజం సూసైడ్ నోట్స్ ని ఏ మాత్రం పట్టించుకుంటుంది? మానవ సంబంధాలకి విలువనిస్తూ చనిపోతున్నందుకు అయినవాళ్ళకి సారీ చెబుతుంటారు. జాగ్రత్తలు కూడా చెబుతుంటారు. తమ వారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తుంటారు. ఛనిపోయే క్షణం వరకు సెంటిమెంట్లున్నాయంటే వారిని మనమే దూరం చేసుకుంటున్నట్లు.   అందుకే సూసైడ్ నోట్ ని తరచి తరచి చూడాలి. ఆత్మహత్యకి నిన్నా మొన్నా జరిగిన ఏదో సంఘటన ఎప్పటికీ నిజమైన కారణం కాదు. ఒక సంఘటనకే ఎవరూ జీవితాన్ని తిరస్కరించరు. ప్రతి ఆత్మహత్య వెనక ఒక దుఃఖ ప్రవాహం, భరించలేని హింస ఖచ్చితంగా వుండే వుంటుంది. అయితే ఒకరికి హింసగా, దుఃఖంగా అనిపించిన విషయం మరొకరికి అనిపించక పోవచ్చు. అది వ్యక్తుల దృష్టికోణం మీద ఆధారపడి వుంటుంది. “ఆత్మహత్య పిరికితనం, ధైర్యంగా పోరాడాలి, జీవితాన్ని ప్రేమించాలి, జీవితం భగవంతుడో ప్రకృతో ఇచ్చిన వరం కనుక అలా వృధా చేయకూడదు” అని మనం ఏదేదో అనేస్తుంటాం కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకే తెలుతుంది తమకి అదెంత ముఖ్యమైన విషయమో. అది ధైర్యాలకి, పిరికితనాలకీ సంబంధించిన విషయం కాదు. మృత్యువుని ఎదిరించటం, మృత్యువుని కౌగిలించుకోవటం…. రెండూ సమాన బలమైనవే.   బతకాలన్న మోటివేషన్ పోవటం జీవితాన్ని మృత్యువు కన్నా అర్ధరహితం చేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న మనిషి ప్రాణం పోయినప్పుడే మొదటిసారి చనిపోయినట్లు కాదు. అంతకుమునుపు అనేకమార్లు మానసికంగా చచ్చిపోయే వుంటారు. నిజానికి ఆత్మహత్య ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాదు. చాలా ఆలోచించి, పకడ్బందీగా, తెగింపుతో చేసే “కోల్డ్ బ్లడెడ్ సెల్ఫ్ మర్డర్”. అది చేయటానికి హత్య కన్నా ఎక్కువ తెగింపు వుండాలి.

బతకటం కష్టమయ్యో లేక బతకాలంటే ఇష్టం పోయో చేసుకునే ఆత్మహత్య గొప్పది కాదు కానీ అది సమాజానికో పెద్ద హెచ్చరిక. ఆ హెచ్చరికల్ని పట్టించుకోక పోతే ఏ పరిస్తితులు, ఏ కారణాల వల్ల ఆత్మహత్యలు జరిగాయో ఆ పరిస్తితులు, కారణాలు మరింత పెరిగిపోతూనే వుంటాయి.   అందుకే ఆత్మహత్య వ్యక్తిగత నిర్ణయమైనా దాని ఫలితం మాత్రం వ్యక్తిగతం కాదు. అది భావి సామాజిక హానికి సంకేతం.

****

ప్రపంచీకరణలో భాగంగా స్థానిక మార్కెట్లు దెబ్బ తినటం, వినిమయ సంస్కృతిలో మనిషి పరాయీకరణకి తీవ్రంగా గురి కావటం, నూతన ఆర్ధిక విధానాల వల్ల బతుకుతెరువులు అగమ్యగోచరం కావటం, పెరిగిపోతున్న సాంకేతికతలో మనిషి రాన్రాను మరింత ఏకాకిగా మిగిలిపోవటం, …..ఆత్మహత్యలకి కారణమంటే మనలో ఎంతమందిమి కన్విన్స్ కాగలం? అందుకే ఆత్మహత్యలు సామాజికం అనేది.

ఫురుగు మందులు, విత్తనాల అమ్మకం దార్ల నుండి ప్రభుత్వాల నిరాదరణ ఆర్ధిక విధానల వరకు రైతుల ఆత్మహత్యలకి కారణం అవుతున్నాయి.   బంగారం మార్కెట్లోని అనిశ్చత స్థితి స్వర్ణకారుల కుటుంబాలకు కుటుంబాల్నే బలి తీసుకుంటున్నాయి. చిన్న పారిశ్రామికవేత్తలు కూడా కోట్ల రూపాయిల అప్పుల్లో కూరుకుపోతున్నారు. పరువు సమస్య, ఉక్కిరిబిక్కిరి చేసే అప్పుల ఒత్తిడి అటువంటి వారిని చావు వైపు నెడుతున్నాయి.   ఇంకా చెప్పాలంటే మనిషిని మనిషి పట్టించుకోలేని వినిమయ సాంస్కృతిక వాతావరణంలో రిలేషన్షిప్ సమస్యలు సంఖ్యలో ఆత్మహత్యలకి ప్రధాన కారణం అవుతున్నాయి.   జాతీయ పెట్టుబడిదారులకు కూడా ఇది సానుకూల సమయం కాదనే సత్యం ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆత్మహత్య, ఒక ఫస్త్ క్లాస్ క్రికెట్ మాచ్లో 58 బంతుల్లోనే సెంచురీ బాదేసిన వి.బి. చంద్రశేఖర్ ఆత్మహత్య (క్రితం నెలలో) నిరూపిస్తున్నది.

మనిషికి నమ్మకం, మానసిక ఆసరా ఇవ్వగలిగే రాజకీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఉద్యమాల వాతావరణం ఇప్పుడు లేదు. ప్రతిదీ కృత్రిమంగా, డొల్లగా, వొట్టి బోలుగా, కేవలం శాబ్దికంగా తయారై చివరాఖరికి కుల, వర్గ, ఆర్ధిక, వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడ్డాక మనిషికి ఆశ, ఉద్వేగం చచ్చిపోతాయి. రాజకీయాలతో, తత్సంబంధిత ఆర్ధిక ప్రయోజనాలతో ముడిపడని ఆధ్యాత్మిక చింతన కూడా ఇప్పుడు లేదు. ఆధ్యాత్మికత ఆశ్రమాల మాఫియాలా తయారైంది. కేవలం సాంకేతికతే తప్ప సృజనాత్మకత. యాంత్రిక వినియోగమే ప్రధానమై పోయి మానవ వనరులు అప్రాధాన్యమై పోతున్న పాడు కాలమిది.   ఇది చింతనాశీలురకు కూడా గడ్డుకాలమే.

ఈ మధ్య పెరుగుతున్న మరో ధోరణి ఫామిలీ సూసైడ్స్. తాను పోతే తన బిడ్డల్నెవరు చూస్తారనే భయంతో బిడ్డలకి కూడా విషం ఇచ్చి చంపో, భావిలోకి తోసేసి తామూ చచ్చిపోయే తల్లిదండ్రులున్నారు. ఇది పతనమైపోతున్న మానవ సంబంధాలకు ఓ పరాకాష్ట ఉదాహరణ.

****

మనం సక్సెస్ కి కృత్రిమమైన విడ్డూరమైన కొలతలు, ప్రమాణాలు పెట్టుకుంటాం. వాటిని చేరుకోలేక పోతే జీవితం విఫలమై పోయినట్లే భావిస్తుంటాం. అందుకే కదూ రిజల్ట్స్ రోజు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకునేది? మన వ్యక్తిత్వ వికాస నిపుణులు అంత దివాలకోరు మేధావులు, నిజాయితీలేని ప్రొఫెషనల్స్ మరొకరుండరు. వాళ్ళు విజయాలకి సూత్రాలు అంటూ ముందు వరసలో అవకాశాలు పుష్కలంగా వున్న వాళ్ళ లక్షణాలు చెబుతారు. అవకాశాలు పెంచలేని పోటీ వాతావరణంలో విజేతలు కూడా ఆర్గనైజ్డ్, అడ్వాంటేజియస్ సెక్షన్స్ లో పుట్టడం ఒక ఫ్లూక్, కేవలం యాదృఛ్ఛికమే అన్న ఇంగితం వారికి తెలియదు. జీవితాన్ని వంద రకాలుగా ఉత్తమాభిరుచులతో మానవీయంగా పరిమళింప చేసుకోవటం గురించి చెప్పే వికాస నిపుణుడు ఎవడూ లేడు.   మన ప్రేమికులకి సినిమా ప్రేమలు తప్పితే జీవితాన్ని నిండారా ప్రేమించుకోవటం తెలియదు. అవతలి మనిషికి నచ్చకపోతే అదో వైఫల్యమైపోయి జీవితం మీద విరక్తి పెరిగి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొల్లలు. ఇందుకు మన సాంస్కృతిక వాతావరణ కాలుష్యం కారణం కాదూ? వీటికి తోడు మనిషి హృదయాన్ని భావోద్వేగంతో గుబాళింప చేసే ఆదర్శాలూ లేవు. అంతా కెరీరిజం, అర్జెస్, క్రషెస్ మాత్రమే వున్నాయి మనిషి ముందు.   సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ జీవితం సంకుచితం, తొక్కిసలాటగా మారిపోతున్నది. లైఫ్ ఆఫర్స్ నొ ఎగ్జైట్మెంట్.

****

మనం ఇప్పుడు కొత్త కొలమానాల్ని కనుగొనాలి. కృత్రిమత్వాన్ని వదిలేసి కనీసం కొన్ని ఔన్సుల నిజాయితీని మిగుల్చుకుందాం. కొన్ని మీటర్ల ఆదర్శాల్నైనా భావి తరాలకి అప్ప చెబుదాం. ఇంకొన్ని లీటర్ల ప్రేమని, మరికొన్ని కిలోల ప్రజాస్వామిక విలువల్ని వారసత్వంగా రాసి హాయిగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోదాం.

మరీ ముఖ్యంగా ఒక దిగులు ముఖం కనబడ్డప్పుడు ఆప్యాయంగా పలకరిద్దాం.

జీవితాన్ని ఒక సహజ సౌందర్య సృజనాత్మక ప్రక్రియగా సాధన చేద్దాం. కుంగుబాటుల్లేని మానవాళిని, సమాజాన్ని సృష్టిద్దాం.

*

 

అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ‘బతకాలన్న మోటివేషన్ పోవటం జీవితాన్ని మృత్యువు కన్నా అర్ధరహితం చేస్తుంది.’
  సత్యం. ఆత్మహత్యా నిర్ణయం ఎప్పుడోనే తీసుకుంటారు. అది అమలు చేయడంలోనే కొంత ముందూ వెనకా. చుట్టూ ఉన్నవారో…స్నేహితులో, బంధువుల్లోనో కొంత ఓదార్పును వెతుక్కుంటారు. కొన్నాళ్ళు దొరుకుతుంది…కుంగుబాటు తగ్గుతుంది. కానీ వాళ్ళ నిర్ణయంలో మార్పు రాదు. కొంతకాలం ఆత్మహత్యకు వాయిదా వేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే తమ చుట్టూ ఉన్న మనుషులనుంచి isolate ఐపోతారో ఆ క్షణం వాళ్ళ నిర్ణయం అమలు చేసేస్తారు. దాన్ని దగ్గిరవారు గమనించగలిగితే maximum నివారించగలరు.
  గొప్పగా రాశారు…. క్లిష్టమైన సమస్య గురించి.

 • …………..” హిట్లర్ కాలంలో నిర్వహించిన కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఎవరూ ఆత్మహత్యలకి ప్రయత్నించలేదు. వారందరూ తమ టర్న్ వచ్చేంత వరకు చావు కోసం ఎదురు చూసారు. “………….

  not true, it seems..

  https://www.ncbi.nlm.nih.gov/pubmed/16006400

  https://www.ncbi.nlm.nih.gov/pubmed/3541300

  • ధన్యవాదాలు. నాకెందుకో అలాంటి సమాచారం వచ్చింది సార్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు