ఉనికి కోసం ఒక ప్రజ చేస్తున్న యుద్ధం…

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల సాహిత్యాభిమానులకు, సామాజిక కార్యకర్తలకు స్కై అంటే ఎవరో పరిచయం అక్కర్లేదు. ముస్లింల పట్ల వ్యతిరేకంగా మత రాజకీయం నడిపే వారిని తిప్పికొట్టే వాళ్ళలో స్కై అందరికన్నా ముందుంటారు. అందుకు ఈమధ్య తీసుకొచ్చిన ‘దర్ద్’ కవితా సంకలనం మాత్రమే సాక్ష్యం కాదు; స్కై చేసే ప్రతీ ప్రయత్నమూ అలాంటిదే. ఒక పట్టాన విడిచిపెట్టే రకం కాదు. చివరి క్షణం దాకా పోరాడి తీరాలన్న దృక్పధం ఉన్న వ్యక్తి కనుకనే జల్జలా, అజా, అలావా లాంటి కవిత్వ సంకలనాలు, కథలు, వ్యాసాల పుస్తకాలు తీసుకొచ్చారు. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధ నేపధ్యంలో ‘నేల లేని దేశం’ అనే పుస్తకం తెచ్చారు. ఈ పనులన్నీ చూస్తే అతనిలో ఉన్న ‘బేచైనీ’ అర్థమవుతుంది.

ముస్లింల పట్ల ఈ సమాజం చూపిస్తున్న వివక్ష ఎంత దారుణంగా ఉందో స్కై ఎప్పుడూ శక్తివంచన లేకుండా బయటపెట్టారు. మన స్వతంత్ర భారతదేశంలో హిందూ మత వాద రాజకీయాలెంత పేట్రేగిపోతున్నాయో ఉదాహరణలు ఇవ్వనక్కర్లేదు. ఆరెస్సెస్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ కాలం నాటి నుండీ నేటి వరకూ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడం పట్ల ఎంతో నిబద్దంగా పని చేస్తోంది. రామాలయం కట్టడం అందులో రాముణ్ణి ప్రతిష్టించడాన్ని అట్టహసంగా ఉత్సవం చేయడం అందరూ కళ్ళారా చూశారు.

అంతే కాదు, ముస్లింల రిజర్వేషన్ ఉపసంహరిస్తాం, సీ ఏ ఏ అమలు చేస్తాం లాంటి నిర్దాక్షిణ్య ప్రకటనలతో ఈ దేశ మూలవాసులను మాటల్లో చెప్పలేని అభద్రతకి గురి చేస్తున్నారు. ఇవన్నీ ఒక సారాంశంగా చూడవలసిన విషయాలు. ఒక విశాలమైన అవగాహనలోంచి ఆలోచించవలసిన సందర్భం. ఒక జాగరూకత, కార్యోన్ముఖత అవసరమైన పరిస్తితి. ఈ లాంటి ప్రతి కాలంలో స్కై తను రాయగలిగింది రాశాడు. తన సహచరులతో రాయించాడు. వాటిని ఒక చోటకి చేర్చాడు. డబ్బు వీలు కుదిరినప్పుడు అచ్చు రూపంలో తెచ్చాడు. లేదనుకున్నప్పుడు ఈ-సంకలనం గా నన్నా రావల్సిన అత్యయక పరిస్తితిని నొక్కి పట్టి చెప్పాడు. ‘దర్ద్’ కవితా సంకలనాన్ని కూడా మనం సంపాదకుడిగా స్కైలోని ప్రతిభనే కాకుండా ముస్లిం సమాజం పట్ల అతని ఆరాటాన్ని పోరాట స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశంగా భావించాలి. ఈ రకమైన ప్రయత్నం ఎంత అవసరమో గుర్తించాలి.

జల్జలా, అజా పుస్తకాలొచ్చినప్పుడు అవెంత సంచలనమయ్యాయో తెలిసిందే. ముస్లింవాద సాహిత్యం చేయగల ప్రభావం తెలిపిన పుస్తకాలవి. ఈ దర్ద్ పుస్తకం కూడా అదే దారిలో లౌకికవాద ప్రాధాన్యత తెలియజెబుతుంది. సీనియర్లతోబాటు వర్ధమాన కవుల ప్రాతినిధ్యం ఈ సంకలనానికి సౌందర్యం, సౌష్టవం. ఇందులో ముస్లిమేతర కవుల సహానుభూతి లేదు; కేవలం స్వీయానుభవ ప్రాతిపదికతే కనిపిస్తుంది.

అందరూ ముస్లిం కవుల్నే ఎంపిక చేయడం జరిగింది. మొత్తం 28 మంది రాసిన 42 కవితలున్నాయి. సంఖ్యల సంగతి పక్కనబెడితే, ఈ కవితలు ముస్లింవాద చైతన్యాన్ని ప్రతిబింబించడంలో పూర్తి శాతం సఫలమయ్యాయని చెప్పాలి. హిందూత్వ దాష్టీకమే ప్రధాన అంశంగా కనబడుతుంది. ‘నా రక్తంలో దేశం ఉంది. దేశం నదుల్లో నేను పారుతున్నా’ (నేను దేశాన్ని – వైష్ణవిశ్రీ); ‘సొంత ఇంట్లో కిరాయి బతుకు బతకాల్సివస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా’ (మీకు తెలుసా – షేక్ నసీమా బేగం); ఈ పురుషాంగాన్ని వెంటేసుకుని ధైర్యంగా బయటకెళ్ళే రోజులు పోయాయి’ (సున్తీ కత్తి – సాబిర్)– ఇలా ఎన్ని వాక్యాలు చదివి వినిపించినా ఆధిపత్య భావజాల వ్యతిరేక స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. మతోన్మాద మూకల పట్ల దేశపు ప్రవర్తనలో వస్తున్న మార్పులని ఈ కవితలు పట్టుకున్నాయి.

రహీముద్దిన్ రాసిన ‘గాయం నా గుర్తింపు చిహ్నం’, ఇబ్రహీం నిర్గుణ్ ‘పైలం బిడ్డా’ కవితలు మతంతో పనిలేకుండా మనుషులుగా మిగలవల్సిన అవసరాన్ని చెబుతాయి.యాకూబ్ ‘మనుషులు కావాలిప్పుడు’ కవిత కూడా ఆ సారాంశం లోంచి వచ్చిందే. పోరాడవల్సిన అవసరాన్ని తెలియజెప్పే యస్ జవేరియా – కలసి పోరాడుదాం, వలి హుసేన్ – ‘మేమిక్కడే’ కవితలు బాగుంటాయి. బాసిత్ – నీకోసమే నువు నిలబడు కవిత దళిత బహుజన వర్గాలను ముస్లింలు తమతోబాటు కలుపుకు పోవల్సిన అవసరాన్ని చాలా సున్నితంగా చిత్రిస్తుంది. ముస్లింవాదుల్లో సావర్కర్ రక్తం కాదు, భగత్ సింగ్ ల ఉరికంబాన్ని ముద్దాడే లక్షణం ఉందనడం స్కై రాసిన ‘నీ మౌనం వారికి ఆయుధమే’ కవితకు బలం చేకూరుస్తుంది. నబీ కరీం ఖాన్, జాబేర్, నస్రీన్ రాసిన కవితలు ఎంతో ఆలోచనాత్మకమే కాకుండా నవ్యతను కూడా కలిగి ఉంటాయి.

ముస్లింవాద కవిత్వమూ ఇస్లాం వాద కవిత్వమూ మైనారిటీ వాద కవిత్వమూ ఇలా చాలా పేర్లు పెట్టబడిన ఈ తరహా కవిత్వమంతా మాటల్లో చెప్పలేని అస్తిత్వ పోరాటం ఉంది. ఉనికి కోసం ఒక ప్రజ చేస్తున్న యుద్ధం ఉంది. మహమూద్ రాసిన ‘ఈ దేశ అస్తిత్వాన్ని’ కవిత ఈ విషయాన్ని ప్రస్పుటంగా చూపిస్తుంది. ‘నా అస్తిత్వం అమానుష కాళరాత్రుల చీకటి పరిష్వంగంలో బందీ, నా అస్తిత్వం బహిరంగ కుట్రల కత్తులకు బలౌతున్న నిల్వెత్తు క్షతగాత్రి’ అనడంలో కవి భావం అదే.

ఈలాంటి కవితల పుస్తకం తేవడంలో వాదంగానో ధోరణిగానో ఏంగానో ముస్లిం జీవితాలలో ఉండే వేదన బయటకు రావడం చూస్తాం. అలా రాకపోతే ఏం జరుగుతుంది ? ‘నేల లేని దేశం’ రాకపోతే పాలస్తీన ప్రజల పట్ల మన ఆలోచనలెల ఉన్నాయో బయటకి తెలియదు. నేలపురి రత్నాజీ కూడా ‘జాగా లేని జాగా’ అనే దీర్ఘ కవిత రాశారు. ఒక ప్రత్యేక జీవన స్థితిగతులు మరొక విలక్షణ వ్యక్తీకరణను సొంతం చేసుకుంటాయి. ఒక సిద్దాంత స్థిరీకరణకి ఈ తరహా కవిత్వం ఎప్పుడూ దోహదం చేస్తుంది. ఏమిటా సిద్దాంతం ? ఎవరా సిద్దాంత ప్రవక్త ? లాంటి ప్రశ్నలు ఉదయిస్తే రావచ్చు. ఖాదర్, అఫ్సర్, ఖాజా వంటివారి ప్రతిపాదనలు గుర్తొస్తాయి. సుంకిరెడ్డి, జిలుకర శ్రీనివాస్, బాలగోపాల్ లాంటివారి ముందుమాటలూ వ్యాసాలు గుర్తొస్తాయి. అయినప్పటికీ ఒక మూలవాసీ హృదయంతో నిరంతర జాగరూకతతో ధైర్యంతో స్కై చేసే ఈ లాంటి పనులు నిశ్శబ్దంగా ఒక సందేశాన్నిస్తాయి. ఆ సందేశమే ఒక సిద్దాంత రూపాన్నిస్తాయి. మరి స్కై ఏం చెబుతున్నాడు ? అత్యంత బలంగా ఉన్న ఒక ఫాసిస్టు మతవాద భావజాలానికి మూర్ఖంగా ఎదురు వెళ్ళమంటున్నాడా ? ఉపాయంగా మెసల మంటున్నాడా ? ఇలాంటి ఆలోచనలు రేగుతాయి మనకి. ఒక సంపాదకుడి పని మామూలుగా చూస్తే పది మంది దగ్గర్నుంచీ కవితలు సేకరించడం మినహా ఏమంత గొప్ప పనీ ? అనిపించవచ్చు. ఆ రకంగా చాలా మంది ‘సరికొత్త సంపాదకులని’ సాహిత్య సమాజం చూస్తోంది కూడా. స్కై చేసిన ఈ గుల్దస్తా ఏటికి ఎదురీదాల్సిన పరిస్తితిని, నిర్భయంగా నిలబడాల్సిన ఆవశ్యకతని బలంగా పరిమళిస్తుంది.

చూడ్డానికివి మామూలు లక్షణాలే గానీ, Iam Indiam Muslim అని షాజహానా రాసిన కవిత, అఫ్సర్ రాసిన తలాష్ కవిత కేవలం వాచకాలు కావు, అవి అవకాశవాద రాజకీయ వైరుధ్యాల మధ్య నలిగిపోతున్న ఈ దేశ ముఖ చిత్రం. స్కై సంపాదకత్వంలో మత ప్రాతిపదికత ఎప్పుడూ కనబడదు. స్కై ముస్లిం జీవితాల్లో మతం రేపే చిచ్చును, ప్రత్యేకించి స్త్రీలు ఎదుర్కొనే దుర్మార్గాన్నీ చాన్నాళ్ళుగా ఎండగడుతూనే ఉన్నాడు. ఇస్లాంవాద భావజాలాన్ని అదే కోణంలో సైద్దాంతికంగా పరీక్షకు పెట్టాలనీ చెబుతూ వస్తున్నాడు. అయితే స్కై మతప్రాతిపదికన రిజర్వేషన్లని వ్యతిరేకించనవసరం లేదన్న ఒక పరిశీలన ఉంది. బుద్దిపూర్వకంగా హిందూ అనే పదాన్ని ఈ కోణంలోనే వాడవద్దని సూచిస్తాడు. ముస్లింలు గురవుతున్న అభద్రతకి రాజ్యమే కారణం వహించాలని చాలా స్పష్టంగా చెబుతాడు. ఇవన్నీ స్కై మాత్రమే చెబుతున్నాడని నేను చెప్పట్లేదు. అతని సంపాదకత్వ ప్రతిభ ఈ కోణాలన్నింటినీ స్పృశిస్తుంది. ఆ రకంగా స్కైలోని  సృజనకారుడిని ఈ కార్యకతృత్వం చాలా సునాయాసంగా మింగేసింది. ఈ ముస్లింవాద సంకలనాలన్నీ తెలుగు సాహిత్యంలో గొప్ప చేర్పుగా చెప్పి తీరాలి. ప్రపంచంలో ఏ ముస్లింజీవన దురాక్రమణ తీరుతెన్నులని అర్థం చేసుకోవాలన్నా ఈ సంకలనాలు ఎంతో ఉపయోగపడతాయి. ముస్లింలను అర్థం చేసుకునే క్రమంలో ‘మిగతావాళ్ళకి’ ఉంటున్న సంశయాన్ని ఈ సంకలనాలు తొలగిస్తాయి. ముస్లింజాతి బలిదానాలను కీర్తిస్తూ అన్వర్ రాసిన ‘చూపుడు వేలు’ కవిత, బాసిత్ రాసిన ‘నీ కోసమేనువ్వు నిలబడు’ కవిత మనలి తప్పక కదిలిస్తాయి.

ఈ ముస్లింవాద కవిత్వ సంకలనాలకి స్పష్టత చాలా గొప్ప లక్షణం. చాందస వ్యతిరేకత సుగుణం. దర్ద్ అభివ్యక్తిలో అవిఛ్ఛిన్నతని వదులుకోలేదు. ఉద్యమ లక్షణాన్ని వదులుకోలేదు. సామాజిక ప్రయోజన కార్యాకారణాన్ని వదులుకోలేదు. కాలపు భౌతికతని ఈ సంకలనం ప్రతిబింబిస్తుంది. అందుకే స్కై ఉద్యమకారుడు. పారిభాషికంగా ఈ సంపాదకుణ్ణి విప్లవకారుడు అనలేకపోయినా ఈ దర్ద్ వంటి సంకలనాలు విప్లవాత్మక ప్రయోగాలు. ముస్లింవాద ప్రతీ పరిణామదశల్నీ స్కై గ్రంధస్తం చేశాడు. నేటి ఫాసిస్టు కాలపు సంక్లిష్టతను దర్ద్ కవిత్వ సంకలనం పొరలు పొరలుగా విప్పి చూపిస్తుంది. ఇందులోని భావచిత్రాలు గానీ, ప్రతీకలు గానీ ఎక్కడా మతసంబంధంగా గాక, ఉద్యమ క్రమాన్ని, పోరాట క్రమాన్ని పొదవుకున్నాయి. గౌస్ పాషా రాసిన ‘వెళ్ళొస్తా మిత్రులారా’ ‘ఆ కళ్ళు అనుమానంగా చూస్తున్నాయి’ ఆ కోవకు చెందినవే. వలి హుస్సేన్ ‘మేమిక్కడే’ అందుకు బలాన్నిస్తుంది.

ముస్లింవాద కవిత్వ శిల్ప నివేదన కొత్తదేమీ కాదు. మరింత చర్చకు ఆస్కారమున్నప్పటికీ దర్ద్ సంకలనం ఆశయం అన్నింటికన్నా గొప్ప మౌలిక భావన. ఉద్వేగం ఏకసూత్రత. పోరాడవలసిన స్వభావచిత్రణ నిర్ణాయకమైనది.ఇందులోని కవుల నిజాయితీకీ, ఈ పుస్తకం తేవడంలో కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ అభినందనలు. ఈ దేశ మూలవాసుల పక్షాన మనందరం నిలబడవలసిన అనివార్యతను దర్ద్ కల్పిస్తుందంటే అతిశయోక్తి కాదు.

దర్ద్ (కవిత్వం) సంపాదకత్వం: స్కైబాబ  పేజీలు: 98, , ఈ- ప్రతులకు: నసల్ కితాబ్ ఘర్ ప్రచురణలు, skybaabapoet@gmail.com, +91 98854 20027

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనిషి మనిషిని ప్రేమించాలి. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవాలి.మనతో కలిసి ఉండే పక్కింటి వారు, స్నేహితుల మనసుల్లో , సమాజం దృష్టిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. భిన్నత్వంలో ఏకత్వ నినాదాన్ని సరిగానే పాటిస్తున్నారు. స్వార్హ రాజకీయ కుట్రల్లో భాగంగా చేస్తున్న కార్యకలాపాలే వివక్షకు కారణం.
    చక్కని, వివరణాత్మక సమీక్షను అందించిన శ్రీరామ్ పుప్పాల గారికి కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు