ఈ కత్తుల వంతెన దాటడానికి ఒక చేదోడు!

ఇది వివిధ రంగాల ప్రముఖులు రాసే అతిథి సంపాదకీయాల శీర్షిక

నిషిని పెద్ద మెదడు కలవాడనీ, ప్రకృతిని జయించాడనీ, విశ్వాంతరాళంలోకి తొంగి చూడగలిగాడనీ…ఇలా ఏవేవో అనుకుంటాం కానీ; అవి పాక్షికనిజాలు మాత్రమే. మనిషిని, చూస్తూండగానే ఏమార్చి, అంత గొప్ప విజ్ఞానికీ అజ్ఞానపు గంతలు కట్టి చిన్నచిన్న విషయాలు కూడా చిత్తుచేస్తూ ఉంటాయి. మన ఆలోచనలు, మన మేధ గ్రహాంతరయానం చేయగలవు కానీ; మన చూపునకు, మన బుద్ధికి అతి దగ్గరగా ఉన్న, మనతో సహజీవనం చేస్తున్న సాధారణసత్యాలను కూడా ఒక్కోసారి సక్రమంగా గుర్తించలేక బోల్తా పడుతూ ఉంటాయి.

కాలాన్నే తీసుకోండి. మనం కాలంతో జీవిస్తాం, కాలంతో శ్వాసిస్తాం, కాలాన్ని మణికట్టుకు బంధించుకుంటాం, గోడకు వేలాడదీసుకుంటాం. కాలాన్ని ముక్కలుగా చేసి క్షణాలనీ, నిమిషాలనీ, రోజులనీ, నెలలనీ, సంవత్సరాలనీ, ఋతువులనీ పేర్లు పెట్టుకుంటాం. అయినాసరే, కాలాన్ని అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ వెనకబడుతూనే ఉంటాం.  కాలాన్ని ఎన్ని ముక్కలుగానైనా నరికి పోగులు పెట్టండి; ప్రతి ముక్కా మనల్ని నిలువునా ధిక్కరించి వెక్కిరిస్తుందే తప్ప కాలతత్వాన్ని తెలియనివ్వదు. కాలాన్ని మనమే నడిపిస్తున్నామనుకుంటాం కానీ, కాలమే మనల్ని నడిపిస్తోందన్న సత్యాన్ని తెలుసుకోలేం.మనం ఇంద్రజాలాన్ని గుర్తించినట్టుగా కాలజాలాన్ని గుర్తించలేం; ప్రతిక్షణమూ కాలం చేసే కనికట్టుకు లొంగిపోతూ ఉంటాం.

సంస్కృతమహాభారతం, ఆదిపర్వంలో కాలస్వభావం గురించి చేసిన వ్యాఖ్యానం ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా తోస్తుందంటే; అంతవరకూ ఒక మామూలు సంభాషణగానూ, ఓ మామూలు కథలానూ సాగుతున్న ఘట్టాన్ని కాస్తా హఠాత్తుగా ఉహించని లోతుల్లోకి తీసుకుపోయి, గొప్పలోచూపును ఆవిష్కరిస్తుంది. అది కాలాన్ని జయించి నిత్యనూతనత్వాన్ని స్థాపించుకునేలానూ ఉంటుంది.

శౌనకుడు అనే మహర్షి ఇతర ఋషులతో కలసి నైమిశారణ్యంలో చేసే పన్నెండేళ్ళ సత్రయాగానికి ఉగ్రశ్రవుడు వస్తాడు. ఋషుల తీరిక సమయంలో మహాభారతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. అతడు సూతుడైన రోమహర్షణుని కుమారుడు. సూతులు బ్రాహ్మణులు కారు; అయినాసరే మొదట్లో పురాణప్రవచనాధికారం సూతులదే. ఋషులు కూడా వారికి శ్రోతలు కావలసిందే. మహాభారతం ఎలాంటిదో చెప్పి, సృష్టిక్రమాన్ని వివరించి, కథను క్లుప్తంగా పరిచయం చేసి, చివరగా ఉగ్రశ్రవుడు కాలం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. అతని వివరణలో కాలం ఎలాంటిదంటే…

విధాతృవిహితం మార్గం న కశ్చిదతివర్తతే / కాలమూలమిదం సర్వం భావాభావౌ సుఖాసుఖౌ-

అనగా, బ్రహ్మ నిశ్చయించిన మార్గాన్ని ఎవరూ అతిక్రమించలేరు. భావ, అభావాలకు, సుఖ, అసుఖాలకు…అన్నింటికీ కాలమే మూలం;

కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః / సంహరంతః ప్రజాః కాలం కాలః సమయతే పునః-

అనగా, కాలమే ప్రాణులను పుట్టిస్తుంది. కాలమే ప్రజలను సంహరిస్తుంది. ప్రజలను సంహరించే కాలమే తను కూడా శమిస్తుంది.

కాలోహి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ / కాలః సంక్షిపతే సర్వాః ప్రజా విసృజతే పునః-

అనగా, కాలమే అన్ని లోకాలలోనూ శుభాశుభభావాలను సృష్టిస్తుంది. కాలమే అన్నింటినీ అంతరింపజేసి తిరిగి సృష్టిస్తుంది.

కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతిక్రమః / కాలః సర్వేషు భూతేషు చరత్యవిధృతస్సమః-

అనగా, కాలమే నిద్రనుంచి మేలుకొలుపుతుంది. కాలం అతిక్రమించడానికి సాధ్యం కానిది. కాలం అన్ని జీవులలోనూ సమానంగా అడ్డులేకుండా సంచరిస్తూ ఉంటుంది.

అతీతానాగతా భావాః యేచ వర్తంతి సాంప్రతః / తాన్ కాలనిర్మితాన్ బుద్ధ్యా న సంజ్ఞాం హాతుమర్హసి-

అనగా, భూతభవిష్యత్ వర్తమానాలలోని అన్ని భావాలూ కాలనిర్మితాలేనని తెలుసుకో. వివేకాన్ని పోగొట్టుకోవద్దు.

ఇక్కడ శుభాశుభాలు, సుఖాసుఖాలతో సహా అన్నింటికీ కారణమూ; అన్నీ చేసేదీ కాలమే ననడంలో పెద్ద విశేషం ఏమీలేదు. పెద్దలు, జీవితాన్ని కాచివడబోసినవారినోట వేదాంతరూపంలో ఇలాంటివి వ్యక్తమవుతూనే ఉంటాయి. ఇక్కడ విశేషంగా తోచేది ఏమిటంటే, భావాలను, అభావాలను కూడా కాలమే సృష్టిస్తుందని అనడం! అంతకంటే విశేషంగా గతానికి, నేటికి, రేపటికి చెందిన భావాలు కూడా కాలనిర్మితాలే ననడం!

భావాలు అంటే ఆలోచనలే. మనం గతంలో చేసిన ఆలోచనలు, ఇప్పుడు చేస్తున్న ఆలోచనలు, రేపు చేయబోయే ఆలోచనలు కాలం నిర్మించేవే. ఆలోచనలే క్రియారూపం ధరిస్తాయి; ఆ క్రియే సమాజంగానూ; ఆ సమాజమే సంస్కృతి, మతం, సాహిత్యం, రాజకీయాలు, న్యాయం, కుటుంబం, మానవసంబంధాలవంటి వివిధ వ్యవస్థలుగా, వివిధ విలువలుగా రూపాంతరం చెందుతుంది. ఇవి మనకు తెలిసినవే. కానీ ఇక్కడ మహాభారతకథకుని దృష్ట్యా చెప్పుకుంటే, మనకు తెలియనిదేమిటంటే, ఇవన్నీ అంతిమంగా కాలనిర్మితాలన్నసంగతి! వీటిని మనమే నిర్మించుకుంటున్నామనుకుంటాం.

మహాభారతకథకుడు మనిషిని పూర్తిగా కాలాధీనుడిగానూ, స్వతంత్రసంకల్పశక్తి, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం లేనివాడుగానూ; కాలం చేతిలో కీలుబొమ్మగానూ చిత్రిస్తున్నాడని మనకు అనిపిస్తుంది; కోపం కూడా వస్తుంది. కానీ నిజానికి ఆ అవసరం లేదు. సత్యం అనేది, లేదా ఒక ఆలోచన అనేది అనేక అంతరవులలో వ్యక్తమవుతూ ఉంటుంది. మనం ఒక అంతరవుకు పరిమితమై చూసినప్పుడు అది మాత్రమే నిజమనీ, మిగిలినవి అసత్యాలనీ, మనకు పొసగనివనీ అనిపించవచ్చు. కానీ వేరే అంతరవులలోకి వెళ్ళి చూసినప్పుడు అవే నిజమనిపించవచ్చు. అప్పుడు నిజానిజాల గురించిన మన భావన మారుతుంది. విభిన్న అంతరవుల మధ్య కూడా ఒక సమన్వయం, ఒక సామరస్యం కనిపిస్తుంది. ఆలా చూసినప్పుడు, ఒక అంతరవులో మహాభారతకథకుడు చెప్పింది కూడా నిజమే. ఇంకొక అంతరవులో, అంతా మన ప్రయోజకత్వంలా తోచడమూ అంతే నిజం.

ఇంకొంచెం తేలికగా అర్థమయ్యేలా చెప్పుకుంటే, మన ఆలోచనలు, అవి కల్పించే వ్యక్తిత్వం, దానినుంచి పుట్టే ఆచరణా…అన్నీ కాలనిర్దిష్టాలు. ఒకానొక కాలంలో మనందరం, కనీసం మనలో ఎక్కువమంది ఒకలానే ఆలోచిస్తాం, ఒకలానే ఆచరిస్తాం; దానికి భిన్నమైన ఆలోచన, ఆచరణ మన ఊహలోకి వచ్చే అవకాశం లేదు. ఉదాహరణకు, రాచరికనియంతృత్వం కిందా, ఫ్యూడల్ వ్యవస్థలోనూ, పితృస్వామికవ్యవస్థలోనూ ఉన్నప్పుడు అవే సహజమైనవనుకుంటాం. ఆవిధంగా అవి మన ఆలోచనాస్వేచ్ఛకు, ఆచరణస్వేచ్ఛకు హద్దులు గీస్తాయి. అదే ఏ పెట్టుబడిదారీవ్యవస్థలోకో, ప్రజాస్వామ్యంలోకో మారుతున్నప్పుడు ఆ హద్దులు చెదిరి కొత్త హద్దులు ఏర్పడడం ప్రారంభిస్తాయి. కనుక కాలానికి తప్పనిసరిగా మనల్ని నియంత్రించే లక్షణం ఉంటుంది. దానికి ఒక్కోసారి స్థలం కూడా జతపడుతూ ఉంటుంది.

ఏతావతా చెప్పొచ్చేది ఏమిటంటే, గత వందేళ్ల కాలంలో, ముఖ్యంగా గత డెబ్బై అయిదేళ్ళ స్వతంత్రభారతంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం లేదా మతసామరస్యం, సామ్యవాదం వంటి కొన్ని స్థలకాలనిర్మితాలైన ఆదర్శాలకు, ఆలోచనలకు మెజారిటీ జనం అలవాటుపడ్డాం. వాటి దిశగా గట్టి అడుగులో, ఉత్త అడుగులో పడుతున్నాయనే అనుకుంటూ వచ్చాం. ఇప్పుడు దేశంలోని ఆలోచనలు వాటికి భిన్నమైన మార్గం పట్టడం చూస్తున్నాం. మన దేశంలోనే కాదు, దాదాపు ప్రపంచమంతటా ఆ మార్పు కనిపిస్తోంది. స్థలకాలాలతో ముడిపెట్టి కానీ ఈ మార్పును అర్థం చేసుకోలేం. గత వంద-డెబ్బై ఏళ్ల కాలంలో వృద్ధి చెందిన ఆలోచనలు, ఆచరణలు; వాటికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులూ ఈ మారుతున్న వాతావరణంలో క్రమంగా ప్రాసంగికతను కోల్పోవడం, మైనారిటీ గొంతుగా మారడం జరుగుతోంది. వారు తమ ఆలోచనలను, ఆదర్శాలను బతికించుకోవడానికి పంటిబిగువు పోరాటం చేయవలసివస్తుంది. ఇలాంటి సందర్భాలలో కాలజ్ఞానం అత్యంత కీలకమైన వనరు అవుతుంది. ఆ జ్ఞానం లోపించినప్పుడు వారి  ఆలోచనలు, ఆదర్శాల ఉద్ఘాటన యాంత్రికంగా మారి మరింతగా ప్రాసంగికతను కోల్పోతుంది. వారిది మరింతగా ఒంటరి పోరుగా పరిణమిస్తుంది. దానికి విరుగుడు కాలస్వభావాన్ని అర్థం చేసుకోవడమే.

కాలజ్ఞానం పట్టుబడినప్పుడు, తమ ఆలోచనలను, ఆదర్శాలను సజీవం, ప్రాసంగికం చేసుకోవడానికి అవసరమైన ఆయుధాలను, వ్యూహాలను కాలమే అందిస్తుంది. కాలం దేనినీ స్థిరంగా ఉండనివ్వదు, అది నిత్యనూతనత్వాన్ని కోరుకుంటుంది, నిత్యనూతమైన భాషను, వ్యూహాలను అభిలషిస్తుంది. అయితే, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ మొదలైన విలువలు; దయ, సానుభూతి, సహానుభూతి, స్నేహం మొదలైన స్పందనలు కాలజాలానికి లొంగకుండా ఎల్లకాలాలలోనూ తమ ఉనికిని నిలుపుకుంటాయి. పచ్చికలా కోసినకొద్దీ మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటాయి. మానవజీవనఅంతిమలక్ష్యాన్ని నిర్దేశిస్తూనే ఉంటాయి.

కాలం కూడా ఉండిఉండి పాక్షికతను మార్చుకుంటూనే ఉంటుంది. అతిని శిక్షించి సమతూకాన్ని స్థాపిస్తూనే ఉంటుంది. కనుక ఆశ చెదరకుండా, ఆదర్శం అణగారకుండా చూసుకోవడమే మనిషి కర్తవ్యం. జ్ఞానమే కాదు, కాలజ్ఞానం కూడా ఈ కత్తుల వంతెన దాటడానికి చేదోడు.

*

భాస్కరం కల్లూరి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భాస్వరం గారి సంపాద కీ యం జ్ఞాన దాయకం.
    కాల ప్రభా వానికి మానవ చైతన్యం తోడు అయితే నే ముందడుగు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు