‘ఇఫ్తార్’ కథ వెనక కథ!

ఈ రెండు మూడు నెలల్లో వచ్చిన కొన్ని మంచి కథల వెనక కథలు ఇక నుంచి వరసగా…….

రంజాన్ నాడు ప్రచురితమైన ‘ఇఫ్తార్’ కథను, సారంగలో ‘మంచికథ’ శీర్షిక కింద పరిచయం అనగానే ముందు కంగారు అనిపించింది. కథా నేపథ్యం కూడా చెప్పమన్నాక.. దానికి జవాబు, క్షణం ముందు పుట్టిన కంగారే కదా అని కూడా అనిపించింది. అవును.

ఈ ‘ఇఫ్తార్’ సంతోషాన్ని పంచుకోవడానికి ఇచ్చిన కథావిందు కాదు. ఒక సుదీర్ఘకాలపు కడుపుమంటను, భయాన్ని జయించలేని ఒక అసమర్థుడు, దానిని వీలైనంతమంది మీదికి నెట్టేయడానికి చేసిన ప్రయత్నం.

చిన్నతనంలో పుట్టినరోజు వస్తే ఇంట్లో అమ్మానాయిన తర్వాత.. ఎదురింట్లో ఫకీరు సాయిబుకీ, బూబమ్మవ్వకీ కాళ్లు మొక్కుతూ, అవ్వ ఇచ్చే రూపాయిని దాచుకుంటూ, వాళ్లే ఆరోజున అందుబాటులో ఉన్న అమ్మమ్మ తాతయ్యలనుకుంటూ, పెరిగిన వాడిని నేను. వారి కొడుకుల్ని ‘మామూ’ అంటూ, కూతుర్ని ‘బూ’ అంటూ గడిపాను. పండగలొస్తే.. మాకోసం కూర లేని బిర్యానీలు, సేమ్యా పాయిసాలూ స్పెషల్! అందరిలాగానే ‘వాళ్లతో’ కూడా మామా అత్తా సంబంధాలే!

నేను పొట్ట చేతబట్టుకుని మా ఊరు వదలి వలస వచ్చేసి రెండు దశాబ్దాలు దాటాయంతే. అప్పటిదాకా కూడా మా ఊర్లో పెద్దగా అదృశ్యకుడ్యాలు మొలిచినట్లు నేను గుర్తించలేదనుకుంటాను. మా ఇంటి పక్కనే ఉండే కసాయిదొడ్డికి రోజూ పొద్దున్నే వచ్చి కొన్ని పొట్టేళ్లను కోసేసి, ఎవరైనా పనిగట్టుకుని కోళ్లను తెస్తే వాటి పీక తెగ్గోసి.. కడిగేసిన కత్తిని కుడిచేత్తో వీపు వెనక బిగించి పట్టుకుని, ఎడమ చేయి ఊపుకుంటూ వెళ్లిపోయే కసాయి సాయిబు తప్ప.. మా ఊర్లో ఎవ్వరూ శ్రద్ధగా గడ్డాలు పెంచడమూ, టోపీలు పెట్టుకోవడమూ నాకు తెలియదు. బూబమ్మవ్వ, అమ్మతో సినిమాకు వెళ్లాలంటే ఓ తెల్లగుడ్డతో తల, భుజాలు కొద్దిగా కప్పేసుకుని వెళ్లడం తప్ప బురఖాలు కూడా తెలియదు నాకు! అప్పటిదాకా.

ఆ తర్వాత నేను ఆ ఊరికి అతిథిని అయ్యాను. ఊర్లో మార్పులు వస్తే.. అక్కడ ఉండే వాడికంటే అప్పుడప్పుడూ వచ్చే అతిథికి గబుక్కున తెలిసిపోతాయి. శుక్రవారం తప్ప అప్పట్లో వాళ్ల తండ్రుల్ని కూడా నేనలా చూడలేదుగానీ, నా ఫ్రెండ్స్ కూడా టోపీలు పెట్టుకుని, జానెడు గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నారు. బురఖాలు హైదరాబాదులో లాగానే అందరికీ కనిపిస్తున్నాయి.. ఈ ప్రాంతానికి అలవాటులేని హిజాబ్ లు కూడా!

ఈ మార్పు ఎలా వచ్చిందో నేను లోతుగా తెలుసుకోలేకపోయాను. కానీ, అస్తిత్వ ప్రదర్శన కోసం ప్రయత్నం అనిపించింది. ఆ ప్రయత్నంతో, సంఘటితం కావడం కోసం అనిపించింది. ఇంతకీ, ఎందుకా ‘అస్తిత్వ ప్రదర్శన’? అనుకుంటే, ఏదో భయాన్ని అధిగమించడానికి అనిపించింది. ఆ భయం, ఈ కథకు బీజం!

నిజానికి బీజారోపణ సంవత్సరాల కిందటే జరిగినా, బద్ధకాన్ని చీల్చుకుంటూ ఈ రంజాన్ నాడే మొలక బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసింది.

‘‘అంటే నువ్విప్పుడు ముస్లిముల్ని దువ్వడానికి ప్రయత్నిస్తున్నావా?’’ అన్నాడో మిత్రుడు. చిత్రంగా ధ్వనించింది. ‘ఇఫ్తార్’ లో ఆ ప్రయత్నం ఉన్నట్టు నాకు నమ్మకం లేదు. అయినా వాళ్లను దువ్వే అవసరం నాకేంటి. వలస జీవితంలో మా గౌసు ఉన్నంత కాలమూ.. ప్రతి రంజాన్‌కు తీసుకెళ్లి హలీం, బిర్యానీ తినిపించేవాణ్ని. పోయాకగానీ, అంతకుముందుగానీ రంజాన్ నాడు నన్ను పిలిచి ఓ గంటెడు వెజ్ బిర్యానీ పెట్టిన వాళ్లు.. ఈ ఇరవయ్యేళ్ల వలసజీవితంలో లేరు. మిత్రులు బోలెడు మంది ఉన్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు మాత్రం కొత్తగా పెట్టబోతారా? వాళ్లనలా ఈ ‘ఇఫ్తార్’తో దువ్వి, నానా జాతుల గడ్డి గింజలే తిండి అయిన వర్తమాన జీవితంలో, బిర్యానీ కోసం నేను రాశానా? ఆ మిత్రుడి మాటకు జవాబుగా,- నవ్వి ఊరుకున్నాను.

‘‘సాయిబులూ సాయిబు కథలే రాసి, నువ్వూ సాయిబు కథలే రాస్తే ఎలా?’’ అన్నాడు ఇంకో ఆత్మీయుడు! మంచీ చెడులు తూకంగానే రాశానని అనుకున్నాను గానీ.. పాకం చెడిపోయింది. ‘ఇఫ్తార్’ మీద ముద్ర పడింది.

భయపడుతున్నారా? ఒకరు మరొకరితో పోటీ పడుతున్నారా? తేల్చే తాహతు నాకు లేదు. కానీ.. గడ్డాలూ బొట్లూ పెట్టుకోవడం కొత్తగా అలవాటు చేసుకుంటున్నారు! కుటుంబ మూలాల్లో వాటి దాఖలాలుంటే చాలా మంచిది. కానీ, మనుషుల్లో ‘కొత్తగా’ వాటి మీద పుడుతున్న ప్రేమ చూస్తేనే భయం!

రాముడంటే నాకు చాలామందికిలాగానే పసితనం నుంచి ఇష్టం. వయసుకు అనులోమంగా బుద్ధి పతనం అవుతున్న కొద్దీ రాముడి వ్యక్తిత్వంతో భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ.. అలసిపోయినప్పుడో, ఆదమరచినప్పుడో ‘రామచంద్రా’ అంటూ ఆ అభాగ్యుణ్ని తలచుకుంటుంటాను. కానీ ఇప్పుడు నలుగురిలో ఆ మాట అనాలంటేనే భయం. ఎవడు ద్వేషిస్తాడో.. ఎవడు ప్రేమిస్తాడో.. ‘కొత్తగా’! అదే భయం! ఆ భయమే ‘ఇఫ్తార్’ కథకు నేపథ్యం.

-కె.ఎ. మునిసురేష్ పిళ్లె

ఇఫ్తార్

‘గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నన్నేనా!? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అవును నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో మొబైల్ తీస్తున్నాడు. ఎవరికైనా చెప్తాడా? ఏం చెప్తాడు? ఎవరినైనా పిలుస్తాడా? ఎందుకు పిలుస్తాడు? పారిపోనా? ఎందుకు? ఎక్కడకి? అదిగో, చూపు మరల్చినట్టుగా మరల్చి మళ్లీ చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది! ఆ, ద్వేషం! ద్వేషమే అది. మనల్నందర్నీ కాపాడ్డానికి వాళ్ల దేవుడు మెళ్లో బిగబట్టుకున్నాడే, అది వాడి కళ్లలో, చూపుల్లో ప్రవహిస్తోంది.. విషం! విషంగా చూస్తున్నాడు. చూడ్డం అంటే, కళ్లలోకి కదా చూడాలి. వాడు నా కళ్లలోకి చూడట్లేదు. నాలుగంగుళాలు కిందికి చూస్తున్నాడు!!’

‘మిర్రి మిర్రి చూస్తున్నాడు. నన్నేనా!? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అహ నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో జేబులో చెయ్యి పెట్టాడు! ఏం తీస్తాడు?  రివాల్వరా? బాంబా? పేలుస్తాడా? ఎందుకు పేలుస్తాడు? దాక్కోనా? ఎలా? ఎక్కడ?  అదిగో నన్ను తప్పించుకోడానికన్నట్టు నాలుగడుగులు దూరంగా నడిచి, మళ్లీ నన్నే చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది! ఆ, ద్వేషం! ద్వేషమే అది. వాళ్ల ప్రవక్తను చంపేయడానికి ఓ మహాతల్లి గొర్రెపిల్లలో నింపి ఇచ్చిందే, అది వాడి కళ్లలో, చూపుల్లో ప్రవహిస్తోంది.. విషం! విషంగా అగుపిస్తున్నాడు. చూడ్డం అంటే కళ్లలోకి కదా చూడాలి. వాడు నా కళ్లలోకి చూడట్లేదు. ఒక్కంగుళం ఎగువన చూస్తున్నాడు!!’

* * *

కారు తుడుచుకోడానికి చిన్న బకెట్లో నీళ్లు తీసుకుని, గుడ్డతో బయటకు వచ్చాను. వైపర్స్ పైకి లేపి అద్దం, ముందువైపు తుడిచేసి విండో అద్దాలు తుడుచుకుంటూ వెనక్కు వచ్చాను. ప్రాణం ఉసూరుమనిపోయింది. సాలెగూడులాంటి చిక్కటి గీతలు. వెనక అద్దం బద్దలు బద్దలుగా చిట్లిపోయి ఉంది.  రెండు నెలల్లో ఇది మూడోసారి. ఏదో తగిలితే పగిలినట్లుగా లేదది. పనిగట్టుకుని పగలగొట్టినట్టుగా ఉంది. కిందకు చూస్తే.. సగం ఇటుక. దానికి అంటుకున్న గాజు ముక్కలు. పగిలిన అద్దం మీద ఇటుక పొడి మరకలు. కోపం నషాళానికి అంటింది. నాకు కోపమా.. నా శ్రాద్ధం! ఏడుపొచ్చింది. పోలీసు కంప్లయింటు ఇచ్చేయనా? కారు అద్దం పగిలిందని కాగితం రాసుకెళ్తే, నవ్వుతారేమో. ఛీకొట్టొచ్చు. గెటవుట్ అని అరవొచ్చు. లేదా, మేం చందాలేసుకుని కొత్త అద్దం వేయిస్తాం.. ఈ బోడి కంప్లయింటు రిజిస్టరు, ఎంక్వయిరీ చేయడం కంెట మాకు అదే ఈజీ అని వెటకారం చేయొచ్చు. కారు తుడిచే ముచ్చటకు స్వస్తి పలికి ఇంట్లోకి నడిచాను.

‘‘అద్దం పగలగొట్టారు’’

‘‘మళ్లీనా?’’ వంటింట్లోంచి దోసెలు వేస్తున్న చందన.

‘‘దిష్టి తీయించి రక్ష కట్టించు’’ లోపల జపం చేసుకుంటున్న అమ్మ.

‘‘నీకు కావాల్సిందేలే.  నా బైక్ కింద పడి, రిపేరుకు వెయ్యిరూపాయలడిగితే.. సంపాదించుకుని చేయించుకోమన్నావ్ గా.. ఇప్పుడు గ్లాస్ అయిదువేలు. మార్పించు’’ దోసెలు తింటున్న కార్తీక్ శాడిస్టిక్ తృప్తి.

‘‘మా పేర్లు వేయించమంటే.. కారు మీద లేకిగా పిల్లల పేర్లేంటి అన్నావ్ గా’’ ప్రియ ఎత్తిపొడుపు.

‘‘మీకు అదేం స్టిక్కరింగ్ పిచ్చండీ’’ నాముందు దోసెల ప్లేటు పెట్టి, చందన ముక్తాయించింది.

‘ఆ స్టిక్కరింగ్ వల్లే పగల గొడుతున్నారా? మూడుసార్లూ!’ ఈ చిన్న ప్రశ్న వందల సార్లు బుర్రలో సుడులు తిరుగుతోంటే రుచీపచీ తెలీకుండానే తిని లేచాను.

* * *

‘‘ఇన్సూరెన్సు ఉంది, అయినా ఇప్పటికే పది వేలు బొక్క. రెండుసార్లకి’’

‘‘కావాలంటే ఈసారి క్లెయిం చేద్దాం సార్. కాపోతే కంప్లయింటూ, వెరిఫికేషనూ..! నోక్లెయిం బోనస్ రాదు మరి..’’

‘‘సరే కానివ్వు’’ అయిదువేలు క్యాష్ ఇచ్చేశాను. కొత్త అద్దం బిగించాడు.

అద్దాలు బిగించే షాపు పక్కనే స్టిక్కరింగ్!  అప్పటికే స్టిక్కర్ షీట్ చేతిలోకి తీసుకుని.. ‘‘ఏ భాషలో వేయమంటావు సాబ్..’’ అన్నాడు. ఏం చెప్పను? కారు కొన్నప్పుడు దేవభాష కదాని సంస్కృతానికి దగ్గరగా హిందీ అక్షరాల్లో వేయించాను. లాస్ట్ టైం పగిలినప్పుడు- ఆఫీసులో వాళ్లందరికీ నా ఐడియాలజీ కమ్యూనికేట్ అవుతుందని ఇంగ్లిషులో వేయించాను. అదీ పగిలింది. ఈసారి తెలుగులోనా?

అసలు వేయించనా? వద్దా?

‘‘ఇంగ్లిషులో వేసేయ్’’ అనేసి, వాడు కంప్యూటర్ మీద టైపు చేయడం చూసి, అది కాదు.. ‘‘కార్తీక్, ప్రియ.. చెరో మూల వేయించు’’ అనగానే వాడు ఆశ్చర్యంగా చూశాడు నాకేసి. ‘‘క్యా సాబ్.. బాతేఁ బహుత్ బహుత్ బోలా థా పిఛలే బార్’’ అన్నాడు. మౌనంగా ఉండిపోయాను. వాడు పాన్‌పరాగ్ నములుకుంటూ, పిల్లల పేర్లు టైప్ చేసి, స్టిక్కర్ కట్ చేసే పనిలో పడ్డాడు. కానీ చాలా సింపుల్‌గా వాడు అనేసిన ఆ మాట, ‘బహుత్ బహుత్ బాతేఁ’, అందులో నా ఫిలాసఫీ నన్ను నేను కొట్టుకున్న కమ్చీ దెబ్బలా ఉంది.

* * *

‘‘నా పేరు శ్రీనివాసరావో, శంకర్రావో అయిఉంటే నీకింకా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేవాడిని’’

లంచ్ బ్రేక్‌లో క్యాంటీన్‌లో ఉదయం జరిగినదంతా చెప్పాక, ముందు పెద్దగా నవ్వి, అన్నాడు. నాకు బాధ కలిగింది. మనుషుల మీద వాడి అభిప్రాయాలు ఎలాగైనా ఉండొచ్చు గాక.. కానీ వాడు, నాతో అనాల్సిన మాట కాదిది. ‘నోర్ముయ్..’’ అన్నాను కసురుకుంటూ.

‘‘అది కాదు మామా. నీ దేవుడు నీ వాడు కాదిప్పుడు. ఎప్పుడో కిడ్నాప్ అయిపోయాడు’’ నవ్వాడు. వాడు చెప్పేది నాకు తెలుసు. ఇవి వాడి మాటలు కావు, నేను చెప్పేవే. వాడిప్పుడు నాతో వల్లిస్తున్నాడు. అదే చిరునవ్వుతో.. ‘‘నీ దేవుణ్ని రాజకీయం ఎత్తుకపోయింది. నువ్వు మనస్ఫూర్తిగా దణ్నం పెట్టలేవు. నీ మీద పార్టీ ముద్ర పడిపోతుంది.’’

‘‘కానీ ఆ మాట, అది, నాకు ఇష్టం’’

‘‘ఇష్టాల్ని దాచుకో, మొహాన తగిలించుకుని తిరగొద్దు, కోకూడదు’’

‘‘భవ సాగరాన్ని దాటిస్తుందని..’’ నాటకీయంగా అన్నాను.

‘‘మనసు మీద, చెరగిపోకుండా  పదిలంగా రాసుకో ఖచ్చితంగా దాటిస్తాడు.’’

అనుమానంగా చూశాను.

‘‘మామా.. నీ బతుకు నీది కాదు. యూ ఆర్ ఆఫ్టరాల్ ఏ పప్పెట్. నీ నోట్లో వినీ వినీ నాకూ వచ్చేసింది.. ‘క్రీడా మృగా తే జనాః’! మన బతుకుల్తో ఆడుకునే వాడు దేవుడని అంటావు కద. కానీ ఆ దేవుడిని కిడ్నాప్ చేసిన వాడు వేరే ఉంటాడు. నీ బతుకును కూడా శాసించే శాసనకర్త వాడు. నీ తలరాత, విధిని మార్చి రాసే విధాన నిర్ణేత వాడు’’ ఆపాడు. ‘‘నువ్వు కాబట్టి ఇదంతా చెప్పాను. ఇంకొకడితో అంటే ఈ పాటికి నా జనాజాకు ఘుసుల్ అవుతుండేది’’ నవ్వాడు.

లంచ్ టైం అయిపోయింది. స్టిక్కరింగ్ వేయించలేదనే దిగులు వీడకుండానే సీటులోకి చేరుకున్నా. ఇంతలో వాట్సప్ మెసేజీ అలర్ట్. వాడినుంచే.. తెలుగులో టైప్ చేసి పంపాడు..

‘‘నిషా విషాదమ్మున..

విష కషాయమ్ముల..

ప్రవాహంలో కలిసిపో..

లేదా,

ఏరు ఒడ్డున వేర్లు తేలిన..

మాను లెక్కన ఉండిపో!

పుడమి గర్భం కోత పడితే..

మౌనమ్ముగానే ఒరిగిపో!’’

ఆలోచనలో పడిపోయాను. ఒరిగిపోయేదాకా, ఇలాగే ఉండిపోతాను. కలిసిపోను!

ఆ మధ్య బట్టలు కొనడానికి వెళ్లినప్పుడు  చందన వెటకారం గుర్తొచ్చింది. నాకు ప్లెయిన్ కలర్స్ ఇష్టం. నచ్చిందని యెల్లో అందుకోగానే.. ‘పొలిటికల్ ఎంట్రీనా’ అని కిసుక్కున నవ్వింది. అప్పుడు వెలిగింది బుర్ర! ఎరుపు, పసుపు, కాషాయం, ఆకుపచ్చ, బ్లూ, పింక్.. ప్లెయిన్‌గా ఏ రంగూ ఎంచుకోలేను. పొలిటికల్ ముద్ర పడుతుందని భయం. చివరికేదో అటూ ఇటూ కాని రంగుల్లో ఒకటి తెచ్చుకున్నాను.

ఇప్పుడు దేవుళ్ల వంతు. పార్టీలు హైజాక్ చేస్తున్నాయా? ఎవడిని మొక్కాలి? నాకిష్టమైన వాడి పేరు స్టిక్కర్ వేసుకోలేనా? వేసుకుంటే ఒకడు- తన విష ప్రవాహంలో కలిపేసుకుంటాడు. ఇంకొకడు నా మీద విషం కక్కేసి పోతాడు. ఇంకోసారి ఇంకో ఇటుకతో అద్దం పగలగొట్టేస్తాడు! ‘ఎవడు పగలగొట్టాడా’ అని నేను, గడ్డమున్న ప్రతివాడినీ అనుమానంగా చూస్తూ బతకాలిక!

ఎవడిదో ఉగ్రవాదానికి, ప్రతి గడ్డమూ, టోపీ ఐకాన్‌గా మారిపోతుంటాయి!

ఎవడిదో ఉన్మాదానికి ప్రతి దేవుడూ ఒక పర్యాయపదం అయిపోతుంటాడు!!

చూపు వాట్సప్ విండో మీద పడింది. ఇంతకీ వీడేం చెబుతున్నాడు. ప్రవాహానికి జడవకుండా ఉండమంటున్నాడా? మనసులో పదిలంగా ప్రతిష్ఠించుకో అన్నాడు.. ‘క్రీడార్థం సృజసి ప్రపంచమ్’ అంటూ ఎవడిదో ఆటకోసం మనం తయారయ్యాం అనే నా మాటల్నే గుర్తుచేశాడు! నిజమే, వాడి పేరు శ్రీనివాసరావో, శంకర్రావో అయిఉంటే ఇంకా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పి ఉండేవాడు. ఒక రామానుజుడు, ఒక ఆదిశంకరుడు కనిపిస్తున్నారు వాడిలో నాకు. వాడి పేరు రియాజ్ అహ్మద్.. పేరులో కాదుగానీ, వాడి మాటల్లో వారి సారం ధ్వనిస్తోంది నాకు!

* * *

ఆఫీసులో సెంట్రలైజ్డ్ ఏసీ చప్పుడు చేయకుండా చలిని కురిపిస్తోంది. మనసంతా ఉక్కపోత. గది అంతా రూమ్ స్ప్రేయర్ పరిమళాలే.. మనసుల్లోనే దుర్గంధం. పలకరింపుల్లో కనిపిస్తున్నవి నవ్వులే.. ఆ నవ్వుల్లో విరిసేవే విషం పువ్వులు!!

తలుపు తోసుకుంటూ, సరిగ్గా అప్పుడు లోపలికొచ్చాడు ఆపద్బాంధవుడిలాగా ఇనాయతుల్లా, ప్లేట్లో టీ కప్పుతో!

‘‘తల పగిలిపోతోంది మామూ.. దేవుడిలాగా వచ్చావు. వందేళ్లు నీకు’’

నవ్వాడు. అభావంగా, నిర్వేదంగా ఉందది. ఎప్పుడూ అలాగే నవ్వుతాడు. కానీ ఈ రోజెందుకో ఆ నవ్వు చూస్తే భయమేసింది.

నేను ఈ ఆఫీసులో చేరేప్పటికే బాయ్‌గా ఉన్న అతణ్ని మామూ అని పిలవడం అలవాటైపోయింది. అప్పటికి అతడి బెత్తెడు గడ్డంలో సగం ఉన్న తెల్లవెంట్రుకలు మొత్తంగా విస్తరించేసరికి నేను మేనేజర్ అయ్యాను. అతను రిటైరయ్యాడు. అయినా.. మేనేజిమెంట్‌తో మాట్లాడి ఎక్స్‌టెన్షన్ ఇప్పించాను. తనది కాని విషయంలో తలదూర్చడు. తన పరిధికి మించి ఒక్క మాట మాట్లాడడు. ఎవరైనా కోప్పడినా, మాటలు అన్నా.. శాంతంగా, కాదు, అభావంగా ఉంటాడు. ఎన్ని తరాల అనుభవంలోంచి వచ్చిందో.. ఆ ‘అభావం’లోంచి కొన్ని వందల భావాల్ని నాలోకి గుమ్మరిస్తున్నట్టు ఇప్పుడు కూడా అభావంగా నవ్వాడు. ఆ నిర్వేదాన్ని చూసి భయపడ్డాను. ‘‘కూర్చో’’ అన్నాను.

వెనక్కి మరలబోతున్నవాడల్లా, పజిల్డ్‌గా చూశాడు. ఎందుకని అడగలేదు. కుర్చీలో కూర్చోవడం జీవితంలో అదే తొలిసారి అన్నట్టుగా, ఒక చివర ఆనీ ఆననట్టుగా కూచున్నాడు.

‘‘ఏమైంది? ఎప్పుడూ సెలవు పెట్టవు. రెండు రోజులు ఆఫీసుకు రానేలేదు.. హెచ్ఆర్‌కు కూడా చెప్పలేదట’’

‘‘సాజిద్ హాస్పిటల్లో పడ్డాడు సర్’’

‘‘అరె.. ఏమైంది’’

‘‘.. ..’’

ఇనాయతుల్లాకు సాజిద్ అనే ఎదిగొచ్చిన కొడుకున్నాడని తెలుసు. తను రిటైరైనప్పుడు ఆ ఉద్యోగం కొడుక్కి వేయించమని అడిగాడు. నేనే ఒప్పుకోలేదు. కుర్రవాడికి వేరే మంచి అవకాశం చూడొచ్చుననే ఉద్దేశంతో. రెండ్రోజులు ఆస్పత్రిలో ఉంచాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? పైగా, ‘ఏమైంది’ అని అడిగితే ఈ మౌనం ఏమిటి? కొంపదీసి ప్రాణం పోయే జబ్బా? ఆ కంగారులో, చెప్పి తీరాల్సిందే అన్నట్టుగా  మళ్లీ రెట్టించాను ‘‘మామూ..’’

నా ముందున్న టేబుల్‌లోకి పాతేసిన చూపుల్ని కొన్ని క్షణాలు అలాగే ఉంచేశాడు. నెమ్మదిగా తలెత్తి ఒక్క క్షణం నా కళ్లలోకి చూశాడు. కళ్లలోకేనా? ఒక్క అంగుళం పైకి చూశాడా?

తన కళ్లలోని నిర్వేదాన్ని నా మొహం మీదికి గుమ్మరిస్తున్నట్టు, భయపెట్టే చూపుల్తో అన్నాడు. ‘‘యా..క్సిడెంట్ సర్’’. ఆ క్షణానికి అతి కష్టమ్మీద ‘‘అయ్యో..’’ అని మాత్రం అనగలిగాను. మళ్లీ అతను మాటాళ్లేదు. టీ కాస్త తాగాను. జేబులోంచి రెండువేలు తీసి ఇచ్చాను. అందుకున్నాడు. అత్త ఎలా ఉందన్నాను.. తలాడించాడు. ఇనాయతుల్లాను ఈరోజు ఎందుకు కూర్చోమన్నానో తెలీదు. బుర్రను తొలుస్తుండిన పిట్ట, ఈ యాక్సిడెంట్ దెబ్బకి తుర్రుమని ఎగిరిపోయింది. నా మౌనం చూసి, లేచి నిల్చున్నాడు. తలవంచి, రెండు వేలు నోటున్న కుడిచేతిని నెత్తిమీద టోపీ తాకేలా ఆన్చుకుంటూ ‘షుక్రియా సర్’ అన్నాడు. ‘సాజిద్ జాగ్రత్త’ ధైర్యం చెప్పాను.

* * *

‘‘నీతో అలా చెప్పాడా?’’ అన్నాడు రియాజ్. రంజాన్ నెల కాబట్టి, రియాజ్‌కు సాయంత్రం గంట ముందే వెళ్లిపోయే చాన్సుంది. అతనితో పాటు నేనూ వచ్చేశాను. ఇద్దరం నా కార్లో వెళుతున్నాం. ఇనాయతుల్లా ఇంటికెళ్లి పరామర్శిద్దాం అని వాడినీ అటు బయల్దేరదీశాను. ‘‘కాదా’’ అనుమానంగా అడిగాను, డ్రైవ్ చేస్తూనే.

‘‘నాకిలా జరిగిందని చెప్పుకోడానికి కూడా భయపడే స్థితిలో బతుకుతున్నాం మనం’’ అన్నాడు.

భుజాలు తడుముకున్నాను. నన్ను ఉద్దేశించే అన్నాడా? మొదటిసారి కారు అద్దం పగిలినప్పుడు ఆఫీసులో అడిగితే.. పార్క్ చేసి ఉన్నప్పుడు పైనుంచి చెట్టుకొమ్మ విరిగిపడిందని చెప్పాన్నేను, ఏం జరిగిఉంటుందో తెలిసినా! రియాజ్ మాటల్లో వెటకారం లేదు. చెప్పుకుంటూ పోయాడు. నాకు అర్థమైంది ఇదీ..

ఇనాయతుల్లా కొడుకు సాజిద్ డిగ్రీ చదువుతున్నాడు. తెల్లారుజామున న్యూస్ పేపర్ వేస్తుంటాడు. వీధిలోంచి పేపరు విసిరడం ఇష్టపడని ఒక కస్టమరు ఇంటి తలుపు దగ్గర పెట్టేసి, ప్రహరీ గేటు నుంచి బయటకు వస్తుండగా.. అటుగా, ఆ సమయంలో వ్యాయామశాలకు వెళ్తున్న కుర్రాళ్లు చూశారు. మా యిళ్లలోంచి వస్తున్నావేంట్రా అని నిలదీశారు. వాడి సైకిలు మీద, పంచుతున్న వాటిలో అది చివరిపేపరు. తాను పేపర్ బాయ్ నని నమ్మించేలోగానే కొట్టారు. మా అమ్మాయిలు కావాలారా.. డైరక్ట్‌గా ఇళ్లమీద పడ్తున్నారా? అంటూ కొట్టారు. కాదని ప్రతిఘటించేసరికి మళ్లీ కొట్టారు. ఒక్కడు- నలుగురు! మీరెలాంటి నా కొడుకులో సినిమాలో చూశాంరా.. అని కొట్టారు. ఈ దేశం మాది, మీరెందుకు ఉన్నార్రా..? అంటూ కూడా కొట్టారు. చావ చితక్కొట్టి, రోడ్డు మీద ముద్దలా వదిలేసి వెళ్లారు.

నాకు భయమేసింది. ఫలానా వ్యక్తినే కొట్టాలనే కక్ష లేదు! ఫలానా కారే పగలాలనే కాంక్ష లేదు! లేని కారణాలకు, సమూహాన్ని ద్వేషిస్తూ, వ్యక్తుల మీద పగ తీర్చుకుంటున్నందుకు భయమేసింది. ‘ఒక్కడు- నలుగురు’ అనేది సిద్ధాంతంగా మారుతోందని తలచుకుని భయమేసింది.

ఇనాయతుల్లా కొడుకు రూపం నాకు గుర్తొచ్చింది. ఇంకా పిడికెడుగా ఎదగని లేత గడ్డం, నెత్తిన టోపీ, సుర్మా పెట్టుకున్న కళ్లు! ఆలోచనలు గజిబిజిగా మారుతుండగా..  అన్నాను

‘‘గడ్డం లేకపోతే ఇది జరిగేది కాదేమో’’. నవ్వాడు రియాజ్!

‘‘గడ్డం అంటే స్టిక్కర్ కాదు’’ హర్ట్అయి చూశాను. చెబుతూ పోయాడు.. ‘‘పగలకొడతారు కాబట్టి, నువ్వు కారు మీద స్టిక్కర్ తీసేశావు. విరగ్గొడతారు కాబట్టి, వాణ్ని మొహం మీద గడ్డం తీసేయమంటున్నావు. అంతేకదా’’ నీలాంటి వాడు అంతకంటె ఏం సొల్యూషన్ చెప్పగలడు అనే నిలదీత ఉందా మాటలో, కమ్చీతో కొట్టినట్టుగా. అవును, బతకడానికి అస్తిత్వాల్ని దాచేసుకోవడం మొదలైతే, ఆగేదెక్కడ?

సాజిద్‌కు ఒళ్లంతా బ్యాండేజీలే. ఒక చెయ్యి మాత్రం విరిగింది. ఏం జరిగిందో తెలిసినా, కేవలం పరామర్శకోసమే వెళ్లినా.. వాడితో నాలుగు మాటలు మాట్లాడించడం చాలా కష్టమైపోయింది. చాలా సేపటికి సాజిద్ నాతో ఒక మాటన్నాడు. ‘‘కొడుతున్నంత సేపూ ‘మీరు.. మీరు..’ అంటూ తిట్టారు అంకుల్. కానీ,’’ నాతో చెప్పవచ్చా లేదా అనే భయం అడ్డుతున్నట్టుగా ఆగాడు. మళ్లీ తనే ‘‘కానీ, వాళ్లు చెప్పే ‘మీరు’ వేరు.. ‘మేం’ వేరు!’’

మనసు అలసిపోయింది. ‘ఏమిటి భగవంతుడా.. ఈ రోజున ఇంకెన్ని కమ్చీ దెబ్బలు రాసిపెట్టావు నాకు’ మౌనంగా వేడుకుంది.

నిజమే. కొట్టినవాళ్లు- ద్వేషిస్తున్న వాళ్లు వేరు, వీడు వేరు! వీళ్లను భయపెడుతున్న వాళ్లు వేరు, నేను వేరు! వీడికి చేయి విరిగింది. నాకు కారు పగిలింది.

‘‘వాడెందుకో నాతో మాట్లాడ్డానికి భయపడుతున్నాడు..’’ అక్కడినుంచి వచ్చేశాక, డ్రాప్ చేయడానికి  రియాజ్ ఇంటివైపు వెళ్తుండగా అన్నాను. పగలబడి నవ్వాడు. ‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం డ్రస్‌లో ఇలా ఉంటావు గానీ.. నీకు ఓ పంచె కట్టి చేతికి వేపాకు మండలు ఇస్తే దెయ్యాల్ని తోలే మంత్రగాడిలా ఉంటావ్..’’ నవ్వుతూనే అన్నాడు. నాకూ నవ్వొచ్చింది. కానీ ఏం చేయను. ఎర్రటి కుంకుమ బొట్టు, కాస్తపెద్దదిగా పెట్టుకోవడం చిన్నప్పటినుంచి అలవాటైపోయింది. ఈ తరం కుర్రాడే అయినా కార్తీక్‌ కూడా అంతే! ‘‘ఇది మా ఆచారం రా’’ అన్నాను.

వాడి నవ్వు ఆగిపోయింది. ‘‘మీకు బొట్టు. మాకు గడ్డం. ఆచారాలే. నువ్వు పాటిస్తావు. నేను పాటించను. సాజిద్‌కి గడ్డం- ఆచారం దశ దాటి, అవసరం దశలోకి వెళ్లిపోయింది.  ఆరోజు రోడ్డు మీద ముద్దలా పడి ఉంటే, పొద్దున్నే చికెన్ కొట్టు తెరవడానికి వెళ్తున్న రెండు గడ్డాలే వాణ్ని తీస్కెళ్లి ఆస్పత్రిలో వేశాయ్!’’

* * *

మనుషులు ఎదుటి వాడి కళ్లలోకి చూడడం మానేశారు. కళ్లతో నవ్వడం, కళ్లతో మాట్లాడడం, కళ్లలో స్నేహం కురిపించడం మర్చిపోయారు. కళ్లకు అంగుళం పైన బొట్టు చూసి భయపడతారు, ఛీత్కరించుకుంటారు! కళ్లకు నాలుగంగుళాల కింద గడ్డాన్ని చూసి అనుమానిస్తారు, అసహ్యించుకుంటారు! బొట్టు పెట్టుకోవాలని వేదం చెప్పదు. గడ్డం పెంచాలని ఖురాన్‌లో లేదు!

మనం మనుషులుగా బతుకుతున్నామా.. మతాలుగా బతుకుతున్నామా? ఆచారాలు, కోడ్ గుర్తులుగా మారాయా? కోడ్ గుర్తులే ఆచారాలు అయ్యాయా? ఎంత దైన్యం?

* * *

‘‘జరీనాను అడిగితే నేర్పట్లేదు.. నేను పిన్ని దగ్గరకొచ్చి నేర్చుకుంటాను బాబాయ్’’ అంది చందన,  మా ఇంటికొచ్చి ఆరోజు బిర్యానీ వండిన రియాజ్ భార్య మీద పితూరీ చెబుతూ.

‘‘కూతురు పుట్టలేదని ఇప్పటికీ ఏడుస్తుంటుంది. నువ్వడిగితే తనకు వచ్చినవన్నీ నేర్పేస్తుంది బేటీ’’ అంటూ నవ్వాడు ఇనాయతుల్లా.

రియాజ్‌ని ఇంట్లో డ్రాప్ చేసేశాక, ఆ సాయంత్రం, జరీనా అందించిన కమ్మని సేమియా తిని, చెప్పాను. ‘‘రేపు సాయంత్రం నువ్వు మనింట్లో బిర్యానీ వండాలమ్మా మీ వదినకు చేతకాదు’’ అని! ‘‘అంతకంటేనా అన్నయ్యా’’ అంటూ నవ్వుతో ఒప్పుకుంది. మూడు కుటుంబాలకి అలా మా ఇంట్లోనే విందు ఏర్పాటు అయింది.

‘‘అద్దం పగలగొట్టిన వాళ్లెవరో తెలిస్తే.. పిలిచేసి ఉండేవాణ్ని’’ అన్నాను సరదాగా.

‘‘నీలా ఇంకొకడు ఇలా బంధాల్ని బిర్యానీగా వడ్డిస్తే.. ఇంకెవరి అద్దమూ పగలదులే’’ రియాజ్ మళ్లీ నవ్వాడు.

‘‘కరక్టే. జరీనాలాగా ఇంకెవరైనా ప్రేమని సేమ్యాగా తినిపిస్తే.. మరొక సాజిద్ చెయ్యీ విరగదు’’ నేనన్నాను.

మీకు పంచిన వెలుగు సార్థకమైందని, సూర్యుడు ఇంకో ఊరు వెతుక్కుంటూ అస్తమిస్తున్నాడు.

రియాజ్, జరీనా బేగం, ఇనాయతుల్లా, మా చందన సంపాదించుకున్న కొత్త పిన్నీ నలుగురూ నమాజ్ పూర్తి చేశారు. ఖజూర్ పళ్లనూ, సేమియా పాయసాన్నీ తీసుకువచ్చి అందరికీ అందించింది మా ప్రియ. లోపలి గదిలో కార్తీక్‌, సాజిద్ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ‘‘వినాయకచవితి నాటికి నువ్వు మా ఇంటికొచ్చి ఉండ్రాళ్లూ కుడుములూ చేయాలి. ఆరోజు అందరి భోజనాలు అక్కడే..’’ జరీనా- చందనతో క్విడ్‌ప్రోకో ఒప్పందం చేసుకుంటోంది.

ప్రకాశం తగ్గి, మసక చీకటి ముసురుతోంది.

మనసుల్లో విషం ఇగిరిపోతుంది. మనుషుల్లో ద్వేషం ఎగిరిపోతుంది. ఎగువకు, దిగువకు చూడక.. అచ్చంగా కళ్లలో, ప్రేమ అమృతంగా కురుస్తోంది ఆ రాత్రి! ఆకలి రుచి తెలిపే రోజా ముగిసింది! మృష్టాన్న భోజనం పిలుస్తోంది. దీపాలు వెలిగాయి. కొత్త కాంతి పరచుకుంది!

ఇది ఇఫ్తార్.

*

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • గుబులు ను నేనూ కొన్ని అక్షరాల్లోకి ఒంపుకున్నాను కవిత్వ రూపంలో

  అదే గుబులు ఇలా కథలా కమ్మగా చదవడం చాలా బాగుంది

  ఎక్కడా లేవని చెప్పను కానీ
  ఉన్నవన్నీ ఒక్కలాంటివి మాత్రం కాదు

  ఆ నమ్మకమే బంధాలను బతికించాలి

 • మంచి కధ. ఇవాళ్టి దేశ పరిస్థితి బాగా చెప్పారు. ముగింపు బావుంది.

 • విద్వేషాలతో రగిలిపోతున్న సమాజానికి,కాయకల్ప చికిత్స లాంటి కథ.సాహిత్యం ఏం చేస్తుంది అనే ప్రశ్నకు,మనిషి అంతరంగంలో మార్పుకు బీజం వేస్తుందనే సమాధానమే ఈ కథ.అధ్బుత కథనంతో ఆద్యంతం ఆకట్టుకుంది.అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు