ఇప్పటి సాహిత్యం గురించి కొన్ని ప్రశ్నలు!

ఈ వ్యాసంలోని వివిధ అంశాలపై మీ అభిప్రాయాలు రాయండి!

నకు తెలుగులో నూరేళ్ళకు మించిన ఆధునిక సాహిత్యం ఉంది; అంతకుముందు దాదాపు వెయ్యేళ్ళ ప్రాచీనసాహిత్యం ఉంది. ఆధునిక సాహిత్యం వచ్చిన ఈ నూరేళ్ళ పైచిలుకు కాలంలో, ఇరవయ్యేళ్లను ఒక తరంగా లెక్కిస్తే అయిదుతరాలు గడిచాయి. విద్యపరంగా, సాంకేతికత పరంగా ఎన్నో మార్పులూ వచ్చాయి. ఆలోచనల్లోనూ, ఆదర్శాల్లోనూ, అభిరుచుల్లోనూ, భాషలోనూ, అభివ్యక్తిలోనూ తరానికి తరానికి మధ్య సహజంగానే అంతరం ఏర్పడుతూ ఉంటుంది; ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరికొకరు బోధపడని పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా తొంభై దశకం తర్వాతికి వస్తే దేశంలో సాంకేతిక అభివృద్ధీ, ఆర్థికబలిమీ అనూహ్యవేగాన్ని తెచ్చుకున్నాయి. ఆ దామాషాలోనే తరాల మధ్య బోధపడనితనం కూడా పెరుగుతూవచ్చింది. అలాగని, ప్రతి తరంలోనూ తమను పునర్నవం చేసుకుంటూ తరాల అంతరాలను దాటగలిగేవారు ఉండరని కాదు, తప్పకుండా ఉంటారు.

ఏ సాహిత్యమైనా నిర్దిష్ట స్థల, కాలాలలోనే పుడుతుంది. అదే సమయంలో స్థలకాలాలను దాటి తన అస్తిత్వాన్ని నిలుపుకునే లక్షణం కూడా దానికి ఉంటుంది. కనుక అంతవరకు వచ్చిన ఉత్తమసాహిత్యాన్ని ఎంచి చూపి రేపటి తరానికి అందించే బాధ్యతా, ఆ మేరకు మార్గదర్శనం చేయవలసిన బాధ్యతా ముందు తరాలకు ఉండదా? ఆ బాధ్యతను మనం గుర్తించామా? అంతవరకు సముద్రంలోకి దిగిన అనుభవం కానీ, రత్నసేకరణా, పరీక్షానుభవం కానీ లేని ఓ కుర్రాడికి సముద్రాన్ని చూపించి ఇందులో గొప్ప రత్నాలున్నాయి, తీసుకొమంటే అతను తీసుకోగలడా? మనమే చేయిపట్టుకుని అతన్ని సముద్రంలోకి ఒక్కొక్క అడుగే నడిపించి, రత్నాలను ఎంచి చూపి, అవి ఎందుకు రత్నాలు అయ్యాయో చెప్పనవసరం లేదా?…ఇలా అనేక ప్రశ్నలు.

త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’ గురించి ఆమధ్య ఫేస్ బుక్ లో ఒక చిన్న పోస్ట్ కనిపించింది. శ్రీమహలక్ష్మి అనే ఆమె రాసిన పోస్ట్ అది. “చదవడం మొదలుపెట్టగానే అసలు ఏమీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా, ఏం చదువుతున్నానో అర్థం కాకుండా ఉంది” అని అది మొదలవుతుంది. “బుక్ గురించి విన్నంత hype చదువుతున్నప్పుడు కనిపించలేదు” అని అంటారామె. ఇటీవలి తరాలు ‘అసమర్థుని జీవయాత్ర’ నవలను చదవాలని అనుకోవడమే తెలుగు సాహిత్యం భవిష్యత్తుపై గొప్పఆశాభావాన్ని, భరోసాను కలిగిస్తుంది. మనం యువతరాన్ని అన్యాయంగా శంకించి ఆడిపోసుకుంటాం కానీ; తరాలకు అతీతమైన సాహిత్యాభిరుచి వారిలోనూ పుష్కలంగా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వగైరా తేడాలను కూడా మరీ భూతద్దంలో చూపిస్తాం. అదే సమయంలో కాలికమైన అంతరంవల్ల ఆ నవలతోనూ, ఆ నవల పుట్టుక వెనుక తెలుగునాట ఉన్న సామాజిక, సాంస్కృతిక, తాత్విక, ఆర్థికపరిస్థితులతోనూ కొత్త తరాలకు తగిన పరిచయం ఉండి ఉండకపోవచ్చు. ఆ పరిస్థితుల నేపథ్యంనుంచి అది ఎందుకు గొప్పనవలో కొత్తతరాలకు తెలియచెప్పడానికి ఏమైనా ప్రయత్నించామా?

తమకున్న పరిమితుల్లోనే కావచ్చు, మన పూర్వులు ఈ సమస్యను మనకంటే ఎక్కువ దూరదృష్టితో, ఎక్కువ బాధ్యతతో పరిష్కరించారనిపిస్తుంది. సంస్కృతకావ్యాల విషయంలోనే కానీ, తెలుగు కావ్యాలు, ప్రబంధాల విషయంలోనే కానీ ఒక సంఖ్యను నిర్ణయించి, వాటిని తప్పక చదవాలని నిర్దేశించడం; ఇప్పటి మాటలో చెప్పాలంటే ఒక సిలబస్ ను ఇవ్వడం కనిపిస్తుంది. ఆధునిక తెలుగు సాహిత్యం విషయంలో మనం అలాంటి ప్రయత్నం ఏమైనా చేశామా, చేస్తున్నామా?

అయితే ప్రాచీనసాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. ప్రాచీన సాహిత్యం ప్రధానంగా పఠనపాఠనసంప్రదాయంలో భాగమై తన అస్తిత్వాన్ని నిలుపుకోగలుగుతూ వచ్చింది. రసమూ, అలంకారమూ, ఛందస్సు, వ్యాకరణం, కథాకథనం, శిల్పం వగైరాలు ప్రాచీనసాహిత్యపరిశీలనలో ముఖ్యమైన తూనిక రాళ్ళు అయ్యాయి. ఆధునికసాహిత్యానికి వచ్చేసరికి, సమాజమూ, కాలికతా వగైరాలు రచనాపరిశీలనలో ముఖ్యాంగాలు అయ్యాయి. ఒక రచన వైశిష్ట్యాన్ని బోధపరచే ప్రయత్నంలో ఇవి తప్పనిసరి దృక్కోణాలయ్యాయి.

***

కొత్త తరాలు ఆధునిక తెలుగు సాహిత్యం అనే సముద్రంలోకి మరింత ముందుకూ, లోతుకూ వెళ్లడానికి ఏ విధంగా చేయూతనివ్వచ్చు? గత నూరేళ్ళ పైచిలుకు కాలంలో వచ్చిన ఓ పాతిక ఉత్తమకవితలను, ఓ పాతిక ఉత్తమ నవలలను, ఓ పాతిక ఉత్తమ నాటకాలను,  ఓ రెండువందల ఉత్తమకథలను, ఓ యాభై ఉత్తమవిమర్శగ్రంథాలను ఎంపిక చేయడం అందుకొక ప్రారంభం కావచ్చు. అయితే, ఈ ప్రక్రియలకే పరిమితమవాలని కానీ, ఈ సంఖ్య ఇలాగే ఉండాలని కానీ ఏమీలేదు. ప్రక్రియలు, సంఖ్య విషయంలో అందరూ కలసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అవసరమనిపిస్తే సంఖ్యను పెంచుకోవచ్చు. అయితే ఆ పెంపు అసలు లక్ష్యాన్ని పలుచన చేసేలా ఉండకూడదు. ఒక దశకాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ దశకంలో వచ్చిన సాహిత్యాన్ని ఎంచవచ్చు. ఆ దశకంలో అలాంటి సాహిత్యమే ఎందుకు వచ్చిందో అవగాహన కలిగించవచ్చు. ఇలా ఎంచే ఆధునికసాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం ఫక్కీలోనే సవ్యాఖ్యానంగా ప్రచురించాల్సి ఉంటుంది.

తొలి ఘట్టంలో ఎంపికదారులు, తదుపరి ఘట్టంలో వ్యాఖ్యాతల అవసరం ఏర్పడుతుంది. అంతే ముఖ్యంగా, ఏ ప్రచురణకర్త అయినా ఈ భారాన్నివహించడానికి ముందుకు రావలసి ఉంటుంది. ఉత్తమసాహిత్యం ఎంపిక కానీ, ప్రచురణ కానీ అంత తేలిక కాదు. ఎంపికలో చాలా రకాల వివాదాలు తలెత్తుతాయి. ప్రాంతాలు, సామాజికవర్గాలు, జెండర్ తేడాలు ఉంటాయి.  కనుక ఆయా ప్రమాణాలను, పద్ధతులను చాలా జాగ్రత్తగా, సమష్టి అంగీకారంపై రూపొందించుకోవాలి. చివరికి మెజారిటీ నిర్ణయాన్ని అనుసరించాలి. అంతా పారదర్శకంగా, ప్రజాస్వామికంగా జరగాలి. ఆ తర్వాత ప్రచురణలో కాపీరైట్ సమస్యలు తలెత్తుతాయి. హక్కుదారులకు తగు మొత్తాలలో డబ్బు చెల్లించి హక్కులు పొందాల్సి ఉంటుంది. చూడబోతే, ఇది ఎవరో కొందరు వ్యక్తులు, సాహితీసంస్థలు, ప్రైవేట్ ప్రచురణకర్తలు చేపట్టగల పనిగా తోచని మాట నిజమే. అలాగని విస్మరించదగిన పనీ కాదనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం -రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల్లోని తెలుగు పీఠాలు, సాహిత్య అకాడెమీలు రంగప్రవేశం చేయడం, ఆ మేరకు సాహిత్యప్రేమికులు వాటిపై ఒత్తిడి తేవడం! తెలుగు రాష్ట్రాలు విడివిడిగా కాకుండా కలసి ఈ పని చేయడం ఎంతైనా అభిలషణీయం.

కొత్త తరాల కోసమని మొదట్లో అన్నా, ఇంతా రాసిన తర్వాత, తరాల తేడా లేకుండా ఇది అందరికీ అవసరమేనని ఇప్పుడనిపిస్తోంది. పాత తరాలకు మాత్రం నూరేళ్ళ పై చిలుకు ఆధునిక తెలుగు సాహిత్యమంతా కరతలామలకమైపోయిందని ఎలా అంటాం? కొత్త తరాలనే వేలెత్తి చూపడం అన్యాయం కాదూ? ఎలాంటి మినహాయింపూ లేకుండా ఆధునిక తెలుగు సాహిత్యంలోని ఉత్తమరచనలన్నీ అందరి వేళ్ళ మీద కాకపోయినా, కళ్ళముందు ఉండాలంటే ఇలాంటి ప్రయత్నం ఏదైనా జరగాల్సిందే. తెలుగులో ఇంత గొప్ప సాహిత్యం ఉందని ప్రపంచానికి చెప్పడానికి, ప్రపంచభాషల్లోకి అది వెళ్లడానికి కూడా ఇలాంటి షోకేసింగ్ అవసరమే.

***

అసలీ మొత్తం ఆలోచనే తప్పు, ఇది ఏమాత్రం ఆచరణసాధ్యం కాకపోగా అర్థరహితమని కూడా ఎవరికైనా అనిపించవచ్చు. ఒక రచన ఉత్తమమని, ఇంకొకటి కాదని నిర్ణయించడానికి వీళ్ళెవరు, వీళ్ళ అర్హతేమిటన్న ప్రశ్నా రావచ్చు. ఇది చదివిన పాఠకుల్లో ఎక్కువమంది ఇలాగే భావించినప్పుడు పైన రాసినదంతా నిరభ్యంతరంగా పక్కన పెట్టేయవచ్చు. అయినా సరే ఒక ప్రశ్న మిగిలిపోతుంది:

సముద్రం ఎంత గొప్పదైనా అది అనంతంగా విస్తరిస్తూపోయినప్పుడు ఆ గొప్పదనం మన చూపులకు, మన అనుభవానికి ఎలా అందుతుంది?! ఏంచేస్తే అందుతుంది?!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

భాస్కరం కల్లూరి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • రచయిత అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. ఆధునిక సాహిత్యం రచయిత అన్నట్లు ప్రాంతాలు సామాజిక భాష యాస వివక్ష ను ఎదుర్కొంటుంది. సముద్రంలోని రత్నాలను ఏరి చూపటం సాధ్యం కాక పోవచ్చు ఎందుకంటే ఒక పాఠకుణ్ణి చేరిన సాహిత్యం మరో పాఠకుణ్ణి చేరలేక పోవచ్చు. సమ కాలీన సాహిత్యం లో రత్నాలున్నాయి. అవి ఏరి పుస్తకాలు ప్రచురించ గల పబ్లిషర్స్ బహు తక్కువ. పుస్తకం కొనే పాఠకుల తరుగుదల కూడా కారణం. రెండు తెలుగు రాష్ట్రాల పీఠాలు కలిసి పని చేయాలనే తలంపు మంచిదే కానీ యాస ను అవహేళన చేసిన గతం వల్ల సాధ్య పడక పోవచ్చు.

 • Absolutely agree with you, Bhaskaram garu. But, who will bell the cat? It is a million dollar garagutan question. Best. V R Veluri

 • ఆవిడ అన్నది నిజమే..అసమర్థుని జీవయాత్ర అర్థం కాలేదంటే ఎవరైనా నవ్వుతారేమోనన్న సంశయం నాకుండేది.. విశ్లేషణలు కొంతవరకు హెల్ప్ చేస్తాయి మీరన్నట్లు…
  అలాగే మంచి నవలలు, కథలు చాలా వరకు గుర్తించినట్టున్నారు

 • త్రిపుర నేని మధుసూదనరావు సాహిత్యంలో వస్తు శిల్పాలు లో వెన్నెముక దీని మధ్య తరగతి సాహిత్యంలోకి ప్రవేశించింది ఈ వందేళ్ళుగా రాయడం చదవడం చర్వితచర్వణంగా ఆముచ్చట్లు చెప్పుకో టం ఒక వ్యసనంగా వ్యాపకంగా మారింది. ఇంకా త్రిపురనేని మాటల్లో ఈ శిష్టులు జనసామాన్యానికిలేని రస దృష్టి తమకే ఉందనుకుంటారు. అలిఖిత సాహిత్యాన్ని జానపద సాహిత్యం అని ముద్దు పేరు పెట్టారు.

 • గత నూరేళ్ళ పైచిలుకు కాలంలో వచ్చిన ఓ పాతిక ఉత్తమకవితలను, ఓ పాతిక ఉత్తమ నవలలను, ఓ పాతిక ఉత్తమ నాటకాలను, ఓ రెండువందల ఉత్తమకథలను, ఓ యాభై ఉత్తమవిమర్శగ్రంథాలను ఎంపిక చేయడం అందుకొక ప్రారంభం కావచ్చు.

  బాగుంది.

  అయితే సమస్యల్లా ఈ “ఉత్తమ ల” తోనే

  ఉత్తమ లు వారి వారి అభిరుచి, పక్షపాతం, కులాభిమానం, ప్రాంతీయతతో వర్ధిల్లితే … ?

 • మీరు చెప్పింది బాగానే వుందికానీ
  మంచి-చెడు సాహిత్యాలను విడదీసి చెప్పేదేవరు?
  ప్రతి వారికీ ఒక లింకు వుంటుంది.అది స్వంతంగా ఆలొచించనివ్వదు .
  ఒకటే మార్గం:
  1) ఆ సాహిత్యం ఎందుకు మంచిదో చెప్పడం.
  2)ఎందుకు మంచిది కాదో వివరించడం.
  ఈ బిగింపుల మధ్య చదివేవాళ్లు/రాసేవాళ్లు ఝడుసుకుని పారిపొతే….!!
  —డా కె.ఎల్.వి.ప్రసాద్
  సికిందరాబాద్.

 • చాలా వివరంగా రాశారు. ఒక చిన్న సందేహం. కొన్ని పదాల ప్రయోగం భాషని క్లిష్టతరం చేస్తుఃదనిపిస్తుంది. మీరు ప్రయోగించిన కాలికము అన్న పదం అంతగా వాడుకలౌ లేదు. ఏమైవుంటుందా అన్న సందేహం వుఃడిపోయిఃది. మీ ఈ వ్యాసంలో ఇలాంటి ప్రయోగాలు ఆధునికుల సాహిత్యంలో ఎక్కువగా కనిపిసఱతాయి. వాళ్లకి బాగా అనుభవమైన ఇంగ్లీష్ పదానికి సరితూగే తెలుగు పదాన్ని అన్వేషిస్తూ రాసే ప్రయతఱనంలో కొన్ని క్లిష్టమైన అంతగా వాడుకలో లేని పదాలు కనపడుతున్నాయి. సందర్భానుసారం అర్దమైందనుకున్నా ఒక శంక వుండిపోతుంది.

 • ఇందులో ఎన్నో ఆలోచించదగిన అంశాలు ఉన్నాయి.

  ఒక యాభయ్యేళ్ళ క్రితం కొత్త, విప్లవాత్మక వస్తువులు, భావాలు, శైలి వల్ల గొప్పతనాన్ని పొందిన రచనలు ఆ తర్వాతి కాలంలో ఆయా ప్రత్యేకతలు సామాన్య పాఠక రచయితలకు రోజువారీగా కనిపించటం మొదలుపెట్టటం వలన అంత గొప్పగా కనిపించక పోవచ్చు. అలానే గొప్పవిగా చెప్పబడే ఇంకా చాలా పుస్తకాలు, రచనా కాలం నుండీ ఇప్పటికి వచ్చిన సామాజిక, రాజకీయ మార్పుల వల్ల తమ ప్రాసంగికతను కోల్పోయి ఉండవచ్చు.

  అటువంటి సందర్భాల్లో సమకాలీన సామాజిక, సాహిత్య వాతావరణాన్ని వివరించి, ఆ రచన గొప్పతనాన్ని స్పష్టం చేసే వ్యాఖ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

  గొప్ప పుస్తకాల పట్టిక కన్నా, గొప్ప పుస్తకాలకు ఇటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయని నా అనుకోలు. ఉదాహరణ మీ వేయిపడగలు నేడు చదివితే.

 • అంతా చక్కగా విశ్లేషించారు భాస్కరంగారు. సమిష్టి గా ఎక్కువ మంది మంచిది అని అంగీకరించిన రచపలని ముద్రణకి స్వీకరించాలనేదీ కొంత సమస్యాత్మకం కావచ్చును- సాథారణంగా మనం చూస్తున్నాం ఒక రాజకీయ సిద్ధాంతాన్నో , ఆథ్యాత్మిక దృక్నధాన్నో నమ్మిన కొందరు ఒక కూటమిగా ఏర్పడి మంచికథలని నిర్ణయిస్తారు. అలాఃటి సందర్భాలలో అన్నిసార్లు ప్రతిభకి న్యాయం కలగదు. లేదా వ్యాపారదృక్పథం సేలబలిటీ ప్రాధాన్యత ని సంతరించుకుంటాయి. అప్పుడు కూడా సరియైన నిర్ణయాలు జరగవు.. ఇదిపరిగణనలోకి తీసుకోవాలి. మనం నమ్మిన దాన్ని కాకుండా రచయిత తాను నమ్మిన దానిని ఎంత నమ్మకం కలిగేలా చెప్పగలిగాడనేది ప్రామాణికం కావాలి. సాహిత్య విలువల్ని నిలబెట్టే రచనలే నాలుగు కాలాలపాటు నిలుస్తయని అఃదరూ నమ్మకపోవచ్చుకదా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు