ఇన్‌ టు ది రిలేషన్‌…

“ఫ్లాష్ ఫిక్షన్”- ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్న కథనవిధానం. దీన్ని తెలుగులో మనం “మెరుపు కథలు” అనవచ్చేమో! ఈ శీర్షికకి మీ కథలు పంపించండి.

జీవితంలో మొదటిసారి ప్రేమ – కొంచెం ఆలస్యంగా!

ఓ పదేళ్ళ కిందట పరిచయమై ఉండుంటే మీతో ఒక కొడుకునో కూతుర్నో కని ఉండేదాన్ని – అంది ఆమె నివ్వెరపోయి  మరి సమాజమో  అన్నాడు.

నాకు మీరంటే ఇష్టం అదొకటే ముఖ్యం నాకు – నేను సమాజాన్ని పట్టించుకోను అని మీకు తెలుసు – అందామె!

అవునూ  ఎప్పుడంటే అప్పుడు నాకెప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అయిపోతావు నీకేమీ అడ్డంకులు లేవా అనడిగాడు ఓసారి ఓ శుష్కహాసం చేసి – లేవు హిస్ట్రెక్టమీ అయిపోయింది అంది క్లుప్తంగా!

నేను మీ మీద ఫైనాన్షియల్‌ గా డిపెండ్‌ అయి లేను కాబట్టే మన రిలేషన్‌ ఇంకా బాగుంది అందామె
అవును నిజమే అన్నాడు నిజాయితీగా!

ఇంతకుముందు వచ్చినట్లుగా ఇప్పుడు రావడం లేదు మీకు నా కోసం సమయం లేదు అంది కినుకగా
మొదట్లో ఉన్న తొందర ఇప్పుడు ఉండదు కదా మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే అన్నాడు పరాకుగా!

ఫోన్‌ లో అలకలు, కన్నీళ్ళు, బెదిరింపులు ఏవీ ఉండవు నిరాశ తప్ప, వస్తా వస్తా అనే ఆశ్వాసనా, వస్తాడనే నమ్మకం తప్ప!

నాకు కుటుంబమే ప్రయారిటీ, నా కుటుంబం తర్వాతే ఇంకేదైనా అని ఖచ్చితంగా అన్నాడు
సరే మీ కుటుంబమే నా ప్రయారిటీ కూడా… మీరు బాగుండాలి!

అతను బాగున్నాడు!

ఆమె కూడా బాగుంది – ఎదురుచూస్తూ!

*

గీతా వెల్లంకి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు