ఇది నాకు సరయ్యిన  సిచ్చే…     

 తెలుగు పాఠకులు అసలు కథలు చదువుతున్నారా…?

రానురానూ కథలకు ఆదరణ తగ్గిపోతోందా….?

 పాఠకులు  కథలను పట్టించుకోవడం లేదా…?

తెలుగు సాహిత్యకారులు ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటున్న తరుణంలో… తన మునికాంతపల్లి కథలతో ఒక కలకలం సృష్టించాడు సోలోమోన్ విజయకుమార్. మంచి కథలకు, కొత్త తరహా కథలకూ ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించాడు. తన మునికాంతపల్లి  కథలు అద్భుతం అనే ఆకాశానికి ఎత్తిన వాళ్లు ఉన్నారు. అబ్బే ….అన్న వాళ్లూ ఉన్నారు. అభిప్రాయం ఏదైనా కావచ్చు, కానీ సోలోమన్ తన కథలతో చెప్పాలనుకున్నది చెప్పాడు.  

విజయకుమార్  తనకు తెలిసిన ప్రపంచాన్ని, తనతో కలిసి తిరిగిన మనుషులను, తనకు తెలిసిన భాషలోనే చెప్పిన కథలు మునికాంత పల్లి కథలు. అవి చదివిన పాఠకులు నెల్లూరు జిల్లాలోని మారుమూల పల్లెని దళిత గూడెంను స్వయంగా తిరిగి వచ్చిన అనుభూతి పొందారు. నక్కలోల్ల బిజిలీ, పెంచిలవ్వ, సుబ్బులు, సుధాకర్  లాంటి…పాత్రలతో కలిసి మాటాడిన అనుభూతి పొందుతారు.  

ఇప్పటికే చాలా మంది చెప్పిన దళిత జీవితాలను, అవే దళిత కథలకు…. తనదైన నెరేషన్, మాండలికం సొగసు అద్ది, పచ్చి సహజత్వంతో చెప్పిన సోలోమన్ విజయకుమార్ ..తనదైన కథలతో సాగిపోతున్నాడు.

సారంగ పాఠకుల కోసం తన మర్చిపోలేని కథ  ఎంగిలోడు గురించి ఇలా పంచుకున్నారు.  

ఎంగిలోడు కథ చదవండి!

***

పోయినేడాది వొచ్చిన నా మునికాంతపల్లి కతలు పుస్తకంలో ఎంగిలోడు అనేటి కత ఉండాది. నాకు శానా దుక్కం పుట్టిచ్చేటి నా సిన్నప్పుటి మా ఊరి మణిసి బతుకు కత అది. ఆయన్న అసలు పేరు సుదాకరు. కానీ నా సిన్నప్పుడు ఊళ్ళో అందురూ ఆయన్నని ఎంగిలోడు అనేటి మారుపేరుతోనే ఎక్కిరింతగా పిల్సేటోళ్ళు.

రవాఁదేవమ్మ అనేటి రెడ్డెమ్మ ఇంటి బరిగొడ్లని సిట్టడివికి తోలకపొయ్యి మేపుకోనొచ్చేటి పని చేసేదా ఎంగిలోడు. ఆయన్న దారిలో ఎప్పుడు, యాడ కనబడినా పిలకాయిలం ఎక్కిరిచ్చి నవ్వుకునేటోళ్ళం.

పెద్దజబ్బుతో (కుస్టు) ఇకారంగా కనబడేటోడు సుదాకరన్న. కాలేళ్ళూ, సేతేళ్ళూ కొరక్కదిన్నట్టు సగానికే ఉండేటియి. పాత తెలుగు సినివాఁల్లో దెయ్యిం ఏశికం ఏసిట్టు ఉండేది ఆయన్న మొకం. రెడ్డెమ్మ వొక్కటే ఆయన్నని వొరే సుదాకరా అని పిలస్తుండేటిడి. ఊరంతా ఎంగిలోడు అని పిల్సేది.

ఈదుల్లో మేం పిలకాయిలం ఎక్కిరిస్తుంటే కోపంగా జూసి, మాకు ఇనబడకుండా యాందో గొణుక్కోని గమ్మున ఎల్లిపొయ్యేటోడు తప్పితే తిరగబడి ఎప్పుడూ మిమ్మల్ని ఏఁవీ అనేటోడు కాదు సుదాకరన్న.

ఆయన్నకి చేతేళ్ళు ఏవాటాన సగానికుంటాయో ఆదే వాటాన మేం పిలకాయిలం కూడా మా సేతేళ్ళని సగానికి ముడిసి అట్టా మూసిన మా సేతుల్ని ఆ సుదాకరన్నకి సూపిస్తా పొళ్ళు బైటికి పెట్టి వ్వెవ్వెవ్వెవ్వెవ్వె అంటా ఎక్కిరిస్తా, నవ్వుకుంటా ఎగుర్లాడేటోళ్ళం.

సందేళల్లో బడినుంచి ఇళ్ళకొచ్చి ఈదుల్లో ఆడుకుంటా ఉండేది మేం. అప్పుడే సిట్టడివి నుంచి పసవల్ని ఊళ్ళోకి తోలకొస్తా మాకు సిక్కేటోడు సుదాకరన్న.

ఇప్పుడు బుద్దొచ్చి ఇక్కడ సుదాకరన్న అని రాస్తుండాను కానీ ఎంగిలోడు అనే పిల్సేది సిన్నప్పుడంతా పిలకాయిలం ఆయన్నని.

వొకనాటి మజ్జానం నేనూ మా పక్కింటి ఇనోదూ బడెగ్గొట్టి మా ఊరి సొర్నముకి ఏటొడ్డున బిళ్ళంగోడు ఆడుకొనేదానికి పోతుంటే ఏటిగట్టుకింద యాపసెట్టు మొదుట్లో జారబడి కునుకు దీస్తుణ్యాడు సుదాకరన్న. నేనూ ఇనోదూ బెమ్మజెవుఁడు పొదల సాటున దాంకోని సిన్న సిన్న రాళ్ళేసినాం ఆయన్న మిందకి. నిదర మేలుకోని మేం దాంకోనుండేటి పొదల దిక్కుకే సూడజాగినాడు. మేం ఇహీ ఇహీ అంటా నవ్వుకుంటా ఆయన్నకి దూరంగా నిల్సుకోని మా సేతుల్ని కుస్టు సేతుల మాదిర్న ముడుసుకోని డ్యాన్సు జాస్తా ఎక్కిరిచ్చ జాగినాం. ఆయన్న సెట్టు మొదుట్లోనుంచి లేసి మాతొట్టు దబ్బిడి దబ్బిడిమంటా లగిచ్చినాడు. మేం అరస్తా నవ్వతా ఆయన్న సేతికి సిక్కకుండా దౌడుదీసినాం.

దూరంగా లగిచ్చేసి, ఎనిక్కి దిరిగి రేయ్ ఎంగిల్నా కొడకా నీయమ్మన్దెంగా మమ్మల్నే తరుంకుంటా ? కుత్తబగల్దెంగతాం ఉండో అంటా అరిసినాం. యాపసెట్టు కింద నిల్సుకోని సూస్తావుండాడు సుదాకరన్న.

అప్పుడంటే అది తెలవని వొయిసు, పిల్ల ఎవ్వారాలు. ఆ తరవాత ఎవుర్నైనా అట్టా మాటిమాటికీ ఏడిపిచ్చడం, ఎక్కిరిచ్చడం తప్పని తెలుసుకోని ఎన్నితూర్లు సిగ్గుతో, నామింద నాకు పుట్టేటి అసియ్యంతో ఏడ్సుకున్నానో లెక్క లేదు. కుస్టుజబ్బోడ్ని పట్టుకోని, వొకనాడు కాదు రొండునాళ్ళు గాదు ఆయన్న సచ్చిన్దాకా ఎక్కిరిచ్చిన గెవణాలు ఏళ్ళు గడిసినా అంత తేలిగ్గా వొదలడం లేదు నన్ను.

ఈ కత రాసేటప్పుడు కూడా పుస్తకంలో మిగిల్న కతలకంటే జాస్తిగా అడుగడుక్కీ, అచ్చిరం అచ్చిరానికీ ఏడుపు తన్నకొచ్చేటిది. ఆనాటి దినాలన్నీ కళ్ళముందర ఆడేటియి.

సుదాకరన్న మాతొట్టు జూసేటి సూపూ, ఎక్కిరిచ్చేటి మిమ్మల్ని ఏం జెయ్యిలేక తలదిప్పుకోని పొయ్యేటి తీరూ ఎప్పుడు గెవణానికొచ్చినా ఈనాటికీ కళ్ళనిండా నీళ్ళు గమ్మతాయి.

అట్టాటి సుదాకరన్న మాఊర్లో తెల్ల దావఁరపూలు పూసేటి వొంకిని గుంటలో సెపవైఁ తేలినాడు. పోలీసోళ్ళొచ్చి యెట్టాయిన్ని గుంటలోకి దించినారు. తెల్లతావఁరపూలు కాడలతోగూడా వొళ్ళంతా సుట్టుకోనుండిన సుదాకరన్న సెపాన్ని జుట్టు బట్టుకోని గట్టుమిందకి ఈడ్సకొచ్చినాడు యెట్టాయిన.

నీళ్ళల్లో బొక్కబోళ్ళాపడి తేలతుండిన సుదాకరన్న సెపాన్ని గట్టుమింద ఎల్లికిత్తలా పండేస్నారు. ఆయన్న మెడకీ, కాళ్ళకీ, నడుంకీ ఇరబూబిన తెల్లతావర పూలతో కాడలు సుట్టుకోనుండాయి. ఆయన్న ఎడంసేతిమింద ఇంత పొడగన ‘అలియేలి మంగ’ అనేటి పేరు పచ్చబొడిసుండాది.

సుదాకరన్న మేనత్త కూతురు మంగ. మంగకి పెళ్ళి కుదిర్నాదని దెలిసి తట్టుకోల్యాక గుంటలో దూకినాడు సుదాకరన్న. ఈ మందలంతా రెడ్డెమ్మ జెప్తేనే ఊరికి దెలిసింది. వారం దినాల్నుంచీ దిగులుగా ఉణ్యాడోడు. యాళకి కూడు ఎయ్యిచ్చుకొనే దానికి గూడా రాడం మానేస్నాడు. యాందిరా యాఁవయ్యింది నీకని రెడ్డెమ్మ గెట్టెంగా అడిగేతలికి ‘మంగికి పెళ్ళి బెట్టుకున్నారంట మా’ అనిజెప్పి బొక్కుబొక్కున ఏడ్సినాడంట. నీ రాత్యాందో నీకు తెలవదా ? ఇంకా యేంటికిరా ఏడ్సి బాదపడటవాఁ.. గమ్మునుండ్రా అని జెప్పిందంట రెడ్డెమ్మ.

కుస్టోడైతే యాంది ? మనుసుండదా.. పేఁవుండదా.. ఎన్ని అగుమోనాల్నైనా తట్టుకోని, దులుపుకోని బతికినోడు. మనుసుబడ్డ పిల్ల, అత్త కూతురు కాకుండా పోతుంటే తట్టుకోల్యాక పొయ్నాడు, మంగ పెళ్ళికంటే ముందర్నే పేణాలు దీస్కున్నాడు.

ఆయన్న గనబడితే అప్పుటి ఊరి పిలకాయిలందురం ఆయిన కాళ్ళమిందబడి సెమాపణలు అడుక్కోవాలని ఇప్పుడు అనిపిస్తుంటాది. కానీ ఆయన్న రాడు. ఇరైఐదు యాళ్ళకి ముందర్నే వొంకినిగుంటలో పేణాలు గలుపుకోని సొర్నముకి ఏటి కడుపులో పొణుకున్నాడు సుదాకరన్న.

ఎంగిలోడు ఎంగిలోడు అంటా ఊరంతా ఎక్కిరిచ్చిన కుస్టురోగపు పూండ్ల. సుదాకరు బతుకునీ, నా పిల్లదనపు ఆగిత్త్యాన్నీ కతగా రాసి నలగరి ముందరా బెట్టినందుకు సంబరంలేదు నా మనుసుకి.

ఏనాడైతే సుదాకరన్న నా ఎదాళానికొచ్చి నా సెవాఁపణలు ఇని నన్ను సెవిఁస్తాడో ఆనాడే నా మనుసుకి సంబరం, నిమ్మలం కలగతాయి. అయితే సచ్చిన ఆయన్న రాడు, కాబట్టి నేను సచ్చిన్దాకా ఆయన్న ఇసయంలో నిండారా నిమ్మలపడను. కుస్టురోగపోడ్ని ఎక్కిరిచ్చి, ఏపిచ్చి, ఎగుర్లాడినందుకు ఇది నాకు సరయ్యిన సిచ్చే.

*

సొలోమోన్ విజయ్

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కన్నీళ్లు తెప్పించిన కత.సుధాకర్ లాంటి మడుసులు
  ఎందరెందరో… దుఃఖాలు ఎన్నెన్నో… ఇజియ కత
  నేర్పుగా రాసినాడు.బలే ఇడిసినాడు..

  • మరపురాని మనిషులు వాళ్ళు. థ్యాంక్యూ శీనన్నా

 • ఆయన రూపం మీ గుండెల్లో దుఃఖంగా పూడుకట్టుకొని పోయింది. దానికి ఈ కత పరాకాష్ట. తుర్జెనీవ్ “ముమూ”కథకి సాటైన దుఃఖాన్ని నింపుకున్న కత ఇది. రెండూ విషాదాంత ప్రేమ కథలే.

 • ఆయన రూపం మీ గుండెల్లో దుఃఖంగా పూడుకుపోయి ఉంది. దానికి ఈ కత పరాకాష్ట.
  తుర్జెనీవ్ “ముమూ” కథకు సాటైన దుఃఖం నింపుకున్న కత ఇది. రెండూ విషాదాంత ప్రేమ కథలే.

  • ఆ పూడిక తోడుకున్నకొద్దీ దుఃఖమే, థ్యాంక్యూ అల్లుడా నారాయణా

 • ఇజయా చాలా దుఖమొచ్చిందయ్యా. ఎడుపోస్తాంది.

  • నాతోపాటూ మీ కన్నీళ్లూ సుదాకరన్నకి నివాళులు, థ్యాంక్యూ మోహనాచార్య

 • ఏం జెప్పాల – ఏవుంది చెప్పడానికి !
  మన బతుకుల్లో లోతుల్లోకి ఎల్తే ఇట్టాంటి
  ఇసయాలెన్నెన్నో కదా !
  అప్పుడప్పుడూ ఇట్టనే గుర్తుకొస్తే కొంచెం
  ఏడుపు , కొంచెం కోపం వస్తూనే వుంటది .
  నువ్ కత రూపంలో జెప్పి –
  మనేద తీర్చుకున్నవ్ , అందరూ అట్ట జేయలేరు కదా ఇజయా కుమారు ….

  • మనేద తీరేదిగాదు. నలగరికీ చెప్పుకొని సుదాకరన్నని చూపించిన చిన్న తృప్తి. మప్పిదాలు ప్రసాద్ సార్.

 • అన్నా!
  కంటనీరు పెట్టించే కత..
  కొన్ని తప్పులకి ఎన్ని క్షమాపణలు ఏడుకున్నా తృపితి వుండెళ్ళేదు.

  బాగుండాది.☘

  • అవునన్నా ఆ మనిషి ఇంక లేనప్పుడు తృప్తి యాడది..

 • “వొంకినిగుంటలో పేణాలుగలుపుకోని..సొర్నముకి ఏటికడుపులో పొణుకున్నాడు సుదాకరన్న”

  నువ్ దగ్గిరుండుణ్ణ్యా..ఒకపాలి నిన్ను జావిలిచ్చకోవాలనిపించిళ్యా..

  ఏడుపొచ్చందబ్బా..

  సిన్నప్పటి ఏకిరితోకిరిపన్లన్నీ గుర్తొచ్చా..

  • ఏకిరి పిల్ల నా బట్టలం కాబట్టే ఇప్పుడు తల్సుకోని ఏడ్సుకుంటుండాం..

 • “ఎంగిలోడు” ఊరికొక్క డైనా ఉంటాడు. కతల్లోకి జేరి, కలవరబెట్టింది మీ ఎంగిలో డొక్కడే. ఏంజెప్పాలబ్బా ఇంగ. ఈమాదిరే మా ఊల్లో గునోడుండే వోడు. వోడు మీ ఎంగిలోడు మాదిరితో గాదులే. గెలాయించుకోని బతికి, పదీ పన్నెండేల్లకే పుటుక్కుమనేసినాడు. ఓడు గుర్తుకొచ్చినాడు నాకు. బలే రాసినావబ్బా…

  • అట్టాటోళ్ళందురికీ రుణపడుండాయి ఊళ్ళూ, గెవణాలూ.. మప్పిదాలు సర్.

 • ఇంపైన యాస. కథ కరుణరసభరితంగా ఉంది. జ్ఞాపకాల ప్రపంచంలోకి పాఠకులను సైతం నడిపించి విజయవంతమయ్యారు రచయిత. అభినందనలు.

  • జ్ఞాపకాలే మిగిలినాయి ఏడిపిస్తూ.. నవ్విస్తూ.. థ్యాంక్యూ సర్.

 • ఇది శిక్ష కాదు విజయ్. నిజమైన పరిపక్వత, పశ్చాత్తాపం. ఇలా ఒప్పుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. అది నీకుంది. నిన్ను సుధాకరన్న ఖచ్చితంగా క్షమిస్తాడు.
  అద్భుతమైన భావవ్యక్తీకరణ.👏👏👏👌

  • మనల్ని మనం స్థిమిత వరచుకోలేని జ్ఞాపకాలు అక్క… థ్యాంక్యూ మీకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు