ఇది కాకి గోల కాదు, బతుకు తండ్లాట

సాంస్కృతిక ఫాసిజం తో పోలిస్తే  పిట్టకు ఇంత పెట్టి దండం పెట్టడం అవివేకమూ అజ్ఞానమూ కాదు. అది ఒక పరంపర. శోకం. తెలంగాణ ఉత్సవం

బ్రతుకు చుట్టూ ముడిపడ్డ ఏ భావోద్వేగాల చరిత్ర అయినా మనోఫలకం మీద స్థిరస్థాయిగా నిలబడిపోద్ది అనడానికి ఇటీవల వచ్చిన బలగం సినిమా సాక్ష్యం . తెలంగాణ ఒక మారుమూల పల్లె ఇంటింటి బ్రతుకు తండ్లాట బలగం. క్రాఫ్ట్ రీత్యా గొప్ప సినిమా కానప్పటికే చూసిన ప్రతి వీక్షకున్నీ కన్నీటినీ వరదల్లో ముంచెత్తింది. ఈ మాట అతిశయోక్తి అనిపించినా అది నిజం. ఆ ఆఖరికి ఈ సమీక్షకున్ని కూడా. కథ చిన్నది. కథనం జీవితం అంత విశాలమైనది. దర్శకుడు అంత పేరున్నవాడు కాదు, నటులు పెద్దగా అందరికీ తెల్సినవాళ్ళు కాదు. మన పక్కింటి సాధారణ బ్రతుకులే అవి. ఏ పొలం గట్టు దగ్గరో. పచారికొట్టు దగ్గరో, కాకా హోటల్లోనో, గ్రామాయణాన్ని సంసారం అంతా బైటేసుకునే ఆలి మొగల  పంచాయితీ కదంబ హారం బలగం సినిమా. వెండితెర వెలుగుకు అదనపు సొబగు బ్రతుకంత సంక్లిష్టమైన విస్తారమైన భవ బంధనాల అల్లిక సినిమాగా రూపుదిద్దుకున్నది. మరీ ఇచ్చింతరం కాకుంటే జీవితాన్ని చూడడానికి కృతకమైన సినిమాకి పోవాలా అని మీరు అడగొచ్చు. నిజానికి  ఇది నీ కథ, నా కథ, మనందరి కథ. ప్రేమ, అసూయ, దుఃఖాల  కలబోత ఇది. చావు చుట్టూ అల్లుకున్న గ్రామ్యం  బలగం.

చావు పుట్టుకల సంసార సాగర ఘోష ఎక్కడ మొదలు పెట్టాలి. ఊరుంటే వాడ,వాడ పక్క స్మశానవాటిక,కాటి సీను  బుద్దుడి దగ్గరికి ఒకడు వచ్చి ‘నా జీవితం పరమ పంకిలంగా ఉంది నాకు కాస్త శాంతిని ప్రసాదించు సావీ’ అని వేడుకున్నాడట.ఆయన ఒక మాట చెప్పాడు వీలుంటే చావు చూడని ఇంటి నుండి పిడికెడు ఆవాలు తీసుకుని రా అనే ఆజ్ఞ వేసాడట. ఎక్కడా ఒక్క ఆవగింజ కూడా అతనికి దొరకలేదు. కనుక బలగం సినిమా మన జీవితంలో లేదు అంటే మీ ఇంట్లో ఆవాలు దొరుకుతాయి అన్నమాట. తెలంగాణకే పరిమితం అయిన విచిత్ర పద్దతులు ఉంటాయి. దాపరికం తెలియని ఆతిధ్యాలు ఉంటాయి. అరమరికలు జాడతెలీని అన్యోన్యత ఉంటుంది. కోపం అయినా ప్రేమయినా దాచుకోలేని అమాయకత్వం.ఇంటికి పిలిచిన అల్లున్ని నిర్లక్ష్యం చేసిన కొమరయ్య కొడుకులు నల్లిబొక్క దగ్గర పెరిగిన పంచాయితీ  ఇరవై ఏళ్ళ తర్వాత ఇంటి పెద్ద చనిపోతే ఉన్న వూర్లోనే ఉన్న కన్నవాళ్ళను చూడలేని బిడ్డ, సూరత్ బోయిన చిన్న కొడుకు, బ్రతుకు దినగండమై అప్పులపాలైన సగటు తెలంగాణ మనవడు, లగ్గం పైసలు వస్తే తప్ప కస్టాలు తీరని నిరుద్యోగి తన అప్పులు తీరడం దానికి కుటుంబాన్ని కలపడానికి చేసిన బ్రతుకు పోరాటమే బలగం సినిమా. పిండాన్ని కాకి ముట్టడం అనే సాంప్రదాయం చుట్టూ తిరిగిన ఈ శూద్ర కథ ‘కాకి గోల’ అయి నవ్వుల పాలైనది. అయినా ఊరువూరంతా ఒక దగ్గర రచ్చబండ దగ్గర సినిమా ఆడుతోంది. ఇటీవల కాలం లో ఏ సినిమా కీ ఇటువంటి గౌరవం దక్కలేదు.

యాభై అరవై ఏళ్ళకింద యు ఆర్ అనంతమూర్తి సంస్కార అనే నవల రాసాడు. తాను యూనివర్సిటీ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లోనే ఆ నవల రాసుకున్నాడు. నవల రాసాక ఇంకో పది పదిహేను ఏళ్ళకు పట్టాభి గా పిలవబడిన తిక్కవరపు పట్టాభి  రామిరెడ్డి, తన భార్య అయిన స్నేహలత ను గిరీష్ కర్నాడ్ నూ పెట్టి సినిమా తీసాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా ఒక ఒక అలజడి. ఇంత చిన్న అంశం కూడా సినిమా తీస్తారా అనే ప్రశ్నలు కథే ఏమిటి అంటే ఒక అగ్రహారం లో ప్రాణేశాచార్య అనే నిష్టాగరిష్ట బ్రాహ్మణుడు, అదే వూరిలో సంధ్య, నిష్ట అన్నీ వదిలేసి కులం గాని ఒక అమ్మాయి చంద్రితో సహజీవనం చేస్తున్న నారాయణప్ప. పశ్చిమ కనుముల్లో జరిగిన ఈ కథను  శృంగేరి పీఠానికి దగ్గరలో   ఉన్న వైకుంటపురం గ్రామంలో చిత్రీకరణ చేసారు. అగ్రహారాన్ని దిక్కరించిన నారాయనప్ప తన బ్రతుకేదో తాను బ్రతికి ఒక మిట్ట మధ్యాహ్నం కన్నుమూసాడు. ఊరంతా అన్నం తినేవేళలో ఈ చావు వార్త విన్న అగ్రహారం మైలపడ్డది. తిండీ తిప్పలు మాని  బ్రాహ్మణ ఆచారాలు విస్మరించి ‘అడ్డగోలు తిళ్ళూ తిరుగుళ్ళూ’ తరిగే నారాయనప్ప – చంద్రి ల మధ్య కుదిరిన అ(స)క్రమ  సంబంధం చుట్టూ అల్లుకున్న నైతిక అంశాల చర్చ. రోగాల బారిన పడి చనిపోయిన నారాయణప్ప పుట్టుక తో బాపడు అయినప్పటికీ గుణ రిత్యా చండాలుడు కనుక పోయినవాడి అంతిమ సంస్కారాలు ‘సంస్కార హితంగా జరగాలా ‘చండాల’ పద్దతిలో జరగాలా అనే మీమాంస వైకుంటపురం అగ్రహార పెద్దల కి వచ్చింది. ఆ సందేహ నివృత్తి చేయగలిగిన వాడు ఆ అగ్రహారం లో ఇటువంటి సందిగ్ధత ను విడమర్చి చెప్పే ఘనాపాటీ లు లేరు కనుక ఊరి పెద్దలంతా ఆ శవాన్ని అలాగే వదిలేసి ప్రాణేశాచార్య దగ్గరకు వచ్చింది పంచాయితీ. ఒక పక్క వూరిలో పొయ్యిలో పిల్లి లేవలేదు. మైల తీరితే తప్ప గంగ ముట్టని నీతివంతమైన అగ్రహారం శవ కంపు ఒక వైపు పైన కాకులు గద్దలు కింద చచ్చిన ఎలకల తో పిల్లలు స్త్రీలు ఆకలితో సతమతం అవుతున్నారు.

పంచాయితీ ఘనాపాటీ ప్రాణేశాచార్య దగ్గర ఉంది. అప్పుడు చంద్రి తన వంటి మీద ఉన్న బంగారు నగలు తీసి పంచాయితీ జరుగుతున్న అరుగుమీద పెట్టింది. అంత ఖరీదైన బంగారం అక్కడ ఉన్న అందరినీ ఆకర్షించింది.అందరి కళ్ళూ చెంద్రి బంగారం మీదనే. మొత్తానికి తాను నేర్చుకున్న సమస్త శాస్త్రాలు ఏవీ తన ప్రశ్నకుజవాబు చెప్పలేకపోయాయి . చివరికి ఇల్లు వదిలి ఊరిబయట ఆంజనేయ స్వామీ గుడిలో కి తదేక ప్రార్ధన లో మునిగిపోయాడు ఆ ఘనాపాటి.  ఊరిబయట ఆంజనేయ స్వామీ గుడిలో  సదరు పండితుడు గుడి బయట మైలతో ఉన్న అగ్రహారీకులు వీళ్ళ అందరికీ దూరంగా అంటరాని చంద్రి.  అసలు చచ్చిన వాడు బాపడా కాదా వాడి అంతిమ సంస్కారం ఎలా జరపాలి అనే చిక్కు ప్రశ్నకు తన ముందున్న ఏ శాస్త్రమూ వేద ఉపనిషత్ గ్రంధాలూ సమాధానం చెప్పలేదు. లోపల గుడిలో గందరగోళం, గుడి బయట ఆకలి కేకలు ఒక వైపు హితుడు పోయాడనే దుఖంలో చంద్రి. సమస్యకు పరిష్కారం కనుగోనలేని నిస్సహాయత ఒక వైపు మరో వైపు  రోగిష్టి పెళ్ళాంతో ఏళ్ళకు ఏళ్ళుగా అన్ని సుఖాలకూ దూరం అయిన ఆ ప్రాణేశాచార్య ఆ రాత్రి ఆ అంటరాని చంద్రితో ఏకమౌతాడు. ఇప్పుడు ధర్మం చెప్పాల్సిన పూజారి ఏ నైతికతతో నారాయణప్పను దోషిని చేయగలడు . మొత్తానికి చంద్రి ఎలాగో కస్టపడి తన ఇష్ట సఖుడికి అంతిమ సంస్కారం చేయడం తో సంస్కార సినిమా ముగుస్తుంది. కర్నాటకలో మధ్వాచార్య సాంప్రదాయులు అగ్రహారీకుల కథ.

ఏముంది ఇందులో చచ్చిన శవ అంతిమ సంస్కారాలు ఎలా జరిగితే ఏమిటి అనే ప్రశ్న ఇంతవరకూ ఎవరూ వేయలేదు. ఎందుకంటె ఇది ధర్మంచుట్టూ అల్లబడిన భావోద్వేగాల కథనం. ఇది బ్రాహ్మణ కుల ఆచారాలను సదాచారాన్ని ప్రశ్నించిన సినిమా. ఒక సదాచారి ధర్మం తప్పినా తన పుట్టుక మూలంగా లబించిన సోషల్ కాపిటల్ ఒక అగ్రహారం ఎలా స్వీకరించిందో చెప్పిన సినిమా. ఈ దేశ లో అన్ని పుట్టుకలూ పుట్టుకలు కావు, అన్ని బ్రతుకులూ బ్రతుకులు కావు, అన్ని చావులూ చావులు కావు. నారాయణప్ప చావు ధార్మిక శాస్త్రాల ఉనికి అస్తిత్వానికి ఒక పరీక్ష పెట్టింది. బలగం సినిమా తెలంగాణ కొమరయ్య చావు కొందరిని మారు మనుసు పొందేలా చేసింది మరి కొందరిని ఆ చావుని ఎద్దేవా చేసేలా చేసింది. విచ్చిన్నమైన కుటుంబాన్ని కలిపేలా చేసింది.

యాభై  ఏళ్ల కింద తీసిన సంస్కార సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా తలెత్తుకు తిరిగే రీతిలో పురష్కారాలు అందుకున్న సినిమా. చరిత్ర మన కళ్ళ ముందే ముగిసిపోయింది. ఇరవై ఏళ్ల కింద కె.టి.యెన్ శాస్త్రి ‘తిలదానం’ సినిమా తీసాడు. నమ్మిన విలువలు ఆచరించి తోటి బాపన పండితుల తో పోటీ పడలేని ఒక సత్తెకాలపు ముసలి తండ్రి తన కొడుకు నక్సల్బరీ ఉద్యమంలో కలిసిపోతే కోడలు మూలా నక్షత్రం లో పుట్టిన మనవడితో బ్రతుకు దెరువు కోసం చచ్చిన శవాల దగ్గర తిలదానం తీసుకోవడం అనే బాధ్యతను  తన అంతిమ ఘడియల్లో మోసిన బ్రతక నేర్వని ఒక పూజారి కథకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. ఇవి చావు చుట్టూ అల్లబడి వెండితెరను ముద్దాడిన కథనాలు. ఎటుకూడి కొమరయ్య బ్రతుకే కాకి గోల అయ్యింది.

ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి అనిపిస్తోంది. సంస్కార సినిమాలో నారాయణప్ప బ్రాహ్మణుడు  కాకుండా ఏ దళితుని కథో అయితే ఆ సినిమా ఇంత ప్రజాదరణ పొందేదా ? తిలదానం కథలో ఒక బుడగ జంగపు వాడో, ఏ శారద కాండ్లు అయితే  ఆ సినిమా ని శాస్త్రి తీసేవాడా ? మరి జబర్దస్త్ కమెడియన్ అనే ఒక సూద్ర పోరడు సినిమాలో జనాలు ఎందుకు హేతువుని వెతుకు తున్నారు. బెన్ హర్, ట్రాయ్, లాంటి సినిమాలను మిక్షిలో రంగరించి ‘మహిష్మతి’ లాంటి ఊహా పరికల్పలన, క్షత్రియ-బానిస విలువలను , కట్టప్ప లాంటి నమ్మకమైన బానిసలను తయారు చేసుకోవడం తెలుగు సినిమా పుట్టినప్పుటి నుండీ చూస్తూనే ఉన్నాము. అక్రమంగా సంపాదించిన అదనపు విలువల, హవాలా సొమ్ము, రాజకీయ జోక్యం మూలంగా ఇవ్వాల ‘బాహుబలి’ లాంటి సినిమాలు తయారు అవుతున్నాయి. దాని లక్ష్యం అదే దోపిడీ విలువలను తయారు చేయడం అమ్మడం. శవాలతో సంపర్కం చేసే అఘోరాలను ఆదరించిన తెలుగు కళామతల్లి, సైకోపాత్ పశుపతినీ,  ఏ ఆదిలాబాద్ అడివిలో పోడు భూములను కొట్టుకునే కొమురం భీము, విశాఖ మన్యంలో కొట్లాడిన  సీతారామరాజు ఏనాడూ కలవని వాళ్ళు నాటు నాటు అని లిల్లాయి పాట పాడితే దానికి ఆస్కార్ కొనుక్కుని మురిసి ముద్దైన మన చైతన్యం చూస్తే ఈ ప్రశ్న అడగాలి అనిపించింది.

నువ్వు పుట్టిన కులం నిషిద్దం అయినచోట , నువ్వు పెరిగిన ప్రాంతం పాప పంకిలం అయిన చోట, నువ్వెన్నుకున్న సహచరి అంతరం అయిన చోట. అసమ విలువల తూకంలో నీ లింగబేధం అబేధ్యం అయిన చోట, గర్వం, గౌరవం, మదం, అహంకారం, అసహనం సర్వవ్యాప్తం అయిన చోట, బలగం లాంటి సినిమా కి చోటెక్కడ ఆ సంస్కృతులకు స్థానం ఎక్కడ ? సినిమా అంటే బ్రతుకు. సినిమా అంటే మనసు. ఒక గావురం . అత్తలతో సయ్యాటలు మరదళ్లలో మదపుమాటలు కాదు. బ్రతుకు అంటే నిజమైన మానవ సంబంధాలు కావాలి అంటే బలగంలోనే దొరుకుతాయి.

సినిమా ఇంత పాప పంకిలం అవడానికి కారణం ఏమిటి ? ఎక్కడ ఉన్నాయి ఈ మూలాలు ?  ఒక కుటుంబం మానం గౌరవం మర్యాద వీటిని పెంచి పోషిస్తున్నది ఆడవాళ్లే. వాళ్ళ శరీరాలలో రెండుకాళ్ళ మధ్యలో, పై ఎదలలో , మొహంలో , మాటలో బద్రపరుస్తున్నారు. పైవి ఏవీ చెడిపోవద్దు ఆచారాలు ఇలానే ఉండాలి అని సమాజం అంటుంది. ప్రాణం అయినా పోవచ్చు కానీ మానం మాత్రం పోవడానికి వీలు లేదు” ఇదీ వర్తమాన తెలుగు సినిమా సిస్మోగ్రాఫ్. తెర మీద ఏ ప్రాంతం, ఏ కులం, ఏ కుటుంబం, ఊరేగాలో ఒక విలువను స్తిరీకరించింది. మన పుత్ర సంతానాలు,పరమ పంకిలం అయిన పరాయి ఆడబిడ్డల మీద మన విక్రుతాన్నీ, వాచాలత్వాన్నీ, నైచ్యాన్నీ ప్రదర్శన చేస్తూ వూరేగాలి, మన ఇంటి ఆడబిడ్డలు పరమ పవిత్రంగా గడప దాటకుండా విలువల మీద ప్రసంగాలు ఇవ్వాలి. తెలుగు సినిమా దశాబ్దాలుగా ఇవే విలువలను ప్రోది చేసింది. ఈ తప్పుడు సూత్రీకరణలే తెనుగు తెరను యేలుతున్నాయి. కులాలను,ప్రాంతాలను వీరత్వానికి, అజ్ఞానానికి , హంతకులకు చిరునామా గా స్తిరీకరిస్తూ ఇంతకాలం వలసవాద చరిత్రకారులే చేశారు. వలసవాద చరిత్రను పూర్వపక్షం చేసే ప్రయత్నాలు మొదలైనాయి కానీ  తెలుగు సినిమా చేస్తోన్న వికృత విలువలను తిరగరాసే పని ఇంకా మొదలు కావాల్సే ఉంది. ఈ ప్రపంచం లో సుఖపడ్డ ఏ రెండు కుటుంబాలూ కష్టపడ్డ రెండు ఏ కుటుంబాలూ ఒకేలా ఉండవు అంటాడు. అదే నిజమైతే బలగం ఆవాదన ని నిర్ద్వందంగా కొట్టేసుద్ది. ఎందుకంటె బలగం సినిమాలో లేని కష్ట సుఖాలు అరుదనే చెప్పొచ్చు. వందేళ్ళ తెలుగు సినిమా ఒక మూసను తయారుచేసి పోయింది. ఎవరన్నా ఆ మూసదాటి బయటకు వస్తే కస్టాలు మొదలయినట్టే. రెండున్నర రూపాయల గొడవ ముదిరి కొమ్మద్ది లో వందలాది మందిని కర్కశంగా చంపుకున్న మొండి కత్తి రక్తపు మరకల చరిత్రను, కత్తి విదిల్చిన చేతి సాహసాన్నీ వేన్నోళ్ల పొగిడాము. ఇంత విక్రుతాన్ని చూసిన నాకు ఈ గందరగోళాన్ని ఏ మేథో చట్రం వెలుగులో చూడాలో అర్ధం కావడం లేదు. కానీ  డి కాలనైజింగ్ ది మైండ్ అనే ఒక మేథోసూత్రీకరణ జరిగినట్టే డి ఆంధ్రైజింగ్ సినిమా ఇప్పుడు తక్షణ అవసరం ఉంది. లేకుంటే మీరు ఇచ్చే విలువలు  సంస్కారాలు వికటించి బలగం లాంటి సినిమాలో పాప ప్రక్షాళన చేసుకుంటోండు ఆధునిక వీక్షకుడు.

శతాబ్దాలుగా భూస్వామ్య పదఘట్టనల మధ్య నలిగిన తెలంగాణ సీమాంధ్ర పాలనలో మరిన్ని గాయాల పాలు అయ్యింది. భాష యాస పేరుతో కొనసాగిన అవమానాలను చవిచూసింది. వలసపాలన కాలంలో రెండు వందల ఏళ్ళకింద కాటన్ వితరణ మూలంగా నిర్మించిన  దవళేస్వరం ప్రాజెక్ట్ ఫలాలు నేరుగా మద్రాస్ సినిమా రంగానికి పెట్టుబడిగా మారాయి. ఆ అదనపు విలువ నాడు సినిమా రంగం లోకి మళ్ళించ బడి స్టూడియో ల నిర్మాణం, సినిమా హాళ్ళ నిర్మాణం, పంపిణీ తదితర వ్యాపకాలలో విస్తరించిన ఆధిపత్య సాంస్కృతిక ధోరణి తమ సంపదతో ప్రింట్ ఎలక్ట్రానిక మాధ్యమాల లోకి విస్తరించి తెలంగాణా భాషను యాసను కించ పరచింది. ఆ దశలో తొలి ప్రయత్నం ‘చిల్లర దేవుల్లు’ తర్వాత మాభూమి. ఆ సినిమా మొదలు పెట్టె కాలం నాటికి దేశం నియంతృత్వం వెర్రితలలు వేసిన అత్యయక స్థితినీ చూసింది. ఆ అనుభవాల నేపధ్యం లో రాజకీయ అనిశ్చితి మరొక  సాయుధ పోరాటం దిశగా సాగుతున్న దశలో కవులు కళాకారులు వృత్తి విప్లవకారులు కలగంటున్న మరొక నూతన ప్రపంచానికి ఒక దారి ఇచ్చిన సినిమా మా భూమి . ఆ సినిమా విడుదల అయ్యాక గ్రామాల నుండి బస్సులు, ఎడ్ల బండ్లు కట్టుకుని నగరానికి సినిమా చూడడానికి వచ్చారు అని విన్నా గడిచిన వారం రోజులుగా బలగం సినిమా గ్రామ రచ్చబండల దగ్గర ఊరంతా కలిసి చూస్తున్నారు. అదొక సామూహిక దుఃఖసాగరం. ఎందుకు ఇంతమంది అ సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారు ? చిన్న బడ్జెట్ సినిమా అయినా ఎందుకు ఆ సినిమాని  బీద బిక్కీ జనం సొంతం చేసుకున్నరు? ఒక ప్ర్రాంత బలాలు బలహీనతలు కోపతాపాలు, కపటంలేని ప్రేమలు, కల్మషం ఎరగని రచ్చబండ ముచ్చట్లు అత్యంత సహజంగా చూపబడ్డాయి. ఈ విజయం ఒక వైపు అయితే సినిమా మూడనమ్మకాల చుట్టూ తిని తాగడం చుట్టూ ఆకరికి నల్లి బొక్క దగ్గర ఇచ్చక పోయే బందాలు అని ఎద్దేవా చేస్తున్నారు. నిజమే తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కొలిసే సిస్మోగ్రాఫ్ ఇంకా కనిపెట్టాల్సే ఉంది. భాషను యాసను, నిధులను, గద్దల్లా తన్నుకు పోతున్నారు అనే కదా వేలాది మంది అగ్గై మండింది. తెలంగాణ అమాయయకపు బ్రతుకే కాదు. అది బొగ్గు పొరలను మండించింది. కధనాన కవాతై నిలబడ్డది. ప్రత్యామ్నాయ పోరాటాలకు వేదిక  అయ్యింది కదా. అంతటి ధీరత్వం ఉన్న చోట మర్యాద లోపిస్తే దశాబ్దాలు గడిచినా కూడా ఆ అవమాన పొరలు మాయం అవవు అని నిరూపించిన సినిమా బలగం. పండగ దగ్గర మొదలైన లొల్లి పెళ్లి దగ్గర మొదలైన రడం చావులో ఎకమవుతది అని నిరూపించిన సినిమా బలగం. సినిమా ప్రజల భావోద్వేగాలను కదిలించాలి కానీ కంటిచూపుతో గాలిలో కార్లూ బస్సులూ యెగిరి పడడం కాదని చెప్పిన ప్రయత్నం బలగం. సినిమా అంటే రెండున్నర జిల్లాల మూడున్న కులాల టెంప్లెట్ కాదని గుద్దులాటలూ మల్లయుద్దాలూ కక్ష కార్పణ్యాలూ లేకుండా రక్తం బొట్టు చిందించకుండా కూడా రెండున్నర గంటలు కూకోబెట్టే  బలం తెలంగాణ సినిమా కు ఉందని నిరూపించిన సినిమా.

ఇందులో లోపాలు ఉన్నాయి. అప్పులు తీరితే చాలు ఎవరిని అన్నా చేసుకుంటాను అనే మనవడు. తన మాట మాత్రమె నెగ్గాలి అనే పెద్దకొడుకు, ఆడవాళ్ళ పైన చేయిచేసుకునే పితృస్వామిక పీడన. పిట్ట ముట్టకుంటే వూరు నుంచి వెలి వేస్తాం అనే గ్రామ పెత్తందారీ తనపు మూడత్వం. అవన్నీ ఆక్షేపణ అంశాలే కానీ చావు బతక గోరతది. పోయిన కొమరయ్య బలగం ఒక సంక్లిష్టమైన సంబంధాల సమాహారం. ఉపాది లేక సూరత్ పోయిన కొడుకు. కొమరయ్య సమాధి పొలం మధ్యలో కడితే భూమి ఎవరూ కొనరు అని అడ్డు  తగిలిన చిన్న కొడుకు కోడలు. కొమరయ్య అనని  మాటని తన అప్పుల అవసరానికి మార్చుకున్న మనవడు. ఇరవయ్యేళ్ళు దూరం అయినా తమ బార్య పుట్టింటి వాళ్ళను కలవకుండా చేసిన అల్లుని ఐశ్వర్యం. ఇలాంటి అనేక ఆర్ధిక అంశాలు కూడా సినిమాలో అంతర్లీనంగా ఉన్నాయి. కొమరయ్య కొడుకు  మూడోద్దుల నాడు నాలుగు మేకలు కొస్తే, ఐదొద్దుల నాడు అల్లుడు కోసిన పది మేకలు ఇవన్నీ ఇవన్నీ పంతాలు తప్ప కొమరయ్య మీద ప్రేమ మాత్రం కాదు.

ప్రతి ప్రాంతానికీ ఆ ప్రాంత ప్రాణం అక్కడి ప్రజల కళారూపాల్లో ఉంటది. ఈ సినిమా బలం ఇక్కడ వందల ఏళ్ళుగా ప్రజల జీవితాల్లో భాగం అయిన చిందు డక్కలి, బేడ బుడగ జంగాల, శారద కాండ్ల మౌఖిక గాధలు. ఆ మౌకిక కధనాల సారం ఒడిసిపట్టుకున్నాడు కనుకనే బలగం సినిమా ప్రజలు ఆదరిస్తున్నారు . మీరు ఇచ్చుక పోవద్దు రా కొడకా ఇదీ బలగం సినిమా అంతః సారం. విచ్ఛిన్న మైన బందాలు, దూరమైన దారులు, యాది మనాది పర్యంతమైన  అన్నా తమ్ముళ్ల మధ్య లుప్తమైన మాటలు, అక్క చెల్లెళ్ళ మధ్య కానరాని నెరను  ఇదే బలగం సినిమా ని కట్టిపడేసిన అంశాలు.

ఇందులో మందు ఉంది, మతం ఉంది, మూడ నమ్మకాలు ఉన్నాయి అని హేతువు వెతుక్కునే హేతువాదులు తార్కిక వాదులు ప్రజల జీవనంలో భాగం  అయిన ప్రజా ఇచ్చను సహానుభూతి తో అర్ధం చేసుకోవాలి తప్ప హేళన చేయడం మానవత్వం అనిపించుకోదు. ఇవ్వాళ గుడిలో బడిలో బలుల పేరా పరివ్యాప్తం అయిన సాంస్కృతిక ఫాసిజం తో పోలిస్తే  పిట్టకు ఇంత పెట్టి దండం పెట్టడం అవివేకమూ అజ్ఞానమూ కాదు. అది ఒక పరంపర. శోకం. తెలంగాణ ఉత్సవం. ఆ బాధ యాతన అనుభవించిన వాళ్ళకే తెలుసుద్ది. సినిమా ని కేవలం సినిమా గానే చూడమని చెప్పడం లేదు ఒక ప్రాంత అభివ్యక్తికి ఉన్న వైవిధ్యాన్ని,  విలక్షణతనీ   చూడండి.

*

 

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • “ఈ దేశ లో అన్ని పుట్టుకలూ పుట్టుకలు కావు, అన్ని బ్రతుకులూ బ్రతుకులు కావు, అన్ని చావులూ చావులు కావు.” నిక్కచ్చిగా రాశారు సార్.

 • ఇదే “బలగం” సినిమాను ఏ సత్యజిత్ రే ,మృణాల్ సేన్,ఋత్విక్ ఘటక్, శ్యామ్ బెనగల్ లాంటి పేర్లతో తీసుంటే ఆస్కార్ కు తప్పకుండా నామినేట్ అయివుండేది👍 అతుకుల బొంతల్ని తీసి డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వ ప్రమేయంతో అవార్డులు కొనుక్కుంటున్న కాలంలో నిజాయితీగా విలువల ఆధారంగా తీసిన సందేశాత్మక చిత్రం…. సోదాహరణలతో చాలా బాగా రాశారు. శుభాకాంక్షలు👌👌👌

 • బలగం సినిమా పైన సీతారాములు వ్యాసం చాలా బాగుంది. ! తనదైన వాక్యం, విశ్లేషణ. విడి మనుషులకు బాల్యం యెట్లనో, మానవ సమూహమైన సమాజానికి పల్లెలు అటువంటివి . ఇప్పుడు అక్కడ జీవితాలు మారిపోయి వుండవచ్చు. మారిన ఆర్థిక సంబంధాల వల్ల మునుపటిలాగా, మనం అశించినట్టుగా వుండకపోవచ్చు. కళాకారుడు ఆ పాత సంబంధాలు వుంటే బాగుండును అనుకుంటాడు. ఆ మమతల కోసం ఆరాటపడతాడు.
  ఇందులో సoబద్దతను, హేతువు వెతకడం మూర్ఖత్వం… మనుషుల ఉద్వేగాలే ఇక్కడ ప్రధానం. అవి అట్లనే వుంటాయి. వాళ్ళు అట్లనే వుంటరు.
  యే నమ్మకాలూ లేకుండా మనుషులు బతకలేరు. అనుబంధాలు యెంత వాస్తవమో, విశ్వాసాలూ అంతే వాస్తవం. ముఖ్యంగా పురాతన సాంప్రదాయాలు, ఆచారాలూ వున్న మన వంటి సమాజంలో అవి లేకుండా అసాధ్యం. శుద్ధ సాంకేతిక అంశాలను పక్కకు పెట్టి నేను సినిమాను చూశాను.
  హీరోయిన్ మీద పాడే ఒక్కపాట తప్ప మిగతా పాటలు అన్నీ వింటున్నప్పుడు నాకు గద్దర్ పాటలే గుర్తొచ్చాయి. ఆ పాటల్లోని ఉద్వేగం, ఇమేజరీ, పాట నిర్మాణం అలాగే వుంది. అవును మరి గద్దర్ పాటలకు మూలం ఆ పల్లె పదాలే కదా!
  సంస్కార ‘ సినిమాతో పోలిక , బలగం సినిమా గురించి తన వాదన నచ్చాయి.
  తీసిన వ్యక్తుల ప్రాంతాన్ని బట్టి, కథా వస్తువు ప్రాంతాన్ని బట్టి , కథా వస్తువు కులాన్ని బట్టి కొందరు సినిమా విమర్శ చేయడం , అంచనా వేయటం దారుణం.
  సీతా రాములు ప్రశ్న నిజమే! అవార్డులు పొందిన ఇన్ని ‘బ్రాహ్మణ చావు ‘ సినిమాలు వుండగా కొమురయ్య చావు మాత్రమే’ కాకి గోల ‘ ఎందుకయ్యింది?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు