ఇది ఒక తరం తపనా, పోరాట చరిత్ర!

కోటేశ్వరమ్మ గారిలాంటి తరం ఈ స్థితిని ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఎట్లా దీన్ని ఎదుర్కొంటుంది? అనే ప్రశ్న ఇవాళ మనకి చాలా అవసరం.

1

కొండపల్లి కోటేశ్వరమ్మ గారు బెజవాడ మొగల్రాజ పురంలో మా పొరుగు. సిద్ధార్థ కాలేజీ పక్కన వాళ్ళింటికీ నేనుండే గదికీ మధ్యలో కడియాల వారి మెస్ వుండేది ఆ రోజుల్లో! నిజానికి వొక దశలో వాళ్ళింట్లో నేను అద్దెకి దిగాల్సింది కాని, ఇంకో ఆంధ్రజ్యోతి మిత్రుడి కోసం ఆ అందమైన ఇల్లు “త్యాగం” చేసేయాల్సి వచ్చింది.

మొదటిసారి నేను ఆమె పేరు మా తాతయ్య, ప్రజా నాట్యమండలి కళాకారుడు, కమ్యూనిష్టు యోధుడు మహమ్మద్ సాలార్ గారి (పాత సినిమాల్లో సలీం!) ద్వారా వినే వాణ్ణి. బహుశా, వాళ్ళంతా కోటేశ్వరమ్మ అమ్మ గారు అంజమ్మ గారికి స్నేహితులు.  బుర్ర కథ నాజర్ కి సన్నిహితులు. గరికపాటి రాజారావు గారి తరం వచ్చేసరికి మా నాన్నగారు ఆయన శిష్యులయ్యారు. నా తరం వచ్చేసరికి నేను మళ్ళీ తీవ్రవాద  వామపక్ష రాజకీయాల వైపు మళ్ళాను. కోటేశ్వరమ్మ గారిలాంటి వారు చాలా చాలా అరుదుగా వుంటారని సాలార్ తాతగారు చెప్పేవారు. నిజానికి మా ఇంట్లో స్త్రీలందరికీ ఆ కుటుంబాలు చాలా దగ్గిరగా పరిచయం,  మా అమ్మ తరపు వాళ్ళ కమ్యూనిష్టు రాజకీయాల వల్ల- ఆ ఇంటి కథలు మా ఇండ్లలో ఫోక్ లోర్!

ఈ మధ్య ఫిలడెల్ఫియా వచ్చాక- మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనియా లూంబా తో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ కోటేశ్వరమ్మ గారి సంగతులు ఆ నోటా ఈ నోటా విన్నవీ, మా కుటుంబం వాళ్ళు చెప్పినవీ గుర్తుకు వచ్చాయి. అనియా లూంబా  వామపక్ష రాజకీయాల్లో స్త్రీల పాత్ర గురించి రాస్తున్న పుస్తకంలో కూడా కోటేశ్వరమ్మ గారి ప్రస్తావన వుంది.

2

వాళ కోటేశ్వరమ్మ గారి వంద వసంతాల చరిత్రని తలచుకుంటే ఆమె నుంచి మనమేం నేర్చుకోవచ్చు అన్న ప్రశ్న నా ఎదుట నిటారుగా నిలబడుతోంది.

నాకెప్పుడూ వొక దిగులు ఎట్లానూ వుంది. కోటేశ్వరమ్మ గారి తరం తరహా సమాజం, దానికి తగ్గట్టుగా “ఎత్తిన జెండా దించకోయ్” అన్న స్థిర సంకల్పం వున్న వామపక్ష రాజకీయాలు వుంటే మానసికంగా  వాటిని  స్వాగతించడానికి నిజంగా  మనం సిద్ధంగా వున్నామా?

ఇప్పటి వామపక్ష రాజకీయ ధోరణుల మీద మనలో చాలా మందికి సందిగ్ధాలున్నాయి. నిజంగా వామపక్షమే గొప్ప ప్రత్యామ్నాయం అనుకునే వాళ్లకి కూడా సందిగ్ధాలే వుండడం అసలు విషాదం. వామపక్ష రాజకీయాలు అటుంచితే, అసలు ఈ కాలంలో వొక సంక్షోభ సమయంలో  ఏదో వొక  కట్టుబాటుగా  వుండగలమా అని నా ప్రశ్న. అభివృద్ధి అనేది ఇవాళ కేవలం వ్యకిగతం కాదు, కేవలం సామాజికం కూడా కాదు. అభివృద్ధి రాజకీయాలు మన మధ్యతరగతి మనసుని పట్టి లాగుతున్నాయి. దేశంలో కాని, ప్రవాసంలో గాని భారతీయులు కుడి వైపు అయిష్టంగానైనా మొగ్గు చూపడానికి ఇదొక పెద్ద కారణం. “ఎలాగోలా ఎదగడం” అనేది మనల్ని శాపంలా వెంటాడుతున్న భావన. పిడికెడు మెతుకులు సరే, వొక పూట మద్యం కోసం మొత్తం జీవితాల్ని ధారపోస్తూ, కార్పోరేట్ కాళ్ళ మీద సాగిల పడుతున్న తరం మనది.

కోటేశ్వరమ్మ గారిలాంటి తరం ఈ స్థితిని ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఎట్లా దీన్ని ఎదుర్కొంటుంది? అనే ప్రశ్న ఇవాళ మనకి చాలా అవసరం.

మా మామయ్య గురించి మా అమ్మ వొక అనుభవం చెప్తూ వుంటుంది. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో మామయ్య కొరియర్ గా పనిచేశాడు. అతన్ని ఒక సారి మలబార్ పోలీసులు పట్టుకున్నారు. తీసుకువెళ్ళి నానారకాల హింసలు పెట్టారు. పోలీసులకి అజ్ఞాత వాసుల చిరునామా కావాలి.  అప్పటికి మా కుటుంబం వున్నవన్నీ పోగొట్టుకుంది. సమాచారం ఇస్తే మంచి వుద్యోగం ఇప్పిస్తామని అధికారుల హామీ. “అక్కర్లేదు. నన్ను చంపెయ్యండి. పర్లేదు” అని మౌనంగా వుండి పోయాడట మామయ్య. ఆ తరవాత అతనెలాగో పారిపోయి వచ్చాడు కాని, రాజీ మాత్రం పడలేదట.

ఇప్పటి జీవితాల్లో ఇదొక అపూర్వ జానపద కథలాగా వినిపిస్తుంది. వుద్యోగమో కాసింత ఆర్ధిక ఆసరానో చూపిస్తే ఆదర్శాలు వోడిపోతున్నాయి కదా మరి!

కోటేశ్వరమ్మ గారి జీవితం కేవలం కొన్ని అనుభవాల సంపుటి కాదు, వొక నిబద్ద పోరాట కావ్యం. మామూలు జీవన ప్రమాణాలతో పోలిస్తే ఆమె మిగుల్చుకున్నదేమీ లేదు. కాని, వొక అర్థవంతమైన జీవితం అనే భావనకి ఆమె ఉదాహరణగా మిగిలిపోతుంది, ఆమె స్పష్టత వల్ల. దృక్పథం వల్ల-

4

కోటేశ్వరమ్మ గారిని తలచుకుందాం అని “సారంగ” తరఫున మేం అనగానే ఎంతో  మంది సంతోషంగా ముందుకు వచ్చారు. ఈ మధ్య మామూలుగా మేం ఇంకో రచయిత గురించి రాయమని అడగ్గానే “ముందు మా గురించి రాయించండి. తరవాత వేరే వాళ్ళ గురించి రాస్తాం” అని నేరుగానే నిస్సిగ్గుగానే సమాధానాలు వస్తున్న కాలంలో  ఎట్లాంటి కారణాలు చెప్పక్కర్లేకుండానే మమ్మల్ని అర్థం చేసుకొని సహకరించిన వాళ్ళు సజయ, వొమ్మి రమేష్ బాబు. వాళ్ళిద్దరూ ఎంతో సమయం ఈ పనిలో పెట్టి వుంటారు.  కోటేశ్వరమ్మ గారి సన్నిహిత మిత్రులని కలుసుకుని, రచనలు సేకరించడం మొదలుకొని–కొన్ని పేజీలకు పేజీలు   యూనికోడ్ లో టైప్ చేయడం దాకా – వాళ్ళిద్దరి సహాయాన్ని “సారంగ” ఎప్పటికీ మరచిపోదు.  సారంగ ప్రతి అడుగులో తోడు నడిచే మరో మిత్రుడు ఎన్. వేణుగోపాల్ సహకారానికి కూడా సారంగ కృతజ్ఞతలు,  అట్లా చెప్పడం వేణూకి నచ్చకపోయినా! అరుదైన ఫోటోలు పంపిన కొండవీటి సత్యవతి గారికి కృతజ్ఞతలు. ఇందులో కొన్ని రచనల్ని యూనికోడ్ లో టైప్ చేసి ఇచ్చిన కవిమిత్రుడు నవీన్ కుమార్ కి కూడా కృతజ్ఞతలు. అసలు, కోటేశ్వరమ్మ గారి గురించి ప్రత్యేక సంచిక చేద్దామన్న ఆలోచన మా సంపాదక వర్గ సభ్యురాలు కల్పనా రెంటాలది. చాలా మంది రచయితలు ఆమె మాట మీద తమ రచనలు పంపించారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

5

కోటేశ్వరమ్మ గారు వొక ఎత్తు. వాళ్ళమ్మాయి కరుణ గారు ఇంకో ఎత్తు. ఎప్పుడూ మృదువైన చిరునవ్వుతో పలకరిస్తూ వుండిన డాక్టర్ కరుణ గారికి, మా నాన్నగారికి మంచి స్నేహితుడైన కరుణ సహచరుడు రమేష్ బాబు గారికి ఈ ప్రత్యేక సంచిక అంకితం.  కరుణ గారమ్మాయిలు  చుక్కుకి,  అనురాధకి ఇది మా స్నేహ కానుక!

అట్లాగే, అప్పట్లో మొగల్రాజ పురం అంటే అచ్చంగా వొక సాహిత్య వాడ. నవోదయ రామమోహన రావు గారు,  బాలగోపాల్, వసంత లక్ష్మి, ఖాదర్ మొహియుద్దీన్, ఉషా ఎస్. డానీ, వేగుంట మోహన ప్రసాద్, సి. రాఘవాచారి, ఎన్. వేణుగోపాల్, మంచి పుస్తకం సురేష్-భాగ్య లక్ష్మి, త్రిపురనేని శ్రీనివాస్, సౌదా అటు రేడియో కాలనీలో పన్నాల, కృష్ణ కుమారి–ఇంకా ఎందఱో- బయటి నుంచి ఎవరు బెజవాడ వచ్చినా మొగల్రాజ పురం వచ్చి తీరాల్సిందే అన్నట్టుండేది. ఆ మొత్తం కమ్యూన్ కి కోటేశ్వరమ్మగారితో ఎంతో కొంత అనుబంధం వుంది. వారందరికీ ఇది సంతోష సందర్భం అని మాకు తెలుసు.

*

 

 

 

అఫ్సర్

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఇటువంటి అరుదైన విషయాలను తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

 • ఈ ప్రత్యేక సంచిక ప్రచురణతో సారంగ ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అభినందనలు.

 • అద్భుత మైన ఆలోచనా ప్రయత్నమూను
  Thank you Saranga
  నా మిత్రులు డా.పద్మశ్రీ విజయవాడ పోస్టల్ క్లినిక్ లో డా.కరుణ గారితో పాటు ఉండేది. డా.కరుణ గారి రూమ్ లో చిన్న పిల్లల ఫోటోలు వాటి క్రింద శైశవగీతి(శ్రీశ్రీ)కవిత లోని పంక్తులు ఉండేవి. చాలా ఆప్యాయంగా పలకరించేవారు.
  ఢిల్లీలో ఉన్నప్పుడు తెలుగు మిత్రులద్వార రమేష్ గారిని చూడటం కరుణగారు గుర్తు పట్టి పలకరించటం మరవలేని విషయం.
  ఈ నా స్వ విషయాన్ని గుర్తుచేసుకొంటూ
  జీవన యాత్రలో అనేక పోరాటాలను స్వీకరించి సాధించిన కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి ప్రణమిల్లుతూ ..
  ప్రత్యేక సంచిక ఆలోచన పంచిన కల్పన గారికి కృతజ్ఞతలు

 • బాగుందండీ‌ కోటేశ్వరమ్మ గారిమీద ప్రత్యేక సంచిక తేవాలన్న మీ ఆలోచన. ఇప్పుడే చూస్తున్నాను. ధన్యవాదాలు.

 • వుద్యోగమో కాసింత ఆర్ధిక ఆసరానో చూపిస్తే ఆదర్శాలు వోడిపోతున్నాయి కదా మరి.. ఈ మాటలో అంతా ఉంది సర్.. కోటేశ్వరమ్మ గారి వంటి వ్యక్తులు చాలా అరుదు. నా మటుకు నాకు ఎన్నో కొత్త విషయాలు ఈ ప్రత్యేక సంచిక ద్వారా తెలుస్తున్నాయి. ధన్యవాదాలు.

 • కోటేశ్వరమ్మ గారి గురించి ప్రత్యేక సంచిక తేవాలన్న సంకల్పమే గొప్ప విషయం. నిండు నూరేళ్ల ఆ తల్లికి ఇంతకు మించిన అభినందన ఏముంటుంది.. సంపాదకులకు నా వినమ్ర వందనాలు..

 • కోటేశ్వరమ్మ నిర్జనవారధి ఆమె నిబద్ధతకు నిండైన దర్పణం

  కోటేశ్వరమ్మ గారి జీవితం కేవలం కొన్ని అనుభవాల సంపుటి కాదు, వొక నిబద్ద పోరాట కావ్యం.
  ప్రత్యేక సంచిక బాధ్యులందరికీ అభినందనలు

 • ఆమె కథ “నిర్జన వారధి” చదివినప్పటి నుండి ఆమె నాలో చెదరని చిత్తరువు అయ్యారు.

 • కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి ప్రణమిల్లుతూ … వారి గురించి ప్రత్యేక సంచిక తీసుకు వస్తున్నసారంగ సంపాదక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ …

  Revolutionary Desires: Women, Communism, and Feminism in India ( Routledge 2018), the forthcoming book of Professor Ania Loomba, ( English Department, University of Pennsylvania ) explores the histories and subjectivities of militant-nationalist and communist women from the 1920s till the late 1950s. It traces how they shaped a new political and feminist subject, in collaboration as well as contestation with mainstream nationalist, liberal-feminist, and European left-wing models of womanhood.

 • ఇప్పటి జీవితాల్లో ఇదొక అపూర్వ జానపద కథలాగా వినిపిస్తుంది. వుద్యోగమో కాసింత ఆర్ధిక ఆసరానో చూపిస్తే ఆదర్శాలు వోడిపోతున్నాయి కదా మరి!

 • నిర్జన వారధికాదు. జన వారధి కొండపల్లి కోటేశ్వరమ్మ. పోరాటయోధురాలు నిజ జీవితంలోనూ.. ఉద్యమజీవితంలోనూ. … సహచరుని చేతిలో మోసపోవడం ఒక ఎత్తైతే కన్నబిడ్డలను దూరం కావాల్సిరావడం మరెంతో బాధించే విషయం. పసితనంలో దూరమే కాదు ఎదిగిన కొడుకు ఉద్యమానికి అర్పణ కావడం అల్లుడు మరణించటంతో కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం పసిబిడ్డలతో తాను మోడులా మిగిలిపోవటం ఎంత బాధాకరం జీవితాన్ని అనుభవించిందో ఆ తల్లి. వందేళ్లు పూర్ణాయుస్సుతో జీవించి ప్రపంచానికి జీవిత పరమార్థం సాకల్యం చేసిన ఘనురాలు. ఆమె స్మరణలో సారంగ అధిపతులు చేసిన ఈ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు