ఇత్తరాకుల తట్ట

డికవతల ఉన్న వీధి స్తంబం లైటు వెలుతురు నీడ సుబాబాకుల్లోంచి టెంట్ మీదకి పడుతోంది. వర్షసూచికగా ఈదురుగాలి చిన్నగా మొదలైంది. ఆ గాలికి టెంట్ నీడ ఎవరో ఊయల ఊపుతున్నట్టుగా అటు ఇటు విసురుగా ఊగుతుంది.

రాళ్ళ పొయ్యి పెట్టి వంటచేసిన జాగా కాడ ఎవరో ఆడమనిసి ఒక్కతే కూర్చొని అన్నం తింటునట్టుంది. ఎవరో చూద్దామని తింటున్న ఇత్తరాకుని ఎడం చేత్తో పట్టుకొని అటుగా నడిచా.

వెంట్రుకల చివర్లు సాంబారన్నంలో నానుతున్నాయనే పట్టింపే లేకుండా తలొంచుకొని ముద్దలు కలుపుకొంటోంది. తన దగ్గరగా వొచ్చి ఆగిపోయిన రెండు చెప్పుల శబ్దాన్ని చూడటానికి తలెత్తింది. ఆ ఎరుప్పచ్చని బల్బు ఛాయలో మేరి పిన్నంని గుర్తుపట్టలేకపోయా. చూసి చాలా రోజులైపోయింది. మునుపటిలా ముఖం తేటగా లేదు. చంద్రుడి మీదుండే ఎన్నటికి మాసిపోని మచ్చలు తన చెంపలమీద, అక్కడక్కడా.

నేనే అని కొంచెం స్థిమితపడి నీరసంగా నవ్వుతూ “చిన్నోడా, వంటలు భలే కుదిరాయి రా. ఎంతైనా శనగపాటోడి కొడుకువనిపించుకున్నావ్ రా.”

ఎవరైనా నాన్న ఊసు ఎత్తితే శబ్దం లేకుండా ఒక నవ్వు నవ్వి ఊరుకునేవాడిని. కానీ, ఇవాళెందుకో ఏమి మాట్లాడాలో తెలీక అలా నిల్చుండిపొయ్యా.

చీకటి నిశ్శబ్దంలో నా ఇబ్బందిని గ్రహించిందనుకుంటా! ఇత్తరాకుని బల్లమీద పెట్టి చేతికున్న ఒక్క గాజుని వెనక్కనుకొని జగ్గుతో మంచినీళ్లు తాక్కుంటూ “చిన్నె, అమ్మ యాడుందిరా? పొద్దున్నుండి ఒక్కసారి కూడా సరిగా మాట్లాడలే. నాకోసం పిల్సకొత్తవా రా?.”

గొంతులో నాకోసం ఇక్కడ ఎవరూ లేరనే భాద.

తిన్నది చాలనుకొని నా చేతిలోని ఆకుని తట్టలో విసిరేసి చెయ్యి కడుక్కోకుండానే అమ్మకోసం వెతికా. తాటాకు పందిరి నడిమిట్లున్న సధివింపు పాన్పుపై పెళ్ళైన రాజిగాడోళ్ల జంట. వాడికెదురుగానున్న పళ్ళెంలో నిండుగా మడతలు పడిన నోటు కాగితాలు. ఎడంపక్క కూసున్న గుంపులో అమ్మ ఎవరితోనో ముచ్చట్లు. వెనకనుండి మెల్లిగా వెళ్లి కొంగుపట్టుకొని లాగి, ఇటురా అని తలతో సైగ చేశా.

మందిలో మాట్లాడటం ఇష్టంలేదు, చిన్నప్పుడు, ఇప్పుడు కూడా.

అమ్మ అక్కడనుండి వస్తుంటే, టీవీ సీరియల్ మాంచి రసపట్టులో ఉంటే మధ్యలో చిత్త వస్తే ఎలా ఉంటుందో, అలా ఉంది ఆ గుంపు సంగతి.

ఉలుకు పలుకు లేకుండా నడ్సుకుంటూ పోతున్న నన్ను చూసి “యాడికి రా?….మిగిలిపోయిన అన్నం, కూరలు, గిన్నెల్లో తోడారా? తిన్న ఆకులన్నీ పారేసారా…?” – నేను కనిపిస్తే అడగాలనుకున్న ప్రశ్నలన్నీ అడిగేసింది నా జవాబులతో సంబంధంలేకుండా.

“అమా…  పిన్నం నీతో మాట్లాడాలంటే”- పెళ్ళిపనుల గందరగోళంలో ఎవరిమీదో చూపించాల్సిన అసహనం, అమ్మ మీద.

నన్ను దాటేసుకొని పెద్ద పెద్ద అంగలేస్తూ టెంట్ కాడికి ఉరికింది అమ్మ. బాబాయోళ్ల గాబులో చెయ్యి కడుక్కొని పొయ్యేసరికి పొయ్యి గడ్డల మీద బాసంపట్ల వేసుకొని మాట్లాడుతున్నారిద్దరు. సీరియస్ గా ముఖం పెట్టి పిన్నం ఎదో చెప్తుంటే, అమ్మేమో పిన్నం భుజాలమీద చేతులేసి, పడీ…పడీ నవ్వుతుంది.

ఆడమనుషులు, వాళ్ళ మాటలు వినడానికి ఒక తోడు దొరికితే చాలనుకుంటా, ఎక్కడలేని నవ్వులను దుఃఖాల బావుల్లోంచి కూడా తోడుకుంటారు.

సప్పిడి చేయకుండా అమ్మపక్కన చతికిలపడ్డా. నేను వెళ్లడం చూసి మళ్ళీ తినడం మొదలెట్టింది పిన్నం. ఇత్తరాకులో మిగిలిన ఆ చారన్నం తిన్న తరువాత నాకెళ్ళి చూసి “మా అయ్య కదరా, కొంచెం మజ్జిగన్నం పోసుకొని రా రా చిన్ని,” అంది.

చిన్నప్పుడు ఇంట్లో రెండే కూరలుండేవి- అయితేనేం ఎల్లిపాయ కారం లేకపోతే ఉల్లిగడ్డ కారం. ఇంకా గుర్తు నాకు ఐదో తరగతి ఎండాకాలం సెలవులు అనుకుంటా. అప్పుడేమో నాకు విరోచనాలయ్యి బైటికిపోతే ముడ్డి మొత్తం మంట. పైపెచ్చు ఆకలయినపుడు తినడానికి మళ్ళా ఆ కారమే దిక్కు. ఎక్కణ్ణుంచి సంపాదించిందో తెలీదు కానీ నా భాద చూడలేక సాయంత్రానికల్లా మజ్జిగన్నం తెచ్చింది పిన్నం. అలా నా జీవితంలోకి ఒక కొత్త మనిషి నా ప్రమేయం లేకుండానే వచ్చింది. ఆ రోజు మొదలుకొని ఏ పొద్దైనా మా ఇంట్లో కూరలు బాగోకపోతే పళ్ళెంలో బువ్వేసుకొని, సంక్రాంతి పండగప్పుడు చర్మాన్ని చర్నాకోలుతో హింసించుకొనే డూ డూమ్ బండోడిలా, గూడేమంతా తిరిగి… తిరిగి … పిన్నం ఇంటి దగ్గర ఆగిపోయేవాడిని.

చిన్నప్పటి సాయంత్రాలంతా తన కోసమే ఎదురుచూసేవాడిని. చిన్నబడిలో ఇంటిబెల్లు కొట్టిన తరువాత, పుస్తకాల సంచి ఇంట్లో పడేసి పొలాలకు వెళ్లే దారిలో ఉండే మోరిమీద కూర్చునేవాడిని.

పత్తికిపొయ్యి గట్టుమీదున్న కందికాయలో, మిరపకోతకి పొయ్యి వాగొడ్డుమీదుండే రేగ్గాయలో, వడ్లగింజల పరిగెకి పొయ్యి కాలవబాటలో చిన్న ఈతకాయలో, అలా ఎదో ఒకటి సాయంత్రానికల్లా నా లాగు బొందిజేబులో మచ్చటంగా వేసేది పిన్నం.

రాజిగాడు పుట్టేంత వరకు నేనే తన కొడుకుని. తీరా, వాడు పుట్టి ప్రేమనంతా లాక్కెళ్ళు పోతున్నాడని అలిగినవేళ, ఒళ్ళో పడుకోబెట్టి తలా నిమురుతూ చిత్రపు కథలు చెప్పేది. ఒక రోజు జోకొడుతూ పిన్నం ఒక మాట చెప్పినట్టు లీలగా గుర్తు నాకు- “వాడు నా చిన్న కొడుకు, నువ్వు నా పెద్దోడివి రా.”

రోజులన్నీ ఒకేలా ఉండవు కదా! కారణం ఏంటో సరిగా తెలియకుండానే పిన్నం దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళా నా ప్రమేయం లేకుండానే.

అప్పుడు నేను తొమ్మిదో తరగతి. కమలాకర్ సార్ తొడపాశం పోరు పడలేక రాత్రుళ్ళు కూడా కిరసనాలబుడ్డి వెలుగులో రేఖగణితం చతుర్భుజాలతో కుస్తీపట్టేవాడిని. ఏవో అరుపులు వినిపిస్తుంటే అమ్మ ఊదురుగొట్టం పొయ్యికాడ పడేసి బయటకెళ్లింది. ఒక పదినిమిషాలు వృత్తమానినితో నేను తంటాలు పడిన తరువాత ఎంతకూ అమ్మ రాపోయేసరికి నేనూ బయటకొచ్చా . అమ్మ మాట గట్టిగా వినపడుతోంది. గోలంతా పిన్నం వాళ్ళ ఇంటివైపు నుండి వస్తుంది.

చేతిలో తోడుతెచ్చుకున్న పెన్సిల్ ముక్కని విసిరేసి ఉరికా. సూరుకింద అమ్మ నించొని లోపలున్న ఎవరినో తిడుతుంది. పిన్నం రోలు పక్కన మట్టిలో కూలబడి ఉంది. తన చుట్టూ ఉన్న అరుపులు వినిపించట్లేదనుకుంటా చూపులన్నీ నేల మీదే. నేను పక్కన నిల్చోన్నాననే ఊసు కూడా లేకుండా తనలో తానే ఎదో గొణుక్కొంటుంది.

అమ్మ గుడిసెలోనుండి బయటకొస్తూ చేతిలోనున్న ముళ్లుగర్ర పారేస్తూ “ఏమి పుట్టింది రా నీకు? ఏమి లంజరికం చేసిందని దాన్ని సంపుతున్నావ్ ఇప్పుడు? గూడెంలో ఉన్న పత్తిత్తులకంటే ఆ బోడి రంకుతనం ఏమి చేసిందిరా ఇది?” అని, రాజి గాడిని భుజంమీద జోకొడుతుంది. వాడు బరువవుతున్నాడనుకుంటా కాలు కింద సరిగా ఆనక అమ్మ బ్యాలన్స్ తప్పుతూ అడుగులు తడబడ్డాయి.

“ఇంకా ఏమి చేయాలి ఈ లంజది?గూడెంలో ఏ నాకొడుకుని అడిగినా దీని బాగోతం బయటపడుద్ది. పిల్లగాడు పెద్దోడయిండే ఏ మాత్రం సిగ్గు పెట్టలేదు దేవుడు దీనికి అసలు” ఊడిపోతున్న లుంగీ సరిచేసుకొని మళ్ళా కొట్టడానికొస్తున్నాడు బాబాయి.

“ఎవడ్రా ఆ నా బట్ట దీని సంసారంలో నిప్పులు పోసింది? ఎవరైనా కుశాలుగా బతికితే కంట్లో నిప్పులు పోసుకునే రకాలు ఈ గూడెం మంద. అసలు, మందిమాటలు వినడానికి సిగ్గు లేదురా నీకు…” పిన్నంని రెక్కపట్టి పైకి లేపింది అమ్మ.

ఇంటికి తిరిగి నడిచేటప్పుడు, చీకట్లో కుక్కల అరుపులకి భయపడి అమ్మ కొంగుపట్టుకుని కాళ్ళీడిస్తున్నా. పిన్నం మాత్రం, మౌనంగా మా వెనకాల నడుస్తుంది. ముక్కు ఎగదీసుకున్నప్పుడో, చెదిరిన జుట్టుని ముడేసుకున్నప్పుడో తప్ప, మా వెనకాల ఒక మనిషి ఉన్నట్టు జాడే లేదు.

బహుశా ఆ రోజే, వానగుంటలాటలో నా మీద గెలిచి గట్టిగా అరిచి గోలపెట్టే మనిషి, ఉప్పుబిర్ర ఆటలో చీర అంచంతా మట్టి పూసుకునే మనిషి చనిపోయిందనుకుంటా….

ఆ రాత్రి ఈతాకు చాపమీద ఒక చివరన నేను పడుకుంటే, మధ్యలో రాజిగాడు, ఆ చివరన పిన్నం పడుకుంది. ఓ పక్కకి ఒత్తిగిలి పడుకునేసరికి చెంప ఆనించిన దిండంతా ముద్దముద్దగా తయారయింది తెల్లారేసరికి. ఆ రాత్రే తెలిసింది నాకు పిన్నం కళ్ళల్లో కూడా కన్నీళ్లొస్తాయని. రాత్రంతా రాజి గాడు మెసులుతూనే ఉన్నాడు. ఏ అర్ధరాత్రప్పుడో నా మీద కాలేసి సోయలేకుండా పడుకున్నాడు.

గాలివానోచ్చిన తెల్లారి చెట్లన్నీ ఎలా చలనం లేకుండా స్తబ్దుగా ఉంటాయో, అలా ఉంది గూడెం అంతా పొద్దున్నే. లేచేసరికి పక్కలో ఎవరూ లేరు. అమ్మేమో ఊళ్ళోకిపొయ్యి వస్తూ కంట్లో ఎదో నలక పడిందానిమల్లే, కొంగుతో తుడుసుకుంటుంది. బాబాయోళ్ల మొత్తలకాడ ఇద్దరు, ముగ్గురు పెద్దోళ్ల ఉన్నారు.

వేప పుల్ల నోట్లో వేసుకొని బయటకి నడుస్తుంటే, “యాడికి రా?” అని అమ్మ అరిచింది. చెవుడొచ్చిన వాడల్లే ఏమి పట్టనట్టు గంపు కాడికి నడుచుకుంటూ పోతుంటే రాజిగాడు వెనకనుండి వచ్చి కాళ్ళకి చుట్టుకున్నాడు.

ఎక్కిళ్ళ మధ్య ఏడ్చుకుంటూ కూడ పలుక్కొని చెప్పాడు- “అమ్మని తీస్కరా… పో అ… న్నా”.

చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ ఇంటికి పొయ్యేసరికి అమ్మ గుమ్మంలో దిగాలుగా ఉంది. రాజిగాడిని దగ్గరికి రమ్మని చెప్పి, ఒళ్ళో కూర్చుపెట్టుకొని వాడి బుగ్గకంటి ఎండిపోయిన చీమిడిని తుడుస్తుంది.

“చిన్నోడా, పిన్నం వెళ్ళిపోయింది రా. వీడిని కూడా తీసుకపోతానని ఎంత ఏడ్చిందో పిచ్చిది. ఆ పెద్దోళ్లు దాని మాట పడనిస్తేగా…ఇక రాదు రా అది”అని, రాజిగాడిని ముద్దుపెట్టుకుంటుంది.

తెల్లారగట్లప్పుడు బాబాయి ఇంటికొచ్చాడని, మళ్ళీ ఎదో గోడవపెట్టుకున్నారని, ఈ సారి రొకలిబండతో వీపుమీద కొడితే పిన్నం పది నిముషాలు సృహ తప్పి పడిపోయిందని…..ఇంకా వినరాని బూతుమాటలని….  “ఇవన్నీ పడేకంటే వెళ్లిపోవడమే మంచిదని” పిన్నం అంటే, బాబాయేమో చీరలన్ని బయట పారేసాడని, రాజి గాడిని ఎత్తుకొని పోతుంటే, పెద్దోళ్లొచ్చి వాడిని చంకలోంచి లాక్కొని “నీతో పెరిగితే, అన్నీ నీ బుద్దులే వస్తాయే..వాడిని ఇక్కడే పెంచుతాం” అని ఇక్కడే ఉంచారని…ఇలా నేను నిద్రపొయ్యినప్పుడు జరిగిన విషయాలన్నీ ముక్కలు ముక్కలుగా, ఒక క్రమమంటూ లేకుండా అతికించి చెప్పింది అమ్మ.

ఎందుకోగానీ, ఆ రోజునుండి బాబాయి గూడేమోళ్లతో కలవడం మానేశాడు. నలుగురు కూడిన చోట తన గురించే మాట్లాడుకుంటున్నారని భయం అనుకుంటా.

చీకటి తెరలు పూర్తిగా వీడకముందే పనికిపోవడం, మళ్ళా కర్రి చీకటి గుప్పుమనేదాకా ఇంటికి రాకపోవడం. తెల్లారుజామున పనికేల్లెలోపు అన్నం వండి, ఇద్దరిడిచిన బట్టలు ఉతికేవాడు. రాత్రి వచ్చిన తరువాత రాజిగాడికి నీళ్లు పోసి అన్నం తినిపించి నిద్రపుచ్చేవాడు.

ఆదివారం ఇంట్లో ఉన్నా బయటకొచ్చేవాడు కాదు. మా ఇంట్లో ఎప్పుడైనా సియ్యకూర వండినపుడు బాబాయికి ఇచ్చిరమ్మని అమ్మ చెప్పేది. పిన్నం లేని ఇల్లంతా శూన్యంలా, బూజుపట్టిన దండెం మీద వేలాడుతున్న బట్టలన్నీ లోపలికి వెళ్లిన మనుషులందరిని వెక్కిరిస్తున్నట్టు ఉండేవి.

ఎప్పుడైనా నేనో, రాజిగాడో, పిన్నం ఊసు తీస్తే, పొగచూరిన తాటాకుకప్పు వైపు చూస్తూ తనలో తానే నవ్వుకునేవాడు బాబాయి, భాదని దిగమింగుకుంటూ.

రాజిగాడు హాస్టల్కి వెళ్లినతరవాత మనిషి ఒంటరయ్యాడు. ముసలోడయిపోతున్నాడనే దానికి గుర్తుగా జుట్టంతా తెల్లబడటం మొదలెట్టింది.

ఎన్నో సార్లు అమ్మని అడిగినా పిన్నం ఎక్కడుందని, ఎందుకు వెళ్ళిపోయిందని. కానీ, ఎప్పుడడిగినా ఎదో ముక్తసరిగా ఒక మాటచెప్పి తప్పించుకునేది. వాళ్ళు, వీళ్ళు చెప్పుకుంటుండగా విన్నది ఏంటంటే, పిన్నం మధిరలో ఎదో హోటల్ లో పనికి కుదిరిందని అక్కడే ఎదో ఇంట్లో అద్దెకు ఉంటుందని.

ఆ పదేళ్ల కాలంలో పిన్నం ఊరొచ్చిన ఊసే లేదు. కానీ, నెలకోసారైన రాజిగాడి దగ్గరికెళ్లేదట. పొద్దున గేటు తీసేసరికి అందరికంటే ముందే ఉండి రోజంతా వాడికావాల్సినవన్ని కొనిపించి, అందరికంటే చివరిగా వెళ్లెదట ఇంటికి. ఏడ్చుకుంటూ.

రాజిగాడు తొమ్మిదిలో ఉన్నప్పుడు బాబాయికాలు విరిగింది. పైగా, తాగుడెక్కువై సరిగా తినక మంచాన పడ్డాడు. టైంకి ఇంత వండి పెట్టేవాళ్ళు లేక పస్తులుండేవాడు జబ్బుచేసిన రోజుల్లో.

బాబాయికి పిన్నం విలువ తెలిసొచ్చిందో లేక తోడు కావాలని అనిపించిందో తెలియదు కానీ తన కోసం ఒక పెద్దమనిషిని పంపించాడు. ఇంకొకసారి తనే వెళ్ళాడు తీసుకురావడానికి.

“నిన్ను పెళ్లి చేసుకున్న మనిషి సచ్చిపొయ్యి చాలా రోజులయింది. ఇప్పుడు ఆ ఊరూ, ఆ ఇంటికి నేను ఎలా రావాలి? శవంతో కాపురం చెయ్యడానికి వచ్చావా ఇప్పుడు” అని, లోపలెవరికో చట్నీ వెయ్యడానికెళ్లింది. హోటల్కి వచ్చే మనిషితో మాట్లాడినట్టు ఒక మాట అనేసి తన పనిలో తాను మునిగిపోయిందట పిన్నం.

కొత్తగాకట్టిన మధిర ఫ్లైఓవర్ కింద కూర్చొని బిత్తరచూపులు చూస్తున్న బాబాయిని, ఎవరో ఆటో డ్రైవర్ ఊరికి తీసుకొచ్చాడు. అప్పటికే తాగి ఉన్నా, మళ్ళా తాగటానికి సారాయి తెమ్మని రాజిగాడిని కొట్టుకాడికి పంపాడు. రాజిగాడికి జరిగిందంతా చెప్పి చిన్న పిల్లోడిలా ఏడ్చాడట ఆ రాత్రి బాబాయి.

రాజిగాడు పదోతరగతి గట్టెక్కపోయేసరికి కరెంటు పని నేర్చుకునే పనిలో కుదిరాడు. ఓ మూడేళ్లు డక్కి మొక్కీలు తిన్న తరువాత సొంతగా ఊళ్ళో పొలంకాడుండే బావి మోటార్లు బాగుచేయడం మొదలెట్టాడు.

అమ్మ ఏరోజైనా మనేదగా ఉన్నప్పుడు మాత్రం దగ్గర కూచోపెట్టుకొని సందర్భానికి పొసగని మాటలు చెప్పేది నాకు – ” చిన్నోడా, రేపు ఎవరైనా నిన్ను నమ్ముకొనిచ్చినప్పుడు వాళ్లనెప్పుడు సూటిపోటి మాటలనక. నాకు నువ్వు ఎట్లా ముద్దో, ఆ మనిషి వాళ్ల అమ్మోళ్ళకి అంతే ముద్దు కదా. ఆ పిల్లకి కొన్ని ఇష్టాలుంటాయి. ఏ మనిషిని కష్టపెట్టకుండా బతకాలి చూడు నువ్వు, చిన్ని… ”

అమ్మ నోటెంట ఎప్పుడు ఇలాంటి మాటలొచ్చినా నాకు మాత్రం ఒక్కటే గుర్తుకొచ్చెది. ఆ రోజు రాత్రి  నేను అలా మూగగా పడుకోకుండా పిన్నంని అడిగిఉంటే, బహుశా ఇలానే మాట్లాడేదేమో తను కూడా!

పోయినేడాది నాన్న చనిపోతే, 14 ఏళ్ల తరువాత పిన్నం ఊరుకొచ్చింది.

పిన్నం ఊర్లో ఉన్నంతకాలం నాన్నతో రోజూ పరాచాకాలాడేది. వయసుతో పాటు పెరిగిన నాన్న పొట్టని చూసి “చిన్నోడో, నీ తమ్ముడో, చెల్లో, మీ అయ్య పొట్టలో దాసుకున్నార్రో” అని, గెలిచేసేది.

చావు కబురెవరు చెప్పారో తెలీదు కానీ ఉదయం ఎనిమిదిన్నర కల్లా వచ్చేసింది. రోజంతా ఎవరితో మాటా లేదు, పలుకూ లేదు. నాన్నని పడుకోబెట్టిన మంచం ఎడం పక్కన ఉన్న పందిరిగుంజనానుకొని మౌనంగా ఏడుపు. బొందలగడ్డకి పోతూఉంటే నా చేతిలో చెయ్యేసి నా వెంటే నడిచింది. మట్టేసేంత వరకు నాతోనే ఉండి నాన్నకి నేనెంత ఇష్టమో చెప్పి “తన పేరు గుర్తుండేలా ఎదో ఒకటి చెయ్యాలి రా చిన్నోడా నువ్వు” అని, చెప్తూనే ఉంది.

సాయంత్రం ఇంటికొచ్చి చూస్తే ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోయింది.

మళ్ళా, ఇదిగో ఈ రోజు ఇలా నన్ను మజ్జిగ పోసుకురమ్మని బ్రతిమిలాడుతుంది.

లైట్ వెలుతురుకు పురుగులు పడకుండా డెర్సా గిన్నెలన్నింటికి మూతలేశారు. పెరుగు చట్నీ మూత తీసి అన్నంకి రెండింతలు అయ్యేలా పెరుగు పోసా. నిండుకున్న పళ్లెం ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని టెంట్లోకి నడిచా. ఆ లోపు అమ్మేమో, పిన్నం కుడిచేతికి పసుపు రాస్తోంది. పొద్దున గొడవలో గాజులన్నీ చిట్లి రక్తం కారింది ఆ చెయ్యే కదా.

రాజిగాడి పెళ్లిచూపులప్పుడు కానీ, పప్పన్నమప్పుడు కానీ, పిన్నంని పిలవాలనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ, చర్చిలో పెళ్లిచేసేటపుడు అబ్బాయి తల్లితండ్రులు ఖచ్చితంగా ఉండాలి కదా అని ఎవరికి చెప్పకుండా అమ్మే పిన్నంకి ఫోన్ చేయమంది.

ఇవాళ పొద్దునెప్పుడో వచ్చినా పెళ్లితో తనకేమీ సంబంధం లేనట్టు ఎక్కడో మూలన కొంగు ముసుగేసుకొని కూర్చొని పెళ్లి చూస్తోంది.

పెద్ద పాస్టర్ గారు అప్పటిదాకా పెళ్లిజంటతో పరిశుద్ధ వాక్యాలు చదివించి అసలు పెళ్లి తంతు ఇక మొదలవుతుందని, మేళగాల్లని రెడీగా ఉండమని సైగ చేసాడు. అమ్మాయి తల్లితండ్రులని ముందుకు రమ్మని చెప్పి “ఈ అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడం ఇష్టమేనా” అని, అడిగాడు . వాళ్ళు అంగీకారంగా తలలూపడంతో అబ్బాయితరపు పెద్దల్ని ముందుకు రమ్మని మైకులో చెప్పాడు.

గుంపులో ఎదో గుసగుస మొదలైంది. బాబాయి ముందుకు నడుస్తుంటే ఎవరో పిన్నంని పేరు పెట్టి పిలిచి ముందుకు పో అని అరిచారు. పక్కనున్న ఎవరో లెమ్మని వత్తిడి చేస్తున్నారు. అందరి ముందు దోషిగా, మెల్లగా నిలబడింది పిన్నం.

ముందుకు నడుద్దామని అనుకునేలోపు ఎవరో అమ్మాయి తరపు మనిషి “నీలాంటి లంజలు దీవిస్తే మా అమ్మాయి కూడా నీలాగే పరాయి ఊర్లో బిచ్చ మెత్తుకుంటుందే. అసలు ఎవడు పిలిచాడే నిన్ను పెళ్లికి? నీ బాగోతమంతా మాకెరుకే” అని, పిన్నం జుట్టుపట్టుకొని లాగి కిందపడేసాడు.

ఎక్కడో ముందు కూచున్న అమ్మ అందరిని తోసుకుంటూ వెళ్లి పిన్నంని కొట్టిన మనిషిని కోపంతో నెట్టింది.

“నువ్వేవడ్రా దీని మీద చెయ్యెయ్యడానికి? నీ  కళ్ళల్లో ఎవరూ కారంపొయ్యలేదేరా ఇంకా, సిగ్గుమాలోకం తప్పిన చెడ్డ నా కొడకా ” అని, పిన్నంని పక్కకి తీసుకపోతుంది.

ఈ లోపు అమ్మాయి తరపు కొందరు, గూడెం పెద్దోళ్లు కొందరు మాటా మాటా అనుకున్నారు. అమ్మ ఇంకా ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటే అవతల గుంపులోనున్న మనిషేవరో అంది- “ఎందుకమ్మా నీకు మాలా రోషం పొడుసుకొస్తుంది? కన్న కొడుకే సప్పిడి చేయకుండా ఉంటే మధ్యలో నీకేమొచ్చింది”.

పిన్నం అక్కడనుండి బయటకు నడిచింది. అమ్మ నన్ను ఉండమని చెప్పి తనతో పాటే నడుచుకుంటూ వెళ్లింది. అప్పుడు వెళ్లిన తరువాత ఇదిగో ఇలా ఈ చీకటి టెంట్లో కూర్చొని అన్నం తింటూ కనిపించింది.

“చిన్నోడా, పెళ్లి బాగా జరిగింది కదా రా! అమ్మాయి కూడా చూడటానికి సుక్కల్లే ఉంది.”

“……………”

“సరే కానీ ఈ ఇత్తరాకులేందిరా ఎవరు తియ్యలే?”

“…………”

పిన్నం మాట్లాడుతున్నంతసేపు ఎందుకో ఒకటే దృశ్యం లోపల తిరుగుతుంది. ఎందుకు ఆ రోజు నేను పిన్నంని ఏమి అడగకుండా పడుకున్నానా అని? ఒకవేళ అడిగినా ఏమైనా చెప్పి ఉండేదా అని?

“అసలెందుకు పిన్నం నువ్వు వెళ్లిపోయావ్ ఆ రోజు?”

ఎన్నో రోజులు నలిగిన ప్రశ్న, అనాలోచితంగా వచ్చేసింది బయటికి.

తింటున్న మనిషల్లా కాస్త ఇత్తరాకుని పక్కనెట్టి చాలాసేపు చూసింది నావైపు.

“కొన్ని విషయాలు మనతోనే పుట్టి మనతోనే సచ్చిపోవాలి చిన్నోడా. ఎవరికీ తెలియకుండా ఉంటేనే మంచిది అలాంటి మాటలు”

ఎన్నో రోజులు దాచుకున్న కష్టం, భాద బయటకొచ్చేసాయి.

ఓ పది నిముషాలు ఉరుములు మెరుపులు తరవాత కరెంట్ పోయింది. చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి.

“చిన్నోడా వాళ్ళు ఇంకా సధివింపు పాన్పు మీదే ఉన్నారా? వెళ్లి వాళ్ళకి ఆ గ్యాస్ లైట్ బుడ్డి వెలిగించుపో రా” అని, పిన్నం చేతులు కడుక్కోవడానికి లోటా వెతుక్కుంటుంది.

“పోద్దున అంత గొడవుతున్నా తాళి కట్టాలనే ధ్యాసే కానీ ‘నా అమ్మని ఎవడ్రా కొట్టేది’ అని, ఒక మాట కూడా అనలేదు వాడు. వాళ్లకోసం ఎందుకు నువ్వు ఇంకా తపనపడటం పిన్ని” అని, కోపంగా కుర్చీని తన్నా.

తిన్న ఇత్తరాకు తట్టలో వేస్తూ చెప్పింది- “చిన్నీ…నీకు  నేను చెప్పిన మాట గుర్తు లేదా? నువ్వు నా పెద్ద కొడుకు, ఎంతైనా వాడు చిన్న కొడుకు కదా రా”.

నేను లైట్ ఇచ్చి వచ్చేలోపు ఆ ఎంగిలి ఇత్తరాకుల  తట్ట నెత్తినెత్తుకొని పోతుంది. వానకి ఆ తట్టలోని ఆకుల్లో ఉన్న ఎంగిలి మెతుకులంతా పిన్నం మోహమ్మీదకి కారుతున్నాయి.

ఓ మెరుపు మెరిసి వెలుగు వెలిసిన తరువాత, పిన్నం ఆ చీకట్లో  ఎవరికి కానరాకుండా మాయమైపోయింది.

*

Avatar

మేడి చైతన్య

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తమ్ముడు నీ పిన్నం గురించి చదువుతుంటే నా పిన్ని గుర్తుకువచ్చింది. కథలా అనిపించలేదు ఆమె జీవితంలా అనిపించింది. చాలా బాగా చెప్పావు. నీ అంత బాగా రాయలేనుగానీ, మా పిన్ని గురించి రాయాలనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు