ఇతరుడి అన్వేషణే ‘శికారి’

‘శికారి’రచయితతో మరో కర్నూలు రచయిత శ్రీనివాస మూర్తి   సంభాషణ

పాణి ఏం రాసినా అందులో ఇమిడిపోయే కట్టుబాటూ, సాహిత్య సౌందర్యమూ చదువరిని ఆకట్టుకుంటాయి. ఇప్పుడు కొత్తగా వెలువడిన ఈ నవల సమాజంలో ఎవరూ పట్టించుకొని శికారీల మనోదర్పణం!

కర్నూలులోని నీలి శికారీల గురించి నాకు కొంత తెలుసు. నీ ‘శికారి’ అచ్చు పనులు చూస్తున్నప్పటి నుంచి ఈ నవలలోని శికారీ పాత్రలు నా మనసంతా ఆక్రమించారు. ఇప్పటికీ వదిలిపోలేదు. ఇంత భిన్నమైన వస్తువును ఎంచుకోవాలని నీకు ఎందుకు అనిపించింది?

*మొదట శికారీల గురించి నీకు తెలిసినంత కూడా నాకు తెలియదేమో. కర్నూలు సాహిత్యంలో శికారీల ప్రస్తావన , వాళ్ళ సారా బట్టీలపై సారా కాంట్రాక్టర్ మూకల దాడులు నీ  మొదటి కథ ‘ సేద్యం ‘ లోనే వచ్చింది. అయితే కర్నూల్లో ఉండే వాళ్లందరికీ బంగారు పేటలో శికారీలు ఉంటారని తెలుసు. దేనికంటే యాభై అరవై ఏళ్ల కింద బంగారు పేట పాత కర్నూలుకు దూరంగా ఉండేది. ఇప్పుడది  కర్నూలులో సెంటర్‌. రాజ్‌విహార్‌లాగే, బస్టాండ్‌ లాగే అదీ. ఆ రకంగా గత రెండు మూడు తరాల వాళ్లకు శికారీల బంగారు పేట ఒక ప్రాంతంగానే తెలుసు. శికారీల జీవితం మాత్రం తెలియదు. మనకు చాలా తెలుసని గొప్పలు పోతుంటాం. మన ఊళ్లోనే మనకంటే భిన్నంగా ఉండే వాళ్ల బతుకు గురించి మనకేమీ తెలియదు. తెలిసినా ఎట్లా తెలుసు? దొంగలని, మనుషులను చంపేస్తారనే తప్పుడు సమాచారం తెలుసు. దాన్ని మోసుకొని తిరుగుతుంటాం.  ఇదీ తెలియడానికీి, తెలియకపోడానికీి మధ్య తేడా.  చాలా విషయాలు ఇట్లాగే ఉంటాయి.

1993లో విప్లవోద్యమంలో పని చేయడానికి పార్టీ నన్ను కర్నూలులో వదిలేశాక మొదటిసారి శికారీలనే పేరు విన్నాను. బాధ్యుడు ఆ పేటకు తీసికెళ్లి కొందరిని పరిచయం చేశాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు విప్లవోద్యమ అభిమానులైన విద్యార్థులు ఒక రూంలో ఉండేవారు. అది నాన్‌ శికారీల ఇల్లు. ఆ విద్యార్థులు  ఎఐఎస్‌ఎఫ్‌తో ఉండేవారు. వాళ్లూ నాన్‌ శికారీలే.  విశాలమైన శికారీల బంగారు పేటను నాన్‌ శికారీలు ఆక్రమించుకొనే క్రమంలో ఇతరులు అప్పటికే అక్కడ స్థిరపడిపోయారనడానికి ఇది గుర్తు.  ఆ విద్యార్థులు కూడా ‘శికారోల్లతో కష్టం’ అనేవాళ్లు. శికారీలు చెడ్డవాళ్లని, ప్రమాదకారులని చెప్పేవాళ్లు. నన్ను ఒక ప్రశ్న వేధించేది. ఒక కమ్యూనిటీ దానికదే చెడ్డది ఎట్లా అవుతుంది? అదీ ఇంత దుర్భరంగా బతికే జనాలు ప్రమాదకారులు ఎట్లా అవుతారు? వాళ్ల గురించి తెలుసుకోవాలని అనిపించింది. మనుషులను తెలుసుకోడానికి వాళ్ల గురించి ఇతరులకు ఉండే ఇంప్రెషన్స్‌ సరిపోవు.  అదంతా పైపై సమాచారమే.  మనుషుల్ని తెలుసుకోవడమంటే వాళ్ల జీవితాన్ని తెలుసుకోవడమే. చాలా విభిన్నమైన, ప్రత్యేకమైన  శికారీలను తెలుసుకొనే ప్రయత్నమే ఈ నవల. అదేదో ఒక వాచకాన్ని నిర్మించడమని నేను అనుకోను. ఇతరుడిగా వాళ్లను తెలుసుకోవాలనే అన్వేషణే ‘శికారి’ రాయడానికి కారణం. అక్కడి నుంచే రచయితలు వస్తే  వాళ్లు తప్పక మరింత బాగా రాస్తారు.

నీవే ‘ఇతరుడిగా’ అంటున్నావు కదా. నీ నేపథ్యం వల్ల నీవు అన్ని రకాలుగా వాళ్లకు ఇతరుడివే. మరి నవలలో పాత్రలు యెంతో సహజంగా, తడిగా వున్నాయి. నన్నయినా, పాఠకులనైనా ఆ తడి, దు:ఖం, సహజత్వం వెంటపడతాయి. దూరం నుంచి చూసి ఇంతగా రాయడం యెలా సాధ్యమైంది?

*‘తెలుసుకోవడం’ లోపలి నుంచి, బైటి నుంచి ఉంటుంది.   సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ కార్యకర్తలు, సృజనాత్మక రచయితలు చేసే పనే తెలుసుకోవడం. ఈ ముగ్గురు ఒక్కో రకంగా తెలుసుకొని ఇతరులకు చెప్తారు. సాహిత్యకారులు తమ సృజనాత్మక శక్తి ద్వారా  ఇతరుల జీవితాన్ని తెలుసుకొనే పనిలోకి దిగి దాన్ని భావోద్వేగాలతో స్వీయానుభవంగా మలుచుకుంటారు. ఎంత స్వీయానుభవంగా మారిందనేదాన్ని బట్టి ఆ రచన ఉంటుంది.  రచనా మెలకువలు కూడా తోడవుతాయనుకో. శికారీలను అంతక ముందు ఎప్పటి నుంచో గమనిస్తూ వచ్చినా వాళ్ల జీవితం నాకు తెలుస్తున్నదనే నమ్మకం కలిగాకే నవల రాయడం మొదలు పెట్టాను. 2006 జనవరిలో అరుణతారలో ఈ నవల సీరియల్‌గా ఆరంభం కావడానికి ఒక ఏడాది రెండేళ్లపాటు నాకున్న పాత, కొత్త శికారేతరుల పరిచయాలతో బంగారు పేటకు తరచూ వెళ్లి వచ్చేవాడిని. శికారీలు ఎవ్వరినీ అంత సులభంగా నమ్మరు. దేనికంటే ‘ఇతరులు’ ప్రమాదకారులని వాళ్లూ అనుకుంటారు. ఈ వ్యవస్థతోటి, పాలకులతోటి, ఇతరులతోటి వాళ్లు నానా ఇబ్బందులు పడ్డారు.  అవమానాలు పడ్డారు.  నా మిత్రుల మీద ఉన్న నమ్మకంతో మొదట నన్ను వాళ్లు దగ్గరికి రానిచ్చారు. అయినా తమ  ఆంతరంగిక కట్టుబాట్లు, నమ్మకాలు, పద్ధతులు, విలువలు చెప్పడానికి ఇష్టపడేవాళ్లు కాదు. మెల్లగా వాళ్ల సారాయి బట్టీల దగ్గరికి రానిచ్చారు. రెండుసార్లు వాళ్లతో రాత్రిళ్లు వేటకు రానిచ్చారు. వాళ్లలో వాళ్లకు తగాదా పడి పంచాయితి జరుగుతుందని తెలిసి, అదెట్లా ఉంటుందో చూద్దామని పోతే కొందరు రానివ్వకపోయినా నమ్మకం కుదిరిన వాళ్లక్కడ కూచోనిచ్చారు. సంబరాలు చేసుకొనేటప్పుడైతే ఇష్టంగా రమ్మనేవారు. అట్లాంటప్పుడే కదా.. మనుషుల ప్రేమలు, దు:ఖాలు, కోపతాపాలు, ఆరాటాలు, అనుబంధాలు, భయాలు, నమ్మకాలు, క్రోధాలు, ధిక్కారాలు బైటపడేది. మనుషులు వ్యక్తమయ్యేది అప్పుడే. జీవితమంటే అదే.  వాళ్ల భాషలో వాళ్లు మాట్లాడుకొనేవారు. కొన్ని తెలుగు పదాలు ఉండేవి. నవలలో నీవన్న సహజత్వం ఏదైనా ఉన్నదంటే అది అట్లా వచ్చిందే.

సంభాషణలు మాత్రమే కాక కథనం కూడా మాండలికంలోని రాశావు. ఎందుకు అట్లా రాద్దామని అనిపించింది? ఎలా సాధ్యమైంది?

*శికారీలు ఇతరులతో తెలుగులోనే మాట్లాడతారు. అదీ అద్భుతమైన కర్నూలు పట్టణ మాండలికం. రోజుల తరబడి వాళ్ల నోటెంట ఆ సొంపైన భాష వింటూ ఉండటంతో పట్టేసింది. ఎంతగానంటే శికారీల గురించిన నా ఆలోచనలు కూడా మాండలికంలోనే సాగేవంటే నీవు నమ్మకపోవచ్చు.  మామూలుగా మనుషులవెరైనా  వాళ్ల మాతృ భాషలో ఆలోచిస్తారు. అందులో కూడా మనలాంటి వాళ్లం మన నేపథ్యాల నుంచి సంక్రమించిన భాషా రూపంలో ఆలోచిస్తాం. కానీ శికారీల సాంగత్యం వల్ల ఈ నవలా రచనలోకి దిగాక కథనం కూడా మాండలికాన్నే ఎంచుకున్నది. మామూలుగా అయితే నాకు అది కష్టం కావాలి. కానీ అదే  తేలికైంది.  అంతకు ముందు  ‘నిప్పులవాగు’ నవలలో సంభాషణలు మాత్రమే మాండలికంలో రాశాను. శికారి రాసే నాటికి ఈ తేడా వచ్చింది. ఒక రకంగా కల్పనా రచయితగా  నా పరిణామంలో శికారీల పాత్ర ఉందా? అనిపిస్తోంది.  అరుణతారలో సీరియల్‌ మొదలు పెట్టాక కూడా ప్రతి ఎపిసోడ్‌ రాయడానికి ముందు, మధ్యలో కూడా తప్పక శికారీల దగ్గరికి వెళ్లేవాడిని. ఎట్లా రాయాలో తోచక పని కుంటుపడ్డప్పుడు శికారీ పేటలో ఆ రోజు జరిగిన   ఘటనో,  ఎవరో ఒకరు అనే ఒక మాటో నా చిక్కు ముడి విప్పేవి. అవన్నీ శికారీల అంతరంగాన్ని ప్రకటించే వాళ్ల స్వీయ అస్తిత్వ వ్యక్తీకరణలు. వాటిని కాల్పనికంగా చెప్పే ప్రయత్నం చేశాను.

నిప్పులవాగు, గుమ్మెటమోత నవలల మధ్యలో శికారి రాశావు కదా? దీనిదే అయిన ప్రత్యేకత ఏమన్నా ఉందా?

*‘నిప్పులవాగు’ మాల మాదిగ జీవితాలను విప్లవోద్యమం, రాయలసీమ ఫాక్ష్యనిజం వైపు నుంచి రాశాను. గ్రామం కేంద్రంగా ఆ నవల సాగింది. అక్కడా పూర్తి నిజ పాత్రలే నవలలోకి వచ్చాయి. కుల అంతరాలకు, ఫ్యాక్షన్‌ ఆధిపత్యాలకు, ఫ్యూడల్‌ దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మౌలిక  మార్పుకు ప్రయత్నిస్తున్న విప్లవాచరణలో మనుషులు కూడా ఎట్లా మారుతారనేది అందులోని ఇతివృత్తం.

‘గుమ్మెల మోత’లో బుడగ జంగాలనే మహాద్భుతమైన సంచార  కళాకారుల జీవితం  ఇతివృత్తం.  మాదిగ ఉప కులంగా గుర్తింపు ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే బుడగ జంగాల ఉద్యమంలో వాళ్లతోపాటు తలమునకయ్యే క్రమంలో ఆ నవల రాశాను.  తమకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం పోరాడే క్రమంలో బుడగ జంగాల కులం నుంచి గత రెండు తరాలుగా  ఒక చిన్న పాయ ఆధునికతలోకి ప్రయాణిస్తున్నది. ఆధునిక పూర్వ సంచార, భిక్షాటన, కళా ప్రదర్శనల స్థాయి నుంచి విద్యా ఉద్యోగాల్లోకి రావాలనే ఆకాంక్ష,   సంఘర్షణ అందులో ఉన్నది. శికారీలు అట్లా కూడా కాదు. ఈ పదేళ్లలో కొంత మార్పు వచ్చి ఉండవచ్చుగాని వాళ్లింకా పూర్వ స్థితిలోనే ఉన్నారు. (ఆదివాసీ మూలాలు ఉన్న శికారీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీలు.) నవలా ఇతివృత్తాల్లోని ఈ తేడా వాటి శిల్పంలో, భాషలో కూడా కనిపిస్తాయి కావచ్చు.

 నీవు కవిత్వంతో మొదలయ్యావు కదా. ఆ తర్వాత  కథ, వ్యాసం ప్రధానమయ్యాయి. మధ్యలో నవల. ప్రక్రియలపరంగా నవలా రచన అనుభవం ఏమిటి?

*         చాలా మందిలాగా నాకు కూడా  కవిత్వమే ప్రారంభం. ఇప్పుడు అది నాలో పలకడం లేదు. ముగిసిపోయింది.

నేను ఒప్పుకోను పాణి. శికారి నవలలో చాలా వాక్యాలు కవితాత్మకంగా వున్నాయి. మరీ ముఖ్యంగా చివరి సన్నివేశం. అవునా! కాదా?

* కావచ్చు. నేనన్నది ఒక ప్రక్రియగా మాత్రమే.

నా దృష్టిలో  కథ, నవలలాగే వ్యాసం కూడా సాహిత్యమే. అది కాల్పనికేతర సాహిత్యం. మామూలుగా వ్యాసకర్తలను చాలా మంది ‘రచయిత’గా గుర్తించరు. కంప్లీట్‌ వ్యాసం రాస్తున్నప్పుడు భాషతో సహా ఇది ఒక నవలకు మూల వస్తువు కదా అనిపిస్తుంది.

మనం ప్రశ్న నుంచి పక్కకు తొలిగినట్లున్నాం?

*లేదు కానీ.. నవలా రచనలో మూల వస్తువు నుంచి (సామాజిక ఇతివృత్తం నుంచి)  సాహిత్య ఇతివృత్తాన్ని ఎంచుకోగలగడం మొట్ట మొదటి విషయం.  అలాంటి సాహిత్య ఇతివృత్తాన్ని ఈ మూడు నవలల సందర్భంలో గుర్తించడం, దాన్ని వెలికి తీయడం అద్భుతమైన అనుభవం. ‘వాస్తవానికి’, ‘కల్పనకు’ మధ్య సంచారం అది. ఆ రెంటి మధ్య నిజ మానవులను పాత్రలుగా మలిచి, వాళ్ల సంబంధాల మీద, ఈ వాస్తవ ప్రపంచం మధ్యనే, అలాంటి మరో కొత్త ప్రపంచాన్ని నిర్మించడమే నవలా రచన. అది మళ్లీ ఈ వాస్తవ ప్రపంచంలోని గతిని, ప్రగతిని చూపించగలగాలి. ఇంకోలా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ప్రసంగాలు చేసి, వ్యాసాలు రాసి,  విశ్లేషణలు చేసి కూడా చేరుకోలేకపోయిన, వెలికి తీయలేకపోయిన, చెప్పవలసింది ఇంకా మిగిలిపోయిన జీవిత సారాన్ని కాల్పనికంగా పునర్నిర్మించడమే నవల. ఇది కథకు కూడా వర్తిస్తుంది. నవల రాయడం వల్ల కలిగే ఎరుక ఉంది కదా.. అది మనల్ని తీర్చిదిద్దుతుంది. జీవితం పట్ల, మనుషుల పట్ల వినయం నేర్పిస్తుంది. శికారి నవల రాయడం అట్లాంటి వ్యక్తిగా, కార్యకర్తగా నా అనుభవ పరిధిని పెంచింది.

సామాజిక, సాహిత్య విమర్శకుడిగా ‘శికారి’ స్థానాన్ని నీవు ఎట్లా చూస్తావు?

వందల వేల ఏళ్ల మన సాహిత్యమంతా అల్ప సంఖ్యాకులదే. రాజులు, సంపన్నులు, అగ్రకులస్థులు, మొగవాళ్లు, నాగరికులమని చాటుకొనేవాళ్లు, మెజారిటీ అయిన హిందువులు మాత్రమే మన సాహిత్యంలో ప్రధానంగా కనిపిస్తారు. గత యాభై అరవై  ఏళ్ల కిందే ఇక ఈ కథలు చెల్లవని తేలిపోయింది. శికారీలు కూడా అల్పసంఖ్యాకులే కావచ్చు. అత్యల్ప సంఖ్యాకులైన బ్రాహ్మణులే వేల ఏళ్ల సాహిత్య కథలకు నాయకులయ్యారు. వాళ్లకు పోటీగా ఇప్పుడు ఈ నవలలో శికారీలు కథా నాయకులయ్యారు. మన తెలుగు రచయితలు అట్లాంటి ఎందరినో సాహిత్యంలోకి తెస్తున్నారు. పీడిత సమూహాల నుంచి, పేదల నుంచి, కార్మిక వర్గం నుంచి వచ్చిన రచయితలు ఆ జీవితానుభవాలను గొప్పగా రాస్తున్నారు. ఆ వరుసలో శికారి కూడా ఉంటుంది.

*

శ్రీనివాస మూర్తి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మూర్తీ, విప్లవ (ఆర్గానిక్ మార్క్సిస్ట్) రచయితకు భిన్నమైన ప్రజా సమూహాలెప్పుడూ ఇతరమైనవి కావు. ఆ రచయితను ఆయా సమూహాలు ఇతర వ్యక్తిగా చూడవచ్చు. ఒక నిర్దిష్ట అస్తిత్వవాద పరిమితులకు బయట విభిన్న అస్తిత్వాల పరస్పత లోనే, బహుముఖ సంక్లిష్ట సంబంధాలలోనే సామాజిక ప్రజాజీవిత సారం ఇమిడిఉంటుందని అటువంటి రచయితలు భావిస్తారు. నిరాకరించబడి సమాజపు అంచుల్లోకి నెట్టివేయబడిన సమూహాలను వారి రక్త మాంసాలతో సజీవంగా చిత్రించడమే ఈ నవలలో ఉండిఉంటుంది. ఏదేమైనా మిత్ర రచయిత పాణికి, మీకు అభినందనలు. నవల AT లో సీరియల్ గా వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక్కచోట నవలను చదవాలనే కుతూహలంతో–మెట్టు రవీందర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు