“ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ నరకం నీకు!”

సాహిత్యం లాగే సినెమా కూడా మనిషిలో సంవేదనలను సంస్కరిస్తూ వుంటాయి. బహిర్ ప్రపంచంలోని అతని ఎదుగుదల చాలా కారణాలుగా జరిగినా, మనిషి అంతర్గతంగా ఎదుగుదలకు ఉపయోగపడేది ఇలాంటి కళలే. ఎందుకంటే అవి మనిషిని తనలోపలికి దృష్టి సారించడానికి వివశుడిని చేస్తాయి. ఆలోచించలేకుండా వుండనివ్వవు. తనకు తెలియకుండానే నెమ్మదిగా లోపలినుంచి వొక మార్పుకు కారణాలు అవుతాయి. అది అతని ప్రవర్తనలో, మనుషులతో సంపర్కంలో, సమాజంలోని అతని నడవడికలో ఇంకా చాలా విషయాలలో ప్రభావం చూపిస్తుంది.

2005 లో మై బ్రదర్ నిఖిల్ సినెమాకెళ్ళాం. నాకు బాగా తెలిసిన నటులు అప్పటికి ఇద్దరే. జుహీ చావ్లా, విక్టర్ బనర్జీ. జుహీ చావ్లా హిందీ వ్యాపార సినెమాలో బాగా పేరున్న నటి. విక్టర్ బెనర్జీని సత్యజిత్ రాయ్ “శత్రంజ్ కే ఖిలాడి”, డేవిడ్ లీన్ తీసిన “అ పాసేజ్ టు ఇండియా” ఇంకా కొన్ని సినెమాలు చూసి వున్నాను. అయితే హాల్లో చూస్తేనేమో మమ్మల్ని కలుపుకుని మహా అయితే పది జంటలున్నాయి. ఇది కూడా వొక వివక్ష ఎలా పోషింపబడుతుందో, అర్థం చేయిస్తుంది. ఇది ఓనిర్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం. గోవాలో ఈతలపోటీలలో రాష్ట్ర విజేత అయిన డొమినిక్ దెసూజా జీవితం ఆధారంగా తీసిన చిత్రం. అతను గోవాలోనే ఎచ్ ఐ వె సోకిన తొలి వ్యక్తి. తొలి నాళ్ళలో, నాళ్ళు కాదు యేళ్ళు అనాలేమో, ఎచ్ ఐ వి బాధితుల పట్ల కుటుంబం, సమాజం, ప్రభుత్వం ఎంత నిర్దయగా, క్రూరంగా ప్రవర్తించిందో చెబుతుంది. ఈ చిత్రం అదనంగా స్వలింగ సంపర్కాన్ని ఎంచుకున్న వ్యక్తుల పట్ల కుటుంబం, సమాజం, ప్రభుత్వ వైఖరిని కూడా చెబుతుంది.

మనది పురుష స్వామ్యం. ఇందులో స్త్రీలను సమాన స్థాయి గౌరవమర్యాదలు, గుర్తింపు లేకపోగా వారి ఎదుగుదలలో చాలా ఆటంకాలు వున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా మారుతున్నప్పటికీ ఇంకా మారాల్సింది చాలానే వుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మూడవ జెండర్ వ్యక్తులు, స్వలింగ సంపర్కాన్ని ఎంచుకునే స్త్రీలు, పురుషులు, ఇంకా రకరకాల భిన్న వ్యక్తిత్వాలున్న మనుషులను గౌరవించే ప్రసక్తి ఎక్కడ! ఆర్టికల్ 377 కింద ఇది నేర పరిగణనుంచి బయటపడింది కూడా మొన్నమొన్ననే. మనిషి స్వభావాల్లో ఎన్ని వర్ణాలున్నాయో అన్ని విభిన్న కోణాలున్నాయి. అందరినీ వొకే గాటన కట్టడానికి లేదు. వొకరు అభిలషణీయులు, మరొకరు కాదు అనడం కూడా అమానవీయమే. మరి అలాంటి వ్యక్తులకి దూరం జరగడం, అవమానకరంగా వ్యవహరించడం, నేరారోపణ చేసి పోలీసు జులుం కి గురి చెయ్యడం లాంటివి పోయి మనిషి వాళ్ళను కూడా సమాజంలో హక్కుదారులుగా, గుర్తించేలా ఎదగడానికి మనం చేసిన ప్రయత్నాలేంటి? మన కళలు చేసింది ఎంతవరకు? తెలుగు సాహిత్యంలో చూస్తే లెస్బియన్ల మీద కొంత సాహిత్యం వచ్చింది, అదీ ఎక్కువగా స్త్రీల నుంచే. నేను ఐతే గేల మీద ఏమీ చదవలేదు. మొన్న వసుధేంద్ర కథలు “మోహనస్వామి” వచ్చింది. కాని దాని మూలం కన్నడ. కన్నడలో ఆ పుస్తకం బాగా అమ్ముడుబోయిందట. బహుశా అక్కడి సాహిత్య వాతావరణం మన దగ్గరికంటే మెరుగ్గా వుందనుకోవాలి. ఇక సినెమా విషయానికి వస్తే గుండు సున్నా. అడపా దడపా వచ్చినా అవి కేవలం వెకిలి హాస్యం, లేదా అపహాస్యం అనాలేమో, తదితర రూపాల్లో వచ్చాయి తప్పితే గంభీర స్వరంతో రాలేదు. ఇప్పుడు హాళ్ళలో ఆడుతున్న నానీస్ గేంగ్ లీడర్ తో సహా.

మై బ్రదర్ నిఖిల్ కథ జుహీ చావ్లా చెబుతుంది. ఆమె అనుసంధానకర్త కూడా. కథను ఇతర పాత్రలు కూడా చెబుతారు. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని పలు కోణాలనుంచి మన ముందు పెట్టడం అన్నమాట. కొంతమంది ఈతలు కొడుతున్న ఆ పూల్ వద్దకి వెళ్ళబోతున్న నిఖిల్ ని అడ్డుకుంటాడు చౌకీదారు. అయినా బలవంతంగా వెళ్ళి పూల్ లోకి దూకుతాడు. చౌకీదారు హెచ్చరిక విని, నిఖిల్ దూకడం చూసి మిగతా వారంతా గబగబా బయటకు వచ్చేస్తారు. అతనికి ఏమీ అర్థం కాదు. గోవాలో అతను వో స్విమ్మింగ్ చాంపియన్. రాష్త్ర స్థాయి పోటీలలో మెడల్స్ గెలుచుకున్న మనిషి. అయితే వో టూర్నమెంట్ కి ముందు జరిగే రెగ్యులర్ పరీక్షలలో అతనికి ఎచ్ ఐ వి వుందని బయటపడుతుంది. అక్కడినుంచి అతని జీవితమే మారిపోతుంది. అతడు వో అంటరానివాడైపోతాడు. అతన్ని టూర్నమెంట్ లోంచి తొలగిస్తారు. వూళ్ళో వాళ్ళే కాదు తల్లిదండ్రులు కూడా అతన్ని దూరం పెడతారు. వొక్క అక్క అనామిక మాత్రం అతనికి బాసటగా నిలుస్తుంది. ఎయిడ్స్ వ్యాధి కొత్తగా వున్న ఆ కాలంలో మరెవరికీ సోకకూడదని అతన్ని వో పాడుబడిన బంగళాలో వొంటరి నిర్బంధంలో వుంచుతారు. చట్టం ప్రతి పౌరునికీ స్వేచ్చగా బతికే హక్కునిచ్చినప్పుడు అతన్ని, అతనిలాంటివారిని ఇలా వెలివేసినట్లు నిర్బంధంలో వుంచడం అమానవీయమే కాదు చట్టవిరుధ్ధం కూడా. ప్రభుత్వానికి ఎన్ని లేఖలు వ్రాసినా దేనికీ స్పందన వుండదు. అనామిక వో లాయర్ని మాట్లాడి నిఖిల్ తరపున కోర్టులో కేస్ పెట్టిస్తుంది. మూడేళ్ళకు అతను విడుదల అవుతాడు, కాని అప్పటికే అతని ఆరోగ్యం పాడైపోయి వుంటుంది. తల్లి దండ్రులు ముఖం చాటేశారు. నిఖిల్ తన సహచరుడైన నిజెల్ తో వుంటాడు. నిఖిల్కి చివరిదాకా సేవలందించినది నిజెల్ అయితే, అతనికి మానసిక ధైర్యాన్నివడంలో, అతని తరపున చట్టంతో పోరాడడంలో, గోవాలోని సామాన్య జనులలో సరైన అవగాహన పెంపొందించడంలో అనామిక బలమైన పాత్ర పోషిస్తుంది. 1986 నుంచి 1994లో అతను చనిపోయేదాకా అతను పడ్డ నరకయాతనంతా మనముందుంచుతాడు ఓనిర్. చిత్రం మొత్తం గ్లూమీగా వున్నా చివర్న ఆశావహ ముగింపు. ఎచ్ ఐ వి వచ్చిన కొత్తలో ఇది స్వలింగ సంపర్కుల కారణంగా వచ్చిందనుకునేవారు, అది తప్పని నిరూపణ అయ్యే దాకా. ఏది ఏమైనా అటు ఎచ్ ఐ వి బాధితులనూ, ఇటు స్వలింగ సంపర్కులనూ సమాజం, కుటుంబంతో సహా, అస్పృశ్యులుగా చూసింది. చట్టం మొహం చాటేసింది. ఎన్నో పోరాటాల అనంతరం ఈ మధ్యే ఆర్టికల్ 377 లో తగిన మార్పులు చేసింది. కాని ఇంకా జరగాల్సింది చాలానే వుంది.

నాతో పాటు చాలా మంది ప్రేక్షకులకు ఈ చిత్రం వో కొత్త విషయాన్ని కొత్త వెలుతురులో చూపింది. అనవసర భయాలను చెరిపేసి, మరింత మానవీయంగా మార్చింది. అయితే వొక్క ఓనిర్ మాత్రమే ఒక్క చేత్తో ఈ విషయంలో చాలా చేశాడు. హిందీ చిత్రాలవరకు, తెలుగు చిత్రాలసలే లేవు, చూస్తే ఇతరులు చేసింది అంటూ వుంటే అది స్వల్పమే. ఈ చిత్రంలో నిఖిల్ నిజెల్ ల జంట వో ప్రేమపూర్వక జంటగా, వొకరి గురించి మరొకరు వెన్నుదన్నుగా వుండే జంటగా చూపడం జరిగింది. మనమీద సమాజం రుద్దిన భావజాలానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. మరి అది సమసిపోవాలంటే ఇలాంటి కథలు ఇంకా ఎన్ని రావాలో. దీని తర్వాత “I AM” లో పోలీసులు వీళ్ళ సంబంధాలను అడ్డం పెట్టుకుని, చట్టం చూపించి భయపెట్టి, బ్లాక్మేల్ చేసి డబ్బు గుంజి ఇంకా చెప్పలేని అమానుషత్వపు ప్రవర్తనతో వాళ్ళని లొంగదీసుకోవడం వగైరా చూపాడు. ఇంకా కొన్ని మంచి చిత్రాలు చెప్పాలంటే “మార్గరిటా విత్ అ స్ట్రా”, “ఫేషన్”, “అలీగఢ్”, “హనీమూన్ ట్రావేల్స్”, “ఎక్ లడకీ కో దేఖా తో ఐసా లగా”, “బాంబే టాకీస్” మొదలైనవి. ఐతే స్థాయీ భేదాలున్నాయి కథనాల్లో. అలీగఢ్ కూడా వొక నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది తీసిన చిత్రం. హనీమూన్ ట్రావెల్స్ లో మరో కోణం. వో గే తన అస్తిత్వాన్ని దాచి అమ్మాయితో పెళ్ళి చేసుకుంటే వచ్చే పరిణామాలు. కొన్ని చాలా బాగా తీసినవి, కొన్ని పర్లేదు అనిపించేవి.

నేను రైళ్ళలో ముఖ్యంగా మూడవ జెండర్ వ్యక్తులను చూసి చిన్నప్పుడు భయపడేవాడిని. అప్పుడు అర్థం కాక, పెద్దయ్యాక వాళ్ళ గురించి ప్రచారంలో వున్న కథల కారణంగా భయం, అసహ్యం వుండేవి. వాళ్ళని కూడా మనుషులుగా అర్థం చేసుకోవడంలో, నన్ను నేను సంస్కరించుకోవడంలో, సాయపడ్డాయి చిత్రాలు. కల్పనా లాజ్మి తీసిన “దర్మియాఁ”, ఇంకా కొన్ని చిత్రాలు మనకు, కనీసం నాకు, తెలియని చీకటి కోణాలతో పరిచయం చేయించింది. ఇవి చూడకపోతే నేను ఇంకా ఇదివరకులానే వాళ్ళ పట్ల భయం, అసహ్యం లాంటి భావనలతోనే వుండేవాణ్ణి. తెలుగు చిత్రాలలో గుండు సున్నా. సాహిత్యం లో ఈ మధ్య కొన్ని పుస్తకాలు వచ్చాయి మూడవ జెండర్ వ్యక్తుల మీద.

మనం ఎంతో ఎదిగాము అనుకున్నా ఏవో కొన్ని మార్చుకోవాల్సినవి, సంస్కరించుకోవలసినవి లోన వుంటూనే వుంటాయి. మరి వాటిని మనకు కొత్త వెలుతురులో చూపి సరిగ్గా అర్థం చేయించడంలో, మనల్ని మరింత మానవీయ వ్యక్తులుగా మలచడంలో సాహిత్యం, సినెమాలు ప్రధాన పాత్రలు వహించాలి.

*

పరేశ్ దోశి

పరేశ్ దోశి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి పరిచయం. మీరు ప్రస్తావించిన సినిమాలను చూడాల్సిందే

 • You won’t believe paresh garu, recently i watched Gangleader with two friends and i was shocked with her comments. She was wondering if it is accepted in India and was uncomfortable about showing person as gay. And moreover she works here in a decent job so must be aware how actively Austarial govt workpace spends on awareness and acceptance LGBTIQ+ community.
  Sometimes its scary to see people educated but have zero general knowledge and kids are much more acceptance and empathy.

  • Thank you Sri ji. In fact Gangleader forced me to write this immediately. There gay is shown as a clown and matter of ridicule. Only the films that handle the issue sensitively can sensitize people.

 • Paresh
  your article is good and thought provoking. I love kalpan ajmi”s Darmiya . Recently Kalpana Rentala wrote a story about the living together of Gey . It was published in Andhra Jyothi Sunday , if my memory was not wrong. It is a good experience to read the story . I love your column . waiting for another piece

  • Thank you Vamsykrishna. Yes her story appeared in jyoti. I read it.. but i have forgotten the title, so did not mention that. Kapoor and sons was good too. Also dear dad.

 • పరేశ్ గారు! చాలా మంచి విషయంతో చాలా బాగా విశ్లేషించారు! ఈ విషయమై వచ్చిన సినీమా పేర్లనుతెలిపారు‌ .కన్నడంలో “నాను అవనల్ల అవళు” (నేను అతడుకాను ఆమెను) అనే సినీమా చాలా బాగా తీశారు. .

 • పరేష్ గారూ గంభీర స్వరం లో ఒకింత సంవేదన సహానుభూతి కలిపి రాశారు మీరు.
  అభినందనలు

 • చాలా మంచి విషయం తీసుకుని ,చాలా చక్కగా పరిచయంచేశారు. మీరు రాసిన సినీమాలు చూడాలి! సాహిత్యం, సినీమాలు జీవితాలపై ఎంత ప్రముఖ ప్రభావం చూపుతుంది!!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు