ఇక నువ్వు లేని లోటు ఎవరన్నా తీర్చేది?

కరోజు,
సాయంత్రం సూర్యుడింకా ఇంకకముందే
హఠాత్తుగా నిశ్శబ్దనదిలోకి జారిపోతావు
గుండెలమీద దీపం పెట్టుకుని

ఒక పెద్ద అల లాక్కున్నట్టు
మునిగిపోయే నిన్ను చూస్తూ
దుఃఖ ద్వీపాలమౌతాము మేమంతా

ఎదో ఒక రోజూ మేమూ అంతే
చిన్నవో పెద్దవో అలల తాకిడికి
కరిగిపోతాము నదిలో
మాకోసం ఏ ఒడ్డు
కన్నీరు పెడుతుందో తెలియదు

మే ఒకటో తారీకు – ‘ప్రపంచ శ్రామిక దినోత్సవం’ రోజు ఉదయాన్నే, వాట్సాప్ లో ‘ఓంకారన్న నో మోర్’ అని కిరణ్ మెసేజి చూడగానే ఒక్కసారే కాళ్ళ కింద నేల కదిలిపోయినట్టనిపించింది. ‘ఎట్లా’ ‘ఎందుకు’ ‘ఏమిటి’ గుండె ఘోషిస్తోంది. వెంటనే వివరాలు తెలుసుకోవాలని ఆత్రత. ఫోన్ చేస్తే ‘ఇప్పుడే తెలిసింది వార్త. కార్డియాక్ అరెస్టు ఆట మేము హాస్పిటల్ కు వెళ్తున్నాం’ అన్నాడు కిరణ్. అసలెందుకు అంత హటాత్తుగా గుండె ఆగిపోయింది ఓంకారన్న ది? మొన్ననే కదా విద్యా నేనూ మాట్లాడితే ‘రెండో సారి ఇంకొంచెం కాలు తీసెసిండ్రు, గట్టిగా వత్తిండ్రు పానమెళ్ళిపోయింది’ అంటూ గాద్గదికమైన ఓంకారన్న గొంతు నా చుట్టూ గింగుర్లు తిరుగుతోంది. ‘తగ్గుతదన్నాఏమీ కాదు మళ్ళీ ఒక వారం రోజుల్లో మామూలైపోతావు’ అని మేము అతనికిచ్చిన భరోసా పచ్చిఅబద్దమై వెక్కిరించింది. కండ్ల నిండా నీళ్ళు. కడుపులో మెలితిప్పుతున్న తీవ్రమైన బాధ. గొంతుకేదో అడ్డం పడినట్టు మాట వస్తలేదు. శూన్యం లోకి చూస్తూ, వేల మైళ్ళ కవతల, సముద్రాల కవతల, గాలిలో కలిసిపోయిన ఓంకారన్న ప్రాణం తో సంభాషించడానికి విఫల యత్నం చేసిన. మట్టిలో కలిసిపోవడానికి సిద్దమైన ఆయన పార్థివ దేహం చివరి చూపుకు నోచుకోలేని నా అశక్తత పిండేసింది.

ఇక తర్వాత మెల్లగా వివరాలు తెలవడం మొదలైంది. ఎంత బాధాకరం? హాస్పిటల్ లో ఉండగానే కార్డియాక్ అరెస్టు తో వెళ్లిపోయాడు రామారావు అన్న. రామలింగం కూడా హాస్పిటల్ లోనే, ఇక నయమౌతాడు అనుకుంటున్న సందర్భం లో వెళ్లిపోయాడు. ఓంకారన్నా కూడా అంతే.

ఓంకారన్న ఒంటరిగానే జీవించాడు, ఒంటరిగానే వెళ్లిపోయాడు, జీవితాంతం కుటుంబమూ, భార్యా, పిల్లలూ అంటూ ఏ బాదరబందీ లేకుండా బతికినట్టు అనిపించినా, ఎప్పుడూ వెంటాడే ఒంటరితనం తోనే బతికాడు. బహుశా ఉస్మానియా యునివర్సిటి లో చేరినంక, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొవడం మొదలు పెట్టినంక జగిత్యాలలో తన ఇంటికీ కుటుంబానికీ కూడా దూరంగానే ఉన్నడు. ఉద్యమం పట్ల నిబద్ధత తో నిమగ్నమై పనిచేసిండు. ఉద్యమ సహచరుల లోనే కుటుంబాన్ని వెదుక్కుండు. హైదారాబాద్ నే ఇల్లు చేసుకున్నడు. సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వాటితో మమేకమౌతున్న విద్యార్థి ఉద్యమాలకు అంకితమై పనిచేసిండు. తీవ్ర నిర్బంధం అమలైన రోజుల్లో యే మాత్రం వెనుకాడలేదు. వెనుకంజా వేయలేదు.

ఎన్నేండ్ల పరిచయం ఓంకారన్నది? జె ఎన్ టీ యు లో పీ డీ ఎస్ యూ లో ఆక్టివ్ గా పనిచేస్తున్నప్పుడు మా సగం కాలం ఉస్మానియా లోనే గడిచేది. ఉస్మానియా కాంపసు లో, హస్తల్స్ లో, ఉద్యమాల్లో తీవ్రంగా తలమునకలై ఉన్న రోజులవి. బహుశా అప్పుడే చూసి ఉంటా ఓంకారన్న ను. జగిత్యాల్ పేదరికం నుండి కాంపస్ కు వచ్చిన బక్క పలుచని యువకుడు, పీ డీ ఎస్ యు లో చాలా ఆక్టివ్ గా పనిచేస్తూన్న ఉద్యమకారుడు. ఓంకారన్న గొప్ప ఆర్టిస్ట్. అధ్బుతంగా బొమ్మలేసే వాడు. అతని చేతిరాతగుండ్రంగా చాలా అందంగా ఉండేది.క్యాంపస్ నిండా గోడల మీద అతని రాతలే ఓంకారన్న వేసే పిడికిలి హై లైట్. అంత గొప్పగా పిడికిలి చిత్రించే వాళ్ళను నేను ఇప్పటిదాకా చూడలేదు. పోస్టర్లు రాయాలన్నా ఓంకారన్నే నగరం నిండా గోడల మీద అతను రాసిన జేగురు రంగు నినాదాలు జ్వలించేవి.

అంత దూరం నుండి చాలా తేలిక్కాపోల్చుకునేటోళ్ళం ఆయన రాతను ఆయన పిడికిలిని. అట్లా క్యాంపస్ లో మొత్తం హైదరబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎన్నో గోడల మీద ఓంకారన్న సజీవంగా జ్వలించే వాడు నినాదమై బిగించిన పిడికిలై. ‘ఎవరీల్లో తెలియదు ఇంట్లో ఎవరున్నారో తెలియదు మేము రాస్తూ ఉంటాం విప్లవం వర్ధిల్లాలని’ ‘గోడలు మండుతునాయి నినాదాల గొంతులై నిలువెత్తు జేగురు రంగు రతల మంటలై గోడలు మండుతున్నాయి’ అనే కవితా వాక్యాలు వెంటాడేవి ఓంకారన్న రాసిన నినాదాలను దించిన పిడికిళ్ళను చూస్తే, 1989 లో పెళ్ళయి నేనూ విద్యా, యేడాది కాలం లో పద్మనాభనగర్, గాంధీనగర్ ఆంధ్ర కేఫ్ తర్వాత దోమల్ గూడా కు ఇల్లు మారాం. అక్కడే ఆయిదేండ్లు ఉన్నాము. అప్పుడే ఎన్ వీ కృష్ణయ్య సిరిసిల్ల ఎం ఎల్ యే గా గెలిచిండు. బషీర్ బాగ్ న్యూ ఎంఎల్యే క్వార్టర్స్ లో ఒక క్వార్టర్ వచ్చింది.

అందులోకి ఓంకారన్న పార్టీ హోల్ టైమర్ గా వచ్చేసిండు. నా ఉద్యోగం వాసవి కాలేజీలో. కాలేజీ నుండి నేను ఇంటి నుండి విద్యా క్వార్టర్స్ కు చేరే వాళ్ళం ప్రతిరోజూ. అప్పుడే ఓంకారన్న బాగా దగ్గరయ్యాడు. ఆయన యునివర్సిటి లో చదవని చదువు లేదు. పీ ఎచ్ డీ లతో సహా. ఐనా ఏమీ తెల్వనట్టు అమాయకంగా ఉన్నట్టుండే వాడు. తన పాండిత్యాన్ని విద్యాధికతనూ ఎప్పుడూ ఎక్కడా ప్రదర్శించలేదు. తనకు యే పని చెప్పినా చేసిండు. తనకు నచ్చకపోతే గునిగిండు, కోపం వస్తే నాలుగు తిట్టిండు. కానీ మనసులో ఎన్నడూ కపటం పెట్టుకోలేదు. ఓంకారన్న కు ఎన్నడూ ఒక అజెండా లేదు, ఒక వెస్టెడ్ ఇంటరెస్ట్ లేదు. ఒక ప్రలోభం లేదు. ఒక లాభాపేక్ష లేదు స్వార్థం లేదు. అంత నిష్కపటంగా బతికిన వాళ్ళు నాకు తెలిసీ చాలా అరుదు. ఎటువంటి మాలిన్యం లేకుండా అట్లా ఓంకారన్నలా బతకడం అంత తేలికా కాదు. అందరినీ తనవాళ్లే అనుకున్నాడు. అందరినీ దగ్గరకు తీసుకున్నాడు. ఎర్రటి ఎండలో తిరిగి తిరిగి మాడిపోయి ఆకలితో దూపతో వచ్చిన వాళ్ళను అరుసుకున్నడు చల్లని మంచినీళ్ళతో, బుక్కెడు బువ్వతో. క్వార్టర్స్ కు వచ్చే అనేక మహిళా కామ్రేడ్లను ఆప్యాయంగా పలకరించి అందరికీ అన్న అయిండు. ‘అన్నా ఏందన్న పెండ్లి చేసుకోవా’ అంటే ప్రసూతికి పోయింది వదిన’ అని ముసి ముసి నవ్వులతో మజాక్ చేసిండు.

అందరికీ ఏవో పేర్లు పెట్టిండు (నాతో సహా ). ఎవరి బలహీనతలనూ ఎవరి తప్పులనూ ఎత్తిపొడవకుండా ఉండలేదు. ఐతే ఎప్పుడూ హస్యంగానే, మజాక్ చేస్తూనే ఏవో పేర్లతో పిలుస్తూనే. మనసులో మాలిన్యం లేదు కపటం లేదు స్వార్థపూరిత కల్మషమూ లేదు. అచ్చమైన తెలంగాణ భాష నుడికారం ఓంకారన్న సొత్తు. తెలంగాణ జానపదుల సామెతలు, నుడికారాలు, పదాలు ఆయన నోటి నుండి అలవోకగా దొర్లెవి, అందుకే ఎంతో తియ్యగా ఉండేడిది ఆయన తిట్టినా కూడా. ఓంకారన్న తో తిట్టించుకోని వాళ్ళు లేరు ఆయన తిట్లు ఎంజాయ్ చెయ్యని వారూ లేరు. అకారణంగా ఎవరినీ ఒక మాటైనా అని ఎరగడు తను. ఆ రోజుల్లో, ఆయన వెంటే ఉన్న రోజుల్లో ఆయన నుడికారాన్ని, సామెతలనూ రికార్డు చేసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఆ తెలంగాణ భాష సౌందర్యాల్ని సొంతం చేసుకుని ఉంటే ఎంత బాగుదేదీ అనిపిస్తుంది చాలా సార్లు.

ఓంకారన్న ఒక మార్మికుడు. పైకి ఉత్త తిట్లుగా, విమర్శలుగా, ఫిర్యాదుల్లా కనబడే ఆయన మాటల్లో ఒక నర్మగర్భత ఉండేది.ఒక పల్లెటూరి నుండి పట్నానికొచ్చి, కాటకల్సి పోయిన ఒక రైతు ఆవేదన, బాధ , ఆందోళన ఉండేది. అయ్యో ఏమైపోతోంది ఈ ఉద్యమం అనే తపన ఉండేది. విప్లవకారుల బలహీనతలను, వాళ్లెంత వాళ్ళైనా సరే ఎత్తిపొడవడానికి, చురుకు పెట్టడానికి యే మాత్రం వెనుకాడని, తెలంగాణ పోరాటప్రాంతపు రైతు నిఖార్సైన ధైర్యం ఓంకారన్నది. ఆ నిజాయితీ ఆయనలో చివరిదాకా ఉన్నది, బహుశా ఆ నిజాయితే, ఆ నిర్మొహమాటత్వమే, ఆ ముక్కుసూటితనమే ఆయనకు జీవితాంతం ఒంటరి తనాన్ని మిగిల్చింది. ఆ రోజుల్లోనే క్వార్టర్స్ కి గుంపులు గుంపులుగా వచ్చే కామ్రేడ్స్ తో తాను యే గుంపులో కలవకుండా సమూహం లో ఒంటరిగానే మెసిలేవాడు. రైతు ఆగ్రహంతో పాటు తాత్విక్త కూడా ఉండేది ఓంకారన్నలో. ఒక సంశయాత్మక ఆశావాద (skeptical optimistic) తాత్వికత ఓంకారన్నది. అన్నింటిని సంశయాత్మకంగా, సందేహంగా చూడడం, ప్రశ్నించడం (తిట్టడం) ఐతే మంచి జరుగుతుంది చివరికి అని అదే మనుషుల్ని నమ్మడం ఆయన ప్రత్యేకత .

అందుకే ఒక అంతుచిక్కని విరోధాభాస ఓంకారన్న.

ఓంకారన్నా, నేనూ, ఇంకా చాలా మందిమి నమ్ముకున్న ఒకప్పటి స్వప్న సామ్రాజ్యం ఇప్పుడు లేదు. పోరాట జండాలు సమున్నతంగా ఎగరడం లేదు. గోడల మీద జేగురు రంగు నినాదాల, పిడికిల్ల స్థానే ఇప్పుడు బిల్ బొర్డ్స్ వచ్చాయి. రంగు రంగుల ఫ్లెక్సీలు వెలిశాయి. శిథిలమైన సామ్రాజ్యాలకు సాక్ష్యంగా చిరిగిపోయిన జండాలు తలలు దించుకుని మరిన్ని పీలికలోతున్నాయి, ఓంకారన్న ఒంటరితనం విశ్వవ్యాప్తమౌతున్నది. ఓంకారన్న దుఃఖమై గాలిలో కలిసిపోయి పరీవ్యాప్తమోతున్నాడు.

ఇప్పుడు ఓంకారన్న లేడు. ఆయన గునుగుడు లేదు. ఆయన కపటం లేని తిట్లు లేవు, ఆయన తియ్యని తెలంగాణ భాష లేదు, ఆ నుడికారాలు ఆ సామెతలు లేవు. ఆ ముసి ముసి నవ్వులు లేవు, ఆ ఒంటరి తనం లేదు. పలు సమూహాల మధ్య పలు ప్రవాహాల మధ్య ఒక ద్వీపం లా , కోపోమొచ్చిన నిర్లిప్తతతో నాలుగు తిట్టి మళ్ళీ బుక్కెడు బువ్వ పెట్టె జగిత్యాల రైతు ఆత్మీయత ఇక కనబడదు. చివరి రోజుల్లో చాలా అవస్థ పడ్డాడు అన్న. ఎక్కువగా పలకరించలేక పోయామే అన్న బాధ విద్యనూ నన్నూ జీవితాంతం వెంటాడుతుంది కనుపాపలపై ఒంటరితనపు నీటిపొరై. అన్నా ఇంత తొందరగా ఏమి ఆగం పడిపోయిందని వెళ్లిపోయావన్నా పేగుల్నీ మెలితిప్పే ఇంత బాధను దుఃఖాన్ని మిగిలించి? నువ్వుంటే, ఎక్కడో ఉన్నావులే, మాతో సహా అందరి పొరపాట్లను , లౌల్యాలను, చిల్లర వేషాలను, కపటత్వాన్ని, కల్మషాల్ని కడిగేయ్యడానికి, దుమ్ము దులపడానికి, నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా తూర్పారపట్టడానికి నువ్వున్నావులే అనుకోని సంతృప్తి పడెటోల్లము…

ఇక నువ్వు లేని లోటు ఎవరన్నా తీర్చేది?

*

నారాయణ స్వామి వెంకట యోగి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత గొప్ప వ్యక్తిత్వం!
    తన జీవితం కన్నా సమాజం గొప్పదని నడిచినవాడు. ఓంకార్ గారి గురించి మీరు రాసిన వ్యాసం ఆయన మూర్తమత్వాన్ని పట్టించింది. ఆయన లోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ పుస్తకం వేస్తే ఎందరికో స్ఫూర్తి అవుతాడు. ఆయన మిత్రులు ఆ పని చేస్తే బాగుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు