ఇంతకీ సీత ఎవరు?!

రాజుకి విజయమే ముఖ్యం, సాధారణభావోద్వేగాలు కాదు. ఈ సత్యాన్ని రావణుడు గుర్తించలేకపోవడం వల్లే రాజ్యంతో సహా తుడిచిపెట్టుకుపోయాడు.

సీత ఎవరు?

బీబీ ఫాతిమా మరో అవతారమే సీత.

సీత ఫాతిమా ఇద్దరూ వేదననే అనుభవించారు. వారిద్దరూ తల్లి భూదేవి పుత్రికలే. వారు జన్మించేది లయించేది భూదేవి గర్భం లోనే. వేదన ఇద్దరినీ ఏకం చేసింది. దుఃఖంలో మళ్ళీ మళ్ళీ మరణిస్తూ పున:పున: జన్మిస్తారు.

సీతయే ఫాతిమా ఫాతిమాయే సీత.

-“ఫాతిమా అండ్ సీత” ఇంగ్లీషు వ్యాసంలో  అఫ్సర్

 

ఫాతిమా మహమ్మద్ ప్రవక్త ప్రియపుత్రిక. అలీ భార్య. సీతలాగే పవిత్ర స్త్రీత్వానికి ప్రతినిధిగా భావించబడుతుంది. సీతలాగే ఆమెకి హుస్సేన్, హసన్ (ఉస్సన్న, అస్సన్న) ఇద్దరు కొడుకులు.

ముహర్రం పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్నిగ్రామాల్లో స్త్రీలు పాడేపాటల్లో సీత, ఫాతిమా పర్యాయ పదాలుగా మారిపోతారు. వారి కథ, వారి వేదన వొకటిగా కలిసిపోతాయి. కథల సరిహద్దులేకాదు, మతాల సంస్కృతుల సరిహద్దులు చెరిగిపోతాయి. ఫాతిమా తీవ్రతప:ఫలితంగా శివుడు ప్రత్యక్షమై వరం ఇవ్వడం వల్లనే పుత్రులు జన్మించారని కూడా చెప్తారు. శివుడు, హనుమంతుడు, రాముడు, ముస్లిం ఫకీరు, సీత-ఫాతిమా, లవకుశులు-హుస్సేన్,హసన్… ఈ పాత్రలన్నీ తమ సరిహద్దుల్ని దాటేసి స్వప్నంలోలాగా వొకటి మరొకటిగా పరివర్తిస్తాయి. ఈ గ్రామీణకథల్లో సీత, ఫాతిమాలు తల్లిగా, తల్లి భూదేవి ప్రకృతిగా కనబడతారు. ఈకథల్లో పురుష ప్రమేయం కనబడదు. స్త్రీల వేదనే ప్రతిబింబిస్తుంది. ఇవి కట్టుకథలని, స్త్రీల ఆవేశం నుంచి, రాగద్వేషాలనుంచి పుట్టిన కథలని గ్రామీణులైన పురుషులు తప్పుపడ్తారు.

ఇలా కథలు కలగలిసి పోవడం, రూపాంతరం చెందడం కొత్త విషయమేమీ కాదు. అందులోనూ భారతీయ కథనాల్లో అసలు కాదు. ఇలా రూపాంతరం చెందే, కలగలిసిపోయే లక్షణమే భారతీయ బహుళసంస్కృతిని స్నేహపూర్వకమైనదిగా నిలిపింది.

ఆయాగ్రామాల్లో స్త్రీలు చెప్పే ఇటువంటి కథల్ని సొంత రామాయణంగా గ్రామీణ పురుషులు అపహాస్యం చేశారని అఫ్సర్  అన్నారు కానీ, నిజానికి అన్నీ సొంత రామాయణాలే. అందుకే రాముడికి సీత ఏమవుతుంది అనే దగ్గరనుంచి అసలు రాముడెవరు, సీత ఎవరు అనే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ యుగాలుగా ఎదురవుతూనే ఉన్నాయి. వాటినుంచి క్రొంగొత్త రామాయణాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

గ్రామీణ స్త్రీలు సీత ఎవరు అని ప్రశ్నించి, సీతయే ఫాతిమా ఫాతిమాయే సీత అని సమాధానం ఇచ్చారు. దీనికి భిన్నంగా అసలు రాముడు ఎవరు అని తులసీదాస్ రామచరిత మానస్ లో పార్వతీదేవి శివుడినే ప్రశ్నిస్తుంది. సీత ఎవరు అనే గ్రామీణ స్త్రీల ప్రశ్న హిందూ-ముస్లిం సంస్కృతుల సరిహద్దుల్ని చెరిపివేయడం మనం చూశాం. రాముడు ఎవరు అన్న తులసీదాస్ ప్రశ్న శైవ-వైష్ణవాల మధ్య దూరాన్ని తుడిపేసింది.

రాముడు ఎవరు అని భర్త శివుడిని ప్రశ్నించిన దేవి సమాధానం అన్వేషిస్తూ రాముడి దగ్గరకు సీత రూపంలో వెళ్ళింది. రావణుడు సీతని అపహరించడంతో రాముడు వేదన చెందుతున్న సమయం అది. రాముడు దేవిని గుర్తిస్తాడు. ఆయన సాక్షాత్తూ విష్ణు భగవానుడే కదా!

పరపురుషుని దగ్గరకు అతని భార్య రూపంలోనే వెళ్ళిన పార్వతిని శివుడు త్యజిస్తాడు. దక్షయజ్ఞంలో అగ్నిప్రవేశం చేసి పునర్జన్మించిన పార్వతిగా మళ్ళీ ఆమెను స్వీకరిస్తాడు. దక్షయజ్ఞ విధ్వంసం రామరావణ యుద్ధాన్ని గుర్తుకు తెస్తుంది. యిక్కడ పార్వతి సీతల కథలు కలగలిసి పోయాయి. రామాయణం శివపురాణం కలగలిసిపోయాయి. శైవ వైష్ణవ విభేదాలకి ఔషధంగా తిక్కన బోధించిన హరిహర అద్వైతానికి ప్రతీకగా ఈ విభిన్న పురాణ కథల రూపాంతరీకరణ ఉపయోగించింది. ఆంధ్రస్త్రీల సీత-ఫాతిమా రూపాంతరీకరణ మరో ముందడుగు. అబ్రహామిక్ మతానికీ సనాతన ధర్మానికీ నిత్యకళ్యాణం ఆచరించే కథలవి.

#####

 

నిజానికి మొత్తం సాహిత్యం మార్గ-దేశీ పద్ధతులుగా విభజించబడింది. లవకుశులు రామాయణాన్ని మార్గపద్ధతిలో గానం చేశారని వాల్మీకి బాలకాండలో రాశాడు. బహుళంగా ప్రచారంలో ఉండి మనదృష్టికి వచ్చే కథలు దేశీ పద్ధతికి చెందినవి. మార్గపద్ధతి అంటే సంస్కృత శిష్టమార్గం. అది రాజ్యానికి, రాజాస్థానానికీ సంబంధించినది. దేశీ పద్ధతి సాధారణ ప్రజలకీ స్త్రీలకీ సంబంధించినది. ఈ విభజన ఒకేకథ విభిన్నరూపాల్లో విభిన్నదృష్టికోణాలతో వ్యక్తం కావొచ్చునన్న సత్యాన్ని తెలియజేస్తోంది. వేలాది సొంత రామాయణాలు ఉండే అవకాశాన్ని వ్యక్తం చేస్తోంది.

అసలు వాల్మీకి హృదయం నుంచి ఆశువుగా తక్షణ ప్రతిస్పందనగా వచ్చిన మొదటి శ్లోకానికి కూడా వొకే అర్ధం లేదు, వొకే వ్యాఖ్యానం లేదు. శోక: శ్లోకత్వమాగత: అని కీర్తించబడిన ఆ మొదటి ‘మానిషాద’ శ్లోకానికే పరస్పర విరుద్ధ అర్ధాలు ఉన్నాయి. ఒక అర్ధం కిరాతనింద, మరొక అర్ధం రామ (విష్ణు) స్తుతి. ఒక అర్ధం కిరాతుడు ఒక పక్షిని చంపి జంటను చెదరకొట్టినందుకు నింద, మరొక అర్ధం క్రౌంచ (రాక్షస) మిధునంలో ఒకరిని (రావణున్ని) చంపినందుకు స్తుతి.

నిజానికి రామాయణమంతా రాక్షసుల్నీ, అడవిలో నివసించే జనాన్నీ చంపినందుకు రాముడనే రాజు ఎదుర్కొన్న ప్రశ్నయే. ఇంకా చెప్పాలంటే రాజ్యం పరిధి యేది, రాజు పరిధి యేది అనే ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషణే రామాయణం. నిజానికి ఈ ప్రశ్న వేసింది మరెవరో కాదు. రాముని భార్య సీతే ఈ ప్రశ్నను ఎక్కుపెట్టింది. రాముని ధనస్సుకి, రాచరికానికి ఎదురుగా ఈ ప్రశ్నని నిలిపింది సీత. స్వయంవరంలో సీత రాముణ్ణి వరించింది అతను ధనస్సుని ఎక్కుపెట్టినందుకు కాదు, ధనుర్భంగం చేసినందుకు అంటారు పిన్నమనేని మృత్యుంజయరావు.

రామాయణానికి వాల్మీకి మూడుపేర్లు పెట్టాడు. ఒకటి రామాయణం, రెండు సీతాచరితం మూడు పౌలస్త్యవధ (బాలకాండ). అంటే రామాయణం ఒక్కరి కథ కాదు. ముగ్గురి కథ. మూడు దృష్టికోణాల సంఘర్షణ. నేనిప్పుడు వరుసగా మూడు దృష్టికోణాలనుంచి రామాయణాన్ని వ్యాఖ్యానిస్తాను.

రాముడు మూర్తీభవించిన ధర్మంగా ప్రసిద్ధి చెందాడు. నిజానికి ‘రామో విగ్రహవాన్ ధర్మ:’ అని నిర్ధారించింది ఒక రాక్షసుడు; రాముని పరమశత్రువు సీతాపహరణానికి దారి యేర్పరచిన మారీచుడు.

రాముడు ‘రాజ్యం వీరభోజ్యం’ అనే మాటని పక్కకు నెట్టాడు. శ్రీకృష్ణుడన్నది ఏమిటి? యుద్ధం అనేది క్షత్రియధర్మమని, యుద్ధంలో అన్నదమ్ములు, బంధువులు అనే విచక్షణ అవసరం లేదని. రాముడు వర్ణధర్మాన్ని ఖాతరు చెయ్యలేదు. వర్ణధర్మం కంటే ముఖ్యమైన యితర ధర్మాలున్నాయన్నాడు. కుటుంబంతో అనుబంధం ప్రధానమైన ధర్మమని చాటాడు. అందుకు క్షత్రియ (వర్ణ) ధర్మాన్ని బలిపెట్టడంలో తప్పులేదన్నాడు. తనకు దక్కవలసిన రాజ్యాన్ని వదలి అడవులకు వెళ్ళిపోయాడు. పాండవులు కూడా అడవులకు వెళ్ళారు కానీ ధర్మం కోసం కాదు, జూదంలో అపజయం పాలు కావడం వల్ల. తర్వాత రాజ్యలబ్ది కోసమే అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగింది.

కానీ రామాయణంలో రాముడే కాదు, భరతుడు కూడా రాజరికాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు. అన్న రాముడినే రాజుకమ్మని అంటాడు. ఇది కుటుంబబంధం వల్లనే. ఈ కుటుంబధర్మం ఎటువంటిది? కుటుంబపెద్దని దైవంగా భావించాలి, తండ్రిమాట జవదాటరాదు. అన్నకి కూడా అలాంటి గౌరవమే లభిస్తుంది.

కేరళ నంబూద్రి బ్రాహ్మల్లో వొక ఆచారం ఉంది. పెద్దకొడుక్కి మాత్రమే పెళ్లి చేసుకొనే అధికారం ఉంది. అతనికే వంశపారంపర్య ఆస్తి దక్కుతుంది. మిగిలిన సోదరులు అతనికి విధేయులై అతనిపై ఆధారపడి బతకాలి. యిది ఆస్తిని ముక్కలు కాకుండా చేస్తుంది. అలాగే రాజ్యం పొందడానికి ఒక్కడే అర్హుడు అనే విశ్వాసం రాచరిక సంక్షోభాన్ని పరిష్కరిస్తుంది. ఈ రామాయణ నీతిని పాశ్చాత్య సంస్కృత విద్వాంసుడు షెల్డన్ పొలాక్ సరిగానే గుర్తించారు.

క్రీస్తుపూర్వపు కాలంలో అశోకుడు రాజ్యకాంక్షతో సోదరుల్ని హతమార్చాడు. అజాతశత్రువు తండ్రి బింబిసారుణ్ణి చంపి రాజయ్యాడు. భారతకథ రాజ్యంకోసం అన్నదమ్ముల మధ్య యుద్ధమే! రాచరికం రక్తసంబంధీకుల మధ్యే చిచ్చు పెడుతూ వచ్చింది.

రాముడు దీన్ని నివారించాలనుకున్నాడు. రాజ్యవిస్తరణ అనే క్షత్రియధర్మం కంటే పితృభక్తికి ఉన్నతస్థానం యిచ్చాడు. కుటుంబపెద్దలకు అణగిమణగి ఉండడాన్ని ధర్మంగా బోధించడం ద్వారా సుస్థిరమైన కుటుంబాన్నీ, కుటుంబవ్యవస్థపై ఆధారపడ్డ రాచరికాన్నీ బలపరచదలుచుకున్నాడు.

ఇది పూర్తి పితృస్వామిక కుటుంబవ్యవస్థ. కుటుంబవ్యవస్థలోనూ, రాజ్యాధికారంలోనూ స్త్రీకి స్థానం లేదు. అలాగే కుటుంబంలో కూడా స్త్రీ పురుషునికి విధేయురాలిగా జీవించడమే ధర్మంగా నిర్వచించబడింది. ఈ పితృస్వామిక ధర్మాన్నే రాముడు రామాయణం అంతటా చాటాడు. తల్లి తండ్రికి, తమ్ముడు అన్నకి, భార్య భర్తకి విధేయులుగా ఉండాలనేదే తిరుగులేని శాసనం. ఈ పితృస్వామికధర్మం నిరంతరం ప్రశ్నకి గురౌతూ రావడాన్ని రామాయణం స్పష్టంగా చిత్రీకరించింది. వొక చర్చ గ్రంధమంతా కొనసాగుతుంది.

ఐతే ఈ పితృస్వామిక కుటుంబ సంబంధాల్ని ప్రశ్నించేది స్త్రీలే కానీ పురుషులు కాదు. కుటుంబంలో పెద్దకొడుక్కే రాజ్యం దక్కాలన్న నియమాన్ని కైకేయి ప్రశ్నిస్తుంది. తండ్రికి అగ్రస్థానాన్ని కౌసల్య ప్రశ్నిస్తుంది. స్త్రీపై పురుషుని ఆధిపత్యాన్ని, రాజ్యవిస్తరణలోని హింసనీ అన్యాయాన్నీ ప్రశ్నించడం ద్వారా సీత ఉన్నతస్థానంలో నిలుస్తుంది.

స్త్రీ స్వరాన్ని పూర్వపక్షం చేసి తటస్థం చేస్తాడు రాముడు. తల్లిని ధిక్కరించి అన్నకే రాజ్యం దక్కాలని పట్టుబట్టి రామపాదుకలను సింహాసనమెక్కించి కుటుంబధర్మాన్ని నిలుపుతాడు భరతుడు. కేవల బలప్రయోగం స్థానంలో ధర్మం రాజ్యం చేయడం మొదలుపెడుతుంది. అది పితృస్వామిక ధర్మం. జాబాలి నాస్తికవాదం ఆసరాతో తండ్రిమాటని కాదని రాముణ్ణి రాజుకమ్మని బోధిస్తాడు. ఆ సిద్ధాంతాన్ని రాముడు సమూలంగా తిరస్కరిస్తాడు. అప్పుడు వశిష్టుడు ఆస్తిక పద్ధతిలో సృష్టిపరంపర, ఇక్ష్వాకు వంశపరంపరని తెరచి జ్యేష్టుడే రాజగుట యుక్తమని రాజువు కమ్మని బోధిస్తాడు. ఇక్కడ విశేషం ఏమంటే – నాస్తిక సిద్ధాంతమూ ఆస్తిక సిద్ధాంతమూ కూడా రాజ్యకాంక్షనే ప్రధానంగా బోధిస్తాయి. ఆధునిక కాలంలో నాస్తిక కమ్యూనిజం ఏకవ్యక్తి నియంతృత్వరాజ్యాన్ని బలపరచడం తెలిసున్నదే. (కానీ క్రూరులూ దురాశాపరులూ అనుసరించే క్షత్రియధర్మాన్ని తాను పరిత్యజిస్తానని రాముడంటాడు.) నాస్తికత్వం, ఆస్తికత్వం పేర్ల మార్పే కానీ రాజ్యకాంక్షకి బీజం కానిదేదీ లేదు. (ఐతే రాముడు రాజుకంటే రాజ్యం ముఖ్యమనే కొత్త ఆలోచనకీ ఆశయానికీ బీజం వేశాడు.)

నిజానికి రాముడికి బుద్ధుడికి చాలా పోలిక ఉంది. బుద్ధుడికి ప్రతిబింబంగానే రామపాత్ర సృష్టించబడిందని కొందరు పాశ్చాత్య విద్వాంసుల వాదన. రాముడూ బుద్ధుడూ ఇద్దరూ రాజ్యం వదిలిపెట్టేశారు. బుద్ధుడు కైవల్యం కోసమైతే రాముడు రాజ్యాన్ని నిలపడం కోసం. నీటి తగవులో తెగలమధ్య యుద్ధాల్ని చూసి విసిగిపోయి బుద్ధుడు తన గణరాజ్యాన్ని వదిలిపెట్టేశాడు అని ఒక వాదన. కానీ రాముడిది నివృత్తి మార్గం కాదు. పూర్తి ప్రవృత్తి మార్గం. అడవులలో ఉన్నా, తన క్షత్రియ ధర్మమైన యుద్ధప్రియత్వాన్నీ, విస్తరణ కాంక్షనీ విడిచిపెట్టడు. ఈ విషయంలో సీత ప్రశ్నని పూర్వపక్షం చేస్తాడు రాముడు. తన మునివృత్తి సన్యాసం కాదని చాటుతాడు.

అసలు రామాయణం ధర్మార్ధ కామాలనే త్రివర్గాన్నే ప్రస్తావించింది కానీ మోక్షాన్ని ప్రస్తావించనేలేదు. ఆదర్శపూరితుడైన రాజునీ, భర్తనీ, అన్ననీ, కుటుంబీకుల్నీ సృష్టించడమే ధర్మంగా బోధించడంకోసం రచించబడింది. ఈ ధర్మం విధేయత, భక్తీ అనే ఇరుసు మీద నిలబడింది.

అసలు మునివృత్తి అనేది సన్యాసం కానే కాదు. పైగా కొందరు మునులు తమ ఆశ్రమంలో భోగలాలసతకి కూడా స్థానం కల్పించేవారు అని రామాయణం స్పష్టం చేస్తుంది. భరద్వాజాశ్రమం దీనికో ఉదాహరణ. అన్న రాముడిని కలవడానికి సైన్యసమేతంగా బయల్దేరతాడు భరతుడు. మార్గమధ్యంలో సైన్యాన్ని దూరంగా విడిచిపెట్టి భరద్వాజ ఆశ్రమంలోకి అడుగు పెడతాడు. ప్రశాంతమైన ఋష్యాశ్రమంలోకి సైన్యాన్ని ప్రవేశపెట్టడం తగదని అతడు భావిస్తాడు. ఐతే భరద్వాజ మహర్షి సైన్యాన్ని ఆశ్రమంలోకి తీసుకురమ్మని చెప్పడమేకాక, వారికి అందమైన స్త్రీలూ, మద్యం వగైరా సమస్త భోగాలూ కల్పిస్తాడు. తపోమహిమతోనేననుకోండి. ఆ సైనికులు అయోధ్యానగరం కంటే ఆశ్రమమే భోగాలతో విరాజిల్లుతోందని మెచ్చుకుంటారు కూడా.

కాళిదాస రఘువంశంలో దిలీపుడు మున్యాశ్రమం బైటే తన సైన్యాన్ని విడిచిపెట్టి ఆశ్రమం లోపలి అడుగుపెడతాడు. సంతానాన్ని ఆశిస్తూ నిరాడంబర జీవితాన్ని గడుపుతాడు, గోసేవ చేస్తాడు. దానికి భిన్నమైనది భరద్వాజాశ్రమం. కారణం ఏమిటంటే కొందరు మునులు రాజులతో దగ్గరి సంబంధం కొనసాగించారు. రాజ్యంలో భాగంగా ఉన్నారు. మున్యాశ్రమాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, విద్యాకేంద్రాలు కూడా! రాచరికానికి సమ్మతి కూర్చే ప్రక్రియ కూడా విద్యలో భాగం. వేదాంతం నుంచి లోకాయతం వరకూ మున్యాశ్రమాల్లో బోధించబడేవి (భారతం శకుంతలోపాఖ్యానం ఆదిపర్వం)

కనుక రాముడు ఆశ్రమజీవితాన్ని స్వీకరించడం రాచరికాన్ని త్యజించడం కావొచ్చుకానీ రాజ్యాన్ని త్యజించడం ఏమాత్రమూ కాదు. ఇంకా చెప్పాలంటే రాముని అరణ్యవాసమంతా ఇక్ష్వాకు రాజ్యబలాన్ని విస్తరించడమే. ప్రత్యక్షంగా ఇక్ష్వాకు రాజ్యపరిధిలోకి రాని వానర రాక్షస రాజ్యాలను తమ కోసలరాజ్య పరిధిలోకి ఈడ్చుకురావడమే రాముడు చేసిన పని. వనవాసకాలంలో రాముడు రాజ్యంలేని రాజుగా వ్యవహరించాడు. స్వతంత్రంగా జీవిస్తున్న వానర రాక్షస రాజ్యాల్ని కోసలకు సామంతరాజ్యాలుగా విధేయరాజ్యాలుగా మార్చాడు.

వానర రాక్షస రాజ్యాలలో కూడా అన్నకే రాజ్యాధికారం దక్కడం, మిగిలిన సోదరులు విధేయంగా జీవించడం కనబడుతుంది. కాని స్త్రీలు స్వతంత్రులుగా కనబడతారు. స్వేచ్ఛాప్రవృత్తి కన్పిస్తుంది. తార శూర్పణఖ మొదలైన పాత్రలు తమ అభిప్రాయాల్నీ వాంఛల్నీ స్వతంత్రంగా వ్యక్తం చేయడం కన్పిస్తుంది. ఆ పాత్రలు పూర్తిగా పురుష విధేయతతో జీవిస్తున్నట్టు కనిపించదు.

ఏదేమైనప్పటికీ పెద్దకొడుక్కే రాజ్యాధికారం దక్కడమనే ముఖ్యమైన ఇక్ష్వాకురాజ్య లక్షణం వానర రాక్షస రాజ్యాలలో కూడా కన్పిస్తుంది. పితృస్వామిక కుటుంబం బలపడటాన్ని ఈ లక్షణం సూచిస్తుంది.

రాముడు రాక్షసులనే కాదు, ప్రధానంగా స్త్రీల ప్రశ్నల్నీ ఎదుర్కొంటూ వచ్చాడు. ఎందఱో వేసిన ప్రశ్నలన్నీ సీతలో కలిసిపోయి వొకేవొక ప్రశ్నగా, రాజ్యంపై ప్రశ్నగా ఎక్కుపెట్టబడుతుంది.

“రామా! అసత్యవాక్యమును పూర్వమెన్నడూ నీవెరుగవు. ధర్మనాశనమునకు హేతువైన పరస్త్రీ వాంఛ నీకు అసలే లేదు. ధర్మాత్ముడవు, సత్యసంధుడవు, తండ్రి ఆజ్ఞను పాలించువాడవు” ఇది అరణ్యకాండలో సీత రాముడికిచ్చిన యోగ్యతాపత్రం.

కాని సీత మెచ్చిన రాముని గుణాలు వాటికవే విలువకట్టదగినవి కావు. నిజానికి బలమైన రాజ్యానికి, రాచరిక వ్యవస్థకీ రాముని ఆ గుణాలు పునాదులు. ఈ విషయం సీతకి పూర్తి విరుద్ధస్వభావం కలిగిన శూర్పణఖ తన అన్న రావణునిపై చేసిన నింద ద్వారా మనకు స్పష్టమౌతుంది. “శ్మశానములో ఉన్న అగ్నిని గౌరవించరు. దురాశాపరుడై నీచమైన భోగములయందు ఆసక్తిగల రాజుని గౌరవించరు” అని రావణున్ని నిందిస్తుంది. ఇంద్రియనిగ్రహం, కృతజ్ఞత, ధర్మస్వభావం రాజుకి లేకపోతే పతనం తప్పదు అంటుంది.

రామునిలో ఇంద్రియనిగ్రహం, రావణునిలో ఇంద్రియలాలస మనకు కనిపిస్తాయి. మొత్తంగా మానవజ్ఞానం ప్రకృతినీ, తన స్వభావాన్నీ, కాంక్షలనీ అణచుకోవడం వల్లే సాధ్యమైంది. దానినుంచే నాగరికత ఆవిర్భవించింది. జ్ఞానం రాజ్యం యొక్క వ్యక్తీకరణ. నాలెడ్జ్ ఈజ్ పవర్. మనస్తత్వశాస్త్రవేత్త ఫ్రాయిడ్ మానవ అచేతన వాంఛా కల్లోలం పైన సూపర్ ఇగో (అంతరాత్మ) రాజ్యం చేయడం వల్లే మానవుడు, అతని నాగరికత రూపొందాయని అన్నాడు.

భోగలాలసత వల్ల మనిషి మితిమీరిన స్వార్ధపరుడిగా సెల్ఫ్ సెంటర్డ్ గా మారతాడు. ఈలక్షణం సన్నిహితుల్ని కూడా పట్టించుకోని స్థితికి తీసుకుపోతుంది. తన సోదరులు చనిపోయినారన్న విషయాన్ని కూడా గూఢచారుల ద్వారా తెలుసుకోలేకపోయావని శూర్పణఖ రావణున్ని నిందిస్తుంది. పరులను అవమానించడం, దురాశ, మనుషులను దగ్గరికి రానీయకపోవడం, ఏమరుపాటుగా ఉండటం, గూఢచారుల ద్వారా సమాచారాన్ని సేకరించడంలో వెనకబడిపోవడం వంటి రావణుని దుర్లక్షణాలను శూర్పణఖ నిందిస్తుంది. ఇవి రాజుకి తగవు.

ఈ లక్షణాలకి భిన్నంగా రాముడు మొదటినుంచి యితరుల కష్టసుఖాలను పట్టించుకుంటూ వారిని మిత్రులుగా మార్చుకుంటాడు. ఎవరినీ నిందించడు. తనను రాజ్యానికి దూరం చేసిన కైకేయితో సహా అందర్నీ సమర్ధిస్తాడు కానీ నిందించడు. భోగలాలసత ఏమాత్రం లేదు. సరళమైన జీవితాన్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే రాజుని నిలబెట్టేది రాజ్యం మాత్రమే, అధికారం మాత్రమే. సామదానభేద దండోపాయాలన్నీ రాముడు ఉపయోగిస్తాడు. కాని మొదట మాత్రం తన అభిప్రాయాల్ని చర్చద్వారా సామరస్యపూర్వకంగా వొప్పించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తాను ఏదిధర్మం అనుకుంటాడో దాన్ని మాత్రమే ఆచరిస్తాడు. ఇది రాముణ్ణి ధర్మాత్ముడిగా నిలబెడుతుంది. నిజానికి ఈ ధర్మం రాజధర్మం. ఆసంగతి శూర్పణఖకి తెలుసు, మారీచుడికీ తెలుసు. ఒక్క రావణుడికి తప్ప అందరికీ తెలుసు. అందుకే రావణుడు తప్ప రాక్షసులందరూ మారీచుడితో సహా రాముణ్ణి పొగిడినవాళ్ళే. ఎందుకంటే రాజ్యవిస్తరణకి రాముడిలో ఉన్న లక్షణాలు అవసరం. అందుకే మొదట కింగ్ మేకర్ గా ఉండి, చివరకు తిరుగులేని రాజుగా అవతరించాడు.

రావణుడు చేసిన ప్రధానమైన నిందలు రెండు. ఒకటి, రాముడికి రాజ్యం లేదు కనుక వ్యర్ధుడు. రెండు, ఆడదాని మాటకి అనవసరమైన విలువనిచ్చి అడవిదారి పట్టాడు. కాని శూర్పణఖకి తెలుసు రాముడు వ్యర్ధుడు కాడు, నిజమైన బలవంతుడని. “రాముడు శ్రమపడకుండా కార్యములు సాధిస్తాడు. అతడు దండకారణ్యస్థానాన్ని ఓడించాడు” అంటుంది శూర్పణఖ.

నిజానికి రాక్షసులే కులాసా జీవులుగా కన్పిస్తారు. మారీచుడు రాక్షస జీవితాన్ని ఇలా వర్ణిస్తాడు. “రాక్షసులందరూ అనేకవిధములైన ఆటలకు సంబంధించిన పద్ధతులను, రతికి సంబంధించిన కళలను తెలుసుకొని సుఖంగా ఉన్నారు. సమాజములుగా ఏర్పడి ఆయా ఉత్సవములను చేసుకొని ఆనందించుచున్నారు”

జీవితమంటే రతిక్రీడ, ఉత్సవాలు, ఆటలు అన్నట్లుగా ఉంది రాక్షసులకు. రావణుడూ రాక్షసుడే! ఇటువంటి జీవితం రామునితో పోలిస్తే నాగరికతలో వెనకబాటు మాత్రమే! రాజ్యాధిపత్యం, అందుకవసరమైన జనశ్రేణీకరణ రాజ్యం బలపడటానికి అవసరం. కులాసా జీవితం దీనికి విరుద్ధం.

వానరులలోనూ రాక్షసులలోనూ ఇలాంటి కులాసా పద్ధతులు ప్రధానంగా కనబడతాయి. తార, శూర్పణఖల ప్రవర్తనలో వారి వాంఛావ్యక్తీకరణ, మద్యపాన ప్రియత్వంలో స్వేచ్ఛాశీలత కనిపిస్తుంది. రాజ్యం బలపడటానికి స్త్రీల స్వేచ్ఛని, ప్రవర్తనని నియంత్రించడం కూడా ప్రధానం. దానితోబాటు పురుషుడికి స్వీయ నియంత్రణ అవసరం. అది రాముడిలో కనిపిస్తుంది. సీత కూడా దానినే నిర్ధారిస్తుంది.

నియంతృత్వరాజ్యానికి ప్రతినిధులుగా నిలిచిన హిట్లర్, స్టాలిన్ లు ఇద్దరూ భోగలాలసతకి దూరంగా ఉన్నవారే. కుటుంబసంబంధాలతో సహా సర్వాన్నీ తన గుప్పిట్లోకి తీసుకొని క్రమబద్ధంగా క్షేమంగా నడపగల రాజ్యం గురించి కలగన్న ప్లేటో, ఫిలాసఫర్ కింగ్ (రాజర్షి) అవసరాన్ని స్పష్టం చేశాడు.

రావణుడు మనలో అణచబడిన, అచేతన (సబ్-కాన్షియస్)లా కనడతాడు. సీత రావణుడి చిత్రాన్ని గీసి భద్రపరుస్తుంది. ఆ చిత్రాన్ని చూసి రాముడు సీతని అడవులలో వదిలిపెడతాడు. ఇటువంటి కథ ఒకటి జనంలో ప్రచారంలో ఉంది (స్త్రీల రామాయణ గీతాల్లో ఇటువంటి కథ ఉందని వెల్చేరు నారాయణరావు రాశారు). రావణుడి కాష్ఠం ఆరదని ఒక నానుడి. నిజమే! అది మనలో రగులుతూ ఉంటుంది.

వాంఛ, ముఖ్యంగా సెక్సు వాంఛ రాక్షసమైనదిగా భావించబడింది. తన మాజీభార్యతో సంగమించిన వొక బౌద్ధసన్యాసిని బుద్ధుడు తీవ్రంగా నిందిస్తాడు. “అంగాన్ని నిప్పుల్లో కాల్చుకోలేకపోయావా?” అని కూడా అంటాడు (బుద్ధ చరియ – రాహుల్ సాంకృత్యాయన్)

రాముడు సన్యాసి కాదు గానీ, ఏకపత్నీవ్రతుడు. శృంగారాన్ని కుటుంబ అవసరాలకి అంటే సంతానోత్పత్తికి పరిమితం చెయ్యాలని భావించినవాడు. రఘువంశ మహారాజులు కేవలం సంతానం కోసమే వివాహం చేసుకొనేవారని కాళిదాసు రఘువంశంలో రాశాడు. అంటే వాంఛ ప్రధానమైనది కాదు అని అర్ధం. “సంతానోత్పత్తికి మరోమార్గం లేకపోవడం వల్లే సమాజం సెక్సుని అంగీకరిస్తుంది” అని ఫ్రాయిడ్ రాశాడు. నాగరికత, రాజ్యం ఆవిర్భావ వికాసాల్లో సెక్సు అణచివేత చాలా ప్రధానం.

ఐతే అన్నివేళలా ఇలాంటి అణచివేత అసాధ్యం అని వాల్మీకికి తెలుసు. భర్తవేషంలో వచ్చిన ఇంద్రుడితో అహల్య సంగమిస్తుంది. వాల్మీకి ఇక్కడ ఒక రహస్యాన్ని బట్టబయలు చేస్తాడు. అహల్యకి ఆ వచ్చినవాడు తన భర్త కాదని, ఇంద్రుడని తెలుసు. దేవరాజు అనే మక్కువ వల్లే అతనితో సంగమిస్తుంది.

భారతీయ కథనాల్లో రావణుడూ రాక్షసులూ మాత్రమే కాదు, దేవతలు చివరికి ఆదిదేవుడు విష్ణువు కూడా చపలచిత్తులే; శృంగారవాంఛకి లొంగినవారే. నారదుణ్ణి మోసం చేసి అతను ప్రేమించిన స్త్రీని సొంతం చేసుకోవడం వల్ల నారదుడు విష్ణువును శపిస్తాడు. ఆ శాపంవల్లే రామావతారం, భార్యావియోగం సంభవించాయని శివపురాణంలోనూ, రామచరితమానస్ లోనూ ఒక కథ ఉంది. జలంధరుని వేషంలో వెళ్లి తులసిని సంగమించాడు విష్ణువు. అది తెలిసి తులసి శపించడం వల్లే విష్ణువు రామావతారం ఎత్తి కష్టాలు పడ్డాడని మరోకథ రామచరితమానస్ లో ఉంది.

ఇంతకూ చెప్పొచ్చేదేమంటే ప్రతివ్యక్తిలోనూ చివరికి దేవుడిలో కూడా రావణుడు ఉంటాడు. స్పష్టమైన దేవరాక్షస విభజన అసాధ్యం. ఇంతకీ రావణుడు ఒకవైపు రాక్షసుడు, మరోవైపు వేదపండితుడు, శివభక్తుడు. రావణుడు సహజసిద్ధమైన వాంఛల్ని రాముడిలా రాజ్యం కోసం బలిపెట్టలేకపోయాడు.

రాముడు సీతపేరుతో గెల్చుకున్నది రాజ్యాన్నే. లంకలో తనవిధేయుడైన విభీషణున్ని రాజుగా నిలిపాడు. ఇంతకీ అతడు రావణుడి సోదరుడే. చివరిలో రాముడు సీతతో స్పష్టం చేస్తాడు, “నేను యుద్ధం చేసింది నీకోసం కాదు” అంటాడు. “నాచరిత్ర (ఇమేజి)ని రక్షించుకోవడం కోసం, నావంశ కళంకాన్ని తుడిచివేయడం కోసం యుద్ధం చేశాను” అంటాడు. అగస్త్యుడు దక్షిణదిక్కుని జయించినట్టు నేను నిన్ను శత్రువుల నుండి జయించాను అని గర్వంగా చాటుతాడు.

రాజుకి విజయమే ముఖ్యం, సాధారణభావోద్వేగాలు కాదు. ఈ సత్యాన్ని రావణుడు గుర్తించలేకపోవడం వల్లే రాజ్యంతో సహా తుడిచిపెట్టుకుపోయాడు.

ఐతే రాముడి రాజ్యకాంక్షని, రాజ్యవిస్తరణని తప్పు పట్టింది సీత మాత్రమే. “రామా! దండకారణ్యంలో నివసించే రాక్షసులను వాళ్ళతో ఏ వైరమూ లేకుండానే చంపవలెనను ఆలోచన నీకు కలుగుట ఏమాత్రము మంచిది కాదు. వీరుడా! ఏ అపరాధము చేయనివారిని చంపుట నాకు సమ్మతము కాదు.” అంటుంది.

రామునిలోని మంచిగుణాలను మొదట మెచ్చుకున్న సీత రాముడిలోని హింసాప్రవృత్తిని తప్పుపడుతుంది. వనంలో ఆయుధాన్ని ధరించడం తగదు, దేశధర్మాన్ని పాటించాలి అంటుంది. ఆయుధం మానవస్వభావాన్ని పూర్తిగా మార్చేస్తుంది అంటుంది. ఇంద్రుడి ఆయుధాన్ని తన దగ్గర భద్రపరచుకొన్న ఒక ముని స్వభావం క్రూరంగా హింసాత్మకంగా మారిన విధానాన్ని వివరిస్తుంది. ధర్మాన్ని ఆచరించమని రాముణ్ణి హెచ్చరిస్తుంది. సీత దృష్టిలో ధర్మమంటే ఏమిటి? రాజ్యవిస్తరణ కాంక్షని విడిచిపెట్టడం.

రాక్షసులనుంచి మునుల రక్షణ కోసమే తాను ఆయుధం ధరించానని సమాధానం చెప్తాడు రాముడు. సీతని మెచ్చుకుంటూనే సున్నితంగా చెప్తాడు. చివరికి నిన్నైనా విడిచి పెడతాను కానీ మునుల కోసం చేసిన ప్రతిజ్ఞను విడిచి పెట్టనని కుండబద్దలు కొడతాడు.

ఈ సంభాషణకు ముందు సీతారాములు సుతీక్ష్ణమహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అది చాలా ప్రశాంతమైన ఆశ్రమం. ప్రపంచవిజయాన్ని కాంక్షించిన అలెగ్జాండర్ వొక యోగి ఎదుట దర్పంగా నిలబడి, “నీకేం కావాలో కోరుకో!” అన్నాడట. “నువ్వు అడ్డుతప్పుకో! వెలుతురు వస్తుంది. అదిచాలు” అన్నాడట ఆ యోగి. అదిగో ఆ యోగిలాంటి వాడు సుతీక్ష్ణమహర్షి. తన ఆశ్రమం చాలా ప్రశాంతమైనదని, మృగాలు తప్ప మరేవీ ఆశ్రమంలోకి రావని, అవికూడా హాని చెయ్యవని చెప్తాడు. తన ఆశ్రమంలోనే ఉండమని అంటాడు. అందుకు రాముడు తిరస్కరిస్తాడు. తన దగ్గర ఆయుధం ఉందని, తాను మృగాలను చంపే ప్రమాదం ఉందని, దానివల్ల ముని హృదయం గాయపడవచ్చని కనుక తాను ఆశ్రమంలో ఉండలేనని చెప్తాడు.

సుతీక్ష్ణమహర్షి ఆశ్రమం నుంచి బయల్దేరి వస్తున్నప్పుడే సీతారాముల మధ్య పై సంభాషణ జరిగింది. మృగాలని చంపే ప్రమాదం ఉందని భయపడిన రాముడు రాక్షసుల్ని చంపడాన్ని ధర్మంగా కర్తవ్యంగా సమర్ధించుకుంటాడు. చాటునుంచి చంపడాన్ని వాలి ప్రశ్నించినప్పుడు నువ్వు జంతువువి కనుక నిన్నేవిధంగానైనా వేటాడడంలో తప్పులేదని సమర్ధించు కుంటాడు. వానరరాజు సుగ్రీవుణ్ణి మిత్రుడిగా స్వీకరించినవాడు, హనుమంతుడిని గొప్ప పండితుడిగా వ్యాకరణవేత్తగా వేదజ్ఞుడిగా గుర్తించి పొగిడినవాడూ నైన రాముడు అదేజాతికి చెందిన సుగ్రీవసోదరుడు వాలిని జంతువుగా నిర్వచిస్తాడు. జంతువుని ఏవిధంగా చంపినా తప్పులేదని, జంతువధకి ఏ నియమాలూ ధర్మశాస్త్రాలూ వర్తించవని చాటుతాడు. దాన్నొక వేటగా వర్ణిస్తాడు. రాజ్యవిస్తరణలో భాగంగా లౌక్యంతో కూడిన వివిధరీతుల్ని అవలంబించడం సహజమే. అలాగే యితర జాతులవాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపుతూనే వారితో స్నేహం చెయ్యడం ప్రస్తుతించడం రాజులరీతి. దీన్నే నయానా భయానా లొంగదీయడం అంటారు. అశోకుని వంటి బౌద్ధప్రభువులు కూడా వనవాసుల్ని అణచి ఉంచడానికే ప్రయత్నించారని చరిత్రకారులు చెప్తారు.

ఆశ్చర్యకరంగా సీతప్రశ్ననే వాలి కొనసాగించాడు. నీతో శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేని నన్ను ఎందుకు చంపావని నిలదీశాడు. మరొక ముఖ్యమైన ప్రశ్నకూడా వేస్తాడు వాలి. “ఎవరినైనా చంపడానికి భూమి బంగారం వెండి (సంపదలు) కారణం. నీకు నా భూమియైన వనము మీద కానీ, నేను తినే ఫలముల మీద కానీ ఆశ ఏమిటి?” యిది వనవాసి వేసే ప్రశ్న. రాజ్యంపై వనవాసులు ఈనాటికీ ఎక్కుపెడుతున్న ప్రశ్న.

దీనికి రాముని సమాధానం ఇక్ష్వాకురాజుల సార్వభౌమాధికార విస్తరణ కాంక్షని చాటుతుంది. “పర్వతములతోనూ, చిన్నవనములతోనూ, మహారణ్యములతోనూ భూమి మొత్తంగా ఇక్ష్వాకు వంశీయులకు చెందినది. మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుట అనుగ్రహించుట యందు కూడా వారికే అధికారము.” ఈ సమాధానం వాలికే కాదు, సీతకు కూడా వర్తిస్తుంది.

కానీ వాలి భార్య తార విలపిస్తూ రాముడిని తప్పు పడుతుంది. వాలిని అన్యాయంగా చంపి నింద్యమైన పని చేసినందుకు రాముడు పశ్చాత్తాపపడుట లేదు అంటుంది. వాలి కొడుకు అంగదుడు మాత్రం మరో సందర్భంలో తన పినతండ్రి సుగ్రీవుడిని మోసగాడిగా నిందిస్తాడు. రాముడి పేరు ప్రస్తావించడు. దానికి కారణం రాముడి సమయానుకూల ప్రవర్తన కారణం కావొచ్చు. ఉద్వేగపూరితంగా రాముడు ఎప్పుడూ ప్రవర్తించడు. నిజానికి తననికూడా చంపెయ్యమని వాలి భార్య తార రాముణ్ణి కోరుతుంది. ఈ కోరికలో ఒక ఉక్రోషం ధ్వనిస్తుంది. చివరికి రాముడు పరిస్థితినంతా చక్కబెడతాడు. ఆమెని ఓదారుస్తాడు. కొంత వేదాంతాన్నీ ఆశనీ కలగలిపి బోధిస్తాడు. రాముడు ఎప్పుడూ అంతే! రావణ వధానంతరం విభీషణుడితో “మరణం తర్వాత శత్రుత్వం ఏముంటుంది? రావణుడు నాకూ సోదరుడే!” అంటాడు. రాజుకి ఉండవలసిన స్థితప్రజ్ఞత, భావోద్రేకాతీత స్థితీ రాముడిది.

తనని చంపమని కోరుతూ తార రాముడికి మరో ధర్మసూక్ష్మం బోధిస్తుంది. నేను స్త్రీని అని, స్త్రీహత్య పాతకమని ఆలోచించవద్దు. నేను నాభర్త వాలినుంచి విడదీయరానిదాన్ని కనుక చంపవచ్చునంటుంది. స్త్రీహత్య పాతకమా కాదా అనే విషయంలో బాలకాండలో కూడా చర్చ జరుగుతుంది. తాటకిని చంపమని ఆజ్ఞాపించే సందర్భంలో దేవేంద్రుడూ విష్ణువూ కూడా స్త్రీవధ చేశారంటాడు విశ్వామిత్రుడు. ప్రజారక్షణ కోసం ఎటువంటి పనినైనా రాజు చెయ్యాలంటాడు. రాముడు కూడా కౌసల్యతో సంభాషించే సందర్భంలో తండ్రి జమదగ్ని మాట ప్రకారం పరశురాముడు తన తల్లిని చంపడం ధర్మమేనంటాడు.

సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ జాతికి చెందిన పిల్లల్నీ స్త్రీలనీ చంపడానికి వొక సిపాయి సందేహిస్తాడు. మరో సిపాయి, పాము పిల్లల్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పి చంపేస్తాడు. యుద్ధమనేదే హింస. కానీ ఆ హింస కూడా కొంత న్యాయబద్ధంగా ఉండాలని ఆశిస్తాం. స్త్రీలు, పిల్లలు బలహీనులు కనుక వారిపై దాడి పనికిరాదని భావిస్తాం కానీ నియమాలు ఉల్లంఘించబడుతూనే ఉంటాయి.

ఆయుధం అనేది ఋషులను కూడా నరకంలోకి నెట్టిందనేది సీత బోధ. కానీ ఆయుధం లేకపోతే రాజ్యంలేదు, రాజులేడు, రాముడు లేడు.

రాజ్యం ఉన్నంతవరకూ హింస అనేకరూపాల్లో కొనసాగుతూనే ఉంటుంది. దానిలో శ్రేణీకరణ (హైరార్కీ) ఒక భాగం. ప్రాచీన రామరాజ్యంలోనే కాదు, ఆధునిక కమ్యూనిస్టు రాజ్యంలోనైనా ఈ హెచ్చుతగ్గుల దొంతరల వ్యవస్థ తప్పదని బకూనిన్ లాంటి అరాచకవాదులు స్పష్టం చేశారు. అది నిజమైంది కూడా!

హింస భావోద్వేగాలవల్ల సంభవించవచ్చును. కొంత స్వార్ధం వల్ల సంభవించవచ్చును. యిది పశు సహజం. కానీ హింసని రాజ్యాధిపత్యానికి అనుకూలంగా మలచుకోవడం అనేది మనిషి చైతన్యపూరితంగా చేసే ప్రక్రియ. అత్యాచారాన్ని ఆయుధంగా మలచుకోవాలని హిందూత్వవాది సావర్కర్ అనడంలో పొలిటికల్ పవర్ దాగి ఉంది.

రావణుడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు కానీ అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించలేదు. కేవలం వాంఛవల్లనే అత్యాచారానికి పాల్పడ్డాడు. రావణుడు తన వదినయైన రంభపై కూడా అత్యాచారం చేస్తాడు. తాను వదిననని, విడిచిపెట్టమని బ్రతిమలాడినా వినకుండా అత్యాచారానికి తెగబడతాడు. రంభ విషయం కానీ, సీతాపహరణం కానీ రావణుడు కోరిక వల్లనే చేశాడు కానీ, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కాదు.

రాముడు దీనికి భిన్నం. తాను సీతను చెరనుంచి విముక్తం చేశానని అనడు, జయించానని అంటాడు. అలా అనడంలో అన్ని సందర్భాల్లో రాముడు రాజుగానే, మూర్తీభవించిన రాజ్యంగానే వ్యవహరించాడని అర్ధమౌతుంది. అదే ధర్మం, రాజధర్మం.

రావణుడు దీనికి పూర్తిగా వ్యతిరేకం. అతడు వాంఛా పరిపూర్తినే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు. రాజ్యం అతనికి ద్వితీయ లక్ష్యం మాత్రమే. తనపైన, తన యింద్రియాలపైన, తన వాంఛలపైన రాజ్యం చేయలేనివాడు బయటి ప్రపంచాన్ని శాసించలేడు. రాజ్యంగా మూర్తీభవించలేడు. అందుకే రావణుడు లంకతో సహా తుడిచిపెట్టుకుపోయాడు.

రావణుని స్వభావం రాముని స్వభావం కంటే భిన్నమైనది. రావణుడు ఒకసారి మంచి చెడుల చర్చే అనవసరమంటాడు. మరోసారి జ్ఞాతుల్ని నమ్మనే నమ్మరాదంటాడు. తనమాటే వేదమని అతని నిశ్చితాభిప్రాయం (మారీచ, విభీషణులతో సంభాషణలు.) నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు అనేది రావణ స్వభావం. దీనికి భిన్నంగా రాజ్యం ప్రజాసమ్మతిపై ఆధారపడి ఉంది అనే వాస్తవానికి కట్టుబడిన ప్రాగ్మాటిస్ట్ రాముడు. అందువల్ల మంచైనా చెడైనా ప్రజల అభిప్రాయం ప్రకారమే, సమ్మతి ప్రకారమే నడుచుకుంటాడు రాముడు. సీతని అగ్నిప్రవేశానికి పురికొల్పడానికీ సీతని అడవులలో విడిచిపెట్టడానికీ కారణం అదే!

నిన్ను గెలుచుకున్నది నీపై ప్రేమతో కాదు అని సీతకు ప్రకటించడం ద్వారా రాముడు తానొక రాజునని, రాజ్యమే తనకు ప్రధానమని చాటాడు. రాజ్యానికి అనుబంధంగానే ఏ బంధమైనా, ఏ భావోద్వేగమైనా!

రాజ్యం పురుషకేంద్రకం, పితృస్వామికం. దాన్ని నిలపాలంటే స్త్రీశక్తిపై అదుపు అవసరం, నిరంతర నిఘా అవసరం.

రామునిచేత తిరస్కరించబడిన సీత అంటుంది, “స్త్రీత్వమేవాను పశ్యసి. తేలిక స్వభావంగల మనుష్యుని వలె నాలో స్త్రీత్వాన్ని మాత్రమే చూస్తున్నావు. నేను నిజానికి భూమినుంచి పుట్టాను.”

ప్రకృతి(భూమి)కి, స్త్రీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం వల్ల స్త్రీ స్వభావం మార్మికం, దైవికం. అమోఘమైన పునరుత్పత్తి శక్తి స్త్రీలో ఉంది. అది స్త్రీని దేవతగా మార్చింది. దేవతగా మార్చి అణచివెయ్యాలని కూడా పురుషుడు భావించాడు, రాజ్యం భావించింది. ప్రకృతి వైపరీత్యాల్లాంటిదే స్త్రీ వైపరీత్యం కూడా. ప్రకృతినిలాగే స్త్రీని కూడా శాసించాలని పురుషుడు భావించాడు.

సీత భూమినుంచే పుట్టింది. భూమి (ప్రకృతి) లోనే కలిసిపోయింది. రాముడు చక్రవర్తిగా సింహాసనం అధిష్టించిన తర్వాత సీత భర్తని కోరిన కోరిక ఏమిటో తెలుసా? ప్రశాంతమైన అడవుల్నీ ఆశ్రమభూముల్నీ చూడాలని కోరింది (ఉత్తరకాండ). గొప్ప చిత్రకారుడు గీసిన చిత్రాలలో ప్రశాంత ప్రకృతిని చూసి తిరిగి ఆశ్రమభూముల్ని చూడాలని సీతకు కోరిక కలిగిందని భవభూతి ఉత్తరరామచరిత్ర నాటకంలో రాశాడు. రాముడు పరిత్యజించడం వల్లనే ఆ కోరిక తీరడం విచిత్రవిషాదం. ఎంతగా నాగరికతదుమ్ము పేరుకుపోయినా స్త్రీ హృదయం సహజ ప్రకృతికి దగ్గర. ఆత్మ పరమాత్మల అమూర్తపు గోల స్త్రీకి లేదు. ఆమె ప్రకృతితో విడదీయరాని భాగం. అంతే!

స్త్రీ దైవంగానే కాకుండా అర్ధనారీశ్వరతత్త్వం భారతదేశంలో ప్రాచుర్యంలో ఉంది. భగవంతుడొక్కడే పురుషుడని, మనుషులందరూ స్త్రీలేనని పరమభాగవతులు భావించారు. యిటువంటి తాత్త్విక భావనలు పుంస్త్వానికి గల ప్రాధాన్యాన్ని తగ్గించాయి. అదే సమయంలో భౌతిక విజయం కంటే ఆత్మా సామ్రాజ్యమే గొప్పదనే భావనలు బలపడ్డాయి. అసలు “నేనెవరు?” అనేది తెలుసుకోవడం ముఖ్యమన్న తాత్త్వికభావన స్థలకాలాలలో విస్తరించాలనే రాజ్యకాంక్షకి గండి కొట్టింది.

నిజానికి రామాయణం చివరికి వచ్చేసరికి విశ్వమంత విశాలంగా మారిపోయింది. అన్ని సమస్యలకీ మూలం –  రాముడు తానెవరో మరచిపోవడం, తన దైవత్వాన్ని విస్మరించడం. అసలు విషాదం అది. విశ్వమంత విశాలమైన తనని స్థలకాలాల్లో కుదించుకున్నాననే సంగతి రాముడికే తెలియకపోవడం అసలు విషాదం. బ్రహ్మదేవుడే దిగివచ్చి ఆ సత్యాన్ని రాముడికి గుర్తుచేయాల్సి రావడం మహావిషాదం. (యోగవాసిష్టంలో “నేను ఎవరు?” అనే జిజ్ఞాసతో రాముడు గురువు వశిష్టుణ్ణి ఆశ్రయిస్తాడు.)

స్థల కాల బద్ధుడూ, రాజూ ఐన రాముణ్ణి అధ్యాత్మరామాయణం ఆత్మసామ్రాజ్యానికి రాజుని చేసింది. తులసీదాసు దీనినే అనుసరించాడు. రామాయణంలోని చిట్టచివరి ఘట్టాన్ని మొదటిదిగా మార్చి అధ్యాత్మరాముణ్ణి రచించింది. దీనితో సంఘటనలకి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఈ పరిణామానికి జైన రామాయణం కూడా దోహదం చేసింది. జైన రామాయణం ప్రకారం రాముడు అసలు యుద్ధం చేయనే లేదు. లక్ష్మణుడే రావణున్ని చంపాడు. ఫలితం ఇద్దరూ నరకానికి పోయారు. ఆయుధమే పట్టని రాముడు కైవల్యం చెందాడు. సీత ఆశించిన రాముడు యితడు.

అధ్యాత్మరామాయణం రెండాకులు ఎక్కువ చదివి అసలు సీతను రావణుడు అపహరించనేలేదంది. మరి రావణుడు అపహరించింది ఎవరిని? మాయా సీతని.

ఈ మాయాసీత అనే భావనకు బీజాలు వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు రాముణ్ణి మానసికంగా బలహీనుణ్ణి చేయడం కోసం మాయాసీతని కల్పించి హతమారుస్తాడు. ఈ ప్రపంచమే మాయ, మిధ్య, కల్పితం అనే అద్వైత వేదాంత ధోరణితో మాయాసీతనే రావణుడు అపహరించాడు అని అధ్యాత్మరామాయణం, రామచరితమానస్ వర్ణించాయి. ఈ గ్రంధాలలోని మాయాసీత రామ (విష్ణు) కల్పితం. అంటే, రామాయణంలోని రాక్షసమాయ, ఆధ్యాత్మ, తులసీ రామాయణాలలో దైవమాయగా మారింది. ఫలితంగా సంఘటనలు అభావం చెందాయి. రామాయణం స్థల కాలాతీతంగా మారిపోయింది. దీనినే సనాతనం అంటారు. సనాతనం అంటే స్థల కాల బద్ధం కానిది.

ప్రవృత్తిమార్గాన్ని, లౌకికధర్మాన్ని బోధించిన రామాయణం పూర్తిగా ఆధ్యాత్మికంగా మెటాఫిజికల్ గా రూపాంతరం చెందింది. బాలకృష్ణుడి నోట్లో తల్లి యశోదకి విశ్వమంతా కనిపిస్తే, ఒకభక్తుడికి రామచరితమానస్ లోని బాలరాముడిలో విశ్వం సాక్షాత్కరిస్తుంది. ఈ రామాయణ ఆధ్యాత్మీకరణ యొక్క లౌకిక ప్రయోజనం ఏమంటే, భిన్న సంస్కృతుల మధ్య సామరస్యం. శైవ-వైష్ణవ, హిందూ-ముస్లిం సంస్కృతుల సమ్మేళనం. రాం రహీం ఒక్కడే అని కబీర్ గానం చేశాడు. గాంధీ అదే తత్వాన్ని ఆధునిక జాతీయ రాజకీయాలకి అన్వయించాడు. ఈశ్వర్ అల్లా తేరేనాం అన్నాడు.

కానీ హిందూత్వ వాదులు వాల్మీకి రామాయణానికి తిరోగమించాలని భావిస్తున్నారు. వేల రామాయణాల స్థానంలో వొకే రామాయణాన్ని వొకే రాముడిని నిలపాలని చూస్తున్నారు. అధ్యాత్మరామాయణం ద్వారా అధిగమించబడిన పుంస్త్వాన్ని పునఃప్రతిష్ఠించి, రాజైన రాముణ్ణి జాతీయ నాయకుడిగా ప్రతిష్టించాలని చూస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమంటే, స్థల కాల బద్ధుడు కాని రాముడిని క్రీస్తులాంటి చారిత్రక పురుషుడిగా కుదించాలని చూస్తున్నారు. యుద్ధప్రియుడైన జాతీయ నాయకుడిగా నిలపాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఇతిహాస పురాణాల్లోనూ తత్వశాస్త్రంలోనూ కొనసాగుతూ వచ్చిన పూర్వపక్ష సిద్ధాంత రూపంలోని చర్చనీ తర్కాన్నీ మినహాయిస్తున్నారు. తద్వారా రామాయణాన్ని సంప్రదాయం స్థాయినుంచి మతగ్రంధంగా కుదిస్తున్నారు. గుడిరాజకీయం చేస్తున్నారు.

రామాయణం ఒక సంప్రదాయం. మొత్తం వాఙ్మయాన్ని శృతి స్మృతిగా విభజించారు. శృతి వినికిడిపై ఆధారపడినది. అది వేదం. స్మృతి అంటే ఇతిహాస పురాణాల నుంచి మూతం వాఙ్మయమంతా వస్తుంది. స్మృతి అంటే జ్ఞాపకం. గతం నుంచి వారసత్వంగా వచ్చిన జ్ఞాపకం. రామాయణం స్మృతే. గత జ్ఞాపకాలను మన సంస్కారాన్ని బట్టి వివిధ పద్ధతుల్లో మనం గుర్తుకు తెచ్చుకుంటాం. మన వ్యాఖ్యానాన్నీ కథనాన్నీ జోడిస్తాం. అందుకే ఇన్ని రామాయణాలు (సంస్కృతి జ్ఞాపకాలపై ఆధారపడి ఉంది).

అన్నిరంగాల్లో రాజ్యనియంతృత్వం వ్యాపిస్తుండడంతో వొకే రామాయణం గురించి, వైవిధ్యం లేని వొకే మూసకతనం గురించి అన్వేషణ మొదలైంది. అది ఆధునిక విషాదం.

రామాయణం అనే పదాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు. రామ+అయనం, రామునిజీవనయానం (చరిత్ర) అని అర్ధం. రామా+అయనం, రామా అంటే స్త్రీ. స్త్రీ జీవనయానం (చరిత్ర). ఇప్పుడు రామాయణాన్ని కేవలం రామకథగా కుదించి, పుంస్త్వంతో కూడిన దుందుడుకు కథనాలను వాడుకలోకి తేవడానికి ప్రయత్నం జరుగుతోంది.

గాంధీని అనుయాయులు అమ్మా అని పిలిచేవారని ఆశిష్ నంది ఇంటిమేట్ ఎనిమీలో రాశాడు. గాంధీ ఆడరాజకీయాలు చేస్తున్నందుకే చంపేశానని గాడ్సే అన్నాడు. గాంధీ రాజకీయాలని అహింసాయుతంగా మార్చేశాడు. రాముడిని తులసీరామాయణపద్ధతిలో అర్ధం చేసుకున్నాడు. రామాయణం రాజ్యకాంక్షతో మొదలై ఆత్మసామ్రాజ్యమే నిజమైన సామ్రాజ్యం అని బోధించే దిశగా పయనించింది.

రామాయణం, ఫాతిమా-సీత లాంటి కథనాల్లో ప్రకృతిని తిరిగి చేరుకోవడంగా పర్యవసించింది. ప్రకృతిపై సార్వభౌముడైన మనిషిని ప్రకృతి ఆరాధకుడిగా దిగజారుస్తోంది భారతీయసంస్కృతి అని మార్క్సు విమర్శించాడు. హనుమంతుడి లాంటి జంతుదేవతలను పూజిస్తున్నారని రామాయణసంస్కృతిని విమర్శించాడు. నిజానికి ప్రకృతినే కాదు, స్త్రీని అంటే సీతమ్మవారిని కూడా కొలవడం రామాయణసంస్కృతి. రాజ్యం నుంచి రాజ్యరాహిత్యానికి, పుంస్త్వం నుంచి స్త్రీత్వానికి, వికృత నాగరికత నుంచి ప్రకృతికి తిరుగు ప్రయాణమే నిజమైన రామాయణ సంస్కృతి. రామాయణం కేవలం ఒక గ్రంధం కాదు, అదొక ప్రయాణం.

హేతుబద్ధతపైన ఆధునికులకుండే విశ్వాసం రామాయణ బహుళ కథనాలకీ, రామాయణ ప్రయాణానికీ అడ్డంకిగా నిలిచింది. హేతుబద్ధమైనదే సత్యమన్న భ్రమ హేతువుని కుదించివేసింది. మన హేతుదృష్టికి అందే విషయాలే గాక, అందనివి చాలా ఉంటాయన్న ప్రాచీన దృక్పథం క్షీణించడంతో రామకథ గ్రంధంగా ఘనీభవించింది. ప్రొటెస్టెంట్ గ్రంధతర్కం రామాయణ గమనానికి ఆటంకంగా నిలిచింది.

మంచివాడు-చెడ్డవాడు, దేవుడు-రాక్షసుడు, స్త్రీ-పురుషుడు, వీటితో పాటు ఆధునిక వలస చారిత్రిక దృక్పథం వల్ల సంక్రమించిన ఆర్యుడు-ద్రావిడుడు, హిందూ-ముస్లిం లాంటి ద్వంద్వాలు ఎక్కడా ఏరోజూ కలవని, కలవలేని బైనరీ ఆపోజిట్స్ గా కుదించబడ్డాయి. దీంతో హిందూవాదులు రాముణ్ణి పుంస్త్వం, పౌరుషం, జాతీయతలతో కూడిన హిందూదేవుడిగా కుదించారు. ద్రావిడవాదులు రాముణ్ణి ఆర్యుడిగా నిర్వచించారు. వీరి చారిత్రక దృక్పథం వలసవాదం వల్ల పుట్టిన కుహనా సిద్ధాంతమని తేలినా తమ వాదాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు.

కానీ సనాతన ప్రాచ్య దృక్పథం ప్రకారం ద్వంద్వాలు పరస్పరాశ్రితాలు. టావోఇజం ప్రకారం ఏదైనా తీవ్రస్థాయికి చేరినప్పుడు పూర్తి విరుద్ధమైనదిగా మారిపోతుంది. భారతీయ పురాణాలు వైరభక్తి అనే దృక్పథాన్ని సృష్టించాయి. దీని ప్రకారం నువ్వు ఎవరినైనా ద్వేషించడమంటే వారితో లయం కావడమే! తన కోపమె తన శత్రువు అన్నది అందుకే! రాక్షసులందరూ విష్ణువులో లయిస్తారు. రామాయణంలో మారీచుడు అంటాడు – రేఫతో మొదలయ్యే ప్రతిపదమూ తనకి రాముడినే గుర్తుకు తెస్తోందని, అంతటా రాముడే దర్శనమిస్తున్నాడని రావణుడితో అంటాడు. అందుకే భగవంతుణ్ణి నిందిస్తున్నట్టు పైకి కనబడుతూ లోపల స్తుతిని యిముడ్చుకున్న వ్యాజస్తుతి శతకాలు ఎన్నో వెలువడ్డాయి. కాసుల పురుషోత్తమకవి రాసిన ఆంధ్రనాయక శతకం అటువంటిదే. తమిళకవి కంబన్ రాసిన రామాయణం ఇరావతారంలో శూర్పణఖ రామభక్తురాలిగా కనిపిస్తుంది. ఆమె లక్ష్మిని పూజించి గొప్ప సౌందర్యవతిగా మారుతుంది. విష్ణుద్వేషులుగా కనబడే రాక్షసులు విష్ణువులో లయించడం సాధారణమైన పురాణ కథనం. రాక్షసస్త్రీకి కూడా అటువంటి స్థానం కల్పించాడు “దేశీ” కవి.

అందువల్లనే గాంధీ మహాత్ముడు మొదటిగా సంస్కరించవలసింది వలసవాదిని, సామ్రాజ్యవాదినే అని భావించాడు. ఈ భావన శత్రువును అభావం చేసింది. ఇది రామాయణ సంస్కృతే.

అందుకే కువెంపు అనే ఆధునిక కన్నడ రచయిత శూద్రతపస్వి నాటకంలో రాముణ్ణి ఆధ్యాత్మిక సంస్కర్తగా చిత్రించాడు. శూద్రుడు తపస్సు చేయడం అరిష్టమని, అందువల్ల శంబూకుడిని హతమార్చాలన్న బ్రాహ్మణుడిలోని “అహంభావం” అంతరించేలా చేస్తాడు రాముడు. అహంభావం ఆత్మజ్ఞానానికి అడ్డంకి అని అద్వైతవేదాంతం బోధిస్తుంది. ఈ వేదాంతబోధకి అనుగుణంగా శంబూకవధ కథని మార్చేశాడు కువెంపు. రామాయణకథని బహుళరీతుల్లో చెప్పడం సహజమేనని బహుళ రామాయణాలు ఉన్నాయని అన్నాడు. కువెంపు పధ్ధతి సనాతన అధ్యాత్మరామాయణానికి కొనసాగింపు. ద్రవిడ దృక్పథంతో తెలుగులో త్రిపురనేని రామస్వామిచౌదరి, తమిళంలో కె. తంగరాజు, శంబూకుడిని తిరుగుబాటుదారుగా చిత్రించారు. రాముడిని బ్రాహ్మణుల మాట జవదాటలేని రాజుగా చిత్రించారు. దీనికి పూర్తి భిన్నంగా బ్రాహ్మణుడినే సంస్కరించిన ఆత్మజ్ఞానిగా రాముణ్ణి చిత్రించాడు కువెంపు. ఇది సనాతన దృక్పథానికి ఆధునికమైన ముక్తాయింపు. ఎందుకంటే అధ్యాత్మ, తులసీ రామాయణాల ప్రకారం రాముడు సాక్షాత్తూ పరమాత్మయే.

ఆంధ్ర, తమిళనాడులకి భిన్నంగా కర్ణాటకలో రాంమనోహర్ లోహియా ప్రభావం ఎక్కువ. చారిత్రక పురుషులకన్నా పురానపురుషులు ప్రభావశీలురని లోహియా భావించాడు. పురాణాలని అర్ధం చేసుకోవడానికి ఆధునిక సంకుచిత హేతు దృక్పథం సరిపోదని గుర్తించినవాడు లోహియా. ఎందుకంటే ఆయన గాంధీ అనుయాయి. గాంధీ ఆరాధించిన రాముడు కబీర్ రాముడు; సామరస్యధోరణికి ప్రతినిధి.

మనిషి హేతుబుద్ధికి చాలా పరిమితులు ఉన్నాయని పురాణాలు చాటుతాయి. ఎందుకంటే మనిషి జ్ఞానపరిధిలోకి రాగలిగినది కొంత మాత్రమే. అనంతవిశ్వంలో అనంతజన్మలలో సంభవించిన సంఘటనలన్నీ అతనికి తెలియవు. కానీ బిందువుకీ సింధువుకీ విడదీయరాని సంబంధం ఉంది. అందుకే పురాణ ఇతిహాసాలలో కేవలం ప్రత్యక్ష సంఘటనలే కాక, ప్రతి సంఘటనకీ అనేక కారణాలని చూపడం జరుగుతుంది. గతంలోని శాపాలూ, గతజన్మలోని శాపాల కథలని కూడా ప్రస్తావిస్తాయి పురాణాలు. తులసీ రామాయణంలో ఇతర పురాణాలలో రామావతారానికి కూడా చాలా కారణాలు చెప్పబడతాయి. అందువల్ల కార్యకారణ పరంపర పూర్తిగా అర్ధం చేసుకోవడం అసాధ్యం. అందుకే వైవిధ్యభరితమైన కథనాలు సాధ్యమౌతాయి. ఒకేఒక కథనం అసాధ్యం (రాముని అవతారాలు కూడా తిరిగి తిరిగి అనంతంగా సంభవిస్తాయి.) వేలాది రామాయణాలూ, అనంత రామకథలూ అందుకే సాధ్యమౌతాయి. ఆకథలూ కథనాలూ సాంస్కృతిక సరిహద్దులను చెరిపేస్తాయి. సీతనీ ఫాతిమానీ, రాముణ్నీ రహీమునీ పర్యాయపదాలుగా మారుస్తాయి. అందుకే రామాయణం అంతులేని ప్రయాణం, అనంతమైన బహుళత్వంతో కూడిన వ్యక్తీకరణ.

*****

రాణి శివశంకర్ శర్మ

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా చక్కని వ్యాసం. శర్మగారికి అభినందనలు

 • బహుముఖమైన సత్యాన్ని ఆవిష్కరించిన వ్యాసం. అయితే రామునికి రాజ్య కాంక్ష అంటగట్టడం సమంజసంగా లేదు. రాముడు తాను ధర్మమని నమ్మినది మాత్రమే ఆచరించినాడు. ఆ ధర్మము దేశకాలాబద్ధ మైనదా కాదా అన్నది వైయక్తికమైన దృక్పథము.

  ఆర్. యస్. సుదర్శనం గారు తమ విమర్శ వ్యాసాలలో చెప్పినట్లు గా వ్యక్తి ధర్మము వేరు, వ్యవస్థా ధర్మము వేరు. వ్యక్తిధర్మము – సత్యాచరణము, పరస్పర విశ్వాసము, అకుటిలత, మనో నిగ్రహము వంటివి సర్వ దేశకాలములకు వర్తించేవి. రాక్షస సంహారము, జనవాక్య పాలన, వంశగౌరవము, వర్ణాశ్రమ ధర్మములు, ఏకపత్నీ వ్రతము మొ.. వ్యవస్థాధర్మము – దేశకాలానుగుణముగా మారేవి; అయితే వీనిని కూడా కొందరు నిత్యమైనవిగా భావంచవచ్చు. అందు వల్లనే వైయక్తికమైన దృక్పథమన్నది.

  వాల్మీకి అందించిన రాముడు అన్న మూలద్రవ్యాన్ని గ్రహించి మనకిష్టమైన రీతిలో మలచుకొంటాము. కనుకనే వాల్మీకి రాముడు వేరు, తులసీదాసు రాముడు వేరు, తమిళుల రాముడు వేరు, తెలుగుల రాముడు వేరు, జానపదుల రామడు వేరు ( సీతా యుక్తంగా). కాని కాలాతిక్రమంగా బహుజనాదరణ పొందినవి మాత్రమే నిలువ గలవు. రామాయణ కల్ప వృక్ష రచనానంతరము విశ్వనాథ వారు ‘నా రాముడు’ వ్రాయడంలోని రహస్యమిదే.

 • బహుముఖమైన సత్యాన్ని ఆవిష్కరించిన వ్యాసం. అయితే రామునికి రాజ్య కాంక్ష అంటగట్టడం సమంజసంగా లేదు. రాముడు తాను ధర్మమని నమ్మినది మాత్రమే ఆచరించినాడు. ఆ ధర్మము దేశకాలానవచ్ఛిన్నమైనదా కాదా అన్నది వైయక్తికమైన దృక్పథము.

  ఆర్. యస్. సుదర్శనం గారు తమ విమర్శ వ్యాసాలలో చెప్పినట్లు గా వ్యక్తి ధర్మము వేరు, వ్యవస్థా ధర్మము వేరు. వ్యక్తిధర్మము – సత్యాచరణము, పరస్పర విశ్వాసము, అకుటిలత, మనో నిగ్రహము వంటివి సర్వ దేశకాలములకు వర్తించేవి. రాక్షస సంహారము, జనవాక్య పాలన, వంశగౌరవము, వర్ణాశ్రమ ధర్మములు, ఏకపత్నీ వ్రతము మొ.. వ్యవస్థాధర్మము – దేశకాలానుగుణముగా మారేవి; అయితే వీనిని కూడా కొందరు నిత్యమైనవిగా భావంచవచ్చు. అందు వల్లనే వైయక్తికమైన దృక్పథమన్నది.

  వాల్మీకి అందించిన రాముడు అన్న మూలద్రవ్యాన్ని గ్రహించి మనకిష్టమైన రీతిలో మలచుకొంటాము. కనుకనే వాల్మీకి రాముడు వేరు, తులసీదాసు రాముడు వేరు, తమిళుల రాముడు వేరు, తెలుగుల రాముడు వేరు, జానపదుల రాముడు వేరు ( సీతా యుక్తంగా). కాని కాలాతిక్రమంగా బహుజనాదరణ పొందినవి మాత్రమే నిలువ గలవు. రామాయణ కల్ప వృక్ష రచనానంతరము విశ్వనాథ వారు ‘నా రాముడు’ వ్రాయడంలోని రహస్యమిదే.

  • రాముడి రాజ్యకాంక్షని, రాజ్యవిస్తరణని తప్పు పట్టింది సీత మాత్రమే.

   • నా దృష్టిలో రాజ్యకాంక్ష, రాజ్యవిస్తరణ అనడమే పొరపాటు; సీత వెలిిబుచ్చినది కూడా ధర్మ సందేహమే.

    రామాయణ కాలంలో భారతకాలంలో వలె సామ్రాజ్యాలు, సామ్రాట్టులు లేరని కొందరు చరిత్రకారుల కథనం – small kingdoms with flexible borders. రావణవధానంతరం కూడా లంక రామరాజ్యంలో భాగం కాలేదు.

   • 1) ‘‘ఇక్ష్వాకూణామ్ ఇయం భూమిః స శైలవనకాననా’’ ఈ భూమి అంతా కొండలు, వనాలు, అడవులతో సహా ఇక్ష్వాకువంశజులదే అని వాలి చనిపోయేటప్పుడు హితబోధ చేసాడు కదా? దానికి వాలి కూడా ఒప్పుకున్నాడు కదా? ఇక రాజ్యం ఏమిటి? కాంక్ష ఏమిటి?

    2) భరద్వాజుడు భరతుని సైన్యానికి తన తపశ్శక్తి నంతా వెచ్చించి ఆతిథ్యమిచ్చింది రాజులతో స్నేహం చేసినందువలన కాదు, అతడి పుణ్యం, పాపం రెండూ సంపూర్ణంగా లుప్తమై పోవాలని. సౌభరి ఒకేసారి 50 రూపాలు ధరించి తన పుణ్యాన్నంతా ఖర్చుచేసుకుని మోక్షం పొందినట్లుగా భరద్వాజుడు కూడా తపశ్శక్తి వలన కలిగిన పుణ్యాన్నంతటినీ అలా లుప్తమయ్యేలా చేసుకున్నాడు. విషయాన్ని మనకు కావలసిన కోణంలో వ్రకీకరించకూడదు. మొత్తం చదవాలి.

 • In India at least, the story of the state is closely intertwined with that of Rama. Ramarajya carries with it an undefined welfare feeling in people. Dr. Kesavareddy titled one of his novels as “Ramudundadu, Rajjimundadi” which well proves this view point. Only in the age of modern history this is challenged in conceptual world and the historical world view itself is now being challenged by post modernist ideologies. Ramayana discusses the state and its formation within a culture including by discussion and debate all the opposing views of state. But the prevailing modern reality introduced and developed limited national interests as dominating world views and thus opened doors for an imperialist expansion of state thus decimating the ideal of welfare state. So Ramayana may never lose its lustre as a proponent of welfare of people as a single human species occupying this planet.
  Whether we can contrast the modern expansion of state with the ideology of state formation in the epic is a controversial question.

 • బాపు రమణలు రంగనాయకమ్మ కలిసి,
  రామాయణాన్ని పూజా విగ్రహంగా మార్చేశారు.

  • వారికి ముందు రామాయణంపై సినిమాలే రాలేదు, రచనలే రాలేదు, కావ్యాలే రాలేదు, రామాలయాలే లేవు. రాముడి ఆలయాలే లేవు. పూజావిగ్రహమే కాదు. రాముడి పైన భజనలేలేవు, కీర్తనలే లేవు. త్యాగరాజు లేడు, నాటకాలూ లేవు, పద్యాలూ లేవు. బాపు రమణలు, రంగనాయకమ్మ వ్రాసినవి, తీసినవి తెలుగులోనే అయినా భారతదేశ ప్రజలందరికీ అర్థమైంది, అర్థమై రామాయణాన్ని భారతదేశం, ప్రపంచం పూజించడం మొదలుపెట్టింది. ఇంతా చేసి బాపు తీసింది వాల్మీకి రామాయణమే కాదు……. ఏమిటీ వక్రకోణాలు? అసలు వారి సినిమాలు, రచనలు చదివిన, చూసిన సామాన్యప్రజలెంతమంది? వారు అవి చదివే, చూసే రాముడిని పూజించడం మొదలుపెట్టారా?

 • కౌటుంబిక విలువలను- కుటుంబంలో తండ్రి, ఆ తర్వాత పెద్దన్న అనే విలువలను ప్రచారంలో తేవడానికి రామాయణం చేసిన కృషిని గురించీ; రాజ్యం, నాగరికతలు “ప్రకృతి”కి వ్యతిరేకమనే అవగాహనను ఈ వ్యాసం కొత్తవెలుగుతో చర్చిస్తున్నది.

  • ఎందరో సనాతనులైన మహానుభావులు, అందరూ రామాయణం పై కొత్త వెలుగులు ప్రసరించినవారే.కొందరు ఆధునికులు రామాయణాన్ని మార్కెట్లో కేవలం ప్రదర్శన వస్తువుగా మార్చేశారు.తర్కాన్ని పరి హరించారు. దానినే సంపూర్ణం అన్నారు. అందుకే ఆ అజ్ఞానపు చీకటి తొలగించడానికి నేనీవ్యాసం రాయవలసివచ్చి౦ది నాగరాజు గారూ!

 • chala bagundi vyasam, kanee oka sandeham sharma garu… sita eppudoo rajya vistarana kankshani samrdhinche maatalu analeda?
  e sandarbham lonoo aa patra himsanee, yudhdhannee vimarsha chesinatlaitey – naa uddesham lo idi goppa discovery.

  • మంచి ప్రశ్న కళ్యాణి గారూ.సీత రాజ్య విస్తరణని కోరిన సందర్భం ఎప్పుడూ లేదు. ఆత్మరక్షణ కోసం హింస తప్పని సరైన సందర్భంలో మాత్రమే హింసని సీత అంగీకరించింది.తనని రక్షించడానికి రాముడు ఆయుధం పట్టవలసిన ఆవశ్యకతని అంగీకరించింది.హనుమంతుడు తన వీపుపై ఎక్కించుకొని మోసుకుపోతాను అంటాడు కానీ సుదూరానికి సముద్రమార్గంలో సురక్షితంగా నిర్భయంగా తీసుకువెళ్లడం,ఆ సందర్భంలో రాక్షసుల ముప్పు నివారించడం అసాధ్యం అని సవివరంగా హేతుబద్ధంగా హనుమ కి వివరిస్తుంది జానకి. కనుక యుద్ధం ఎలాగూ తప్పదని ఆమె అభిప్రాయం.
   ఆత్మరక్షణ నిమిత్తం కొంత హింస తప్పకపోవచ్చు కానీ అనవసరంగా రాజ్య విస్తరణ కోసమో,భయపెట్టడానికో అపరాధం చేయనివారిని చంపడం హింసించడం తప్పు అని సీత అన్న మాట. [ఇదే భావం వాలి, అతని భార్య తారలాంటివాళ్ల మాటలలోను ధ్వనిస్తుంది.]

 • ఇంతచక్కటి విశ్లేషకాత్మకమైన వ్యాసానికి, పేరు అతకలేదు. రామాయణంలో సాంఘీక దిక్కారం, భావజాలసంఘర్షణ లాంటి టైటిల్ ఉండాలి.

  Because the scope of this article is well beyond సీత.

 • అవునండీ శర్మ గారూ,,మీకసలు ఇంత శోధించి సాధించి సవివరంగా సంక్లిష్టంగా ఇంపుగా అక్కడక్కడ కంపుగా రాయాలని ఎందుకనిపించింది??ఈ రతల ద్వారా మీరు ఎవరిని ఉద్దరించాలనుకొన్నారు??
  ఏది ఏమైనా మీలోని విషయానికి ( matter) కి నా అభినందనలు.

 • అనేక రామాయణాలలోని వివరాలను సంకలనం చేసి చెప్పటం బాగుంది. రామాయణ కథలోని పలు భాగాలను జనబాహుళ్యం తమ జీవితాలకు అనుగుణంగా అన్వయించుకొని క్రొత్త కథలుగా మలచాయి అనటం కూడా బాగుంది. రామాయణ కథకు, ఇతర మతాలలోని కథనాలకు ఉండే పోలికలను సందర్భానుసారంగా చెప్పటం ఆయా సాహిత్యాలపై రచయితకు ఉన్న అవగాహనను ప్రతి బింబిస్తున్నది.
  అధ్యాత్మ రామాయణం, మాయ సీత ప్రస్తావన, మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ: అని చెప్పటం గురించిన ప్రస్తానన, పలు రామాయణాలను అన్నిటినీ ఒక ఆధునిక పరిశీలనా దృష్టితో మిళితం చేయటం, వాటిని అన్నిటినీ నిరాకరిస్తూ ఒకే రామాయణాన్ని ప్రొమోట్ చేయటం పట్ల నిరసన వెలిబుచ్చటం బాగున్నాయి.
  కబీర్ దాసు రాముడు, గాంధీ రాముడు, అనటమూ, విశ్వనాథ నా రాముడు అని రాసిన ప్రస్తావన ( కామెంట్లలో లెండి) అవి కూడా చాలా నచ్చాయి.
  ఒక ప్రధానమైన లోపం మాత్రం తట్టింది నాకు-దీనిలో అంతటా రాముడు సీత మానవులే.
  అలా ఎందుకు, అసలు?
  మారీచుడితో, రావణుడు, విభీషణుడు, హనుమంతుడు, శబరి, గుహుడితో సహా- కబీరుకు, గాంధీకి, వినోబాల నుండి ఇవాల్టి సగటు హిందువు వరకూ దేవుడిగా తప్ప మనిషి లాగా అగుపడని రాముడు- అనేక రామాయణాల వర్ణనల ప్రకారమే పాయసం తింటే పుట్టటం నుండి అనేక అసాధారణతలతో – మనిషి వేషంలో వచ్చిన దేవుడు- వట్టి మనిషిగాను, రాజు గాను, కేవల సామాజికుడు గాను కనబడటం ఈ వ్యాసపు లోపం అనిపిస్తున్నది.
  వేదాలకు, ఉపనిషత్తులకు- వాటి దర్శనానికి, భారత-భాగవత-రామాయణాలకు ఏదో ఒక మౌలికమైన సంబంధమే లేకపోతే, అవి హిందూమత గ్రంధాలు అనబడేవి కావు కదా, అసలు? వాటి తాత్వికత లోను, ఈ కథల్లోను కామన్ గా ఉన్న సూత్రం ఏమిటో ఈ వ్యాసం చర్చించలేదు. భార్యను పోగొట్టుకుని తిరిగి సంపాయించుకున్న అనేకమంది రాజులు, సత్యం కోసం భార్యల్ని పణం పెట్టిన రాజులు ఇందరు ఉండగా, రాముడు మాత్రమే దేవుడు ఎందుకయ్యాడు; రామాయణం ఒక్కటే పవిత్రం ఎందుకు అయ్యింది? వాళ్లంతా వట్టి మనుషులు, మహా అయితే గొప్ప రాజులు ఎందుకు అయ్యారు?
  -ఆ కనెక్టు లేకపోవటం వల్ల మాత్రమే ఈ వ్యాసం ప్రాచీన హిందూమతపు విశ్వాసాలను ఆధునిక పాశ్చాత్య దృష్టితో విశ్లేషించినట్లు, కొంచెం అసంపూర్ణంగా తోస్తుంది.

  • చాలామంది గుర్తించని అసలు ప్రమాదం భారతీయ గ్రంధాలు అన్నిటినీ మతపరమైనవిగా ఆధ్యాత్మికమైనవిగా చూడడం . దీనిలో ఓరియంటలిజం పాశ్చాత్య వలసవాద ప్రభావం ఉంది.
   భారతీయులు పూర్తిగా ఆధ్యాత్మిక మత పరదృష్టి గలవారు అందుకే లౌకికంగా పనికి మాలినవారు తమని తాము పాలించుకోలేరు అని వలసవాద దృష్టి.దానిలో భాగంగా భారతీయులు ఆధ్యాత్మికులు అని పొగిడారు కూడా.
   మొత్తంగా భారతీయులు ఇర్రెషనల్ హేతుబుద్ధి లేనివారు పాశ్చాత్యు లు ఆ మేధావులు ప్రచారం చేశారు.దానిలో భాగంగా భారతీయులు సెన్సెస్ ఇంద్రియ పరిమితులకి లోబడినవారు అని కూడా ప్రచారం చేశారు మరికొందరు వెస్ట్ మేధావులు.
   పొగడతాలలోను విమర్శలోను కూడా భారతీయులని లౌకిక హేతు బుద్ధి లేనివారుగా ఫిక్స్ చేశారు
   ఈపాశ్చాత్య ప్రభావం వల్ల భారతీయ గ్రంధాలు అన్నిటినీ ఆధ్యాత్మికంగా వ్యాఖ్యానించడం మొదలైంది.అదే భారతీయత గా భావించబడింది.ఈవలలో ఇండియన్స్ కూడా చిక్కుకుపోయారు.
   అందుకే అభిజ్ఞాన శాకుంతలం ని పాశ్చాత్య భాషలోకి అనువాదం చేసిన విలియం జోన్స్ శృంగార వర్ణనలని తొలగించాడు. కొన్ని కావ్యాలు శృంగారం ఎక్కువగా ఉంది అని నిషేధించబడ్డాయి కూడా.రాధికా సాంత్వనం.
   అదే సమయం లో పాశ్చాత్యులు శకుంతలలో ఆశ్రమ ఆధ్యాత్మికత ను మాత్రమే చూసారు.కొందరు భారతీయ పండితులు కూడా ఆదృష్టిని సాగదీస్తూ శకుంతల లో పూర్తి ఆధ్యాత్మికంగా వ్యాఖ్యానించారు. యల్లంరాజు శ్రీనివాసరావు గారు అలాగే..
   ఈ పాశ్చాత్య దృష్టి కుహనా ఆధ్యాత్మికత గా భారతీయులని మింగేసింది.గీత గోవిందంలో కూడా పూర్తి ఆధ్యాత్మికత వేదికారు.
   నిజానికి పురుషార్థాలు నాలుగు..రామాయణంలో త్రివర్గ ప్రధానం.మోక్షం కోసం ఆధ్యాత్మిక రామాయణం రచించబడింది.
   మనిషి జీవితం రామాయణం కూడా ఒక ప్రయాణం .
   రామాయణం ని కేవలం మత ఆధ్యాత్మిక
   గ్రంధం గా చూడడం పాశ్చాత్య ఓరియంటల్ దృష్టి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు