ఇంతకీ టాగూర్ ఏమంటాడు?!

సజ్దనుడికి సందేహం కలిగినప్పుడు మాత్రమే అంతఃకరణ లేదా హృదయం ప్రమాణంగా ఉంటుంది.

క తెలుగు సినిమా లో హీరో గుండె మీద చెయ్యి పెట్టుకుని నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తా అంటూ ఉంటాడు. అంటే నా హృదయం ఏం చెప్తే అది చేస్తాను అని బహుశా అర్ధం అనుకుంటాను. ప్రతిభావంతుడైన సంభాషణల రచయిత కొత్తగా ప్రవేశపెట్టిన ఒక నాయకలక్షణం అది.
తర్వాత కాలంలో చాలా మంది సరదాకి ఆ డైలాగ్ వాడుతూ ఉండేవారు.
అలా ఎవరికి వారు వారి హృదయం చెప్పినట్టే చేస్తే మంచిదే కానీ హృదయం అంత సులువుగా చెప్పేస్తుందా. లేదా పిలవగానే పలికేస్తుందా అసలు అంత సులువుగా స్పందించడం కూడా చేసెయ్యగలదా?!
ఏమో ఇది ఎవరికి వారు తేల్చుకోవలసిన వ్యవహారం. బుద్ధి తాలూకు లెక్కల ప్రమేయం లేకుండా మన హృదయం ఎక్కడయినా, ఎప్పుడైనా కరుగుతోందా అని గుండెమీద చెయ్యపెట్టుకుని ప్రశ్నించుకుంటే తప్ప జవాబు దొరకదు.
సరే అది కదలడంతోపాటు కరుగుతోంది. మనకు ఏం చెయ్యాలో చెప్తోంది. ఎప్పుడంటే… అదా ఇదా అని సందేహం కలిగినప్పుడు హృదయం ఏం చెప్తే అదే చెయ్యాలి. అని పెద్దలు కూడా చెప్పేరు.
దాన్నే అంతఃకరణప్రవృత్తి అన్నారు. ఐతే ఆ అంతఃకరణ యొక్క మాట వినేటప్పుడు ఇంకా దేన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి
సరిగ్గా ఇక్కడే కాళిదాసనే భారతీయ మహాకవి ఓ మంచి మాట అంటాడు
సతాంహి సందేహపదేషు వస్తుషు
ప్రమాణమంతఃకరణప్రవృత్తయః
ఏదైనా సందేహం కలిగితే అంతఃకరణ ఏం చెప్తే అదే ప్రమాణం అన్నాడు. అంటూ కాళిదాసు కదా దానికొక ‘క్లాజ్’ పెట్టేడు.
ఇది అందరికీ కాదు సుమా సజ్జనులకు మాత్రమే అని.
ఐతే ఎవరు సజ్జనులు? ఏది దానికి అంటే సజ్జనత్వానికి కొలత?
సరిగ్గా దీనికి ఎంతో వివరంతో కూడిన సమాధానం ఒకచిన్న వ్యాసం లో టాగూర్ చెప్తాడు
ఆ వ్యాసం పేరే భావుకత – పవిత్రత.
మనం సాహిత్యంలో, కళారూపాలలో, వాటి ఆస్వాదనలో అవసరమనుకునే భావ ప్రాధాన్యత ను లేదా భావుకతను అతనేమీ తక్కువ చెయ్యడు కానీ అది మాత్రమే కలిగిఉండడం అంతిమఫలం కాదంటాడు
ఒక కథ చదివి లేదా ఒక పాట విని ఒక కవిత్వం చదివి పులకితులు కావడం ఆ అనుభూతి లో మైమరవడం లేదా ఓలలాడడం అలా ఉండగలగడం మంచి విషయమే లేదా గొప్పవిషయమే.
 దానిప్రయోజనం ఏమిటీ అన్నప్పుడు దాని వలన ఎద మెత్తనౌతుందని, మృదువుగా మారిన ఆ హృదయం ఎదుటిమనిషి అవస్థలు చూసి స్పందించగలదని ఆవిధంగా దయార్ద్రం అవుతుందని ఒక విశ్లేషణ లేదా నిర్ధారణ జరిగి ఉంది.
ఎదమెత్తనౌటకై
సొదకుందరా 
అంతమదిగల
అహమ్మెల్ల తొలగి
పోవునురా
అంటాడు ఒక కవి.
నీ హృదయం మృదువుగా మారడానికి దుఃఖం నుంచి పలాయనం చెందడం కాక నిలిచి అనుభవించడం నేర్చుకో అప్పుడు ఎదుటిమనిషిని కలుపుకోగలుగుతావు అంటాడు
ఇదంతా నిజమే. స్పందించడం చేతనైన గుండెకు లోకాన్ని అక్కున చేర్చుకునే శక్తి రావచ్చు.
ఇప్పుడు టాగూర్ దీనికి  మరో పై మాట చెప్తున్నాడు
“చెట్టు రెండు రకాలు గా ఆహారాన్ని సంగ్రహించుకుంటుంది. ఒకటి దాని ఆకుల ద్వారా గాలి, వెలుతురు నుంచి బలం పొందుతుంది.
ఇంకొకటి దాని వేళ్ల ద్వారా అది ఆహారాన్ని లాక్కుంటుంది.
ఒకప్పుడు వాన కురుస్తున్నది. ఒకప్పుడు ఎండ కాస్తున్నది. ఒకప్పుడు చలిగాలి కొడుతున్నది. ఒకప్పుడు వసంతవాయువు వీస్తున్నది. పల్లవసమూహం చంచలమై వాటినుంచి తమకు కావలసినది తీసుకుంటున్నది. తర్వాత అవి ఎండి రాలిపోతున్నాయి. తిరిగి కొత్తచిగుళ్లు మొలకెత్తుతున్నాయి
కానీ వేరుకు చాంచల్యం లేదు. అది సర్వదా స్తబ్దమై, ధృఢమై, లోతుగా పరివ్యాప్తమై తన ఆహారాన్ని తన రహస్యఫలితంగా సంపాదించుకుంటుంది.
మనకు కూడా ఆ వేరు, ఆకులవంటి రెండు దిక్కులున్నాయి. మన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఈ రెండు దిక్కులనుంచీ పొందవలసిఉంటుంది
వేరు దిక్కు నుంచి పొందడమే ప్రధానమైనపని. ఇది భావము లేదా భావుకత యొక్క దిక్కు కాదు. స్వభావం యొక్క దిక్కు.
భావం హృదయం నుంచి పుట్టేది. హృదయం ఎంతలో మారిపోతూ ఉంటుంది? ఇవాళ దానికి ఏ విషయం వల్ల తృప్తి కలిగితే రేపు దానికి ఆ విషయం మీద విరక్తి కలుగతుంది. దానికి పోటూ పాటూ ఉన్నాయి. ఒకప్పుడు ఉల్లాసమూ, ఒకప్పుడు క్లాంతీ.
చెట్ల ఆకుల వలే దాని వికాసం ఈ రోజు నూతనంగా ఉంటుంది. రేపు జీర్ణమై పోతుంది. ఈ పల్లవిత చంచల హృదయం నవనవభావాల స్పర్శలకు వ్యాకులమై స్పందిస్తుంది ” అంటాడు
హృదయం నుంచి పుట్టే స్పందనను చెట్టు ఆకులతో పోలుస్తున్నాడు. అవి చెట్టు కు ఆధారమైన ఆహారాన్ని ప్రాణశక్తిని తీసుకుని అందించగలిగినా వాటికి స్థిరత లేదు. వాతావరణాన్ని బట్టి ఋతువులను బట్టి రకరకాలుగా మారిపోతూ ఉంటాయంటాడు. హృదయం కూడా అంతే
కానీ చెట్టు వేరు అలా కాదు. అది స్థిరంగా పాదుకుని రహస్యంగా ఆహారాన్ని నేలనుంచి స్వీకరించి చెట్టుకు అందిస్తుంది.
కాబట్టి శక్తి ని ఆకుల వేపు నుంచి కంటే వేరు దిక్కు నుంచి పొందడమే ప్రధానమైన పని అంటాడు.
ఇది మనిషికి స్వభావం గా గుర్తించమంటాడు
ఈ స్వభావం బలంగా స్థిరంగా ఉండడం వల్లనే చెట్టుకు బలమూ, స్థిరత చేకూరుతాయి. దీనితో అనుసంధానం వల్లనే ఆకులు నవనవం గా ఉంటాయి. చెట్టును వేరు నుంచి ఖండిస్తూ ఆహారం ఇచ్చే సూర్యకాంతే దాన్ని ఎండుకట్టెను చేస్తుంది అంటాడు
అంచేత మనిషి హృదయం తో పాటు లేదా అంతకన్న ఎక్కువగా తన స్వభావం విషయం లో జాగురూకుడై ఉండాలి
అంటే ఏం చెయ్యాలి
ఏం చెయ్యాలో చెప్పేముందు ఉన్నతమైన స్వభావం ఇలా ఉంటుందంటాడు
“అక్కడ చాంచల్యం ఉండదు. వైచిత్రి కోసం అన్వేషణ లేదు. అక్కడ మనం శాంతులమై ఉంటాము. స్తబ్దులమై ఉంటాము. అక్కడ జరిగేపనిరహస్యమైనది. మిక్కిలి లోతైనది. అది లోలోపలే శక్తిని ప్రాణాన్ని ప్రవహింపజేస్తుంది. అది మనలను నిలబెడుతుంది. పోషణ చేస్తుంది. తాను రహస్యంగా ఉంటుంది”
స్వభావం ఈ విధంగా దేనివల్ల మారుతుంది అంటే కేవలం నిష్ఠ వల్ల అంటాడు.
 అది అశ్రుపూర్ణమైన భావం యొక్క ఆవేగమూ ఆవేశమూ కాదు. అది నిష్ఠ. అది ఎక్కడ పట్టుకుని ఉంటుందో అక్కడే పట్టుకుని ఉంటుంది. కేవలం లోతునుంచి ఇంకా లోతుకు చొచ్చుకుని పోతుంది.”అంటాడు. అందుకే దాన్ని చెట్టు వేరుతో పోల్చాడు.
నిష్ట అంటే ఏమిటి. కొన్ని ధర్మాల పట్ల అవి సాంఘిమైనవి కాకపోయినా స్వయం నిబద్ధమైనవైనా సరే వాటి పట్ల నిష్ఠ. ఈ నియమ నిష్ఠ లు లేనివాడికి హృదయం ఏం చెప్తుంది. వాడి భావుకత వాడిని ఎక్కడకు ఈడ్చుకుపోతుందీ ఇదీ ప్రశ్న.
ఇదీ టాగూర్ చెప్తున్న ప్రకృష్టవచనం
స్వభావం నిష్టవల్ల సంస్కరించబడాలి. అప్పుడు మాత్రమే ఆ భావుకత వల్ల మంచి ఫలితం ముఖ్యంగా ఆ వ్యక్తి కి ఒనగూడతుంది.
అందుకే చెట్టు వేరు ఆకులు ఉదాహరణ చెప్పేడు
మనం కవులం సాహిత్యకారులమ ఈ నిష్ఠ అనే మాట పట్ల ఏమరుపాటుతో ఉన్నావేమో భావుకతకే పెద్ధ పీఠం అమర్చుకుంటున్నామేమో అని అనుమానం వచ్చింది ఇది చదివినప్పుడు.
ఆయన హృదయస్పందన కంటే నిష్టకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చినప్పుడు భావుకతను కాస్త కిందకి దింపినప్పుడు కనీసం ఈ హృదయం కూడా కరగని వాళ్ల మాటేమిటి
క్రమశిక్షణ మంచి అలవాట్లు స్వభావాన్ని ఎంతో కొంత తీర్చి దిద్దుతాయనే మాట మనకి పనికి రాని మాటగా మారిపోయినప్పుడు మళ్లీ కనీసపు మంచి అలవాట్ల కోసమేనా ప్రకృతి మనని ఏదో రూపాన పీడిస్తుందేమో
వృషభ గోమయం తిని ఆచమనం చెయ్యకుండా వచ్చిన ఉదంకుడు అవమానితుడయ్యీడు, శపించబడ్డాడు. (ఆచమనం అంటే చేతులూ కాళ్లూ కనుక్కుని నీళ్లు పుక్కిలించడం.) అని భారత కథ చెప్తే అది పురాణకథ గా పక్కనపెడతాం
కానీ చేతులుకడుక్కోమని, చెప్పులతో ఇంట్లోకి వెళ్లవద్దని, శుచిని పాటించమని భయపెట్టి ప్రకృతి ఇవాళ మనకి బోధించవలసి వస్తోంది.
నియమం అంటే మరో విషయం గుర్తొస్తోంది. ఒకసారి బెంగుళూరు నుంచి తిరుపతి కారులో వెడుతూ ఉన్నాం. మధ్యలో మంచినీళ్లు తాగి ఖాళీ అయిన ప్లాస్టిక్ నీళ్లసీసా కిటికీలోంచి బయటికి విసిరేను. ఇంతలో మా అబ్బాయి కారు పక్కకీ తీసి ఆపేడు. ఎందుకా అనుకునీ లోపు కారు దిగి వెనక్కి వెళ్లి నేను పారేసిన సీసా తెచ్చి కార్లో పక్కన పడేసాడు.
చెప్పొద్దూ సిగ్గుపడ్డాను
ఈ మాత్రం నియమాలైనా చాలు. చుట్టూ ఉన్న ప్రపంచమూ మనమూ కూడా బాగుపడడానికి.
నాకైతే టాగూర్ చెప్పిన నిష్ఠ ఇలా అనేక దశల వారీగా అర్ధం చేసుకుని పాటించవలసినదే అనిపించింది. ఐతే ఇందులో మూర్ఖత్వం, అజ్ఞానం అన్న దుర్లక్షణాలుతక్షణమే చేరడానికి సిద్ధంగా ఉంటాయి. వాటి పట్ల అప్రమత్తతే విద్య అన్నా చదువు అన్నా అని కూడా గ్రహించకతప్పదు.
ఇటువంటి నిష్టా పరుడైన వాడినే కాళిదాసు సజ్జనుడు అన్నాడు.
అటువంటి సజ్దనుడికి సందేహం కలిగినప్పుడు మాత్రమే అంతఃకరణ లేదా హృదయం ప్రమాణంగా  ఉంటుంది
అంతే కానీ ఎవడికి పడితే వాడికి గుండెమీద చరుచుకుని ఇక్కడేం చెప్తే అదే చేస్తాననే అర్హత ఉండదు అని రవీంద్రనాధ్ టాగూర్ మరీమరీ చెప్తున్నాడు.
*
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా గొప్పవిషయం ప్రస్తావించారు. వేరే మాటలలో సరిగ్గా ఇదే చెప్పారు కీర్తిశేషులు అన్నాదురై ( కానీ ఆచరించలేదు)

 • సజ్జనత్వం గురించి ఎంత మృదువుగా చెప్పారో ! మా లక్ష్మి గారు !

 • స్వభావాన్ని వేరుతో పోల్చటం బాగుంది.అది ఎప్పటికీ మారని అంతర్ నిష్ఠకు అన్వయించటం టాగూర్ కే చెల్లింది.మీ దృష్టితో మాకు అందించే ఈ శేఫాలికలు ఎప్పుడు గుపాళింపును,జ్ఞానాన్ని కలిపి అందిస్తాయి.మల్లెలచాటున కర్పూరం లా..💐🙏

 • లక్ష్మీ! మీరు పరిచయమైనప్పటినుంచి మీ మాటలు, మీ స్వభావం, మీ కథాసంకనాలు,మీ సత్యాన్వేషి,,మీరు భారతీయ నవలా దర్శనంలో విశ్లేషించిన కథలు అన్నీ చూస్తూవస్తున్నాను. మీరు ఎంచుకునె కథా వస్తువు సౌమ్యం, సరళం, సుందరం,ప్రేమ, బాధ, తపన ఇలానే ఉంటాయి. ఇక సారంగాలో వచ్చే ఫోస్టింగ్స్ చూస్తె బాణుడు, కాళిదాసు, టాల్స్ స్టాయి, టాగూరు, సినీమాలు, కథలు, కావ్యాలు, సంగీతం, పాటలూ! ఎక్కడా కోపం,ద్వేషం, ఉద్రేకం,ప్రతీకారం ఇలాంటివి లేశ మాత్రం కనిపించదు ప్రత్యేక్షంగా నూ, పరోక్షంగా నూ! చివరికి మనసులో ఒక మథనం , ఒక కనువిప్పు! మానవసంబంధాలు, జీవించేపరిధి చిన్నది గానూ చూసే ప్రపంచం విశాలంగాను!

  “నీ .హృదయం మృదువుగా మారడానికి దుఃఖం నుంచి పలాయనం చెందడం కాక నిలిచి అనుభవించడం నేర్చుకో అప్పుడు ఎదుటిమనిషిని కలుపుకోగలుగుతావు అంటాడు.” ఆణిముత్యం! అప్పుడే మనిషి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలబడగలడు.
  “”నాకు మనుషులంటే ఇష్టం. పనులకోసం మనుషులు అని ఎక్కువగా నమ్మే ప్రజలమధ్య నేను మనుషుల కోసం పనులు అని నమ్మడమే కారణం. అందుకే మనుషులుంటే అన్ని పనులూ పక్కన పెట్టేస్తాను” మహా ప్రపంచంతో సంధానం! ఇదే సామాజిక సంబంధం!!ఎంత సత్యం ఈ మాటలు.
  ఇక్కడ టాగూరు చెప్పిన మాటలు “చెట్టు — ఆకులు .. వేర్లు! వాటి వివరణ ఎంత బలంగా, ప్రేరణ, శక్తి నింపేదిగా ఉంది.

  స్వభావం నిష్టవల్ల సంస్కరించబడాలి. అప్పుడు మాత్రమే ఆ భావుకత వల్ల మంచి ఫలితం ముఖ్యంగా ఆ వ్యక్తి కి ఒనగూడతుంది.
  ఎవరు సజ్జనుడు !నిష్టాపరుడు ! అంతఃకరణం ప్రేరణతో నిశ్చయించుకోగలడు!!
  కాళిదాసునుండి …..టాగూరు…..మహావృక్షం—-ఆకులు…వేర్లు!!ఇలా వారిధి కట్టుకుంటూ వెళ్ళారు. నిష్ట అంటే ఏమిటి! ఆ పాలన అడుగడుక్కు నేర్చుకుంటూ ,సంస్కరించుకుంటూ ముందుకునడవాలి. ఇది కఠినమైన సాధనే!వేర్లు ఎంత బలంగా,ఎంత లోతుగా ఉంటే వృక్షం అంత ఏపుగా,కళ కళలాడుతూ ఏ గాలి వానకు వంగక నిలబడుతుంది. నిష్టతో సజ్జనుడై!!!మనఃపూర్వక అభినందనలు! మనసును సంస్కరించె మీ ఫోస్టింగ్స్ కు!! 👏👏👏💐💐💐

  • సుశీల గారూ
   ఎంత పెద్ద ప్రశంసాత్మక విశ్లేషణ
   ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు