ఆ సాయంత్రాల కోసం…

సాయంత్రాలన్నీ
ఏమైపోయాయి
నాలుగు గదుల మధ్య
నజ్జు నజ్జుగా మారి
బతుకుతున్నాం కానీ
సాయంత్రాలన్నీ తప్పిపోవడమేం
బాలేదు.

బడిగంట మోగగానే
భుజాన బుక్కులెత్తుకొని పరుగెత్తుకోచ్చిన సాయంత్రం
ఏ యాపచెట్టు కొమ్మకో వేలాడుతూ
కోతులమై దుంకిన సాయంత్రం
ఏ ఈతపండ్ల గోలలకో తగిలి
తియ్యటి జ్ఞాపకమైన సాయంత్రం
పత్తిగింజలో, మిరపచెట్లో పెట్టబోయి
ఉడుకుడుకు నీళ్ళతో స్నానం చేసి
అరుగుల మీద ఆకాశాన్ని పరుచుకున్న సాయంత్రం
నాలుగు అడుగులు నడుస్తూ
ఎక్కడెక్కడి మాటలనో తడుముకుంటూ
అందమైన సూర్యుణ్ణి
లోపలికి ఒంపుకొని లోపలి గాయాల్ని
కడుకున్న సాయంత్రం
ఎన్నెన్ని సాయంత్రాలను ఎవరెత్తుకెళ్తున్నారు?!

సాయంత్రాలన్నీ ఏలా వెళ్లిపోయాయి
ఎందుకు మనల్ని కాదని మనతో
లేకుండా పరిగెత్తుకొని వెళ్ళాయి.

అమ్మ నాటుకు పోయి
నొప్పుల పాటల్ని పాడుకుంటూ వచ్చిన సాయంత్రాలు
నాన్న శెలక్కాడికి పోయి
మాగేసిన తునికపండ్లను
సీతపలక పండ్లను తెచ్చిన సాయంత్రాలు
ఊరి అవతల కూతబెడుతూ
గొర్లను, బర్లను మర్లేసుకుంటూ వొచ్చిన సాయంత్రాలు
ఏ మనిషికోసమో
ఎదురుచూస్తూ వెళ్లిపోయిన సాయంత్రాలు
ఏ గోడల కొక్కాలకు వేలాడుతున్నాయి
ఏ చెట్లకొమ్మలకు ఇగుర్లుబెడుతున్నాయి

ఎంత బావుండేవి సాయంత్రాలు
మల్లెపూలు ముందేసుకుని
అల్లుకున్నట్టు
దుఃఖపు కథలతలలని నిమురుకునట్లు
మబ్బులన్నీ కిందికిదిగుతునట్టు
రంగురంగుల సాయంత్రాల్లో
గుండె ఎన్నెన్ని బొమ్మలేసుకుందో. .
ఈ సాయంత్రాలనన్నీ
దాచుకోవడానికి
ఎన్ని జిబిల స్టోరేజ్ అవసరమో కదా…

*

పేర్ల రాము

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • తప్పిపోయిన బాల్యపు సాయంకాలాలను
  జ్ఞాపకాలుగా వెతుక్కుంటున్న కవిత
  ఎత్తుగడ నుంచి ముగింపు దాకా
  అద్భుతమైన నడక.

 • అరుగు మీద ఆకాశాన్ని పరుచుకున్న సాయంత్రం..
  అందమైన సూర్యున్ని ఒంపుకుని గాయాలు కడుకున్న సాయంత్రం..
  ఎంత అద్భుతమైన వర్ణనలు..
  ఆ తునికి పండ్లు, బర్లను మల్లేసిన జ్ఞాపకాలు..
  ఇంకా ఆ ముగింపు వాక్యాలు మధురాతి మధురం.
  అందమైన అనుభవాలు ఆనందాలు అనిర్వచనీయంగా అమురుకున్న అద్భుతమైన ఆలోచన ❤️

  • చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీ స్పందన ప్రత్యేకమైంది. 🌿♥️

 • మల్లెలను ముందలేసుకున్నట్టు ఉంది కవిత తమ్ముడు

  • చాలా సంతోషం.. థాంక్యూ గోపన్న☘️

 • కవిత చాలా చాలా బావుంది తమ్ముడు💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు