ఆ యాదిలో, ఆ  మనాదిలో—సైరన్!

 సైరన్ నవల ఆవిష్కరణ దరిమిలా సారంగ కోసం అల్లం రాజయ్యతో చేసిన సంభాషణ

అల్లం రాజయ్య ఒక ఉద్యమ సంకేతం. చలన సంగీతం. తెలంగాణ అనుభవాల సంతకం. రాజయ్య కొత్త నవల “సైరన్” ఈ తరానికొక కానుక. రోజువారీ చరిత్రలోంచి పెల్లుబికిన ఉద్వేగం. ఈ నవల వెలువడిన సందర్భంగా అల్లం రాజయ్యతో ఏ.కె. ప్రభాకర్ ముఖాముఖీ. 

ప్రశ్న : సృజనాత్మక రచనా వ్యాసంగంలో దాదాపు రెండు దశాబ్దాల మౌనం తర్వాత మీ నుంచి అదే సడలని రాజకీయ చైతన్యంతో, అంతే స్ఫూర్తిమంతంగా సింగరేణి కార్మికోద్యమ  నవల ‘సైరన్’ వెలికి వచ్చింది. దీన్ని మీ రెండో రాకడగా భావించవచ్చా? 

జవాబు : సృజనాత్మక రచనా వ్యాసంగం కూడా నిరంతరం చలనంలో ఉండే సామాజిక ఆచరణే. రాయాలని ఒత్తిడి, ఆచరణలో అనివార్యమైనప్పుడు రాశాను. నా తరువాత రెండు తరాలు వారి వారి క్షేత్రస్థాయి అనుభవాలతో కంఠ స్వరాలతో ముందుకు వచ్చారు. వారందరితో కలిసి నడవడానికి, ఇంతకాలం బతకటానికి అవకాశం దొరికింది. వందలాది కథలు నవలలు వచ్చాయి, వస్తున్నాయి. వాటన్నిటిలో క్రియాశీలమైన మమేకత్వమే  స్ఫూర్తి. నాకు తప్పనిసరిగా రాయాలి అనిపించినప్పుడు రాస్తాను.  ‘సైరన్’ నవల రావటానికి – ఆ నవలలోని జీవితాన్ని వేగవంతం చేసిన వాళ్లే కారణం. వాళ్ళ పోరాట త్యాగాల ఆనవాళ్ళే  మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత యీ నవల మొదలు పెట్టడానికి కారణమయ్యాయి. సంపత్ రెడ్డి, ఇట్యాల కిషన్, నీలాదేవి,  మల్లయ్య, చంద్రమౌళి, మలుపు ప్రచురణలు బాల్ రెడ్డి వంటి అనేకమంది మిత్రులు, సాహితీ మిత్రులు నా చేత ఈ నవల రాయించారు. ఇట్లా రూపుదిద్దారు.

రెండో రాకడ అని కాదు గాని; 20 సంవత్సరాలుగా సమాజంలో వివిధ ప్రజా శ్రేణుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అధ్యయనం చేసే క్రమంలో దేశంలో విప్లవోద్యమం నిర్మాణమవుతున్న భిన్న ప్రాంతాలు తిరగడంతో సరిపోయింది. క్షేత్రస్థాయిలో ఆ చలనాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత కాలం పట్టింది.  ముందు ముందు వాటన్నిటినీ  రాతలోకి తేవడం సాధ్యపడుతుందో లేదో చూడాలి?

ప్రశ్న : ఎప్పుడో 1978 లో మొదలు పెట్టిన ‘సైరన్’ నవల 2020 వరకూ నలభై సవత్సరాల పాటు కోల్డ్ స్టోరేజ్ లో వుండిపోడానికి కారణం ఏంటి? ఈ గ్యాప్ వల్ల ‘సమకాలీనం’ కావాల్సిన నవల ‘చారిత్రికం’గా పరిణమించింది. ఇప్పుడు యే పరిస్థితులు మిమ్మల్ని ఈ నవలని పూర్తి చేయడానికి పురిగొల్పాయి?

జవాబు: మొదట గ్రామీణ ప్రాంతాల నుండి రైతాంగ పోరాటాలు వేగవంతం కావడంతో యాదృచ్ఛికంగా నాలాంటి వాళ్లు అందరూ రకరకాలుగా కరపత్రాల నుండి వార్తల దాకా రాయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే రైతాంగ జీవితాన్ని, ఆ జీవితంలో సంభవించిన చలనాన్ని వర్ణిస్తూ కథలు, నా తొలి నవల ‘కొలిమంటుకున్నది’ వచ్చాయి. ‘సైరన్’ నవలలో పేర్కొన్న విధంగా క్రమంగా సింగరేణి కార్మిక ప్రాంతాల్లోకి, ఆదివాసి ప్రాంతాల్లోకి పోరాటాలు విస్తరించాయి. తొలుత ఈ నేపథ్యంలో నేను కొన్ని కథలు రాశాను. ఈ నవల కూడా అప్పుడే మొదలు పెట్టాను. 1980 తర్వాత పి.చంద్, తుమ్మేటి రఘోత్తం రెడ్డి లాంటి సింగరేణిలో పని చేసేవాళ్ళు సాహిత్యం రాయటం ఆరంభించారు. మేము ముగ్గురం తరచూ కలుసుకుని సాహిత్యం గురించి ఆలోచించే వాళ్ళం. అలా ‘బొగ్గు పొరల్లో…’ కథలు తెచ్చాం. అబంపి ప్రచురణలు పెట్టి బండారు కిష్టయ్య, అల్లెంకి లచ్చయ్య గారు ప్రచురించారు. ఆ తర్వాత రఘోత్తం రెడ్డి  ‘నల్ల వజ్రం’ వచ్చింది. పి.చంద్ ‘శేషగిరి’ నవల రాశారు. సింగరేణి నేపథ్యంలో నాకన్నా  క్షేత్రస్థాయి అనుభవంగల సహచరులు రాస్తున్నందున అదే విషయం రాయాలనిపించలేదు. ఆ సిల్ సిలాలోనే పి. చంద్ అప్పటినుండి ఇప్పటిదాకా దాదాపు డజనుకు పైగా నవలలు, 30కి పైగా కథలు కూడా  రాశారు.  మునీర్ ‘మా తుఝే సలాం’ , ‘తరతరాల పోరు’  నవలలు రాశారు. నేను ఆదివాసి రైతాంగ విషయాల్లో కూరుకుపోయాను.

50 ఏళ్లు మూడు తరాల ప్రజల పోరాటం –  వర్గ కుల మత లింగ జాతి ప్రాంతీయ వైరుధ్యాలతో ఘర్షణ ఐక్యతతో – అనేక ఆటుపోట్లు అనుభవించింది. భారతదేశంలో బలమైన సాంప్రదాయిక తాత్వికతను, అభివృద్ధి నిరోధక మైన అర్ధం వలస – అర్ధ భూస్వామిక ఉత్పత్తి సంబంధాలను అర్థం చేసుకొని మొత్తం దేశ ప్రజలు పోరాడుతూ ఉత్పత్తి శక్తుల వికాసం గురించి, శాస్త్రీయ విజ్ఞానం గురించి నేర్చుకుంటున్నారు. అలాంటి దేశవ్యాపిత ప్రజాస్వామిక వర్గపోరాట ఆచరణ – అధ్యయనం సంవత్సర కాలంపాటు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన రైతు కూలీలు,  రైతులు, రైతు మహిళల్లో కనిపించాయి. నిజానికి ఈ ఉద్యమ క్రమం ‘సైరన్’ లో ఆరంభమైంది. అది తర్వాత దేశవ్యాపితమైంది. అనేక రకాలుగా అసత్యం సత్యంగా చలామణి అవుతున్న నేటి నయా ఉదారవాద కాలంలో – పరిణామ క్రమానికి మూలమైన గతితార్కిక చారిత్రిక సత్యం – దాన్ని ఆవిష్కరించిన ప్రపంచ కార్మిక వర్గం – స్థానికంగా సింగరేణి కార్మిక వర్గం – వాటి చేతన నా అనుభవంలో ఉన్నవి. అన్ని కాలాల్లో చరిత్రను నిర్మించే క్రమంలో ప్రజలు చరిత్రను అధ్యయనం చేస్తారు. దాని సారాన్ని తమ పురోగమనంలో తమతో నిలుపుకుంటారు. చరిత్ర సమస్త మానవ కార్యకలాపాలకు చోదక శక్తి … విడదీయరాని భాగం. కొనసాగుతోన్న కొనసాగాల్సిన విప్లవ ఆచరణలో భాగంగానే సైరన్ యిప్పుడు వెలువడింది.

ప్రశ్న :  1978 – 2020; ఈ నలభై సంవత్సరాల్లో సింగరేణి బొగ్గుగనుల్లో కార్మిక యాజమాన్య సంబంధాల్లో గానీ, ఉత్పత్తి విధానంలోగానీ, కార్మిక పోరాట పద్ధతుల్లో గానీ వచ్చిన మౌలికమైన మార్పులు ఏవి? వాటి వైపు తిరిగి కొత్తగా దృష్టి పెట్టడానికి ‘సైరన్’ తోడ్పడుతుందని భావించవచ్చా?

జవాబు : మౌలికంగా భారతదేశం అర్ధ వలస అర్ధ భూస్వామిక ఉత్పత్తి విధానం కొద్ది మార్పులతో కొనసాగిస్తున్న దేశం. 1978లో స్థూల దేశీయ ఉత్పత్తి వ్యవసాయం 65%, పరిశ్రమలు 24%, సేవా రంగం 11% గా ఉండేది.  2020 నాటికి అది  వ్యవసాయం 17 శాతం, పరిశ్రమలు 23 శాతం, సేవా రంగం 60 శాతంగా మారింది. భారతదేశం జీడీపీలో అమెరికా చైనాల తర్వాత మూడవ దేశం. కానీ జీవన ప్రమాణాల రీత్యా 101 వ స్థానంలో ఉంది. యూరప్ లో లాగా వ్యవసాయ ఉత్పత్తి రంగంలో ఇక్కడ పారిశ్రామికీకరణ జరగలేదు. పైగా వ్యవసాయ రంగం పెట్టుబడిదారుల మార్కెట్టై సర్వీస్ రంగంలోకి తరలించబడుతోంది. గ్రామీణ ప్రాంతంలోని వృత్తిపనివారు యూరప్ లో లాగా జాతీయ పెట్టుబడి దారులుగా అభివృద్ధి చెందక ఛిన్నాభిన్నం అయ్యారు. అగ్రకులాల వాళ్లే దళారీ  పెట్టుబడిదారులుగా బ్రిటిష్ వలస కాలం నుండి ఇప్పటిదాకా కొనసాగుతున్నారు. ప్రతి సామాజిక మలుపులో పై కులాలవారే సంపద, అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఈ రకమైన ఉత్పత్తి విధానంలో భాగంగా సింగరేణిలో అరకొర వసతులతోనే ఈ మధ్య కాలంలో మూడు రెట్లకు పైగా ఉత్పత్తిని  పెంచారు. కానీ కార్మికులను 70 వేల నుంచి 50 వేలకు కుదించారు. కాంట్రాక్ట్ కార్మికులను వేల సంఖ్యలో పెంచారు. బొగ్గును నేలలోనే  గ్యాస్ గా  మార్చి వెలికితీసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆస్ట్రేలియా లాంటి చోట వాడుతున్నారు. సింగరేణిలో మాత్రం ఓపెన్ కాస్టు గనులు తవ్వి వందలాది గ్రామాలను నామరూపాలు లేకుండా చేసి, వేలాది మంది ప్రజలను నిర్వాసితులను చేసి సింగరేణిని బొందలగడ్డగా మార్చారు. ప్రజల బాగోగులు పట్టని విధ్వంసకర ఉత్పత్తి నమూనా యిది. అప్పటి నుండి ఇప్పటి దాకా సింగరేణి కార్మికులు అనేక పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి మీద ఉక్కుపాదం మోపారు. అయినా కార్మికులు 56 రోజుల చరిత్రాత్మక సమ్మెతో దక్షిణ భారతదేశాన్ని స్తంభింపజేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 28 రోజులు సకల జనుల సమ్మె చేశారు. వందలాది కార్మిక యోధులు అమరులయ్యారు. ఈ చరిత్రంతా, సింగరేణి కార్మికుల చరిత్ర, ‘నెత్తుటి త్యాగాలు’ పుస్తకంగా వచ్చింది. పి. చందు గారు శేషగిరి,  విప్లవాగ్ని, హక్కుల యోధుడు, భూదేవి, స్ట్రైక్, బొగ్గులు వంటి నవలలు, అనేక వ్యాసాలు ఇప్పటిదాకా  సింగరేణి మీద రాశారు.

సింగరేణి కార్మికులు ‘సైరన్’ నవల కాలంలో ముందుండి అనేక పోరాటాలు చేసి, భారతదేశ కార్మిక ఉద్యమంలో మన కాలంలో 50 సంవత్సరాల – మూడు తరాల పోరాటాలకు మార్గదర్శకులయ్యారు. అలాంటి పోరాటం, గతితార్కిక చారిత్రిక అనుభవం, ఆచరణ మిగతా కార్మిక వర్గానికి, రైతాంగానికి, ఆదివాసీలకు, మహిళలకు, దళితులకు – వారి చైతన్యంలోకి చేరితే – బాగుంటుంది … చేరాలనే ఆకాంక్షతో ఈ నవల రాసిన.

ఏది ఏమైనా ప్రజలు పోరాడుతారు. సాహిత్యం,  ప్రజల సృజనాత్మక అనుభవంలోంచి – పాతది నశించి కొత్తది రూపొందే క్రమంలో నుంచి – తగిన భావోద్వేగాలతో వెలువడుతుంది. ప్రజా పోరాటాలు అశేష ప్రజానీకాన్ని కనిష్ఠ స్థాయి నుంచి గరిష్ఠ స్థాయికి చేరడంలో సాహిత్యం తన వంతు పనిచేస్తుంది. ప్రజా సాహిత్య సృజన విప్లవోద్యమ క్రమంలో – ఆచరణలో భాగం.

ప్రశ్న :  ‘సైరన్’ నవల వస్తువు ఎమర్జెన్సీ తర్వాత  సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడక ముందు కాలం నాటిది. ‘సింగరేణి కార్మికులకు బొగ్గు తీయడమే కాదు, రాష్ట్ర దేశ రాజకీయాలన్నీ తెలుసు చరిత్ర తెలుసు చరిత్రను మలుపు తిప్పడం తెలుసు’ అంటారు నవలలో వొకచోట. సింగరేణి కార్మికుల్లో పెల్లుబికిన యీ  వర్గ చైతన్యం దేశవ్యాప్తం కాబోతుందన్న వొక రాజకీయ ఆచరణ ఆశతో నవల పూర్తవుతుంది.  ఇన్ని దశాబ్దాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది యెటువంటి గుణాత్మకమైన మార్పులకు లోనైంది?

జవాబు : భారతదేశ చరిత్రని గతితార్కికంగా,  ప్రపంచ వ్యాపితంగా మార్స్ నుండి లెనిన్, మావోల వరకు – 1976 తర్వాత ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న ప్రజల చరిత్ర నేపథ్యంలో నుంచే అర్థం చేసుకోవాలి. 1857 నుంచి ఇప్పటివరకు ఉత్పత్తి శక్తుల వికాసం కోసం శాస్త్రీయ విజ్ఞానం కోసం భారత ప్రజలు వర్గ పోరాటం చేస్తున్నారు. అందులోని భాగమే  సింగరేణి కార్మిక ఉద్యమం అయినా ఉద్యమ సాహిత్యమైనా. దేశంలో 1857 నుండి 1947 దాకా వలస వ్యతిరేక పోరాటాలు సాగాయి. 1947  నుండి అర్ధ వలస – అర్ధ భూస్వామిక ఉత్పత్తి సంబంధాల్ని మార్చటానికి బహుముఖంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే 1967 నక్సల్బరీ నూతన ప్రజాస్వామిక పోరాటాన్ని ముందుకు తెచ్చింది. 1972 తర్వాత ప్రజలే చరిత్ర నిర్మాతలనే అవగాహన బలపడింది. అత్యాయిక పరిస్థితి ఎత్తివేత ఇందులోని భాగమే. ఉత్పత్తి శక్తుల వికాసం కోసం ప్రజలు అనివార్యంగా పోరాడుతారు. అర్ధ వలస – అర్ధ భూస్వామిక ఉత్పత్తి సంబంధాలు దేశ ప్రజలకు గుదిబండగా తయారయ్యాయి. భూమికోసం విముక్తి కోసం సంఘర్షణ విభిన్న ప్రాంతాల్లో తలెత్తింది. ఈ సంఘర్షణ కొత్త సమాజాల ఆవిర్భావంలో అనివార్యమైంది. ఉత్పత్తి సంక్షోభాన్ని శాస్త్రీయంగా పరిష్కరించనప్పుడు ఉత్పత్తి సంబంధాలు ఫాసిస్టు రూపం ధరిస్తాయి.

అత్యాయిక పరిస్థితి ఎత్తివేసిన తరువాత కరీంనగర్ ఆదిలాబాద్ వంటి వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో,  సింగరేణి , దాన్ని ఆనుకొని ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అరెస్టులు, జైళ్ళు,  నిర్బంధం, కోర్టు కేసులు, ఎన్కౌంటర్లు, మిస్సింగ్ కేసులు  … లాటిన్ అమెరికాలో జరిగినన్ని హింసాత్మక ప్రయోగాలు ఉత్తర తెలంగాణలో జరిగాయి. 1985 వరకు ఈ ఉద్యమాలు అన్నీ కలిసి ఆదివాసీ ప్రాంతాలలో స్థావరాలను నిర్మించుకున్నాయి. ఇప్పుడు అవి దేశ వ్యాపితంగా విస్తరించాయి. భారతదేశంలోని అతిపురాతన వర్గ – కుల – మత – జాతి – లింగ – ప్రాంతీయ వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో ప్రజలు నిర్విరామంగా పోరాడుతున్నారు.

ఇలాంటి పోరాట అనుభవాలకి పునాది రూపం సైరన్. నవలలో తాత్విక రాజకీయ ఆర్థిక అంశాలు, కార్మికులు ఆచరించిన, నిర్మించిన విప్లవోద్యమ క్రమం, వాటి చుట్టూ అల్లుకుని ఉన్న భావోద్వేగాలు చిత్రించడమైనది.

మూడు వేల సంవత్సరాల భావవాద తాత్వికత స్థానంలో గతితార్కిక చారిత్రక తాత్వికతను పోరాటం ద్వారా నిర్మించటం అనేది భారతీయ చరిత్రలో గొప్ప గుణాత్మకమైన మార్పు. అనేక జయాపజయాలతో ప్రజాస్వామిక ఆచరణలో పోరాటంలో ప్రజలు తర్ఫీదు పొందుతున్నారు.

ప్రశ్న : సింగరేణి కార్మిక జీవితాన్ని నేపథ్యం చేసుకొని ఎంతో సాహిత్యం;  దాదాపు వంద కథలు, డజను నవలలు, ఎన్నో పాటలు, వ్యాసాలు వచ్చినప్పటికీ వాటిపై  తగినంత   అధ్యయనం జరగలేదనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో యీ ఉపేక్షకి కారణాలు ఏమై ఉండవచ్చు? 

జవాబు : అర్ధ వలస అర్ధ భూస్వామిక ఉత్పత్తి సంబంధాల సమాజంలో కళలు, సాహిత్యం కూడా అదే స్వభావంలో ప్రచారంలో ఉంటాయి. ప్రచార మాధ్యమాలు, విశ్వవిద్యాలయాలు,  ఉన్నత కులీనులు – మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ భాగం పాత సామాజిక భావజాలంతోనే ఉంటారు … పోరాడే ప్రజలు పోరాటం నుండి పాత సమాజానికి భిన్నమైన సాహిత్యం సృష్టిస్తారు. ఇలాంటి సాహిత్యం రాశిలో కాకుండా వాసిలో పాత సాహిత్యం కంటే భిన్నమైంది. ఉన్నతమైంది. ఇలాంటి సాహిత్యాన్ని ప్రజలు సొంతం చేసుకోవడనేది – విప్లవోద్యమమంత సుదీర్ఘమైనది. ఉపేక్ష – పాత కొత్త భావజాలాల మధ్య సంఘర్షణాత్మకమైన వైరుధ్యం నుంచి ఏర్పడుతుంది. ప్రజల పోరాటం, చైతన్యం విస్తరించిన కొద్దీ ఇలాంటి సాహిత్యాన్ని ప్రజలు ఆదరిస్తారు. ప్రపంచంలో ఎంతో సాహిత్యం వచ్చింది. చివరికి మిగిలింది పోరాటాలను సోషలిస్టు వాస్తవికతతో చిత్రించినవవే కదా! ఆదరణ వస్తుగతమైంది. అధ్యయనం క్రమంగా పెరుగుతుంది. సింగరేణి సాహిత్యం మీద చాలా మంది పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

ప్రశ్న : విప్లవ వాస్తవికతని  కాల్పనిక తలంలోకి తీసుకుపోయి పాఠకుల్ని వుద్వేగంతో కట్టిపడేయడానికి మీరు ఎంచుకునే టెక్నిక్ రష్యన్ కాల్పనిక సాహిత్యంతో పోలి ఉంటుందనిపిస్తుంది. సైరన్ నవల చదువుతున్నప్పుడు చాలా సందర్భాల్లో గోర్కీ అమ్మ నవల గుర్తొచ్చింది. స్థల కాలాల పరిధి పరిమితుల్ని దృష్టిలో ఉంచుకోకుండా పోల్చడం సబబు కాకపోవచ్చు  గానీ సైరన్ – అమ్మ … ఈ రెండింటి మధ్య పేర్కోవాల్సిన పోలికలు – తేడాలు ఏమైనా వున్నాయా?   

జవాబు : 1905లో డిసెంబర్ నాటికి మొదటి మహత్తర సాయుధ తిరుగుబాటును రష్యాలో జారిస్టు ప్రభుత్వం అణచివేసింది. నిర్బంధం పెరిగింది. బోల్షివిక్ నాయకత్వం అరెస్టయింది. అలాంటి నిర్బంధంలో గోర్కీ అమెరికాకు వలస పోయాడు. ఓడిపోయిన మొదటి విప్లవం ఒత్తిడి అతన్ని కకావికలం చేసింది. మెన్షవిక్కులు, సోషలిస్టు రివల్యూషనరీలు, నర్యోద్యుక్కులు లాంటి అరాచకవాదులు ఆ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఇలాంటి అతివాద మితవాద పరిస్థితుల మధ్య లెనిన్ ‘ఏమి చేయాలి’ అని రాశారు. ఒక స్పష్టమైన వ్యూహం ఎత్తుగడలు ఏర్పడుతున్న దశ. ముఖ్యంగా అర్ధ వలస – అర్ధ భూస్వామిక దశలో ప్రజాస్వామిక విప్లవంలోకి కార్మికులను, రైతాంగాన్ని సమీకరించడం బోల్షెవిక్కుల ముందున్న నిర్మాణపరమైన సవాలు. అప్పటికి ఇప్పటిలాగా కార్మికవర్గ  తాత్వికత, సిద్ధాంతం సంపూర్ణంగా రూపొంది ప్రజల్లోకి గరిష్ట స్థాయికి చేరుకోలేదు. అలాంటి సందర్భంలో కార్మికవర్గ ఎజెండాను శ్రామికవర్గ ఉద్యమస్ఫూర్తిని కార్మిక వర్గ నాయకత్వం రైతాంగంలోకి తీసుకుపోవడం ఇతివృత్తంగా తనకు పరిచయం ఉన్న పాత్రలను ఎంచుకొని గోర్కీ అమ్మ నవల రాశారు. బైబిల్ తర్వాత ఎన్నో ప్రపంచ భాషల్లోకి వెళ్లిన ‘అమ్మ’ ను ప్రజలు తమ అనుభవంలోకి ఆచరణలోకి తీసుకున్నారు.

‘సైరన్’ నవల నాటి తాత్విక రాజకీయ ఆర్థిక స్థితి ‘అమ్మ’ లో వర్ణించిన లాంటిదే. 1967 నక్సల్బరీ నూతన ప్రజాస్వామిక విప్లవం –  భారత దేశాన్ని పెద్ద కుదుపు కుదిపేసింది. అతివాదులు మితవాదులు అందరూ కదిలి ఒక దేశ వ్యాపిత విప్లవ వెల్లువకు కారణమయ్యారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించజాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాయిక పరిస్థితి ప్రకటించింది. అత్యాయిక పరిస్థితి ఎత్తివేసిన తరువాత ‘సైరన్’ నవల మొదలవుతుంది. వర్గపోరాట రాజకీయం మొదటి వెల్లువలోని అతివాద మితవాద ధోరణుల్ని సమీక్షించుకుని స్పష్టమైన రాజకీయ తీర్మానంతో రైతాంగ కార్మిక రంగాల్లో పనిచేసి క్రమంగా ఆదివాసీ ప్రాంతాలకు, భారత దేశ వ్యాపితంగా విస్తరించే పునాదిని ఏర్పరుచుకున్నది. అమ్మ – సైరన్  నవలలకు లెనిన్  ‘ఏమి చేయాలి?’ కరపత్రమే  తాత్విక – రాజకీయ దిక్సూచి.

అయితే సైరన్ నవల నాటికి కార్మిక వర్గ రాజకీయాల్లో చాలా పరిణామాలు సంభవించాయి. ప్రపంచ వ్యాపితంగా తిరుగులేని శక్తిగా ఎదిగి –  రెండు ప్రపంచ యుద్ధాలలో నలిగి – మూడు వంతుల ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన ‘కార్మికవర్గ’ భౌతిక – బౌద్ధిక చరిత్ర సింగరేణి కార్మికులకు అందుబాటులో  ఉన్నది. అది నేర్పిన గుణపాఠాలు ఉన్నాయి.   ఇంకా రూపొందని  దశలో – స్పష్టం కాని దశలో –  కార్మిక వర్గాన్ని రూపు కట్టడం, ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు వాస్తవికతను సాహిత్యంలో ప్రవేశపెట్టడం రష్యన్ సాహిత్యం,  అమ్మ  – గోర్కీల మార్గం.

సైరన్  నవల ఆ మార్గంలో మరో చిన్న అడుగు.  అది సింగరేణి కార్మికులు, ఆదిలాబాద్ కరీంనగర్ రైతాంగం, పిల్లలు తమ త్యాగాలతో నిర్మించిన దారి. ఆ యాదిలో, ఆ  మనాదిలో వాళ్లందరినీ సదా లోపల గునాయించుకోవటమే నా రాతలు.  ‘సోషలిస్టు వాస్తవికత’లో ప్రపంచ ప్రజలు తమ గుండెలకద్దుకున్న అపురూపమైన సాహిత్యం రష్యన్  సాహిత్యం. ప్రజలందరిలాగే  దాని నుంచి మేము స్ఫూర్తి పొందాము. మీ అభిమానానికి ధన్యవాదాలు.

ప్రశ్న :  1980 తర్వాతి కాలం  పరిస్థితుల గురించి – సైరన్ కి కొనసాగింపుగా – సింగరేణిలో కార్మిక జీవితాల్లో ఉత్పత్తి శక్తుల అభివృద్ధి కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో భాగంగా చోటుచేసుకున్న సామాజిక రాజకీయ చలనాన్ని తెలిపే మరికొన్ని రచనలు రాయాలనే ప్రణాళిక ఉందా? ఇవాళ్టి పరిస్థితుల్లో ఆ అవసరం వుందని భావిస్తున్నారా? 

జవాబు : 1980 తర్వాత పి. చందు, తుమ్మేటి రఘోత్తంరెడ్డి లాంటివాళ్ళు చాలా కథలు రాశారు. నవలలు రాశారు. 1980 కి ముందటి పరిస్థితిని నేను సైరన్ లో రాశాను. హుస్సేన్ గారు ‘తల్లులు – బిడ్డలు’ అనే నవల రాశారు. అది చాలా పెద్ద నవల.

రాయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటికైతే కొత్త  ప్రణాళిక ఏం లేదు. అయితే వయసు ఆరోగ్యం సహకరిస్తే 50 సంవత్సరాలు మూడు తరాల గురించి రెండు నవలలు రాయాలని ఉంది. నూతన ప్రజాస్వామిక పోరాటాల్లో  వర్గ కుల మత పితృస్వామిక జాతుల వైరుధ్యాలను ఐక్యత ఘర్షణతో పరిష్కరించుకుంటూ, మూడు వేల సంవత్సరాలుగా అణచబడిన భారతదేశ ఉత్పత్తి శక్తులు – తమ వికాసం కోసం పోరాడే క్రమంలో కుప్పలు తెప్పలుగా వెలువడుతున్న భావవాద సాహిత్యం స్థానంలో సోషలిస్టు వాస్తవికతతో అన్ని ప్రక్రియల్లో సాహిత్యం ఎంతో రావాల్సి ఉంది. అన్ని ప్రాంతాల్లో అన్ని భాషల్లో వచ్చిన సాహిత్యం అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తేవాల్సి ఉంది.

మూడో తరం లోని యువకులు అన్ని రకాలుగా మా కన్నా చొరవ అనుభవం, పోరాడే గుణం కలిగినవారు. వాళ్ళు తమ చరిత్ర సాహిత్యాల్ని తామే నిర్మించుకుంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాస్వామిక విప్లవోద్యమం తనదైన సాహిత్యాన్ని తప్పకుండా సృష్టించుకుంటుంది. కొత్త తరం  యువకులతో కలిసి నడవటం మాలాంటివారికి జీవ ధాతువు.

 *

ఏ.కె. ప్రభాకర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నవల గురించి సమగ్రంగా తెలియని వాళ్ళు, రాజయ్య గారి సాహిత్య ప్రయాణం సమూలంగా తెలియని వారు, ఎవరైనా ఎంత విపులంగా విషయాలను రాబట్టలేరు అద్భుతంగా ఉంది. రాజయ్య గారికి, ప్రభాకర్ గారికి అభినందనలు ..

    ముకుంద రామారావు
    హైదరాబాద్

  • సైరన్ నవల ఎన్నాళ్ళు గానో ఎదురు చూసాక వచ్చినందుకు సంతోషంగా ఉంది. రష్యా విప్లవోద్యమానికి చోదక శక్తి అయిన మాక్సిం గోర్కీలా భారత దేశ విప్లవోద్యమానికి అంతే స్థాయిలో దక్కిన రచయిత కా. అల్లం రాజయ్య గారు. ఈ సారూప్యత ఎన్నాళ్ళు గానో మనసులో వుంది. ప్రభాకర్ సార్ ప్రశ్నలలో అది చూసి చాలా inspire అయ్యాను. మంచి ప్రశ్నా జవాబులను అందించిన ఇరువురికి సారంగ సంపాదక వర్గానికి అభినందనలు.

  • అల్లం రాజయ్య దేశ ప్రజలంతా గర్వించదగిన రచయిత. రచన, కార్యాచరణ రెండు విడి విడి అంశాలు కావు. పరస్పరాధారితలు. విప్లవ కార్యాచరణ నుండి రచన అనివార్యతను తెలిపిన రచయిత తాను. నేనెంతో ఇష్టపడే గొప్ప రచయిత. అల్లం రాజయ్య అవగాహనలో కనిపించే విశిష్టత ఒకటుంది. సమాజ చలనశీలనతను సరిగా అర్థం చేసుకోవటం అనేది ఆ విశిష్టత. వర్గ, కుల సమాజంలో రచయిత రెండింటిని నిర్దిష్టంగా అర్థం చేసుకోవాలి. సమాజంలో వస్తున్న మార్పులను ఆ దృక్పథం నుంచి చూడాలి. ఒకప్పుడు వర్గ దృక్పథంతో మాత్రమే కథలు, నవలలు రాసిన అల్లం రాజయ్య ఇప్పుడు శ్రామికుల కులం పునాదిని, పెట్టుబడిదారుల కులాన్ని గమనిస్తున్నాడు. మనువాద వ్యవస్తలో పెట్టుబడికి, కులానికి మధ్య గల అవిభాజ్య సంబంధాన్ని గతితార్కిక అవగాహనతో అనుశీలిస్తున్నాడు. ఈ కొత్త పరిణామం నాకు నచ్చింది. ఇది ఆయన తాత్వికతలో వోచ్చిన ప్రగతి. సైరన్ నవల తెలంగాణాలో ఇంకా దేశంలో వచ్చిన రాజకీయార్థిక పరిణామాల దర్పణం. ప్రజల నిరంతర పోరాటాల, త్యాగమయ జీవితాల సంపుటి. అలాంటి గొప్ప రచన అందించిన రాజయ్య సార్ కు నా అభినందలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు