ఆ పక్కనుంటావా? ఈ పక్కనుంటావా?

Episode 8: ఒక రచయిత బలవంతుల పక్షాన నిలబడి, వాళ్లు చేసే పనులవల్ల కలిగే హానిని పరిశీలించకుండా వాటిని గుడ్డిగా కీర్తిస్తే, పాఠకుడు కూడా అదే అంధత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది.

త భాగంలో ఇచ్చిన ఒక కథలో కొంత భాగమిది. ఒకసారి చదివి మనం చర్చలోకి వెళ్దాం.

మరపురాని రాత్రి

రియా క్లబ్ నుంచి బయటకు వచ్చేసరికి రాత్రి పదిన్నర దాటింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధిలో ఆమె నవ్వు ప్రతిధ్వనిస్తోంది. పొట్టిగా ఉన్న ఎరుపు రంగు బట్టలు వేసుకుందామె. ఇంతకుముందు ఇలాంటి బట్టలు వేసుకునే ధైర్యం ఎప్పుడూ చెయ్యలేదు. స్నేహితుల బలవంతం మీద వేసుకుంది. ” మోకాళ్ల పైకి డ్రస్ వేసుకున్న ఈ రోజే నువ్వు నిజమైన ముంబై అమ్మాయిగా మారావు అని ప్రకటిస్తునాం!” వెంట ఉన్న స్నేహితులు ఆటపట్టించారు. ఆమె చిన్నగా నవ్వింది.

రాత్రి గాలి చల్లగా ఉంది. క్లబ్ బయటి రోడ్డు దాదాపు ఖాళీగా ఉంది. రియాకి కొద్దిగా మైకంగా అనిపిస్తోంది. మిగిలిన స్నేహితులు వెళ్లిపోయాక, క్యాబ్ బుక్ చేసుకోని ఆమె ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ కాస్త ముందుకు నడిచింది. ఆమె హీల్స్ ఫుట్‌పాత్ పైన అసంబద్ధమైన శబ్దం చేస్తున్నాయి. అప్పటికే అతను కొంతసేపటి నుంచి ఆమెను గమనిస్తున్నాడు. ఆమె ఆ వ్యక్తిని గమనించలేదు. అతను ఇలాంటి అవకాశం కోసమే వేచి ఉన్నాడు.

ఆ తరువాత జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆమె అరిచింది, పోరాడింది, ఏడ్చింది — కానీ వినడానికి చుట్టూ ఎవరూ లేరు. రెండు గంటల తరువాత, ఆమె పోలీస్ స్టేషన్‌లో కూర్చుని, పోలీసులు ఇచ్చిన శాలువా శరీరం చుట్టూ చుట్టుకుని కుమిలిపోతూ కూర్చుంది. బహుశా ఆమె కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిందేమో. అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశానికి ఒంటరిగా రాకుండా ఉండాల్సిందేమో. రకరకాలుగా వెళ్తున్నాయి ఆమె ఆలోచనలు.

ఇన్‌స్పెక్టర్ వచ్చి రాగానే విషయం తెలుసుకున్నాడు. ఆమె నిలబడితే శాలువా జారడంతో ఆమెని పై నుంచి కిందకి చూసి ముఖం చిట్లించాడు. “అంత రాత్రిపూటా ఒంటరిగా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావ్? అదీ ఇలాంటి బట్టల్లో?” అన్నాడు కోపంగా చూస్తూ. ఆమె తలదించుకుని చేతులతో మినీని కిందకి లాక్కుంది.

ఆ రాత్రి జరిగింది ఒక విషాదం. ఈ నగరం దాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ అమ్మాయి మర్చిపోలేదు. చాలామంది ఆధునిక యువత ఒంటరిగా వెళ్లిన ఆమె ధైర్యాన్ని అభినందించవచ్చు కూడా. కానీ సమాజం ఆమె చిన్న బట్టలు వేసుకుంటే క్షమించినంత సులభంగా ఆమె అజాగ్రత్తని క్షమించకపోవచ్చు.

కథ చివర్లో ఇచ్చిన ప్రశ్న: రచయిత ఎవరి వైపు నిలబడి ఉన్నాడు?

మొదట చదివినప్పుడు అంతా బాగానే ఉంది కదా అనిపించి ఉండచ్చు. ఈ కథ ఒక బాధితురాలి గురించి. కథలో ఆమె మీద జరిగిన అత్యాచారాన్ని విషాదకరమైన సంఘటనగానే వర్ణించాడు రచయిత. కానీ పరిశీలనగా చూస్తే అదంతా పైపై మాటలు మాత్రమే అని అర్థమౌతుంది. లోతుల్లోకి వెళ్లి చూస్తే ఒక్కొక్కటిగా రచయిత రంగులు కనపడతాయి. రండి ఒక నాలుగడుల లోతుకు వెళ్లి ఆ రచయితని దగ్గరగా చూద్దాం.

మొదటి అడుగు: ఆ అమ్మాయి వేసుకున్న బట్టల మీద, ఆమె ప్రవర్తనపైన అనవసరమైన దృష్టి. కథలో ఉన్న ఈ రెండు వాక్యాలు చూడండి-

“పొట్టిగా ఉన్న ఎరుపు రంగు బట్టలు వేసుకుందామె. ఇంతకుముందు ఇలాంటి బట్టలు ఎప్పుడూ వేసుకోలేదు. వేసుకునే ధైర్యం చెయ్యలేదు.”

“మొత్తానికి మోకాళ్ల పైకి డ్రస్ వేసుకున్న ఈ రోజే నువ్వు నిజమైన ముంబై అమ్మాయిగా మారావు అని ప్రకటిస్తున్నాం!” వెంట ఉన్న స్నేహితులు ఆటపట్టించారు.

రచయిత ఆమె అలాంటి దుస్తులు వేసుకోవడం ఒక “ధైర్యమైన” చర్య అంటున్నాడు. అలా చెస్తేనే ఆమె ముంబై అమ్మాయిగా మారుతుందని ఒక పాత్రతో చెప్పించాడు. సాధారణంగా పాత్ర అనే మాటల దోషాన్ని రచయితకి ఆపాదించకూడదు. కానీ ఈ కథలో ఉన్న అనేక వాక్యాలతో కలిపి పరిశీలిస్తే రచయిత వైఖరి స్పష్టంగా తెలుస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఆ రోజు జరిగిన ఆ దుస్సంఘటనకు ఆమె దుస్తులే ప్రేరేపణ అని చిత్రీకరించే ప్రయత్నం కనపడుతోందా లేదా మీకు?

రెండో అడుగు – బాధితురాలిపై నిందారోపణ. అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న యస్సై ఎలాంటి దృష్టితో ఆ అమ్మాయిని చూస్తున్నాడో, రచయిత కూడా అదే దృష్టితో ఆమెను చూస్తున్నాడు. ఎక్కడున్నాయి ఆ నిందారోపణలు? ఇదిగో ఈ రెండు వాక్యాలు –

“బహుశా ఆమె కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిందేమో. అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశానికి ఒంటరిగా రాకుండా ఉండాల్సిందేమో.”

పైకి ఈ మాటలు ఆలోచించి చెప్పిన మాటల్లా అనిపిస్తాయి కానీ వాస్తవానికి బాధ్యతను బాధితురాలిపైకి నెట్టే ప్రయత్నం ఉందిక్కడ. ఈ రెండు వాక్యాలు ఆమె మనసులో అనుకుంటున్నట్లు రాశాడు కానీ ఆ పాత్రను అడ్డంపెట్టుకుని రచయితే మాట్లాడుతున్నాడని మనకి స్పష్టంగానే తెలుస్తోంది. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలనీ, నిర్మానుష్యమైన ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదని ఒక ఉచిత సలహా కథాంతర్భాగంగా ఇస్తున్నాడు రచయిత.

మూడో అడుగు: శనితిజింగ్ థె ఛ్రిమె. నేరాన్ని నేరంలా కనిపించకుండా, లేదా జరిగిన సంఘటన తీవ్రతని తగ్గించేలా రాయడం. దాడి జరిగింది ఒక అమ్మాయిపైన. ఆ దాడి గురించి చాలా తక్కువగా చెప్పాడు. “ఆమె అరిచింది, పోరాడింది, ఏడ్చింది…” అనే శుష్కమైన పదాలతో జరిగింది చెప్పాడు. వెంటనే కథని పోలీస్ శ్టేషన్‌కి తీసుకెళ్లిపోయాడు. ఎక్కడా ఆ దుర్మార్గానికి ఒడికట్టిన వాడి గురించి ప్రస్తావన లేదు. అతడిని నిందిస్తూనో, తిడుతూనో, అతని చర్యని వ్యతిరేకిస్తూనో చెప్పిన వాక్యం ఒక్కటి కూడా లేదు.

నాలుగొవ అడుగు – రచయిత (ఈ భాగంలో) రాసిన చివరి వాక్యం. ఇది రచయిత మోసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

“చాలామంది ఆధునిక యువత ఒంటరిగా వెళ్లిన ఆమె ధైర్యాన్ని అభినందించవచ్చు కూడా. కానీ సమాజం ఆమె చిన్న బట్టలు వేసుకుంటే క్షమించినంత సులభంగా ఆమె అజాగ్రత్తని క్షమించకపోవచ్చు.”

ఇది తెలివైన వాక్యంలా అనిపించినా, దానిలో తీవ్రమైన, అనాగరికమైన ఒక సూచన ఉంది. జరిగిన దానికి ఆ దుస్తులు ఆహ్వానం పలికాయి అనేది ఆ మాటల ముసుగు వెనుకాల వున్న అభిప్రాయం.

ఈ రకమైన వైఖరి ఈ ఒక్క వాక్యంలో మాత్రమే కాదు — అది కథ అంతటా అల్లుకుని ఉంది. పితృస్వామ్య నమ్మకాల అవశేషాలు మోసుకుని తిరుగుతున్న రచయిత ఇతను. పైకి సానుభూతిపరుడిగా నటిస్తూ అంతర్లీనంగా ఒక ఛాందసమైన భావజాలాన్ని సమర్థించే ఆషాఢభూతి ఈ రచయిత. ఈయన కథని మొదలుపెట్టినప్పుడూ, నడుస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినా తన అసలు స్వరూపాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆఖరి వాక్యం – “సమాజం ఆమె చిన్న బట్టలు వేసుకుంటే క్షమించినంత సులభంగా ఆమె అజాగ్రత్తని క్షమించకపోవచ్చు” – అతడిని నగ్నంగా పట్టించేసింది. జరిగిన సంఘటన ఆమె స్వాతంత్ర్యంపైన జరిగిన దాడి అని కాకుండా ఇతర మహిళలకు ఒక పాఠంగా చిత్రీకరించే ప్రయత్నం, బాధ్యతను నేరస్తుడి నుంచి బాధితురాలికి మార్చే ప్రయత్నం కథని అతఃపాతాళానికి తొక్కేస్తోంది.

గత భాగంలో రెండు రంగులు అనే ఇంకో కథ ఇచ్చాను. మీకు గుర్తుందా? అందులో రచయిత రెండు రకాల టోన్ వాడి రెండు పాత్రల గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో ఒక పాత్ర గురించి చెప్పేటప్పుడు ఉన్న నిజాయితీ, నిబద్ధత మరో పాత్ర గురింఛి చెప్పేటప్పుడు కనపడలేదు. రెండో పాత్ర గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు. అలా మనకి ఆ రచయిత ఎవరి వైపు ఉన్నాడో అర్థమైంది. మరి ఈ రోజు మీరు చదివిన కథలో రచయిత ఎవరి వైపు ఉన్నాడు?

బాధితురాలి వైపు ఉన్నాడా? లేడా? బాధితురాలి వైపు లేడంటే మరి ఎవరి వైపు ఉన్నట్లు? ఉన్నది ఇద్దరు. ఒకళు బాధపడ్డారు. మరొకరు బాధపెట్టారు. ఈ ఇద్దరిలో రచయిత ఎవరి వైపు ఉన్నాడు?

ఇలాంటి కథలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఒక మగ రచయిత ఉన్నాడు. ఆడవాళ్ల సమస్యలపట్ల ఏ మాత్రం సహానుభూతిలేని వ్యక్తి. కేవలం పోటీలలో బహుమతుల కోసం స్త్రీవాద కథలు రాస్తాడు. బహుమతులు కూడా వస్తుంటాయి. కానీ ఆ కథని జాగ్రత్తగా చదివితే ఆ రచయితకి స్త్రీల పట్ల వున్న ద్వేష భావన ఏదో ఒక చోట కనపడిపోతుంది. ఆ బహుమతులు ఇచ్చిన వారికి బహుపరాక్. ఉదాత్తమైన, మానవ సంబంధాలపైన కథలు రాసే మరో రచయిత ఉన్నాడు. కథలో ఏ పరిస్థితిలో అయినా ఏ సందర్భంలో అయినా ఒక స్త్రీ పాత్రని వర్ణించాల్సి వస్తే వెంటనే అంగాంగ వర్ణన చేస్తాడు. అసదర్భమైన ఆ వాఖ్యానాలతో అతని లేకి మనస్తత్వాన్ని వ్యక్తమౌతుంది తప్ప కథకి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

మీరు మరీ చెప్తారండీ, అందరు పాఠకులు ఇదంతా తెలుసుకోగలుగుతారా? నిజమే అందరు పాఠకులు తెలుసుకోకపోవచ్చు. చాలామంది గుర్తించకపోవచ్చు. కానీ ఒకే ఒక్కరు తెలుసుకున్నా, ఒక్కళ్లకి మాత్రమే అర్థమైనా రచయిత గా మీ స్థానం ఎక్కడ ఉంటుంది? సరే ఆ ఒక్కళ్లు కూడా తెల్సుకోలేనంత గొప్పగా మీరు రాశారనే అనుకుందాం. మరి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? ఇలాంటి తప్పు కథా బలాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. రచయిత గౌరవాన్ని భంగపరుస్తుంది. రైల్లో పుస్తకం చదువుతున్న పాఠకుడు రచయిత మీద గౌరవం పోయిన మరుక్షణం ఆ పుస్తకాన్ని కిటికీలో నుంచి బయటికి విసిరేస్తాడు.

రచయిత ఏ పక్కనుంటే ఏమైంది?

ఒక పాఠకుడు ఒక కథని ఎలా అనుభూతి చెందాలో ఆ రచయిత వైఖరి (stand) నిర్ణయిస్తుంది. ఒక రచయిత బలవంతుల పక్షాన నిలబడి, వాళ్లు చేసే పనులవల్ల కలిగే హానిని పరిశీలించకుండా వాటిని గుడ్డిగా కీర్తిస్తే, పాఠకుడు కూడా అదే అంధత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది. అదే రచయిత అణగారిన వారి పక్షాన నిలబడితే, ఆ కథ ద్వారా సమాజంలో కాస్త సానుభూతిని, కూస్త సామాజిక అవగాహనను పెంపొందించవచ్చు.

రచయిత కథలో ఏ పక్కన నిలబడ్డాడు అనేది అతని నిజాయితీని నిర్వచిస్తుంది. ఒక్కోసారి కొన్ని కథలలో కొన్ని పాత్రలు ఒకరికి ఒకరి వ్యతిరేకంగా మాట్లాడుకుంటయి. ఆ విబేధం కూడా స్పష్టమైన సైద్ధాంతిక విబేధం అయ్యుంటుంది. అప్పుడు రచయిత ఆ విభేదించుకుంటున్న ఇద్దరి మధ్య నిలబడి వాళ్ల వాదనను మనకి వినపించడం మొదలుపెట్టాడనుకుందాం. చాలామంది ఏం చెప్తారంటే – “అక్కడ జరుగుతున్న వాదనను ఒక సాక్షిలా చెప్పాలి” అంటారు. అది జరిగే పని కాదు.

అప్పుడు అతను వార్తా విలేఖరి అవుతాడు తప్ప రచయిత ఎలా అవుతాడు? నిజాయితీగా రాసిన వార్తలు తటస్థంగా ఉండచ్చు. కోర్టు తీర్పులు తటస్థంగా ఉండచ్చు. కానీ రచనలు తటస్థంగా ఉండవు. ఉండకూడదు కూడా. రచయిత ఏదో ఒక వైపు నిలబడాల్సిందే. ఆ నిలబడేది బాధితుల వైపు అయితేనే అది బాధ్యాతాయుతమైన రచన అవుతుంది. ఒక్కో కథలో అవసరాన్ని బట్టి అనేక స్వరాలు ఉండచ్చు, కానీ వాటన్నింటి ఆత్మ ఒకటై ఉండాలి.

ప్రతి రచయిత, రాసిన ప్రతిసారీ గుర్తుపెట్టుకోని సమీక్షించుకోవాల్సిన ప్రశ్న ఒకటి ఉంది – నేను అన్యాయానికి గురైన బాధితులతో సానుభూతి చూపుతున్నానా? అనాలోచితంగానైనా, అప్రయత్నంగానైనా బాధితులైన వాళ్లకి హాని కలిగించే వ్యవస్థలను లేదా పాత్రలను సమర్థిస్తున్నానా? ఇలా ఆలోచించి చేసే రచన రచయిత బాధ్యతను వెల్లడిస్తుంది. ఆ రచనకి విలువ ఉంటుంది. రచయితకి గౌర్వం ఉంటింది. చేసేది పూర్తి కాల్పనిక రచన అయినా సరే, సైన్స్ ఫిక్షన్ అయినా, హిస్టారికల్ అయినా, ఫాంటసీ అయినా ఇలాంటి ఆలోచన తప్పనిసరి. అలాంటి ఆలోచన ఉంటేనా రచన అనే వ్యాసంగం పూర్తి స్పృహతో, బాధ్యతతో చేసిన చర్యగా మారుతుంది.

రచయిత తప్పు చేసిన వాడి పక్షాన నిలబడటం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి?

ఒక రచయిత దుర్మార్గాలు చేస్తున్న పాలకుడిని కీర్తించినప్పుడు, దుర్వినియోగమౌతున్న అధికారాన్ని విస్మరించినప్పుడు, అత్యాచార బాధితురాలిని మౌనంగా ఉంచి, అత్యాచారానికి పాల్పడినవారిని కాపాడే కథను చెప్పినప్పుడు, వ్యవస్థీకృత అణచివేతను ప్రశ్నించనప్పుడు – ఆ రచయిత ఏం చేసినట్లో తెలుసా? అతను కథను చెప్పడం లేదు — పైన చెప్పిన దుర్మార్గాల వల్ల ఎవరికైతే అపకారం జరుగుతోందో, వాళ్లకి ఆ అపకారాన్ని పునరావృతం చేస్తున్నట్లు.

అలాంటి రచన సమాజానికి హానికరమైన ఆలోచనలను, సిద్ధాంతాలను బలపరుస్తుంది. సమాజం సంగతి అటుంచండి మీ రచనకీ, మీకు ఏం జరుగుతుంది? పాఠకులలో ఏ కొంత నిజాయితీ ఉన్నా ఇలాంటి రచనలని వాళ్లు అంగీకరించరు. వాళ్లకి కోపం రావచ్చు, ద్రోహం చేయబడినట్లు భావిచవచ్చు. ముఖ్యంగా బాధితులలో తమను తాము చూసుకునే పాఠకులు మళ్లీ ఆ రచయిత ముఖం చూడటానికి కూడా ఇష్టపడకపోవచ్చు.

పై కథను కథాంశం మార్చకుండా, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలను కలిపి చెప్పాలంటే ఎలా చెప్పచ్చు?

కథాంశం అదే — ఒక మహిళ రాత్రి పొద్దుపోయి క్లబ్ నుంచి బయటకు వస్తుంది, దాడికి గురవుతుంది. కానీ టోన్, దృష్టి బాధితురాలికి మద్దతు ఇచ్చేలా, ఆమె మీద నిందారోపణ చెయ్యకుండా రాయచ్చు.

రియా దుస్తులమీద ఉన్న దృష్టిని మళ్లించి, అదే దృష్టిని సంఘటన ముందు, ఆ తరువాత ఆమె మానసిక స్థితి మీద పెట్టచ్చు. ఆ పరిస్థితిలో ఆమె భావోద్వేగాల మీద చూపు సారించవచ్చు. విమర్శనాత్మకమైన సూచనలు చెయ్యాల్సిన అవసరం లేదు. వ్యవస్థ వైఫల్యాలు ఇలాంటి సంఘాటనలకు ఎలా కారణమయ్యాయో చెప్పచ్చు. పోలీసుల ఉదాసీనత, సామాజం వేసే అపవాదులు, ప్రజల అభద్రత ఇవన్నీ చెప్పచ్చు. ముఖ్యంగా ముగింపు వాక్యం ఆమెదే బాధ్యత అని కాకుండా సామూహిక బాధ్యతా వైఫల్యం కింద చూపించవచ్చు. బహుశా ఇలాంటి వాక్యం రాయచ్చు – “రియా ఆ రాత్రి చరచబడలేదు. తమ కూతుళ్లను సురక్షితంగా ఉంచడంలో విఫలమైన నగరం చేసిన తప్పుకి ఈ రూపంలో శిక్ష అనుభవించింది”

ఈ వెర్షన్‌లో సంఘటనలు అలాగే ఉన్నాయి కానీ రచయిత వైఖరి మారింది. మారిన వైఖరిలో రచయిత నేరాన్ని స్పష్టంగా ఖండిస్తున్నాడు. బాధితురాలు చేసిన పనిని ఖండించడంలేదు. అది చాలు పాఠకుల, విమర్శకుల అంగీకారం ఆ రచనకు లభించడానికి. చెప్పడంలో కొంత నేర్పు కూడా తోడైతే, అంగీకారం అభినందన గా మారుతుంది. ఆ కథ కలకాలం నిలిచే కథ అవుతుంది.

మీరు సరైన పక్షాన ఉన్నారో లేదో ఎలా నిర్ధారించుకోవాలి? రచన చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి: ఈ కథలో అత్యంత బలహీనమైన వాళ్లు ఎవరు? నేను వాళ్ల గురించి మాట్లాడుతున్నానా? ఆ మాటలు వాళ్లని సమర్ధిస్తున్నాయా?

రెండోవది ఒక పాత్రని సంక్లిష్టంగా మార్చడం కోసం ఆ పాత్ర క్రూరత్వాన్ని సమర్థించకండి. ఇది చాలా సినిమాలలో చేసే పని. ఒక విలన్ క్యారెక్టర్‌ని శక్తివంతుడిగా చూపించేందుకు అనవసరపు మర్డర్లు, అదీ క్రూరంగ  చేయిస్తుంటారు. అదే తప్పు. పాత్రని కాంప్లెక్స్‌గా మార్చండి. కానీ వాళ్లు చేస్తున్న తప్పులని ఎక్కడైనా అనాలోచితంగా, అప్రయత్నంగా సమర్థించట్లేదని నిర్ధారించుకోండి.

కాల్పనిక సాహిత్యంలో మీరు ఎవరి గురించి అయినా వ్రాయవచ్చు, కానీ మీరు ఎక్కడో ఒక చోట నిలబడాలి.

మీరు అతి క్రూరులైన విలన్‌లను సృష్టించి వాళ్ల గురించి వ్రాయచ్చు. లోపభూయిష్టమైన హీరోలను తయారు చెయ్యచ్చు. ఏది నైతికమో ఏది కాదో అనేలా గందరగోళపరిచి కథని నడపచ్చు. కానీ కథ ముగిసే సమయానికి, పాఠకుడు ఆ కథ గురించి మళ్లీ ఎప్పుడూ గందరగోళానికి గురికాకూడదు. కథ ఎవరి వైపు నిలబడిందో, రచయిత ఎవరి వైపు నిలబడ్డాడో పాఠకుడి స్పష్టంగా అర్థమవ్వాలి. అది అలా జరగాలంటే, రచయితకి తాను వైద్యం చేస్తున్నాడా లేక హాని చేస్తున్నాడా అనే స్పష్టత, అవగాహన ఉండాలి. ఆ రెండింటి మధ్య తేడా తెలిసుండాలి.

(తరువాత భాగంలో – నేను చేసే తప్పులు)

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు