ఆ ఒక్క రోజు….

అమ్మ అడగకనే పంచిన ప్రేమేనా? నే కోరుకున్న కఠినత్వం మాత్రం చూడొద్దూ.

అమ్మాయి పరిగెడుతోంది. ఆ నిర్జన ప్రదేశంలో ….ఎటెళ్ళాలో, ఎవరి రక్షణ పొందాలో పాలుపోక…..ఓ క్షణం ఓ దిక్కూ…మరుక్షణం మరో దిక్కుగా!

నేను వెంటాడుతున్నాను ….కోరికా….అందలేదన్న  కసీ…పశుబలం….ఇంకా… ఎక్కడా లేని రాకాసి శక్తులన్నీ కలిసి శరీరం ఆవాహనం చేసుకొన్నట్లుగా…పులై వేటాడుతున్నాను. తోడేలై వెంటబడుతున్నాను. పరిసరాల స్పృహలేకుండా నేనూ, ….ఏ దేవుడూ వచ్చి కాచేది లేదని అర్థమై , నిస్సహాయంగా  ఆమే!

సాటి మనిషిగా అస్థిత్వం కోల్పోయి, ఆకలితీర్చుకుందుకు, ఆమెను కేవలం కళేబరంగా మాత్రమే  గుర్తించి, మాటువేసి, వేటువేసే పులిలా నేనూ!
ఆ చిమ్మ చీకట్లలో …నిమిషాలు వేట తర్వాత …దూరం తరిగింది. జుట్టు చేతికందింది. ఆమె గింజుకుంటోంది.
బాధతో..ఉక్రోషంతో..ఓడిపోకూడదన్న ప్రయత్నం తో!. ..
జట్టుతో సహా వెనక్కి వంచటం వల్ల నిస్సహాయంగా వాలిపోయిన ఆ ముఖంపైకి ఆబగా వంగి , భయంకరమైన షాక్ వల్ల వెర్రి కేకపెట్టి, ఆమెనొదిలి ఆ  పాదాలదగ్గరకు జావగా జారిపోయాను.
ఆమె నవ్వుతోంది. ఓ రేపిస్ట్ ని నేలకరిపించాననే గర్వంతో!
నా కళ్ళనుండి రక్తం వర్షిస్తోంది. ఆమె దిక్కులు పిక్కటిల్లేలా నవ్వుతూనే, తిరస్కారంతో…., క్రోధంతో…, జుగుప్సతో …..నన్ను కళ్లతో కాల్చేస్తూ…కాళ్ళతో తొక్కుతోంది. మాట పెగలక, కళ్ళెత్తే ధైర్యం లేక, ఎలాగోలా … అతికష్టం మీద తడారిపోయిన గొంతుతో ,
“అక్కా…నన్ను చంపెయ్ ప్లీజ్.” అని మాత్రం అనగలిగేను… కాదు గొణిగేను…. ఉహూ…మూలిగాను.
చావులాంటి మెలిపెట్టే ఏడుపు. చచ్చే ముందరిలాంటి ఒగుర్పు.!ఒళ్ళంతా గగుర్పాటు. సిగ్గుతో చితికిపోవటం అంటే తెలుస్తోంది. మూలుగుతూనే ఉన్నాను గట్టిగా… బాధగా!
ఠంగ్ఠంగ్…గ్…గ్….కటకటాలపై లాఠీ చేసిన శబ్దానికి మెలకువ! కాదు కొత్త జన్మే! నరకం నుండి తెరిపి! ఇరకాటం నుండి ఊపిరి!
పీడకలనుండి బయటపడేయగల ఓ శబ్దం ‘కఠినమైనదైనా’ ఎంత మధురం!!?
ఇదేం పాడుకల???!! అక్క రావటమేంటీ??! ఈ కలేం చెబుతోంది. తనంత పాపిష్టోడనా??.  హు…పాపిష్టితనంలో ఇంకా ఇంతా, కొంతా అని మళ్లీ తూకాలా??  పాపిష్టోడవబట్టే కుటుంబానికి మచ్చతెచ్చి, అందరికీ దూరమై..ఇలా చీకటిలో మగ్గుతున్నాడు.అమ్మ తనని అందరు తల్లుల్లాగే ప్రేమించింది. పైకి తేవాలని కష్టపడింది. కానీ ఇప్పుడు తనని చూడ్డానికి ఆరునెలల కోసారి కూడా రావటంలేదు. ఇక ఆ పాత చనువు అమ్మ తనకెప్పటికీ ఇవ్వదని తెలిసి పోతూనేఉంది. ఇపుడు లోకానికి తనెంత ‘అసహ్యమో’ అమ్మ కీ అంతే! జనానికి నా నీడ ఎంత నీచమో, అక్కకీ అంతే!
అక్క కూతురంటే తనకెంతో ముద్దు. తనచేతుల్లోనే పెరిగింది. తనంటే పాపకి ప్రాణం…తండ్రి లేని ఆపిల్లంటే తనకీ అంతే. పాపని ఇన్ని రోజులు చూడకుండా ఉండగలిగేడంటే ఇక వేరే గత్యంతరం లేకే!. పాపనోసారి తెండమ్మా అని అడగలేడు. అర్హతలన్నీ స్వయంగా తుడిచేసుకున్నాడు.బంధాలన్నీ తనకిపుడు ప్రశ్నార్థకాలేగా.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కలుపుకోండి. వారూ మీలాంటివారే  అంటారుగానీ, నాలాంటి మృగాలనిగురించి ఆ మాట అనగలరా ?

సమాజపు తిరస్కారం, అంతులేెని అవమానం, ముఖం చూపించలేనంత ఖర్మ.! ఓ అయిదు నిమిషాలు మగ అహాన్ని, మృగ వాంఛనీ నిలువరించుకలేక పోయినందుకు జీవితం విషమంత చేదైపోయింది.

ఛా…స్నేహితులా వాళ్ళూ !!?? ఆజన్మ శత్రువులు.! క్లాసులెగ్గొంటించి, చెత్త సినిమాలకూ, హాస్టళ్ళముందు చక్కర్లకూ తోడుగా వాడుకునీ , చివరకు ..ఓ అమ్మాయి మానాభిమానాలను విధ్వంశం చేయటానికీ భాగస్వామి ని చేసారనీ…హు. ఇప్పుడా…ఇపుడు గ్రహించి ఏంలాభం.?
“నేను రానురా…అమ్మ కష్టం పై చదువుతున్నాను. అమ్మే గుర్తొస్తుంది ” అని   అపుడెలా చెప్పలేకపోయాడో….ఇపుడంతా మృగాడు అంటూంటే ..కాదనీ, మనిషిననీ చెప్పలేకపోతున్నాడు . దోష భావన ఇంతలా ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేస్తుందని తనకి తెలీదు.

                        ***

గోడ కవతల అమ్మ!  ఇవతలగా చూపు కలపలేని  నేను!

‘బాగున్నావా?’ అని అమ్మ అడగదు.
‘నువు బావుండాలమ్మా’ అని నేను చెప్పలేను.
అలా నుంచుంటామంతే !.విధి ఓ ఇనుపగోడ మా మధ్యలో ఆనాడే నిలబెట్టింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఇలా నిలబడ్డాం.
“అంతా అలా జరిగపోయిందంతే”! అమ్మ ముఖం మరీ ముడుచుకుపోయింది ఆ మాటంటూ .
“ఏం…..ఏం ..జరి…గిందీ…?! అడిగాననుకున్నానంతే. ధైర్యం దాపున ఉంటేగా!.
“నీకు చెప్పకూడదనే అనుకుంటిమి. నువేం ఉద్దరిత్తావని చెప్పాల ?! కడుపులో ఉండంగ నన్ను తంతే ఏంటో అనుకుంటి. బయటపడ్డాకా  నన్నూ, ఆ పాణం పోయిన  అమాయకురాలి తల్లినీ కలిపి మళ్ళీ తంతావని ఊయించుకోలేదు.అయిదేళ్ళ దాన్నికూడా వదలర్రా దురమారుగుల్లారా?? ..బయట ఆడుకుంటన్న పిల్ల! అక్కా నేను పనికెల్లినాం. నరసయ్యని చూడమని.” చెంగు నోట్లో దోపుకుని ఏడుపునాపుకుంది.
సరిగ్గానే విన్నాడా తనూ?  తలెత్తి అమ్మతో కన్ను కలప తప్పిందిగాదు.
కళ్ళ కింద నలుపుతో , కళతప్పి ఉన్న అమ్మ! అరవైఏళ్ళ దానిలా…నలిగి పోయి !! ….
మనసు కలుక్కుమని ‘తాను’ ఇంకా మిగులున్నానని గుర్తుచేసింది.

‘నాకు తెలీ….మా’….గొంతు పెగిలితేగా…గొణిగాను.

“ఎంతుకూ?? లోకులు నన్ను కుళ్ళబొడసి ఒదిల్తేనీ. కొడుకు చేసిన పాపం ఊరికేె బోద్దా ?? అని.

ఇదెక్కడి నాయం??!  నీకు కళ్ళుబోయి, పాపానికొడిగడితే, మద్దెలో ఆ పసిదానికి శిచ్చెలా పడుద్ది?? “
“ఆడుమంచోడమ్మా ! సావాసగాళ్ళే పాడుచేసారుగానీ ” అంటది ఈనాటికీ మీ యక్క.
నువు లేని లోటెట్ట కుంటా నన్ను సాకుతుంది .ఇపుడింగ ఘడియ, ఘడియా ఆడపిల్ల గురించి బెంగపడి పిచ్చిదైపోతంది. తాగుబోతు సచ్చినోడు బిడ్డని తోటలోకి లాక్కెళతుంటే, పొరుగోళ్ళు చూసి ఇడిపిచ్చారు.అదే ఎవురు చూడకపోయుంటే??”  అమ్మ సూటిగా చూస్తున్నట్టుంది.
నేను చూపులతో నేెలను దిగంతాల వరకూ  తవ్వుతున్నాను. నామెడ లాగేస్తున్నా తలెత్తి ‘అయ్యో’! అనలేకపోయాను. అమ్మ వెళిపోతే బాగుండు. ఎందుకో తనివితీరా ఏడ్చుకోవాలనుంది.
“ఎంతకాలం ఇలా ఆడోళ్ళంతా బయపడతా బతకాల ?? మేమంతా సచ్చి బతికిపోవాలా? లేక ఏటాడే ఎదవలందరినీ బతికుండగా సంపేయాలా? ”
రాయిలా వినటం తప్ప నేనేం స్పందించను?
“ఓ ఆడకూతురిని ఏటాడేనాడు , నిన్ను నమ్ముకున్న ఈ అమ్మా,, అక్కా,పాపా గుర్తుకు రాలేదు గాబట్టికి, ఇక అలాగే మమ్మల్ని పూర్తిగా మరిసిపో బాబూ..మేం ఊరొదిలేసిపోతన్నాం.”అంది అమ్మ.
“అలా అనకమ్మా! .. నన్ను రానీ.  మిమ్మల్ని బాగా చూసుకుంటా ” గబ గబా చెప్పాను ఎలాగోలా స్వాధీనపడి.
“ఒద్దులేయా.. ఇకిదే కడసారి చూపు మనిద్దరికీని.”!. గుండెల్లో సుడితిరిగే బాధ భుజాలను ఊపుతూ బయటకు తన్నుకు రాగా, “అమ్మా … వెళ్ళకండి …ప్లీజ్  . స్వీటీ పాపా..తల్లీ  స్వీటీ..  ప్లీజ్.” నా మాట లెక్కచేయకుండా అమ్మ గిరుక్కున వెనక్కు తిరిగి ఆగకుండా బయటకు నడిచింది.
“పద స్వీటీ. ..నిన్ను ఇక్కడే కూర్చోమన్నానా? మామయ్య నాకె అగుపడలేదు. మారాం చేయక..పద …పద” నా చెవిలో పడిన అమ్మ మాటలు గుండెల్లోకి దొర్లించిన బండలను మోయలేక గోడకి జారి కూలబడ్డాను.  ఇక నేనూ, విచక్షణ నోరు నొక్కేసిన నా గతమూ మిగిలాం.
అమ్మ  అడగకనే పంచిన ప్రేమేనా? నే కోరుకున్న కఠినత్వం మాత్రం చూడొద్దూ.
ఆ రోజు ఇలాగే వేడుకుంది ఆ అమ్మాయి మమ్మల్ని!.. ‘ప్లీజ్…ఒద్దు…ప్లీజ్  అని !!..ఆగామా? . ఆగుంటే!! నా జీవితం నా చేతుల్లేనే ఉండేది!. నా కుటుంబం నాకే మిగిలేది.!
హు…ఆ రోజు..ఆ ఒక్క రోజు వెనక్కి వస్తే ఎంత బాగుండును.
“ఒద్దురా. మన చెల్లి లాంటిదిరా” అనంటే…ఎంత బాగుండునూ!
స్నేహితుల కాళ్ళిరిచి, తరుముతున్న  అమ్మాయి కాళ్ళకి మొక్కి, ….ఆమెను ఇంటిదగ్గర దించుంటే ఎంత బాగుండును! !
చేజారిన నీళ్ల వంటి  విలువైన జీవితం…మళ్ళీ తిరిగి బాగుచేసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుండునూ?! ఎంత బాగుండునూ?!
అమ్మ చేతి ముద్దా, అక్క కంట్లో ప్రేమా, పాప ఆటల్లో శాంతీ…మళ్ళీ దక్కితే ఎంత బాగుండునూ??! ఎంత బాగుండునూ??!!
*
మనోజ నంబూరి

మనోజ నంబూరి

ఇటీవల సాక్షిలోనూ, ప్రజాశక్తిలోనూ కథలు ప్రచురించారు. రేడియో గుల్దస్తా కార్యక్రమంలో ఆరు కథలు ప్రసారం. కొన్ని బాలల కథలూ,నాటికలూ,బుర్రకథలూ...

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు