ఆరోగ్య కరమైన గడ్డి కోసం…

పతంజలి శాస్త్రి గారి కథల చిన్ని పరిచయం – 6

( పతంజలి శాస్త్రి గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కథల్ని చిన్నగా పరిచయం చేస్తున్నాం. ఈ కథలు కొంతమంది చదివి ఉండొచ్చు, చాల మందికి తెలియకపోయి ఉండచ్చు, ఎందుకంటే ఇవేవి చదువరులకు అందుబాటులో లేవు. చదవని వాళ్ళకి కథని రుచి చూపించడంకోసం, చదివేసిన వాళ్ళకి మరోమారు గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ చిన్ని పరిచయం. ఇది  విశ్లేషణ, వివరణ ఏమాత్రం కాదు).

సారి శాస్త్రిగారు వ్యవస్థల్లో ఉన్న అవలక్షణాల్ని పట్టి ఎత్తి చూపించే 90 వ దశకం మొదట్లోని  మూడు కథలు ‘చేను, చేప’, ‘అప్పిచ్చువాడు, వైద్యుడును’, ‘గ్రాసం’ కథల పరిచయాన్ని చూద్దాం.

వైనతేయగోదావరికి సముద్రానికి మధ్య కొంచెం సముద్రానికి దగ్గరగా పరుచుకున్న వూరది. శర్మ గారు పుట్టి పెరిగిన వూరది. ఇద్దరు పిల్లలు. పెద్దవాడు హైదరాబాద్ లో రియల్ఎస్టేట్ బిజినెస్ లో  సెటిల్ అయితే, రెండోవాడు చెన్నై లో ఉద్యోగం చేసుకుంటున్నాడు.  శర్మగారి పదిహేను ఎకరాల పొలం ఎప్పట్నుంచో సత్తయ్య కుటుంబం కౌలుకి చేస్తోంది. నెమ్మదిగా వూరు రూపు  మార్చుకుంటోంది. ఎక్కడినుంచో వచ్చిన చౌదరి పంట పొలాల్ని కొని చేపల చెరువులు వేయడం మొదలు పెట్టాడు. . చేపల పంట తీసాక చెరువు లో  కలుషితమైన  ఆ నీళ్లన్నీ కింద పొలాల్లోకి వదిలేయడం, వాళ్ళు వీళ్ళు కలిపి తలలు పగలకొట్టుకోవడం, సాధారణ విషయాలైపోయాయి. చౌదరిగారు  పంట ఎత్తడం చుట్టుపక్కల పొలాలు కొనడం సాధారణ విషయం అయిపోయింది. శర్మగారి కొడుకు హైద్రాబాదు నుంచి వూరికి వచ్చాడు. వున్న పదిహేను ఎకరాలు అమ్మేసి తండ్రిని పట్నానికి వచ్చేయమని ప్రతిపాదన. తల్లినైతే ఒప్పించాడు కానీ శర్మగారు ఇంకా సందిగ్ధంలోనే వున్నారు. ఈలోపులో కొడుకు చౌదరి తో బేరాలు మొదలు పెట్టేసాడు. ఎందుకో శర్మగారికి మనసు మనుసులో లేదు. అమ్మేస్తాము అనే నిర్ణయాన్ని తట్టుకోలేక పోతున్నారు. ఆ రోజు సాయంత్రం చీకట్లో సత్తయ్య ఇంటికి వచ్చాడు. శర్మగారివైపు చూస్తూ తనలో తానే మాట్లాడుకోవడం మొదలు పెట్టాడు.

“…..కొబ్బరి తోటలు సేపల సెరువులైపోయాయి, బంగారంలాంటి ఊడుపు సేలు అమ్మేసుకున్నారు, లీజుకి ఇచ్చారు, ఈ కొన్నవాళ్ళు ఎవరు బావు? సౌదరి గారిది మన జిల్లా ఏంటండీ. సేపల సెరువులు పెట్టి ఎం చేసారండి, కాపలా కత్తానికి ఒకడండి  పోనీ ఇద్దరనుకోండి, మందు గట్ట ఏసేవాడు ఆయన పైనుంచి రప్పిత్తన్నాడు, మరదే ఊడుపు  పొలం అనుకోండి ఎంత మందికి  కూలిదొరుకుతుందండి. తొలకరి నుoచి కోతలదాకా ఎంతమందికి కూలి దొరుకుతుందండి? పైగా వ్యసాయం పనులు ఏడాదికి ఏడాది ఉంటది….. కొబ్బరి తోటలకి ఎంత పనుండెడయ్య. అంతెందుకు బావు సేపల చెరువు వచ్చినప్పటినుంచి శానా బత్తులోరికి  పని పోయింది. చారెడు భూమి ఎంతమందికి కూడు పెట్టేదో ఎరుగుదురా?  సెరువులు పెట్టి భూములు సంపుతున్నారు బావూ. మాలాంటోళ్లు కడుపులు పట్టుకుని ఊరొదిలి పోతామండీ. మీరు మాత్రం ఏమి చేయగలరండి? మీ పొలంలో చౌదరిగారు చెరువులు పెడతారండి. మాలాంటోళ్ళ బతుకు ఏమైతే ఎవరికండి. ఊరంటే ఊళ్ళో చిన్న పెద్ద అందరూ బాగుంటేనే వూరండి…….”

చీకట్లో వెళ్ళిపోయాడు సత్తయ్య. శర్మగారు  కూతుర్ని కాపురానికి పంపే ముందు ఏడ్చాడు. కొన్నేళ్ల తరువాత మునిమాపువేళ సత్తయ్య మాట్లాడిన మాటలు సమూలంగా కుదిపేశాయి. రాత్రి ఎప్పుడోగానీ నిద్ర పట్టలేదు. ఉదయం లేస్తూనే భార్యతో అన్నారాయన ” చూడు నే చెప్తే భాధ పడతాడు, వాడు … ప్రస్తుతానికి పొలం అమ్మే ఉద్దేశ్యం లేదని  చెప్పు”.

అది ‘చేను, చేప’ కథ.

***

అంజి రెడ్డికి బొల్లిరాజు గారినుంచి కబురొచ్చింది. రాజుగారి దగ్గర గింజలకు, యూరియా కోసం అప్పుతీసుకుని మూడేళ్లైపోయింది, పొలాలన్నీ బీళ్లయిపోయ్యాయి. మెట్ట అంతా  దరిద్రం చుట్టుకుంది. దున్నల గుంపుల మాదిరి మబ్బులు ఊరిమీదకు రావడం తప్ప చినుకు చినకలేదు. వర్షాలు బొల్లిరాజుగారి తరపునే వున్నాయి, వడ్డీలు పెరిగిపొయ్యాయి. ఊరి దేవతకి కోళ్లు కోశారు. కోళ్ళుతిన్నమ్మ రాయి అయి కూర్చుంది.

” ఊరికి శని పట్టింది, పిల్లలిద్దర్నీ సరిగా కూడు పెట్టలేక తుని పంపేసాను. ఉదయమే రాజుగారు కబురంపేరు. పురుగులమందు ఇస్తారేమో అడగాలి”

రాజుగారింట్లో అంజిరెడ్డి కి వింతగా మర్యాదలు జరిగాయి. మూడేళ్లనుంచి వడ్డీ కూడా ఇవ్వని వాడికి ఆవ పెట్టిన పులిహోర విందు తినిపించారు రాజుగారు. లోపలికి వెళ్లిన అంజిరెడ్డికి రాజుగారు డాక్టర్ గారిని పరిచయం చేసారు. గొప్ప ఆపరేషన్లు చేసే డాక్టర్ అని, అయన ఆపరేషన్ లు చూసి హైదరాబాద్ వాళ్ళకే మతిపోతోందని ముక్తాయించారు రాజుగారు. డాక్టర్ గారు అంజిరెడ్డి ని దగ్గర కూర్చోపెట్టుకుని కాగితం మీద పెన్సిల్తో  బొమ్మ గీసి చూపించారు. అంత అయ్యాక బొల్లిరాజుగారు అన్నారు నేను చెప్పానని కాదబ్బాయి   ఆలోచించుకో. ఇదైతే ఒకళ్ళకి ఉపకారం చేసినట్లుంటది, నీ అప్పు తీరిపోద్ది, అంటూ మాట పైకి రానీయొద్దని చిన్న హెచ్చరిక కూడా చేసారు. డాక్టర్ గారు రిజర్వేషన్ చేయించి హైదరాబాద్ తీసుకు వెళ్లారు. ఉదయం హాస్పిటల్ లో సకల మర్యాదలు చేసారు, ఏసి గదిలో నిద్ర పట్టి ఊరంతా వర్షంలో ములిగినట్లు కలగన్నాడు. మర్నాడు ఆపరేషన్ ఐయింది, అప్పు వడ్డీతో సహా తీరిపోయింది తెలిసింది, దస్తావేజులు ఇచ్చేసారు, పెండికాయ తీసేసారా అమాయకంగా అడిగాడు అంజిరెడ్డి. ” పెండి కాయ కాదు మూత్రపిండం, డాక్టరుగారు చూపించారు, ఎర్రగా పెద్ద జీడిపిక్కలా ఉందనుకో ఇంకోటి ఉందిలే నీకు. దేవుడు తెలివితేటలు లేని నాకొడుకాని అనుకునేవాడిని, చూసేవా కొన్ని రెండెట్టాడు, కొన్ని ఒకటే పెట్టాడు. ఏటి ఉచ్చోసుకోడానికి ఒకటి చాలదేటి ?.

అది ‘అప్పిచ్చువాడును, వైద్యుడూనూ’.

***

అదొక చిన్న రాజ్యం, దానికి వీరసేనుడు మంత్రి. కొద్దిపాటి సైన్యంతో పాటు కాసింత అశ్విక దళం కూడా వుంది. గుర్రాలని జాగ్రత్తగా  చూసుకోవడం అశ్వికుల భాద్యత. వాటికి గడ్డి చేర వేసేందుకు కొంతమంది మోపుల వాళ్ళని నియమించారు. మోపులవాళ్ళు అశ్వికులు కలిసి సగం మోపులే తీసుకుని, పూర్తి మోపులకి డబ్బిచ్చి పంచుకోవడం మొదలు పెట్టారు. దానితో తిండి సరిగ్గాలేక గుర్రాలు చిక్కిపోవడం మొదలుపెట్టాయి. విషయం తెలిసినా సరైన ఆధారం లేక ఎవర్ని ఏమీ చేయడానికి లేకపోయింది.

రాజ గురువు సలహాతో మోపుల వారిమీద, మోసం జరగ కుండా గ్రాస అధ్యక్షుడిని నియమించారు. అధ్యక్షుడు ఆత్మీయుడైతే ఉచితంగా ఉంటుందని, సేనాని బావమరిదినే గ్రాస అధ్యక్షుడిగా నియమించారు. గ్రాస అధ్యక్షుడి వినతిమేరకు ఓ ఉపాధ్యక్షుడిని పర్యవేక్షణకు మరో నలుగురు ఉద్యోగుల్ని ఎక్కువ వేతనాలిచ్చి నియమించారు. అయినా సరైన తిండిలేక   గుర్రాలు కుక్కల్లా అయిపోయాయి.

అయితే పరిపాలనా సంస్కరణలు పూర్తిగా జరగక పోవడం వల్ల గుర్రాలకి గడ్డికి అంతరాయం ఏర్పడుతోంది అని  గ్రాసాధ్యక్షుడు తెలియచేసాడు. . అయితే అధ్యక్షులు, ఉద్యోగులు, ఉపాధ్యక్షులు, మోపుల వాళ్ళు, అశ్వికులు, పరస్పరం సహకరించుకుంటూ పాత పద్ధతినే మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి వీరబాహుడు  మోపుల వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించాడు.

పేదలు, ఇతర ఆధారం లేని మోపుల వారిని ఉద్యోగాలనుంచి తొలగించడం  అధర్మమని వారి కుటుంబాల ఉసురు ప్రభువులకి తగులుతుందని , వారిని ఉద్యానవనం లో నియమించడం న్యాయ సమ్మతమని అద్యక్షులువారు పట్టుపట్టారు. ఆ తరువాత రాజుగారు, అద్యక్షుడు చెప్పినట్లే చేస్తూ మంత్రి వీర బాహుడ్ని అతనికి  సంబంధం  లేని విషయాల్లో వేలుపెట్టొద్దని, ఆ భాద్యతల్లోంచి తొలగించారు.

సేవకి సంబందించిన విషయం కావడం వల్ల గ్రాసోద్యోగులు అందరు  సేనాపతి పర్యవేక్షణకు వచ్చారు, సేనాని దీనికి ఒక ప్రత్యేక శాఖ  నియమించి, కొత్త ఉద్యోగుల్ని మరికొంత మందిని నియమించాడు. సేనాని, గ్రాసాధ్యక్షుడు, సమస్య పరిష్కరించడానికి రాజుగారి అనుమతితో పశు గ్రాస క్షేత్రాలు వేయించారు. గుర్రాలకి శాశ్వతంగా ఆరోగ్య కరమైన గడ్డి ఏర్పరచడానికి ప్రత్యేకించి కొన్ని పొలాలు తీసుకున్నారు. రవాణా కోసం బళ్ల వాళ్ళని, బళ్ల వాళ్ళని పర్యవేక్షించడానికి వృషభ అధ్యక్షుల్ని, గడ్డి పెంచడానికి కోయడానికి అనేక మంది పనివాళ్లని నియమించారు. వీళ్లందరి వేతనాల అవసరాలు చూడడానికి కొంతమంది గణకులు, ఉప గణకులు వారిమీద ఒక అధికారిని కూడా నియమించారు. పొలాలు రాజధాని వెలుపల  ఉండడం చేత గ్రాసోద్యోగులకి అక్కడే కుటీరాలు ఇవ్వడం జరిగింది.

పశుగ్రాసం కొంత, కూరగాయలు కొంత, వరి కొంత, గ్రాసాధ్యక్షుడి పర్యవేక్షణలో వేశారు. కూరగాయలు, పంటలు విక్రయించడానికి ఒక పటిష్టమైన యంత్రాగాన్ని వేశారు. దీనికోసం వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగులందరికీ కూరగాయలు, వరి ధాన్యం, పాలు ఉచితంగా దొరుకుతుండడం తో పాటు, గడ్డి తో సహా అన్నీ అమ్మడంవల్ల వచ్చిన ధనం కూడా మిగులుతోంది. గ్రాసాధ్యక్షుడు, సేనాని, ఉపాధ్యక్షుడు, గ్రాసోద్యోగులు, గణకులు, వృషభాధ్యక్షులు, అశ్వికులు, ఇతరులు ఐకమత్యంగా పాలు తేనె వలె  కలిసి యంత్రాంగాన్ని  సమర్థవంతంగా నిర్వహిస్తూ “గ్రాసం” మేయడం దిగ్విజయంగా కొనసాగించారు.

గ్రాసోద్యోగులందరూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు గుర్రాలు తప్ప.

*

 

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు