ఆయనది మనిషిని కలిసినట్లుండే కవిత్వం!

గోపి మన మధ్యే కవిత్వ రూపంలో తిరుగుతున్న ఒక మనిషి. మనమే ఒక కవిత్వమయితే దాని రూపంగా కనిపించే ఒక కవిత ఆయన.

‘ఢిల్లీ వెళ్లినప్పుడల్లా నా అస్తిత్వాన్ని కాస్త కాస్త కోల్పోతుంటాను. పరాయీకరణకు తురాయిలా వెలుగుతుంది ఢిల్లీ..’ అని ప్రముఖ కవి ఎన్. గోపి రాసిన ఒక కవిత ఇటీవల  చదివి నిశ్చేష్టుడినయ్యాను. దాదాపు మూడు దశాబ్దాలుగా ఢిల్లీలో ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు నా తెలుగు నేల నన్ను పిలుస్తుందా అని అనుకుంటూనే ఉంటాను. ఇక్కడ ఏదీ నీది కాదు. నిన్ను నీవు పరాయీకరణ చేసుకుంటే కాని ఢిల్లీలో జీవించడం కష్టం. నాలో నన్ను కోల్పోతున్న భావాన్ని గోపి ఢిల్లీ కి అప్పుడప్పుడూ వచ్చినా ఎలా పట్టుకున్నారో అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  గోపి అభివర్ణించినట్లుగానే ‘ఎటు చూసినా ధగ్దమైన మాటల బూడిద, వ్యర్థమైపోయిన న్యూస్ ప్రింట్ కుప్పల మధ్య’ నేను ఇక్కడ జీవిస్తున్నాను.

‘ఢిల్లీని చూసినప్పుడల్లా నాకు సముద్రాల మీద పర్వతాలు పెత్తనాలు పెత్తనం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది’ అన్నారు గోపి. ఒక దుర్గ్మార్గపు ఆధిపత్య భావనను ఒక్క వాక్యంలో చెప్పడం అంటే ఇదే. ‘దశాబ్దాలుగా ఢిల్లీ వెళ్లి వస్తున్నాను కాని నిజం చెప్తున్నాను, దానితో పరిచయం నాకింకా కలగనే లేదు’ అని గోపి అన్నట్లుగానే నేను ముప్పై ఏళ్లుగా ఢిల్లీలో ఉన్నా నాకు ఇంకా అపరిచయస్తుల మధ్యే బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఆలూరి బైరాగి ఢిల్లీని భ్రాతృహంతకులనగరం అన్నాడు. మహాభారత కాలం  నుంచీ, ఔరంగజేబుల కాలం  నుంచీ ఇక్కడ హంతకుల స్వరూప స్వభావాలు మారుతున్నాయి.  ‘నీవు ప్రేమించే నగరంలో నిన్ను సమాధి చేసేందుకు రెండు గజాల నేల దొరకలేదు’ అని   ఢిల్లీ బాదుషా, కవి బహదూర్ షా జఫర్ ను బ్రిటిష్ సైనికులు బంధించి రంగూన్ కు ప్రవాసం పంపినప్పుడు వాపోయారు. నాడూ నేడూ ఢిల్లీ స్థానికులకు పరాయి ప్రదేశం, వలస వచ్చిన వారికి పరాయీకరణ చెందిన నేల.

వేలాది మంది రైతులు పొలాల్ని వదిలి ఢిల్లీ సరిహద్దుల్లోకి కదిలొచ్చిన దృశ్యం గోపి మరో కవిత ‘ఆక్రోశ్’ లో కనపడుతుంది. ‘పార్లమెంట్ భవనం చింపిరి జుట్టు చిక్కులు తియ్యలేని ముండ్ల దువ్వెనలా ఏమీ ఎరగనట్లు కులుకుతుంది.’. అని ఆయన రాశారు. ఐదేళ్ల  క్రితం ఢిల్లీ కాలుష్యం గురించి ఆయన ‘ఢిల్లీ గాలి’ అన్న శీర్షికతో  రాసిన కవిత్వం చదివితే ఇవాళ్టికీ పరిస్థితి ఏమీ మారలేదని అనిపిస్తుంది. ‘గాలిని పీల్చకండి. ఊపిరి తిత్తులను ఆపేయ్యండి.. గుండెకు తాళం వెయ్యండి..స్పందించడం మానుకోండి.. రేపు ఊపిరి తిత్తులను గుర్తుగా పెట్టి ఎన్నికల్లో గెలవండి.ఇది ఫలానా పార్టీ కాదు..ఢిల్లీని గ్యాస్ ఛేంబర్ గా మార్చిన రాజకీయ గాలి..’ అని రాసిన గోపి కవిత కలుషిత గాలి వెనుక రాజకీయాన్ని అర్థం చేయిస్తుంది.

‘నిన్ను నీవు తెలుసుకోవాలంటే నీ గురించి పలవరించే ఒక కవితలోకి వెళ్లాలి.’ అన్నది నా భావన. గోపి కవిత్వంలో మన గురించి ఒక అన్వేషణ కనిపిస్తుంది. ఆయన వాక్యాల మధ్య మన ఆలోచనలు తచ్చాడుతున్నట్లు కనిపిస్తాయి. ‘వ్యవస్థకు రూపం ఉండదు. అది ఆక్టోపస్ లా అందరిలో వ్యాపించి కాస్సేపు కదిలి మళ్లీ నిద్రపోతుంది.’ అన్న గోపి వాక్యాల చదివినప్పుడు మన శరీరం లో ఒక ఆక్టోపస్ ప్రయాణిస్తున్నట్లనిపిస్తుంది.

ప్లాటు ఫారం మీద
రాలిపడ్డ ఎండుటాకులు
జాలి గలగలలు
వడి విరిగిన కిర్రుమనే వెర్రి ఆశలు
ముడితే చాలు చిట్లిపోయే
పొడి పొడి కలలు….

అని ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం రాసిన గోపి కవితలు ఇప్పుడు చదివినా ఆయన కవితల్లో మనిషి జీవితం కనిపిస్తుంది. ఆ జీవితంతో పెనవేసుకున్న తాత్వికత కనిపిస్తుంది. అంతే కాదు, ఆ జీవితంలో వైరుధ్యాలకు కారణమైన వ్యవస్థ దుర్మార్గాలూ కనిపిస్తాయి. ఆయన సప్తతి సందర్భంగా ఇటీవల వెలువడిన ‘మనిషిని కలిసినట్లుండాలి’ అన్న పుస్తకంలో 2016 నుంచి 2019 వరకు రాసిన కవితలు ఉన్నాయి. ‘ఎవరినైనా కలిస్తే మనిషిని కలిసినట్లుండాలి. పచ్చని చెట్టుక్రింద సేద దీరినట్లుండాలి.. దోసిలిలో జీవితం ప్రతిఫలించాలి..’అని రాసిన గోపి ఈ సంకలనంలోనే కాదు, తన ప్రతి కవితా సంకలనంలోనూ, మనిషిని కలిసినట్లే అన్న భావన కల్పిస్తారు.

గోపి పెద్దగా క్లిష్టమైన పదాలు వాడరు. మనం మాట్లాడే మాటలే ఆయన చెబుతున్నట్లుంటుంది. కాని ఆ మాటల్ని చదివితే అవి ఒక ఆలోచనగా మారతాయి. ‘పదాలను వాక్యాల్లో ప్రయోగించడమంటే జీవితంలో అడుగుపెట్టడమే…’ అని ఆయన ఒక కవితలో రాశారు. అలా గోపి వాక్యాలతో ప్రయాణించడం కూడా జీవితంలో అడుగుపెట్టడమే అన్నట్లుగా ఉంటుంది.

గోపికి సాధారణ మాటల్లో అనంతమైన అర్థాల్ని చెప్పడమే కాదు. అందమైన పదాలతో మనసును ఆకర్షించడమూ తెలుసు.  వాన వెలిసిన వేకువ, తీగమీద నడుస్తున్న నీటి ముత్యాలు, తడిరెక్కలల్లారుస్తూ ఆడుకుంటున్న పిచ్చుకలు, పాలపొరలారేసినట్లున్న ఆకాశం, కొబ్బరాకుల మధ్య చప్పుడు చేస్తున్న చలిగాలి, పచ్చిక చీరల్ని అల్లిబిల్లిగా అందుకుని ఒయ్యారపు ఒంపులు తిరుగుతున్న పెల్లబాటలు అన్న హృద్యమైన వాక్యాల్నిఆయన ఏనాడో ప్రయోగించారు. ఈ నాటికీ ఆయన గుండె తడి అదే విదంగా తళ తళా మెరుస్తూ కనపిస్తుంది.

తాజా సంపుటిలో ‘భావయాత్ర’ అన్న కవితలో ‘అందమైన ప్రయాణం, కారు కాగితమ్మీద పెన్నులా జారిపోతోంది..స్థిరత్వంలో పోగొట్టుకున్నదంతా చలనంలో సాధించినట్లు..ఒక విహ్వలత, ఒక ఆర్ద్రత భావనకు ఒక చేయూత కోసం బాష్పాకులితమైనట్లు, పురాతన జ్ఞాపకాలు పక్షుల బారులై ఎగురుతున్నట్లు’ అని రాస్తూ మననూ తన భావయాత్రలో కి తీసుకువెళతారు.  ‘తెలియకుండానే పొద్దుపొడుపు ఒంటినిండా పాకినట్లు… పక్షుల కలకలా రావాలకు టీకా తాత్పర్యాలను రచిస్తున్నట్లు … నీ చిరునవ్వే లేకపోతే నేను పేదనవుతాను. అకవినవుతాను.’ అన్నారు ఆయన మరో కవితలో.

మనుషులు ఉంటారు. కాని మాట్లాడుకోరు. ఒక యాంత్రిక నిశ్శబ్ద జీవితంలో సజీవ ప్రాణులే నిర్జీవంగా మారతారు. మాట్లాడుకున్నా వాటికి అర్థం ఉండదు. ఆధునిక సమాజంలో అందరికీ ఎదురయ్యే ఈ అనుభవాన్ని గోపి అద్భుతంగా రాశారు.  ‘మన మధ్య సంభాషణ గడ్డకట్టిందంటే ఏదో జరుగరానిది జరిగినట్లు… ఇక ఇప్పుడు ముఖాలు మాట్లాడుకుంటాయి. విచక్షణ ఉన్నంతవరకే అది సంభాషణ. లేదా అది ఒట్టి రణగొణ’ అన్నారు.

ఇవాళ దళారులే రైతు భాష మాట్లాడుతున్నారు.. ‘పద్యంలోంచి ఓ పదం తప్పిపోయి మార్కెట్ యార్డులో ఓ మూలనకూర్చొని రోదిస్తోంది…’ అని గోపి ‘పునరావృత్తి’ అన్న శీర్షికతో రాసిన   కవితలో దగాపడ్డ రైతు వేదన కళ్లముందాడుతుంది. ‘ఇవాళ మార్కెట్ యార్డ్ కాకులు పీక్కుతింటున్న రైతు శవం లాగుంది…’ అని ఆయన మరో కవితలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘ఇవాళ జానపద గీతాలు ఆశ్రిత వృత్తుల నయాగీతాలుగా మారుతున్నాయి…’ అన్న వాక్యంలో జానపదం జనపదంగా కాక పాలకపదంగా మారిన వైనాన్ని ఆయన మృదువుగా ఎండగట్టారు.

‘పోలీసు అండలేకుంటే ప్రజాస్వామ్యం బతకదు. అన్నట్లు ప్రజాస్వామ్యం ప్రజలకోసం వచ్చిందా, ప్రజలనుంచి లాక్కున్నదా’ అని ప్రశ్నించే గోపి అనేక కవితల్లో నేటి ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారిన వైనాన్ని చిత్రించారు.

బాల్యాన్ని, తల్లి దండ్రులను, గ్రామాల్నీ కవితల్లో తలుచుకున్నప్పుడల్లా ఆయన భావనలతో మనం మమేకం కాక తప్పదు. ‘ఇవాళ ఎందుకో మా నాయన గుర్తుకొస్తున్నాడు. మరిచిపోయింది లేదు కాని ఇవాళ మరింత గాఢంగా..’ అని తలుచుకునే గోపి, ‘బహుశా ఈ కల్వర్టు మీద కూర్చొని మా అమ్మ కట్టిచ్చిన సద్దిమూట విప్పాడేమో… సద్ది అంటే మామిడికాయ తొక్కు కలిపిన అన్నం. పొట్లం విప్పగానే ఆకలి పుష్పంలా గుప్పుమనే పరిమళం. కాస్సేపు ఇక్కడ కూర్చుని మా తండ్రిని ఆవాహన చేస్తాను.. అన్నప్పుడు ఆ పరిమళం మనం చుట్టుకుంటున్నట్లనిపిస్తుంది.. ఎందరికుంటుంది ఈ అపూర్వ అనుభూతి!

‘నిన్నటి దాకా అతడు మనిషి’ అన్న కవితలో మనుషుల పెదాలపై ఉన్నట్లుండి కదిలే విషపు చిరునవ్వు మనకు కనపడుతుంది. ‘భూమీ సముద్రం, ఆకాశం అపరిచితంగా మారుతాయి. చిరకాల స్నేహితాలు అహితంగా పరిణమిస్తాయి. అది వర్షం కూడా కాదు, ఒకే ఒక్క విష బిందువు చిందుతుంది, మనుషులందరూ శత్రువులా ప్రవర్తిస్తారు.. సంకుల సమరాలు మొదలవుతాయి..’ అని రాసినప్పుడు మన చుట్టూ ఉన్న మానవ ప్రపంచం ఎంత కలుషితమయిందో అర్థం అవుతుంది.

గోపి మన మధ్యే కవిత్వ రూపంలో తిరుగుతున్న ఒక మనిషి. మనమే ఒక కవిత్వమయితే దాని రూపంగా కనిపించే ఒక కవిత ఆయన. మామూలు మాటలతో కవితలు అలవోకగా రాయడం వల్లనేమో, మామూలు మనుషులు కూడా ఆయనతో పాటు నడిచి కవులయ్యారు. తన చుట్టూ కొన్ని దశాబ్దాలుగా మానవ కవితా ప్రపంచాన్ని నిర్మిస్తున్న ఒక అసమాన సామాన్య కవి గోపి.

‘ఏమన్న గానీ ఇవాళ పద్యం రాసే తీర్త… తంగెడు పూల రెక్కలను పొట్లాలు కట్టి దే పేదల కవిత్వమని దశ దిశలా చాటిస్తా… నదులు తిరిగి కాలువల్లోకి ప్రవహించినట్లు పట్నాలను పల్లెల్లదాకా ఈడ్చుకుపోతా…’ అనే గోపికి కవిత్వం ఒక దిన చర్య మాత్రమే కాదు ఒక తపశ్చర్య. ‘ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం నవ్వు ధగ్దమై పోవాలి. కవిత్వమంటే ధగ్దమై మళ్లీ జన్మించాలి..’ అనే గోపి కవిత్వం ఎప్పుడు చదివినా ధగ్దమై మనం పునర్జన్మ చెందినట్లే ఉంటుంది.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గోపి గారి కావిత్వాన్ని చకగే సమీక్షించారు కృష్ణుడు.గోపి గారి కావేత్వమ్ నిజంగానే అందమయిన పదాలతో అర్ధవంతంగా ఉంటాయి.

    “గోపి మన మధ్యే కవిత్వ రూపంలో తిరుగుతున్న ఒక మనిషి. మనమే ఒక కవిత్వమయితే దాని రూపంగా కనిపించే ఒక కవిత ఆయన. మామూలు మాటలతో కవితలు అలవోకగా రాయడం వల్లనేమో, మామూలు మనుషులు కూడా ఆయనతో పాటు నడిచి కవులయ్యారు. తన చుట్టూ కొన్ని దశాబ్దాలుగా మానవ కవితా ప్రపంచాన్ని నిర్మిస్తున్న ఒక అసమాన సామాన్య కవి గోపి.”

  • కృష్ణారావు గారు నమస్కారం . గోపి సార్ కవిత్వాన్ని మీరు విశ్లేషణ చేసినతీరు గోపిసార్ కవిత్వం లాగే చాలా బాగున్నది. బాగున్నది అని అంటే సరిపోదు . సమాజాన్ని ప్రతిబింబిస్తూ రాసే కవిత్వం కదా అలా వేలు పట్టుకుని చిన్నపిల్లలను నడిపిస్తూ తీసుకెళ్లినట్లే సార్ కవితా పంక్తుల వెంట నడుస్తాం . మీ అనుభవాలను గోపి సార్ కవిత్వానికి జోడిస్తూ మీదైన శైలిలో సమీక్ష చేసారు .congratulations
    — కొండపల్లి నీహారిణి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు