ఆయనతో ప్రయాణం ఒక పుస్తకం చదివినట్టే!

క గంధం చెట్టు అక్కడ ఉంది అంటే, ఆ అడవి ప్రాంతమంతా సువాసన భరితమై ఉంటుంది అని చిన్నప్పుడు చదివాను, అప్పటినుంచి నా మనసులో నాటుకుపోయినటువంటి విషయం ఏంటంటే గొప్ప వ్యక్తులు ఎందరినో ప్రభావితం చేస్తారు అని! మా కాలంలో జన్మించిన అమ్మాయికి రెండు జీవితాలు ఉండేవి. పుట్టినిల్లు ఒక జీవితం మెట్టినిల్లు  ఒక జీవితం. రెండు గొప్ప చరిత్ర గల కుటుంబాల వారసత్వాలను తలకెత్తుకున్న కవియిత్రిగా, రచయిత్రిగా ఇప్పుడు మీకు మామగారైన కొండపల్లి శేషగిరిరావు గారితో నేను కలిసి నడిచిన ప్రయాణం చెప్పదలుచుకున్నాను. “ఏదో  పుట్టాం కాబట్టి బతకాలి. బతకాలి కాబట్టి తినాలి అనుకోవడం కాదమ్మా! ఏదైనా మంచిని సాధించి చూపాలి.” అదే జీవితం అని చెప్పిన మా మామయ్య, మా నాన్న తర్వాత నాన్న! మళ్ళీ నేనిక్కడ మా కాలంలో అనే అనాల్సి వస్తుంది. ఆ రోజులలో చాలా వరకు చాలా ఇళ్ళల్లో మామగారు అంటే కోడళ్ళు భయపడుతూనో, మాట్లాడకుండా ఉండడంతోనో కాలం గడిపే వాళ్ళు. దీనికి భిన్నంగా మా ఇంట్లో వాతావరణం ఉండేది. మంచివారు, ఉత్తముడు, సహనశీలి, సౌమ్యులు, శ్రమశీలి వంటి విశేషణాలను ఎన్నైనా వేయవచ్చు మా మామగారికి. వీరిని గురించి చెప్పాలి అంటే ముందు మామయ్య గురించి చెప్పాలి. నేనెవరో అనేదీ చెప్పాల్సి వస్తుంది. మా మామగారు కొండపల్లి శేషగిరిరావు గారు. కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ చిత్రకళా విద్యార్థి. దేశం గర్వించదగిన చిత్రకారులు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చిత్రకళా విభాగంలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు.

నేను ప్రముఖ స్వాతంత్ర్య  సమరయోధుడు పెండ్యాల రాఘవరావు గారి చిన్న కుమార్తెను. రెండు ఎమ్.ఎల్.ఎ.సీట్లు, ఒక ఏం.పి.సీట్ వరంగల్ నుండి గెలిచి, ఏం.పి.గా ఐదేళ్లు పార్లమెంటు లో ప్రజాగళం వినిపించిన కమ్యూనిస్టు నాయకుడు మా నాన్న. మేము బాపు అంటాము. మా అమ్మ కౌసల్యాదేవి. 1982 మే నెల లో నాకు కొండపల్లి వేణుగోపాలరావుతో పెళ్లయింది. శేషగిరిరావు గారికి మూడవ కొడుకు మావారు. అప్పుడు నేను బి.ఎ.రెండవ సంవత్సరం హన్మకొండ పింగిళి కళాశాలలో చదువుతున్నాను. పరీక్షలప్పుడు పెళ్లి డేట్ కుదిరింది. నేను ఒప్పుకోలేదు.” పరీక్షలయ్యాక ముహూర్తం పెట్టుకోవచ్చు కదా! పెళ్లి నా చదువు కంటే ముఖ్యమైందా బాపూ?” అన్నాను. మళ్లీ రాసుకోవచ్చు బిడ్డా, సప్లిమెంటరీ లో ఆ ఒక్క సబ్జెక్టు పరీక్ష, అని నాకు నచ్చ చెప్పారు. ‘ఫెయిల్ అని వస్తుందా? ఆబ్సెంట్ అని వస్తుందా ‘మెమో ‘మీద? అని నేను అడిగిన రెండో పశ్న! ఆబ్సెంట్ అని వస్తుందన్నారు.

“పెళ్లయ్యాక నీ చదువుకు ఏ ఆటంకము ఉండదు అని చెప్పారు, అన్నీ తెలుసుకున్నాము కాబట్టే ఇలా చదువు మధ్యలో పెళ్లి పెట్టుకున్నాము బిడ్డా!” అని కూడా నచ్చ చెప్పారు, విన్నాను. పెళ్లయింది. తర్వాత పుట్టింటికి వచ్చి మిగతా సబ్జెక్ట్స్ అన్ని రాసేశాను. ఇంగ్లీష్ ఒక్కటి సప్లిమెంటరీ లో రాసాను. సెకండ్ ఇయర్ పాసయ్యా. హైదరాబాదులో రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో బిఏ ఫైనల్ ఇయర్ లో జాయిన్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నాను. విశ్వవిద్యాలయం మారుతున్నారు కాబట్టి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే మైగ్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావాలి అన్నారు. అప్పుడు అంత ఈజీగా ఇచ్చేవారు. కాదు. మా మామగారు స్వయంగా కాకతీయ యూనివర్సిటీ కి వెళ్లి, వైస్ ఛాన్స్లర్ గారితో, రెడ్డి విమెన్స్ కాలేజీలో రావిభారతి గారికి మా బాపు “ఆడపిల్లలకు పెళ్లి అయ్యి ఇలా మారాల్సి వచ్చినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు మైగ్రేషన్ తప్పకుండా ఇవ్వాలి “అని అని మాట్లాడి సర్టిఫికెట్ తెచ్చారు. రెడ్డి విమెన్స్ కాలేజీలో రావిభారతి గారికి   కూడా చెప్పి, నాకు అర్థం కాని పాఠాలను ఎలాగైనా వీలు చేసుకుని చెప్పమని అడిగారు. గౌరవనీయులు రావి భారతి గారు నేను మిస్ అయిన రెండు పరిచ్చేదాలను నా ఒక్కదాన్ని కూర్చోబెట్టి, కొన్ని క్లాసులు తీసుకొని నాకు నేర్పించారు. బహుశా, నాలాంటి అమ్మాయిలకు అప్పుడు ఇది ఒక అపురూప సంఘటన అయ్యుంటుంది. ఇది మా మామయ్య గారు కోడలు గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

ఒక మనిషిని అంచనా వేయడానికి కొన్ని సంఘటనలు పెద్ద రుజువులుగా ఉంటాయి. బి.ఎ. ఫైనల్ ఇయర్ అయిపోయింది. నేను డెలివరీకి మా పుట్టింటికి వెళ్లాను.” ఈ జీవితం చాలా పెద్దది ఎన్నో అవకాశాలుంటాయి ఒక అవకాశం తప్పిందని నిరాశ చెందద్దు నువ్వు మళ్ళీ పరీక్ష రాసుకొని పాస్ అయి పై చదువులు చదువుకోవచ్చు “అంటూ ఒక భారమైన సమాచారాన్ని మోసుకొచ్చింది ఒక ఉత్తరం. అది మా మామగారి నుంచి నాకు వచ్చిన ఉత్తరం ! నా దుఃఖానికి అంతులేదు. “నేను ఫెయిల్ అవ్వను కచ్చితంగా పాస్ అవుతాను. చాలా బాగా రాశాను అని నా గోల”బాలింత ఏడవకూడదు” అని అమ్మ! ఈ స్థితిలో నన్ను చూసి బాపు వెంటనే హైదరాబాద్ కు వెళ్లారు. విషయం కనుక్కుంటే, పెళ్లప్పుడు రాయని ఇంగ్లీష్ ఎగ్జామ్ తెచ్చిన తంటా!కె.యు. లో రాసి పాసయ్యా, అది చెల్లదంటే మళ్లీ ఓ.యు. లోనూ రాసి పాసయ్యా!కానీ, ఎవరు చేసిన కన్ఫ్యూజనో ఈ మార్కులు మెమోలో పడక ఫెయిల్ అయినట్టు భావించి రిజల్టు ఆపేశారు. ఇదంతా తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. వెంటనే ఎం.ఎ. ఎంట్రెన్స్ రాయలేకపోయాను. సరే ఇది నాకు జరిగిన నష్టం. కానీ, ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే మా మామయ్య నాకు రాసిన ఉత్తరం! ఎంత బాధ్యతగా ఫీల్ అయ్యారు చెప్పే ఉద్దేశం ఇది! అందుకే, ‘ మెట్టినింటి నాన్న’ అని చెప్పాను.

నేను చిన్నప్పటినుంచి బొమ్మలు చాలా బాగా దించే దాన్ని. ప్రముఖ ఆర్టిస్ట్ గారి ఇంట్లోకి వెళుతున్నాను అంటే నేను పెద్ద ఆర్టిస్టుని అవుతానని భావించుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. నేను వేసిన బొమ్మ లను చూసి మామయ్య బాగానే వేశావు కానీ ఫ్రీ హ్యాండ్ లేదు మరి కాస్త ప్రాక్టీస్ చేయాలి,చూడకుండా దించడం అలవాటు చేసుకోవాలి అని అన్నారు. తర్వాత మావారికి ట్రాన్స్ఫర్ అయింది. ఇంక అంతే అక్కడితో నా ఆశ ఆగిపోయింది. ఇద్దరు పిల్లలు, వాళ్ళ చదువులు. కాని హన్మకొండ లో ఉన్నప్పుడే, ఎం.ఎ. ఎక్స్టర్నల్ చేశాను, టి.పి.టి చేశాను. మా వారు నన్ను బ్యాంక్ పరీక్షలు కూడా రాయించారు. ఇంగ్లీష్, మాథ్స్ విషయాలు తనే శ్రద్ధగా నేర్పించారు. సాహిత్యంపై పూర్తి అవగాహన లేకున్నా, చదివిన ఆ కాస్త జ్ఞానంతో కవితలు, చిన్న కథానికలు రాసేదాన్ని. కవయిత్రిగా అప్పుడే తొలి బీజాలు అక్కడే పడ్డాయి. కానీ నేను పత్రికల్లో కనిపించడానికి దశాబ్దాలు పట్టింది, అది వేరే విషయం అనుకోండి. మావారు ఇంజనీర్. ఆయనకు మళ్లీ హైదరాబాద్ కు బదిలీ అయింది.

మనిషి జీవితంలో ఏం సాధిద్దామని అనుకుంటారో? ఏం సాధిస్తారో అనేవాటి మధ్య ఒకటేదో సన్నని గీతేదో ఉంటుంది అని నాకనిపిస్తుంది. మాది పెద్ద సమిష్టి కుటుంబం. పిల్లలు చదువులు హడావిడి. అయినా సరే మామయ్య నా గురించి పట్టించుకున్నారు. ఇంత చదువుకుని ఖాళీగా ఉండడం ఎందుకమ్మా ఉద్యోగం చేసుకో అన్నారు. మామయ్యనే స్వయంగా స్కూల్స్ లో అప్లికేషన్ ఎలా రాయాలో రాసి ఇచ్చారు. నీ చేతితో నువ్వు తిరిగి రాసుకోని వాళ్ళకు ఇవ్వమ్మా అని చెప్పారు. మా అత్తయ్య నన్ను తీసుకుని అశోక్ నగర్ లో పీపుల్స్ హై స్కూల్ కి తీసుకువెళ్లి అక్కడ ప్రిన్సిపాల్ కి నన్ను పరిచయం చేశారు. సరే, అక్కడ డెమో క్లాసు తీసుకోవడం, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఉద్యోగం సంపాదించుకోవడం అనేది నా ప్రతిభ పైన ఆధారపడి ఉంది కానీ, ఈ ప్రయత్నానికి నాకు బాసటగా నడిచింది అత్తయ్య మామయ్యలే అని కచ్చితంగా చెప్తున్నాను.

మామయ్యకు మనుషులంటే అభిమానం. ఎందుకంటే వారు ఏ రోజు ఏ వ్యక్తిని కించపరిచి మాట్లాడడం నేను చూడలేదు. ఎప్పుడో తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. రాత్రి 11, 12 గంటల వరకు పని చేసుకునేవారు. జె.ఎన్.టి.యు.లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసినప్పుడు సమయపాలన క్రమశిక్షణ ఎలా ఉండేదో రిటైర్ అయ్యాక కూడా ఒక నియమ బద్ధమైన జీవితం ఉండేది.

చెప్పాలంటే మామయ్య రిటైర్ అయ్యాకనే విస్తృతంగా బొమ్మలు దించారు. ప్రభుత్వం కూడా పెద్దపెద్ద చిత్రాలను వేయించింది. పంజాగుట్టలో ఉన్న హుడా కాంప్లెక్స్ మైత్రివనంలో గోడలకి వేసిన రెండు పెద్ద పెద్ద చిత్రాలు ఇప్పటికీ సందర్శకులను అలరిస్తున్నవి. విశ్వరూప సందర్శనం, లవకుశలు అశ్వమేధ యాగాన్ని చేజిక్కించుకోవడం అనే బొమ్మలు. వాటిని మ్యూరల్ పెయింటింగ్స్ అంటాం. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియం ముందు పెద్ద మ్యూరల్స్ వేశారు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇవన్నీ మాకు చెప్పని పాఠాలే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గుట్టలు, కొండలు మాయమైపోయాయి. ఇప్పుడు మా మామయ్య వేసిన బొమ్మల్లో కొన్నే మనం చూస్తాం. అంత ఎండలో పడి వచ్చేవారు అవన్నీ వేసుకుని. రాగానే ఇంత మజ్జిగ నీరో, నిమ్మకాయ షర్బతో ఇస్తే మహా ఆనంద పడిపోయేవారు. అలా ప్రతి చిన్న పనిని అప్రిషియేట్ చేసేవారు.

మోడరన్ పెయింటింగ్స్ వేసినా, సామాజిక చిత్రాలు వేసినా వారి కుంచె విన్యాసం అబ్బురపరుస్తుంది. కోతులను ఆడించేవాడిని మదారి అంటారని నాకు తెలియదు. మామయ్య చెప్తే గాని తెలిసింది. ప్రకృతి రామణీయకాన్ని చిత్రాల్లో బంధించారు, చారిత్రకాంశాలను చిత్రించారు మహాపురుషుల బొమ్మలు గీశారు. ప్రముఖుల పోట్రేట్స్ వేశారు. అన్నింటిని మించి భారతీయ సంప్రదాయాలకు నిలువెత్తు రూపాలైన పౌరాణిక గాథలను వర్ణమయం చేశారు. ముఖ్యంగా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కథాత్మకంగా నీటివర్ణ చిత్రాలు వేసినప్పుడు ఆ సందర్భంలో వచ్చే కొన్ని ప్రముఖమైన శ్లోకాలను నాకు చదివి వినిపిస్తూ మాట్లాడడం నేనెలా మరచిపోతాను? నా సంతోషం ఏంటంటే ఆ సాహిత్యంశాలన్నీ నాకు తెలిసి ఉండడం వలన అవి నాతో మామయ్య చర్చించేవారు! ఎవరికి దక్కుతుంది ఈ అవకాశం?

మా ఇంటికి ఎందరో గొప్పగొప్ప వ్యక్తులు వచ్చేవాళ్ళు. ఏనాడు డాంబికాలు ఇష్టపడని మా మామయ్య, మిద్దె మీద ఉన్న తన గదిలో మామూలు కుర్చీలు వేసి కూర్చోబెట్టేవారు. వారిని ఆహ్వానించడంలోనే వీరి గౌరవ మర్యాదలు కనిపించేవి. వాళ్లకు నన్ను పరిచయం చేసేటప్పుడు “మా కోడలు నీహారిణి. ఎం.ఎ. తెలుగు సాహిత్యం చదివింది” అని చెప్పేవారు. నాకు ఒక వైపు సంతోషము, మరోవైపు భయము కలిగేది. ఏవైనా సాహిత్య విషయాలు ప్రస్తావిస్తారేమోనని! ఎప్పటికప్పుడు నన్ను నేను తర్ఫీదు చేసుకుంటూ ఉండేదాన్ని చదువుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు ఎందుకు అడుగుతారు? అది నా అమాయకత్వం! అరిపిరాల విశ్వంగారు, జె. బాపురెడ్డిగారు వీరు ప్రముఖ కవులు. బి.ఎన్.రెడ్డి గారు, వీరు కవి, ఆర్కిటెక్చర్, ఎం ఎస్ రెడ్డి గారు, వీరు ప్రముఖ చిత్ర నిర్మాతలు, జూనియర్ సముద్రాల ప్రముఖ సినీ గేయ రచయిత, వానమామలై వరదాచారిగారు, బిరుదు రాజు రామరాజుగారు, సినారెగారు వంటి ప్రముఖుల మాటల్లో స్నేహం కనబడేది. నేనప్పటికి ఇంకా కవయిత్రిగా పేరు తెచ్చుకోలేదు. కాళోజిగారు సరే సరి మా బాపుకు కూడా ఫ్రెండే కదా!

ఇలాంటి కవులు రచయితలు మా ఇంటికి వచ్చేవారు. ఇక సహ చిత్రకారులైన పి.టి రెడ్డిగారు కాపు రాజయ్యగారు వచ్చేవారు. రాజయ్య గారికి భోజనం వడ్డించినప్పుడు నేను కూడా వారి సంభాషణలో పాల్గొనేదాన్ని. వీళ్లే కాదు ప్రభుత్వ అధికారులు కూడా మామయ్యగారిని బొమ్మలు వెయ్యమనడానికో, తీసుకోవడానికి వచ్చేవారు. ఆ కాలంలోని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ.పీ.వీ.శర్మ గారు,  చీఫ్ సెక్రటరీ రంజిత్ అరోరా గారు,  డి.జి.పి. ప్రభాకర్ రావు వేదవతి ప్రభాకర్ గార్లు, ఐఏఎస్ ఆఫీసర్ గాయత్రి రామచంద్రన్ గారు ఇలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా అత్తయ్యను తప్పకుండా పరిచయం చేసేవారు. నన్నే కాదు మిగతా కోడళ్ళు, కొడుకులు అక్కడ ఎవరున్నా పరిచయం చేసేవారు వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కుటుంబ విలువలతో ఉండేవాళ్లు ఇటువంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పడం నా ఉద్దేశం.

జేఎన్టీయూలో ప్రొఫెసర్ గా పనిచేసినప్పుడు ఎందరో వందలాది విద్యార్థులు వారికి క్రింద శిష్యరికం చేసే ఉంటారు. ప్రస్తుతం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న చిత్రకారులలో సురభి వాణి దేవి, బి. నరసింగరావు, వైకుంఠం, లక్ష్మా గౌడ్ గౌరీ, శంకర్ గార్లు మరెందరో మామయ్య విద్యార్థులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. చిత్రకారులు ఉల్చిగారు మాతోనూ చాలా బాగా మాట్లాడారు. మేము శిల్పకళా వేదికలో చిత్రకళా విభాగానికి సంబంధించిన గ్యాలరీని ఓపెన్ చేసినప్పుడు మామయ్య చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడు చందనాఖాన్ గారు, ఐ. కిషన్ రావుగారు అతిథులుగా వచ్చారు. మా అమ్మాయి మామయ్య పెయింటింగ్స్ తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. తాము స్వయంగా పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చేసుకున్న నుంచి, తన కొడుకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న వరకు గల మార్పులను చూసిన వారుగా, ఆ రోజు తమ మనవరాలు తన బొమ్మలను పెయింటింగ్స్ ని వాయిస్ తో పాటు ఇవ్వడం అనేది ఆయనకు చాలా ఆనందం కలిగించింది, వస్తున్న మోడర్న్  టెక్నాలజీని బాగా ఆస్వాదించారు. శభాష్ శభాష్ అంటూ మెచ్చుకున్న మాటలు, వారి కంటి వెలుగులు నేను ఎప్పటికీ మర్చిపోలేను.

మామయ్యకు ఏదో ఒక వేదిక మీద సన్మానాలు జరుగుతూనే ఉండేది. రవీంద్రభారతిలో ఉగాది సందర్భంగా వేదిక మీద స్క్రీన్ పైన ఒక పెద్ద వర్ణచిత్రం ఉండేది. అది మామయ్య చిత్రించిందే. భారతీయ సంస్కృతిని, చరిత్రని ప్రస్ఫుటిస్తూ ఉన్న ఆ చిత్రం ముందు కూర్చుని సభా కార్యక్రమాలు నిర్వహించేవారు. పాత జ్ఞాపకాల పుటలను తెరిస్తే ఇప్పుడూ కళ్ళముందు మెదులుతుంది.

ఫోటో: కందుకూరి రమేశ్ బాబు

ఢిల్లీ ఎ.పి. భవన్ లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చి ఒక చిత్రం దగ్గర అట్టే నిలబడిపోయారు. ప్రతిష్టాత్మకమైన హంస అవార్డు చంద్రబాబు నాయుడుగారి చేతుల మీద అందుకున్నారు. నేటి తెలుగు తల్లి విగ్రహానికి రూపకర్త అయిన మామయ్యను గౌరవించని ముఖ్యమంత్రులు, మంత్రులు లేరు. భారత దేశ ప్రధాని పి.వి. నరసింహారావుగారి చేతుల మీదుగా సన్మానం జరిగింది. దేవులపల్లి రామానుజారావుగారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన సందర్భమది. ఈ నిలువెత్తు పోట్రేట్ ప్రస్తుతం సారస్వత పరిషత్ లో ఉన్నది. శివానంద మూర్తి ట్రస్ట్ వారు మామయ్యను సన్మానించినప్పుడే నేను సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిని కలిసింది. తెలుగు యూనివర్సిటీలో మామయ్యకు, ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్, సినీ దర్శకులు బాపుగారికి తెలుగు యూనివర్సిటీలో సన్మానం చేశారు. వారు వీరికి అభిమానట! వీరు వారికి అభిమాని అట! ఇవి ఆరోజు మా పరిచయాల ముచ్చట్లు. ఇక త్యాగరాయ గానసభ వేదిక పైన మామయ్యతో పాటు మరో సన్మాన గ్రహీత దాశరధి రంగాచార్యులు ఆ రోజు వీరి సంభాషణ భలే విచిత్రంగా సాగింది. కిన్నెర ఆర్ట్స్, వంశీ ఆర్ట్స్, మానస ఆర్ట్స్ ఇలా ఎన్ని సంస్థలు మామయ్యను సత్కరించి గౌరవించాయి. ఈ సభలకు వెళ్ళినప్పుడు నేర్చుకున్న జ్ఞానమంతా నాకు వెన్నంటే ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చేప్పుడు మామయ్య చాల విషయాలు చెప్పేవారు.

మామయ్య కవి, రచయిత. నేను గీస్తాను కానీ మాట్లాడలేను అని వేదిక పైన అన్నా కూడా ఆ ఉపన్యాసంలో క్లుప్తంగా బాగా మాట్లాడేవారు. ఈ విషయాన్ని వేదిక పైన ఉన్న అధ్యక్షులు వెంటనే అనేవారు కూడా! మీ కుంచెనే కాదు మీరూ చక్కగా మాట్లాడుతారు.. అని! అప్పుడే అనుకునేదాన్ని కొండ అద్దమందు… అని! నేను పుట్టిన చిన్న పెండ్యాలలో ఏ విలువలు అయితే నేర్చుకున్నానో, పెరుగుతున్న అత్తగారింట్లోనూ నేర్చుకున్నాను.

ఇక్కడ ఒక విషయం తప్పకుండా పంచుకోవాలని అనిపిస్తున్నది! అప్పుడు మేము హనుమకొండలో ఉంటుండే వాళ్ళం. మా వారు ఆఫీస్ నుంచి రాగానే హడావిడిగా, “నాన్నగారికి పద్మా అవార్డ్ ఇస్తున్నారు మనం వెళ్దాం పద పద” అని పిల్లల్ని నన్ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మామయ్యకి ఈనాడు పత్రిక ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ” ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్, రేపు ఉదయం మీ ఇంటికి వస్తాం” అని! కానీ అవార్డు రాలేదు, వేరే వారికి ఇచ్చారు. నేను చాలా బాధపడి, ఉక్రోషంతో మామయ్య గదిలోకి వెళ్లి, ఇది అన్యాయం మామయ్య ఇలా చేసారేంటి అని కన్నీళ్లు పెట్టుకున్నాను. “ఇంత వాటికి బాధపడొద్దమ్మా. అవార్డుల కొరకు కాదు నేను బొమ్మలు వేసేది. నా ఇష్టంగా వేసుకుంటున్నాను అంతే. కానీ, ఒక్క విషయం అనిపించిందమ్మా, నాకు ఇవ్వకున్నా కనీసం పి.టి.రెడ్డి గారికి ఇచ్చినా బాగుండేది ఈ అవార్డు” అన్నారు. ఇది ఆయన సంస్కారం, ఇది అయన విజ్ఞత, ఆయన సహనశీలత. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా పత్రిక ముఖంగా చెప్తున్నాను, కానీ ఈ విషయం ఎక్కడా ఇదివరకు రాలేదు. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ అనలేదు.

‘చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పేరుతో నేను మామయ్య జీవిత చరిత్ర రాసాను. కలర్ పిక్చర్స్ తో పుస్తకంగా ముద్రిస్తున్నానని తెలిసి “ఎందుకమ్మా అంత ఖర్చు? ఇవన్నీ చేతి చమురు వదిలించుకోవడం తప్ప మరి ఏమీ లేదు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా” అన్నారు! ఆనాడు వారికి 60 ఏళ్లు వచ్చినప్పుడు షష్టిపూర్తి ఉత్సవం చేస్తాము అంటే కూడా ఈ ఆడంబరాలు వద్దు” అనే అన్నారు. “కష్టపడి సంపాదించడమే కాదు పొదుపు చేయడం నేర్చుకోవాలి, ఉన్నంతలో బ్రతకాలి అని వారు చెప్పినటువంటి మాటలే జీవిత పాఠాలు మాకు.

వారి జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభలో సినారె గారు, వరవరరావు గారు ఒకే వేదిక మీద ఉన్న ఆనాటి జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయి. ముఖ్యంగా మామయ్య కళ్ళలో ఆ ఆనందం నేనెప్పటికీ మరువలేను. 80వ దశకం లోకి వచ్చాక క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గుముఖం పట్టడంతో సభలకు వెళ్లడం తగ్గించేశారు. బొమ్మలు వేయడం తగ్గించేశారు.

రవీంద్ర భారతి కళాభవన్ లో వారం రోజులు మామయ్య బొమ్మల ప్రదర్శన చేసాం. వారి జీవితం గురించి ఒక డాక్యుమెంటరీని తీసాం. ప్రభుత్వ సంస్కృతిక శాఖ వారు స్పాన్సర్ చేశారు. యూట్యూబ్ లో చూడవచ్చు. ఇవన్నీ చేస్తుంటే చాలా సంతోషించారు. మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. ఇది చాలు వారికి జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి. మీతో పంచుకోవడానికి!

ఆరుగురు కొడుకులు, కోడళ్ళు, ఒక కూతురు, అల్లుడు వీళ్ళందరికీ ఇద్దరేసి పిల్లలు 14 మంది మనవలు, మనవరాళ్లతోనూ మా అత్తయ్య కమలమ్మతోనూ ఒక నిండైన జీవితాన్ని గడిపి, అద్భుతమైన చిత్రాలను మనకు వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారు కొండపల్లి శేషగిరిరావుగారు. ఒక ప్రేమ మూర్తిగా, ఒక విద్యా విజ్ఞాన సంపన్నుడిగా, ఒక మానవత్వం మూర్తిభవించిన వ్యక్తిగా, అన్నిటికీ మించి  ఒక సూపర్ పెయింటింగ్ ఆర్టిస్ట్ గా దగ్గరి నుండి చూసాను కాబట్టి కోడలిగా వారి మనస్తత్వాన్ని చెప్పగలిగాను. వారి ఆదర్శవంతమైన జీవితం స్ఫూర్తిదాయకమైంది.

*

ఫోటోలు: కందుకూరి రమేశ్ బాబు

కొండపల్లి నీహారిణి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొండపల్లి శేషగిరిరావు గారు గొప్ప కళాకారులని తెలుసుగానీ, ఆయన జీవితం, వ్యక్తిత్వం బొత్తిగా తెలియలేదు నాకు ఇన్నాళ్లూ. మీరు ఆ అంశాలను చక్కగా ఆవిష్కరించారు. ముందు తరాల నిబద్ధత, అణకువ, సంస్కారం – గుర్తింపుకూ, బిరుదులకూ ఆశించకుండా తమ వంతు పని చేసుకుంటూ పోవడం – గొప్ప ఆదర్శాలు. ధన్యవాదాలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు