ఆమె వ్యక్తిత్వం స్ఫూర్తిగా రాసిన ‘పర్దా’

ఎంపిక: అఫ్సర్

కొన్ని కథల్ని చదువుతున్నప్పుడు జీవితమే కనిపిస్తుంది. తెరలన్నీ చీల్చుకొని, అచ్చంగా బతుకు దృశ్యమే అక్షరాలా వేదిక మీద నిలబడినట్టు వుంటుంది. వేంపల్లె షరీఫ్ కి పరిచయం అక్కర్లేదు. ఎలాంటి మిరుమిట్లు గొలిపే అలంకారాలూ లేని, ఆడంబరాలూ లేని కథన శిల్పి. కొన్ని కథల్ని చదువుతుంటే, ఈ కథలు షరీఫ్ కీబోర్డు మీద బలవంతాన టైప్ చేయలేదనీ, ఆ కథే అతని చేత అతని వేళ్ళని నడిపించిందనీ అనిపిస్తుంది. అట్లాంటి కథల్లో వొకటి – పర్దా! ఆ కథకి షరీఫ్ అందించిన చిన్న నేపథ్యంతో పాటు కథ కూడా చదవండి. ఈ పర్దా వెనక బతుకు కథని చూడవచ్చు. 

 

 

‘పర్దా’ కథకు పదమూడేళ్లు. అప్పుడే ఇన్నేళ్లు గడచిపోయాయా.. అనిపిస్తుంది తల్చుకుంటే. జేజి దూరమై కూడా పదమూడేళ్లు. ఆమె బతికున్నంతకాలం ఆమె కథ రాయాలని ఎంతో ప్రయత్నించాను కానీ కుదరలేదు. చివరికి ఇది రాసేటప్పటికి ఆమె లేదు. ఈ కథ 2009లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అప్పటి సండే ఎడిటర్‌ వేమన వసంత లక్ష్మి గారు ప్రచురించారు. కథ ప్రింటయ్యాక అందులో ఉన్న నా ఫోన్‌కి ఎన్ని కాల్స్ వచ్చాయో లెక్కలేదు. కొంతమంది సనాతులు ఇబ్బంది పడి ఫోన్‌ చేశారు. ఎక్కువ మంది మాత్రం బాగా రాశావు అన్నారు. జేజి పాత్రతో లీనమై ఆమెను చూడాలని ఫోన్‌ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఆమె చనిపోయిన విషయాన్ని తెలుపుతూ తిరిగి ఆంధ్రజ్యోతి వాళ్లు ఉత్తరాల పేజీలో ప్రచురిస్తే కానీ నాకు ఫోన్లు రావడం ఆగలేదు. జేజి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను చిన్నపిల్లవాణ్ని. నాకు లోకం తెలిసేలోపు ఆమె ముసలిదై చనిపోయింది. లేకపోతే ఆమెతో మాట్లాడాల్సినవి, పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆమె వ్యక్తిత్వం నాకు నిరంతర స్ఫూర్తి. ఇన్నేళ్లకు మళ్లీ ఈ కథను అందరికీ గుర్తుచేస్తున్నందుకు “సారంగ”కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

*

పర్దా

-వేంపల్లె షరీఫ్‌

 

అది మా ఇల్లు.

మూడు గదులుంటాయి. మొదటి గది ఓపెన్‌. దానికి షెట్టర్‌ వేయించాలని అలాగే వదిలేశాడు మా నాయన. రెండో గది తలుపుకు ఓ పరదా ఉంటుంది. అది ఇంతకు ముందు లేదు, మా అక్క పెద్దమనిషి అయ్యాక వచ్చింది. ఆ తర్వాతే మా ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి.

మూడో గది వంటగది.

మా అక్క తిన్నా తిరిగినా ఏం చేసినా ఈ రెండు గదుల్లోనే. మొదటి గదికి తలుపు లేదు కాబట్టి కేవలం రాత్రిపూట మాత్రమే ఆమెకు అందులో ఎంట్రీ. ఇంటికి పరాయివాళ్లు ఎవరొచ్చినా మొదటి గదిలో కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవాడు మా నాయన. వాళ్లున్నంతసేపూ రెండో గది తలుపు వేసి పర్దాను పదేపదే జరిపేవాడు. ఒక్క మా నాయనే కాదు మా అమ్మ కూడా అంతే. అదే అలవాటు ఆ ఇంట్లో పిల్లవాడినైన నాకూ వచ్చేసింది.

ఒక్క మా జేజికే అది అలవాటు కాలేదు. ఆ వయసులో కూడా మా జేజిది తిరిగే కాలే. కట్టేసినా ఒక్కచోట ఉండే రకం కాదు. కాయకష్టం చేసిన కాళ్లవి. అటూ ఇటూ తిరక్కపోతే వాటికేం పాలుపోదు.

అలా తిరగడం మా అమ్మకు నచ్చదు. ముసలివాళ్లు అన్నాక ‘అల్లా… బిస్మిల్లా’ అనుకుంటూ ఓ మూల ఉండాలన్నది మా అమ్మ సిద్ధాంతం. ప్రపంచం కొట్టుకు పోయినా సరే కూర్చున్న చోటు నుంచి కదలకూడదు అంటుంది. అందుకు మా జేజి ససేమిరా అంటుంది. అటో ఇటో వెళుతుంది. లేదా ఆ ఇల్లూ… ఈ ఇల్లూ చుట్టేస్తుంది. కొంచెం పరిచయమైనా చాలు… గంటల తరబడి వాళ్లింట్లో తిష్ట వేస్తుంది. ఇది టౌను… ఇక్కడ ఇలాంటివన్నీ చేయకూడదంటే వినదు.

‘ఇదేం ఊరు కాదా… వీళ్లేం మనుషులు కారా…?’ అని ప్రశ్నిస్తుంది. మా జేజికి ఒంట్లో వయసుడిగింది కానీ నోటికి బిస తగ్గలేదు. కొడుతుందో… కొట్టించు కుంటుందో తర్వాత విషయం కానీ తేడా వస్తే మాత్రం ఎంతటి పోట్లాటకైనా సై అంటుంది. వాళ్లొకటంటే మా జేజి పది అంటుంది. వాళ్లు పది అంటే మా జేజి వంద అంటుంది. ఇక బూతు పురాణాలకైతే కొదవేలేదు. ఆమె మొరటు సామెతలు వదిల్తే అవతల ఆడోళ్లకైనా, మగోళ్లకైనా సిగ్గుతో బట్టలూడిపోవాల్సిందే. అందుకే పల్లెలో మా జేజి నోటికి ఎవరూ ఎదురెళ్లరు.

అంతటి రౌడీ చరిత్ర ఉన్న మా జేజి ఒక్క మా అమ్మకు మాత్రమే భయపడుతుంది. కొడుతుందో, తిడుతుందో అని కాదు- టయానికి ఇంత బువ్వ పెట్టకుండా ఎగ్గొడుతుందని.

ఈ వీక్‌నెస్‌ ఉంది కాబట్టే మా జేజికి కొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్లూ ఆ వీక్‌నెస్‌ కూడా ఉండేది కాదు. మా అమ్మతో గొడవైతే మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీసి తుర్రుమని బస్సెక్కి వెళ్లిపోయేది. అక్కడ కూలీ నాలీ చేసుకోనైనా బతుకుతుంది కానీ చాన్నాళ్ళ వరకు ఇటు తొంగి చూసేది కూడా కాదు.

మా నాయన కూడా మా జేజిని పట్టించుకునేవాడు కాదు. ఈ అత్తా-కోడళ్ల పోరులో నలిగిపోవడం ఎందుకులే అన్నట్టుండే వాడు. ఏ అమాస… పున్నానికో వెళ్లి బత్తెం పడేసేవాడు. మిగతా రోజుల్లో కాయకష్టమే మా జేజికి గతి.

అయినా జేజికి ఎందుకో ఆ జీవితమే బాగుందనిపిస్తుంది. పేరుకు కొడుకున్నాడు కానీ తన కష్టం-సుఖం పట్టించుకోడు. వీడి దగ్గరకొచ్చి తనింట్లో తాను దొంగ తిండి తినాల్సిన ఖర్మేమిటి? వీడికన్నా పరాయివాళ్లు మేలు. వెళ్లి కూర్చుంటే… పెట్టే ఒకపూటైనా నోటికి మనస్ఫూర్తిగా ముద్ద అందిస్తారు. పోనీ… వీడి కడుపులో మంచి  పిల్లోళ్లు అయినా పుట్టినారా… అంటే ఇద్దరికి ఇద్దరూ (అక్క, నేను) దొంగలే. అమ్మ బిడ్డలు. ఆయమ ఏమి చెబితే అది వింటారు. ఆయమ ఏది అంటే అది అంటారు. ఆ యమ దిక్కే మాట్లాడతారు. ఇక తనకెవరు దిక్కు? ఎందుకుండాలి ఇక్కడ?

ఇది జేజి మనసులోని మాట. ఈ విషయం తానే ఒకసారి చెప్పింది.

జేజి గత వారమే ఇక్కడికొచ్చింది. తట్టాబుట్టా సర్దుకుని ఏకంగా ఇక్కడ ఉండి పోవడానికే దిగింది. ఎలాంటి గొడవ లేకుండా కిక్కురుమనకుండా పడి వుండటానికి వచ్చింది. జేజిలో ఇంత రాజీ ధోరణి అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇక సొంతగా బతికే శక్తి ఆమెకు లేదు. పల్లెలో కూడా చాలామంది జేజిని తిట్టినారంట. ‘ఇప్పుడైనా కొడుకు దగ్గరికి వెళ్లి మానంగా మట్టంగా బతుకు… ఇక్కడుంటే దిక్కులేని చావు చస్తావు’ అనినారంట. గత్యంతరం లేని స్థితిలో ఇక్కడి కొచ్చి చిక్కుకుపోయింది జేజి.

‘‘నేను మూయను… నువ్వు తీయను… నేను మూయను… నువ్వు తీయను… పొద్దుగూకులు నాకిదే పనైపోతాండాది… ఇంట్లో గోషా పెట్టిన ఆడపిల్ల ఉండాదన్న గ్యాపకం కూడా లేకపోతే ఎట్టా? అయినా ఏం పనుంటాది ఇంట్లోకి, బయటికి పదితూర్లు తిరగనీకి’’ గయ్యిమంది అమ్మ గొంతు.

ఏదో ఆలోచనల్లో ఉన్న మా జేజి ఉలిక్కిపడి వెనక్కి చూసింది. ఎప్పుడొచ్చిందో` అమ్మ వెనకాలే వచ్చి గుమ్మానికి పరదా సర్దుతోంది.

‘‘పాడు పరదా… దేనికీ అడ్డే… వొచ్చినప్పటి నుంచి లచ్చతూర్లు తిట్టించింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ ముసలిపానానికి గ్యాపకమే ఉండటంలా’’ మనసులో అనుకోబోయి పైకే అనేసింది జేజి.

అమ్మ మరింత రెచ్చిపోయింది.

‘‘ఆ… గ్యాపకం ఉండదు. తిండానికేతే అన్నీ గుర్తుంటాయి. ఇంకా తొమ్మిది గూడ కాందే… నాష్టా అని వొచ్చావే… ఇది గూడా అట్టనే గుర్తు పెట్టుకోవాల…’’

జేజి కడుపు కాలిపోయింది, తిరిగి ఏదో ఒకటి అనేదే కానీ మనసు కుదుట పర్చుకుంది. ‘ఈ పరదా ఒక్కటీ గుర్తుంచుకుని వేస్తే పోలా…’ అనుకుందేమో.

ఈ మధ్య జేజికి ఆకలి ఎక్కువవుతోంది. ఏవోవో తినాలనిపిస్తోంది. ముసలి మబ్బున ఇలాగే అనిపిస్తుందేమో. అందుకే ఏం పాలుపోక ఉట్టినే ఇంట్లోకి బయటికి తిరుగుతుంది. మనిషిని చూసైనా గుర్తు తెచ్చుకుని ఇంట్లో ఉన్న పై తిండి ఏదైనా చేతిలో పెడతారేమోనని ఆమె ఆశ. తిండికి బదులు… తిట్లే కడుపు నింపుతున్నాయి.

మెల్లగా వంగి మొగసాల్లో కూర్చోని మళ్లీ ఓసారి పరదావైపు చూసింది జేజి. పూల పూల పరదా. దాని మధ్యలో మక్కాబొమ్మ ఉంది. గుమ్మానికి నిండుగా కప్పి ఉంది. జేజికి పల్లెలో ఈ బాధ లేదు. తన రెండంకణాల గుడిసెలో తానే మహారాణి. ఇంట్లోకి, బయటికి ఎన్నిసార్లయినా తిరగొచ్చు. తన మాటకు ఎవరూ ఎదురు చెప్పరు. తనను ఎవరూ అడ్డుకోరు.

‘‘ఇక్కడే ఈ పరదాలు… అంతరాలు. ఒట్టి దాపరికపు మనుషులు. అసలు తమకు గోషా అనే మాటే తెలియదు. ముట్టయిన నాలుగు రోజులు ఆడపిల్లను ఓ మూల కూర్చోబెట్టి ఐదోరోజు చేతికి చింతబర్ర ఇచ్చి గొడ్ల కాడికి పంపిస్తారు కాపలాకు…’’ గొణుక్కుంది జేజి.

జేజికి అక్క మొహం గుర్తొచ్చినట్టుంది.

‘‘అందరూ ఆ పిల్లను ఎర్రగా ఉందంటారు. అది ఎరుపు కాదు తెలుపు… ఎండ, గాలి తగలక పాలిపోయిన తెల్లమొఖం… ఊదుమొఖం…’’ పరదా మీద కోపం అక్క మీదికి మళ్లి తిట్టుకుంది జేజి.

‘‘ఎందుకు పనికొస్తుందీ పిల్ల. రేపు పెళ్లయి ఒక కాన్పు అవుతానే కళ్లు నేల కేసి చచ్చుబడిపోతుంది. అదే మా కాలంలో  అయితేనా ఆ వయసులో చెట్లు ఎక్కేసే వాళ్లం… చింత చిగురు జోలెనిండా తెచ్చేవాళ్లం. మొగోని మాదిరి గొడ్డలి చేతబట్టి కొండకెళ్తే గొడ్డలి దెబ్బకు కొండ ఓ… అని అర్సాల. సాయంత్రానికి కట్టెలన్నీ మోపుకట్టి నెత్తికెత్తుకుని ఊళ్లోకొస్తే… చూసేటోళ్లు ఓయమ్మా … అని నోరెళ్లబెట్టాల. ఇప్పు డున్నారు ఎందుకు? పాడుపిల్లలు… గోషా అంట… గోషా… నీళ్ల బిందె సరిగా అందు కోలేదు… నైసు పాప…’’

జేజి వొదురుకుంటూ ఉండగానే- నాయన హవాయి చెప్పులు కాళ్లకు కొట్టు కుంటూ యాడ్నుంచో ఎండబడి ఇంటికొచ్చాడు. చెప్పులు బయట్నే వొదిలి పడుకున్న పసిపాప మొహంపై కప్పిన బట్ట తీసినట్టు మెల్లగా గుమ్మానికున్న పర్దా తీసుకుని లోనికెళ్లాడు. అది చెక్కు చెదరలేదు. ఎలా ఉన్న పర్దా అలా వొచ్చి నిలబడి, ఇంట్లోకి తొంగి చూస్తున్న జేజి కళ్లకు అడ్డుపడిరది.

జేజి కోపం ఈసారి నాయన మీదికి మళ్లింది.

‘‘సన్‌…న్న బిడ్డ వీడు. కట్టుకోడానికి బట్ట కూడా లేకుండె నా బట్టకి. కొంగు పట్టుకుని యనకెనకాలే తిరిగేటోడు. ఎట్టాంటోడు ఎట్టా మారిపోయినాడు’’

జేజి గతం తవ్వుకుంటూ … నాయన్ని పెంచి పెద్ద చేయడానికి పడ్డ కష్టాలు గుర్తుకు తెచ్చుకుంది.

మా అబ్బకి రెండో పెళ్లాం మా జేజి. ఆ కాలంలో మొగుడికి ఆడోళ్లు చచ్చేంతగా భయపడేటోళ్లు. మా జేజి కూడా అబ్బ దెబ్బకి వాళ్ల అబ్బను గుర్తు తెచ్చుకునే దంట.

‘మ్మే… నన్నీబు…’ అంటే వణుకుతా వచ్చి నిలబడుకునేదట.

మొగుడు అంటే ఏంటో కూడా తెలియని చిన్నవయసులోనే రెండోపెళ్లోడికి ఇచ్చి చేశారు జేజిని. పుట్టింటి పేదరికాన్ని తిట్టుకుంటూ ఉండేది జేజి.

‘‘ఆ తాగు బోతోడికి, ఆ రోగిష్టికి ఇచ్చి చేసినారు. పిల్లోడు పురిట్లో ఉండగానే నేలకూలి చచ్చి పాయ పాడుమనిషి. అబ్బుడ్నుంచి ఒకటే కష్టాలు’’ అని బాధపడేది.

ఉండుండి మొహానికి ఏదో ఈగ కొట్టింది. ‘‘ఓసి దీని దుంపతెగ… ఇట్ట కొడతాంది మొఖానికి’’ గొణుక్కుంటూ రెండు చేతుల్ని మొహమ్మీద టప్పుమని పించింది. ఆ చప్పుడుకు ఈగ ఎటో పారిపోయింది.

‘‘వసార్లోనే కూచోనుండాగాని… చూసీ చూడనట్టు పోతాండాడు. కనీసం ఏమ్మా … నాష్టా తిన్నావా … అని కూడా అడగలేదు … మద్దెలో పోయే నా కొడుకు…’’ మళ్లీ నాయన మీద తిట్లు లంకించుకుంది.

‘‘ఆడముండని… మొగోడు లేని ఆడదాన్ని… నేను బయపడ్లా వీణ్ణి పెంచడానికి … వీడు బయపడతాండాడు… ఇంతింత మీసాలు పెట్టుకుని, ఇంత మొగోని మాదిరి ఎదిగి పిల్లకు పెండ్లి చేయడానికి వణకతాండాడు… కొజ్జా నాకొడుకు.’’

‘పిల్లదాన్ని ఎందుకురా గోషా పెట్టినా’వని ఆమధ్య ఒకసారి జేజి మా నాయన్ని అడిగింది.

‘‘యాన్నించి తెస్తావ్‌ లచ్చలు? లచ్చల్తో పని… గోషా లేకండా తిప్పితే మన్తో అయితాదా… అసలు తట్టుకుంటామా…? పిల్లదానికి పెండ్లి చేయడమంటే మాటలనుకుంటాండావా..? ఇంట్లో కూచోబెట్టి నాలుగు ఉర్దూ ముక్కలు చెప్పిస్తే ఎవరో ఒకరు వాళ్లే జేసకపోతారు… లెక్కదండిగా ఇయ్యకుంటే పాయ… పిల్లదాన్ని పరువు గానైనా పెంచిండారు గదా… అనుకుంటారు’’ అన్నాడు మా నాయన.

జేజికి నాయన ఉద్దేశ్యం అర్థమైంది. కట్నానికి భయపడి పిల్లదాన్ని గోషాపెట్టి వీధిలో పెద్ద పరువుగల్లోడు అనిపించుకుంటాండని.

‘‘ఒక్క పిల్లదాన్ని గోషా పెట్టడంలో ఉన్న శ్రద్ధ మరేమిటికీ ఉండదు. కన్న తల్లిని ఎలా చూసుకోవాల… ఎంత మర్యాదగా మాట్లాడాల అనేది తెలీదు నా బట్టకు. యాడా అక్కరకు రాని పట్టింపులు ఒక్క పిల్లదాన్ని గోషా పెట్టడం దగ్గర్నే అక్కరకొచ్చినాయి యీనికి…’’

ఈగ యాణ్ణుంచో వచ్చి మళ్లీ మొహానికి కొట్టింది.  ఏదో చెరుపు జరుగు తుందని భయపడిరది జేజి.

‘‘దీన్నోట్లో మట్టికొట్టా… ఏమిటికి దీనికి ఇంత బయం లేదు…’’ అంటూ చేయి చాచి గాల్లో ఎగురుతున్న ఈగను గట్టిగా పట్టుకుంది. నలిపి ఇంటి ముందుకు విసిరింది. ఈగ కళ్లు తేలేసి వెల్లకిలా పడిపోయింది.

జేజి ఆణ్నుంచి లేచి మెల్లగా ధర్మాసుపత్రి దావ  పట్టింది. గుండెల్లో  నొప్పిగా ఉండాదని ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిందో నాయన్తో. ఒకటికి రెండుసార్లు మాతర్లు తెచ్చిచ్చినాడు నాయన. ఆ తర్వాత పట్టించుకోలేదు. జేజి ఏం పాలుపోక ధర్మాసు పత్రికైనా వెళ్లొద్దామనుకుని లేచి నిలబడిరది.

జేజి దుప్పటి కప్పుకోదు. భుజమ్మీద ఓ తెల్లటి పాతగుడ్డను టవల్లా వేసుకుని నడుస్తుంది. పల్లెలో కూడా జేజి అంతే.

ఆ దుప్పటి గుడ్డను తీసుకుందామని మెల్లగా పరదా జరిపి ఇంట్లోకి వెళ్ల బోయింది. మల్లా దుప్పటి బయట గూట్లోనే ఉన్న సంగతి గుర్తు కొచ్చి ఆగిపోయింది.

పరదా వేయకుండా తిరుగుతోందనే కోపంతో అమ్మనే జేజికి సంబంధించిన వస్తువులన్నిట్నీ బయట్నే పడేసింది. తనపై కోడలికున్న నిర్లక్ష్యానికి తిట్టుకుంటూనే జేజి మెల్లగా దుప్పటిని అందుకుంది. చంకలో పెట్టుకుని అరుగు మెట్లుదిగి రోడ్డు మీదికి నడిచింది. ఆ పొద్దు ఎందుకో దుప్పటిని కనీసం భుజమ్మీద కూడా వేసుకోబుద్ధి కానట్టుంది. ‘ముసల్దాన్ని ఎట్ట తిరిగితే ఏముండాదిలే…’ అనుకుందో ఏమో!

అరిగి, నవారు విరిగిన చెప్పులకు పిన్నీసు తగిలించుకుంది. గుండెల్లో నొప్పి ఆ పొద్దు ఇంకొంచెం ఎక్కువగా అనిపించిందో ఏమో వొంగిపోయి ముక్కుతా మూలుగుతా ఆస్పత్రికి పోయింది. జేజి పోవడం వీధిలో చెక్కపనాయప్ప చూసినాడు.

వాళ్ల చుట్టాలబ్బాయికి మా అక్కను అడుగుతున్నారు. ఆయప్పకు మా ఇంటి గురించి బాగా తెలుసు. నిన్న సంబంధం మాటలు మాట్లాడుదామని ఇంటి కొచ్చినప్పుడు మా జేజిని కూడా చూసినాడు.

ఇప్పుడు మా జేజి ఇలా ఆస్పత్రికి వెళ్తూ ఆయప్ప కంటపడిరది. ఆయప్ప ఊరకే ఉండకుండా ‘‘ఏమ్మా… యాడికో పోతాండవే…’’ అంటూ పలకరించినాడు. జేజి ఆగి గుర్తుపట్టి దారిలోనే మాటలు పెట్టుకుంది.

‘‘దరమాస్పత్రికి పోతాండా కొడుకా… కొడుకు సూపిచ్చమంటే సూపిచ్చక పాయ… దరమాస్పత్రికైనా పోతే సూదేచ్చారు కదా అని పోతాండా…’’ అంది.

చక్కపనాయప్ప ఏమనుకున్నాడో ఏమో ‘ఆస్పత్రికి ఎందుకు? ఏమిటికి?’ అని కూడా అడగలా. నేరుగా ఇంటికొచ్చి అమ్మకు, నాయనకు ఆవేశంగా ఏదో చెప్పినాడు.

నాయన ఉడికిపోయినాడు. అమ్మ భగభగ మండిపోయింది. కొంచేపటికి జేజి మళ్లీ అలాగే దుప్పటిని చంకలో పెట్టుకుని ఇంటికొచ్చింది. జేజిని చూస్తూనే నాయన రగిలిపోయినాడు.

ఏమ్మా… యాడికి పోయినావే… అని కొడుకు అడుగుతాడేమో తనకొచ్చిన రోగం గురించి చెబుదాములే… అని ఆశపడిన జేజికి నిరాశే ఎదురైంది.

వచ్చీ రాంగానే జేజి మీదకి లేసుకున్నాడు నాయన.

‘‘అడుక్కుతినేదాని మాదిరి… రోడ్డు మీదికి అట్టా సావకపోతే… పిల్లదానికి పెండ్లయ్యేదాకైనా దుప్పటి నిండుగా కప్పుకొని చావొచ్చుగదా…’’ అన్నాడు.

జేజికి నోటమాట రాలేదు. ఏం చెప్పాలో తెలీలా. ఒంట్లో శక్తినంతా కూడ గట్టుకుంది. వచ్చినప్పటి నుంచి కూడబెట్టుకున్న అక్కసునంతా వెళ్లగక్కింది.

‘‘పెండ్లికూతుర్ని జేచ్చాండాది నన్నా… నీ కూతుర్నారా… నా కొడకా… నా వెంట పడినావు… ఇబ్బుడికే వొళ్లంతా పులిసిపోయి సచ్చాండా… డాక్టర్‌ ఇంతింత సూదులు వేసి ఇన్నిన్ని మాతర్లు రాయించినాడు. ఏం చేయాల్రా దేవుడా అని నేను ఉంటే నీ పొటుకేమిట్రా నాకు… వోరోరే… బాగైపోయింది ఈడికొచ్చి. మనిషిని తల్లాడనివ్వరు… మాట్లాడనివ్వరు… ఇంగేమిటికిరా మీరు బతకతాండేది? ఇబ్బుడిబ్బుడే సండ్లొచ్చాండే పిల్లదాన్నయి దుప్పటి కప్పుకుని తిరుగుదునా… సెప్తాంటే రోంతన్నా సిగ్గుండాల… ఎవరైనా వింటే మూచ్చారు… నాకొడకా… మొఖమ్మీద… థూ… అని’’ అంటూ నిజంగానే ఊసింది నాయన మీద ఉక్రోషం ఆపుకోలేక జేజి.

నాయన మరింతగా కాలిపోయినాడు. కూచున్నోడు గభేలున లేచి కసితీరా పిడికిలి బిగించి జేజిని ఒంగబెట్టి ఒక్క గుద్దు గుద్దబోయేంతలో ‘‘వాయమ్మో… సంపేసినాడే ముసల్దాన్ని…’’ అంటూ జేజి వలవలా ఏడ్చేసరికి వదిలేసినాడు.

వదిలేసినా కూడా జేజి అరుపులు ఆగలా. ‘‘ఆగిత్యందానా…ఎందుకు అట్టా అరుచ్చాండావే… నిన్నెవురైనా పొడ్సినారా… నోర్మూయ్‌…’’ గట్టిగా కేక పెట్టినాడు నాయన.

అయినా జేజి ఊరుకోలేదు. పైగా ‘‘పొడుచ్చావు… పొడవనిచ్చే మనిషివి’’ అంటా ఎత్తిపొడిచింది.

ఇంగ నాయన ఆవేశాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. పళ్లు పటపటా కొరుకుతూ మీదిమీదికి ఉరికురికి వెళ్లాడు. ఇంకాసేపు అక్కడుంటే ముసల్దాన్ని చంపేస్తాడే అనుకున్నాము. ఇంతలో టకటక పంచె ఎగ్గట్టి వీధిలోకొచ్చి నిలబడు కున్నాడు నాయన. చెప్పులేసుకుని అడ్డురోడ్డు వైపు వెళ్తా… ‘‘ఒరే సిన్నోడా… ఇంగోసారి ముసల్ది దుప్పటి లేకుండా బయటికెళ్తే సెప్పరా… సెప్తా దీని సంగతి…’’ అంటూ వార్నింగిచ్చినాడు.

జేజి వణికిపోయింది

‘‘ఇదేం ఖర్మరా దేవుడా…’’ అంటూ ఏడ్చింది.

‘‘వీడి సిన్నబ్బుడు ఊళ్లో కొట్టాలు కాలిపోతే నా బిడ్డ పచ్చుండాడని ఇల్లిల్లూ తిరిగి అడుక్కున్నా… అబ్బుడు గోషా, పరదా అనుకోనుంటే ఈ నా కొడుకు ఇంతోడు అయ్యేటోడా?’’ అంటూ శోకాలు పెట్టింది.

‘‘మల్లా నాలుగిళ్లు అడుక్కున్నా పర్వాలా… నేనీడ ఉండలేను వెళ్లిపోతా…’’ అని సర్దుకోవడం మొదలుపెట్టింది.

నేను గుమ్మానికున్న పరదాను సర్ది పట్టుకుని నీళ్లు నిండిన కళ్లతో జేజి వైపే చూస్తుండిపోయాను నిస్సహాయంగా.

000

ఆదివారం ఆంధ్రజ్యోతి, 10 జులై 2009

వర్తమాన కథ, 2009

మ్యూజ్‌ ఇండియా డాట్‌కామ్‌ (ఇంగ్లీష్‌ అనువాదం), మార్చి 2012

‘జన్‌సత్తా’ హిందీ దినపత్రిక, ఆదివారం అనుబంధం, 07 అక్టోబర్‌ 2012

వేంపల్లె షరీఫ్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది షరీఫ్ గారూ! జేజి కళ్ళ ముందు తిరుగాడింది కథ చదువుతున్న సేపు.

  • Excellent story sir👌👌 చదువుతున్నంతసేపూ, చదివాక కూడా జేజీ పాత్ర
    నా కళ్ళముందే ఉన్నట్లుంది ఉంది. కంగ్రాట్స్ సర్👏👏💐

  • షరీఫ్ గారూ కధ కదిలించింది. ఆడ వారి జీవితం పరదా వెనుక ఎంత దుర్భాలమో బాగా చూపించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు