ఆమె మీది అనంతమైన ప్రేమ- యథేచ్ఛ

కాస్త తడి చేర్చుకున్న వాక్యం కంటబడితే కరిగిపోతాను. ఒక్క అందమైన ఊహను రెక్కగా చేసుకున్న వాక్యాన్ని చూస్తే ఉప్పొంగుతాను.

ఎట్లా బతకాలో తెలుసు. ఎట్లా బతగ్గూడదో తెలుసు. ఎట్లా ప్రేమించాలో తెలుసు. ఏం చేస్తే ప్రేమ దూరమవుతుందో తెలుసు. కన్నీళ్లేమిటో తెలుసు. కారణాలేమిటో తెలుసు. ఇంతా తెలిసీ, ఆ ప్రకారంగా నడుచుకుని ప్రేమను శాశ్వత పరుచుకోవడానికి, బతుకును పండించుకోవడానికి మనకు అడ్డువచ్చే అశక్తత ఏది? ప్రాణంగా పెంచుకున్న యిష్టాన్ని, తపనపడి తపనపడి ఒడిలోకి తెచ్చుకున్న యిష్టాన్ని చేజేతులా విసిరేసుకుంటామే, ఎందుకని? కల్లోలంలోని ఆకర్షణ అట్లాంటిదా? దుఃఖించడంలోని సుఖం అంత గొప్పదా? సృష్టిని నడిపిస్తోన్నది కోరికేనా? కోరుకున్నదాన్ని నిలబెట్టుకోలేని అశక్తతా, నిస్సహాయతా కాదా!? యథేచ్చను చదువుతున్నప్పుడు నాకు కలిగిన కొన్ని ఆలోచనలివి.

తనను కమ్మేసిన ఒక్కో ప్రేమపొరనీ ఒలిచి ప్రపంచం ముందు పరుస్తూ నందకిషోర్ ‘యథేచ్చ’గా రాసి వెలువరించిన ఈ కవితా సంపుటిలో ఐదు విభాగాలకింద పేర్చబడిన యాభై కవితలున్నాయి. ఒట్టి కవితలు కావవి. కవితాకాశంలోకి విసిరేయబడిన యాభై ప్రేమ శకలాలు. కవితల ఆంగ్ల శీర్షికలు ఎంతో apt గా, కొత్తగా అనిపిస్తాయి. వీటన్నిటినీ ‘Five stages of slow death in love’ అంటూ ఐదు విభాగాలుగా పేర్చడం ద్వారా ఆమెపట్ల గల ప్రేమలోనే ప్రాణాన్ని దాచుకున్న విషయాన్ని మొదట్లోనే తేటపరుస్తాడు. ‘నిన్ను వెంబడించాలని కాదు వెతుక్కుంటూ వచ్చా’నంటాడు. తనవెంటే మనల్నీ లాక్కెళ్తాడు. ఆమెవైపుగా యితని ప్రయాణాన్ని ఆపడం అంటే ‘ఆకాశానికి తెరకట్టడం’ అంటాడు. యిద్దరూ ఒకటేననే నమ్మకాన్ని కలుగజేస్తాడు. ఆమెనే చూస్తూ, తాకుతూ, మాట్లాడుతూ, ఆమె గురించే కలలుగంటూ ‘కాలి చిటికెన వేలికోసం ఎలుకలు కొట్లాడుకునేంతటి ‘ తన్మయత్వంలోకి జారిపోయాక ‘అత్యంత రుచికరమైన పదార్థం అన్నమే’నని తీర్మానిస్తాడు. ఆమె కళ్లలో ఏదో పడిందని గాలంతా వెతికి దూదిపువ్వుల్ని ఏరుకొస్తాడు. ఆమె పెదాలు చీలిపోవడం చూసి పారిపోతాడు. చదువుతున్న మనకేమో ఎంతటి అమాయకుడితను అనిపిస్తుంది. ఎంత ప్రేమ దాచుకున్నాడితను అనిపిస్తుంది.  పిలిచి, దగ్గరకు తీసుకుని, తల నిమిరి, ముద్దుపెట్టి తిరిగి ఆమె చెంతకు చేర్చాలనిపిస్తుంది.

ఇంకా ఎట్లా చెప్పాలి ఈ కవిత్వం గురించి?  ప్రకృతి అందాలను అందంగా పలకరిస్తూనే ప్రేమను పలవరిస్తాడీ కవి. రాళ్లను కరిగించే నదిని పారనివ్వమంటాడు. తననితాను వచ్చీపోయే వర్షంగా చెప్పుకున్నా మనకు మాత్రం ఎప్పుడు కదిలితే అప్పుడు ప్రేమను కురిపించే మేఘంలా కనబడతాడు. రాత్రి కలలో రాసుకొన్న పద్యం పగలు దొరకదని తెలిసినా ఆమె కనిపించే కలని యిష్టంకొద్దీ వెతుక్కుంటాడు. ఆమె రాదని తెలుసునంటాడు. ‘మనకంటూ మంచిరోజులుంటాయిరా’ అని సముదాయిద్దామంటే ‘సర్లేగానీ, ఆమె వచ్చి తలుపుతీసి నిద్రలేపినట్టు కల కూడా రాదంటావా?’ అనడుగుతాడు. దొరికిన కాళ్ల జతకు చేతులు పెట్టి, ఎముకల గూడు కట్టి, మాంసాన్ని జతచేసి మనసుంటే బాగుండుననుకుంటాడు. తీరా మనసిస్తే ఆ ప్రాణి ఎటుపోయిందీ తెలీలేదంటూ విచారపడతాడు. మన కంటి కిందకూ కాసిని కన్నీటి నీడలు కురిపించి పోతాడు.

Antithesis అన్న కవిత ఎవరో కాకలు తీరిన కళాత్మక దర్శకుడు యిష్టంగా చిత్రీకరించిన సన్నివేశంలా తోస్తుంది. వణికే చేతులు, వర్షించే కళ్ళు, భగ్గున రాజుకున్న అగ్గిపుల్లా, పొగలా తేలిపోయిన ఊపిరీ కళ్ళముందు కదలాడుతాయి. వెనుక, ఒక ప్రేమకథ ముగిసిపోయిన దృశ్యాన్ని స్పష్టాస్పష్టంగా చూపిస్తాయి. Ventilator కవిత చదివినప్పుడు మనం కూడా చూపుల్ని ఆకాశంవైపు సారించి ఒక దీర్ఘశ్వాస తీసుకుంటాము. కాసింత నీడ కురిపించమని మనం ప్రార్థించిన కొమ్మల్ని గుర్తు తెచ్చుకుంటాము. ఎటు నుంచి ఎటు చదివినా ‘మారని దుక్కపు తలరాత’లను తలచుకుని ఊ కొడతాము. ‘చెదలుతిన్న లోకంలో మనుషులు దొరకలేదు’ అన్నపుడు మనలో మాయమైన పచ్చని మనిషితనాన్ని గుర్తు తెచ్చుకుంటాము. Treatment అన్న కవిత చదువుతూ ‘దుఃఖం ఇచ్చిన ఆనందంలో ఆకలి పోయిన జ్ఞాపకాన్ని’ తడుముకునే అశాంతి క్షణాల్ని పక్కనే ఉండి గమనిస్తాము. మన గుండెమీద చేయి వేసుకుని, నొప్పితో తండ్లాడుతూ యితని గుండె చేసిన శబ్దాన్ని అనుభవిస్తాము.

Say Something చదవినప్పుడు, ప్రేమ పుట్టిన క్షణం – ఆ వెనుకటి కాలమంతా అదృశ్యమయిపోయే అద్భుత దృశ్యాన్ని వీక్షించగలుగుతాము. ప్రేమ దూరమవబోతోందని తెలిసిన క్షణం, మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వెళ్లాలని నిశ్చయమైన క్షణం – ఆ దిక్కుతోచని శూన్య స్థితిని అనుభూతి చెంది, దాన్ని కవిత చేసిన తీరును చూసి అబ్బురపడతాము. To my Surprise చదివితే ప్రాణమైన వ్యక్తిని కోల్పోవడం ఎంతటి వేదనో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె వెళ్ళిపోయాక ఆమె కట్టుకున్న పిచ్చుకగూళ్ళలో గింజలు చల్లుతూ, ఖాళీ అయి చెదిరిపోయే ఈ కవిని చూసి కలత చెందుతాము. Sepsis చదివాక, దుఃఖపడుతోన్న స్నేహితులెవ్వరన్నా ఉంటే ఉత్తమాటలు చెప్పడం కాక మరేదైనా సహాయమందించేందుకు కదలబుద్ధవుతుంది మనకు. ఈ కవికైతే ఆ అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే, Apart from Writing, యింకేం చేయాలో యితనికి తెలుసు. రాత్రి చివర వేచిఉన్నదే ఉదయమని తెలుసు. నిల్చున్న ప్రతీచోటా ఆగిపోనిదే కాలమని తెలుసు. ప్రేమించడం తెలుసు. దహించుకుపోవడమూ తెలుసు.

యిక, Post Script అన్న విభాగం కింద పేర్చబడిన పది అద్భుతమైన కవితల్ని నేనిక్కడ ఉదహరించదల్చుకోలేదు. ఆ కవితల గురించి నేను చెప్పబోవడంలేదు. వాటిని మీ అనుభూతికే వదిలేస్తున్నాను. చదివాక కనీసం నలుగురితో మీరు వాటి గురించి మాట్లాడతారని హామీ యిస్తున్నాను. ఎటువంటి అస్పష్టతా లేకుండా, చెప్పాలనుకున్న విషయం పట్ల సంపూర్ణ అవగాహనతో, హత్తుకునే భాషలో, హత్తుకునే శైలిలో రాయబడిన కవితలివి. యథేచ్చలోని ప్రతి కవితా తనదైన వాతావరణంలోకి మనకు తెలీకుండానే మనల్ని లాక్కెళ్తుంది. యథేచ్చలోని అందమైన భాష మనల్ని ప్రకృతికి ఇంకాస్త దగ్గర చేస్తుంది. యథేచ్చలో ఉబికి వచ్చిన భావాలన్నీ మనలోపల మూలనపడిన ఏ స్మృతివీణ తంత్రులనో సుతారంగా తాకుతాయి. మర్చిపోయిన మధుర సంగీతమేదో మళ్లీ పరిచయమైన అనుభూతిని కలుగజేస్తాయి.

కవిత్వమంటే ఇదీ ఇదీ అంటూ కొలమానాలేమీ లేవు నాకు. ఫలానా ఫలానా వస్తువులమీద రాస్తేనే కవిత్వమనే భ్రమలూ లేవు. కాస్త తడి చేర్చుకున్న వాక్యం కంటబడితే కరిగిపోతాను. ఒక్క అందమైన ఊహను రెక్కగా చేసుకున్న వాక్యాన్ని చూస్తే ఉప్పొంగుతాను. యధేచ్ఛను చదువుతున్నంతసేపూ ఈ అనుభూతికే లోనయ్యాను. హృదయమంటూ ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన కవిత్వమిదని తీర్మానిస్తున్నాను. యథేచ్ఛను చదివాక దూరాన్నీ దుఃఖాన్నీ సముద్రాలతోనూ అరణ్యాలతోనూ ఆకాశాలతోనూ కొలుస్తోన్న ఈ ప్రేమికుని పరివేదనను పదేపదే పలవరించలేకపోతే మీకు ప్రేమంటే ఏమిటో తెలియదని నా లెక్క. యింకొక్క మాట – ఈ కవి ‘నాకున్నవి రెండే కాలాలు. ఆమెని ప్రేమించిన కాలం. ఆమెని ప్రేమించకుండా ఉండలేని కాలం’ అంటాడు. యథేచ్చ చదివాక మనకుండేవీ రెండు కాలాలు. యితని కవిత్వాన్ని ప్రేమించిన కాలం. ప్రేమించకుండా ఉండలేని కాలం.

నవీన్ కుమార్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత మంచి పరిచయం.ఒక నదిలో మునుగుతాము అది ఒక భ్రమ కావొచ్చు.అయితే ఆ భ్రమకు ఒక వాతవ లోక సంఘటన ప్రేరణ కావొచ్చు.అన్నీ తెలుసు,అయినా శూన్యం కంటే ఒక భ్రమే ఇంకా బాగుంది అనిపిస్తుంది. అది భ్రమ అని చెప్పినవాళ్ళని మీదే భ్రమ అని స్వప్నాన్ని కావలించుకునేంత.అయితే స్వప్న ప్రేమ వృధా కాదు.నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నట్లు ఒక స్థిమిత ప్రదేశానికి నాకు ఒక స్వప్న కారణం అయినా ఉంది,దీని అనుభూతి జ్ఞాపకం ఉంది.ఇది లేని వాళ్ళు శూన్యాన్ని మోసుకొని తిరగడం వీళ్ళు చూడగలుగుతారు.శూన్యాన్ని దేనితో నింపలేక అహం తో నింపుకొని అందరితో దానికోసం పోరాడేవాళ్ళ కంటే,ఇలాంటి స్వప్నాలతో ప్రేమను పంచుకుంటూ పెంచుకునే వాళ్ళది అదృష్టమే.చాలా చక్కగా వ్రాసారు.ఇద్దరికీ అభినందనలు.

  • యధేచ్చను ఎన్నిసార్లు చదివానో అన్న… తనదైన లోకంలోకి నందన్న తీసుకెళ్ళి కొత్తగా ప్రేమను పరిచయం చేయిస్తడు.మీ వ్యాసం,వాక్యం అంతే ప్రేమగా ఉంది అన్నా…ప్రకృతి అందంగ చిత్రించబడడం యధేచ్ఛలో ఎంత బాగుందో…

  • కల్లోలం లోని ఆకర్షణ, దుక్ఖంలోని సుఖం.

    కొలమానాల్లేవని, భ్రమలూ లేవని చెప్పి, తీర్మానాలూ చేయడం బాగుంది. నీ ప్రేమ అలాంటిది. చాలా చక్కగా రాశావోయ్ మిత్రుడా ! చదువుతున్నంతసేపూ భలే గిలిగింతలు పెట్టావ్.

    యెదేచ్చ చాలా మంచి బుక్. గుండెని గాయం చేసే బుక్. నువ్ మరిన్ని వ్యాసాలు రాయాలని నా కోరిక.

  • యధేచ్చని చక్కగా పరిచయం చేసావ్ నవీన్ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు