ఆమె నేర్చుకోవాల్సిన మొదటి పాఠం!

ఈ మధ్యే నేను రాసిన ఏడు కథలను, ఛాయా ప్రచురణలు “ఉనికి” పేరుతో కథా సంకలనం తీసుకొచ్చారు. ఈ ఏడు కథల్లో, నాకు నచ్చిన నా కథ “కలల ఫోటోఫ్రేమ్”.

కథ ఇక్కడ చదవండి!

కావ్య కల, ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకోవడం. తన పార్టనర్ రోహిత్ ప్రోత్సాహంతో తన 9 టు 5 జాబ్ మానేసి సొంతంగా ఫోటోగ్రఫీ చేపడుతుంది. మరి అంతా బాగుంటే ఈ కథ ఎందుకు చెప్పాల్సొచ్చింది? మామూలుగా అయితే ఏ జంటలో అయినా, మగవాళ్ళు ఎక్కువగా సంపాదించడం, పెద్ద స్థానంలో ఉండటం చాలా మామూలు విషయం. అలా ఉన్న వాళ్ళని గొప్పగా చూస్తారు ఆడవాళ్ళు. కానీ అదే మగవాళ్ళు తమ సహచరి తమకంటే ఎక్కువ చదివినా, సంపాదించినా, పెద్ద స్థానంలో ఉన్నా, ఎలాంటి అభద్రతలు లేకుండా దాన్ని ఒక మామూలు విషయంగా ఎంత మంది తీసుకుంటారు?

కథలో కావ్య కి మొదట తన కెరీర్ ని సపోర్ట్ చేసిన రోహిత్ ఉన్నట్టుండి మొహం మాడ్చుకోవడం, వెటకారంగా మాట్లాడ్డం మింగుడు పడటం లేదు. రెండు మొహాలు చూపిస్తున్న రోహిత్ లో అతని అసలు నైజం ఏదో కావ్య కి అర్థం కావడం లేదు. తనకి ఒక రూల్, రోహిత్ కి ఒక రూల్ ఎందుకో కావ్య కి తెలీడం లేదు. అప్పటి దాకా తనకు ప్రోత్సాహాన్నిచ్చిన రోహిత్, ఇప్పుడు కావ్య విజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అందుబాటులో ఉంటూ, రోహిత్ కి పనులు చేసి పెడుతూ ఉన్నంత వరకూ రోహిత్ బానే ఉన్నాడు. ఎప్పుడైతే కావ్యకి గుర్తింపు రావడం మొదలయిందో, అప్పటి నుండి ప్రేమ పేరుతో మభ్యపెడుతూ, ఆ అమ్మాయి చేతికొచ్చిన అవకాశాలను పోగొట్టుకునేలా మానిప్యులేట్ చేయడం మొదలు పెడతాడు.

 

కావ్య పనిని అప్పుడప్పుడూ కించ పరిచినట్టుగా మాట్లాడటం, తను ఫోటోషూట్ కి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు.. ‘నువ్వు లేకుండా నాకు తోచదు’ అని దొంగ ప్రేమ చూపించడం, చివరికి ఒక స్థితి లో కావ్య తన టాలెంట్ ని కూడా శంకించేలా మాట్లాడ్డం చేస్తాడు. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ కావ్య ముందు నుండే గమనించినా, రోహిత్ అలాంటివాడు కాడన్న గుడ్డి నమ్మకం తో ఆ ప్రవర్తనను పట్టించుకోదు.

ప్రేమ పేరుతో సర్వ సాధారణంగా ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాల్లో తమ మేల్ పార్టనర్స్ కి కంట్రోల్ ఇవ్వడం మొదలు పెడతారు. వాళ్ళకు నచ్చలేదని కొన్ని రకాల బట్టలు వేసుకోవడం మానేయడం, కొంత మంది స్నేహితులని కలవకుండా పోవడం, తమ పనిని పక్కన పెట్టి వాళ్ళ కోసం ఆగిపోవడం.. లాంటివి.

ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర కావ్య బెస్ట్ ఫ్రెండ్ రీనాది. సిస్టర్ హుడ్ కి ఒక చక్కటి ఉదాహరణ రీనా, కావ్యల స్నేహం. చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటకు రాకపోవడానికి ముఖ్య కారణం, ఎక్కడికి వెళ్ళాలో తెలీకపోవడం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేరు, కొన్ని సార్లు ఆర్థిక స్వాతంత్య్రం ఉండదు. కానీ ఈ కథలో కావ్యకి రీనా లాంటి ఒక మంచి సపోర్ట్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే, కావ్య రోహిత్ తో విడిపోవడానికి ధైర్యం చేయడానికి కారణం, రీనా స్నేహమే! ఎప్పటికప్పుడు రీనా ప్రేమ ముసుగులో ఉన్న పితృస్వామ్య నైజాన్ని కావ్యకి చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. స్నేహితురాలి ప్రతిభ ముందు నుండే గుర్తించింది కాబట్టి చూస్తూ చూస్తూ తను ఒక అబ్బాయి కోసం కెరీర్ ని, అవకాశాలని జారవిడుచుకోవడం నచ్చక ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటుంది. కెరీర్ కంటే రిలేషన్షిప్ ఎక్కువేమీ కాదని, ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ కోసం కెరీర్ ని వదులుకోవద్దనీ సూచిస్తుంది.

ఎంత మంది మగవాళ్ళు తమ సహచరుల విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతారు? ఎంత మంది ఎలాంటి అభద్రతాభావం లేకుండా తమ సహచరుల విజయాన్ని చూసి గర్వపడతారు?

చిన్నప్పటి నుండే ఆడపిల్లల్ని సర్దుకుపోవాలనీ, కుటుంబం కోసం కలలని, కెరీర్ ని పక్కన పెట్టాలి అన్నట్టే చెప్తూ వస్తారు. అందువల్లే ఈ మేల్ చావనిస్ట్ ల ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వలలో త్వరగా పడతారు. సర్దుకుని పోవడం సంగతి అలా ఉంచితే, నచ్చిన దానికోసం గట్టిగా నిలబడటం అమ్మాయిలకి మొదట నేర్పాలి. ఎంత ప్రేమ ఉన్నా, పర్సనల్ స్పేస్, సరిహద్దులు, కెరీర్ చాలా చాలా అవసరం. ఎప్పుడైతే వాటిని చెరిపేసి పక్క వాళ్ళకి మనమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో, అప్పుడే మనం మన ఉనికి ని కోల్పోవడం మొదలవుతుంది.

అసలు అమ్మాయికి ఏ ఉద్యోగమూ లేదు, కేవలం అబ్బాయే ఆ రిలేషన్షిప్ లో సంపాదిస్తున్న వ్యక్తి అయితే, ఆ సందర్భం పూర్తిగా వేరు. ఇప్పుడు అంశం అది కాదు. ఇద్దరూ సమానమైన స్థితిలో ఉండి, అబ్బాయి కంటే ఎక్కువ గుర్తింపు, అవకాశాలు అమ్మాయి చేజిక్కించుకుంటూ ఉంటే అప్పుడు ఆ అబ్బాయి ప్రవర్తన గురించి ఈ కథ. మరి కావ్య ఆ ప్రవర్తనని ప్రేమ అనుకుని భ్రమపడి, చేతికందిన అవకాశాలను జారవిడుచుకుందా, లేక తనకు తాను ప్రాధాన్యత ఇచ్చిందా?

కెరీర్, ఆర్ధిక స్వాతంత్య్రం కంటే ఏదీ ముఖ్యం కాదు అన్నది నా గట్టి నమ్మకం. దాని గురించిందే ఈ నా “కలల ఫోటోఫ్రేమ్”.

*

మాధురి పాలాజి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు