ఆమె గురించి కొన్ని కవితలు

1.
పశ్చిమ దిశ నుంచి పరుచుకున్న
ఏటవాలు కిరణాలను,
సాయంకాలం చరకతో
దారాలుగా వొడికి,
ఓ చున్నీ నేసాను!
ఆమె భుజాలు మీంచి
కప్పాను!!
చేతులతో దాన్ని తడుముతూ
“ఎక్కడ దొరికింది నీకీ
వెన్నెల చాదర్”
అన్నదామె!
నావైన ఘడియల పై తన ముద్ర కల్పన కాదు
స్వప్నం  అసలే కాదు
మారుతున్న కాలమంత స్వచ్ఛమైన సత్యం

2
ఎన్ని నిశానీలని
దాచుకో గలదు
ఈ మది సందూకు!?
నీ పలుకులకు లయల
గురుతులుగా ఊగే లోలాకులూ,
దారి ఎదపై నీ నడకలు వొదిలిన ముద్దులూ,
నీ నిద్దుర కు కలలను అద్దీ
నీ మెలుకువల కాన్వాస్ పై ఉదయాన్ని చిత్రించే
నీ ముక్కెరనూ,
నీ పై పెదవుల మెరపులను ఆఘ్రాణించి
అక్షరాలు చేసి
కింది పెదవి కాంతిని కలం చేసి
నీ నవ్వులు రాసుకునే కావ్యాలు
నా భారాలని తగ్గించి నన్నో సీతాకోకచిలుకని చేస్తాయి

3.
నిద్దుర లో
నాపై నీవు కాలో చేయో వేసినపుడు
నీ స్పర్శలో పొద్దుటి పని అలుపు కనిపిస్తుంది.
అప్పుడు ఇంకా గట్టిగా హత్తుకుంటాను.
అలసిన నీ దేహానికి హాయినీ,
సొలసిన నీ మనసుకు మత్తునూ,
నా మెలకువ నీ నిద్దురకు కానుకౌతుంది.

పెందలాడే మేలుకుంటావు
ఇంటి బరువంతా మోస్తావు
నన్ను పొద్దెక్కిందాకా కదిలించవు
“ఎంత అలసిపోయాడో
ఇంకాసేపు నిదురపోనీ ”
అనుకుంటావు
నా పితృస్వామ్యపు
బద్ధకం మీద జాలితో
మాతృత్వపు అమాయకత్వాన్ని కప్పి పోతావు..
నేను చంటిపిల్లాడినై ఇంకాసేపు నిదురలోకి ముడుచుకుంటాను

4.
నిద్రాభంగం అయినపుడు
మధ్యలో
నన్ను తడుముకుంటావు

నేను నీకు అంత గొప్ప
నిజాన్నైనందుకు
సంబరపడిపోతాను

బతుకు భారం నుంచి
విముక్తి పొందినట్లు భావిస్తాను.

5
నన్ను ఎప్పుడూ వర్తమానంలో
ఉంచేస్తావు
భవిష్యత్ గురించి
భయం లేకుండా చేస్తావు
జీవించి ఉండంటం అంటే
పోరాడుతూ ఉండడమే అనే కదా
నీ తాత్వికత

***
ఇలా నాలుగు
మాటలు రాసుకున్నపుడంతా
అనిపిస్తుంది
నీ ఒక్క చిరునవ్వుకు
ఎన్ని అర్థాలు తీస్తున్నానో కదా అని
బతుకు నిఘంటువులో పదాలకు
కొరత లేదిప్పుడు.

*

చిత్రం: సృజన్ రాజ్

మహమూద్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు