ఆధునిక స్వేచ్చా మానవుడి స్వరం – మాధవ్ కౌశిక్

“నేను సామాన్యుడి స్వరాన్ని. సమాజంలో మార్పు కోసం రచనలు చేయడంలో విశ్వాసం ఉన్నవాడిని. రచయితలుగా మనం సైద్దాంతిక సంకెళ్ల నుంచి విముక్తి కావాలి. కొందరు ప్రజలకోసం కానీ, ఒక సిద్దాంతం కోసం కానీ రచనలు చేసి మనను మనం పరిమితం చేసుకోకూడదు. రచయితలు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రతి ఒక్కరికోసం రచించాలి. స్వేచ్చగల రచయిత స్వేచ్ఛగల సమాజాన్ని సృష్టించగలడు”   అని అన్న ప్రముఖ కవి మాధవ్ కౌశిక్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడయ్యారంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ అద్యక్షుడుగా వ్యవహరించిన అకాడమీకి కవిత్వాన్ని హృదయ పూర్వకంగా ప్రేమించే కవి అధ్యక్షుడు కావడం ఎంతో సంతోషం కలిగించింది.

నేను ఆయనను చాలా సమావేశాల్లో కలుసుకున్నాను. ఒడ్డును చూడగానే తుళ్లి పడుతూ వచ్చే అలల్లా కవుల్ని చూడగానే ఆయన లో ప్రాణం లేచి వచ్చి పరుగు పరుగున రావడం గమనించాను. మొట్టమొదటి సారి నేను కవిత చదివినప్పుడే ఆయన నన్ను కౌగలించుకున్నారు.  తన కవితా సంపుటాలు ఇచ్చారు. కలిసినప్పుడల్లా తన కవితలు ఎలా ఉన్నాయి అని చిన్న పిల్లాడిలా అడగడం నాకు ఆశ్చర్యం కలిగించేది. నా కంటే దాదాపు  పదేళ్లు పెద్ద అన్న అభిప్రాయం ఆయన ఏనాడూ కలిగించలేదు. ఆయన ప్రసంగించినా, కవిత చదివినా ఒకే లాగా ఉంటుంది.

ఛండీఘడ్  ఏ వీధీ ఆయన కవిత్వం విని ప్రతిధ్వనించకుండా ఉండలేదు. తాను పుట్టిన ఊరు భివానీలోనే ఆయన కవితా ప్రయాణం ప్రారంభమైంది. హిందీలోనే పిజి, బిఇడి, సాహిత్య వాచస్పతి పూర్తి చేసిన కౌశిక్ కళాశాల రోజుల్లోంచే కవిత్వం రాయడం ప్రారంభించారు. తన తండ్రి ప్రహ్లాద్ కిషన్ కౌశిక్ హిందీ అధ్యాపకుడు, పండితుడు కావడం వల్ల తాను పుస్తకాల మధ్యే పుట్టానని, అక్షరం కనపడితే చదవడం చిన్నప్పుడే మొదలైందని ఆయన ఒకసందర్భంలో చెప్పుకున్నారు. ఊళ్లో ఉన్న లైబ్రరీలన్నీ ఆయన పదధ్వనులతో సుపరిచితం. ‘ప్రతి రోజూ వంద పేజీలు చదివితే తప్ప నాకు నిద్రపట్టదు’ అని ఆయన చెప్పారు.

తండ్రి ఉర్దూ భాష ప్రేమికుడు కావడంతో మాధవ్ కౌశిక్ కు హిందీ గజల్స్ పై పట్టు సులభంగా అబ్బింది. అయితే చిన్నప్పటి నుంచే కవితలు రాసినా వాటిని ప్రచురించడానికి తండ్రి ఇష్టపడేవాడు కాదు. సాహిత్యంలో నిలదొక్కుకోవాలంటే చిన్నప్పుడు రాసిన, అపరిపక్వతతో ఉన్నప్పుడు లిఖించిన కవితలను ప్రచురించవద్దని ఆయన హితవు చెప్పారు. దీనితో మాధవ్ కౌశిక్ తన 32 ఏళ్ల వయస్సులో మొదటి కవితా సంకలాన్ని ప్రచురించారు. తన తొలి కవితలు ఇప్పటికీ వెలుగు చూడలేదని ఆయన చెబుతారు. ఇప్పటికి ఆయన 40 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వాటిలో కవితా సంకలనాలే కాక 19 ఘజల్ సంపుటాలు, మూడు కథా సంకనాలు, రెండు బాల సాహిత్యం, ఇతర అనువాద సంకలనాలు ఉన్నాయి .

‘ప్రపంచమంతా సాహిత్యం ఒక్కటే’ అని మాధవ్ కౌశి అభిప్రాయం. ఉదారీకరణ, మార్కెట్ శక్తులు ప్రబలిపోయిన నేటి సమాజంలో మార్కెట్ దుష్ట సంస్కృతి మానవ విలువల్ని హరించి వేసిందని ఆయన బాధపడుతారు. ఎక్కడ చూసినా అరాచకత్వం లేదా అమానుషత్వం కనిపిస్తోంది అన్నారు. ఈ పరిణామాన్ని ఎదిరించాల్సిన శక్తులు కూడా బలహీనపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు.

‘ప్రతి రోజూ కాలాన్ని రాళ్లతో కొట్టి చంపే వాడిని కాలమే రాయిగా మార్చేసింది’ అని ఆయన అన్ని స్వప్నాలు పారిపోయాయి(సారే సప్నే భాగీ హై ) అన్న సంపుటిలో అన్నారు. ‘ఎండ మహత్తును గాలి లాక్కొంది, లేకపోతే చెట్టు కూడా ఆకులను ప్రేమించేది’  వంటి అపురూప వాక్యాలు ఆయన కవితల్లో తచ్చాడుతాయి.కౌశిక్  ఘజల్,  కవితా సంపుటాల పేర్లన్నీ నేటి సమాజానికి ప్రతిబింబాలే. అంగారోంపే నంగేపావ్ (నిప్పులపై నగ్నపాదాలు), రేపటి కిరణాలు, తుఫానులో దీపం వెలిగించు, కలలు క్షేమంగా ఉన్నాయి,కలల ఆకాశం, సూర్యుడు ఉదయించేంత వరకు, కొవ్వొత్తులతో యాత్ర , శతాబ్దపు నిశ్శబ్దం మొదలైన అనేక సంపుటాలు ఆయన వెలువరించారు.

ఎవరి ముఖంలోనూ దుఃఖం తన ప్రభావాన్ని చూపించడంలేదు, నీవు మనిషే కావచ్చు కాని దాన్ని నిరూపించుకోలేవు అని రాసిన మాధవ్ కౌశిక్ , ఇంటి యజమాని అయి కూడా ఇంటిని ద్వేషిస్తావు ఇల్లు లేకపోతే ఎలా ఉంటుందో దేశ దిమ్మరిని, నిర్వాసితుడిని అడుగు అని ఆయన నిరాశ్రయుల బాధను వ్యక్తం చేస్తారు.

కనీసం నీ మనస్థితి ఏమిటో వినిపించు. కనీసం కళ్లలోకన్నీరైనా తెప్పించు అని మనిషి తనం గురించి గుర్తు చేసే కౌశిక్,

బుల్ డోజర్ కళ్లలోకూడా కన్నీరు ఉంటుంది,, కొంచమయినా ఆలోచించు ధ్వంసమైన వస్తువులు ఎవరివో అని ప్రభుత్వ వ్యవస్థనూ ప్రశ్నిస్తారు.

జ్ఞాపకాల ముళ్లు పెరికివేయలేం, ప్రేమించే వాతావరణాన్ని మార్చలేం అని చెప్పే కౌశిక్

సడక్ నుంచి సంసద్ వరకు అంతా నిశ్శబ్దం. ఇప్పుడెక్కడా  సమస్యలు ప్రతిధ్వనించడం లేదు -అని నేటి వాతావరణం గురించి గుర్తు చేస్తారు.

పాతకాలపు ముఖాల్ని గుర్తు తెచ్చుకో, కళ్లలో పూలు ప్రతిఫలించనీ, నాలుకపై పరిమళాన్ని వ్యాపించనీ అనే కౌశిక్,

న్యాయస్థానంలో ఎవరు స్పష్టంగా నిజం వింటారు,నీ ప్రకటనలో కొంతైనా అబద్దం ఇరికించు- అని నేటి న్యాయవ్యవస్థ తీరుతెన్నుల్నీ వ్యక్తం చేస్తారు.

నా ఆలోచన పంటపొలాల్ని వదిలేయి,కాని నా ఉనికిని తాకట్టులో ఉంచు అనే మాధవ్ కౌశిక్, ప్రతి వ్యక్తీ గ్రామాన్ని వదిలి నగరంలో నివసిస్తున్నాడు. ఈ ఇంటిలో అతడి జ్ఞాపకాల రాళ్లే మిగిలాయి- అని అని బాధపడతారు.

గాడాంధకారాన్నుంచి సూర్యుడు ప్రతికారం తీర్చుకునే రోజు అధికారపు కారిడార్ల నుంచి అరుపులు వినిపిస్తాయి  అని ధిక్కార కవిత్వం రాసిన మాధవ్ కౌశిక్, మన విజయానికి బదులు ఓటమి గురించైనా రాస్తాను అంటాడు

గాలిలో కలల ఇంటిని నిర్మిస్తాను అని ఆశావహంగా చెప్పే ఈ కవి నీ కళ్లలో నీరు ఎన్నో గొంతు విప్పని కలల హత్య జరిగిందని చెబుతాయి అని కూడా రాస్తారు.

మౌనం సరైంది కాదని  ఘంటాపథంగా చెప్పే మాధవ్ కౌశిక్

మౌనంలో గాయపడ్డ మౌనం బాధ మునిగిపోతే

మిత్రమా, మౌనపు ప్రయాణం మౌనంతోనే ముగుస్తుంది

గట్టిగా చెప్పు, మనం మెల్లిగా మాట్లాడితే

మౌనపు ప్రతి చురకత్తీ మన స్వరాల్లో రహస్యంగా ప్రవేశిస్తుంది

అని హెచ్చరిస్తారు.

నిప్పులు కళ్లలోంచి కురిశాయి, మంచు నిట్టూర్పులనుంచి రాలింది అని రాసే మాధవ్ కౌశిక్ ,

కవి తన నాలుక తెగిపోయినా

చేతులతో తిరిగి రావడం విచిత్రం

అందుకే అతడు విషాదంతో లేడు

అని చెబుతాడు.

పార్లమెంట్ కారిడార్లు

రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి

మరుగుజ్జులు గొంతెత్తి

మాట్లాడుతున్నారు
అని నేటి పార్లమెంట్ ను గురించి రాసిన కవి నిప్పుపురుగు చీకటిని వేటాడుతూ బయటకు వచ్చింది అని కూడా రాస్తాడు

పార్లమెంట్ లో సత్యమేవ జయతే నినాదం క్రింద

తక్కిపెట్టిన స్వరం  మౌనం బలంగా పరుచుకుంది అని రాసే మాధవ్ కౌశిక్

నిజం చెప్పాలంటే మీరు కూడా అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారు అని చెప్పేందుకు వెనుకాడరు.

‘మాధవ్ కౌశిక్ ఎప్పుడూ ఎవరికో ఏదో చెప్పాలని చూడరు, బైరన్ లాగా రక్తమోడుతున్న హృదయాన్ని పంచుకోడు. నన్ను నేను వ్యక్తం చేసుకోవడమే కవిత్వం అంటాడు’  అని ఒక విమర్శకుడు రాశారు.

ఆయన కవితలు ఒకసారి ఎంత గగనాన్ని చుంబించినట్లు ఉంటే  ఉన్నాయో మరో సారి నేలపే ప్రయాణిస్తున్నట్లు కనపడతాయి. జయశంకర్ ప్రసాద్ , సుమిత్రానందన్ పంత్, నిరాలా, మహాదేవి వర్మ వేసిన దారిలో నడిచే కౌశిక్  హిందీ,ఉర్దూ భాషల మధ్య హద్దుల్ని చెరిపివేసి ఇరు భాషల కవితా ప్రేమికుల్నీ ఆకట్టుకుంటారు.

సాహిత్యం మార్పు తెస్తుంది, అది కనపడకపోవచ్చు  అది మనకు సామాజిక లోతుల్ని ఇస్తుంది అని విశ్వసించే కౌశిక్   నా లోపలి నిశ్శబ్దం లావాలా పెల్లుబుకుతోంది. నేనే నిరాయుధుడిలా ప్రపంచంలో ప్రవేశించానేమో. నా గురించి నేను ఎవరికి చెప్పుకోవాలి? అని ప్రశ్నిస్తారు.

ఇదేమి స్వాతంత్ర్యం

అంది నోళ్లపై తాళాలున్నాయి

సత్యం గురించి మాట్లాడే సాహసం చేయి

నీ దేశ బహిష్కారం చూస్తావు  

అని నేటి సమాజ పరిస్థితి గురించి చిత్రిస్తారు.

మాధవ్  కౌశిక్ ప్రతి కవితలో ఆధునిక స్వేచ్చా మానవుడి గురించి ఆవేదన కనపడుతుంది.ఈ చీకటి రోజుల్లో కేంద్ర సాహిత్యఅకాడమీ కూడా అంధకారంలో మునిగిపోతుందనుకునే సమయంలో మాధవ్ కౌశిక్ అత్యధిక రచయితల మద్దతుతో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కావడం కాలంపై ఆశ కలిగిస్తోంది.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు