ఆకలి బాధ ఎవలికైనా ఒకటే

వేసవికాలము మా బొబ్బిలి ప్రాంతములో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయములో బయట ఎవరూ తిరగరు. ఉన్నకాడికి తిని నీడపట్టున ఉండడానికే చూస్తారు.

మిట్ట మధ్యాహ్నమైతే అసలు ఎవరూ బయట కనబడరు.

మగవాళ్లు సాలల్లో.. మందిరాల చావళ్లలోనో విశ్రాంతి తీసుకుంటుంటారు.ఆడవాళ్లు మాత్రం ఇంట్లో పనులు చక్కబెట్టు కుంటుంటారు. పనులన్నీ అయ్యాక ఇంటి తలుపులన్నీ బార్లా తీసి అయినింట్లో చిన్న గుడ్డపరుచుకొని మధ్యాహ్నపు కునుకు తీస్తారు.

మా అమ్మకు మాత్రం ఎప్పుడూ ఖాళీ ఉండేది కాదు. ఎప్పుడూ మధ్యాహ్నము కూడా ఏదో ఒక పనిచేస్తూనే వుండేది.

ఒకరోజు మిట్టమధ్యాహ్నం అంబళ్లు తినేశాక పై గడపలో గుడ్డపరచి దానిపై తిరగలి పెట్టి చోళ్ళు విసరడం పెట్టింది మాఅమ్మ.

తిరగలికి ఒకవైపు చిన్నపీట వేసుకొని ఆ పీటపై కూర్చోని కట్టుకున్నకోక పైకి దగ్గరగా మడిచి ఆ తిరగలికి చెరో వైపు కాళ్లు బార్లాచాపి తిరగలి కొయ్య పట్టుకొని విసరసాగింది. నేను సరదాగా రెండోవైపు కూర్చోని తిరగలి తిప్పేను. అప్పటికి నా వయస్సు పదకొండు సంవత్సరాలు. ఆరవ తరగతి అయిపోయిన వేసవిసెలవులు అవి.

“వద్దులెగురా! నాయనా! నువ్వు సరిగ్గా తిప్పలేకపోతే నాకు బరువైపోతుంది తిరగలి. నేనే తిప్పుకుంటాను” అంది.

“నేను తిప్పుతానులే” అని తిప్పసాగాను. తిరగలి ఇద్దరు తిప్పితే పని సుళువ వుతుంది. వేగంగా కూడా అవుతుంది. ఇద్దరం గబగబా తిప్పుతున్నాము.

మాఅయ్య ఇంటిదగ్గర వుంటే కనక, తనే సాయం పట్టేవాడు. ఆరోజు లేడు. అంబలి తినేసి  బయటికెలిపోయాడు.

సహజంగా ఎప్పుడూ మా అమ్మా,అయ్యా కలిసే తిరగలి తిప్పేవారు. పనులు ముమ్మిరిగా వుండి పగలు ఖాళీ లేకపోతే రాత్రులు తిళ్ళు తిన్నాక వాళ్లిద్దరూ తిరగలి తిప్పడము నాకు తెలుసు.

ఊరిలో ధాన్యాలు ఆడే మిల్లులే వున్నాయి తప్ప చోళ్ళు మరాడే పిండి మిల్లులు అప్పటికి రాలేదు. తరువాత ఎప్పుడో వచ్చాయి. ధాన్యము ఆడే మిల్లులు మాత్రం ఐదు ఉండేవి. నాకు తెలిసి మొదటగా మావీధి చివర కొల్లి కన్నమునాయుడు మిల్లు ఉండేది. అది డీజిల్ ఇంజనుతో నడిచేది. మిగతావన్నీ కరెంటుతోనే తిరిగేవి.

కాపు వీధిలో పెదగోపాలరావు గారి మిల్లు, తరువాత మావీధిలోనే మరోవైపు బొత్స బలరామునాయుడి మిల్లు, ఆ తరువాత జాగాన చంద్రుడమ్మ మిల్లు ఉండేవి. తరువాత పోలవీధిలో కూడా ఒక ధాన్యంమిల్లు పెట్టారు. అది ఎవరిదో నాకు వాళ్ల పేరు తెలియదు.

“అమ్మా! అయ్యేడి!? ఎక్కడికెల్లాడు!?” అడిగాను తిరగలి తిప్పుతూ

“మీ అయ్య కళ్లానికెల్లాడు.సాల్లో పిడకలు కుచ్చిరి పేరుస్తున్నాడు.” అంది.

“ఒహో…” అనుకున్నాను. పిడకలు కుచ్చిరి వేసవిలో పేర్చి ఉంచుకుంటే వర్షా కాలములో వంటకు యిబ్బంది వుండదు. మా అయ్యకూడా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏ క్షణమూ అస్సలు ఖాళీగా వుండడు.

అమ్మా, నేను  యిలా మాట్లాడుతూ పనిచేస్తుండగా మా ఇంటికి ఎవరో ఒకామె వచ్చింది. పొడుగ్గావుంది. మంచిపాలపిట్ట రంగుకోక…పెద్దంచు…మైజారుదిద్ది కట్టుకుంది. కొప్పుని తలవెనక పెద్దమెట్ట ముడిచింది. ఆ మెట్టపై ఎర్రటి పువ్వేదో పెట్టుకుంది.

ముఖానికి పసుపులాటిది ఏదో రాసుకుంది. నుదుటున ఎర్రగా పెద్దబొట్టు పెట్టుకుంది. ముక్కుకి కమ్ములు అడ్డుకమ్మితో సహా ఉన్నాయి. చెవులకు తమ్మిట్లు లాంటివి పెట్టుకుంది. చేతులకు మురుగులు, కాళ్లకు కడియాలు ఉన్నాయి.  సంకలో పెద్ద బుట్టొకటి పెట్టుకొని ఎండతో వచ్చి మా పైగడప మునంచు రాయిమీద చతికిల పడింది.

చూస్తే పెద్దవయసు ముసలమ్మలాగా వుంది. పండుముత్తయిదువు లాగా నిండుగా కూడా అనిపించింది.

తనెవరో నాకు తెలియదు.ఇంతకు ముందు ఎప్పుడు నేను ఆయమ్మను చూడలేదు.

మా అమ్మ మాత్రం తననిచూసి నవ్వింది.

ఆమె కాసేపు కూర్చోని

“అమ్మీ రాయే… నన్ను తోలియ్యే” అంది, మా అమ్మనుద్దేశించి.

“ఇంట్లో బియ్యము లేవమ్మా!” అంది మా అమ్మ

“నాకేపాటిస్తావు!?” బియ్యం గూన అడుగునుంటాయి చూడే” అంది చెయ్యి తిప్పుతూ. చాలా బాగా ఎరిగున్న మనిషిలా మాట్లాడుతోంది.

మా అమ్మ నవ్వుతోంది.

“ లేవమ్మా! ఉంటే మరెంది!? నెరా…నేవు, ఇంక ధాన్యము ఆడించాలి” అంది.

ఉన్నట్టుండి ఆమె ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. నాకేమీ అర్ధం కాలేదు.

“అయ్యో..కూతరా! ఎంత అన్నేయమైపోయిందే నీ బతుకు. పూటకు బియ్యము నేని బతుకయిపోయిందా!” అని ఏడ్చింది.

“ఎలా బతుకుతున్నావు కూతరా! నీ పిల్లల్లి ఎలా పెంచుతున్నావు కూతరా!.. ఎంత పాపిస్టి దాన్నే నేను. ఇలాంటి ఇంటికిచ్చినానే నిన్నూ…అని రాగాలు తీసి ఏడుస్తూ చీర కొంగుతో ముక్కు ముఖమూ తుడుచుకుంటోంది.

మా అమ్మేమో అంతా చూస్తూ నవ్వుతోంది.

నాకంతా అయోమయంగా ఉంది.

వాళ్ల మాటలు చేతలు ఏమీ అర్ధం కావడం లేదు.ఆవిడెవరో నాకు తెలియదు.మా అమ్మ మాత్రం తెలిసిన మనిషితో మాట్లాడినట్టే మాట్లాడుతోంది. నవ్వుతోంది. ఆవిడ మాటలు కూడా ఇంట్లో మనిషిలానే ఉన్నాయి.

ఒక్క క్షణం ఏడుపు ఆపి

“అమ్మా! మా అల్లుడేడమ్మా!?” అడిగింది బాధపడ్డ గొంతుతో

“లేడమ్మా! కళ్లానికెల్లాడూ“ చెప్పింది

“అయ్యో, అల్లుడా! నువ్వెంతో బుద్ది మంతుడవనుకోని ఇచ్చినాను నా కూతురుని.ఎంత అన్నేయం చేసినావు అల్లుడా! పాలు బువ్వెట్టి పెంచినాను కూతుర్ని. పిల్లని ఇంటిలొదిలీసి నువ్వు కల్లాల్లంట పొలాల్లంటా తిరుగుతున్నావా నాయనా!

పాల్జావలాటి కూతురుని నీ పాలబెట్టానా అల్లుడా! ఇంత పద్దుకు మాలిన బతుకనుకో లేదు అల్లుడా! అష్టైశ్వర్యాలలో పెరిగింది నాకూతురు. ఆకరికి అంబలి తాగిస్తున్నావా!..అల్లుడా!అని మళ్లీ రాగము తీసింది.

ఈ సారి మా అమ్మ పగలబడి నవ్వింది.

నాకు అంతా వింతగావుంది. ఆమె అలా ఏడవడమేమిటో మా అమ్మ నవ్వడమేమిటో నాకేమి అర్ధము కావడం లేదు.

“ఏమి చేస్తామమ్మా! ఇప్పుడు బాధపడి ఏటిలాభం!? అయిపోయిందేదో అయిపోయింది”

అమ్మ నవ్వుతూనే కుయ్యెత్తులాడుతోంది. అమ్మనవ్వు,ఆ మాటతీరు,ముఖములో కనపడ్డ హావభావాలు అదే చెప్తున్నాయి.

ఆమె ఏడుపు ఆపి

“నీకేటి కరమ్మే తల్లీ, తిరగలి తిప్పాల్సిన బాధనీకేల, మన ఇంటినిండా నౌకర్లు చాకర్లు వుండగా…

ఆరు గరిసెల ధాన్యము అయినింట్లో పోసినాను. మూడు పుట్ల పెసలు,ఏడుపుట్ల మినువులు,కందులు ఉలవలు కావల్సినన్ని ఉండగా నీకీ కరమ్మేలే తల్లీ మనింటి కెలిపోరాయే ఈ తల్లికి పిల్లబరువు కాదు.. అంది.

మా అమ్మ మళ్లీ నవ్వుతోంది.

“ఎలిపొస్తానమ్మా! నన్ను నా నలుగురు పిల్లలని పెంచుతావా!” అడిగింది.

“దానికేమి బాగ్గెమే. నీకు నచ్చినన్నాలు మనింటిలుందువుగానీ, తిరిగి వచ్చేసినప్పుడు ఆ ముక్కులోనివి చెవులోనివి నాకొగ్గేద్దువు గానీ” అంది.

ఈ మాటలకు మా అమ్మ విరగబడి నవ్వింది. కళ్ళల్లో జలజలా నీళ్లు పొంగాయి. నవ్వి..నవ్వి చివరికి పయ్యాడ చెంగుతో కళ్ళు తుడుచుకోని యిలా అంది.

“ఈ కబుర్లకేమి గానీ,నువ్వు మరో ఇంటికెళితే ఏమైనా దొరుకుతాయి. నువ్వు ఇక్కడ ఎంత సేపున్నా నాభం లేదు. నిజంగానే ఇంట్లో బియ్యము లేవు”  అంది.

ఈసారి మా అమ్మమాటలని నమ్మినట్టుంది ఆమె.

“బియ్యము నేప్పోతే ఆపిండి అన్నా చేరడు పడేయ్యి” అంది. మేము తిప్పుతున్న తిరగలి వైపు చెయిచూపిస్తూ

“పిండి పడతావా! అయితే పట్టు” అని మా అమ్మ అక్కన్నుంచి లేచి దోసిలినిండా తీసి రెండుదోసిళ్ల పిండి ఆయమ్మ బుట్టలోని సంచిలో వేసింది.

పిండి వేసేశాక ఆ అమ్మ అక్కన్నుంచి వెళిపోయింది.

నేను మా అమ్మనడిగాను.

“ఎవులమ్మా! ఆయమ్మా!? అని. అమ్మ నవ్వింది.

ఆయమ్మ ఆడదాయి కాదు. ఆడవేసమేసుకున్న మగాడు..అంది.

ఆశ్చర్యపోవడం నా వంతయింది. మగాడా!! అన్నాను, నోరు ఆవలించి. అచ్చం ఆడమనిషి లాగానే వుంది..ఉన్నాడు!.

“అవును మగాడే..పగటి వేషగాడు. అప్పుడప్పుడు వస్తుంటాడు.” అంది.

మరి వాళ్ళింటిలో అన్ని ధాన్యం అవి వున్నాయన్నాడు కదా! మరి మనల్లి బియ్యమూ పిండి ఎందుకడుగుతున్నాడు అడిగాను, నాకు అర్ధము కాక.

అమ్మ నవ్వింది.

“అవన్నీ ఉత్తుత్తివే. మనల్లి నవ్వించడానికి అలా చెపుతారు” అంది.

అతడు అడుక్కోవటానికొచ్చాడని అర్ధమయింది.

“అయితే మాత్రం అంత పిండేసియ్యాలా! మనము ఇంతసేపు విసిరిన పిండిలో సగం యిచ్చేశావు” అన్నాను.

“తప్పు నాయనా! అలా అనకూడదు” అంది

“ఎవలికైనా ఆకలి బాధ ఒకటే కదా! మనకి అవకాశమున్నమేరకి మనం మరొకలికి  సాయిపడాలి” అని కూడా అంది.

*

రెడ్డి రామకృష్ణ

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు