అస్తిత్వ కథనం అంటే ఇదీ!

వలస జీవితంలోని ఆ విషాదాలకి కళ్లు చెమర్చక మానవు.

“అ – అమ్మ, ఆ – ఆవు. అమ్మవంటిదే ఆవు. అది తెలుసుకో నీవు!” పాట గుర్తుందా?

తాము పెంచుతున్న ఆవులంటే ప్రాణం. ప్రతీ ఆవుకీ ఒక పేరు పెడతారు. వాటి సేవకోసం తెల్లవారుఝామునే లేస్తారు. అయిదేళ్ల పిల్లలతో సహా. దోమల బెడదనించీ తప్పించడంకోసం వాటి చుట్టూ పొద్దున్నే పొగపెడతారు. వాటి కాలకృత్యాలను శ్రద్ధగా పట్టించుకుంటారు. వాటిని బయటకు మేతకు తీసుకెళ్లినప్పుడు బురదనీటిని తాగనీయకుండా తాజా ఊటనీటిని చేదలతో తీసుకెళ్లి మట్టితో చేసిన తొట్లల్లో పోసి తాగిస్తారు. (ఈ ఊటనీటికి ఎంత శక్తి వున్నదని నమ్ముతారంటే, ఆ నీటిని కాచి వడపోయడాన్నీ, వంటకు వాడడాన్నీ కూడా నిషేధిస్తారు.) అలా బయటి కెళ్లినప్పుడు ఆవు పొదుగులు సిమెంటు లాంటి మట్టితో కప్పబడడంవల్ల దూడలకు చేపడం కుదరకపోతే ఆ దూడలని పశువుల కొట్టానికి తీసుకెళ్లి వాటికి ఆహారాన్ని అందించి జాగ్రత్తగా చూసుకుంటారు. ఆవు మూత్రాన్ని అమగంగ అని అంటారు, ఉదయాన వాటి మొదటి మూత్రానికి చిన్నపిల్లల కడుపులో వుండే పురుగులని హరాయించే శక్తి ఉన్నదని నమ్మి పిల్లలచేత తాగిస్తారు. ఆవుల పాడిని సంపదకింద జమకడతారు. కొత్తగా ఈనిన ఆవు పాలని చిన్నపిల్లలకు ఇస్తారు. ఎంత చిన్నపిల్ల లయినా గానీ నేలమీద కూర్చుని ఆ పాలున్న పాత్రని (పాత్ర అంటే, ఒక కాయగూర బుర్ర) రెండు చేతులతోనూ పట్టుకుని గౌరవంతోనూ, భక్తితోనూ తాగడం, పాల నిచ్చిన ఆ ఆవుకు సుదీర్ఘమైన జీవితకాలంకోసం. “మీకు ఎల్లప్పుడూ పాలు దొరుకుగాక!” అని తల్లులు పిల్లలను దీవిస్తారు. పాలనుండి వెన్న తీసే పద్ధతి తాడు కట్టి కవ్వంతో చిలకడంవంటిది కాదు. ఎంతో జాగ్రత్తగా మేటి సొరకాయ నించీ తయారుచేసిన బుర్రలలో పాలని నింపి వాటిని కుదిపి వెన్నని తీస్తారు. ఆ బుర్రలకి ఇంట్లో ఎత్తయిన గట్టుమీద ప్రత్యేకస్థానం ఉంటుంది.

ఈ వర్ణన హిందూ రాజ్యంలోని కొంతమంది గూర్చి కాదు. రువాండా దేశంలోని టుట్సి తెగల జీవన విధానాన్ని గూర్చి. Scholastique Mukasonga రాసిన Cattle Praise Song (https://www.newyorker.com/magazine/2018/11/12/cattle-praise-song ) అన్న కథలో మొదటిభాగంలో.  ఇది చదువుతున్నప్పుడు గోకులంలో యాదవులు తమ జీవితాలని ఇలానే  గడిపివుంటా రన్న నమ్మకం కల్గుతుంది.

ఒకప్పటి మధుర స్మృతుల గురించి రాసిన నవలలకి ఉదాహరణగా కవనశర్మ గారి “బంగారు రోజులు,” కొమ్మూరి వేణుగోపాలరావు గారి “హౌస్ సర్జన్,” అక్కినేని కుటుంబరావు గారి “కొల్లేటి జాడలు” లనీ చెప్పవచ్చు. ఈ మూడింటిలో,   కొల్లేరు ప్రధాన పాత్రధారి గనుక “కొల్లేటి జాడలు” మాత్రమే విషాదాంతం. టుట్సి తెగలు ఊచకోతలకు గురికావడం, పారిపోగలిగిన వాళ్లు జీవనవిధానానికి దూరమవడం ఇక్కడ విషాదం. దీని ప్రభావం కథలో రెండవభాగంలో. దురదృష్టవశాత్తూ ఇందులోని విషాదానికి అంతం లేదు.

హుటు-టుట్సి తెగల మధ్య కలహాలు రువాండా దేశానికి 1962లో స్వతంత్రం  వచ్చినప్పటినుంచే మొదలయ్యాయి. 1980 దశకం చివరికి వచ్చేసరికి దాదాపు అయిదు లక్షలమంది హుటు తెగ దాడులబారినుండీ తప్పించుకోవడానికి చుట్టుపక్కల దేశాల్లో తలదాచుకున్నారు. 1994లో ఈ దాడులవల్ల టుట్సి తెగకు చెందిన ఎనిమిది లక్షల మంది మరణించారు, బతికున్నవాళ్లల్లో దాదాపు రెండున్నర లక్షలమంది స్త్రీలు మానభంగాలకు గురయ్యారు.  ఈ తెగలమీద దాడిలో నోరులేని జీవాలని కూడా వదలకుండా ఆవులనీ సంహరించారు. కారణాలు ఏమయితేనేం, టుట్సి తెగలవాళ్లు కాందిశీకులయి ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన పునరావాస సహాయాన్ని అందుకుంటూ ప్రత్యేక ఆవాసాల్లో జీవితాలని వెళ్లబుచ్చుతున్నారు.  అయితే, ఈ వలస జీవనవిధానం వాళ్లకు ఎంత నచ్చడం లేదో, గతిలేక మేకలని పెంచడంతో సర్దుకుంటున్న తమ తెగకు చెందినవాడినే ఒకణ్ణి చిన్నచూపు చూశారని చెబితే అర్థమవుతుంది.

ఆ వలస జీవితంలో ఆవులనించీ దూరమయి, తల్లి ఇంట్లో పెంచే అరటిచెట్లని ప్రాణంగా చూసుకొనే, తండ్రి బయటకు వెళ్లినప్పుడల్లా లేని ఆవులగూర్చే మాట్లాడే వైనాలని చదివిన తరువాత వాళ్ల జీవితాలలోని విషాదాలకి కళ్లు చెమర్చక మానవు.  కొన్నేళ్లయిన తరువాత ఫ్రాన్స్ లో పట్టభద్రురాలయి కథకురాలు పక్కనవున్న ఒకదేశంలో ఉపాధ్యాయిని ఉద్యోగాన్ని సంపాదించి, తండ్రికి డబ్బులు పంపితే ఆయన ఆ డబ్బుని ఏం చేశాడంటారు? ఆవుని కొనడంకోసం పక్కన పెట్టాడనడం అంత ఆశ్చర్యకర మేమీ కాదు గదా?

“I hadn’t understood that the path of exile led to the gates of Hell. … My father, my mother, and the rest of my family were not spared by the genocide; nor were the other Nyamata Tutsi.” అన్న వాక్యాలని చదివిన తరువాత “కొందరు మానవులు తమ జాతివాళ్లకే ప్రత్యేకంగా శ్రద్ధగా పోస్తున్న ఈ విషపూరితమైన పాలని నేలపాలుచేసే రోజు వస్తుంది!” అన్న ఆశ దరిచేరకపోగా, “ఆ విషపు పాలల్లోనుంఛీ ఒక్క చుక్కని కూడా కిందపడనివ్వడం లేదు!” అన్న నిరాశ, నిస్పృహలు ఆవరించడం అంత ఆశ్చర్యకర మేమీ కాదు.

వార్తా కథనాలకీ అస్తిత్వ కథనాలకీ తేడాని ఈ కథ స్పష్టం చేస్తుంది. టీవీలో ఎన్ని చావులని చూపించినా దారుణాలగూర్చిన కథనాలని ఎన్నింటిని వినిపించినా అవి అనుభవాలకు ఏమాత్రం సరిరావు. ఆ ప్రభావాన్ని అర్థంచేసుకోవడానికి ఈ కథని చదవాలి.

(source: http://scholastiquemukasonga.net/en/biography/)

Scholastique Mukasonga రువాండాలో 1956లో జన్మించారు. టుట్సి తెగకు చెందిన వీరి కుటుంబం హుటు- టుట్సి తెగల మధ్య వైషమ్యాల కారణంగా 1960లో నివాస స్థలాన్నుంచీ కుటుంబ సమేతంగా వలస వెళ్లవలసివచ్చింది. 1992లో ఫ్రాన్సులో నివాస మేర్పరచుకున్నారు. రెండేళ్ల తరువాత మళ్లీ తలెత్తిన వైషమ్యాల కారణంగా రువాండాలో ఉంటున్న 27మంది ఆమె కుటుంబ సభ్యులు ఊచకోతకు గురయ్యారు. ఆమె మొదటి నవల Notre-Dame du Nil, Ahamadou Kourouma మరియు Renaudot బహుమతులని 2012లోనూ, అలాగే Océans France Ô బహుమతిని 2013లోనూ, French Voices సత్కారాన్ని 2014లోనూ గెలుచుకుంది.

 

 

తాడికొండ శివకుమార శర్మ

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు