అసలు నేను..

ప్రతి ఒక్కరం మన లోపలి మనిషి మీద ముసుగేసి కప్పేసి బాహ్య ప్రపంచానికి అందంగా కనిపించే ప్రయత్నం చేసేవారమే..ఒక్కసారైనా మనమేమిటో తెలుసుకోవాలంటే ..ఆ తెర తీయగ రాదా?

‘ఇదిగో ..ఒరేయ్ ..మా భువన పెళ్లి కుదిరింది ..”తిక్క కుదిరిందన్నట్టు పెళ్లి కుదిరిందేమిటీ” లాంటి కుళ్ళు జోకులు వెయ్యకు ..  వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖున రాజమండ్రి నాళం వారి సత్రం లో పెళ్లి..రాత్రి పదీ ముప్పావు కి ముహూర్తం .. ‘ అంటూ భాస్కరరావు మావయ్య ఫోను !

నేను ఇంకా బదులు చెప్పేలోపే, ‘నీకు ఇప్పుడు ఉదయమే కదూ..లేదా పొరబాటున నిద్ర లేపేసేనా?’ అంటూ మళ్ళీ ఇంకో ప్రశ్న.

చిన్నప్పటి నుంచీ నాకు మా భాస్కరరావు మావయ్య అంటే ప్రాణం. ఏదో  పెద్దరికం చూపించెయ్యకుండా నాతో ఓ ఫ్రెండులా ఉండేవాడు, దాంతో అన్ని విషయాలూ తనకి చెప్పుకునేవాడిని.
‘ఒరేయ్ ..అట్నుంచి మాటాడవేమి? నా గొంతు వినిపిస్తూందా ? ‘ గెట్టిగా అరిచేడు
‘అయ్యో …వినిపిస్తూంది మావయ్యా..చాలాకాలం తర్వాత నీ గొంతు వినడం కదా ..అలా ఆలోచనల్లోకి వెళ్ళిపోయేను’ అన్నాను.
‘నా గొంతు వినడానికేం ..అయినా నువ్వెప్పుడూ ఫోన్ చెయ్యవు మరి ..నీ లాంటి పెద్ద ఉద్యోగస్తులకు ఇన్కమింగ్ తప్ప ఔట్గోయింగ్ సదుపాయం ఉండదు కదరా ..?’
‘మావయ్యా ..చురకలెయ్యడం మొదలెట్టేవా ? ఉద్యోగం లో కాస్త బిజీగా ఉండి, కుదరడం లేదు ..వీకెండ్ అనేసరికి ..ఇంట్లో తనూ, పిల్లలూ ..వాళ్ళతో సరిపోతుంది’
‘నిజమేలే..సీత కష్టాలు సీతవి ..పీత కష్టాలు పీతవి..ఇప్పుడు నువ్వు మీ కంపెనీ కి ప్రెసిడెంటువి కదూ ?’
‘లేదు బాబాయ్ ..ఇంకో రెండేళ్లు పడుతుంది’ అన్నాను మొహమాటంగా !
‘అయినా .. మన కుటుంబం లో అటేపు చూసినా ఇటేపు చూసినా , నీ అంత ఎత్తు ఎదిగినవాడు లేడురా..చదవడమే ఐఐటీ లో చదివేవు ..అమెరికా లో పెద్ద ఉద్యోగం, అక్కడా ఇక్కడా ఆస్తులు ..అందరికీ సాధ్యం కాదురా అబ్బాయ్’ అంటూ చెబుతుండేసరికి , ఆపు చేస్తూ అన్నాను, ‘ఊరుకో మావయ్యా ..నాదేముంది ..ఏదో దేవుడి దయ ..మీ అందరి ఆశీస్సులు’

‘టెన్తు క్లాసు మన జిల్లా ఫస్టు , ఇంటరు కూడా జిల్లా ర్యాంకు ..ఇంక ఆ  ఐఐటీ అయితే ..’

‘యాభయ్యో ర్యాంకు ..’ మొహమాటంగా గుర్తు చేసేను

‘చూసేవా .. మరి ఇన్నోటి సాధించేసి , సిగ్గుపడుతూ మీ ఆశీస్సులు అంటావేంట్రా వెర్రి వెధవా ..అంతే కాదు ..ఈ రోజుల్లో ఆంటే ప్రతీ అడ్డమైనవాడూ ఆస్తులు అమ్మో..తాకట్టు పెట్టో .. అమెరికా వెళ్ళేవాడే ..కానీ ఆ రోజుల్లో ..ఆ మైక్రోసాఫ్ట్ కంపనీ వాళ్ళు కోరి మరీ అమెరికా తీసుకెళ్లిపోయేరు..ఇదంతా గొప్ప కాదేంటీ ?’

నిజమే ..చదువులో , ఉద్యోగం లో , ఆస్తుల్లో నన్ను మించినవాడు మా చుట్టపక్కాల్లో ఎవరూ లేరు..ఇప్పట్లో రారు. ఓ రకంగా నా మీద నాకే గర్వంగా అనిపించింది!

మా రాజమండ్రి లో చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చేయి, కాస్త టాపిక్ మారుద్దామని, ‘మావయ్యా ..ఇంకేమిటి విశేషాలు ?’ అన్నాను

‘ఏముంటాయిరా ? మీ అమ్మానాన్న పోయిన తర్వాత నువ్వు ఇటేపు రావడమే మానేసేవు ..ఆం..అన్నట్టు ..చిన్నప్పుడు, నీకు సైకిల్ నేర్పిస్తూ , మన ఆర్యాపురం వీధిలో బిందెతో నీళ్ళట్టుకొస్తున్నావిడని గుద్దేసేము ..గుర్తుందా ? ఆవిడ ఈ మధ్యనే కాలం చేసింది!’

నాకసలు ఆ ఆర్యపురమే గుర్తు లేదు..అలాంటిది , ఆ నీళ్ళబిందావిడ ఎవరో ఎందుకు గుర్తుంటుంది?

నేను మాట్లాడకపోయేసరికి, ‘నీకు గుర్తు లేదు కదూ ..నువ్వు ఆ సైకిల్ తో ఆవిణ్ణి గుద్దేసరికి , ఆవిడ నెత్తిమీద బిందెలో నీళ్లన్నీ ఆవిడ మీద ఒలికిపోయేయి ..ఆ దారిన పోతున్న తుంటరి వెధవెవడో..’ఈవిడెవరో రోడ్డు మీదే నీళ్ళోసేసుకుంది ‘ అంటూ శ్లేషతో అనేసరికి, ఆవిడకి ఒళ్ళుమండి, ‘ఆ చిన్న వెధవకి సైకిల్ తొక్కడం రాదు సరే ..మరి తాడిలా ఉన్నావు …నీకేం పోయేకాలం ‘అంటూ ఆ బిందె తో నా నెత్తిన ఒక్కటిచ్చింది ..ఆ కట్టిన బొప్పి తగ్గడానికి నాలుగు వారాలట్టింది ..అందుకే నాకు గుర్తుండిపోయింది ‘ అంటూ చెప్పుకుపోతున్నాడు మావయ్య!

‘ఈ వాట్సాప్ లో ఫ్రీ కాలింగ్ అనేసరికి జనాలు అమెరికాకి ఏమిటి ..నరకం లో ఉన్న యములాడితో కూడా గంటలు గంటలు బాతాఖానీ వేసేస్తారు అనుకుంటున్నావు కదూ ‘ అని మావయ్య అనేసరికి ఉలిక్కిపడ్డ నేను , ఇంక ఈ కాల్ ముగించాలని, ‘ఛ ఛ..లేదు బాబాయ్..అవునూ ..భువన పెళ్లిసంబంధం వివరాలు చెప్పు ‘ అన్నాను

‘ఏముందిరా ..అబ్బాయి మరీ నీ అంత కాకపోయినా ..బాగానే చదువుకున్నాడు ..పైగా దాని క్లాసుమేట్..తండ్రి లేడు..పూర్తిగా తల్లి పెంపకం ..ఆవిడా తక్కువ మనిషి కాదులే ..హైదరాబాద్ లో ఓ చిన్న ఫార్మా కంపెనీ ఉంది..మా కన్నా చాలా స్థితిమంతులు కూడా ‘

‘అవునా ?’

‘అవును ..పైగా నువ్వు తెలుసట కూడా ..అందుకే ఒక కండిషన్ మీద వాళ్ళ అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకుంది ‘

‘నేను తెలుసా ? ఎవరావిడ ? ఏమిటా కండిషన్ ?’

‘ముందు కండిషన్ చెబుతాను .. అది ఏమిటంటే..నువ్వు పెళ్ళికి కాదు కదా ..భవిష్యత్తులో మా ఇంటి ఛాయలకి కూడా రాకూడదు ..సరేనని ఒప్పేసుకున్నాను’ తాపీగా అన్నాడు  మావయ్య

ఒక్కసారి ఉలిక్కిపడి,  అరిచేను, ‘ఇదెక్కడి కండిషను ? అంటే నేను భువన పెళ్ళికి రాకూడదా ? మరలాంటప్పుడు పెళ్లి అని మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు చెప్పావు ? నేను పెళ్ళికి రాకూడదు అని చెప్పడానికి అసలు ఆవిడెవ్వరు ?’

‘ఆవిడ పేరు అనన్య పలివెల .. హెల్త్ అండ్ యు కంపెనీ కి చైర్మన్ ..కాలేజీ లో నాలుగేళ్ళూ ప్రేమించి, కడుపు చేసి,  నీకు అమెరికా అవకాశం రాగానే, ఆ అమ్మాయికి టాటా చెప్పి వెళ్లిపోయేవుట’ అని మావయ్య చెబుతూంటే, నాలోని అసలు నేను నాకేసి చూసి వెటకారంగా నవ్వడం నాకు తెలుస్తూంది !

*

రవీంద్ర కంభంపాటి

ఊరు విశాఖపట్నం , ప్రస్తుతం ఇన్ఫోసిస్, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను .

ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను. సరదాగా ఓ ఏడాది క్రితం నుండి రాయడం మొదలెట్టాను . దేవుడి దయ, నా అదృష్టం ల కాంబినేషన్ కుదిరి , నలభై ఎనిమిది కధలతో పిఠాపురం క్రానికల్స్ అనే పుస్తకం వేయగలిగాను

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు