అసంబద్ధతకి రూపం వస్తే “స్క్వేర్ వన్”

మోహన్ రుషి వాడిన భాష జనం భాష. అచ్చం తెలంగాణ పలుకుబడి. కృతక భాష మచ్చుకు కానరాదు.

బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది ఇంగ్లీషులో ప్రాచుర్యంలో వున్న ఫ్రేజ్. ఒక పదబంధం. నుడికారం. చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించక, మళ్ళీ మొదటికి రావటం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండటం. గుండ్రంగా తిరిగి బయలుదేరిన చోటకే రావటం. పిల్లలు, పెద్దలు ఆడే ఆట ఒకటి వుంది. వైకుంఠపాళి, పాళి అంటే పటము. పలక. ఈ ఆటకే ఇంకో పేరు పరమపద సోపానపటము. నిచ్చెనలు ఎక్కుకుంటూ, వైకుంఠం, పరమపదం వేపు సాగుతుంది ప్రయాణం. లక్ష్యం అది. ఎక్కడోచోట ఆడేవాడు పాము నోట్లో చిక్కుకుంటాడు. అక్కడ నుండి జారి కిందకు, మళ్ళీ మొదటికి, బయలుదేరిన చోటికి వస్తాడు. బ్యాక్ టు స్క్వేర్ వన్.

తన రెండో కవిత్వ పుస్తకం “స్క్వేర్ వన్”లో మోహన్ రుషి చెబుతున్నది మనం మన జీవితంలో ఆడే ఈ వైకుంఠపాళి, పరమపద సోపానపటం ఆట, గురించే. మనిషి ఈ సో కాల్డ్ నాగరికి సమాజంలో దారీ తెన్నూ తెలీక ఎలా వుక్కిరిబిక్కిరి అవుతున్నాడు, తిరిగి తిరిగి మళ్ళీ ఎలా మళ్ళీ ఆ మురికి కూపంలోకి వచ్చి పడుతున్నాడు అనేదాన్ని కడుంగడు హృద్యంగా, స్పష్టంగా, కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నాడు.  .

ఇది బొందికాలం. మాయదారి కాలం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, వీర పాండ్య కట్టబ్రహ్మలం అవుదామనుకున్నవాళ్ళు వీర పనుల కట్టబ్రహ్మలై గసపోసే వొగిరింపులతో వొట్టిపోతున్నారు. లోకం వేటగాళ్ళతో నిండి వుంది. అందులో ఒకడివి కాలేకపోవటం నీ చేతగానితనం. జ్ఞానం అంటే వున్న చోటుకు తిరిగి రావటమే జీవితం అని తెలుసుకోవటం. ఇట్లాంటి స్థితిలో చావు గురించి భయపడ్డానికేం లేదు. ఇప్పుడు బ్రతుకు గురించి భయపడ్డానికే చాలా వుంది. సిటీలో బస్సు ప్రయాణం కడగండ్లు, బ్రతుకు మారాముళ్ళు వేరుగా లేవు. ఇక్కడ ఎవడి ప్రపంచం వాడిది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బతకలేని వాడు గాడిది. గుండమే కాదు గుండ్రంగా కూడా వుంది జీవితం. ఇలా వుంటుంది పుస్తకం అంతా.

కవిత్వంలో మోహన్ రుషి చేసిన గొప్పపని ఏమిటంటే సిద్ధాంతాలు, చర్చలే ముడి సరుకుగా వున్న తెలుగు కవిత్వాన్ని, వాటినుండి బయటకు తీసుకువచ్చి, మామూలు మనిషి రోజువారీ జీవితాన్ని నిజాయితీగా, పరమాద్భుతంగా చూపించగలగటం. ఆయన చెప్పేది వుపన్యాస ధోరణిలో కాకుండా, సంభాషణ రీతిలో, ఆత్మీయంగా వుంటుంది. ఎంతటి నిష్ఠుర నిజాన్నైనా, కుండ బద్దలు కొట్టినట్లు చెబుతాడు. బస్సు కండక్టర్లు, డ్రైవర్లు, హాస్పిటల్ స్టాఫ్, క్యాన్సర్ సోకిన పిల్లలు, తల్లడిల్లే నిస్సహాయ తండ్రులు, ఫుట్పాత్ మీద నిద్రపోయే బిచ్చగాళ్ళు, వీధులూడ్చే పని మనుషులు, వీళ్ళందరిలో వున్న మానవత్వాన్ని చూడగలిగాడు. తన కవిత్వానికి వస్తువులు వీళ్ళు. వీళ్ళలాంటి మరికొందరు. వీళ్ళ ఆశల్ని, నిరాశల్ని, బాధల్ని, దుఃఖాల్ని, వేదనల్ని కలగలిపి, గొప్ప కవిత్వ రసాయనాన్ని తయారు చేశాడు.

తన కవిత్వ ఖండికలకు మోహన్ రుషి పెట్టినపేర్లు, కొన్ని పదబందాలు కొత్తగా ఆలోచింపజేసేవిగా వుంటుంది. పిల్లలూ దేవుడూ చల్లనివారే అనే సినిమాపాట పల్లవికి బదులు కుక్కపిల్లలూ దేవుడూ చల్లనివారే అంటాడు. నీడ్ ఆఫ్ ది అవర్ కు బదులు నీడిల్ ఆఫ్ ది అవర్. ఇలాంటివి ఇంకెన్నో వున్నవి. మనసే అందాల బృందావనం బదులు బొందావనం. ఒకమాట అని వేరే మాటను, వేరే అర్థాన్ని ద్వనింపజేస్తాడు. ద్వన్యాలోకంలో ఆనందవర్థనుడి ద్వని ఇదేనా? ఆలోచించాలి.

మోహన్ రుషి వాడిన భాష జనం భాష. అచ్చం తెలంగాణ పలుకుబడి. కృతక భాష మచ్చుకు కానరాదు. కవిత్వం కోసం కాకుండా, వున్నదాన్ని వున్నట్లు తీసుకొని, దాన్ని కవిత్వంగా భాసింపజేస్తాడు. పదాలు మెటామోర్ఫసిస్ చెందుతవి. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ పదాల్ని అవసరమైన చోట వాడడానికి వెనుకాడడు. కమస్కం, అపోజిట్ సెక్స్… ఇట్లా.

కొన్ని మాటలు పైకి మామూలుగా కనపడతవి గాని, లోనికి తొంగి చూస్తేగాని వాటి తాత్వికార్థం తొందరగా బోదపడదు. నీవూ, నేనూ, అనబడేవాడు. వాడు ఎవరు? వాడు ఎవరో కాదు. నీవూ నేనూ వాడూ ముగ్గురం ఒకటే. ఒకే తాను ముక్కలం. ఇట్లా ఆలోచిస్తేగాని తత్వం బోదపడదు. ఇలాంటి సందర్భాలు పుస్తకంలో చాలా వున్నవి. ఆధునిక తెలుగు కవిత్వాన్ని తాత్విక స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత కూడా మోహన్ రుషికే దక్కాలి.  .

ట్రూలైతో అలైబలై అనే కవితలో అంటాడు, జీవితంలోని అసంబద్ధత కాగితం మీద ప్రతిఫలించదు అని. నిజమే కాని, ఈయన గారు చేస్తున్నదేమిటి? జీవితంలోని అసంబద్ధతను కాగితం మీద కవిత్వరూపంలో ప్రతిఫలింపజేయటానికి ప్రయత్నమే కదా? ఒక ఉదాహరణ, క్యాన్సరొచ్చి కేవలం మూడున్నరేళ్ళ పాప మృత్యువుతో పోరాడి బ్రతుకు ముగిస్తే, తండ్రి ఎలా వున్నాడు? “ఆరిన దీపం రగిల్చిన మంటలో తగలబడిన వాడిగా వున్నాడు.” దీన్ని మాటల్లో ఎక్స్ ప్లెయిన్ చేయ్యటం కుదరదు. గొప్ప ఇంటెన్స్ ఫీలింగ్. తీవ్ర వేదన. కవిత్వంలో చెప్పాలంటే ఇలాగే చెప్పాలి.

ఇక పోతే, ప్రతి కవిత ఓపెనింగ్…ప్రారంభం, డ్రమటిక్ గా, ఉత్కంఠభరితంగా, ఏదో సంఘటన మధ్యలో మొదలైనట్లుగా వుంటుంది. పాఠకుడు వెనకాముందు ఊహించుకోవాలి. పద్ధతిగా వుందామని నిర్ణయించుకున్నాం. ఇది ఒక కవిత ప్రారంభం. ఎవరు నిర్ణయించుకున్నారు? ఎందుకు? ఇదంతా పాఠకుడు ఊహించుకోవాలి ముందే.

పుస్తకంఅంతా పరుచుకున్న దుఃఖం, బాధ…వీటిని పరిశీలిస్తే, కవిగారు ఏమైనా పెసిమిస్టా, నిరాశావాదా అనిపిస్తుంది. కాని, లోతుగా పరిశీలిస్తే అది సరి కాదనిపిస్తుంది. జీవితంలో దుఃఖం, బాధ ఒక పార్శ్వం. ఇంకో పార్శ్వం అందం, ఆనందం. ఈ రెండో పార్శ్వం తెలియనివాడు కాదు కవి. జీవితాన్ని ఆనందభరితం చేసేందుకు కొందరుంటారన్న అవగాహన పుస్తకం ఆమూలాగ్రం చదివితే తెలుస్తుంది. అన్ని రోజులూ అధ్వాన్నంగా వుండవు. నిజంగా కొన్ని మంచి రోజులు వుంటాయి. రోజువారీ జీవితాన్నే పరమాద్భుతంగా దర్శించిన ఘట్టాలు కవిగారి అనుభవంలో వున్నవి. ఇలాంటి కవిని నిరాశావాది అని ఎలా అనబుద్ధి వేస్తుంది? అనలేము కదా!

మోహన్ రుషి కవిత్వ నిర్మాణంలో తనదైన శైలినీ, గొప్ప టెక్నిక్కునీ ప్రదర్శిస్తాడు. వచనంలా కనబడే ఏకవాక్యాన్ని రెండు మూడు పాదాల్లోకి విస్తరిస్తాడు. కొన్నిచోట్ల ఒకే పాదంలో రెండు మూడు పాదాల్ని ఇరికిస్తాడు. వాడుకభాష మధ్యలో అకస్మాత్తుగా పచ్చి గ్రాంథిక భాష వచ్చి చొరబడుతుంది. తెలిసిన పదాలు రూపం మార్చుకొని కొత్త వేషంతో కనిపిస్తవి. ఇలా ఇంకా కొన్ని చెప్పవచ్చు. మోహన్ రుషి ఈస్తటిక్ పోయెట్ మాత్రమే కాకుండా, అందులో మెళకువలు తెలిసిన క్రాఫ్ట్స్ మ్యాన్ కూడా.

మోహన్ రుషి మొదటి కవిత్వ పుస్తకం (రెండో పుస్తకం “దిమాక్ ఖరాబ్” కూడా కవిత్వ పుస్తకమే అని నా నమ్మకం) “జీరో డిగ్రీ” కూడా “స్క్వేర్ వన్” లాంటిదే, ఒక విధంగా. కాకపోతే “జీరో డిగ్రీ”లో కంటే “స్క్వేర్ వన్”లో బాధ, దుఃఖం, జీవితంలో వున్న కాంట్రడిక్షన్స్, అసంబద్ధత ఇంకా చిక్కబడ్డవి. గాఢమైనవి. మనిషి ఎంతగా బాధ పడగలడో, ఎంతవరకు ఆ బాధను భరించగలడో, దాన్ని, ఆ లిమిట్, ఆ అంచు వరకు వెళ్ళి చేసిన పరిశోధన ఫలితమే మోహన్ రుషి కవిత్వం అని చెప్పవచ్చు. అలా అన్నప్పుడు రెండోది, మొదటిదాని కొనసాగింపు అవుతుంది. కాకపోతే రెండింటికీ ఒకటే తేడా, భావంలో, వ్యక్తీకరణలో, గాఢతలో, టెక్నిక్ లో మొదటిది జీరో డిగ్రీ అయితే రెండోది ఇంకా ఎక్కువ. మైనస్ జీరో డిగ్రీ.

19వ శతాబ్దంలో ఛార్లెస్ బాదలేర్ అనే గొప్ప కవి ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో వుండేవాడు. ఈ కాలంలో, ఇక్కడ, ఈ తెలుగుదేశంలో హైదరాబాదులో వుండి ఈ వాతావరణానికి అనుగుణంగా, ఈ బాధలు, ఈ మనుషుల కృత్రిమ వేష భాషలు గురించి మోహన్ రుషి ఎలాగా రాశాడో, ఆ కాలంలో అక్కడ ఆ కవి బాదెలేర్ కూడా అలాగే అక్కడి మనుషుల గురించి రాశాడు. అప్పట్లో ఫ్రెంచ్ సాహితీవేత్తలకు ఆయన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఆయన్ను నానా ఇబ్బందులు పెట్టి, జైలు పాలు చేసి, ఆయన రాసిన పుస్తకాన్ని ప్రభుత్వపరంగా నిషేధింపజేశారు. దేశం మారింది. కాలం మారింది. మోహన్ రుషి అదృష్టవంతుడయ్యాడు. ఈయన్ను భౌతికంగా ఇబ్బందులు పెట్టకపోయినా, ఈయన కవిత్వాన్ని ఉపేక్షించవద్దు. చదవండి. విమర్శించండి. ఎంత ఎక్కువగా విమర్శిస్తే, అంతా బాగా అర్థం అవుతాడు.

(“స్క్వేర్ వన్”, ఆంథాలజీ ఆఫ్ పోయెమ్స్, వెల; 120 రూ.లు, ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, ఆర్య సమాజ్ ఎదురుగా, కాచిగూడ, హైడరాబాద్. www.telugubooks.in)

దీవి సుబ్బారావు

దీవి సుబ్బారావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవి అంతరంగం , పుస్తకం అంతరంగం వెరసి మీ అంతరంగ విశ్లేషణ . ఋషి నేటి ట్రెండ్ సెట్టర్ పోయెట్.అభినందన.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు