అసందిగ్ధతా కష్టమే!

ప్రతి నాణేనికీ రెండు వైపులు లాగా, అమెరికాలో లాగా గానీ లేదా ఇంగ్లండులో గానీ ఉండే బలమైన పార్టీల సంఖ్యలాగా చాలా అంశాలకి రెండు పక్కలకి మించి వెసులుబాటు ఉండే అవకాశం తక్కువ. అలాగే, ఒకరి రాకకోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆ రాక అనేది నిశ్చయమని తలుస్తున్నప్పుడు, ఇవాళ కాకపోతే, రేపు పొద్దున్న, అది కాకపోతే రేపు రాత్రి, లేదా ఆ మరునాడు అది జరుగుతుందని ఆశించడంలో ఆశ్చర్య మేమీ ఉండదు. ఇంగ్లీషులో maybe అనేది అలాంటి సందర్భాలకి కొంచెం సందిగ్ధాన్ని కలిపి వడ్డించే పదం. ఆ పదాన్ని సమర్థవంతంగా, సమయానుకూలంగా వాడిన కథ “నో మోర్ మేబి”.

ఈ కథలో నాలుగు పాత్రలు: కథకురాలు, ఆమె భర్త వుజి, కోడలు గర్భవతిగా ఉన్నదని సహాయానికి వచ్చిన వుజి తల్లిదండ్రులు. వుజి చైనాలో పి.హెచ్.డి. చేసి అమెరికా వచ్చాడు. కథకురాలికి చైనాలో బట్టల తయారీ దుకాణం ఉండేది. మామగారు లిటరేచర్ ప్రొఫెసర్ గా పని చేసి రిటయి రయారు. అత్తగారు వయసులో ఉన్నప్పుడు చదువుదా మనుకున్నారు గానీ కాలేజీ ఎంట్రన్స్ పరీక్షలో సెలెక్ట్ కాలేదు. అందుకని ఆమెకు ఇంగ్లీషుతో పరిచయం దాదాపు శూన్యం. అయితే, వాలీబాల్ కోచ్ గా మాత్రం పనిచేశారు. మామగారికి ఇంగ్లీషు బాగానే వచ్చు. అత్తగారు అమెరికాకి వచ్చి ఉచితంగా నడిపే ఇంగ్లీషు బోధనశాలకి వెడుతున్నారు. ఎప్పటినించో ఆమెలో రేగిన ఇంగ్లీషు నేర్చుకోవాలన్న కోరిక ఇప్పుడు తీరుతోంది. ఆ విషయంలో భర్త మెప్పు పొందాలన్నది ఆమె ఆశయం. అయితే, అమెరికాలో ఏదయినా ఉచితంగా దొరకడం ఆ పెద్దవాళ్లకి ఆశ్చర్యకరం. దాన్ని కొలబద్దగా తీసుకుని, అమెరికా కాపిటలిస్ట్ దేశం కాదు, చైనాలో ఏదీ ఉచితంగా లభించదు కాబట్టి అసలు సిసలు కాపిటలిస్ట్ దేశం చైనా అంటారు వాళ్లు. ఉదాహరణకి, స్వచ్ఛమైన గాలి. అమెరికా వచ్చినప్పటి నించీ ఆ గాలి పీల్చుకోవడంలో అత్తగారు బిజీగా ఉన్నది.

ఎటు చూసినా కనిపించేది కుట్రే నని సోషల్ మీడియా నిండా ప్రబలివున్న అభిప్రాయాలకి ఇంగ్లీషు ఉచితంగా ఎందుకు నేర్పుతున్నారు అన్న విషయం మీద వీళ్ల సంశయాలు తోడవుతాయి. “ఈ బోధనలకి ఎవరు వస్తున్నారో గమనిద్దామని ప్రభుత్వ ఉద్దేశ మేమో?” నంటారు మామగారు. “అంతమందిని గమనించడం అంటే చాలా పని. అంత పని అమెరికన్లు ఎందుకు చేస్తారు, చైనావాళ్లు చేస్తారు గానీ!” అంటారు ఆయన భార్య. “ఇక్కడ కూడా పౌరుల మీద నిఘా ఉంటుంది గానీ, చైనాలో లాగా కాక ఇక్కడ పౌర హక్కుల గూర్చి చట్టాలున్నాయి,” అంటాడు వుజీ. వలస వచ్చి అయిదేళ్ల పాటు అమెరికాలో నివాసం ఉంటున్నవాళ్లల్లో ఆ అభిప్రాయం కలగడానికి అవకాశ ముండే కొంచెం ఎరుకని వుజీ, అతని భార్య పాత్రల ద్వారా రచయిత్రి మన ముందుంచుతారు. “ప్రతీ ప్రభుత్వమూ ఒకటే!” నంటూ అతని తండ్రి అప్పుడే అమెరికాకి వచ్చి, సంఘంతో ఏమాత్రం పరిచయం లేకపోవడం వల్ల తనతోపాటు తెచ్చుకున్న భావాలని ప్రదర్శిస్తాడు. తండ్రీ కొడుకుల అభిప్రాయాలు రెండూ సరయినవే అని ఈ కథ చదివిన ప్రతివాళ్లూ అనుకోవచ్చు కూడా.

ఒకనాడు వుజి తండ్రి రోడ్డు పక్కన పార్క్ చేసివున్న కొడుకు కారుని కడుగుదామని ప్రయత్నించి తేడా తెలియక ఇంకొక కారుని కడుగుతాడు. ఆ కారు స్వంతదారుడు ఒక నల్లతను. కడిగినందుకు ధన్యవాదాలని తెలుపుతూ ఇక్కడి ఆచారాన్ని బట్టీ ఒక కేకుని అట్టపెట్టెలో తెచ్చి వీళ్ల ఇంటి తలుపు తడతాడు. ధన్యవాదాలు తెలపడానికి గానీ, పక్క ఇంట్లోకి కొత్తగా వచ్చినవాళ్లని ఆహ్వానించేటప్పుడు గానీ కేకు పట్టుకుని వెళ్లడం అమెరికాలో “ఆచారం.” జెఫ్ అని పేరున్న అతను, “మీరు నా కారు కడిగారు కదా,” నంటాడు. ఇంటి పెద్దగా వుజీ తండ్రి జవాబు చెబుతూ, “నేనేదీ కడగలే” దంటాడు. “చూసినవాళ్లు చెప్పారు. ధన్యవాదాలు చెబుదామని వచ్చాను,” అంటాడు జెఫ్. మామగారు కొనసాగిస్తూ, “అది నీ కారేనా?” అనడుగుతాడు. దానికి జెఫ్ కోపగించుకుని, “నేను దాన్ని దొంగిలించా నంటావా?” అనడుగుతాడు. “If you find something wrong, we did not do it,” అంటాడు మామగారు. పాపం ఆయన భయం, లేని తప్పుని మీదకు తోస్తారని! అది జెఫ్ కి తెలియదు. “అంతా సవ్యంగానే ఉన్నది,” అంటాడు. ఇంకా ఏదో ఒక తప్పుని నెత్తిన రుద్దదానికే జెఫ్ వచ్చాడనుకుని, “నీ దగ్గర ఋజువు లేదు,” అంటాడు మామగారు. జెఫ్ కి కోపమొచ్చి ఆ కేక్ మీద అక్షరాలని తుడిపేస్తూ వేలితో వేరే అక్షరాలని రాసి దాన్ని వాళ్ల గుమ్మం ముందరే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ అక్షరా లేమిటి అనేది చదివి తెలుసుకుంటే బావుంటుంది.

ఇంక కథ శీర్షికకీ కథకీ ఉన్న సంబంధం గూర్చి: ఈ కథలో “maybe”లు 37 కనిపిస్తాయి. వాక్యంలో maybe ఉన్న చోటుని బట్టీ అర్థం మారే అవకాశ మున్నది. ఉదాహరణకి చైనాలో కథకురాలి బట్టల కొట్టుకి కుట్టిన బట్టల నందించేవాళ్లతో ఆమె పలికిన ఈ రెండు వాక్యాలు చూడండి.

“I’m not sure. Maybe the Americans will not like the clothes,” I said at first.

Then, later, I said, “I think the Americans maybe do not like them.”

మొహమాటం కొద్దీ మనసులోని మాటను చెప్పలేక కావాలని ప్రవేశపెట్టిన సందిగ్ధాన్ని చివరకు దాన్ని క్రింది వాక్యంతో తొలగిస్తుంది.

And now I say, “The Americans just do not like our clothes.”

కథలో సందిగ్ధతలని విరివిగా చొప్పించినా, దానికి తావులేని అంశమే ఉండదా అన్న ప్రశ్న పాఠకుల మదిలో దూరితే, “ఎందుకుండదూ?” అని జవాబు చెప్పడానికి కాబోలు, maybe కి ఆస్కారం లేని ఒక అంశంతో రచయిత్రి కథ ముగిస్తుంది. వలస వచ్చినవాళ్ల పరంగా అమెరికన్ సమాజాన్ని గూర్చిన బేరీజులని తెలుసుకోవడానికీ, maybe ని సమర్థవంతంగా వాడిన తీరుని గమనించడానికీ ఈ కథని చదవాలి.

రచయిత్రి పరిచయం:

తల్లిదండ్రులు 1954 లో చైనా నుండీ అమెరికాకి వచ్చిన ఒక సంవత్సరం తరువాత Gish Jen పుట్టారు. ఇంగ్లీషులో హార్వర్డ్ యూనివర్సిటీ పట్టభద్రురాలు. తరువాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టాని యూనివర్సిటీ ఆఫ్ అయోవా రైటర్స్ వర్క్‌షాప్ నుండీ పొందారు. ఉత్తమ అమెరికన్ కథానిక సంకలనాల్లో మూడు సార్లు ఆమె కథలు చేకూర్చబడ్డాయి. చాలా పురస్కారాల నందుకున్నారు కూడా.

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు